చిటారుకొమ్మన….. చిగురాకులలో….. ఒకే (సీతాకోక) చిలుక, రెండు ఫోటోలు!
చిటారుకొమ్మన….
ఏ అనవసరపు ఆవేశానికీ లోనుకాకుండా
నింపాదిగానూ, ఒకింత నిర్మోహంగానూ చూడగలిగే కన్ను
చూడలేనిది ఏదీ ఉండదు.
పసితనమూ, వార్ధక్యమూ
పత్రహరితమూ, పోయిన వసంతమూ
అన్నీటినీ ఆ కన్ను అదే కరుణతో వీక్షిస్తుంది.
వెలిగే దీపం చీకటి వాకిట్లో మరీ హుందాగా మెరిసేటట్లుగా
అందం అప్పుడప్పుడూ ఒక్కొక సందర్భాన్నీ అంటిపెట్టుకుని ఉంటుంటుంది.
అందువలన, సౌందర్యాన్ని సృష్టించడమంటే ఎప్పటికప్పుడు సందర్భాన్ని కల్పించడమో, మేలుకొల్పడమో అవుతుంటుంది.
నువ్వు ఉండవు.
అయినా నిన్ను గురించిన సందర్భాలు కొన్నైనా చిత్రాలుగా మారి చిత్తాన్ని అలంకరించి ఉండడమే జ్ఞాపకం.
ఇది సహజం.
నేను ఉంటాను.
అయినా నన్ను గురించిన సందర్భం ఏదీ నీ చిత్తాన్ని అలంకరించి ఉండకుండడమూ నాకు జ్ఞాపకమే!
అసహజమైనా సౌందర్యమే!
అందుకే అంటాను
నింపాదిగానూ, ఒకింత నిర్మోహంగానూ చూడగలిగే కన్ను
చూడలేనిది ఏదీ ఉండదు.
అడవి గాచిన వెన్నెలలా, ఎవరికీ చెందని విషాదం కూడా ఒక్కొకప్పుడు మహా సౌందర్యానికి కారణమౌతుందన్నది నిజం!
ఇంత తీయగా ఉంటుంది గనుకనే నీ జ్ఞాపకపు గాయాన్ని నేను ఎన్నటికీ మానిపోనీయను.
ఎక్కు పెట్టిన బాణానికి గురి తప్పడం కూడా తెలిసే ఉంటుంది.
ఎడారికి దాహాన్ని గురించిన స్పృహ మొదటినుంచీ ఉంటుంది.
ఎంత పకడ్బందీగా రాసుకున్నా విఫలం అయ్యే కొన్ని ప్రేమ కథల్లోనూ గాథల్లోనూ లాగా
అయిన గాయాన్ని
ఎవరిదో ఒక విరహ గీతంలా పెదవులపై మోస్తూ తిరగడంలో ఎంత సుఖముందో నీకేం తెలుసు?
నువ్వు జ్ఞాపకంగా ఉండడంలో ఎన్ని వేల గేయాలున్నాయో నాకిప్పుడు బాగా తెలుసు.
ఎంతగా కాంక్షించి చూసుకున్నా సఫలం కాని కొన్ని ప్రేమ కథల్లోనూ గాథల్లోనూ లాగా
మరిచిపోవడం తప్పనిసరి అయిన ప్రతిసారీ నేను నీ మోహం లోనుంచి తప్పుకుని ఏదో ఒక గాయంలోకో, గేయంలోకో, జ్ఞాపకాల తోయంలోకో లీనం అయిపోవడానికి ప్రయత్నిస్తాను. సఫలం చెందుతాను కూడా!
నన్ను నేను తప్పిపోగొట్టుకోవడంలో ఎంత సుఖముందో నీకేం తెలుసు?
వాడిపోయిన, మోడైపోయిన ప్రతి పూవునుంచి చెట్టునుంచి నన్ను నేను కొంచెం కొంచెంగా దక్కించుకోవడంలో ఎంత సుఖం ఉందో ఇప్పుడు నాకు మాత్రమే తెలుసు.
ఎప్పుడైనా నేనిప్పుడు
నువ్వు ఉండకుండా ఉండే నీ జ్ఞాపకాల లోకంలో ఇలా చెట్టు చెట్టుకీ ఒక హరితాశ్రువునై పరిభ్రమిస్తూ కనబడతాను.
నువ్వుండని ప్రతిచోటా నీ కంటే నిజంగా నాకు నీ జ్ఞాపకమే హరితాత్మ!
ఏదైనా సరే ఒక విలక్షణతతో విశ్వాన్ని సమ్మోహపరచాలని కాంక్షించే ప్రతి చిన్న పువ్వుకూ
ఏదో ఒకనాటికి ఎవరిదో ఒకరి సాన్నిధ్యంలో కనులు మొగిడ్చి తన్మయానికి లొంగి పోయే తరుణం రానే వస్తుంది.
గడ్డిపరక కైనా సరే,
వెనక్కి వాలి, వెన్నిచ్చి, కనులు మూసుకుని కాస్త సేద దీరినపుడు
నలిగి పోతున్నానన్న బాధకన్నా
నన్నే గదా ఆపు చేసుకున్నాడన్న స్పృహ, సంతోషమూ లోపల ఉండకుంటే తప్ప
మళ్ళీ లేచి కూర్చోలేదనుకుంటాను.
క్షణాలుగా గడిచిపోతుంటుంది యవ్వనం
యుగాలుగా గడుస్తూ ఉంటుంది వార్ధక్యం!
అన్నీ అయిపోయాక
కళ్ళ రెప్పల వెనుక బారులుగా తీరి ఉన్న నీళ్ళ చారల దారులలో
ఎవరిదో తెలియని ఒక విశ్వ మొహక గళం తనను తాను తప్పిపోగొట్టుకుని
ఆలాపించే అంతులేని శోకాశోక గీతానికి పారవశ్య సూచకంగానో నిదర్శనంగానో అన్నట్లుగా
ఎప్పుడూ ఒక నీటి బొట్టు కనుపించీ కనుపించకుండా కంటి రెప్పలనంటి
వేళ్ళాడుతూ ఉండడం ఒకానొక మధురాతి మధురమైన జ్ఞాపకం!
***
రంగుల కల -3
ఎందుకో గాని
ఈ రంగుల ముందు నా మాటలు
ఎప్పుడూ మౌనంగా వుండడాన్నే
ఇష్టపడతాయి!
అదెందుకో గాని
విరిసినా విరియక ఉన్నా వాడినా
పువ్వెప్పుడూ ఒక మధుర స్వప్నానికి ఆనవాలులాగానే ఉంటుంది.
ప్రియమైన లోగిలి వైపుకు ఇంకా మొదలేకాని ఒకానొక కలల ప్రయాణంలోకి వేయ జూడబోయిన తొలి అడుగులా
విరిసినా విరియక ఉన్నా వాడినా
ఎలా ఉన్నా పువ్వెప్పుడూ ఒక మధురానుభూతిలాగానే ఉంటుంది.
ఎంతకూ మోహపడని యవ్వనాన్ని భరించి ఉండడం ఎంత కష్టమో
ఎంతకూ మోదపడని హృదయాన్ని ధరించి ఉండడమూ అంతే కష్టం!
లోలోపల మధురంగా జ్వలించలేని మనుషులున్న చోటున
పువ్వు వికసించినా వికసించకున్నా పెద్దగా తేడా ఉండదు.
నీకోసమే అన్నట్లుగా విరిసి విప్పారి ఉన్న విరి తనువును
తనకుతానుగా చేయి చాచి స్పృశించలేని మనిషికి మోహస్పర్శ ఎలాంటిదో ఎప్పటికీ తెలియదు!
మనిషిగా
ఉన్నంతకాలం ఇంత సామాన్యంగా, స్వచ్చంగా మెరవడానికి
ఎన్నెన్ని యాగాల యుగాల యోగాల ఫలితాల్ని ధరించి ఉండాలో అనుకోవడం అత్యూహ కాదు కదూ…
ఇంత తోడుతోడుగా, సామీప్యంలో ఉన్నంతకాలం ఉండడానికీ…
ఉంటూ చూడడానికీ చూడబడడానికీ…
ఈ రంగులదొక వింత లోకం.
కమ్ముకుంటున్న ఉషోదయం లాంటిదో, అస్తమయం లాంటిదో వెలుతురు వర్ణం
ఒకానొక ఇంకా మొదలుకాని సంగతిని సూచిస్తున్నట్లుగా ఉంటుంది.
ఎన్నో వింతలను రాత్రి మోసుకు వస్తుంది.
భయపడతాం భయపెడతాం గానీ, స్వతహాగా చీకటి ఒక సాధువు.
చూడాలని వెలిగిస్తే చిన్నచిన్న సంగతులను కూడా దివ్యంగా వెలిగించి చూపెడుతుంది.
ఈ అనంతమైన విశ్వంలో
ప్రతి రేణువంత ప్రాణికి కూడా ఒక ప్రత్యేకమైన ఉనికి ఉంటుంది.
ఎటొచ్చీ, సానుభూతితో సంయమనంతో చూసే చూపే మనిషికి ఉండాలి.
అవును, ఇది ఒక రంగుల కల!
ఈ కల ఎప్పటికప్పుడు పరుచుకుంటున్న మంచు తెరలా కళ్ళను కమ్మేసి కలవరపెడుతూనే ఉంటుంది.
ఎందుకో తెలియని భావోద్రేకాన్ని భరించి ఉండడం ఎంత కష్టమో, కళ్ళముందు కమ్ముకుంటున్న ఈ రంగుల కలనూ పక్కకు నెట్టి విడిగా చూడడమూ అంతే కష్టంగా ఉంటుంది.
తల వంచుకుని నడుస్తూనే ఉంటామా…
అడుగులు ముందుకు పడుతూనే ఉంటాయా…
ఇంతలో ఏదో ఒక ఊహించని మూలనుంచి ఒక వర్ణమో, వర్ణాల సముదాయమో తెలియకుండా వచ్చి తమ ఉనికిని తెలుపుకుంటున్నట్లవుతుంది.
అదెందుకలా అవుతుందన్న దానికి సమాధానాం దొరకదు గాని,
తల అటుగా తిప్పి చూస్తే, ఇదిగో ఇలా చూడాలన్నట్లుగా వాటికవే చూపులకు దారి పరిచినట్లవుతుంది.
చంద్రుడితో పాటే పోయే వెన్నెలలా,
ప్రియుడి వెంట ప్రేయసి పోతుందని ఎవరో ఒక పూర్వ కవి ఉత్ప్రేక్షించినట్లు,
వర్ణంతో పాటుగానే నా కంటి చూపూ పోతుంది.
వర్ణ సౌందర్యం, వర్ణ సముదాయాల సమ్మేళనల సౌందర్యం. నాకొక తన్మయ నయనానందకర సమ్మోహ భీభత్సం!
విరియడానికి వేసటతో వేచి చూస్తున్నట్లుగా కనుపించే వర్ణం, పువ్వు వెంట ఒకానొక తన్మయాన్ని గాలిలోకి నిరంతరంగా నిశ్వాసిస్తూనే ఉంటుంది;
మొగ్గగా విలసిల్లడానికి ముందే, ఒకా నొక …కాదు కాదు, అనేకానేక తమోహ రణాల సమీకరణాలను అణువణువునా నింపుకుని గదా అది అవతరించేది!
హైదరాబాదు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంటుంది కీసర (కీసర గుట్ట). ప్రసిధ్ధ శైవక్షేత్రం.
క్రీ.శ. తొలి శతాబ్దాలలో ఆంధ్ర దేశాన్ని (వేంగీ దేశాన్ని) పరిపాలించిన రాజవంశాలలో ఒకటైన విష్ణుకుండినులకు, ఈ కీసరకు సంబంధం ఉందని ఒక మాట ఉంది. ఈ రాజవంశం రాజులలో ఒకడైన రెండవ మాధవ వర్మ పరిపాలనా కాలం అయిన క్రీ.శ.4-5 శతాబ్దాలలో ఈ కీసర రాజధానిగా ఉండేదని చెబుతారు.
విష్ణుకుండిన రాజులలో రెండవ మాధవ వర్మ చాలా ప్రసిధ్ధుడు. రాజ్యాన్ని బాగా విస్తరింపజేసి విష్ణుకుండినుల ప్రభను ఒక వెలుగు వెలిగించిన దీటైన రాజు. ఈయన వైదికమతాభినివిష్టుడనీ, అగ్నిష్టోమ, వాజపేయ, పౌండరీక, అశ్వమేధ, రాజసూయ ఆది క్రతువులను చేశాడనీ చరిత్ర పరిశోధకులు చెప్పారు. పదకొండుసార్లు అశ్వమేధ యాగాన్ని చేయడం వలన ఈయన రాజ్యకాలంలో పదకొండు సార్లు దిగ్విజయ యాత్ర సాగించి ఉంటాడనీ చరిత్ర పరిశోధకులు అంటారు. అప్పటిలో బలవంతులైన వాకాటకులను పోరులో ఓడించి, సంధిలో భాగంగా వాకాటక రాజు కుమార్తెను వివాహం చేసుకుని, తదనంతరం రెండు రాజ్యాలకూ వారసుడు అయ్యాడని కూడా చరిత్ర పరిశొధకులు ఊహించారు. ఇంత ప్రసిధ్ధుడైన రాజుతో సంబంధం కలిగి ఉండిన ఈ క్షేత్రం కూడా అంత ప్రసిధ్ధమైనదే! శివరాత్రి నాడు ఏటా జరిగే ఉత్సవాలకు హైదరాబాదు నుండి ప్రత్యేకంగా బస్సులను వేస్తారు. జనం తండోపతండాలుగా వెళ్ళి ఉత్సవంలో పాల్గొంటారు.
కొండ (‘గుట్ట’ అనే అనాలనుకుంటాను!) మీద ఆలయం. మెట్లు ఎక్కుతూండగా కనిపిస్తుంది ఆలయ గోపురం. కొండ (‘గుట్ట’) మీద ఆలయ ప్రాంగణంలో ఏ వైపు చూసినా శివలింగాకృతులు కనిపించి అబ్బుర పరుస్తాయి. కొండ మీదనుంచి చుట్టు scenery చూడడానికి బాగానే ఉంటుంది. ఈ మధ్యనే వెళ్ళి నప్పుడు తీసినవి ఫోటోలు ఇక్కడ కొన్ని. ఈ ఫోటోలు 2 megapixel లెన్స్ తో ఉన్న సెల్ ఫోనుతో తీసినవి. ఈ ఫోటోలలో చివరి నాలుగు ఫోటోలూ dimensions లో పెద్దవి. వాటి మీద ఎక్కడైనా సరే click చేస్తే, image ని original dimensions లో చూడడానికి వీలవుతుంది.