అచ్చ తెనుగు పద్యం
తెలుగు పద్య సాహిత్యంలో ‘అచ్చ తెనుగు’ అన్న మాటను మొదటి సారిగా వాడిన వ్యక్తి మూలఘటిక కేతన అని చెబుతారు. ఈయన తిక్కన మహాకవి సమకాలికుడు. తెలుగులో మొదటి కథాకావ్యానికి (దశకుమార చరిత్ర) శ్రీకారం చుట్టినవాడు కేతన. ‘కవిత చెప్పి’ తిక్కన మహాకవినే మెప్పించినవాడు ఈయన. ఈయన చెప్పిన ఈ ‘అచ్చ తెనుగు’ అనే మాటకు ముందు, ఈ మాట ఏ అర్ధాన్నయితే సూచిస్తుందో అదే అర్ధంలో ‘జాను తెనుగు’, ‘దేశి’ అనే మాటలు వాడుకలో వుండేవి. ఈ మాటలను తమ పద్యాలలో చెప్పిన వారు ‘నన్నె చోడుడు’, పాలుకురికి సోమనాధుడు!
పేరుకి ఇన్ని మాటలున్నా, ఈ మాటలు ‘అచ్చ తెనుగు’ భాషా స్వరూపాన్ని అర్ధమయేలా చేయడంలో సఫలీకృతం కాలేకపోయాయన్న ఒక అభిప్రాయం, విజ్ఞుల మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి! భాషా స్వరూపం అర్ధం కావాలంటే, ఒక ఉదాహరణంతో చెప్పుకుంటే, కొంతలో కొంత స్ఫష్టత వచ్చి, సులభం అవుతుంది.
“పగలు సేయుచు వేడిమి మిగుల జగము
గ్రాచు జమునబ్బ మున్నీట గలిసె ననియొ
తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపు
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”
కూచిమంచి తిమ్మకవి రచించిన ‘అచ్చ తెలుగు రామాయణం’ కావ్యంలోనిది ఈ పద్యం. సూర్యాస్తమయాన్ని సుందరంగా వర్ణించే పద్యం! నాకయితే, ఈ పద్యంలోని మాటల పొందిక, brevity, గాథా సప్తశతిలోని గాథలను తలపుకు తెస్తుంది. మంచి భావంతో నిండి వున్న పద్యం! ఊహ original ది! నాకు తెలిసినంతవరకూ, ఏ ప్రాకృత గాథనుంచో, సంస్కృత శ్లోకంనుంచో ఎత్తుకొచ్చింది కాదు!
ఇప్పుడు, ఈ పద్య భావాన్ని కొంచెం విడమరచి చెప్పుకుంటే…
‘పగలు సేయుచు’ – పగలు సేయువాడు – దినకరుడు.
సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ, కొన్ని రకాలయిన సంస్కృత సమాసాలు అచ్చ తెలుగులోకి మారేటప్పుడు జరిగే మార్పులను గురించి కొంత వివరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సంస్కృత సమాసాలలోని ప్రత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, దొర, తపసి, జోదు…ఇత్యాది శబ్దాలు జతవుతాయి అని వ్యాకరణం. ఉదాహరణకి:
అచ్చ తెలుగులో ‘కప్పు కుత్తుక వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘నీలకంఠ’ కు,
అచ్చ తెలుగులో ‘గిత్త తత్తడి వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘వృషభ వాహన’ కు,
అచ్చ తెలుగులో ‘వెంట్రుక యడుగుల దొర’ అనే సమాసం, సంస్కృతంలో ‘రోమ పాద’ కు,
అచ్చ తెలుగులో ‘మనుబోతు కొమ్ము తపసి’ అనే సమాసం, సంస్కృతంలో ‘ఋష్యశృంగ’ కు,
అచ్చ తెలుగులో ‘పచ్చ వారువపు జోదు’ అనే సమాసం, సంస్కృతంలో ‘హరిదశ్వా’ కూ అనువాదాలని పెద్దల వివరణ. తెలుగులో వీటినే బహువ్రీహి సమాసాలుగా భావిస్తారని కూడా చెబుతారు, అర్ధంలో చివరన కలది, కలవాడు చేరతాయి కాబట్టి. (నల్లని కంఠము కలవాడు, ఎద్దును వాహనముగా కలవాడు…ఇత్యాదిగ).
నాకయితే తెలుగులో ఈ మాటలు, సంస్కృతంలో మాటలు ఎంత అందంగా కనిపిస్తాయో, తెలుగులోనూ అంతే అందంగా అనిపిస్తాయి. ఇలాంటివే ఇంకొన్ని సమాసాలు:
వలిగుబ్బలి రాచ కూతురు (హైమవతి – హిమవంతుని కూతురు, ‘వలిగుబ్బలి’ అంటే మంచుకొండ అని అర్ధం), పుట్ట బుట్టువు తపసి (వాల్మీకి – పుట్ట నుంచి పుట్టిన తపస్వి), పదియరదముల దొర కొడుకు (దాశరధి – దశరధుని కుమారుడు) – ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలంత అందంగానే కనబడతాయి.
ఇక్కడితో ఇది ఆపి, అసలు పద్యానికొస్తే –
పగలు సేయుచు – పగటిని చేస్తూ, ఆ క్రమంలోనే; వేడికి మిగుల జగము గ్రాచు – వేడిమితో జగత్తునంతా వుడికించి ఇబ్బందికిలోను చేసే; యమునబ్బ – యముని తండ్రి (సూర్యుడు); మున్నీట – సముద్రములోనికి; కలిసె ననియొ – కలిసిపోయాడుగదా అని; తొగ వెలందుక – కలువ పూవు (అనే పడతి); నగియె – నవ్వింది; అమ్మగువ – ఆ కలువ సుందరి; పెంపు గని – సంతోషంతో వదనం పెద్దదవడం (కలువ వికసించడం అన్న భావం) చూసి; సయింపక – తాళ లేక; తమ్మి – తామర పూవు (అనే పడతి); మొగంబు మొగిచె – మొహం ముడుచుకుంది, చాటు చేసుకుంది.
సూర్యాస్తమయంతోనూ, చంద్రాగమనంతోనూ కలువలు వికసించడం అనేది ప్రకృతి ధర్మం. సూర్యాస్తమయంతో తామరలు వికసనం కొల్పోయినట్లయి, కళావిహీనంగా, ముడుచుకున్నట్లయిపోవడమూ ప్రకృతిధర్మమే! ఈ రెండు ధర్మాలనూ కలబోసి, ఒకే సందర్భానికి జతచేసి, హృద్యంగా చెప్పడం ఈ పద్యంలో జరిగింది.
నాకు ఈ పద్యాన్ని చదివినప్పుడల్లా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది. పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గాథా సప్తశతి లోని పద్యాలను తెలుగులోకి అనువదించడంలో ఈ పద్యాన్నే(సరిగ్గా ఈ పద్యాన్నే అని కాకుండా, ఇలాంటి పద్యాలనే) ఆదర్శంగా తీసుకున్నరేమో! అని. ఎందుకంటే, అందులోని చాలా పద్యాల నడక ఈ పద్యాన్నే పోలి వుంటుంది. ఉదాహరణకి:
“అడుగుదమ్ములందు బడివేడు పతివీపు
జిన్ని కొమరుడెక్కి చెలగి యాడ
అలుక యెంత తెగనిదయ్యును నిల్లాలి
మొగమునందు నవ్వు మొలచె నపుడు! “ (శతకం 1 గాథ 11)
“ఎవని వదలిన జీవంబు నవసి చనునొ
యతని నపరాధినయ్యు నోదార్ప వలయు;
ఊరు గాలుచు బొలిపోవు చున్న గాని
యగ్గి నొల్లని వారెవ్వరతివ, చెపుమ?” (శతకం 2, గాథ 63)
అందుండి అచ్చ తెలుగు మాటలలో వున్న ఇలాంటి రమ్యమైన పద్యాలను ఇంకా చాలానే ఉదాహరించవచ్చు!
ఏదయినా మంచి సంగీతం లేదా పద్యం విన్నప్పుడు చెవుల్లో తేనె పోసినట్టు ఉంది అంటారు కదా అలా కళ్ళలో తేనె పోసినట్టుంది (ఈ పద ప్రయోగం లేదనుకుంటాను, సరదాకి వ్రాసాను!) ఎంత చక్కని విశ్లేషణ! మీకున్న భాషా పిపాసకి శతకోటి వందనాలు! మీకు ఓపికున్నంత వరకు ఇలాంటివి మరెన్నో మంచి విషయాలు మా ముందుకి తెస్తూనే ఉండండి!
భాషలో సౌందర్యాన్ని, సుందరమైన భావాన్ని విడమరచి చూపించినప్పుడు, చెప్పినప్పుడు, చూసి, విని తన్మయం చెందడానికి అంతే సౌందర్యవంతమైన
చూపూ, మనసూ వుండాలి. అవి మీకున్నాయని మీ వ్యాఖ్యల వలన అర్ధమవుతుంది. ధన్యవాదాలు! తప్పకుండా ప్రయత్నిస్తూనే వుంటాను!
తత్సమాలు, తద్భవాలు పెరిగిపోయి అచ్చ తెనుగు వెనకపట్టి చాలా యేళ్ళయిందనుకుంటా సార్!
అవును శర్మ గారూ! ఈ తత్సమ, తత్భవ వ్యవహారం మరీ ఎక్కువై పోయిందనిపిస్తుంటుంది ఒక్కొకప్పుడు! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!
ఇవ్వాళరేపు thatసమాలు, thatభవాలతోనే నడుస్తోంది “సార్..”
బాగుందండీ, వ్యాఖ్య చాలా బాగుంది! చాలా సంగతులను ఇమిడ్చారు ఆ నాలుగు మాటలలోనే! ధన్యవాదాలు!
అచ్చ తెలుగు గురించి ఇంత చక్కగా చెప్పి సంస్కృత పేరుతో నడిపిస్తున్నారేం?
సంస్కృతందైనా ఆ మాటంటే ఇష్టం కాబట్టి!
ధన్యవాదాలు!
dhanayavadalu telugu bhasaku chala baga krishi chestunnaru.
ganeh baehara గారూ, ధన్యవాదాలండీ!