ఫొటోగ్రఫీ : Images 2012 – (5)

seethakokachiluka-4ఈ ఫోటో తీసే సమయంలో ఓ మోస్తరు బలంగా గాలి వీచింది. గాలి బలానికి పువ్వు వున్న కొమ్మ వంగింది. గాలిలో పువ్వు రెక్కలూ రెపరెపలాడాయి. అదే సమయంలో ఆ పువ్వు మీద వాలిన సితాకోకచిలుక, పూవు రెక్కలమీద సరిగా పట్టు దొరకక, రెక్కల కదలికకు అణుగుణంగా dance చేస్తున్నట్లుగా అయింది. ఇందంతా కొన్ని క్షణాలే! ఆ కొన్ని క్షణాలలో జరిగిన ఆ నాట్యం ఈ ఫోటోలో కనిపిస్తూందనుకుంటాను!

ఫొటోగ్రఫీ : మధుపం…

‘మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమ్ము బోవునే మదనములకు’ అని బమ్మెర పోతనగారు తమ భాగవతంలోని పద్యంలో మధురంగా చెప్పారు…. ‘వెళ్ళదుగాక వెళ్ళదు!’ అన్న సమాధానాన్ని అందులోనే ధ్వనింపజేస్తూ!

ఇలాంటి విషయాలూ చెప్పడానికి అప్పటిలో (క్రీ.శ.14వ శతాబ్దంలో) పద్యం ఒక్కటే మాధ్యమం (medium) కాబట్టి వారు పద్యంలో అలంకారికంగా చెప్పారు. ఆ తరువాత రోజులు…కాదు శతాబ్దాలు గడిచాయి. ఆధునిక యుగంలోకి అడుగుబెట్టాక, కెమేరా కనుగొనబడింది. ఆ తరువాత అనతికాలంలోనే SLRs వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి కూడా! ఫోటోగ్రఫీ గురించి పెద్దగా తెలియని నాలాంటి
వాళ్ళు కూడా, మంచి ఫోటోలు తీయడాన్ని డిజిటల్ కెమేరాలు సౌకర్యవంతం చేసి, వీలు కలిగించాయి. ఈ సౌకర్యం, పోతనగారి పై భావాన్ని అందమైన కలర్ ఫోటోలలో ఎందుకు బంధించి చూపెట్టగూడదన్న ఆలోచనను కలుగజేస్తే, ఆ ఆలోచన ఫలితంగా ఉద్భవించినవే ఈ క్రింది ఫోటోలు!

ఈ ఫోటోలు తీసే క్రమంలో నేను గమనించిన కొన్న సంగతులను ఇక్కడ చెబుతాను.

1) తేనెటీగ చాలా చాలా agile గా ఉంటుంది, పూవు మీద వాలిన తరువాత ఒక్క క్షణకాలం కూడా నిలకడగా వుండదు.
2) పూవు మీద వాలుతూనే అది పూవులోని ఏ భాగంనుంచి తేనె సేకరించుకోవాలో వెదకడం ప్రారంభిస్తుంది. అందువలన పూవుమీద అది నిలకడగా ఉండి కనుపించడం జరగదు.
3) కొన్ని క్షణాల వ్యవధిలోనే పూవులోని ఏ భాగంనుంచి తేనె సేకరించుకోవాలో అది గుర్తిస్తుంది.
4) గుర్తించడమే తడవుగా తేనె సేకరణకు అది ఉపక్రమిస్తుంది. ఇదంతా పూవుపై తేనెటీగ కదలికలతో కొన్ని క్షణాల కాలంలోనే జరిగిపోతూ ఉంటుంది.
5) తేనెటీగ పూవు నుంచి మకరందాన్ని సేకరించేందుకు పట్టే కాలం కూడా చాలా చాలా తక్కువ. అది సేకరణ మాత్రమే కావడం ఇందుకు కారణం! (సీతాకోక చిలుక లాగా తేనెటీగ పూవులోంచి మకరందాన్ని తాగెయ్యదు, మరోచోట నిక్షిప్తం చేయడానికి సేకరిస్తుంది, అంతే! సీతాకోక చిలుక పూవునుంచి మకరందాన్ని తాగేస్తుంది. అందువలన పూవుపై సీతాకోకచిలుక నిలిచి ఉండే సమయం తేనెటీగతో పోలిస్తే చాలా ఎక్కువ!).
6) తేనెటీగకు మకరందాన్ని పూవునుంచి సేకరించడానికి దాని శరీరంలో ఉన్న ఉపకరణం నిడివి చాలా చిన్నది. అందువలన తేనెను సేకరించే క్రమంలో అది పూవులోపలికి బాగా వంగిపోతుంది, (it almost doubles up!).  ఆ కారణంగా పూవుపై తేనెటీగ సజావుగా  ఉండి ఫోటోలకు దొరకడం చాలా కష్టం. అలా పట్టుకోవాలంటే, దూరాన్నుంచే తేనెటీగను చూపులతో అనుసరించి, అది పూవుపై వాలే సమయంలోనే పట్టుకోవాలి. దీనికి చాలా వోపికగా వేచివుండడం అవసరం.
7) Loads and loads of patience అవసరం! సరిగ్గా మంచి image దొరికే తరుణంలో ఆనంద పారవశ్యంలో excitement కి లోనయితే, ఆ excitement లో చెయ్యి వణికి, zoomers వాడుతాం కాబట్టి, image blur అవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఈ image blur అనేది అప్పుడు గమనించలేనిదిగా ఉండి, ఇంటికొచ్చి కంప్యూటర్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు బయటపడి ఆశాభగం కలిగిస్తుంది!

చివరన ఈ మాట – ఈ ఫోటోల మీద ఎక్కడ ‘క్లిక్’ చేసినా, image ని High Definition లో చూడవచ్చు!

ఫొటోగ్రఫీ – ప్రకృతి, పూవులూ, రంగులూ… (5)

మొన్ననే ఈ సంవత్సరానికి  ‘శివరాత్రి’ వెళ్ళింది. ‘సంక్రాంతి’ వెళ్ళి కూడా అటుమొన్ననే అన్నట్లుగా వుంది ఇంకా! పండుగ అనుకోంగానే మొదటగా మనస్సులో మెదిలేది ఇంటి గుమ్మానికి తోరణం! గుమ్మానికి తోరణం అనుకోంగానే జ్ఞాపకానికి వచ్చేది మామిడాకులూ…ఆపై ఆవెంటనే ఆనుకుని వుండే లావు లావు బంతిపూల దండ! ఆకుపచ్చ, ముదురు పసుపురంగులు పక్కపక్కనే వుంటే వచ్చే అందం మాటలతో వర్ణించలేనిది! గుమ్మానికి వ్రేలాడుతూ ఇవి ఇంటి మొత్తానికి పండుగ కళను తెస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు కదా!

‘సంక్రాంతి’ కీ బంతిపూలకూ అవినాభావ సంబంధం వుందనుకుంటాను! ‘సంక్రాంతి’ రోజులలో ఎవిరి పోషణలోనూ లేకుండా ఎక్కడో పిచ్చి ప్రదేశంలో పడి మొలిచి పెద్దదైన బంతి చెట్టు కూడా విరగ పూచిన పూలతో కళకళ లాడుతూ కనిపిస్తుంది. ఇక ఇళ్ళ ముంగిళ్ళలో ఇంటివాళ్ళ పోషణలో వున్న బంతి చెట్ల సంగతి చేప్పనవసరం లేదు కదా!

‘శివ రాత్రి’ తో చలి ‘శివశివా’ అంటూ పోతుందని పెద్దలు పరిశీలనతో చెప్పిన మాట. రాత్రిళ్ళు ఇంకా చలి పొడ వదలకపోయినా, పగళ్ళు ఎండతో మిలమిల లాడుతూ  వుండడం అప్పటినుంచీ మొదలవుతుంది. పగటి ఎండ వేడిమికి పూల చెట్లు, వాటికున్న పూలూ వాడడం మొదలవుతుంది. మిగతా పూల మాట అలా వున్నా, బంతిపూలు మాత్రం వాడు ముఖం పట్టకుండా, ఎండలు ఇంకాస్త ముదిరే దాకా కళకళ లాడుతూనే కనిపిస్తాయి! అలా కళకళ లాడుతూ, కన్నుల పండుగగా వున్న బంతిపూల ఫోటోలు ఇప్పుడు, ఇక్కడ, కొన్ని! ఈ ఫోటోల మీద ఎక్కడ ‘క్లిక్’ చేసినా, image ని High Definition లో చూడవచ్చు! So, enjoy the photos and the colors as well!

మళ్ళీ ఒకసారి మన ‘లేపాక్షి’ గురించి…(2)

‘లేపాక్షి’ ని గురించిన ప్రస్తావన ఎప్పుడు, ఎక్కడ వచ్చినా, లేపాక్షి కి మరో పేరు అనుబంధించబడి వినబడుతుంది. ఆ పేరు ‘బసవన్న’! ‘లేపాక్షి’ ని ‘బసవన్న’ ను విడదీయలేని అనుబంధంతో పెనవేసుకునిపోయి, ఎంతగానో ప్రసిధ్ధి చెందింది ‘లేపాక్షి బసవన్న’ అనే పేరు! లేపాక్షి కి వెళ్ళి ఈ బసవన్నను దర్శించుకోనిదే, ఆ వెళ్ళిన వాళ్ళకు లేపాక్షి సందర్శనం పూర్తి అయినట్లుగా భావింపబడదు అనడం అతిశయోక్తి కానే కాదు!

లేపాక్షి శ్రీ వీరభద్రాలయానికి ఒక కిలోమీటరు లోపు (రెండు మూడు ఫర్లాంగుల కంటె ఎక్కువ దూరం వుండదనుకుంటాను!) దూరంలోనే బసవన్న శిల్పం వుంటుంది. కాలి నడకన వెళ్ళవచ్చును.  ఏకశిల నుంచి మలచబడిన ఈ బసవన్న శిల్పం కూడా, లేపాక్షి, శ్రీ వీరభద్రాలయంలోని మిగతా శిల్పాల లాగా,  జీవకళతో మెరిసిపోతూ వుంటుంది.  మొత్తం శిలనే బసవన్నగా మలిచిన అధ్బుత శిల్పం ఇది. దేశంలోనే పరిమాణంలో అతి పెద్ద (8.1 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తు పరిమాణంతో) బసవన్న శిల్పంగా ‘లేపాక్షి బసవన్న’ ను చెబుతారు! తీరుగా కూర్చుని శ్రీ వీరభద్రాలయం కేసి స్తున్నట్లుగా మలచబడింది. బసవన్న వెనక నిలబడి, కొమ్ముల మధ్య నుంచి ధృష్టి సారించి చూస్తే శ్రీ వీరభద్రాలయంలోని  ఏకశిలపై మలచబడి వున్న నాగలింగం కనబడుతుంది.

అన్ని హంగులతో మలచబడి వున్న’లేపాక్షి బసవన్న’ ఫోటోలు, ఇక్కడ ‘slide-show’ గా!

This slideshow requires JavaScript.

మళ్ళీ ఒకసారి మన ‘లేపాక్షి’ గురించి…(1)

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం, అసంపూర్తి కళ్యాణమండపానికి పక్కన ఒకే రాతి మీద మలచిన విఘ్నేశ్వర మరియు నాగలింగ శిల్పాలున్నాయి. ఈ ప్రతిమలున్న పెద్ద శిల వున్నది, ప్రధాన ఆలయానికి సరిగ్గా వెనకవైపు అవుతుంది.

ఏకశిలలో మలచిన ఈ ప్రతిమల వెనకా ఒక కథ వుంది. ఈ ఆలయ నిర్మాణానికి నియోగించబడిన శిల్పులలో, ఒక కుర్ర శిల్పి పనితనానికి సంబంధించిన కథ అది. ఆలయ నిర్మాణం జోరుగా సాగుతున్న రోజులలో ఒకనాటి రోజు, మధ్యాహ్నం భోజన విరామ సమాయానికి, భోజనం తయారవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆ కుర్ర శిల్పి తల్లి చెప్పడంతో, ఆ మధ్య కాలంలో ఖాళీగా కుర్చోవడం ఇష్టం లేని అతను, తిరిగి అతని తల్లి వద్ద నుండి భోజనం తయారయిందని కబురు వచ్చేంతలోనే, ఆ శిలపై ఈ రూపాలను మలిచాడనీ…

అలా అంత తక్కువ వ్యవధిలోనే శిలను అద్భుతమైన శిల్పంగా మలచ గలిగిన తన కుమారుని ప్రతిభకు ఆశ్చర్య పోయిన ఆ తల్లి, తన్మయంలో ఇంగితం మరచి కుమారుని ఎదుటనే అతని ప్రతిభను గొప్పగా పొగిడిందనీ, అలా ఆమె పొగిడిన తరువాత కొద్ది సేపటికే  అందరూ ఆశ్చర్య పోయే లాగా శిల్పం మలచ బడి వున్న శిల మధ్యలోకి పైనుంచి క్రిందివరకూ ఒక సన్నని పగులు ఏర్పడిందనీ, శిలలో ఏర్పడిన ఆ పగులు కారణంగా శిల్పం  లోపం కలది అయిపొయిందనీ ప్రచారంలో వున్న కథ!

కథ సంగతెలా వున్నా, ఏక శిలపై విఘ్నేశ్వర, నాగలింగ శిల్పాలు చూడడానికి అద్భుతంగా వుంటాయి. నాగలింగ శిల్పంలో పడగ విప్పి వున్న ఏడు తలల నాగరాజు, శిల్పం చెక్కబడి వున్న శిల సహజంగానే ఎత్తుగా వుండడం వలన చాలా gigantic గా, పేరుకు తగినట్లు magnanimous గా కనిపిస్తుంది.

ఆ ఫోటోలు మొదట విఘ్నేశ్వరునివి, ఆ తరువాత నాగరాజువి ఇప్పుడు, ఇక్కడ…slide show గా!

This slideshow requires JavaScript.

ప్రాకృతికం – పల్లె అందం

“ణిప్పణ్ణ సస్సరిధ్ధీ సచ్చందం గాఇ పామరో సరఏ,
దలిఅ ణవసాలి తండుల ధవల మిఅంకాసు రాఈసు.”

శాతవాహన ప్రభువులలో ఒకడైన హాలమహారాజు చే సంకలించబడిన గాథా సప్తశతి అనే పేరున్న ప్రాకృత గాథల సంకలన గ్రంథంలో ఏడవ శతకంలోని ఎనభైతొమ్మిదవ గాథ ఇది.

“నిష్పన్న సస్య ఋధ్ధిః స్వఛ్ఛందం గాయతి పామరః శరది,
దలితనవశాలి తండుల ధవల మృగాంకాసు రాత్రిషు.”

అని పై ప్రాకృత గాథకు సంస్కృత ఛాయ.

‘కోర్కె తీరగా పంట పండింది. దంచిన కొత్త బియ్యపు పిండి ఆరబోసినట్లున్న శరత్కాలపు వెన్నెలరాత్రిలో ఆనందంతో రైతు గొంతు విప్పి పాట పాడు తున్నాడు’ అని ఈ గాథకు పెద్దలు చెప్పిన అర్ధం. భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించే ఒక పల్లెటూరి రైతు జీవితంలో దైవం అనుగ్రహిస్తే పదే పదే పునరావృతమయ్యే ఒక సన్నివేశాన్నీ, ఆ సన్నివేశంలోని సౌందర్యాన్నీ కనులకు కట్టినట్లు అతి తక్కువ మాటలలో వర్ణించి చూపెట్టే ఈ గాథను ఎన్ని సార్లు చదివినా, మననం చేసుకున్నా, తనివి తీరనట్లుంటుంది.

అచ్చమైన ఆప్యాయతతో రైతు కాళ్ళకు అంటుకునే పొలంలోని మట్టీ, మట్టిని తడిపి తమకంతో తబ్బిబ్బయ్యే నీరూ, స్వచ్చంగా వీచే గాలీ, రాబోయే పంటమీదా, పచ్చదనం మీదా కారుణ్యంతో కాచే ఎండ, కాలం కనికరించి అన్ని కలిసొస్తే ఏ దిక్కుకేసి చూసిన కళ్ళ నిండుగా కనిపించే పచ్చదనం….ఇవన్నీ పల్లెటూరు అనే పడతికి ప్రకృతి తనంత తానుగా తొడిగి చూపించిన నిలువెత్తు ఆభరణాలు. జీవితంలో ఏ కొంత భాగమైన పల్లెటూరిలో గడపడం అన్నది సంభవించిన ఏ వ్యక్తికైనా వీటి సహజ సౌందర్యం ఏమంత కష్ట పడకుండానే మనసుకు తట్టి కనులకు కడుతుంది.

ఆధునిక జీవన శైలిలో, పొట్టకూటికోసం అనుకున్నా, మరెందుకోసం అనుకున్నా, తనదైన పల్లెటూరిని విడిచి పట్టణానికి వలస వెళ్ళల్సి రావడం సంభవించిన వ్యక్తికి, తలచుకునే సందర్భం దొరికినప్పుడల్లా, వాటి సహజ సౌందర్యం మనసును పూర్తిగా కమ్మేసి, ఆ దృశ్యాలను విడిచి పెట్టి  ప్రస్తుతంలోకి రావడానికి ఒక పట్టాన ఇష్టపడక మనసు మొరాయిస్తూనూ వుంటుంది.  తప్పనివి అయినా కాకపోయినా, తెచ్చిపెట్టుకున్నవి అయినా కాకపోయినా….ఈ వియోగాలు ఇప్పటి జీవితంలో తప్పించుకోలేని అంతర్భాగాలయిపోయాయి. అంగీకరించాలిసిందే తప్ప, అందులో బాధపడాలిసింది కూడా ఏమీ లేదనే అనుకోవాలి!

పల్లెటూరితో సంబంధం వున్నవాళ్ళు మరోసారి ఆ సౌందర్యాన్ని మననం చేసుకోవడానికి వీలుగానూ, సంబంధం లేని వాళ్ళు ఆ సౌందర్యాన్ని మరోసారి చూడడానికి వీలుగానూ, నా ఫోటోలు కొన్ని slide show గా…. ఇప్పుడు, ఇక్కడ! ఇక్కడ ఒక్క మాట! ఈ ఫోటోలన్నీ బస్సులో ప్రయాణిస్తూ తీసినవి. అందువలన, అక్కడక్కడా ఒకటి రెండు ఫోటోలు straight గా వుండకుండా, కొంచెం angled గా కనిపిస్తాయి. అయితే, angled గా వున్నా, అందులో వున్నది ప్రకృతి  కాబట్టి, వాటి సౌందర్యానికి ఏమీ భంగం కలగలేదనే అనుకుంటాను!

This slideshow requires JavaScript.