హొయసలుల దేవాలయం (3)
హొయసలుల ఆలయ నిర్మాణ శైలిని పట్టి చూపించేవి మరో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటిలో మొదటిది – ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయాన్ని ‘జగతి ‘ అనే ఒక ఎత్తైన నక్షత్రాకారపు పీఠం పైన నిర్మించడం అనేది. ‘జగతి’ వలన వొనగూడే మరో ముఖ్యమైన ఉపయోగం, ఇది ఆలయం చుట్టూ ప్రదక్షిణ పథంలా కూడా ఉపయోగపడుతుంది. ‘జగతి’ పైకి వెళ్ళడానికి మెట్లు ఉండడం, మెట్లకు ఇరువైపులా ద్వారపాలకులు ఉండడం, వారి వసించి ఉండడానికి అన్నట్లుగా చిన్నచిన్న గుడులుండడం, ముందు వైపు నుంచే కాక, కుడి ఎడమ పక్కల నుంచి కూడా మెట్ల మీదుగా జగతి పైకి వెళ్ళ గలిగే సౌకర్యాన్ని కల్పించడం, ఇలా ఉన్న ప్రతి చోటా ద్వారపాలకులు, వారికోసం చిన్న చిన్న గుడులూ ఉండడం – ఇలా చేసిన నిర్మాణాలు మొత్తం కలిసి ప్రధాన దేవాలయానికి ఒక నిండైన రూపాన్ని ఇవ్వడం హొయసలుల కాలంలో నిర్మితాలయిన దేవాలయాలలో చూడవచ్చు.
హొయసలుల కాలంలో నిర్మించబడిన ఆలయాలను చూసిన ఎవరికైనా, హొయసల శిల్పులకు నక్షత్రాకృతి పై ఎంతగానో మక్కువ అన్నది అర్ధమవుతుంది. ఆలయంలో ఏ మూలను చూసినా నక్షత్రాకృతి ఏదో రూపంలో దర్శనమిస్తుంది. గోపురాన్ని కూడా నక్షత్రాకృతిలో మలచడాన్ని చూస్తాం.
దేవాలయం మొదలు నుంచి శిఖరం దాకా నక్షత్రాకృతిలోనే శిల్పాన్ని కొనసాగించి దేవాలయం మొత్తానికి ఒక అందమైన రూపాన్ని ఇవ్వడంలో హొయసల శిల్పులు బహుశః వారు నిర్మించిన దేవాలయాలు కూడ భూమి మీద నక్షత్రాల లాగా కలకాలం మెరుస్తూ ఉండిపోవాలని ఆశించారేమో అనిపిస్తుంది.





















