తెలుగు మాట, పాట, పద్యం (6)

అచ్చ తెనుగు పాట

పండుగ రోజులలో తెలుగిళ్ళలో స్త్రీలు నోములు నోయడం అన్నది మన సంస్కృతీ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగం. శ్రావణ మాసంలో ప్రతి తెలుగిల్లు శ్రావణ మాసపు నోముల ఫలితంగా కళకళలాడుతూ వుండడం నేటికీ చూస్తూనే వుంటాం! శ్రావణమాసంలో నోముల  తరువాత, దీపావళి మొదలు కార్తీక శుధ్ధ పౌర్ణమి వరకూ పూర్వం తెలుగిళ్ళలో బాలికలు నోచే ఒక నోము (‘మూగనోము’ అని పేరు) చివర రోజున, గౌరీదేవికి పూజ చేసిన తరువాత, ఒక పాట పాడేవాళ్ళని స్వర్గీయ ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, వారు రచించిన ‘ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి’ (ప్రథమ ముద్రణ: 1951) పుస్తకంలో ఒక అచ్చ తెలుగు పాటను సూచించి, ఆ పాట పూర్తి పాఠాన్ని కూడా వ్రాసారు. ఆ పాట పేరు ‘మోచేటి పద్మం’. ఆ పాట పేరుమీదుగానే ఆ నోముకి కూడా ‘మోచేటి పద్మం’ నోము అని ఇంకొక పేరు గూడా వచ్చిందని చెప్పారు. ఆ పాట పూర్తి పాఠం ఇది:

మోచేటి పద్మమ్ము పట్టేటి వేళ
మొగ్గల్లు తామర్లు ముడిగేటి వేళ
ఆవుల్లు లేగల్లు వచ్చేటి వేళ
ఆంబోతు రంకెల్లు వేసేటి వేళ

సందేళ దీపమ్ము పెట్టేటి వేళ
చాకింటి మడతల్లు తెచ్చేటి వేళ
బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ
కోడల్లు పసుపుల్లు కొట్టేటి వేళ

కూతుళ్ళు గుండుగిన్నెల్ల కుడిచేటి వేళ
ముద్ద మొగము అద్దాన్ని బోలు
ముద్దరాలి మొగము మోచేటి పద్మమ్ముబోలు
పద్మమ్ము నోచిన చానకు పదివేల ఐదవతనము.

మొదలు నుంచి చివరిదాకా, అచ్చమైన తెలుగుదనంతో గుబాళిస్తుండే పాట ఇది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు గదా! అయితే, ఈ పాటలో ఒకింత ఇబ్బందికరమైన సంగతి, ‘మేచేటి’ అనే మాటకు అర్ధం ఏమిటి? అన్నది. ఈ మాటకు లక్ష్మీరంజనంగారు సూచించిన అర్ధం – ‘మొగుచు’ అంటే ముకుళించు పద్మమేమో! అని. వారు సూచించిన ఈ అర్ధంతో, ఈ నోమును ‘ముకుళించే పద్మం’ నోము అనుకోవడానికి కూడా సాధ్యమౌతుంది. ఈ నోము ‘మూగ నోము’ కావడం వల్లా, అంటే ఈ నోము నోచే బాలిక, నోము ఆచరించే రోజులలో సాయంత్రం ఇరుగుపొరుగు పేరంటాండ్రను బొట్టుపెట్టి పిలవడానికి బయలుదేరిన దగ్గరనుంచి, ఆ నాటి రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూసే దాకా, ఎవరెంతగా పరియాచకాలాడి ప్రేరేపించినా మాట్లాడక ఊరకుండాడాలే తప్ప పెదవి విప్పకూడదనే నియమం వుంది కాబట్టి, ఈ నోముకు ‘ముకుళించే పద్మం’ అనే పేరు సాధ్యమే అనిపిస్తుంది; ‘పద్మం’ బాలిక నోరు, ‘ముకుళించు’ అంటే పెదవులు విప్పకుండా వుండేట్లు చేసే నోము కాబట్టి!

ఇక, ఈ పాట నిండా, నాటి పల్లెటూళ్ళ సంధ్యా సమయపు శోభ పరుచుకుని కనిపిస్తుంది. ఈ పాట మొత్తంలో అర్ధంగానట్లు అనిపించి ఇబ్బంది పెట్టే పదాలు రెండే రెండు. అవి, ‘మోచేటి’, ‘బీరాయి’ అనేవి. వీటిల్లో ,మోచేటి’ కి అర్ధం ముందే వివరించ బడింది గనుక, ఇప్పుడు , ‘బీరాయి’ అన్న పదం సంగతి చూడాలి!

‘బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ’ అని చరణం! ఇది చదివిన వెంటనే ఊహ సహజంగానే పల్లెటూరి ఇళ్ళ ముంగిళ్ళలోనో లేక పెరడులలోనో సర్వ సాధారణంగా కనుపించే ‘బీర చెట్టు’ మీదకు పోతుంది. అయితే, ‘బీర చెట్టు’ పూవులు విడవడానికి ‘సంధ్యా సమయాని’ కి ఏమిటి సంబంధం? అన్నది ప్రశ్న. అదీగాక, బీర (చెట్టు) కు ‘బీరాయి (చెట్టు)’ అని నామాంతరం వున్నట్లుగా కనబడదు. ఈ రెండూ కాకపోతే, మరి ఈ మాటకు
ఇక్కడ అర్ధం ఏమై వుంటుంది?

ప్రస్తుతానికి అదలా వుంచి, ఒక్కసారి పూజ్యులు డాక్టర్ బిరుదురాజు రామరాజు గారి ‘తెలుగు జానపదగేయ సాహిత్యం’ (ప్రథమ ముద్రణ: 1958) పుస్తకంలో చూస్తే, ఈ ‘మోచేటి పద్మం’ నోము శ్రీ నేదునూరి గంగాధరం గారి పాఠంలో ‘మోచేతి పెద్దమ్మ’ నోముగా మారి, ఈ పాట పాఠం కూడా బాగా విస్త్రుతమై కనిపిస్తుంది. శ్రీ గంగాధరంగారి పాఠం ఇది:

మోచేటి పెద్దమ్మ నోచేటి వేళ – మొగ్గల్లు తామరలు పూసేటివేళ
బీరాయి పువ్వులు పూసేటి వేళ – బిందెలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
గుమ్మడి పువ్వులు పూసేటివేళ – గుండిగలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
కాకర పువ్వులు పూసేటివేళ – కడవలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
ఆనబాయ పూవులు పూసేటివేళ – అటికలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
చిక్కుడు పువ్వులు పూసేటివేళ – చిప్పలతో గంధాలు తీసేటివేళ
ఆవులు దూడలు వచ్చేటివేళ – ఆంబోతు రంకెలు వేసేటివేళ
సందిటి దీపాలు పెట్టేటివేళ – చాకింటి మడతలు దెచ్చేటివేళ
మరదళ్ళు మరి జూద మాడేటివేళ – కూతుళ్ళు గుండిగలు దింపేటివేళ
కోడళ్ళు కొటుపసుపు కొట్టేటివేళ – చెల్లెల్లు చేమంతులు ముడిచేటివేళ
వదినల్లు వంటిల్లు చేసేటివేళ -
ముద్దుల మొగము అద్దానబోలు – తన ముఖము తామర పద్మానబోలు.

శ్రీ నేదునూరి గంగాధరం గారు ఇచ్చిన పాఠాన్ని బట్టి చూస్తే, ‘బీరాయి’ బీర చెట్టునే సూచిస్తుంది. అయితే, ఈ పాఠం లక్ష్మీరంజనంగారి పాఠంలోలా ‘సంధ్య’ వర్ణనను సూచించదు. తెలుగింటి వాతావరణం మాత్రం కళ్ళకు కట్టినట్లు వుంటుంది. కానీ, లక్ష్మీరంజనంగారి పాఠంతో పోలిస్తే మాత్రం, ఈ పాట పాఠం సందర్భ శుధ్ధి లేనట్లుగా, అంటే ఒక సందర్భానికి సంబంధించినది కాకుండా వున్నట్లుగా అనిపిస్తుంది. పాట పేరులోకూడా ఈ అసందర్భం కనిపిస్తుంది, ‘మోచేతి పెద్దమ్మ’ ఏమిటన్నది అంతు చిక్కేదిగా కనుపించదు.

ఇప్పుడు, లక్ష్మీరంజనంగారు ఇచ్చిన పాట పాఠంలోని ‘బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ’ దగ్గరకొస్తే, ‘బీరాయి’ అన్న పదం ‘బీర చెట్టు’ ను సూచించేదిగానే అనుకుంటే, ‘బీర చెట్టు పూవులను విడిచేటి వేళ’ అన్న అర్ధం ఆ చరణానికి వస్తుంది. ఇందులో ఇమిడి వున్న అర్ధం ఏమిటి? అన్నది మాత్రం ఇప్పటిదాకా ఎంతగా శోధించినా నాకు పట్టుబడలేదు. బీర చెట్టు వెశేషంగా సాయంత్రం వేళల పూవులను రాలుస్తుందా? అన్నది నాకున్న సందేహం! రాలుస్తుంది గనకనే ఆ పాటలో చరణం అలా వుందని నేను నమ్ముతున్నాను! ఇది సరైనదో కాదో తెలిసినవాళ్ళు చెప్పాలి!

లేని ఎంకి – ఉన్న నాయుడుబావ (8)

చెంద్రుడికి నా ఎంకి చుట్టమై ఎళిపోతె…

చెంద్రుడికి నా ఎంకి   చుట్టమై ఎళిపోతె
చుక్కలన్నీ చేరి   పక్కుమని నవ్వాయి

ఎంకి బావను నేను   ఎందుకా నవ్వంటి
ఎక్కిరింతగ చూసి   ఎగతాళి చేశాయి

చెప్పవే నా ఎంకి   చెప్పి ఎళ్ళవె చాలు
చీకట్ల నన్నుంచ   చెల్లుబాటా నీకు?

చెంద్రుడికి నా ఎంకి   చుట్టమై ఎళిపోతె
మత్తు చూపుల మల్లి   మగతగా చూసింది

ఎంకి బావను నేను  ఏమిటా చూపంటి
జాలి జాలిగ చూసి   జల జలా రాలింది

చెప్పవే నా ఎంకి   చెప్పి ఎళ్ళవె చాలు
కన్నీట నను ముంచ   కట్టుబాటా నీకు?

లేని ఎంకి – ఉన్న నాయుడుబావ (7)

ఎంకెళ్ళి పోయింది ఎలుగెళ్ళి పోయింది…

ఎంకెళ్ళి పోయింది   ఎలుగెళ్ళి పోయింది
ఎంకెతో పాటె నా   మనసెళ్ళి పోయింది.

రేయి కంటే పవలు   బరువుగా గడిచింది
కంటి మీదా కునుకు    లేకుండ పోయింది

కలలన్ని కన్నీటి   చెరువుగా మిగిలింది
బతుకంత బరువుగా   బండలై పోయింది

చెట్టెండి పోయింది   పుట్టెండి పోయింది
ఎంకి నవ్వూ లేక   ఏరెండి పోయింది

ఎంకెళ్ళి పోయింది   ఎలుగెళ్ళి పోయింది
ఎంకెతో పాటె నా   మనసెళ్ళి పోయింది.

లేని ఎంకి – ఉన్న నాయుడుబావ (6)

ఎన్నెన్నొ రాత్రులూ ఒంటరిగ గడిచీ….

ఎన్నెన్నొ రాత్రులూ  ఒంటరిగ గడిచీ
ఎంకి తాకిన ఒళ్ళు  వెలవెలా పోయింది
బలమింకి పోయింది  సొగసెండి పోయింది
చెట్టుచేమతొ గలిసి   చిత్రంగ మిగిలింది

ఎండుటాకూ లాగ   ఎగిరెగిరి పడుతోంది
గట్టుపై చేపలా   కొట్టుకొంటూ ఉంది

మట్టి బీడూ లాగ   మసక చీకటి లాగ
చింకి పీలిక లాగ   చచ్చు పీనుగ లాగ

మలి జనమ కైన   ఎంకి నన్నంటవే
చిగురు తొడిగీ నీకు   సిందూర మెడతాను

ఎన్నెన్నొ రాత్రులూ   ఒంటరిగ గడిచీ
ఎంకి తాకిన ఒళ్ళు   వెలవెలా పోయింది
బలమింకి పోయింది  సొగసెండి పోయింది
చెట్టుచేమతొ గలిసి   చిత్రంగ మిగిలింది

లేని ఎంకి – ఉన్న నాయుడుబావ (5)

గాలి దేవుని కెందుకో జాలైన లేదు….

గాలి దేవుని కెందుకో  జాలైన లేదు
ఒంటరిగ నేవిడుచు   నిట్టూర్పు గొని పోడు

నింగి నంటీ మబ్బు   నిదిర పోతున్నాది
పైరు నాలిక సాచి   ఎదురు చూస్తున్నాది

చీకటింటా చిన్న   దీపమైనా లేదు
ఎంకి చూపూ లేదు   వెన్నెలా లేదు

మళ్ళి తా నొస్తదా   మనసు మళ్ళిస్తదా
మన్ను మునుపటిలాగ   మళ్ళి చిగురిస్తదా

గాలి దేవుని కెందుకో   జాలైన లేదు
ఒంటరిగ నేవిడుచు   నిట్టూర్పు గొని పోడు

లేని ఎంకి – ఉన్న నాయుడుబావ (4)

ఎంకి వెన్నెల పైట ఎగిరి పడితే చాలు….

ఎంకి వెన్నెల పైట  ఎగిరి పడితే చాలు
ఎండలో వెన్నలా   గుండె కరుగూతాది
ఎంకి సన్నని నడుము  చేతనాడితె చాలు
ఎర్రెక్కి యవ్వనం   చిందు తొక్కూతాది.

ఒక్క చూపే చాలు  ఎంకి విసిరిందంటె
ఎండ సూరీడైన  సందె కబురంపాల

ఎంకి నవ్విందంటె  ఎకసెక్క మాడుతూ
ఎన్నెన్నొ జన్మలా  ఏహ్యాలు కరగాల

అట్టాంటి నా ఎంకి   ఊసునెట్టా మరిచి
ఊర్కుండి పోనూ   ఉలిపి కట్టెగ నేను

ఎంకి వెన్నెల పైట   ఎగిరి పడితే చాలు
ఎండలో వెన్నలా   గుండె కరుగూతాది
ఎంకి సన్నని నడుము   చేతనాడితె చాలు
ఎర్రెక్కి యవ్వనం   చిందు తొక్కూతాది.

లేని ఎంకి – ఉన్న నాయుడుబావ (3)

సందెటేళా ఎంకి సిగ్గుపడి నుంచుంటె…

సందెటేళా ఎంకి  సిగ్గుపడి నుంచుంటె
సన్నజాజీ నవ్వి  సిగ నెక్కి కూర్చుంది
కౌగిట్లొ నా ఎంకి  మొగ్గలౌతా వుంటె
చుక్కల్లొ చంద్రుడూ  బిక్క మొగమేశాడు

మరుపేల రాదు నా   మొండి మనసుకు నేడు
మురిపేలు చిందించి   మాయమైనది ఎంకి.

గల గలా నవ్వితే  గంగ ఎల్లువ లాగ
గౌరమ్మ వాకిట్లో  నిలిచి నట్లుండేది
పైటకొం గిసిరితే  పైరగాలికి ఎంకి
పచ్చనీ చేలన్ని  పిలిచినట్లుండేది

మరుపేల రాదు నా   మొండి మనసుకు నేడు
మురిపించి మరపించి   మాయమైనది ఎంకి.


లేని ఎంకి – ఉన్న నాయుడుబావ (2)

అలికిడైతే చాలు అన్ని వైపుల నుంచి…

అలికిడైతే చాలు   అన్ని వైపుల నుంచి
ఎంకి ఊసే మదిని   మెదిలి మెదిలీ చంపు.

గాలి లోనా ఎంకి    ధూళి లోనా ఎంకి
దీపమును చుట్టినా   దివ్య మంగళ ఎంకి.

వెన్నలోనా ఎంకి    జున్ను లోనా ఎంకి
పాలమీగడ కన్న   చల్లనైనా ఎంకి.

పూల లోనా ఎంకి    చేల లోనా ఎంకి
వెన్నెల్లొ మెరిసినా    ఏటినీరూ ఎంకి.

అలికిడైతే చాలు   అన్ని వైపుల నుంచి
ఎంకి ఊసే మదిని   మెదిలి మెదిలీ చంపు.

లేని ఎంకి – ఉన్న నాయుడుబావ (1)

ప్రవేశిక

ఎంకి పాటలను గురించి తెలియని, కనీసం వినని, తెలుగు పాఠకుడుండడు అంటే అతిశయోక్తి కాదు.  ఎంకి తెలుగుదనానికి, పల్లెదనానికీ ప్రతీక.  తెనుగింటి ముంగిట సిరులు పండించి సౌభాగ్యాన్ని నట్టింట నర్తింపజేసిన వనలక్ష్మి లాంటిది ఎంకి.  ఎంకి సున్నితత్వానికి, సహజత్వానికి ఏమాత్రం బాధ కలగకుండా అక్షర రూపాన్నిచ్చి గౌరవించిన మహానుభావుడు కీ.శే.నండూరి సుబ్బారావు గారు. అయితే, అందుకు కృతజ్ఞతగానేమో నన్నట్లు ఎంకి ఆయనతో పాటే తెనుగింటిని విడిచి వెళ్ళిపోయిందేమో ననిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు. నిదర్శనంగా ఎంకి ఎడబాటుతో ఒంటరివాడై క్షోభిస్తూన్న నాయుడుబావ హృదయానికి ప్రతిబింబాల్లా నేడు అతివృష్టి అనావృష్టి దోషాల ఫలితంగానూ, ఇంకా ఇతరత్రా కారణాల మూలంగానూ కరువుకాటకాల్తో కొట్టుమిట్టాడుతూన్న కొన్ని ఆంధ్ర దేశపు పల్లెటూళ్ళ ఆనవాళ్ళు ఈ నిజాన్నిచెప్పకనే చెబుతాయి.  ఆ బాధనుంచే ఈ పాటలు పుట్టాయి.  ఒంటరివాడై దిక్కుతోచక ఈ పాటల్ని పాడుకుంటున్న నాయుడుబావ హృదయవేదన నేటి ఏ పల్లెటూరి నాడిని మీటినా వినిపిస్తుంది, కనిపిస్తుంది.

***

వెన్నలో పుట్టింది  వెన్నెల్లో పెరిగింది…

వెన్నలో పుట్టింది   వెన్నెల్లో పెరిగింది
ఎంకి నా గుండెలో  వెలుగుల్ని నింపింది
గంగి గోవూ లాంటి  గుణవంతురా లెంకి
కన్నెర్ర జేసింది   కత మారి పోయింది

మబ్బు తునకా విడదు   మసక చీకటి పోదు
కుంటి దీపపు వెలుగు   కంటి నిండా పడదు

గుండె నిండా బరువు   గొంతు పిగిలీ పాట
కన్నీళ్ళ మధ్య నా   ఎంకి ఏదను మాట

కునుకు పడనీ రేయి   కలత వీడని పవలు
ఎందుకే నా ఎంకి   ఎందుకీ బతు కసలు

వెన్నలో పుట్టింది    వెన్నెల్లో పెరిగింది
ఎంకి నా గుండెలో   వెలుగుల్ని నింపింది
గంగి గోవూ లాంటి   గుణవంతురా లెంకి
కన్నెర్ర జేసింది   కత మారి పోయింది.