నెలవారీ భాండారాలు: డిసెంబరు 2011
తెలుగు మాట, పాట, పద్యం (4)
తెలుగులో శతక సాహిత్యంలో అధిక్షేప శతకానిది ఒక ప్రత్యేకమైన శాఖ అయితే, అందులో వేణుగోపాల శతకానిది ఒక విశిష్ఠ స్థానం అన్నది తెలిసినదే! ఈ శతకాన్ని రచించినది పోలిపెద్ది వేంకటరాయ కవి. ఇతడు కార్వేటి సంస్థాన కవులలో ప్రముఖుడు అని చెబుతారు.
వేణుగోపాల శతకంలోని పద్యాలలో తెలుగు నానుడులు, సామెతలు అనదగినవి చాలా (పద్యాలకు అనువైన భాషలో) పద్యాలలోకి ఎక్కి కనబడతాయి. వాటిలో కొన్ని మంచివాటిని పద్యాలలోంచి ఏరి విడిగాతీసి చూపించడం ఇక్కడ జరిగింది:
పొరుగూరి కేగిన పోవునే దుర్దశ
కాదె పెండిలి సన్నికల్లు దాచ
డొంకల డాగ పిడుగుపాటు తప్పునే (డొంకలలో దాక్కుని పిడుగుపాటునుంచి తప్పుకోగలమా? అని)
కాలడ్డ నిలుచునే గాంగ ఝరము (గంగా ప్రవాహాన్ని కాలడ్డుపెట్టి ఆపగలమా?)
ఇంకిపోవునే అనావృష్టి జలధి (దేశంలో అనావృష్టివలన సముద్రం ఇంకిపోతుందా?)
అర్కుడుదయింప చెడునె గుహా తిమిరము (గుహలో చీకటి సూర్యోదయంతో తొలుగుతుందా?)
పెట్టిపోసిన నాడె చుట్టాల రాకడ
సేవ చేసిన నాడె క్షితినాదు మన్నన
విభవంబు గల నాడె వెనువెంట తిరుగుట (ఇవన్నీ సమానార్ధకాలే!)
‘అభావ విరక్తి’ అని ఒక అవస్థ వుందని, దానికి ఈ క్రిందివి వుదాహరణలనీ ఒక పద్యంలో చెప్పి…
శక్తి చాలని నాడు సాధుత్వం వహించడం
విత్తహీనుడు ధర్మ వృత్తి తలచడం
వ్యాధి పీడితుడు దైవతాభక్తి దొరలాడడం
పని పోవ మౌనవర్తనం దాల్చడం
రమణి లేకున్న విరక్తి మంచిది అనడం
భారము పైబడ్డ (పుడు) బరువెఱుంగడం (బరువు గుఱించి ఉపన్యాసాలివ్వడం)…
ఇత్యాది ‘అభావ విరక్తు’ ల వలన, తత్కాల విరక్తుల వల్ల ఫలితంలేదంటూ….
తినక చవి చొరకయె లోతు తెలియబడునె (తినక రుచి, దిగక లోతూ తెలియడం సాద్యం అవుతుందా?) అనే సామెత చెప్పబడింది.
ఆశకు ముదిమియు అర్ధికి సౌఖ్యంబు
ధనపరాయణునకు ధర్మచింత
అల్పవిద్యునకు అహంకారదూరత
పాపభీరుత సంతానబాహ్యునకు
కలదనెడువార్త కలదె లోకములయందు… (దీనికి ఏమీ వివరణ అవసరంలేదు కదా!)
ఈతకు మిక్కిలి లోతు లేదు
కవిజనంబుల కెఱుంగనివి లేవు
మెఱుపు దీపంబౌనె మేఘంబు గొడుగౌనె
అల యెండమావులు జలంబు లౌనె
కాని వస్తువు పట్టుకో కాంక్షచేత
పెనుగు మాత్రంబెగాని లభింపదేమి….
పొయిపాలికే పాలు పొంగుటెల్ల
ఆఱిపోయెడి దివ్వె కధిక దీప్తి
కట్టనిల్వని చెర్వు గడియలోపల నిండు
బ్రతుకజాలని బిడ్డ బారెడుండు
పెరుగుటయు విఱుగుటకని యెఱుగలేక
అదిరిపడుచుండు నొక్కొక్క అల్పజనుడు….
వలపు రూపెరుగదు
ఆకలిలో నాల్క అరుచి యెరుంగదు
కోపం బెదుటి గొప్పకొద్దు లెఱుంగదు
నిదుర సుఖం బెఱుంగదు
హరునకైనను నివి గెల్వ నలవికాదు
ఇతరులైనట్టి మానవులెంతవారు….
పైన చూపినవన్నీ అదనంగా వివరణ యేమీ అవసరంలేకుండానే అర్ధమయ్యేవీ, తక్కువ మాటలలో చక్కటి నిజాలను చెప్పేవీను! వాటిల్లో కొన్ని ఇప్పటికీ సామెతలుగా అదపాదడపా నిత్యవ్యవహారంలో పెద్దవాళ్ళనోట వినిపిస్తూనే వున్నాయి కూడానూ!
*****
తెలుగులో అధిక్షేప శతకాలు రచించిన వారిలో కూచిమంచి తిమ్మకవి, జగ్గ కవి అని ఇద్దరు కవులున్నారు. వీరిద్దరూ అన్నదమ్ములని తెలుస్తూనేవుంది కదా! కూచిమంచి తిమ్మకవి రచించిన శతకం శ్రీ భర్గ శతకం, జగ్గ కవి రచించిన శతకం శ్రీ భక్తమందార శతకం. వీరు క్రీ.శ.18 వ శతాబ్దానికి చెందిన వారు. వీరిలో కూచిమంచి జగ్గకవి తెలుగులో మొట్టమొదటి అధిక్షేప ప్రబంధకర్తగా ప్రసిధ్ధుడు. ఆ ప్రబంధం పేరు ‘చంద్రరేఖా విలాపము’. ఇందులోని కవిత్వ స్థాయిని C.P.Brown దొర కూడా మెచ్చుకున్నాడని ఎక్కడో చదివినట్లు గుర్తు.
ఆ సంగతి అలా వుంచి, ప్రస్తుత విషయానికి వస్తే – వీరిరువురు రచించిన అధిక్షేప శతకాలను ఇప్పుడు తలుచుకోవడానికి కారణం, వీరిరువురూ వారి శతకాలలోని పద్యాలలో వాడిన పరభాషా పదాలను గుఱించి ముచ్చటించుకోవడానికి! పరభాషా పదాలలో వీరు మక్కువపడి అన్నట్లుగా ఒకటికి రెండుసార్లు వాడిన పదం ‘ఇల్ల’. ఈ పదం తమిళ భాషలోనిది. ‘లేదు’ అని తమిళంలో ఈ మాటకు అర్ధం. ఎందుకు అంత మక్కువపడి ఈ పదాన్ని వీరు వాడారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ‘ఇల్లె’ అనే ఈ మాటకు బదులు తెలుగు పదం ‘లేదు’ అన్నది వాడొచ్చు, ఛందోభంగం ఏమీ కాదు. (సుఖం ఇల్లె, సుఖం లేదు – తేడా ఏమీ లేదు).
“కోపంబెక్కువ; తాల్మి యిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబు తీల్”
కూచిమంచి తిమ్మకవి – శ్రీ భర్గ శతకము లోనిది ఈ శార్దూల పద్య ప్రథమ పాదం. ఈ పాదంలో చివరిపదం ‘తీల్’ అనేది కూడా పరభాషా పదమే, జగ్గకవి భక్తమందార శతకంలోని ఒక పద్యంలో ఈ పదం ‘తీర్’ అని కనిపించింది, నేను చూసిన పుస్తకంలో. ఇది అచ్చు తప్పు అయివుండాలి. ఈ పదం తీల్/తీర్ ఏ భాషా పదమోగాని, అర్ధం మాత్రం ‘లేదు’ అనే అన్నది సందర్భాన్ని బట్టి అర్ధమై పోతుంది!
కూచిమంచి జగ్గకవి రచించిన శ్రీ భక్తమందార శతకం నుండి ఈ క్రింది పద్య పాదాలు:
“దానంబిల్లె, దయారసంబు నహి, సద్ధర్మంబు తీర్, మీపద
ధ్యానంబున్ గడులొచ్చు…..”
“క్రతువుల్ సేసెదనంటినా, బహుపదార్ధంబిల్లె!…”
అదలా వుంచితే, కూచిమంచి జగ్గకవి భక్త మందార శతకంలో నాకు బాగా ఆసక్తి కరంగా అనిపించిన ఒక మాట ‘దేమస’ అనే మాట. ఈ మాట బ్రౌన్ నిఘంటువులోనికి కూడా ఎక్కలేదు. ఇది ఇప్పుడు ‘తమాషా’ అన్న అర్ధంలో వాడకంలో వుంది. భక్తమందార శతకంలోని ఆ పద్యం, మత్తేభం:
“రసికోత్తంసులు సత్కులీనులు మహాద్రాఘిష్ఠ సంసార ఘో
రసముద్రాంతరమగ్నులై దరికి జేరన్ లేక విభ్రాంతిచే
పసులం గాచిన మోటుకొయ్య దొరలం బ్రార్ధింతు రెంతేని దే
మసగాదే యిది యెంచిచూచినను రామా! భక్త మందారమా!”
తెలుగు మాట, పాట, పద్యం (3)
ఏ భాషలో నైనా సరే, పద్యం పదికాలాల పాటు నిలబడాలంటే, దానికి ముఖ్యంగా కావలసింది నడక. మంచి అర్ధసౌందర్యం కలిగిన పద్యానికి, ఒక మోస్తరు నడకైనా తోడైతే, ఆ పద్యం పదికాలాలు కాదు, వెయ్యి కాలాలైనా నిలుస్తుంది. తెలుగులో వందల కొలది చాటు పద్యాలు, అజ్ఞాతకర్తృకాలైనవి, ప్రజల నాలుకల మీదనుంచే తరంనుంచి తరానికి అంది నిలిచి వుండడానికి కారణం ఇదే గదా!
పద్యానికి ఛందస్సు వుంది. ఛందస్సులో వున్నంతమాత్రాన పద్యం పద్యమవుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. గాలికి తావి తోడైనట్లుగా, ఛందస్సుతో వున్న పద్యానికి మరొకటేదో తోడుకావాలి. ఆ ‘మరొక’ లక్షణాన్ని ప్రతిభగల కవి మాత్రమే అందించగలడు.
తెలుగు పద్యాలలో కంద పద్యానిది ఒక ప్రత్యేక స్థానం. కేవలం 64 మాత్రల నిడివి గలిగినటువంటి ఈ పద్యాన్ని రకరకాలుగా నడిపించారు మన కవులు. ఒక కవి వినూత్నంగా సాధించిన నడకను ఆ తరువాతి కవులు మక్కువతో అనుసరించిన సందర్భాలు సాహిత్యంలో చాలానే కనిపిస్తాయి. పద్యాల నడకల విషయంలో ఎవరు ముందు ఎవరు వెనుక అనే విషయాన్ని పక్కన పెట్టి, ఆయా నడకలలో తెలుగు పద్యం వయ్యారంగా నడిచిన తీరును పట్టి చూసుకుని ఆనందించడం ఒక పధ్ధతి. ఆ పధ్ధతిలో, ఇప్పుడు కంద పద్యమనే కాకుండా, మరికొన్ని రకాల ఛందస్సులలో వున్న పద్యాలను, ఆకర్షణీయంగానూ, ఆనందదాయకంగానూ వుండే వాటి ఒకటి రెండు రకాల ముచ్చటైన నడకలని, ఆ నడకలలో వివిధ కవుల పద్యాలను, నా దృష్టికి వచ్చిన వాటిని, ఇక్కడ మరోసారి మననం చేసుకుంటూ చూపెడుతున్నాను.
“లేమా, దనుజుల గెలువగ
లేమా నీవేల కడగి లేచితి విటురా
లే! మాను, మానవేనిన్
లే, మా విల్లందికొనుము లీలంగేలన్.”
పోతనగారి భాగవతంలోనిది ఈ కంద పద్యం. ఈ పద్యానికి ఒక వీనులవిందైన నడక వుంది. ఈ నడక పోతనగారితో ఆగిపోలేదు. ఇంకా ముందుకు వెళ్ళింది. ఆడిదం సూరకవి ( క్రీ.శ.18 వ శతాబ్దం) తరం దాకా వెళ్ళింది. రేకపల్లి సోమనాథకవి అని ఆడిదం సూరకవికి బలవత్ ప్రత్యర్ధియైన ఒక కవి ఉండేవాడట! ఆయన మీద ఒక భట్రాజు చెప్పన ఈ క్రింది కంద పద్యంలో మళ్ళి ప్రత్యక్షమైంది:
“అప్పా! రేకపలీ సో
మప్పా! విభుదాళి పాళి అమృతపు లప్పా!
ఒప్పులు నీ కవితలు వె
న్నప్పాలకు సాటి వచ్చునౌ భళి రుచులన్!”
ఈ పద్యం చెప్పి, సోమనాథకవికి రాజుగారు బహుమానంగా ఇచ్చిన దుశ్శాలువను ఆయనదగ్గరనుంచి కొట్టేశాడట ఆ భట్రాజు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో సంగతి ఏమిటంటే, కంద పద్యంలో సాధింపబడిన ఈ నడక, క్రీ.శ.18వ శతాబ్దం వాడే అయిన కూచిమంచి జగ్గకవి భక్తమందార శతకంలో ‘మత్తేభ’ ఛందంలో వున్న రెండు పద్యాలలో సాధింపబడి కనిపిస్తుంది. ఆ పద్యాలు ఇవి:
“అదిరా! పిల్చినబల్కవేటికి? పరాకా చాలు నిం కేలగా
గదరా! మిక్కిలివేడి వేసిరిలు బాగా? నీకు శ్రీజానకీ
మదిరాక్షీ శరణంబులాన! నను ప్రేమన్ బ్రోవరా….”
“గడియల్ రెండిక సైచిరా, వెనుకరా, కాసింత సేపుండిరా,
విడిదింటం గడె సేద దీర్చుకొనిరా, వేగంబె బోసేసి రా,
యెడపొద్దప్పుడు రమ్మటంచు….”
భాగవతంలోని ద్వితీయాశ్వాసంలో పోతనగారిదే మరొక కంద పద్యం:
“రామున్ మేచక జలద
శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సు
త్రామున్ దుష్టనిశాట వి
రామున్ పొమ్మనియె పంక్తిరథుడడవికిన్.”
కందపద్యానికి ఇది వీనులవిందైన, హాయిగొలిపే నడక. అయితే ఈ అనుప్రాసమే కొంచెం ఎక్కువైతే పద్యం ఎలా వుంటుందో తెలియడానికి పోతనగారిదే ఒక కందపద్యం:
“అడిగెదనని కడువడిజను
నడిగిన దనుమగుడ నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్.”
ఇందులో మోతాదు కొంచెం ఎక్కువైందని నేననుకుంటాను. అయితే, ఈ మోతాదులో అనుప్రాసము నచ్చే వాళ్ళూ వుండవచ్చు. కాదనలేం! ఈ రకపు నడకను, అనుప్రాసాన్ని కొంచెం మితంగా అంటే తగినంతగా వుంచి, చెప్పిన పద్యం ఎలా వుంటుందో ఈ క్రింది పద్యంలో తెలుస్తుంది:
“కడుపునకు కూడుగానక
పడి మిడిమిడి మిడుకునట్టి బడుగునకీయా
రడి అమరత్వం బేటికి
కడుపిటగాలంగ కంటకాటుక యేలా?”
కొఱవి గోపరాజు రచించిన సింహాసనాద్వాత్రింశిక లోనిదనుకుంటాను ఈ పద్యం, నాకు సరిగా గుర్తులేదు.
దొరకకుండా పోయిన తిక్కనసోమయాజిగారి ‘కృష్ణశతకము’ లోనిదిగా ఈ క్రింది పద్యం, మత్తేభ విక్రీడిత వృత్తం లోనిది, ప్రచారంలో వుంది:
“అరయన్ శంతనుపుత్రుపై విదురుపై నక్రూరుపై కుబ్జపై
నరుపై ద్రౌపదిపై కుచేలునిపయి న్నందవ్రజస్త్రీలపై
పరగం గల్గు భవత్కృపారసము నాపైగొంతరానిమ్ము నీ
చరణాబ్జంబులు నమ్మినాడ జగదీశా! కృష్ణ! భక్తప్రియా!”
తెలుగులోని సరళాతిసరళమైన పద్యాలలో ఇది ఒకటి. ఈ పద్యం చదివినతరువాత ఎవరికైనా పోతనగారి భాగవతంలోని పద్యం గుర్తుకురాకుండా ఉంటుందా? ఆ పద్యం:
“ఇంతింతై వటుడింతింతై మఱియు దానింతై నభొవీధిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్థియై!”
పోతనగారి ఈ పద్యం శార్దూలవిక్రీడిత ఛందంలోనిది.
ఛాయా చిత్రం (19)
ఛాయా చిత్రం (18)
ఛాయా చిత్రం (17)
నా వచన కవితలు (21)
ఇంకా….
నువ్వు ఎంగిలి చేసి వదిలేసిన జ్ఞాపకం ఇంకా ఆ చెట్టు కొమ్మకు వేలాడుతూనే వుంది.
గుడి మెట్ల మీద రాలి పడున్న ఎక్కడిదో తెలియని ఒక మందార ఆకు
గాలికి తచ్చాడుతూ బెరుకుబెరుగ్గా వచ్చి నీ పాదాన్ని తాకి ఇంకా మూర్ఛిల్లుతూనే వుంది.
దారంతా మాటనేది లేకుండా మౌనంగా నడిచి
చివరన మలుపు తిరిగే చోట మోమోటంగానైనా నువ్వొదిలేసిన చిరుచూపు నవ్వు
ఇంకా ముళ్ళపొదల కావల మొగిలిరేకులా పరిమళిస్తూనే వుంది.
నది వొడ్డున నీటి చలమల కావల సరివి చెట్ల నీడల్లో
మళ్ళీ దొరికేవి కావని తెలిసీ నేను పోగొట్టుకుంటూ పోయిన సుదీర్ఘ సాయంకాలాలు
చీకటి పడే వేళకు వాటికవే ఇంకా ఏదో తెలియని విషాదాన్ని మౌనంగా మాటేసుకుంటున్నాయి.
ఒకానొక తమోహ రణ క్షణంలో తేలికగా వదిలేసుకున్న ఇన్నిటి జ్ఞాపకాలు
వలస వెళ్ళి తిరిగి రావడం మరిచి పోయిన పక్షుల్లా
కనుపించీ కనుపించకుండా ఇంకా నీ పాటను వ్యధాలాపంగా ఆలపిస్తూనే ఉన్నాయి.
ఛాయా చిత్రం (16)
ఛాయా చిత్రం (15)
ఛాయా చిత్రం (14)
సీతాకోకచిలుక (1)
ఇది నేను తీసిన మొట్టమొదటి సీతాకోకచిలుక ఫోటో. ఈ ఫోటో తీయడం నా ఆలోచనలోనే లేనిది, కొన్నాళ్ళ క్రితం అకస్మాత్తుగా రోడ్డుమీద నిశ్చలంగా వుండి ఆశ్చర్యపరిచిందీ సీతాకోకచిలుక. lucky గా నేను కెమేరా ఫొకస్ చేసుకుని క్లిక్ చేసే వరకూ అలానే నిశ్చలంగా ఉండి, ఆ పై ఒకటి రెండు క్షణాల తరువాత, రెక్కలు ఆడించుకుంటూ పక్కనే ఉన్న చెట్ల గుబురులలోకి ఎగిరిపోయింది.
దానిని కళ్ళతోనే అనుసరించి, చెట్ల ఆకుల మధ్య దాని సహజ స్థానంలో వుండగా తీసినదిది, ఈ రెండవ ఫోటో!
ఇది మొదలు, మరికొన్ని ఫోటోలు దీనిని అనుసరించాయి….


















