స్వగతాలు (6) : జ్ఞాపకం -2

జ్ఞాపకం (2)

ఒకప్పటి అతి గాఢమైన ప్రేమ కూడా
ఇప్పటికి ఒక అగాఢమైన, అస్పష్టమైన జ్ఞాపకాల సముదాయంగా అంతమై మిగలొచ్చని ఒక మాట!

ఏది పరమ నిజం (absolute truth)?
ఏదీ కాదు.
సంబంధ నిజమో (relative truth)?
అన్నీ!
నీవూ నేనూ, నీ ప్రేమా నా ప్రేమా…. ఇలా అన్నీ!

చూడగలిగితే, చదవ గలిగితే, కాలంలో ఎప్పుడూ ఒక అప్రకటిత దాన శాసనం శిలామయమై క్షణానికో మారు లిఖించబడి వుండి కనబడుతూ వుంటుంది!

ఇదివరకే పడివున్న అక్షరాల అడుగుజాడలలో తడబడుతూ నడుస్తూండేవే
నీవీ నావీ, ఇంకా మనలాంటి వాళ్ళవే అందరివీ, జ్ఞాపకాలు.

చిక్కుపడిపోయి వున్న కురులలోకి వేళ్ళు పోనిచ్చి, ఉదయం అరవిప్పారిన కన్నులతో ఆవులిస్తూ బడలికగా పురివిప్పుకుంటున్నట్లు కదిపినప్పుడల్లా, హటాత్తుగా రాలిపడే ఒక వాడిపోయిన మల్లెపూవు లాంటిది ఈ జ్ఞాపకం.

కళ్ళు నులుముకుని చూడాల్సి వచ్చేటంత అపనమ్మకంగా, నమ్మశక్యం కానంత నిర్నిమిత్తంగా,
ఒక మధురాతి మధురమైన స్మృతిని జ్ఞప్తికి తెచ్చి ఒళ్ళు ఝల్లుమనిపిస్తుంటుంది.

కురులమధ్య కవోష్ణంలో కాలిపోయి మిగిలిన అప్పుడెప్పటిదో మోహాన్నీ, మొహాన్నీ
అక్షరాలా ఈ అక్షరాల జలపాతంలో తడుపుకుని తృష్ణ తీర్చుకుంటూ
నేనిక్కడ ఎన్నాళ్ళుగా నయినా సరే పడి ఉంటూనే ఉంటాను….

అటూ ఇటూ ఒకేసారి మండుతూన్న సూర్యునిలా
ఉదయం సాయంత్రం, పగలూ రాత్రీ అనే ప్రాపంచిక సంగతులను వేటినీ పట్టించుకోకుండా
ఇలా…..

నా వచన కవితలు (22)

శోధన

ఎలా చెప్పాలన్నది సమస్య
ఎప్పటికప్పుడు ఆరంభం ఒక అవస్థ
మబ్బు లోంచి తెగిపడే మొట్టమొదటి వాన చినుకులా
మొదటి మాట విడిపడ్డ దాకా
ఆరంభం ఒక పెద్ద అవస్థ

నీళ్ళ మీదుగా
నీళ్ళ చెలమల మీదుగా
ఇసుక తిన్నెల మీదుగా
సరివి చెట్ల కదలని తలల నీలం మీదుగా
నదికి అవతలి వైపు అందించే అనంతమైన జవాబవసంలేని ప్రశ్నలోకి
నిరీక్షణంగా నిర్వీక్షణంగా పదేపదే వీక్షించడమూ ఒక అవస్థ

రాతిరవడాన్ని శాసిస్తున్నట్లుగా వుండే చుక్కల వెలుతురులో
ఎన్నెన్ని సారులో చీకటిగా నిద్ర లేవడం
నుదుటిపై పట్టివున్న చిరు చెమట బిందువులను
కుంకుమ నీడలలోనికి రాకుండా నిలపుదల చేయడం
కళ్ళు తెరిచేలోపల ఒక సమావేశపు సమీకరణాన్ని
సంగ్రహించుకు చూసుకుని ఆసారికదోలా సంతృప్తి చెందడం

ముక్కు బేసరిపై పడి ముక్కలయ్యే వెన్నెల కిరణం
పదే పదే అదే అగాధంలోకి తరుముకుంటూ తీసుకువెళ్ళే అవే అవే ఆనవాళ్ళూ
ఎన్నాళ్ళగానో తపించి వేధించినా సందేహానికి ఎప్పుడూ దొరకనట్టుండే
సమాధానాల ఉఛ్ఛ్వాస నిఛ్ఛ్వాసాలూ
కన్నీటికి అంతం లేదన్నది తెలిపేటందుకే అన్నట్లుండే
దేహాగ్ని శకలాల సమూహాలూ వాటి నమూనాలూ

ఎవరో వదిలేసి వెళ్ళిపోయిన జ్ఞాపకాలను ధరించి భరిస్తున్నట్లుండే గుండెకి
నిండుగా ఒక్క సారన్నా మోహాన్ని మొహానికి పులుముకుని కనుపించలేని శరీరాన్ని హద్దుగా పెట్టుకుని

ఎందుకని
ఎక్కడికని
ఎన్నాళ్ళని
ఈ శోధన??

 

నా వచన కవితలు (21)

ఇంకా….

నువ్వు ఎంగిలి చేసి వదిలేసిన జ్ఞాపకం ఇంకా ఆ చెట్టు కొమ్మకు వేలాడుతూనే వుంది.

గుడి మెట్ల మీద రాలి పడున్న ఎక్కడిదో తెలియని ఒక మందార ఆకు
గాలికి తచ్చాడుతూ బెరుకుబెరుగ్గా వచ్చి నీ పాదాన్ని తాకి ఇంకా మూర్ఛిల్లుతూనే వుంది.

దారంతా మాటనేది లేకుండా మౌనంగా నడిచి
చివరన మలుపు తిరిగే చోట మోమోటంగానైనా నువ్వొదిలేసిన చిరుచూపు నవ్వు
ఇంకా ముళ్ళపొదల కావల మొగిలిరేకులా పరిమళిస్తూనే వుంది.

నది వొడ్డున నీటి చలమల కావల సరివి చెట్ల నీడల్లో
మళ్ళీ దొరికేవి కావని తెలిసీ నేను పోగొట్టుకుంటూ పోయిన సుదీర్ఘ సాయంకాలాలు
చీకటి పడే వేళకు వాటికవే ఇంకా ఏదో తెలియని విషాదాన్ని మౌనంగా మాటేసుకుంటున్నాయి.

ఒకానొక తమోహ రణ క్షణంలో తేలికగా వదిలేసుకున్న ఇన్నిటి జ్ఞాపకాలు
వలస వెళ్ళి తిరిగి రావడం మరిచి పోయిన పక్షుల్లా
కనుపించీ కనుపించకుండా ఇంకా నీ పాటను వ్యధాలాపంగా ఆలపిస్తూనే ఉన్నాయి.

 

ధర్మం: నా వచన కవితలు (20)

ధర్మం

అర్ధనారీశ్వరునికి మల్లే
అవధులు లేని ఆనందాన్నే కాదు
అంతులేని దుఃఖాన్నీ
కలిగించేదిలా ఉండాలి అందం
అప్పుడే అది సౌందర్యం
సౌందర్యపు తాకిడి తగిలిన
సరయిన మనిషెవ్వడూ
చివరికి మౌని కాకుండా మిగలడు.

ఆనందంలో పెద్దగా జరిగేదేమీ ఉండదు
శోకంలోనే కదా మాట
తన్ను తాను గాయాలతో నిండిన సైనికుని శరీరంలా
అలంకరించుకోజూస్తుంది.

నీకంటే గొప్పవనుకుంటాను
నిన్ను గురించి నేను ఎదురుజూసిన సందర్భాలు
మాయ తొలగిపోయినట్లుగా
మోహం కరిగిపోతే
కనీసం కన్నీరు కార్చేందుకు
ఒక దుఃఖ భరిత క్షణమైనా
ఇప్పుడు మరి కనిపించ దెందుకు?

ఎంతకీ రాని నిన్ను
ఎప్పటికైనా రావా అనుకుంటూ
కూర్చోవడం ఎంతగానో గుర్తు
వచ్చినట్లే వచ్చి
అంతలోనే అదృశ్యమైపోయే నిన్ను
ఎప్పటికైనా పట్టుకోలేనా అనుకోవడమూ
అంతగానే గుర్తు.

ఎంతచేసినా
నీ సౌందర్యాత్మకు దీపశిఖలాంటి జ్ఞాపకంలా
వెలుగుతూండడమే నా ధర్మం
నిరంతరంగా….
నిర్మోహంగా….

 

ఇలా…: నా వచన కవితలు (19)

ఇలా…

ఒక సందర్భాన్ని ఊహించుకుని నేనుంటాను
రాత్రి వెన్నెలలో విరుచుకుంటూ పరుచుకుంటూన్న
సన్నిహితాలైన సంగతులను చెప్పుకుంటుంటాను

మెరుస్తూ నది పక్కనుండి ప్రవహిస్తూ ఉంటుంది
నిశ్శబ్దం ఒక సమ్మోహకరమైన పడకగదిలా
ముస్తాబు చేసుకుని ఉంటుంది
నేను కలవరంగా  కల వరంగా ఉంటాను
పాట పరుగెట్టాలని చూస్తూ ఉంటుంది
పమిట చెంగు రెపరెపలు వివిధాలైన రంగులలో
కంటి రెప్పలను సవర్ణీకృతం చేస్తూంటాయి

రెమ్మ కదలదు
రెప్ప వాలదు
రాత్రింకా సగం కూడా గడవదు
చేతిలోని కలం చెప్పాల్సిన కథ
ఇంకా మొదలే అవదు
ఇదంతా ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానమూ దొరకదు

అకస్మాత్తుగా ఇద్దరు ప్రేమికులు
ఒక పడవలో పయనిస్తూ కనబడతారు
అతడు మాట్లాడడు
ఆమే మాట్లాడదు

రివ్వున వచ్చి వాలిన ఒక గాలిపటం లాంటి జ్ఞాపకానికి
అటువైపునుంచి ఆమె నవ్వు
ఇటువైపునుంచి ఇతని శోకం
ఈ రెండే కనిపించీ కనిపించకుండా
ఎప్పుడూ కలవర పెడుతూంటాయి

ఎక్కడిదాకా? అన్న ప్రశ్నకు
ఆగిన దాకా సమాధానం దొరకదు.

దూరం: నా వచన కవితలు (18)

దూరం

మాట కొక సారి వెన్నెలై మెరియడం
మయూరానికి పింఛంలా నీకు సహజ నైజం
పూట కొక సారి మోహంలో కొట్టుకుపోవడం
పుట్టుకతోనే నాకు అబ్బిన నా నైజం

కళ్ళు తెరిచేప్పటికే
కిటికీకి దగ్గరగా వచ్చి ఉంటావు నువ్వు
మాట వినని ముంగురులను గాలికి అప్పగించి
మౌనంగా చోద్యం చూస్తూ ఉంటావు

తట్టుకోలేని పొద్దు తమకంతో
ఒకింత సేపు తూర్పుని వదిలి
నీ వదనంపై విచ్చుకుంటున్నట్లుగా ఉంటుంది

నీ పెదువుల పై అకస్మాత్తుగా
ప్రత్యక్షమైన చిరునవ్వుతో
అనుమతి దొరికినట్లుగా అయి
సూర్యుడు మెల్లమెల్లగా వెలుపలికొచ్చి ఉదయిస్తాడు

తపస్సు లాంటి సందిగ్ధావేశం
నన్ను నీ దిశగా తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది
నేను నిన్ని చేరే లోపల
తెలియకూడని తాపాన్ని చీర కుచ్చిళ్ళలో సరిచేసుకుంటూ
నువ్వు అక్కడనుంచి విసురుగా వెళ్ళిపోతావు

ఖాళీగా మిగిలిన కిటికీ కి
పాటను అలంకరించి
నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను.

పద్యం: నా వచన కవితలు (15)

పద్యం

కంటి నుండి చూపు వెలువడిందంటే
విల్లు ఎక్కుపెట్టినట్లుండాలి
పంటి అడుగు నుండి మాట
వెలువడినా వెలువడకున్నా
గురి పెట్టుంచిన గవాక్షం లోంచి
పక్షి ఎగురుకుంటూ వచ్చి
పాదాక్రాంతమై తీరాలి!

వెంట తెచ్చుకున్న మాట
ఘల్లు ఘల్లున మ్రోగాలి
రంగవల్లుల లాంటి రంగుల కలల్లోంచి
పంచె వన్నెల చిలుకల లాంటి పలుకులు
చిలువలు పలువలుగా రాలి పడడం
ఒక లెఖ్ఖ కానట్లుండాలి!

రగలడ మనేదే తరుణం
చరణం పడడం అంటూ మొదలిడిన
మరుక్షణం నుంచీ
ఋణ పడి ఉన్నట్లుగా
పద్యం పరుగులు పెట్టాలి!

ఋణం: నా వచన కవితలు (14)

ఋణం

మననంలో ఉన్నంతసేపే
మాట మనిషికి ఋణపడి ఉంటుంది
గమనంలో ఉన్నంతసేపేగా
ఏక్షణమైనా విలక్షణంగా మెరిసేది!

గాలిని వహిస్తేనే గాని పూవు పరిమళించ లేనట్లుగా
మోహానికి మానవ హృదయమేగా వాహిక!

ఉండడం లేకపోవడం ఒక లెక్క లోనిదికాదు
ఎదురుగా ఏంజరుగుతున్నదీ అక్కరలోనికి రాదు
వెళ్ళిపోయిన క్షణం వెనక్కి తిరిగి చూడాలనంటే
వక్షస్థలాన్ని వేదికగా చేసి వెలిగించాలిసిందే!

లక్ష వత్తులు వెలిగించి వెదికినా
అక్షరానికి అలవిపడని క్షణమేదీ
మోక్షం పొంది వీక్షణకు దొరుకుననడానికి
సాక్ష్యాలు ఎంత వెదికినా దొరకవు!

బాల్యం – బడి : నా వచన కవితలు (13/1)

బాల్యం – బడి (2)

మాబడికి ముమ్మాటికీ ఏబడీ సాటిరాదు
రాబడి మాటకేంగాని, తేబడిన జీతంతో కాలం
గడుపుతూ ఒకింత సరదాగానే
జీవించడమను వైఖరి ఆ బడి చలవేన్!

ఆడితి మాటలు రాత్రి వేళకు కళ్ళు మూతలు పడేలా
నదిలో మోతగా ఈత కొట్టడమూ
మాతామహుల కొష్ఠంలో దూరి దులాలకి
ఎంత కష్టమైనా వేళ్ళాడడమూ ఆటలు గాగాన్!

చుక్కల నెన్ని మారులు లెక్క పెడదామన్నా
ఒక్క రాత్రన్నా పూర్తయేది కానే కాదు
ఎక్కువ సార్లు మోమోటమంటూ లేకుండా
అక్కున చేర్చుకు ఆదమరిపించేవవి అంతలోనేన్!

 

*********బ్లాగ్ సందర్శకులకు, శ్రేయోభిలాషులకు 2011 సంక్రాంతి శుభాకాంక్షలు!**********