తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (4)

పలుకుబడి అంటే పలికే తీరు.  ఇందులో ‘బడి’ అనేది ప్రత్యయం. ఇలాంటిదే ‘రాబడి’, వచ్చే తీరు అని అర్ధం.  కానీ జన వ్యవహారంలో ‘రాబడి’ అంటేనే ‘ఆదాయం’ అన్న అర్ధం స్థిరపడిపోయింది. ‘ఈ వ్యాపారంలో రాబడి బాగా ఉంటుందా?’ అంటే ఆదాయం వచ్చే తీరు బాగానే ఉంటుందా అని అర్ధం.

‘అరికం’ ఒక ప్రత్యయం. లక్షణాన్ని తెలుపుతుంది. పేదరికం, పెద్దరికం, చుట్టరికం, ఇల్లరికం, రాచరికం ఇత్యాదిగ. ‘అరి’ అనేది అచ్చ తెలుగు పదం. లక్షణాన్ని తెలుపుతుంది. నేర్పరి, పొడగరి, సిగ్గరి  ఇత్యాదిగా. దీనికి పొడిగింపే ‘అరికం’.

‘అమ్మా! మాదా కబళం తల్లీ!’ ఇందులో మాదా కబళం అనే మాట ‘మాధవ కబళం’. కృష్ణార్పణం తో సరిసమానమైనదిగా భావించబడాలని అర్ధం.

చదువులు, మాటలు కట్టిపెట్టి అంటే ఇక ‘చదివేది లేదా మాట్లాడుకునేదీ ప్రస్తుతానికి ఆపి’ అనే అర్ధంలో ఇప్పుడుంది. ఇందులో ‘కట్టిపెట్టడం’ అనే మాట చరిత్ర చాలా వెనకకు పోతుంది.  అంటే, పుస్తకాలు తాళపత్ర గ్రంథాల రూపంలో ఉండిన కాలందాకా నన్నమాట. తాళపత్ర గ్రంథాన్ని కట్టిపెట్టాలిసిందేగాని పుస్తకం మూసినంత సుళువుగా మూయలేంగదా. మాట మాత్రం వాడుకలో అలా నిలిచిపోయింది.

‘అభ్యంతరం’ అనే మాటకు ‘ఇంటి లోపలి గది’ అని అర్ధం. ‘అభ్యంతరం లేదు’ అనే మాటకు ‘అడ్డుచెప్పటానికి ఏమీ లేదు’ అన్న అర్ధంలో ప్రస్తుతం వాడుకలో ఉంది. అయితే ఈ అర్ధం ఎలా వచ్చిందనేది అర్ధం కావడానికి ఒక సందర్భం ద్వారా చెప్పుకోవాలి. ఒక ఇంటి యజమాని ముందు వసారాలోనో, వరండాలోని కూర్చుని ఉంటాడు. ఇంతలో ఒకతను వచ్చి ‘అయ్యా! తమతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి,’ అన్నాడు. దానికా యింటి యజమాని సమాధానంగా, ‘అట్లాగా! అయితే ఇక్కడ పరవాలేదా, అభ్యంతరం గాని ఉందా?’ అని ప్రశ్నిస్తాడు. ఇక్కడ యింటి యజమాని అర్ధం ‘ఇంటి లోపలి గదిలోనికి వెళ్ళాలిసిన అవసరం ఉందా?’ అని అర్ధం. దానికి ఆ వచ్చిన మనిషి, ‘అబ్బే, అభ్యంతరమేమీ లేదు. ఇక్కడ మాట్లాడుకోవచ్చును,’ అంటాడు. అంటే ‘లోనికి వెళ్ళవలలిసినంత రహస్యమేమీ కాదు’ అని అర్ధం. ఇలా మొదలైంది, పోనుపోనూ ‘అభ్యంతరం’ అన్న మాటకు ‘సమ్మతి తెలుపలేనిది’ అన్న అర్ధం లోక వ్యవహారంలో స్థిరపడిపోయింది.

‘పితలాటకం’ అనే మాట ప్రస్తుతం వాడకంలో ‘తంటా’ అన్న అర్ధంలో ఉంది. ‘ఇతగాడితో పెద్ద పితలాటకం’ అంటే, ‘ఇతనితో వ్యవహారం ఏమంత మంచిదికాడు, ఇతను తంటాలు తెచ్చిపెట్టే మనిషి ‘ అని అర్ధం. ఈ మాట ‘పిత్తళిహాటకం’ అన్న మాటకు అపభ్రంశమని చెబుతారు. అంటే ‘ఇత్తడిని బంగారం లాగా చేసే మనిషి ‘ అని అర్ధం. నిందార్ధంలో ‘ఇత్తడిని బంగారంగా చూపించే మనిషి’ అని. నిందార్ధం జనవ్యవహారంలో స్థిరపడిపోయింది.

తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (3)

అందలము – అందలానికి ఎత్తేశాడు అంటే పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు అన్న అర్ధంలో ఇప్పుడు వాడకంలో ఉన్నట్లుగా కనపడుతుంది గాని, అందలము అన్న మాటకు  ‘పక్కలన తెరలు లేని పల్లకీ’ అని అర్ధం. పూర్వం రాజులకాలంలో రాజాస్థానానికి తీసుకుని వెళ్ళేప్పుడు సన్మానితులను అందరికీ కనిపించే విధంగా అందలం ఎక్కించి తీసుకుని వెళ్ళేవాళ్ళు. రాజులకాలం పోయి, అందలాలు మాయమయ్యాక, పొగడ్తలలో ముంచెయ్యడం అన్న మాటకు అర్ధంగా అందలమన్న మాట మిగిలింది.

లొట్ట వేసుకుంటూ, లొట్టలు వేసుకుంటూ అంటే చాలా ఇష్టంగా తినడం అన్న అర్ధంలో ఇప్పుడు వాడ బడుతోంది. అయితే, ఈ లొట్ట వేసుకుంటూ అన్న మాటకు అర్ధం నిజానికి ‘లోటాడు వేసుకుంటూ’ అని. పూర్వకవుల ప్రయోగాలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ‘కల్లు లొట్టెడు త్రాగి కైపెక్కి’ (వేణుగోపాల శతకం) ఇత్యాదిగా. లొట్టి అన్న పదానికి చెట్టునుండి కల్లును తేసే కుండ అని అర్ధం. లొట్టెడు తాగడం అంటే కల్లు ముంతడు తాగడం అనేగా అర్ధం. అయితే, కాలక్రమేణా జనసామాన్యం సమ్మతికి తగినట్లుగా అర్ధాన్ని మార్చుకుని ఇష్టంగా తినడం అన్న అర్ధంలో ఈ మాట కుదురుకుంది.

ఇప్పుడెవరూ ఇలా అడగడానికి ధైర్యం చెయ్యరుగాని, ఒకప్పుడు మీరే కులస్తులు? అని అడగడానికి గ్రామీణులలో ‘మీరేముట్లు?’ అని అడగడం వాడకంలో ఉందేది. ఇందులో మూడు మాటలున్నాయి. మీరు, ఏమి, ఉట్లు లేదా ఉట్టులు, అనేవి ఆ మూడు మాటలు. వీటిల్లో ‘ఉట్టు’ అన్న పదానికి ‘పుట్టు’ అనీ, ఇంకా ‘కారు, స్రవించు’ అనీ అర్ధాలున్నాయి. ఏ కులంలో జన్మించారు లేదా పుట్టారు అని ప్రశ్నించడానికి సంక్షిప్తంగా తయారయిన రూపమే ‘ఏముట్లు’ అన్న మాట. అయితే, ఇప్పటికే ఈ మాట మరుగున పడిపోయింది.

వేణుగోపాల శతకం – కొన్ని సంగతులు (2)

నానుడులు, లోకోక్తులు అనదగినటువంటివి, అర్ధం అదే అయినా ఇప్పుడు వేరే మాటలలో ప్రయోగంలో ఉన్నటువంటివి, కొన్నైతే అసలు ప్రయోగంలో లేనటువంటివి, మరికొన్ని వేంకటకవి స్వయంగా సందర్భానికి అతికేట్లుగా కల్పించినట్లు అనిపించేటువంటివి, వేణుగోపాల శతకంలో చాలా కనిపిస్తాయి.  వాటిల్లో కొన్నిటిని క్రింద చూపడ మైంది:

‘వెన్న యుండియు నేతికి వెదికి నటుల’ – ఇంటిలో వెన్న సమృధ్ధిగా ఉన్న సంగతి మరిచి నేతికోసం ప్రయాస పడినట్లుగా అని ఈ మాటల అర్ధం. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అనే సామెత, ఒడిలో బిడ్డను పెట్టుకుని ఇల్లాంతా వెదకడ మన్న సామెతా దీనికి కాస్తంత దగ్గరగా అనిపిస్తాయి తప్ప పూర్తిగా ఈ మాటల అర్ధంతో సరిపోగల సామెత ఇప్పుడు వ్యవహారంలో ఒక్కటి కూడా లేదని నా కనిపిస్తుంది.

‘కల్ల పసిండికి కాంతి మెండు’ – మెరిసేదంతా బంగారం కాదు (all that glitters is not gold అన్న ఆంగ్ల సామెతకు మక్కికి మక్కి) ఇప్పుడు వ్యవహారంలో ఎక్కువుగా వినిపించే సామెత.  కాని అర్ధంలో సూక్ష్మమైన తేడా ఉంది. ‘ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది’ అన్న సామెత అర్ధానికి ఈ సామెత అర్ధానికి ఓమొస్తరుగా సామ్యం కుదురుతుంది. కానీ ఇందులో హేళణ ఎక్కువగా ధ్వనిస్తుంది. పై సామెతలో భావ గాంభీర్యం ఎక్కువ.

‘అల్ప విద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద’ ఇంత చక్కని నానుడి ఇప్పుడు ప్రయోగంలోనే లేదు. half knowledge is always dangerous అన్న ఆంగ్ల లోకోక్తిని గుర్తుంచు కున్నంతగా మనం ఈ సామెతను గుర్తుంచుకోలేదు. 

‘ఆబోతు పేదల యశము గోరు’ – ఇది అత్యంత హృద్యమైన నానుడి.  బసవయ్యను అంత ఎత్తులో, ఉన్నతమైన రూపంలో  లేపాక్షిలో మనవాళ్ళెందుకు మలుచుకుని స్థాపించుకున్నారో ఈ మాటల వల్ల అర్ధమవుతుంది.

‘గజముపై చౌడోలు గాడిద కెత్తితే, మోయునా పడవేశి కూయు గాని’ – చౌడోలు అంటే ఏనుగుపై  అంబారి. భారం మోయగలడో లేడో చూసి తలకెత్తాలి అనీ, సమర్ధత సరిగా గుర్తెరిగి కాని ఏపనినైనా అప్పగించ కూడదనీ ఈ మాటల అర్ధం. ఇదసలు ఇప్పుడు ప్రయోగంలో లేదు.

‘వలపు రూపెఱుగదు, నిద్ర సుఖం బెఱుగదు, ఆకలిలో నాల్క అఱుచి ఎరుగదు’ – ఇది ఒక నానుడుల మాలిక.  ఇందులో మొదటి దానికి సారూప్యత గలిగిన ‘ప్రెమ గుడ్డిది’ అనే ఇప్పుడు వాడుకలో ఉన్ననానుడి love is blind అనే ఆంగ్ల లోకోక్తి కి మక్కికి మక్కి.  దీనిని గుర్తుంచుకుని  వాడుతున్నాం మనం. నిద్ర సుఖ మెరుగదు అనే నానుడి అప్పటికి ఇప్పటికి అలాగే ప్రచారంలో ఉంది.  ఇక మూడవది ‘ఆకలి రుచి ఎరుగదు’ అన్న రూపంలో సంక్షిప్తమై ప్రయోగంలో ఉంది. ఆకలిలో నాల్క ‘అఱుచి’ ఎరుగదన్నదే హృద్యమైన అసలు రూపం.

తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (2)

‘అకము’ అనే పదానికి అర్ధం పాపము అని. న అకము, నాకము అంటే పాపము లేనిది, కాబట్టి స్వర్గం.

‘అక్షతలు’ అనగా క్షతమై ఉండనివి unbroken grains అని అర్ధం. అందుకే అక్షతలు తయారు చేసేప్పుడు నిండు బియ్యపు గింజలనే తీసుకోవాలి, అలాంటివే శిరస్సుపై ధరించడం గానీ, చల్లడం గానీ చేయ్యాలి.

‘పరము’, పరముపడి ఉండడం అంటే అభోజనం ఉండడం. పరగడుపు, పరము కడుపు, అభోజనమై ఉన్న, అప్పటికింకా ఏ అహారమూ తీసుకోని స్థితిలో అని అర్ధం.

‘అందె’ అనే మాటకు నూపురము a foot trinklet అని అర్ధం (అందెల రవళుల సందడి మరి మరి….). కానీ అందె వేసిన చేయి అన్నప్పుడు ఇది చేతి కంకణాన్ని సూచిస్తుంది. అయితే ఈ కంకణం ప్రజ్ఞకు ప్రశంశా పూర్వకంగా బహూకరింప బడినదై ఉంటుందనేది ఆ మాటల అర్ధం చెప్పకనే చెబుతుంది.

‘బోన’ అనే పదానికి వండిన ప్రాలు, అన్నం అనే అర్ధం ఉండేది. దీని నించే బోనము అయ్యింది. ఇదే ‘బోనాలు’ అనే మాట. అయితే, బోనము అనే పదం సంస్కృత ‘భోజనము’ అనే పదానికి వికృతి రూపమని కూడా చెబుతారు.

‘హాయిగా’ అన్న మాట సుఖంగా అని ప్రయోగంలో ఇప్పుడున్న అర్ధం. శరీరం బాగా అలసట చెంది ఉన్న తరుణంలో కొంత విశ్రాంతి దొరికితే, అప్పుడు అసంకల్పితంగా నోటినుండి విడుదలయ్యే ‘హా’ అనే ఊర్పుతో కూడుకున్న శబ్దం నుంచి ఈ పదం ఏర్పడింది. కవుల ప్రయోగాల్లో ఇది ఇలాగే కనిపిస్తుంది (సుఖమంది ‘హా’ యని సొక్కువేళ…ఇత్యాదిగ).

‘భడవా’ అన్న మాట ఇప్పుడు ‘చిన్న వయసులోనే పెద్ద పనులు చేయగల నేర్పరి’ లేదా ‘వయసుకు మించిన పనులు చేయగల ప్రావీణ్యత గలవాడు’ అన్న అర్ధంలో పిల్లలను ఒకింత మెచ్చుకోలు ధ్వనించే విధంగా మందలిస్తున్న సందర్భంలో వాడబడుతోంది.  కానీ, ‘బడవా’ అన్న మాట కవుల ప్రయోగాల్లో ‘తార్చువాడు, తార్చునది’ అన్న అర్ధంలో వాడబడింది. (పంచాంగములు మోసి, బడవాతనము చేసి…ఇత్యాదిగ).

‘అల్లారు ముద్దుగా’ అనే పదబంధానికి చాలా ముద్దుగా, అంటే ఏ కష్టమూ తెలీనీయకుండా చూసుకోవడం, అలా పెంచడం అనేది ప్రయోగంలో జనసమ్మతి పొందిన అర్ధం. ఈ పదబంధంలోని ‘అల్లారు’ అనే మాటను అల్ల, ఆరు అని రెండు మాటలుగా విడదీసి చూపించింది బ్రౌణ్యం. అయితే ఈ రెండు పదాల విడి అర్ధాలు ఇక్కడ పొసగవు. అల్లరే ముద్దుగా, అంటే చేసే అల్లరియే ముద్దుగా అనే అర్ధంలో వాడబడినది రాను రానూ అపభ్రంశమై అల్లారు ముద్దుగా మారిందని నా అభిప్రాయం. ఈ అభిప్రాయంతో మీరు సోపపత్తికంగా విబేధించవచ్చు.

‘వాస్తవము’ అంటే నిజం అన్నది రూఢార్ధం. వస్తువులో నిక్షిప్తమై దృగ్గోచరమయేదీ, అనుభవమయ్యేదీ ఏదైతే ఉందో అది తాత్త్వికంగా నిజం కాబట్టి, వస్తుగతమై ఉండేది వాస్తవము, నిజం అన్నది రూఢార్ధమైందని నా అభిప్రాయం. ఈ అభిప్రాయంతోనూ మీరు సోపపత్తికంగా విబేధించవచ్చు.

తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (1)

‘తోచు’ అనే పదానికి అగుపడు అని అర్ధం (ఉండినది ఒకప్పుడు.  అద్దమున తోచు ప్రతిబింబము పగిది, ఇత్యాదిగా). దారి తోచడం లేదు అంటే ఏ దారీ అగుపడదం లేదిని అర్ధం. కానీ ఇప్పుడు ఈ ‘తోచు’ అనే పదం ‘స్పురించు’ అన్న అర్ధంలోనే వాడ బడుతోంది.  ‘ఏమోయ్, ఏమైనా తోచిందా?’ అంటే ఆలోచనకు ఏమైనా స్పురించిందా అన్న అర్ధంలో వాడబడుతోంది.

విడియ, విడియము అనే మాటలకు అర్ధం తాంబూలము అని.  విడియమును అందుకున్న వారు, తాంబూలములను ఇచ్చి పుచ్చుకున్న వారు కాబట్టి ఒకరికొకరు విడియాల వారు అయారు.  అదే వియ్యాల వారుగా మారి ఉంది.

 

అన్ను అనే పదానికి అర్ధం స్త్రీ అని.  అన్నుల మిన్న అనే పదానికి తోటి స్తీలలో అందరి కంటె అందగత్తె అని అర్ధం.

అలరులు అంటే పూవులు అని అర్ధం.  అలరులు కురియగ ఆడెనదె – పూవులు రాలతాయి, కానీ ఇందులో పూవులను కురిపించడం జరిగింది.

గరుత్తు అన్న పదానికి రెక్క అని అర్ధం.  అవి కలవాడు గాబట్టి గరుత్మంతుడు.

ఐదువ అన్న పదానికి (మంగళ సూత్రము, పసుపు, కుంకుమ, గాజులు మరియు చెవ్వాకు లేదా చెవియాకు) అను అయిదు అలంకారములు గల స్త్రీ అని అర్ధం.  ముత్త అనే పదానికి వృధ్ధ అని అర్ధం.  ముత్తైదువ – ముత్త ఐదువ.

‘తెన్’ శబ్దం దిగర్ధమున్న ద్రవిడ పదాంశం.  దక్షిణ దిగ్వాచి అంటే దక్షిణ దిక్కును సూచించే శబ్దం.  అయితే, తెలుగు భాషలో ఈ శబ్దం ఇప్పటి వ్యవహారం నుంచి తొలిగి పోయింది.  కానీ, తెమ్మెర, తెన్నేరు, తెంకాయ (టెంకాయ), తీరూ తెన్నూ – ఇత్యాది సమాస రూపాల్లో మాత్రం నిలిచి ఉంది.

తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (7)

సంస్కృత భాషలో ‘శ్లోకము’ అన్న పదం పద్యానికి బదులుగా సర్వ సామాన్యంగా వాడబడుతూ ఉన్నది గాని, నిజానికి శ్లోక మన్నది పద్య పర్యాయవాచి కాదు. ప్రత్యేక లక్షణముగ ఒక పద్యం.  ఇది అనుష్టుప్ జాతికి చెందినది.

పాదమునకు ఎనిమిది అక్షరములుండడం (ఇక్కడ కూడ సంఖ్య ఎనిమిదే.  భేదమల్లా అక్కడది మాత్రల లెక్క, ఇక్కడ అక్షరాల లెక్క),  అయిదవ అక్షరం అన్ని పాదములందును లఘువై ఉండడం, ఆరవ అక్షరం తప్పనిసరిగా గురువై ఉండడం శ్లోకపు లక్షణములు.

శ్లోకమన్న శబ్దమునకు స్తోత్రము అని అర్ధం.  ఈ రకపు పద్యం మొదట్లో స్తుతి పరమగు రచనలలోనే వాడబడుతుండెడిది గాబట్టి దీనికా పేరు వచ్చి ఉంటుందని పెద్దల అభిప్రాయం.

పద్యములలో అక్షరగణ నిబధ్ధములైనవి వృత్తములు. లక్షణం చెప్పడానికి సౌలభ్యం కోసం గణముల పధ్ధతి ప్రవేశపెట్టబడింది. ఒక్కొక్క గణమునకు మూడు అక్షరములు (అక్షరం లఘువు గాని, గురువు గాని కావొచ్చు). అలా చూసినట్లయితే, మూడు అక్షరముల గణములు ఐనిమిది ఏర్పడతాయి (మ, య, స, న, భ, త, జ, ర అనే 8 ప్రధాన గణములు).  ఈ పధ్ధతిలో లక్షణం చెప్పడం సులభం, ఉదా: ఉత్పలమాలా వృత్తము – భ, ర, న, భ, భ, ర, వ.  ఇత్యాదిగ. సంస్కృత పద్యంలోని ఒక పాదంలో ఉండగల అక్షరముల సంఖ్య 26. వృత్త పాదమునకు ఎన్ని అక్షరము లుండునో ఆ వృత్తము అన్నవ ఛందమున పుట్టినదని చెబుతారు. దీనిని బట్టి 26 ఛందస్సుల్లో మొత్తం 13,42,17,726 వృత్తములు ఏర్పడుతాయి.

ఇన్ని కోట్లుగా వృత్తములు ఏర్పడుతున్నా, సంస్కృతములో గూడ మొత్తం ఇరవైఆరు ఛందములలో పదకొండు, పన్నెండు (త్రిష్టుప్, జగతి) ఛందములలోని పద్యములే ఎక్కువగా ప్రచారం పొందాయనీ, ఈ ఉభయ ఛందములలో దాదాపు అన్ని వృత్తములూ ప్రసిధ్ధములయినాయనీ పెద్దలు చెబుతారు.

తెలుగు పద్యములలోకి ప్రవేశించిన ప్రసిధ్ధ సంస్కృత వృత్తములు ఉత్పలమాల, చంపకమాలలు.  వీటి తరువాత మత్తేభము, శార్దూలవిక్రీడితము అను వ్రృత్తములు.  వీటికి సంస్కృతములో ప్రచారం తక్కువ.  అయితే తెలుగులో ఇవి యతి, ప్రాస సహితముగా ప్రయోగింపబడినాయి.

చంపకమాల వృత్తములోని మొదటి రెండు లఘువులను గురువులుగా మార్చి వాడితే ఉత్పలమాల అవుతుంది.  అలాగే మత్తేభ శార్దూల విక్రీడితములు. మత్తేభములోని తొలి రెండు లఘువులను గురువులుగా మార్చిన యెడల శార్దూల విక్రీడితమౌతుంది.  ఈ రెండింటిలో మత్తేభమునకే తెలుగులో ప్రచారము ఎక్కువ.

తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (6)

“ఈ నగవులను నువ్వేగ నిన్నలకు
ఆనవాళ్ళుగ నా ఎదను నిలిపింది
ఈ నాడిదేల నే నోపగ లేని
మౌనము దాల్చి ఏమార్చేవు, చెలియ!”

‘చెలియ!’ బదులు ‘సఖుడ!’ అని కూడ చదువుకోవచ్చు. అర్ధంలో ఏమీ మార్పుండదు.  ద్విపద ఛందంలో ఉన్న పద్య పాదాలివి. స్వకీయములు.  ఇందులో మొదటి మూడు పాదాల్లో స్వరయతి మాత్రమే పాటింపబడింది.

తెలుగులో ద్విపద అతి ప్రాచీనమైన పద్యం.  నన్నయ భట్టారకుని కంటె ముందునుంచీ ద్విపద ఛందంలో గేయాలుండేవని శాసనాల్లోని పద్యాల వల్లనూ, జానపద గేయ సాహిత్యం రూపంగానూ విశదమౌతుంది. జానపదుల నోళ్ళలో ఎంతగా ప్రాచుర్యంపొంది గేయాల్లో వాడుకోబడినా, పండితుల చిన్నచూపుకు మాత్రం ద్విపద గురి అయినంతగా మరే పద్యమూ గురి కాలేదన్నది సత్యం. ద్విపదకు సాహిత్య గౌరవం ఇచ్చి పోషించిన మొదటి కవి పాలుకురికి సోమనాధుడు.  పద్యత్వాన్ని సంపాదించిపెట్టడానికి అన్నట్లుగా సోమనాధుడు ద్విపదకు యతిప్రాసలను నియతం చేశాడు.

ఎంతగా చిన్న చూపు చూడబడినా, ద్విపద ఛందమే జాత్యుపజాతులలో చాల పద్యాలకు మూలమైందని చెబుతారు. ద్విపద నుంచే తరువోజ పుట్టిందని ఒక అభిప్రాయం.  కాదు, తరువోజనుంచే ద్విపద పుట్టిందని ఇంకొక అభిప్రాయం. ఏదేమైనా, రెండు ద్విపద పాదాలు కలిస్తే తరువోజ అవుతూండడం, రెండూ ఒకే కోవకు చెందినవని చెప్పకనే చెప్తాయి. స్త్రీల దంపుళ్ళ పాటలు చాలా ద్విపదలు, తరువోజలే.

“దంపు దంపనియేరు అది యెంత దంపు
ధాన్య రాసుల మీద చెయ్యేసినట్లు
వంట వంటనియేరు అది యెంత వంట
వదినతో మరదళ్ళు వాదాడినట్లు”

“నొష్ట రాసిన రాలు తుడిచినా పోదు
పైట చెంగులు పెట్టి పులిమినా పోదు”

“కన్న తల్లిని బోలు చుట్టాలు లేరు
పట్టు చీరను బోలు చీరల్లు లేవు”

ఇవన్నీ ద్విపద ఛందంలో ఉన్న పాదాలే. యతిప్రాసలు, పాదనియమాలు ఉన్న చోట్ల ఉన్నాయి, లేని చోట్ల లేవు.  ఉన్న చోటల మాటెలా ఉన్నా, లేని చోటల లేక పోవడంవలన పాటలకు జరిగిన నష్టమేమీ కనిపించదు.

పైన నేను వ్రాసి చూపిన ద్విపద ఛందంలోని పద్యం ఛందస్సు పరంగా సరిగానే ఉన్నా అందులో గేయ లక్షణం ఎంత వరకు అమరింది? జానపదుల నోళ్ళలో సహజంగా పుట్టిన పాటలకు, గణాలు యతిప్రాసలు సరిచూసుకుంటూ వ్రాసిన వాటికి చాలా తేడా ఉంటుంది.

తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (5)

తెలుగులో (లిఖిత) సంప్రదాయ సాహిత్యం నన్నయ భట్టారకునితోనే మొదలైందిగా భావిస్తూన్నాం గనక, తెలుగు సాహిత్యం మొత్తాన్ని గురించి మాట్లాడుకోవలసినప్పుడల్లా, బేరీజు వేసుకోజూచినప్పుడల్లా, నన్నయ గారిని హద్దుగా పెట్టుకుని ఆయనకు ముందు, ఆయనతోనూ.. ఆ తరువాత అని మాట్లాడుకోవలసి ఉంటుంది. నన్నయగారి చేతిలో తాళపత్రం మీదికెక్కడం మొదలెట్టిన తెలుగు సాహిత్యం అంతకు మునుపు జనాల నాలుకల మీద గేయాల రూపంలో ఉండి రకరకాల వయ్యారాలుపోయింది. ఆ వయ్యారాల్లో కొన్ని ఏలలు, జోలలు, అర్ధచంద్రికలు, అక్కరలు, రగడలు, సువ్విపాటలు, జాజరలు, ఉయల పాటలు, ఐరేని పాటలు, చిందులు, జక్కిణులు, చౌపదాలు, ఆరతులు, దరువులు, జక్కులరేకులు, సుద్దులు, నలుగులు, జంపెలు, కురుజంపెలు, అల్లోనేరేళ్ళు, చద్దులు, కొరవంజులు, తలపు పాటలు, అప్పగింతలు, మేలుకొలుపులు, వాదాలు, పడవ పాటలు, కోలాటాలు, గొబ్బి పాటలు, పెండ్లి పాటలు, నివ్వాళులు, సూళలు, ఇత్యాది పేర్లతో వేల కొలదిగా లభ్యమౌతున్నాయని పెద్దలు చెబుతారు.

ఈ గేయాలన్నీ యతి ప్రాసయుక్తంగా ఉన్నాయా అంటే, ఉన్నప్పుడు ఉన్నాయి, లేనప్పుడు లేవు అన్నది సమాధానం.  యతి ప్రాసలు లేకపోవడం వల్ల పాట కుంటుబడిందీ లేదు, అవి ఉండడం వల్ల పాటలకు అదనంగా ఒనగూడిన సౌలభ్యమూ లేదన్నది పెద్దల పరిశీలనలో తేలిన విషయం.  ఒక నియమంలా కాకుండా యాదృచ్చికంగా యతి ప్రాసలు పడితే అవి పాటకు అదనపు అలంకారాలుగా మేరిసేవి.

ఈ పాటల, వీని నడకల ప్రభావం నన్నయ కవిత్వం మీద లేకుండా ఎలా ఉంటుంది? అని తరచి చూసి నిదర్శనాలుగా నన్నయ భారతంలోనివే కొన్ని పద్యాలను ఎత్తి చూపారు పెద్దలు.  వాటిల్లో ఒకటి నన్నయ భారతంలోని ఆది పర్వం, ప్రధమాశ్వాసంలోని 30వ పద్యం, కంద పద్యం:

“ఏయది హృద్యమ పూర్వం
బేయది, యెద్దాని వినిన నెఱుక సమగ్రం
బైయుండు నఘనిబర్హణ
మేయది యక్కథయ వినగ నిష్టము మాకున్”

కంద పద్యంగా ఇలా ఉన్న ఈ పద్యం, పాడుకోవడానికి అనువయిన గేయంగా మారితే ఇలా ఉంటుంది:

యది హృద్యమ పూర్వం బేయది,
యెద్దాని వినిన నెఱుక సమగ్రం
బైయుండు నఘనిబర్హణ మేయది
క్కథయ వినగ నిష్టము మాకున్”

16 అక్షరాలకొక పాదం చొప్పున తిరగ రాస్తే, చరణం మొదటి అక్షరాలలో యతులు, ప్రాసయతులు చక్కగా కుదిరి, తాళం వేసుకుని చక్కగా పాడుకోవడానికి అనువుగా మారడం గమనించవచ్చు.

తెలియవచ్చే దేమిటంటే, పనికిరాని చోట యతిస్థానాన్ని ఉంచి ఎంతగా చెడగొట్టినా, కొన్ని కంద పద్యాలకు వద్దన్నాకూడా, యాదృచ్చికంగానూ, అలంకారికంగానూ యతి ప్రాసలు కుదిరి గేయలక్షణం అబ్బుతుందనీ, అది అంత తొందరగా తొలగిపోయే సంగతి కాదనీను.

నన్నయ భారతంలో ఇలాంటి పద్యాలు ఇంకా చాల ఉన్నాయనీ, నన్నయ పద్యాలలో నిజానికి దేశీచ్చందోబద్దాలైన పద్యాల సంఖ్య హెచ్చు అనీ, అందులోనూ కందాల సంఖ్యే ఎక్కువనీ పెద్దలు చెబుతారు.

ఇదంతా తెలుసుకున్న తరువాత, తెలుగులో ఒక రకపు గేయానికి గాయమై కంది కందమై మిగిలిందని నేను అనుకుంటుంటాను.

తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (4)

పల్లె, పట్టణము అనే భేదం లేకుండా, తెలుగు ఇళ్ళలో తల్లులు నేటికీ తమ పిల్లలను ఆడిస్తూ పాడుకునే పాట, ‘చందమామ రావే’. ఈ పాటను కంద పద్యంగా మారిస్తే ఇలా ఉంటుంది:

“చందమామ రావే జాబిల్లి
రావె కొండెక్కి రావె గోగు పూలు తేవే
బండెక్కి రావే బంతిపూలు
తేవే పల్లకీలు తేవే పారిజాతం తేవే…”

‘…అన్నీ తెచ్చి మా అబ్బాయికి/అమ్మాయికి ఇవ్వవే!’ అని చివర్న ముక్తాయింపు చరణం.

ఇలాంటిదే ఇంకొక పాట, ‘కాకీ కాకీ గంతుల కాకీ’.  ఈ పాట సరిగ్గా రెండు కంద పద్యాలు, చివర్న ముక్తాయింపు చరణం గా అమరిపోతుంది.

“కాకీకాకీ గంతుల
కాకీ కాకిని తీస్కెళ్ళి గంగలో ముంచితే
గంగా నాకు పాలూ
ఇచ్చే పాలూ తీస్కెళ్ళి అమ్మా కిస్తే”

“అమ్మా నాకూ డబ్బూ
నిచ్చే డబ్బూ తీస్కెళ్ళి పంతులకిస్తే
పంతులు నాకూ చదువూ
నిచ్చే చదువూ తీస్కెళ్ళి మామాకిస్తే”

‘…మామ నాకు పిల్లానిచ్చే!’ ముక్తాయింపు చరణం.

చదరంగంలో గళ్ళు ప్రతి ఎనిమిది గళ్ళకూ ఒకసారి వరస మారినట్లుగా, పైన ఉదాహరించిన పిల్లల పాటలలో, అవి పాటలుగా ఉన్న స్థితిలో (చందమామ రావే – జాబిల్లి రావే, కాకీ కాకీ – గంతుల కాకీ, ఇత్యాదిగ), పదాలు ప్రతి ఎనిమిది మాత్రలకొకసారి విశ్రాంతి పొందటం గమనించవచ్చు. వీటినే కంద పద్యాలుగా వ్రాస్తే వరస తప్పడమూ గమనించవచ్చు. పిల్లల పాటల్లోనే కాదు, ‘ఒప్పుల కుప్పా – ఒయ్యారి భామా’ లాంటి తరుణుల పాటల్లో కూడా ఇలాంటి విన్యాసమే కనిపిస్తుంది.  మాటల్ని ప్రతి ఎనిమిది మాత్రలకు విశ్రాంతి పొందే విధంగా అమరిస్తే వాటికి గాన యోగ్యతను కొంత సుళువుగా చేకూర్చ వచ్చని గ్రహించి చేసిన నిర్మాణాలివి.  మామూలు మాటలు – ‘గలగల పారే ఏటీ నీరూ’, ‘నీవూ నేనూ ఒకటిగ కలిసీ’, ‘మదిలో మెదిలే భావా లెన్నో’, ‘రారా రారా ఓ సుందరాంగా’, ‘చాక్లెట్ల కోసం బజారు కెళితే’, ‘చిందర వందర గందర గోళం’, ఇత్యాదిగా ఎన్నయినా చెప్పుకోవచ్చు,  వీటన్నిటికీ గానయోగ్యత దానంతట అదే లభిస్తుంది. 4,4 + 4,4 అమరికలోనే ఈ లక్షణం నిక్షిప్తమై ఉంది.

అయితే, స్థూలంగా ఈ నిర్మాణాన్నే తీసుకుని, గానయోగ్యమైన వరస తప్పే విధంగా పాదాలను విరిచి, యతిస్థానాన్ని 24 మాత్రల తరువాత (కంద పద్యంలో రెండవ, నాల్గవ పాదములలో నాల్గవ గణం ప్రధమాక్షరం యతి స్థానం) నిర్ణయించుకుని నియతం చెయ్యాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించుకుని ఆలోచిస్తే దొరికే సమాధానం ఒకటే.  కంద పద్యం ప్రధానంగా చదువుకోవడానికి ఉద్దేశించినది, పాడుకోవడానికి కాదు.  ఒకవేళ పాడుకోవాలనుకుంటే, అనువుగా ఉండే పద్యాన్ని పాటకు యోగ్యమైన వరసలోకి 16 మాత్రలకొక చరణంగా సర్దుకుని పాడుకోవలిసి ఉంటుంది.

పాడుకోవడానికి అనువుగా ఉండే పద్యాలు నన్నయ భారతంలోనే ఉన్నాయని, వెదికితే ఇలాంటివి ఇతరుల పద్యాల్లోనూ దొరుకుతాయని పెద్దలు చబుతారు.  కంద పద్యానికి మూలాలు పాటలో ఉండడం వల్ల అప్రయత్నపూర్వకంగానే ఇది కొన్ని పద్యాల్లో సిధ్ధిస్తుందని చెప్పుకోవచ్చు.

తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (3)

తెలుగు పద్య పాదములోని మొదటి అక్షరాన్ని ‘వడి’ అని, రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అని అంటారు. తెలుగు పద్యాల్లో ప్రాసయేగాక, యతి కూడ నియతము. అంటే తెలుగు పద్యపు పాదములలో యతి స్థానము పై వడి గూర్ప వలసియుంటుంది. అనగా యతి స్థానముపై పాద ప్రధమాక్షరమును గాని దాని మిత్రాక్షరమును గాని నిలపాలి. హల్లులకు యతి మైత్రి కూర్చునపుడు వాని మీద నిలుచు అచ్చులకు (అంటే తలకట్టు, గుడి, కొమ్ము మొదలగు వాటికి) కూడ మైత్రి కూర్చాలి. అలా కాకుంటే యతి భంగమయినట్లే. తెలుగులో ప్రాస లేని పద్యాలు ఉంటాయి కాని యతిలేని పద్యములు లేవు. తెలుగుపద్యాలకు సంబంధించి 39 రకాల యతి భేదాలు లక్షణ గ్రంధాల్లో చెప్పబడ్డాయి.

సంస్కృత పద్యాల్లో యతి అంటే ‘విచ్చేదం’, విశ్రాంతి కొరకు పాదం అక్కడ విరిగితే చాలు.  తెలుగులో విడి (వళీ), విశ్రాంతీ రెండూ ఉండాలన్నది నియమం.  అంటే యతి స్థానంలో పాదం విరగడమే కాకుండా సరూపాక్షరం కూడ అక్కడ ఉండాలి. తెలుగులో ఉన్న ఈ వళి (అక్షర మైత్రి) నియమం సంస్కృత, కరనాట భాషల్లో లేదనీ, ఒకవేళ అక్కడక్కడా కనిపించినా అది యాదృచ్చికమూ, అలంకారికమూ అని పెద్దలు చెబుతారు.

అయితే, ఈ యతి నియమం మొదటి నించీ తెలుగు పద్యాల్లో ఇంత కఠినంగా ఉందా అంటే, ఉంది… లేదు… అని రెండు రకాలుగాను సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. నన్నయకు పూర్వపు శాసనాల్లో యతి, ప్రాస సహితంగాను, రహితంగాను అగుపించే కంద పద్యాలు ఇందుకు నిదర్శనాలుగా పెద్దలు చెబుతారు.

పద్యము గురువుతో అంతం కావాలన్న నియమం ఒక్క కంద పద్యానికి తప్ప తెలుగు ఛందస్సులో మరే పద్యంలోనూ కనుపించదు. కంద పద్యం అచ్చంగా తెలుగు వాళ్ళ ఆస్తి అనీ, కాదు సంస్కృత ఆర్యాగీతిభేదమే అనీ రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి.

64 మాత్రల నిడివి కలిగియుంటూ, యతి మరియు ప్రాస సహితంగా ఉండడం స్థూలంగా ఇప్పటి కంద పద్య లక్షణం.  కనురెప్పపాటు కాలాన్ని ఒక మాత్ర గా అనుకుని లెక్కిస్తే, ఎన్ని మాత్రలున్నా 64 మాత్రల కాలానికి (లఘు, గురువుల లెక్కతో నిమిత్తంలేకుండా, గణాల సంగతి అంతగా పట్టించుకోకుండా) పద్యం అమరిపోయేలా చూసుకోవడం పాత కంద పద్య లక్షణం. ఉదాహరణకి, మొన్న మొన్నటి దాకా పల్లెపట్టుల్లో పిల్లలు పాడుకుంటూండిన ఈ పాట:

“గుడు గుడు గుంచం గుండే రాగం
పామూల పట్టా పడగా రాగం
చినన్న పెండ్లీ చిట్టే రాగం
పెద్దన్న పెండ్లీ పెట్టే రాగం.”

ఈ పాటను కంద పద్యంలోకి మారిస్తే ఇలా ఉంటుంది:

“గుడు గుడు గుంచం గుండే
రాగం పామూల పట్టా పడగా రాగం
చినన్న పెండ్లీ చిట్టే
రాగం పెద్దన్న పెండ్లీ పెట్టే రాగం.”

కంద పద్య పాదములకు సరిపోయేట్లుగా చరణాల్ని మార్చి వ్రాయడం తప్ప, ఇందులో కొత్తగా చేసిందేమీ లేదు. అయితే, ఇందులో గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, గణాలు కూడా సరిగ్గా సరిపోతున్నప్పటికీ, కంద పద్యంగా మార్చి వ్రాసినపుడు ఈ పాటలో పాడుకోవడానికి అనుకూలంగా ఉండిన తాళానుకూల యతులు మాయమై పోతున్నాయి.