స్వగతాలు (6) : జ్ఞాపకం -2

జ్ఞాపకం (2)

ఒకప్పటి అతి గాఢమైన ప్రేమ కూడా
ఇప్పటికి ఒక అగాఢమైన, అస్పష్టమైన జ్ఞాపకాల సముదాయంగా అంతమై మిగలొచ్చని ఒక మాట!

ఏది పరమ నిజం (absolute truth)?
ఏదీ కాదు.
సంబంధ నిజమో (relative truth)?
అన్నీ!
నీవూ నేనూ, నీ ప్రేమా నా ప్రేమా…. ఇలా అన్నీ!

చూడగలిగితే, చదవ గలిగితే, కాలంలో ఎప్పుడూ ఒక అప్రకటిత దాన శాసనం శిలామయమై క్షణానికో మారు లిఖించబడి వుండి కనబడుతూ వుంటుంది!

ఇదివరకే పడివున్న అక్షరాల అడుగుజాడలలో తడబడుతూ నడుస్తూండేవే
నీవీ నావీ, ఇంకా మనలాంటి వాళ్ళవే అందరివీ, జ్ఞాపకాలు.

చిక్కుపడిపోయి వున్న కురులలోకి వేళ్ళు పోనిచ్చి, ఉదయం అరవిప్పారిన కన్నులతో ఆవులిస్తూ బడలికగా పురివిప్పుకుంటున్నట్లు కదిపినప్పుడల్లా, హటాత్తుగా రాలిపడే ఒక వాడిపోయిన మల్లెపూవు లాంటిది ఈ జ్ఞాపకం.

కళ్ళు నులుముకుని చూడాల్సి వచ్చేటంత అపనమ్మకంగా, నమ్మశక్యం కానంత నిర్నిమిత్తంగా,
ఒక మధురాతి మధురమైన స్మృతిని జ్ఞప్తికి తెచ్చి ఒళ్ళు ఝల్లుమనిపిస్తుంటుంది.

కురులమధ్య కవోష్ణంలో కాలిపోయి మిగిలిన అప్పుడెప్పటిదో మోహాన్నీ, మొహాన్నీ
అక్షరాలా ఈ అక్షరాల జలపాతంలో తడుపుకుని తృష్ణ తీర్చుకుంటూ
నేనిక్కడ ఎన్నాళ్ళుగా నయినా సరే పడి ఉంటూనే ఉంటాను….

అటూ ఇటూ ఒకేసారి మండుతూన్న సూర్యునిలా
ఉదయం సాయంత్రం, పగలూ రాత్రీ అనే ప్రాపంచిక సంగతులను వేటినీ పట్టించుకోకుండా
ఇలా…..

స్వగతాలు (4): ఆధునికత!

ఆధునికత!

ఐరోపీయ నాగరికతకు గ్రీకు భావజాలం పునాది.
గ్రీకు పురాణ భావాజాలానికి హిందూ పురాణ భావజాలానికీ సారూప్యత కనిపిస్తుంది.
అతి ముఖ్యమైన బేధమూ కనిపిస్తుంది.
అది – గ్రీకు భావజాలం ఈ భూమినీ భౌతిక శరీరాన్నీ కేంద్రంగా చేసుకుంటే,
హైందవ భావజాలం భూమిని వదిలి ఆకాశాన్నీ ఆత్మనూ కేంద్రంగా చేసుకుని ఎదిగాయి.

myth లు మాయా శశిరేఖల లాంటివి.
హిందూ, గ్రీకు భావజాలాలు రెండింటిలోనూ  కనుపించీ కనుపించనట్లుండే, వినిపించీ వినిపించనట్లుండే
ఎన్నెన్నో అమోఘమైన మాయలనూ, మనోహరమైన స్వప్నాలనూ మానవ మస్తిష్కానికి అవి అల్లి చూపించాయి.

Galileo తోనూ Rene Descartes తోనూ ఐరోపీయ నాగరికత ఆధునికతను సంతరించుకోవడం మొదలెట్టిందని ఒక మాట.
విషయాన్ని మొత్తంగా కన్నా ఖండ ఖండాలుగా విభజించి చూస్తేగాని అసలు నిజం అవగతంగాదన్నది ఆధునిక భావనగా మొదలై, మానవ శరీరంతో సహా కంటికి కనుపించే ప్రతిదీ సూక్ష్మాతి సూక్ష్మ దృష్టిలో ముక్కలవడం మొదలైంది అప్పటినుంచీ! (ఇది క్రీ.శ,16వ, 17వ  శతాబ్దాల నాటి మాట.  మనం అప్పుడు విజయనగర రాజుల పాలనలోని మలిదశలోనూ, గోల్కొండ, డచ్చి, ఫ్రెంచి పాలకుల కాలంలోనూ వున్నాం).

ఐరోపీయ ఆధునికతలో మనిషిని ముక్కలు చేసి చూసే కొలదీ, విషయ జ్ఞానం పెరిగేకొలదీ, ఇంకా అస్పష్టంగా అయిపోవడం మొదలెట్టిన చూపు మనిషిని మరికాస్త అష్పష్టంగా చూపెట్టడం మొదలెట్టిందనీ,  జ్ఞానం ఎంతగా పెరిగితే, అంతగానూ అస్పష్టత పెరిగిందనీ మరి ఒక మాట.

ఈ అస్పష్టతలో మనిషి తనను తాను పోగొట్టుకోకుండా వుండడానికి, మనిషిని మునుపటిలా మొత్తంగా చూసుకోవడానికీ, అక్కడ పుట్టిన ఆధునిక మార్గమే ‘నవల’ అన్నది ఒకటి గుర్తించదగిన మాట.

జ్ఞానం ఒక్కటే నవలకు నైతికత అనీ, ఆధునిక మానవ జీవనంలోని సంక్లిష్టతకూ, సంక్షోభానికీ సంబంధించిన ఏదో ఒక కొత్త నిజాన్ని ఆవిష్కరించి చూపెట్టని ఏ నవలైనా అనైతికమైనదేననీ చెప్పిన నిర్వచనం లాంటి మాట కూడా తప్పనిసరిగా మన్నించదగినది.

Cervantes తో adventure అనే భ్రమ యొక్క ఆనుపానులను పెళ్ళగించడానికి పూనుకుంది నవల.
Richardson తో మనిషి అంతరంగంలోని రహస్య మాయామోహాలను వెలికితీయడానికి పూనుకుంది నవల.
Balzac తో చరిత్రలో మనిషి వేళ్ళూనుకొన్న నేపథ్యాలను కనుగొనటానికి పూనుకుంది నవల.
Flaubert తో మనిషి రోజువారీ జీవితంలో అప్పటిదాకా కనుగొనబడని కొత్త విషయాలను విశదీకరించడానికి పూనుకుంది నవల.
Tolstoy తో మనిషి అర్ధంలేనివిగా అనుపించే ఆవేశాలనూ, నిర్ణయాలనూ అంతు చిక్కించుకోవడానికి ప్రయత్నించింది నవల.
Proust తో చిక్కకుండా వెళ్ళిపోయే గతాన్నీ, Joyce తో చిక్కకుండా వెళ్ళిపోయే వర్తమానాన్నీ పట్టుకోవాలని ప్రయత్నంచేసింది నవల.
Thomas Mann తో వర్తమానంలోని మనిషి నిర్ణయాలకు ఏనాటివో గతంలోని సంగతుల సంబంధాన్ని విశదీకరించడానికి పూనుకుంది నవల.
Kafka తోనూ Camus తోనూ ఆధునిక జీవన విధానంలోని absurdities ని ఎండగట్టే యత్నం చేసింది నవల.
Marquez తో magic realism అనే మాయా వాస్తవాన్ని రుచి చూపించింది నవల.

ఇలా ఇంకెన్నిటినో చేసి చూపించింది ఐరోపీయ ఆధునికతలో వూపిరి పోసుకున్న నవల.

‘నవల ఎక్కడ ఏది సాధించి చూపించినా అది ఐరోపీయ ఆధునికత విజయమే!’ అని చాటుకునేంత బలంగా ఇది నిరూపితమై మిగిలింది.

అదలా వుండగా
ఒకప్పటిదాకా గ్రీకు భావజాలంతోనూ, నాగరికతతోనూ సమ ఉజ్జీగా ఉన్నట్లుండిన హైందవ భావజాలమూ, నాగరికతా, ఐరోపీయ ఆధునికతకు సమాంతరంగా తాను కనిపెట్టి పెంచుకున్న ఆధునికత ఏది?
హిందూ ఆధునికత అంటూ అసలు ఒకటి యోచించబడి వున్నదా? వుంటే ఎక్కడ, ఏ రూపంలో వుంది?
లేకుంటే, ఐరోపీయ ఆధునికతను అనుకరించడమే, అనుసరించడమే హిందూ ఆధునికత అయిందా?
ఎప్పటికైనా అదే – ఐరోపీయ ఆధునికతయే – ఆదీ, అంతమూనా?

స్వగతాలు (3) : జ్ఞాపకం

జ్ఞాపకం

ప్రతి జ్ఞాపకానికీ వేలిముద్ర లాంటి ఒక personal ముద్ర వుండడమన్నది వాటి నైజం.

Memory loss అంటే?
జ్ఞాపకం పోవడం….అంతే!

ముఫ్ఫై నలభై ఏండ్లుగా వెంట పడి వున్న ఒక జ్ఞాపకాన్ని
ఎలక్ట్రానిక్ కాగితం మీదికి – అదే కంప్యూటర్ స్క్రీన్ మీదికి – వ్రాయడానికి ఎంత సమయం పడుతుంది?
ఒక గంటా?
రెండు గంటలా?
మూడూ? నాలుగూ? ….. పోనీ ఒక రోజు!

జ్ఞాపకం పోవడం అంటే
ఒక memory మన నుంచి వేరై పోవడం – అంతే!

Memory ని Memory గానే మాటలలో మూట కట్టి బయటికి నెట్టేయడంలో పోయే ప్రతి జ్ఞాపకం, తన వెంట ఒక తనువంత అనుభూతి బరువును తీసుకొని పయనమై పోయినట్లనిపించకపోవడం తెలియకుండా జరిగిపోతుంది.

వ్యక్తి హరువును జ్ఞాపకాల బరువు నిర్ణయించడమన్న తెలియని నిజం, తేలికైపోయిన జ్ఞాపకాల బీరువాలోని చీకటిలోనికి తొంగి చూసుకుని ఒకానొక రోజు తముళ్ళాడుకోవాల్సి రావడం జరిగినప్పుడు, ఒక్కసారిగా తెలిసి భయపెట్టే క్షణం రాకూడదనుకుంటాను!

అన్నీ అయి పోయి

ఎప్పటికైనా సరే, చెప్పడానికి ఇక ఏమీ మిగలకుండా అయిపోయి మిగలడం మాటలలో చెప్పలేనంత misery!

Memory loss అంటే?
శిథిలానికి సిధ్ధమౌతూన్న ఒక ఖాళీ అయిపోయిన గది!

స్వగతాలు (1) – ఒక మాట!

ఒక మాట!

‘ఒక్క సారే తప్ప, ఇంకొక సారి ఒక్క క్షణమాత్ర కాలంకూడా వుండడానికి వీలు లేనటువంటి ఈ జీవితం ఎంత మాత్రం విలువైనది?’ అన్నది ఒక ప్రశ్న.
ఈ ప్రశ్న అర్ధవంతమైనది అవునా కాదా అన్నది తరువాతి మాట.
మొదట ఒక మనిషి జీవితం తయారు కావడానికి, అంతకు ముందు చాలా మంది మనుషుల జీవితాలు గతించి వుండాలన్నది ఒక అత్యంత విలువైన ఆలోచన.

తెలుసుకోవాలన్న తపన వుంటూనే వుంటుంది.
అయితే ‘దేనిని?’ అన్నదానిని దీనికి సంధించినప్పుడు దారులు మారుతూండడం చూస్తాం.
‘ఈశా వాస్యం ఇదం సర్వం’ (ఈ జగత్తంతా ఈశ్వర మయం!) ఇది ఒక దారి.
‘తత్త్వం అసి’ (అదే నీవై వున్నావు!) ఇదీ ఆదారి లోనిదే!
Cognito; ergo sum^ (I think; therefore I am – నేను అలోచిస్తాను; కనుకనే నేను!) ఇది ఇంకొక దారి…
ఇలాంటివే ఇంకా ఎన్నో దారులు!

అంతు తేలాలంటే అణువణువునీ పరీక్షించడమే మార్గమని
సైన్సు శరీరాన్ని ముక్కలుగా చేసి చూసినట్లుగానే జీవితాన్నీ ముక్కలుగా చేసి చూడడం నేర్చుకుంది.

రోజు రోజుకూ జీవితంలోని కొన్నైనా సంగతులు మారుతూ వుంటాయి.
చాలా సంగతులు ఏ మార్పునూ వహించకుండా అలానే వుంటూ కూడా వుంటాయి.
మారుతూన్న ప్రపంచం ఒక్కసారిగా అర్ధ రహితంగా కనపడకుండా వుండాలంటే
మారుతూన్న సంగతులతో పాటు
మార్పుకు లొంగని పాత సంగతులనూ విధిగా వెంట తెచ్చుకోవాలి.

జీవితం ఒక్క సారిగా అర్ధరహితం కాకుండా వుండాలంటే
మనలో నిక్షిప్తమైవున్న వేలవేల జీవితాల విశ్వాసాలను ముందు గౌరవించడం నేర్చుకోవాలి!

(^ Descartes, Rene (1596-1650) – French philosopher, mathematician and physicist, చెప్పిన ప్రసిధ్ధమైన మాట!)

 

తెలుగు మాట, పాట, పద్యం (6)

అచ్చ తెనుగు పాట

పండుగ రోజులలో తెలుగిళ్ళలో స్త్రీలు నోములు నోయడం అన్నది మన సంస్కృతీ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగం. శ్రావణ మాసంలో ప్రతి తెలుగిల్లు శ్రావణ మాసపు నోముల ఫలితంగా కళకళలాడుతూ వుండడం నేటికీ చూస్తూనే వుంటాం! శ్రావణమాసంలో నోముల  తరువాత, దీపావళి మొదలు కార్తీక శుధ్ధ పౌర్ణమి వరకూ పూర్వం తెలుగిళ్ళలో బాలికలు నోచే ఒక నోము (‘మూగనోము’ అని పేరు) చివర రోజున, గౌరీదేవికి పూజ చేసిన తరువాత, ఒక పాట పాడేవాళ్ళని స్వర్గీయ ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, వారు రచించిన ‘ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి’ (ప్రథమ ముద్రణ: 1951) పుస్తకంలో ఒక అచ్చ తెలుగు పాటను సూచించి, ఆ పాట పూర్తి పాఠాన్ని కూడా వ్రాసారు. ఆ పాట పేరు ‘మోచేటి పద్మం’. ఆ పాట పేరుమీదుగానే ఆ నోముకి కూడా ‘మోచేటి పద్మం’ నోము అని ఇంకొక పేరు గూడా వచ్చిందని చెప్పారు. ఆ పాట పూర్తి పాఠం ఇది:

మోచేటి పద్మమ్ము పట్టేటి వేళ
మొగ్గల్లు తామర్లు ముడిగేటి వేళ
ఆవుల్లు లేగల్లు వచ్చేటి వేళ
ఆంబోతు రంకెల్లు వేసేటి వేళ

సందేళ దీపమ్ము పెట్టేటి వేళ
చాకింటి మడతల్లు తెచ్చేటి వేళ
బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ
కోడల్లు పసుపుల్లు కొట్టేటి వేళ

కూతుళ్ళు గుండుగిన్నెల్ల కుడిచేటి వేళ
ముద్ద మొగము అద్దాన్ని బోలు
ముద్దరాలి మొగము మోచేటి పద్మమ్ముబోలు
పద్మమ్ము నోచిన చానకు పదివేల ఐదవతనము.

మొదలు నుంచి చివరిదాకా, అచ్చమైన తెలుగుదనంతో గుబాళిస్తుండే పాట ఇది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు గదా! అయితే, ఈ పాటలో ఒకింత ఇబ్బందికరమైన సంగతి, ‘మేచేటి’ అనే మాటకు అర్ధం ఏమిటి? అన్నది. ఈ మాటకు లక్ష్మీరంజనంగారు సూచించిన అర్ధం – ‘మొగుచు’ అంటే ముకుళించు పద్మమేమో! అని. వారు సూచించిన ఈ అర్ధంతో, ఈ నోమును ‘ముకుళించే పద్మం’ నోము అనుకోవడానికి కూడా సాధ్యమౌతుంది. ఈ నోము ‘మూగ నోము’ కావడం వల్లా, అంటే ఈ నోము నోచే బాలిక, నోము ఆచరించే రోజులలో సాయంత్రం ఇరుగుపొరుగు పేరంటాండ్రను బొట్టుపెట్టి పిలవడానికి బయలుదేరిన దగ్గరనుంచి, ఆ నాటి రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూసే దాకా, ఎవరెంతగా పరియాచకాలాడి ప్రేరేపించినా మాట్లాడక ఊరకుండాడాలే తప్ప పెదవి విప్పకూడదనే నియమం వుంది కాబట్టి, ఈ నోముకు ‘ముకుళించే పద్మం’ అనే పేరు సాధ్యమే అనిపిస్తుంది; ‘పద్మం’ బాలిక నోరు, ‘ముకుళించు’ అంటే పెదవులు విప్పకుండా వుండేట్లు చేసే నోము కాబట్టి!

ఇక, ఈ పాట నిండా, నాటి పల్లెటూళ్ళ సంధ్యా సమయపు శోభ పరుచుకుని కనిపిస్తుంది. ఈ పాట మొత్తంలో అర్ధంగానట్లు అనిపించి ఇబ్బంది పెట్టే పదాలు రెండే రెండు. అవి, ‘మోచేటి’, ‘బీరాయి’ అనేవి. వీటిల్లో ,మోచేటి’ కి అర్ధం ముందే వివరించ బడింది గనుక, ఇప్పుడు , ‘బీరాయి’ అన్న పదం సంగతి చూడాలి!

‘బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ’ అని చరణం! ఇది చదివిన వెంటనే ఊహ సహజంగానే పల్లెటూరి ఇళ్ళ ముంగిళ్ళలోనో లేక పెరడులలోనో సర్వ సాధారణంగా కనుపించే ‘బీర చెట్టు’ మీదకు పోతుంది. అయితే, ‘బీర చెట్టు’ పూవులు విడవడానికి ‘సంధ్యా సమయాని’ కి ఏమిటి సంబంధం? అన్నది ప్రశ్న. అదీగాక, బీర (చెట్టు) కు ‘బీరాయి (చెట్టు)’ అని నామాంతరం వున్నట్లుగా కనబడదు. ఈ రెండూ కాకపోతే, మరి ఈ మాటకు
ఇక్కడ అర్ధం ఏమై వుంటుంది?

ప్రస్తుతానికి అదలా వుంచి, ఒక్కసారి పూజ్యులు డాక్టర్ బిరుదురాజు రామరాజు గారి ‘తెలుగు జానపదగేయ సాహిత్యం’ (ప్రథమ ముద్రణ: 1958) పుస్తకంలో చూస్తే, ఈ ‘మోచేటి పద్మం’ నోము శ్రీ నేదునూరి గంగాధరం గారి పాఠంలో ‘మోచేతి పెద్దమ్మ’ నోముగా మారి, ఈ పాట పాఠం కూడా బాగా విస్త్రుతమై కనిపిస్తుంది. శ్రీ గంగాధరంగారి పాఠం ఇది:

మోచేటి పెద్దమ్మ నోచేటి వేళ – మొగ్గల్లు తామరలు పూసేటివేళ
బీరాయి పువ్వులు పూసేటి వేళ – బిందెలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
గుమ్మడి పువ్వులు పూసేటివేళ – గుండిగలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
కాకర పువ్వులు పూసేటివేళ – కడవలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
ఆనబాయ పూవులు పూసేటివేళ – అటికలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
చిక్కుడు పువ్వులు పూసేటివేళ – చిప్పలతో గంధాలు తీసేటివేళ
ఆవులు దూడలు వచ్చేటివేళ – ఆంబోతు రంకెలు వేసేటివేళ
సందిటి దీపాలు పెట్టేటివేళ – చాకింటి మడతలు దెచ్చేటివేళ
మరదళ్ళు మరి జూద మాడేటివేళ – కూతుళ్ళు గుండిగలు దింపేటివేళ
కోడళ్ళు కొటుపసుపు కొట్టేటివేళ – చెల్లెల్లు చేమంతులు ముడిచేటివేళ
వదినల్లు వంటిల్లు చేసేటివేళ -
ముద్దుల మొగము అద్దానబోలు – తన ముఖము తామర పద్మానబోలు.

శ్రీ నేదునూరి గంగాధరం గారు ఇచ్చిన పాఠాన్ని బట్టి చూస్తే, ‘బీరాయి’ బీర చెట్టునే సూచిస్తుంది. అయితే, ఈ పాఠం లక్ష్మీరంజనంగారి పాఠంలోలా ‘సంధ్య’ వర్ణనను సూచించదు. తెలుగింటి వాతావరణం మాత్రం కళ్ళకు కట్టినట్లు వుంటుంది. కానీ, లక్ష్మీరంజనంగారి పాఠంతో పోలిస్తే మాత్రం, ఈ పాట పాఠం సందర్భ శుధ్ధి లేనట్లుగా, అంటే ఒక సందర్భానికి సంబంధించినది కాకుండా వున్నట్లుగా అనిపిస్తుంది. పాట పేరులోకూడా ఈ అసందర్భం కనిపిస్తుంది, ‘మోచేతి పెద్దమ్మ’ ఏమిటన్నది అంతు చిక్కేదిగా కనుపించదు.

ఇప్పుడు, లక్ష్మీరంజనంగారు ఇచ్చిన పాట పాఠంలోని ‘బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ’ దగ్గరకొస్తే, ‘బీరాయి’ అన్న పదం ‘బీర చెట్టు’ ను సూచించేదిగానే అనుకుంటే, ‘బీర చెట్టు పూవులను విడిచేటి వేళ’ అన్న అర్ధం ఆ చరణానికి వస్తుంది. ఇందులో ఇమిడి వున్న అర్ధం ఏమిటి? అన్నది మాత్రం ఇప్పటిదాకా ఎంతగా శోధించినా నాకు పట్టుబడలేదు. బీర చెట్టు వెశేషంగా సాయంత్రం వేళల పూవులను రాలుస్తుందా? అన్నది నాకున్న సందేహం! రాలుస్తుంది గనకనే ఆ పాటలో చరణం అలా వుందని నేను నమ్ముతున్నాను! ఇది సరైనదో కాదో తెలిసినవాళ్ళు చెప్పాలి!

తెలుగు మాట, పాట, పద్యం (5)

అచ్చ తెనుగు పద్యం

తెలుగు పద్య సాహిత్యంలో ‘అచ్చ తెనుగు’ అన్న మాటను మొదటి సారిగా వాడిన వ్యక్తి మూలఘటిక కేతన అని చెబుతారు. ఈయన తిక్కన మహాకవి సమకాలికుడు. తెలుగులో మొదటి కథాకావ్యానికి (దశకుమార చరిత్ర) శ్రీకారం చుట్టినవాడు కేతన. ‘కవిత చెప్పి’ తిక్కన మహాకవినే మెప్పించినవాడు ఈయన.  ఈయన చెప్పిన ఈ ‘అచ్చ తెనుగు’ అనే మాటకు ముందు, ఈ మాట ఏ అర్ధాన్నయితే సూచిస్తుందో అదే అర్ధంలో ‘జాను తెనుగు’, ‘దేశి’ అనే మాటలు వాడుకలో వుండేవి. ఈ మాటలను తమ పద్యాలలో చెప్పిన వారు ‘నన్నె చోడుడు’, పాలుకురికి సోమనాధుడు!

పేరుకి ఇన్ని మాటలున్నా, ఈ మాటలు ‘అచ్చ తెనుగు’ భాషా స్వరూపాన్ని అర్ధమయేలా చేయడంలో సఫలీకృతం కాలేకపోయాయన్న ఒక అభిప్రాయం, విజ్ఞుల మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి! భాషా స్వరూపం అర్ధం కావాలంటే, ఒక ఉదాహరణంతో చెప్పుకుంటే, కొంతలో కొంత స్ఫష్టత వచ్చి, సులభం అవుతుంది.

“పగలు సేయుచు వేడిమి మిగుల జగము
గ్రాచు జమునబ్బ మున్నీట గలిసె ననియొ
తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపు
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”

కూచిమంచి తిమ్మకవి రచించిన ‘అచ్చ తెలుగు రామాయణం’ కావ్యంలోనిది ఈ పద్యం. సూర్యాస్తమయాన్ని సుందరంగా వర్ణించే పద్యం! నాకయితే, ఈ పద్యంలోని మాటల పొందిక, brevity, గాథా సప్తశతిలోని గాథలను తలపుకు తెస్తుంది. మంచి భావంతో నిండి వున్న పద్యం! ఊహ original ది! నాకు తెలిసినంతవరకూ, ఏ ప్రాకృత గాథనుంచో, సంస్కృత శ్లోకంనుంచో ఎత్తుకొచ్చింది కాదు!

ఇప్పుడు, ఈ పద్య భావాన్ని కొంచెం విడమరచి చెప్పుకుంటే…

‘పగలు సేయుచు’ – పగలు సేయువాడు – దినకరుడు.
సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ, కొన్ని రకాలయిన సంస్కృత సమాసాలు అచ్చ తెలుగులోకి మారేటప్పుడు జరిగే మార్పులను గురించి కొంత వివరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సంస్కృత సమాసాలలోని ప్రత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, దొర, తపసి, జోదు…ఇత్యాది శబ్దాలు జతవుతాయి అని వ్యాకరణం. ఉదాహరణకి:

అచ్చ తెలుగులో ‘కప్పు కుత్తుక వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘నీలకంఠ’ కు,
అచ్చ తెలుగులో ‘గిత్త తత్తడి వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘వృషభ వాహన’ కు,
అచ్చ తెలుగులో ‘వెంట్రుక యడుగుల దొర’ అనే సమాసం, సంస్కృతంలో ‘రోమ పాద’ కు,
అచ్చ తెలుగులో ‘మనుబోతు కొమ్ము తపసి’ అనే సమాసం, సంస్కృతంలో ‘ఋష్యశృంగ’ కు,
అచ్చ తెలుగులో ‘పచ్చ వారువపు జోదు’ అనే సమాసం, సంస్కృతంలో ‘హరిదశ్వా’ కూ అనువాదాలని పెద్దల వివరణ. తెలుగులో వీటినే బహువ్రీహి సమాసాలుగా భావిస్తారని కూడా చెబుతారు, అర్ధంలో చివరన కలది, కలవాడు చేరతాయి కాబట్టి. (నల్లని కంఠము కలవాడు, ఎద్దును వాహనముగా కలవాడు…ఇత్యాదిగ).

నాకయితే తెలుగులో ఈ మాటలు, సంస్కృతంలో మాటలు ఎంత అందంగా కనిపిస్తాయో, తెలుగులోనూ అంతే అందంగా అనిపిస్తాయి. ఇలాంటివే ఇంకొన్ని సమాసాలు:

వలిగుబ్బలి రాచ కూతురు (హైమవతి – హిమవంతుని కూతురు, ‘వలిగుబ్బలి’ అంటే మంచుకొండ అని అర్ధం), పుట్ట బుట్టువు తపసి (వాల్మీకి – పుట్ట  నుంచి పుట్టిన తపస్వి), పదియరదముల దొర కొడుకు (దాశరధి – దశరధుని కుమారుడు) – ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలంత అందంగానే కనబడతాయి.

ఇక్కడితో ఇది ఆపి, అసలు పద్యానికొస్తే –

పగలు సేయుచు – పగటిని చేస్తూ, ఆ క్రమంలోనే; వేడికి మిగుల జగము గ్రాచు – వేడిమితో జగత్తునంతా వుడికించి ఇబ్బందికిలోను చేసే; యమునబ్బ – యముని తండ్రి (సూర్యుడు); మున్నీట – సముద్రములోనికి; కలిసె ననియొ – కలిసిపోయాడుగదా అని; తొగ వెలందుక – కలువ పూవు (అనే పడతి); నగియె – నవ్వింది; అమ్మగువ – ఆ కలువ సుందరి; పెంపు గని – సంతోషంతో వదనం పెద్దదవడం (కలువ వికసించడం అన్న భావం) చూసి; సయింపక – తాళ లేక; తమ్మి – తామర పూవు (అనే పడతి); మొగంబు మొగిచె – మొహం ముడుచుకుంది, చాటు చేసుకుంది.

సూర్యాస్తమయంతోనూ, చంద్రాగమనంతోనూ కలువలు వికసించడం అనేది ప్రకృతి ధర్మం. సూర్యాస్తమయంతో తామరలు వికసనం కొల్పోయినట్లయి, కళావిహీనంగా, ముడుచుకున్నట్లయిపోవడమూ ప్రకృతిధర్మమే! ఈ రెండు ధర్మాలనూ కలబోసి, ఒకే సందర్భానికి జతచేసి, హృద్యంగా చెప్పడం ఈ పద్యంలో జరిగింది.

నాకు ఈ పద్యాన్ని చదివినప్పుడల్లా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది. పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గాథా సప్తశతి లోని పద్యాలను తెలుగులోకి అనువదించడంలో ఈ పద్యాన్నే(సరిగ్గా ఈ పద్యాన్నే అని కాకుండా, ఇలాంటి పద్యాలనే) ఆదర్శంగా తీసుకున్నరేమో! అని. ఎందుకంటే, అందులోని చాలా పద్యాల నడక ఈ పద్యాన్నే పోలి వుంటుంది. ఉదాహరణకి:

“అడుగుదమ్ములందు బడివేడు పతివీపు
జిన్ని కొమరుడెక్కి చెలగి యాడ
అలుక యెంత తెగనిదయ్యును నిల్లాలి
మొగమునందు నవ్వు మొలచె నపుడు! “                (శతకం 1 గాథ 11)

“ఎవని వదలిన జీవంబు నవసి చనునొ
యతని నపరాధినయ్యు నోదార్ప వలయు;
ఊరు గాలుచు బొలిపోవు చున్న గాని
యగ్గి నొల్లని వారెవ్వరతివ, చెపుమ?”         (శతకం 2, గాథ 63)

అందుండి అచ్చ తెలుగు మాటలలో వున్న ఇలాంటి రమ్యమైన పద్యాలను ఇంకా చాలానే ఉదాహరించవచ్చు!

మన కథకులు (my notes) – తిలక్ (1)

దేవరకొండ బాలగంగాధర తిలక్ (ఆగస్ట్ 1921 – జులై 1961)

ఊరి చివరి ఇల్లు (1)

కథల్ని నేను స్థూలంగా రెండు రకాలుగా విభజించుకుంటాను. issue-based and feeling-based అనేవి ఈ రెండు రకాలు. మానవ జీవనానికి సంబంధించిన ఏదో ఒక సమస్య చుట్టూ తిరుగుతూ, ఆ సమస్యను ఏదో ఒక కోణం నుంచో లేక పలు కోణాలనుంచో చూసి విశ్లేషిస్తూ నడిచి, అవసమయ్యుంటే, ఇవ్వగలిగుంటే, రచయిత చూపగలిగుంటే చివరికి ఒక పరిష్కారాన్ని చూపుతూ ముగిసే కథలు మొదటి రకానివి. మానవ హృదయానికి సంబంధించిన బాధలను, భావోద్రేకాలనూ మనసుకు హత్తుకునేలా చూపుతూ, కథ ముగిసేటప్పటికి ఒక pleasant feeling ని గానీ లేదా painful feeling ని గానీ మిగిల్చే కథలు రెండో రకానివి. తిలక్ గారి ‘ఊరి చివరి ఇల్లు’ ఈ రెండవ రకానికి చెందిన కథ.

పూర్వ కాలం నుంచీ పురుషుడు స్త్రీ అనే భావనను సౌందర్యానికి ముడివేసి చూసుకున్నట్లుగానే, వేశ్య అనే భావనను సాధారణ స్త్రీలకంటే తెలివిగలదిగానూ, సంభాషణాచతురురాలుగానూ, sensitive at heart గానూ ఊహించి చూసుకోవడానికే ఎక్కువ ఇష్ట పడ్డాడనిపిస్తుంది. నిజ జీవితంలో ఇలాంటి వాళ్ళు ఎదురవుతారో లేదో చెప్పలేను గాని, గురజాడ గారి కన్యాశుల్కంలోని మధురవాణి ఆధునిక తెలుగు సాహిత్యంలో అప్పటినుంచి ఇప్పటిదాకా నిలిచివున్న అలాంటి ఒక వేశ్య పాత్ర. (గురజాడ గారి కన్యాశుల్కం మొదటి కూర్పులో మధురవాణి ఒక insignificant, ప్రాముఖ్యమేమీ లేని పాత్ర; రెండువ కూర్పులో గురజాడ గారిచే బాగా విస్తరింపబడి ఇప్పుడున్న స్థాయికి చేరిన పాత్ర). తెలుగు సాహిత్యంలో మధురవాణి  ప్రభావం ఎంతటిదంటే, ఈమె చేత తెలుగు ప్రముఖ సాహిత్యకారులలో చాలామందిని సరదాగా imaginary interview లు కూడా చేయించడం జరిగింది. ‘ఊరు చివరి ఇల్లు’ లో రమ, sensitive heart తో వున్న ఒక, వేశ్యగా మార్చబడడానికి సిధ్ధం చేయబడుతున్న, యువతి పాత్ర!

‘ఊరి చివరి ఇల్లు’ మొదటి నుంచీ ఒక above from the normal or different from the normal వాతావరణంలో నడిచే కథ. అసలు కథకు ఆ పేరు పెట్టడంలోనే రచయిత తాను అనుకున్నది సాధించాడని, సాధారణ ఊరికి దూరంగా (ఇక్కడ దూరం అనేది physical దూరం అనే దానికంటే  – psychological – ఊహలలో దూరం అనేది గుర్తుంచుకోవాలి) ఒక different locale ని set చేయడంలో సఫలీకృతుడయ్యాడని నేననుకుంటాను. ఈ ఒక్క మాటతో పాఠకుని చిత్తాన్ని ఊరికి దూరంగా ఎక్కడికో ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్ళి కూర్చో బెడతాడు రచయిత. అలాగే, కథ మొదలయ్యే మొదటి వాక్యంతోనే కథకు కావలసిన ఒక mood ని set చేసి, పాఠకుడి చిత్తాన్ని ఊరుకు చివర, ఒక వర్షపు వాతావరణంలో కూర్చోబెడతాడు. కథనంలో ఒక చోట ‘ఆ ఇల్లు అక్కడ ఎందుకుందో ఎవరికీ తెలియదు’ అనే explanation కూడా ఇస్తాడు. This explanation serves as a hint, a message to the reader, to not to think more than what he says in the story and not to go deep into reasoning! ఈ hint తోనూ, message తోనూ, పాఠకుడు ఇంక extra thinking మానేసి, కథతో నిలిచి వుండి, కథను నడవనిస్తూ, తనుకూడా కథతో నడుస్తాడు. ముందు పేరాలలోనే ఈ message ఇవ్వడం అవసరం అనేది తిలక్ గారికి తెలుసు. ఎందుకంటే, ఈ కథను strict reasoning తో చదవడం మొదలెడితే, ముందుకు సాగదనీ, ఈ కథలో తాను చెప్పదలుచుకున్న, నిరూపించదలుచుకున్న విషయానికి, reasoning తో పని పెడితే కుదిరే విషయం కాదనీ తిలక్ గారు కథకునిగా ముందుగానే ఊహించారని నేననుకుంటాను!

మన కథకులు (my notes): బుచ్చిబాబు-2

నన్ను గురించి కథ వ్రాయవూ? – (2)

కథలో ‘నేను’. కథ మొదటినుంచీ కుముదంలో ఏ ప్రత్యేకతా లేదంటూనే, కుముదం ను ఎప్పుడుచూసినా  కనులకు ఉత్ప్రేక్షలనే అద్దాలను తగిలించుకుని తప్ప చూడడు; కుముదం గురించి ఏది చెప్పినా ఉత్ప్రేక్షలనే అలంకారాన్ని జతచేసి తప్ప చెప్పడు. ఇది ఒక వైరుధ్యం. కథ మొదలు నుంచి చివరంటా సాగే వైరుధ్యం.

కుముదాన్ని తాను అసాధారణమైన వర్ణనలతో ఒక వైపు చూస్తూ, ఇంకొకవైపు ఆ పక్కనే ఆమె ఏ ప్రత్యేకతా లేనిదని తీర్మానంగా చెబుతూ చివరిదాకా దానినే పాఠకుడిని నమ్మమంటాడు కథలో ‘నేను’! అదెలా కుదురుతుంది? కుదరదు గనుక  పాఠకుడు కుముదం ను మొదటినుంచీ అసాధారణ వ్యక్తి గానే గణించి, పరిగణిస్తూ వస్తాడు.

—- ‘పూర్తిగా పండని జామపండు రంగులా వుండేది ఆ పిల్ల ఛాయ.’

‘తన వ్యక్తిత్వాన్ని గుర్తుంచుకుని, దాని ప్రభావాన్ని ఇతరులకి తెలియచెయ్యాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో చూడగలిగాను. ….  ఆమెని తొలిగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుతుంది.’

‘ఆమెలో కథావస్తువుగా వుండేటంతటి విశేషం ఒక్కటి కూడా లేదు.  చూడడానికి చాలా సామాన్యంగా వుంటుంది. పల్చటి శరీరం.  వేసంగిలో వర్షం కురిసే ముందు దట్టంగా అల్లుకున్న మబ్బురంగు శరీరఛ్ఛాయ.  సంపూర్ణంగా వికసించని అవయవాలు.  ఎవరో దువ్వినట్లుగా వుండే జడకట్టు.  చూసిన వస్తువులు తనకోసం కానట్టు చాంచల్యంగా కదిలే బలహీనమైన కనురెప్పల కింద మంచులో కదిలిపోయిన కుందేలులా మెరిసే నేత్రాలు, కంఠంలో కొలవడానికి వీలుగా వుండే పచ్చటి నాళాలు.  నీడ కనుపించినట్లు స్ఫురించే వక్షం.  శరీరంలో పై భాగాన్ని మోసేటందుకు వోపిక లేనట్టి అల్పమైన నడుం.  కుముదం సాధారణమైన స్త్రీ. ఎవరూ తుదకు వాళ్ళమ్మకూడా ఆమె అందమైనదని చెప్పుకోవడం నేనెరగను.  అందుకనే ఆమెలో నేనేమీ విశేషం చూడలేక పొయ్యానేమో!’

‘పోతపోసి పదును పెట్టినట్లుగా చలించే వేళ్ళు ఆమెవి.  ఏ అవయవం కదిలినా శరీరంలోని శక్తంతా దానిలో పూరించినట్లుగా వుంటుంది.  ఒక వస్తువుకేసి చూస్తున్నప్పుడు, పంచ ప్రాణాలు కళ్ళల్లోకి పరిగెత్తుకొచ్చినంత తీవ్రంగా చూస్తుంది.  సిగ్గు పడితే రక్తం చెక్కిళ్ళలోనుంచి తొంగిచూస్తున్నట్లుంటుంది. కాని, కుముదాన్ని వర్ణించినంత మాత్రాన కథౌతుందా?’

‘నేను ఆమె కళ్ళకేసి చూస్తూ కూర్చున్నాను.  నిదానించి చూస్తే ఆమె మొహంలో వొక వింత ఆకర్షణ వుంది.  ఆమె శరీరంలో వొంపులు, ఎత్తు పల్లాలు సూర్యరశ్మి సోకినప్పుడు తీర్చి నట్లుగా విప్పారుకున్నాయి.  ఆ కళ్ళు ఆమెకి ఉపయోగం లేవు కాబోలు.  మనుషులకు ఆత్మ వుందో, లేదో నాకు తెలీదు కాని, ఆమెకు మాత్రం లేనట్లు నాకనిపించింది.  మరో లోకంలో ఆత్మని మరచిపోయి, శరీరాన్ని తనిష్టం లేకుండానే ఇక్కడికి రప్పించినట్లు సంచరిస్తుంది.  ఈ ప్రపంచంలో మూసుకుని మరో లోకంలో తెరచుకొన్న నేత్రాలు ఆమెవి.’

‘కుముదం… … చీరని పాదాల పైకి తీసింది.  ఆమె శరీరానికి మాతృత్వం పరిపూర్ణత నిచ్చింది.  వయస్సు మొహానికి వైరాగ్యాన్నిచ్చినా, వార్థక్యాన్నివ్వలేక పోయింది.  మట్టిలో నీళ్ళు కలిసిన వింత సువాసన నన్నావరించింది.  మొహాన్ని పమిటతో తుడుచుకుంది.  తడిసిన పమిట పర్వత శిఖరానికి ఎగబ్రాకేవాడికి పట్టు దొరికినట్లు, వక్షాన్ని అదిమి పట్టుకుంది. సూర్యుడి కడసారి కిరణం లోయలో నీడని వొక్కసారి వెలిగించి మాయమైంది.  సంధ్య అందాన్ని అనుభవించాలన్నవాడు కుముదంతో వుండాలి.  సంధ్యలో నేనెన్నడూ చూడని ప్రత్యేక శోభని ఆనాడు చూడగలిగాను.’ —-

కథా గమనంలో కుముదం ను గురించిన వర్ణన ఇక్కడికి చేరుకునేటప్పటికి. ఆమెపై భావచిత్రణ peak కు చేరినట్లై, ఆమె చుట్టూ ఒక అసాధారణమైన aura ను సృష్టించి వదులుతుంది. ఒక వైపు ఇంత వర్ణన చేస్తూనే, కథలో ‘నేను’ మాత్రం ఆమె అప్పటికీ ఏ ప్రత్యేకతలూ లేని స్త్రీనే అనే అభిప్రాయానికే బధ్ధుడై వుంటాడు. ఇది ఒక paradox, రచయిత కావాలని conscious గా సృష్టించిన paradox! ఈ paradoxical situation ని పాఠకుడు గమనించే పరిస్థితిలో వుండడు. వూపిరి సలపనీయనట్లు వుండే, అసాధారణమైన ఆ powerful imagery లో, వర్ణనలలో పడి కొట్టుకు పోతూ వుంటాడు. (ఈ paradox యే కథ ముగింపును decide చేసిందనీ, కథ dramatic గా ముగియడానికి కారణమయ్యిందనీ అనిపిస్తుంది.)

ఇంత powerful imagery తో కుముదం ను ఆ స్థాయికి తెచ్చి కూర్చో బెట్టిన తరువాత – ఇక ఇప్పుడు ఏమిటి? అన్నది  ప్రశ్న. What to do with her? And, what to do with him? అన్నవి కూడా కథ ముందుకు నడవడానికి సమాధానాలు దొరకాల్సిన ప్రశ్నలు.

ఆమెను glorify చెయ్యడానికి ఇంక మిగిలిన మాటలు లేవు.
అతని గురించి ఇక చెయ్యగలిగింది లేదు.

ఈ స్థితిలో, కథ లేని చోట కథను ఏలా ముందుకు నడిపించాలి, ఎలా ముగించాలి? అన్న సమస్య ఎదురైన ఇప్పుడు, రెండు possibilities:

ఒకటి – He had to change…అతను మారాలి.  ఇది పొసగదు.
రెండు – She had to cease…cease to exist… ఆమె మరణించాలి.

మరణం ఎందుకు? అంటే, మరణంలో వ్యక్తి ప్రదీప్తుడవుతాడు గనుక. కుముదం మరింతగా ప్రదీప్తితమౌతుంది గనుక! ఇంతకంటే, dramatic గా జరిగిన  కుముదం మరణానికి వేరే కారణం ఊహించలేము. Her death was the indirect result of the unbearable wieght of the aura created around her!

అయితే, ఇందులోనే మరో dramatic situation, చనిపోతూ కుముదం  కథలో ‘నేను’ పెళ్ళిచేసుకోకపోవడానికి సంబంధించి చెప్పిన మాటలు, దానిపై  విశ్లేషణ చేసుకుంటూ, ‘ఆమె కోసం నేను పెండ్లి చేసుకోలేదట’ అని కథలో ‘నేను’ చేసిన వ్యాఖ్య, ఆపై ఫ్రాయిడ్ ‘సుప్త చేతన’ ఆలంబన….ఇవన్నీ ఒకదానికొకటి making up గా చేరిన సంగతులు అనిపిస్తాయి. ఈ విశ్లేషణతో పాఠకుడు identify అవలేడు. ఈ విశ్లేషణతోనే కాదు, కుముదం చివరి మాటలతోనే పాఠకుడు identify అవలేడు; కారణం ఒకటే – ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి అన్ని రోజులు ఆగదామె!

ఏదేమైనా, బుచ్చిబాబు గారి ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ కథ మొదటే చెప్పుకున్నట్లుగా రెండు కారణాలవల్ల గొప్ప కథ. అవి narration and inquiry అనేవి! narration గురించి వేరే చేప్పేదేమీ లేదు, ఇప్పటిదాకా చెప్పుకుందదే కాబట్టి.

ఇక రెండవది – inquiry- అవును. Surface level లో మూసలో పోసినట్లు అంతా ఒకే రకంగా unbearably absurd గానే కనిపిస్తాయి. అయితే, things continue to happen out of this absurdity only అనేది సత్యం! కాకపోతే, చూడగలిగే కన్నూ, పట్టుకోగలిగే మనసూ వుండాలి. One needs to have the eye to look and the brains to pick! అన్నది కథలో దొరికే సమాధానం!

మన కథకులు (my notes): బుచ్చిబాబు-1

బుచ్చిబాబు (జూన్ 1916 – సెప్టెంబరు 1967)

కథనం స్థూలంగా రెండు రకాలు. ఒకటి naration – ఎక్కువ వర్ణనలతో పని పెట్టుకోకుండా కథను చెప్పుకుంటూ పోవడం; రెండు inquiry – కథను చెబుతున్నట్లుగానే చెబుతూ అంతః సూత్రంగా ఒక ప్రశ్నను లేవనెత్తి, విశ్లేషించే ప్రయతం చేసి, వీలయితే సమాధానాన్ని సూచించడం, లేదా చెప్పడం.

కథా వస్తువు (subject) ను బట్టి, ఈ రెండింటిలో ఏది ప్రధానమై వుండాలన్నది నిర్ణయమై వుంటుంది. అయితే, enquiey అనేది లేకుండా కేవలం narration తోనే గొప్ప కథ తయారవడానికి ఆస్కారం వుంది గాని, సరయిన narraation లేకుండా కేవలం inquiry తోనే గొప్ప కథ తయారవుతుందనడానికి నిదర్శనాలు సున్న. కారణం, సరయిన narration లేకుండా కథ లేదు.

బుచ్చిబాబు గారి ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ – great narration as well as enquiry, both at the same time! అందువలన ఆ కథ తెలుగులో అత్యుత్తమ కథానికలలో ఒకటిగా మన్ననలందుకుని నిలిచింది.

మనలో చాలా మధ్య తరగతి జీవితాలు పుట్టుకనుంచి గిట్టేదాకా మూసపోసినట్లు ఒకేరకంగా, కొత్తదనమేమీ లేకుండా, unbearably absurd గా వుంటాయి – ఇది ఆ కథలో enquiry! అవును? కాదు? – కథలో ప్రధాన పాత్రలైన ఇద్దరిలో ఒకరు ‘నేను’ దృష్టిలో ‘అవును!’; రెండవ పాత్ర అయిన కుముదం దృష్టిలో ‘కాదు. అలా అనుకోవడానికి వీల్లేదు. that is a wrong notion!’

‘ఎక్కడో ఎప్పుడో పుట్టడం, ఎవరో ఎవర్నో ఒప్పగిస్తే వారిని పెళ్ళాడడం, ఎందుకో తెలీకుండా పిల్లల్ని కనడం, ఎప్పుడో ఎక్కడే చచ్చిపోవడం. ఇది చాలామంది చేస్తున్నది. దీన్ని గురించి కథగా చెప్పుకునేందుకు ఏముంది? ప్రత్యేకత, వ్యక్తిత్వం లేని ఈ జీవితాలు ప్రశాంతాన్ని పొందుతున్నాయి.  కాని, అది బురద గుంటలో పురుగు పొందే ప్రశాంతం’ – అని కథలో ‘నేను’. He was unclear, unrealistic, too emotional and idealistic!

‘ఏమీ లేదు. నాకేదో చెప్పాలనుంది. ఎట్లా చెప్పాలో తెలీడం లేదు. నే చదువుకున్న దాన్ని కాదు. ఉండు, ఆలోచించనీ…’

‘కానీ….కానీ…సుర్యుడూ, చంద్రుడూ ఎప్పుడూ చూస్తూంటాను. కాని, ప్రతిసారి ఎందుకో క్రొత్తగా కనబడతాయి.  మంచినీళ్ళు రోజూ త్రాగుతా. కాని ప్రతిసారి ఎంతో క్రొత్తగా వుంటాయి…నక్షత్రాలు…’

‘ఏమో, నువ్వు జీవితాన్ని పరిశీలిస్తావు.  నేను అనుభవిస్తాను. ఏమో’ – అని కుముదం. She was clear in her thought, realistic, reasonably emotional and focused!

1945-46 ప్రాంతాలలో వ్రాసిన కథ ఇది. కథలోని ‘నేను’ లో బుచ్చిబాబు తనకు తానుగా లేడనుకోవడానికి వీలు లేకుండా వుంటుంది పాత్ర చిత్రణ. బుచ్చిబాబు ఈ కథ వ్రాసే నాటికి 30 సంవత్సరాల వయసులో వున్నారు.

కథలో ‘నేను’ కు ఇరవై యేళ్ళ వయసులో కథ మొదలవుతుంది. కుముదానికి పద్దెనిమిదేళ్ళు. అప్పటికే పెళ్ళి అయింది. కథ అంతమయే నాటికి ‘నేను’ ముఫ్ఫై నాలుగేళ్ళ వయసు వాడు. అప్పటికీ అవివాహితుడూ. కుముదం ముఫ్ఫై రెండేళ్ళ వయసులో వుంటుంది. కనుక, కథ నడిచిన కాలం పధ్నాలుగేళ్ళు.

కథ అంతంలో, కుముదం న్యుమోనియ జబ్బుతో హాస్పిటలులో మంచం పై చావుబ్రతుకుల మధ్య వుండగా చూడడానికి వెళ్ళిన అతను ‘అనుకోకుండా’ తన చేతిని ఆమె చేతిపై ఆనించబోగా, వెంటనే చేతిని లాగేసుకుని దుప్పటిలో దాచేసుకుని ‘నువ్వెందుకు పెండ్లి చేసుకోలేదో నాకు తెలుసు – నాకోసం.’ అంటుంది.

‘నీ స్థితి నాకెంతో బాధగా వుంది’ అంటాడతను కన్నీరు దగమింగుకుని.
‘నాకు నిర్విచారం. ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి. నువ్వు మాత్రం….’ అని కళ్ళు మూసి మరివిప్పదు కుముదం.

కుముదం ఈ మాటలు కథలో ‘నేను’ కు ఒక revealation! ఈ revealation కథలో ‘నేను’ యొక్క ప్రపంచాన్ని తల క్రిందులు చేసి అతని జీవిత పరమావధినే తారుమారు చేస్తుంది. అదే కుముదం సాధించిన విజయం, అదే ఆమె ప్రత్యేకత. కుముదంలోని ఈ ప్రత్యేకతే (కథలో ‘నేను’ చేత) ఆమె గురించి కథ వ్రాయించేలా చేస్తుంది.

కథాంతంలో కుముదం మాటలవలన జరిగిన ఈ revealation రెండు విషయాలను సుచిస్తుంది:
ఒకటి – కుముదం ‘అతడు తనను ప్రేమిస్తున్నాడు’ అన్న అభిప్రాయంలో వుంది, మొదటినుంచీ.
రెండు – అతడు ‘తాను కుముదాన్ని ప్రేమిస్తున్నాను’ అనుకోలేదు ఎప్పుడూ.

ఈ confusion అసలుగా ఎవరిది? మొదటినుంచీ చూసుకుంటూ వస్తే:

తనకు పదేళ్ళ వయసులో ‘నన్ను గురించి కథ చెప్పవూ?’ అంటుంది కుముదం.
తనకు పద్దెనిమిదేళ్ళ వయసులో ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ అంటుంది.

‘తన వ్యక్తిత్వాన్ని గుర్తించుకుని, దాని ప్రభావాన్ని ఇతరులకి తెలియచెయ్యాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో చూడగలిగాను. ఆమె ఒక జీవి. ప్రత్యేకమైన ఉనికి గలది. ఆమెని తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది’ అని వ్యఖ్యానిస్తాడు అతను, కుముదం ఆ కోరిక గురించి.

కుముదంపై ఈ పవిత్ర భావం అతనికి ఎప్పటిది? తాను ఇరవై యేండ్ల వయసప్పటిదా? లేక, (చివరలో ఆమె మాటల తరువాత) ఆమె మరణానంతరం, కథ వ్రాసే నాటికి కలిగినదా? అంటే, రెండింటిలోనూ పెద్ద తేడా లేదనిపించొచ్చు గాని, ఆమె మరణం తరువాత కలిగిన ఈ పవిత్రతా భావాన్ని తన ఇరవై ఏండ్ల వయసప్పటి స్థితికి కూడా ఆపాదించుకున్నట్లుగా అనిపిస్తుంది కథాగమనంలో ఈ వ్యాఖ్య చేసిన చోటు.

కుముదం అందమైంది కాదు. అసాధారణ స్త్రీ కాదు. పదే పదే ఈ వ్యాఖ్య చేయబడి కనిపిస్తుంది కథలో. సారాంశం – ఆరోజులలో (1945-46) మధ్యతరగతి తెలుగిళ్ళలో కనిపిస్తూండిన సాధారణ గృహిణి ఆమె. అయితే, కొన్ని సందర్భాలలో మాత్రం a born intellectual లా కనిపిస్తంది ఆమె మాటలలో.

‘….మనం ప్రకృతికి దాస్యం చెయ్యడం తప్పదు. దాస్యం నేను సహించలేను. కానీ, అది తప్పదనుకుంటాను. నేను ఎదురు తిరగలేక కాదు. నాకదిష్టం లేదు. జీవితానికి తలవొగ్గి ప్రపంచాన్ని అంగీకరిస్తాను.’

‘…ప్రపంచాన్ని మనం ఏదేనా కోరి ఆశిస్తే దాన్ని ఇవ్వదు. మనం దేన్నీ ఆశించకుండా, దూరంగా వుండి చెయ్యగలిగిన పని చేస్తుంటే ప్రపంచం మన పాదాలముందు వాల్తుంది.’

‘నేను నువ్వైతే ఏం చేద్దునో తెలుసా? నదీ తీరాన్న చిన్న తాటాకు పాక కట్టుకుంటాను. అందులో కూర్చుని, ఊరికే చదువు నేర్పుతానని చాటింపు వేయిస్తాను.   మొదట ఏ పదిమంది పొలం కాపులో వస్తారు.  సాయంత్రం వాళ్ళకి బోధించడం మొదలెడతాను. ఇరుగు పొరుగు నుంచి అనేక మంది కర్షకులు, కూలివాళ్ళు చదువుకోసం వస్తారు.  ఉత్త చేతుల్తో రాకుండా, ఒకరు వుప్పు, చింతపండు, ఒకరు పాలు అలా నాక్కావల్సిన వాటిని వాళ్ళే సిధ్ధం చేస్తారు.  వారు నా శిష్య బృందం. వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటా. వారి తగాదాలకు తీర్పు చెపుతా. అంతే. అప్పుడు నా జీవితం వృధా అనుకోను.’ – ఇదీ కుముదం మాటలలోనే కుముదం.

సమయం సందర్భం దొరికినప్పుడల్లా ఉద్యోగం సద్యోగం లేకుండా unrealistic idealism లాంటి దేనిలోనో కొట్టుకుపోతూ నేల విడిచి సాముకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించే అతని జీవితానికి ఒక దిశా నిర్దేశం చేయడానికి ప్రయత్నిస్తుంది కుముదం. దీనిని ఏమనాలి? ఇప్పుడున్న సంకుచితార్ధంలో ‘ప్రేమ’ అనుకోలేం. దానికంటే మించినది, వేరే మాట కావాలి.

అతడు కుముదం మాటలను అర్ధవంతమైనవిగా ఖాతరు చెయ్యడు, పట్టించుకోడు. కథ చివరిదాకా కూడా అదే పరిస్థితిలో ఉంటాడు తప్ప మార్పేమీ వుండదు.

అలా వచ్చి, చివరి సన్నివేశంలో, చేయి స్పృసించబోతాడు. కుముదం అంగీకరించదు.
ఇక అదే ఆఖరి ప్రయత్నంగా, ఒక shock treatment లా -

‘నువ్వెందుకు పెండ్లి చేసుకోలేదో నాకు తెలుసు – నా కోసం.’
‘నాకు నిర్విచారం. ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి. నువ్వు మాత్రం….’ మాట పూర్తికాకుండానే కళ్ళు మూస్తుంది.

ఈ shock treatment ఫలితంగా – చివరికి ఆమె ఆశించింది జరిగిందనడాన్ని కథాంత వాక్యంలో ‘నా ప్రపంచాన్ని తలక్రిందులుచేసి నా జీవిత పరమావధినే తారుమారు చేసిన కుముదాన్ని గురించి ఏం కథ వ్రాయను?’ అన్న మాటలు సూచిస్తాయి.

ఈ వాక్యానికి ముందు, కథలో ‘నేను’ , తాను కుముదం చేతిని అనుకోకుండా స్పృశించబోవడాన్ని, ఫ్రాయిడ్ మనోవైజ్ఞానిక సిధ్ధాంతంలోని ‘సుప్త చేతన’  నేపధ్యంలో విశ్లేషణ చేస్తూ – ‘ఇంతకాలం నా బుధ్ధి వాటిని (కుముదంపై ప్రేమ సంబంధ భావనలను) కట్టేసింది. ఆనాడు ఆమె చెయ్యిపైన చెయ్యి వేసినప్పుడు బుధ్ధిని తొలగించి వాంచలు బైటికొచ్చినట్లు కుముదం గ్రహించి, తన చేతిని లోపల దాచుకున్నట్లు వాటిని వెనక్కి నెట్టి నోరు నొక్కింది. ఆమెలో ఏమీ విశేషం లేదని సమాధానపరుచుకున్నా, ప్రాకృతికమైన ఆకర్షణ లోపల దాగి వుండి, నా జీవితంపై అంత ఒత్తిడి కలిగించినందుకు ఆశ్చర్యపడ్డాను’ – అని explanation యిస్తాడు.(కుండలీకరణం లోని మాటలు నావి).

అయితే, ఒక స్త్రీ పై పురుషుని ప్రేమ భావనలు ఇంత ‘సుప్తం’ గా వుండగలవా? అన్నది ఇక్కడ పుట్టుకొచ్చే ప్రశ్న.
దీనికి సమాధానం ‘అవును’ అన్నదయితే, అది నమ్మశక్యంగానట్లుగా వుండి convincing గా ఒప్పుకోలేము.
‘కాదు’ అయితే, ఈ explanation కథలో ‘నేను’ ఆ చర్యను convincing గా సమర్ధించేదిలా అనిపించదు. అప్పుడు వారిద్దరూ వున్న పరిస్థతిలో, చాలా సహజమైన సానుభూతి ఫలితమైన ఆ చర్యను సమర్ధించడానికి ‘సుప్త చేతన’ ను తోడు తెచ్చుకోవాలా? అన్న సందేహాన్ని రేపుతుంది.

నా వచన కవితలు (22)

శోధన

ఎలా చెప్పాలన్నది సమస్య
ఎప్పటికప్పుడు ఆరంభం ఒక అవస్థ
మబ్బు లోంచి తెగిపడే మొట్టమొదటి వాన చినుకులా
మొదటి మాట విడిపడ్డ దాకా
ఆరంభం ఒక పెద్ద అవస్థ

నీళ్ళ మీదుగా
నీళ్ళ చెలమల మీదుగా
ఇసుక తిన్నెల మీదుగా
సరివి చెట్ల కదలని తలల నీలం మీదుగా
నదికి అవతలి వైపు అందించే అనంతమైన జవాబవసంలేని ప్రశ్నలోకి
నిరీక్షణంగా నిర్వీక్షణంగా పదేపదే వీక్షించడమూ ఒక అవస్థ

రాతిరవడాన్ని శాసిస్తున్నట్లుగా వుండే చుక్కల వెలుతురులో
ఎన్నెన్ని సారులో చీకటిగా నిద్ర లేవడం
నుదుటిపై పట్టివున్న చిరు చెమట బిందువులను
కుంకుమ నీడలలోనికి రాకుండా నిలపుదల చేయడం
కళ్ళు తెరిచేలోపల ఒక సమావేశపు సమీకరణాన్ని
సంగ్రహించుకు చూసుకుని ఆసారికదోలా సంతృప్తి చెందడం

ముక్కు బేసరిపై పడి ముక్కలయ్యే వెన్నెల కిరణం
పదే పదే అదే అగాధంలోకి తరుముకుంటూ తీసుకువెళ్ళే అవే అవే ఆనవాళ్ళూ
ఎన్నాళ్ళగానో తపించి వేధించినా సందేహానికి ఎప్పుడూ దొరకనట్టుండే
సమాధానాల ఉఛ్ఛ్వాస నిఛ్ఛ్వాసాలూ
కన్నీటికి అంతం లేదన్నది తెలిపేటందుకే అన్నట్లుండే
దేహాగ్ని శకలాల సమూహాలూ వాటి నమూనాలూ

ఎవరో వదిలేసి వెళ్ళిపోయిన జ్ఞాపకాలను ధరించి భరిస్తున్నట్లుండే గుండెకి
నిండుగా ఒక్క సారన్నా మోహాన్ని మొహానికి పులుముకుని కనుపించలేని శరీరాన్ని హద్దుగా పెట్టుకుని

ఎందుకని
ఎక్కడికని
ఎన్నాళ్ళని
ఈ శోధన??