స్వగతాలు (11): చెట్టు – హరితాత్మ (ఒక జ్ఞాపకం)

చెట్టు – హరితాత్మ (ఒక జ్ఞాపకం)

ఇంత తీయగా ఉంటుంది గనుకనే నీ జ్ఞాపకపు గాయాన్ని నేను ఎన్నటికీ  మానిపోనీయను.

ఎక్కు పెట్టిన బాణానికి గురి తప్పడం కూడా తెలిసే ఉంటుంది.
ఎడారికి దాహాన్ని గురించిన స్పృహ మొదటినుంచీ ఉంటుంది.

ఎంత పకడ్బందీగా రాసుకున్నా విఫలం అయ్యే కొన్ని ప్రేమ కథల్లోనూ గాథల్లోనూ  లాగా
అయిన గాయాన్ని
ఎవరిదో ఒక విరహ గీతంలా పెదవులపై మోస్తూ తిరగడంలో ఎంత సుఖముందో నీకేం తెలుసు?
నువ్వు జ్ఞాపకంగా ఉండడంలో ఎన్ని వేల గేయాలున్నాయో నాకిప్పుడు బాగా తెలుసు.

ఎంతగా కాంక్షించి చూసుకున్నా సఫలం కాని కొన్ని ప్రేమ కథల్లోనూ గాథల్లోనూ లాగా
మరిచిపోవడం తప్పనిసరి అయిన ప్రతిసారీ నేను నీ మోహం లోనుంచి తప్పుకుని ఏదో ఒక గాయంలోకో, గేయంలోకో, జ్ఞాపకాల తోయంలోకో లీనం అయిపోవడానికి ప్రయత్నిస్తాను. సఫలం చెందుతాను కూడా!

నన్ను నేను తప్పిపోగొట్టుకోవడంలో ఎంత సుఖముందో నీకేం తెలుసు?
వాడిపోయిన, మోడైపోయిన ప్రతి పూవునుంచి చెట్టునుంచి నన్ను నేను కొంచెం కొంచెంగా దక్కించుకోవడంలో ఎంత సుఖం ఉందో ఇప్పుడు నాకు మాత్రమే తెలుసు.

ఎప్పుడైనా నేనిప్పుడు
నువ్వు ఉండకుండా ఉండే నీ జ్ఞాపకాల లోకంలో ఇలా చెట్టు చెట్టుకీ ఒక హరితాశ్రువునై పరిభ్రమిస్తూ కనబడతాను.
నువ్వుండని ప్రతిచోటా నీ కంటే నిజంగా నాకు నీ జ్ఞాపకమే హరితాత్మ!

స్వగతాలు (6) : జ్ఞాపకం -2

జ్ఞాపకం (2)

ఒకప్పటి అతి గాఢమైన ప్రేమ కూడా
ఇప్పటికి ఒక అగాఢమైన, అస్పష్టమైన జ్ఞాపకాల సముదాయంగా అంతమై మిగలొచ్చని ఒక మాట!

ఏది పరమ నిజం (absolute truth)?
ఏదీ కాదు.
సంబంధ నిజమో (relative truth)?
అన్నీ!
నీవూ నేనూ, నీ ప్రేమా నా ప్రేమా…. ఇలా అన్నీ!

చూడగలిగితే, చదవ గలిగితే, కాలంలో ఎప్పుడూ ఒక అప్రకటిత దాన శాసనం శిలామయమై క్షణానికో మారు లిఖించబడి వుండి కనబడుతూ వుంటుంది!

ఇదివరకే పడివున్న అక్షరాల అడుగుజాడలలో తడబడుతూ నడుస్తూండేవే
నీవీ నావీ, ఇంకా మనలాంటి వాళ్ళవే అందరివీ, జ్ఞాపకాలు.

చిక్కుపడిపోయి వున్న కురులలోకి వేళ్ళు పోనిచ్చి, ఉదయం అరవిప్పారిన కన్నులతో ఆవులిస్తూ బడలికగా పురివిప్పుకుంటున్నట్లు కదిపినప్పుడల్లా, హటాత్తుగా రాలిపడే ఒక వాడిపోయిన మల్లెపూవు లాంటిది ఈ జ్ఞాపకం.

కళ్ళు నులుముకుని చూడాల్సి వచ్చేటంత అపనమ్మకంగా, నమ్మశక్యం కానంత నిర్నిమిత్తంగా,
ఒక మధురాతి మధురమైన స్మృతిని జ్ఞప్తికి తెచ్చి ఒళ్ళు ఝల్లుమనిపిస్తుంటుంది.

కురులమధ్య కవోష్ణంలో కాలిపోయి మిగిలిన అప్పుడెప్పటిదో మోహాన్నీ, మొహాన్నీ
అక్షరాలా ఈ అక్షరాల జలపాతంలో తడుపుకుని తృష్ణ తీర్చుకుంటూ
నేనిక్కడ ఎన్నాళ్ళుగా నయినా సరే పడి ఉంటూనే ఉంటాను….

అటూ ఇటూ ఒకేసారి మండుతూన్న సూర్యునిలా
ఉదయం సాయంత్రం, పగలూ రాత్రీ అనే ప్రాపంచిక సంగతులను వేటినీ పట్టించుకోకుండా
ఇలా…..

నా వచన కవితలు (22)

శోధన

ఎలా చెప్పాలన్నది సమస్య
ఎప్పటికప్పుడు ఆరంభం ఒక అవస్థ
మబ్బు లోంచి తెగిపడే మొట్టమొదటి వాన చినుకులా
మొదటి మాట విడిపడ్డ దాకా
ఆరంభం ఒక పెద్ద అవస్థ

నీళ్ళ మీదుగా
నీళ్ళ చెలమల మీదుగా
ఇసుక తిన్నెల మీదుగా
సరివి చెట్ల కదలని తలల నీలం మీదుగా
నదికి అవతలి వైపు అందించే అనంతమైన జవాబవసంలేని ప్రశ్నలోకి
నిరీక్షణంగా నిర్వీక్షణంగా పదేపదే వీక్షించడమూ ఒక అవస్థ

రాతిరవడాన్ని శాసిస్తున్నట్లుగా వుండే చుక్కల వెలుతురులో
ఎన్నెన్ని సారులో చీకటిగా నిద్ర లేవడం
నుదుటిపై పట్టివున్న చిరు చెమట బిందువులను
కుంకుమ నీడలలోనికి రాకుండా నిలపుదల చేయడం
కళ్ళు తెరిచేలోపల ఒక సమావేశపు సమీకరణాన్ని
సంగ్రహించుకు చూసుకుని ఆసారికదోలా సంతృప్తి చెందడం

ముక్కు బేసరిపై పడి ముక్కలయ్యే వెన్నెల కిరణం
పదే పదే అదే అగాధంలోకి తరుముకుంటూ తీసుకువెళ్ళే అవే అవే ఆనవాళ్ళూ
ఎన్నాళ్ళగానో తపించి వేధించినా సందేహానికి ఎప్పుడూ దొరకనట్టుండే
సమాధానాల ఉఛ్ఛ్వాస నిఛ్ఛ్వాసాలూ
కన్నీటికి అంతం లేదన్నది తెలిపేటందుకే అన్నట్లుండే
దేహాగ్ని శకలాల సమూహాలూ వాటి నమూనాలూ

ఎవరో వదిలేసి వెళ్ళిపోయిన జ్ఞాపకాలను ధరించి భరిస్తున్నట్లుండే గుండెకి
నిండుగా ఒక్క సారన్నా మోహాన్ని మొహానికి పులుముకుని కనుపించలేని శరీరాన్ని హద్దుగా పెట్టుకుని

ఎందుకని
ఎక్కడికని
ఎన్నాళ్ళని
ఈ శోధన??

 

నా వచన కవితలు (21)

ఇంకా….

నువ్వు ఎంగిలి చేసి వదిలేసిన జ్ఞాపకం ఇంకా ఆ చెట్టు కొమ్మకు వేలాడుతూనే వుంది.

గుడి మెట్ల మీద రాలి పడున్న ఎక్కడిదో తెలియని ఒక మందార ఆకు
గాలికి తచ్చాడుతూ బెరుకుబెరుగ్గా వచ్చి నీ పాదాన్ని తాకి ఇంకా మూర్ఛిల్లుతూనే వుంది.

దారంతా మాటనేది లేకుండా మౌనంగా నడిచి
చివరన మలుపు తిరిగే చోట మోమోటంగానైనా నువ్వొదిలేసిన చిరుచూపు నవ్వు
ఇంకా ముళ్ళపొదల కావల మొగిలిరేకులా పరిమళిస్తూనే వుంది.

నది వొడ్డున నీటి చలమల కావల సరివి చెట్ల నీడల్లో
మళ్ళీ దొరికేవి కావని తెలిసీ నేను పోగొట్టుకుంటూ పోయిన సుదీర్ఘ సాయంకాలాలు
చీకటి పడే వేళకు వాటికవే ఇంకా ఏదో తెలియని విషాదాన్ని మౌనంగా మాటేసుకుంటున్నాయి.

ఒకానొక తమోహ రణ క్షణంలో తేలికగా వదిలేసుకున్న ఇన్నిటి జ్ఞాపకాలు
వలస వెళ్ళి తిరిగి రావడం మరిచి పోయిన పక్షుల్లా
కనుపించీ కనుపించకుండా ఇంకా నీ పాటను వ్యధాలాపంగా ఆలపిస్తూనే ఉన్నాయి.

 

ధర్మం: నా వచన కవితలు (20)

ధర్మం

అర్ధనారీశ్వరునికి మల్లే
అవధులు లేని ఆనందాన్నే కాదు
అంతులేని దుఃఖాన్నీ
కలిగించేదిలా ఉండాలి అందం
అప్పుడే అది సౌందర్యం
సౌందర్యపు తాకిడి తగిలిన
సరయిన మనిషెవ్వడూ
చివరికి మౌని కాకుండా మిగలడు.

ఆనందంలో పెద్దగా జరిగేదేమీ ఉండదు
శోకంలోనే కదా మాట
తన్ను తాను గాయాలతో నిండిన సైనికుని శరీరంలా
అలంకరించుకోజూస్తుంది.

నీకంటే గొప్పవనుకుంటాను
నిన్ను గురించి నేను ఎదురుజూసిన సందర్భాలు
మాయ తొలగిపోయినట్లుగా
మోహం కరిగిపోతే
కనీసం కన్నీరు కార్చేందుకు
ఒక దుఃఖ భరిత క్షణమైనా
ఇప్పుడు మరి కనిపించ దెందుకు?

ఎంతకీ రాని నిన్ను
ఎప్పటికైనా రావా అనుకుంటూ
కూర్చోవడం ఎంతగానో గుర్తు
వచ్చినట్లే వచ్చి
అంతలోనే అదృశ్యమైపోయే నిన్ను
ఎప్పటికైనా పట్టుకోలేనా అనుకోవడమూ
అంతగానే గుర్తు.

ఎంతచేసినా
నీ సౌందర్యాత్మకు దీపశిఖలాంటి జ్ఞాపకంలా
వెలుగుతూండడమే నా ధర్మం
నిరంతరంగా….
నిర్మోహంగా….

 

ఇలా…: నా వచన కవితలు (19)

ఇలా…

ఒక సందర్భాన్ని ఊహించుకుని నేనుంటాను
రాత్రి వెన్నెలలో విరుచుకుంటూ పరుచుకుంటూన్న
సన్నిహితాలైన సంగతులను చెప్పుకుంటుంటాను

మెరుస్తూ నది పక్కనుండి ప్రవహిస్తూ ఉంటుంది
నిశ్శబ్దం ఒక సమ్మోహకరమైన పడకగదిలా
ముస్తాబు చేసుకుని ఉంటుంది
నేను కలవరంగా  కల వరంగా ఉంటాను
పాట పరుగెట్టాలని చూస్తూ ఉంటుంది
పమిట చెంగు రెపరెపలు వివిధాలైన రంగులలో
కంటి రెప్పలను సవర్ణీకృతం చేస్తూంటాయి

రెమ్మ కదలదు
రెప్ప వాలదు
రాత్రింకా సగం కూడా గడవదు
చేతిలోని కలం చెప్పాల్సిన కథ
ఇంకా మొదలే అవదు
ఇదంతా ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానమూ దొరకదు

అకస్మాత్తుగా ఇద్దరు ప్రేమికులు
ఒక పడవలో పయనిస్తూ కనబడతారు
అతడు మాట్లాడడు
ఆమే మాట్లాడదు

రివ్వున వచ్చి వాలిన ఒక గాలిపటం లాంటి జ్ఞాపకానికి
అటువైపునుంచి ఆమె నవ్వు
ఇటువైపునుంచి ఇతని శోకం
ఈ రెండే కనిపించీ కనిపించకుండా
ఎప్పుడూ కలవర పెడుతూంటాయి

ఎక్కడిదాకా? అన్న ప్రశ్నకు
ఆగిన దాకా సమాధానం దొరకదు.

దూరం: నా వచన కవితలు (18)

దూరం

మాట కొక సారి వెన్నెలై మెరియడం
మయూరానికి పింఛంలా నీకు సహజ నైజం
పూట కొక సారి మోహంలో కొట్టుకుపోవడం
పుట్టుకతోనే నాకు అబ్బిన నా నైజం

కళ్ళు తెరిచేప్పటికే
కిటికీకి దగ్గరగా వచ్చి ఉంటావు నువ్వు
మాట వినని ముంగురులను గాలికి అప్పగించి
మౌనంగా చోద్యం చూస్తూ ఉంటావు

తట్టుకోలేని పొద్దు తమకంతో
ఒకింత సేపు తూర్పుని వదిలి
నీ వదనంపై విచ్చుకుంటున్నట్లుగా ఉంటుంది

నీ పెదువుల పై అకస్మాత్తుగా
ప్రత్యక్షమైన చిరునవ్వుతో
అనుమతి దొరికినట్లుగా అయి
సూర్యుడు మెల్లమెల్లగా వెలుపలికొచ్చి ఉదయిస్తాడు

తపస్సు లాంటి సందిగ్ధావేశం
నన్ను నీ దిశగా తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది
నేను నిన్ని చేరే లోపల
తెలియకూడని తాపాన్ని చీర కుచ్చిళ్ళలో సరిచేసుకుంటూ
నువ్వు అక్కడనుంచి విసురుగా వెళ్ళిపోతావు

ఖాళీగా మిగిలిన కిటికీ కి
పాటను అలంకరించి
నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను.

కల : నా వచన కవితలు (17)

కల

విరి తల్పం లాంటి నీ చిరునవ్వుల ఒడిలో
చిక్కి సొక్కి ఉన్న కళ్ళతో మత్తెక్కి ఉన్న వేళ
తరుణివైన నీకు అరణపు కానుకలా
నన్ను నేను అర్పించుకో జూశాను అప్పుడెప్పుడో…

అది ఒక కల
వెన్నెలలో పరుగెత్తడం మరిచిపోయి నిలుచున్న జింకలా
హటాత్తుగా జారి పడ్డట్లున్న నక్షత్రాల్లాంటి కళ్ళతో
నా వైపు చూసిన నిన్ను
మొదటిసారి మోసుకొచ్చింది ఆ కల…

మూర్ఛిల్లడం పూర్తిగా గుర్తుంది
మౌనం దాల్చడం కాస్తకాస్తగా గుర్తుంది…

పయ్యెదను పానుపులా చేయడం పూర్తిగా గుర్తుంది
పలుకలేని భావాలకు పవ్వళింపులో పాటగా
ప్రాయశ్చిత్తం చేసుకోవడం కాస్తకాస్తగా గుర్తుంది…

మాటేసి ఉన్న వేటగాడిలా మాటకు కాని నాపై
మోహం చెల్లడం పూర్తిగా గుర్తుంది
వేటుకు తెగిపడ్డ కముజు పిట్టలా
కల చెదరడం కాస్తకాస్తగా గుర్తుంది.

పాట: నా వచన కవితలు (16)

పాట

నిన్ను పాటగా పాడుకొనేందుకే
నేను ప్రేమికుడినవుతూంటాను
తెచ్చి పెట్టుకున్న విరహాలతో
ఎప్పటికప్పుడు తప్పతడుగులు వేస్తూ సాగే ప్రేమలోకి
అదే పనిగా అడుగెడుతూంటాను

ప్రేమ  కంటే ముండు పాటకు బందీ నవడం
నా చేతలలో జరిగిన తప్పిదం కాదు
ఒక స్వప్నం లాంటి సందర్భాన్ని రాజేసుకుని
రోజుల తరబడిగా సుదీర్ఘ సమ్మోహానికి డస్సి పడిపోవడం
నేను నీకు చెప్పుకుంటే తీరే సందేహమూ కాదు

నాటకం మొదలవడానికి సూచనగా
లేచే తెర ముందు నీవుంటావు
వెనక వేషధారినై నేనుంటాను
పురూరవునిలానో పురుకుత్సుడిలానో
రంగస్థలం మీద యెన్నెన్నో యాతనలను తలకెత్తుకుని
ప్రేమను ప్రజ్వరిల్ల జేస్తుంటాను

తెర దించే సమయానికి
ముందు నీవెలా ఉన్నా
వెనుక నేను నేనులా మిగలను
ఒక మోహాన్ని కడిగేయడం
ఒక వేషాన్ని తుడిచేయడమంత తేలిక కాదని
తెలుస్తూనే ఉంటుంది

అయినా పాటలోని పరవశం
పరిపరి విధాలుగా నన్ను నీ నుంచి దూరం చేస్తూనే ఉంటుంది.
ఇప్పటికే శతాధికంగా క్షతాలైన మోహాన్ని
పాటకొకసారి మచ్చిక చేసుకుంటూ
మరో వేషానికి మొహాన్ని తయారుచేసుకుంటుంటాను.