స్వగతాలు (1) – ఒక మాట!

ఒక మాట!

‘ఒక్క సారే తప్ప, ఇంకొక సారి ఒక్క క్షణమాత్ర కాలంకూడా వుండడానికి వీలు లేనటువంటి ఈ జీవితం ఎంత మాత్రం విలువైనది?’ అన్నది ఒక ప్రశ్న.
ఈ ప్రశ్న అర్ధవంతమైనది అవునా కాదా అన్నది తరువాతి మాట.
మొదట ఒక మనిషి జీవితం తయారు కావడానికి, అంతకు ముందు చాలా మంది మనుషుల జీవితాలు గతించి వుండాలన్నది ఒక అత్యంత విలువైన ఆలోచన.

తెలుసుకోవాలన్న తపన వుంటూనే వుంటుంది.
అయితే ‘దేనిని?’ అన్నదానిని దీనికి సంధించినప్పుడు దారులు మారుతూండడం చూస్తాం.
‘ఈశా వాస్యం ఇదం సర్వం’ (ఈ జగత్తంతా ఈశ్వర మయం!) ఇది ఒక దారి.
‘తత్త్వం అసి’ (అదే నీవై వున్నావు!) ఇదీ ఆదారి లోనిదే!
Cognito; ergo sum^ (I think; therefore I am – నేను అలోచిస్తాను; కనుకనే నేను!) ఇది ఇంకొక దారి…
ఇలాంటివే ఇంకా ఎన్నో దారులు!

అంతు తేలాలంటే అణువణువునీ పరీక్షించడమే మార్గమని
సైన్సు శరీరాన్ని ముక్కలుగా చేసి చూసినట్లుగానే జీవితాన్నీ ముక్కలుగా చేసి చూడడం నేర్చుకుంది.

రోజు రోజుకూ జీవితంలోని కొన్నైనా సంగతులు మారుతూ వుంటాయి.
చాలా సంగతులు ఏ మార్పునూ వహించకుండా అలానే వుంటూ కూడా వుంటాయి.
మారుతూన్న ప్రపంచం ఒక్కసారిగా అర్ధ రహితంగా కనపడకుండా వుండాలంటే
మారుతూన్న సంగతులతో పాటు
మార్పుకు లొంగని పాత సంగతులనూ విధిగా వెంట తెచ్చుకోవాలి.

జీవితం ఒక్క సారిగా అర్ధరహితం కాకుండా వుండాలంటే
మనలో నిక్షిప్తమైవున్న వేలవేల జీవితాల విశ్వాసాలను ముందు గౌరవించడం నేర్చుకోవాలి!

(^ Descartes, Rene (1596-1650) – French philosopher, mathematician and physicist, చెప్పిన ప్రసిధ్ధమైన మాట!)

 

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (9)

తండ్రి నోట ఉద్దేశ్యపూర్వకంగా వెలువడని మాటలయినా సరే అర్ధంలేనివి కావడానికి వీల్లేదన్న తలంపుతో నచికేతుడు తనకు తానుగా మృత్యువుకు సమర్పించుకోవడానికి సిధ్ధమై యముని సదనము ముందు నిలుస్తాడు.  మూడు రోజులు ఓపికగా వేచి ఉన్న తరువాత ప్రత్యక్షమైన యముడు, నచికేతుని సంకల్పానికి ముచ్చటపడి ఇవ్వడానికి అంగీకరించిన మూడు వరాలకు ప్రతిగా ఆత్మజ్ఞానం ప్రసాదించమంటాడు నచికేతుడు. అందుకు అంగీకరించి, సందేహాలను అడుగమన్న యముడిని నచికేతుడు “స్వామీ! మనుష్యుడు మర్త్యుడు. అయితే కొందరు చెబుతారూ మృత్యువు అంతంకాదని.  ఆత్మ అనేది ఒకటుంటుందనీ, అది అనంతమయిన దనిన్నీ.  కొందరంటారూ, అదంతా ఒట్టి పుక్కిటి పురాణం అనీ. వీటిల్లో ఏది నిజం?” అని ప్రశ్నిస్తాడు.

నచికేతుని ప్రశ్నకు  యముడు చెప్పిన సమాధాన సారాంశం ఇది -  “రెండు రకాల అనుభవాలు ఉంటాయి.  శ్రేయము, ప్రేయము అని వాటి పేళ్ళు. మనుష్యుని ఈ రెండు రకాల అనుభవాలూ, వీటి తాలుకు అనుభూతులూ అల్లుకుని ఉంటాయి. శ్రేయము విముక్తిని ఇచ్చేటువంటిది.  ప్రేయము కట్టిపడవేసేటువంటిది. వివేకులు శ్రేయమనే దారిని ఎన్నుకుంటారు.  అవివేకులు ప్రేయమనే దారిని ఎన్నుకుని అవిద్యలో మగ్గుతుంటారు.  వారికి విముక్తి ఉండదు.  ఆత్మ అంతం, అనంతం రెండూను.  ఆత్మను గురించి ఎరిగినవాడు వైరుధ్యాలను గురించి ఖేదపడడు.  ఆత్మ అనేటువంటిది తెలుసుకోగలిగినటువంటి వస్తువు కాదు.  అది అంతిమ సత్యం.  ఆత్మ జ్ఞానాన్ని పొందడం బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే.  ఆత్మ జ్ఞానాన్ని గురించి ఎరుకపరచడం అత్యుత్తమమైన జ్ఞాన బోధన అవుతుంది. అందులో బోధ పరచువాడు బ్రహ్మమే, బోధ బ్రహ్మమే, బొధపరచబడునదీ బ్రహ్మమే.  ఇది తెలుసుకోవడమే ముక్తి.  ఇది నమ్మకంతో సాధించుకోవలసిందే గాని తర్కానికి అందేటువంటిది కాదు.”

ఇందులో కొత్తగా విశదమయ్యిందేమీ లేదు.  అయినప్పటికీ భారితీయ చిత్తాన్ని ఈ విశదీకరణ విశేషంగా ఆకర్షించి వశపరచుకుంది. అస్పష్టతనూ సంధిగ్దతనూ అలాగేవుంచి మబ్బు విడీవిడకుండునట్లుగా చేసిన ఈ విశదీకరణ సామాన్య ప్రజానీకం ఎవరి చిత్తానికి తోచినట్లుగా వాళ్ళు పరమాత్మ స్వరూపాన్ని ఊహించుకోవడానికి అవసరమైన సౌలభ్యాన్ని కలిగించింది.

చాందోగ్యోపనిషత్తులోని తండ్రీకొడుకుల సంభాషణలో చివరకు ఎదురైన శూన్యాన్ని పరమాత్మగా చెప్పడాన్ని భారతీయ చిత్తం అంగీకరించింది.  అదే శూన్యాన్ని శూన్యంగానే ఒప్పుకోమన్న నాగార్జునుని శూన్యవాదాన్ని, మిగతా సంగతుల మాటెలాఉన్నా, హర్షించలేక పోయింది.

ఈశావాస్య ఉపనిషత్తు పరమాత్మ భావనను అన్నిటినుంచి విడిగా, అత్యంత ఉన్నతంగా నిలబెట్టడాన్ని కూడా భారతీయ చిత్తం అంగీకరించింది.  మిగతా సంగతుల మాటెలాఉన్నా, పరమాత్మను భూమిమీదికి దించి చైతన్యంఉన్న ప్రతి ప్రాణీ మూలశక్తి (పరమాత్మ) తో సమానమే నంటూ పరమాత్మ బహుత్వ భావనను ముందుకు తేబోయిన సాంఖ్యవాదాన్ని అంగీకరించలేకపోయింది.

ఫలితంగా ఈ చింతనలు వెనకకు వెళ్ళిపోయాయి.  ఉపనిషద్వాణి మిగిలింది.  మిగిలుంది.

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (8)

వేదాలు ముఖ్యంగా విధులు.

ముందు భాగాలలో చెప్పుకున్నట్లుగా, భారతీయ తత్త్వ చింతనకు సంబంధించిన ఆదిమూలాలన్నీ ఉపనిషత్తులలో దొరుకుతాయి. ‘ఈశావాస్య మిదం సర్వం’ అంటూ మొదలువుతుంది ఈశావాస్య ఉపనిషత్తు. జగత్తంతా ఈశ్వరమయం, ఈశ్వరుడు పరమ సత్యం, అంతిమ సత్యం అని ఈ మాటలు చెబుతాయి.

సత్యం రెండు రకాలుగా ఉంటుంది.  లౌకికం, పార లౌకిక సత్యం.  రెండవ సత్యం సామాన్యుడి పరిశీలనకు అందదు. యోగాభ్యాసంతో అనుభవంలోకి తెచ్చుకోవచ్చునంటారు యోగులు.

సామాన్యుడి పరిశీలనకు అందని ఈ పరమ సత్యమే జగత్తంతా నిండి ఉందనీ, దాన్ని నమ్మితీరాలనీ నిర్ద్వందంగా చెబుతూ మొదలవుతుంది ఈశావాస్య ఉపనిషత్తు.  ఆదిలోనే ఇది ఒక తప్పటడుగు. సమాధానం కోసం భూమిని వదిలి ఆకాశంలోకి దృష్టి మళ్ళింపు, దారి మళ్ళింపు.  ఈరోజున తీరికగా కూర్చుని చూసే కంటికి ఆరోజుటి దృష్టికి ఉండిన పరిమితులు అర్ధ మెలా అవుతాయని అనుకున్నప్పటికీ, తత్త్వ చింతన పరంగా దీనిని ఒక తప్పటడుగు గానే భావించవలసి ఉంటుంది.

దీనిని సరిచేయడానికి తరువాతి కాలంలో బౌధ్ధం, వైశేషిక, న్యాయ సూత్రాలూ, తర్క శాస్త్రం తగినంత కృషి చేశాయి.  దృష్టిని అకాశాన్నించి భూమికి మళ్ళించినట్లు అనిపించేలా చేశాయి.

సాంఖ్య, వైశేషిక, యోగ, న్యాయ సూత్రాలకు భారతీయ తత్త్వ శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది.  ఈ సూత్రాలు రమారమి క్రీ.పూ.200 – క్రీ.శ.200 సం.ల మధ్య కాలంలో గ్రంథస్తం చేయబడినాయి. సమ్యక్ జ్ఞానాన్ని అంటే  సరియైన జ్ఞానాన్ని కలిగిస్తుంది గనుక దానిని సాంఖ్యవాద మని అన్నారు.  సాంఖ్యం జ్ఞాన ప్రధానమైన సిధ్ధాంతం.  ప్రపంచానికంతా మూలం రెండు శక్తులు ప్రకృతి, పురుషుడు, ఈ రెండూ స్వయం సిధ్ధములు అని సాంఖ్యులు అంటారు.

ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తామని సాంఖ్యుల జ్ఞాన సిధ్ధాంతం చెబుతుంది.  అయితే, సాంఖ్యులు ఉపనిషత్తులు ముందుంచిన ఆత్మను అంగీకరించారు.  ఎందరు ప్రాణులుంటారో అన్ని ఆత్మలుంటాయనీ, ఆత్మ ఎల్లప్పుడూ చైతన్యవంతమయిన శక్తిగానే ఉంటుందనీ, చైతన్యం ఆత్మకు ఒక లక్షణంగాదు, ఆత్మా చైతన్యం రెండూ ఒకటేననీ సాంఖ్యులు వాదిస్తారు. ఉపనిషత్తులకు, సాంఖ్యులకు బేధమల్లా  ఉపనిషత్తులు పరమాత్మను అన్నిటికంటే ఎత్తున విడిగా చూపెట్టాయి, సాంఖ్యులు చైతన్యమున్న ప్రతి ప్రాణీ పరమాత్మే అన్నారు.

సాంఖ్య వాద చిహ్నాలు ఉపనిషత్తులలోనే ఉన్నాయనీ, కఠోపనిషత్తులో ఆత్మ అనశ్వరం, పురుషుడు ఆత్మ ఒకటే అను భావం పదే పదే పునశ్చరణ ఔతూంటుందనీ, భగవద్గీతలోని ఆత్మ శాశ్వతత్వాన్ని నిరూపించే శ్లోకాలు కఠోపనిషత్తు నుండి మక్కికి మక్కిగా తీసుకోబడినవిగా అనిపిస్తాయనీ పెద్దలు చెబుతారు.

ఈ చింతనలకు సంబంధించిన నచికేతుని కథ కఠోపనిషత్తులోనే ఉంది.

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (7)

అచార్య నాగార్జునుడు బహుముఖ ప్రజ్ఞావంతుడు. తర్కము, వేదాంతము, రసాయన శాస్త్రము, వృక్షశాస్త్రము, వైద్యవిషయ శాస్త్రములు ఇత్యాది విద్యలయందు నిష్ణాతుడు.  తర్క, వేదాంతములలో ఇతనిది శూన్య వాదం.

తార్కిక సత్యం లౌకికం, పారలౌకికం అని రెండు రకాలు. లౌకిక సత్య నిరూపణకు ములాలు ఈ లోకంలో దొరుకుతాయి గనుక అది నిరూపణ సాధ్యం, కనుక మౌలికం. పారలౌకిక సత్య నిరూపణకు మూలాలు ఈ లోకంలో దొరకువు గనుక అది నిరూపణకు అసాధ్యం, కనుక అమౌలకం. అది నిస్స్వభావం, కనుక శూన్యం.  బౌధ్ధ తత్త్వచింతన మొదటి సత్యానికి, అంటే లౌకిక సత్యానికి మాత్రమే పరిమితమయినది.

సత్యాన్ని రెండు రకాలుగా విభజించడంవల్ల నాగార్జునుడు బౌధ్ధ తత్త్వచింతన సారాన్నే మార్చివేశాడనీ, ప్రజలలో సామాన్యులు, మేధావులు అన్న విభజనకు ఇది దారి తీసిందనీ, పరమార్ధంలో అంతా శూన్యం గనుక లౌకికంగా ఎలా ప్రవర్తించినా పరవాలేదన్న నిర్లక్ష్య ధోరణికి ఇది దారి తీసిందనీ పెద్దలు చెబుతారు. శంకరుని మాయావాదం కూడా ఇలాంటి ఫలితాన్నే కలిగించిందని కూడా చెబుతారు.

బౌధ్ధ శాఖాలలో ఆఖరుది విజ్ఞాన వాదం.  దీనినే యోగాచారం అని కూడా అంటారు.  క్రీ.శ.270-350 సం.లలో జీవించిన మైత్రేయనాథుడు యోగాచార ధోరణికి మూల పురుషుడు.

భౌతిక ప్రపంచం అవాస్తవం.  అయితే ఈ ప్రపంచాన్ని గుర్తించగలిగిన భావాలేలా పుడుతున్నాయి? అంటే, ఒక కుండను తీసుకుందాం. కుండకు సంబంధించిన ముద్ర ఒకటి అనాదిగా మన చైతన్యంలో ఉంది గనుకనే కుండ కనబడగానే ఆ ముద్ర జ్వలితమై కుండను కుండగా మనం గుర్తించ గలుగుతాం.  కుండ నశిస్తుంది.  కానీ కుండకు సంబంధించిన భావం మాత్రం నశించదు.  కనుక వస్తువు తాత్కాలిక సత్యం.  భావం శాశ్వత సత్యం.

బుధ్ధిలో జ్ఞానం లేకుండా వస్తువుని ఎలా గుర్తించ గలుగుతాం? కనుక జ్ఞానమే ముఖ్యం అని విజ్ఞానవాదుల వాదన. ఇదే వాదనను శంకరాద్వైతులు చేస్తారు.  యోగాభ్యాసం ద్వారా పరమాత్మలో లీనం కావచ్చు అని భావించి బోధించారు గనుక వీరు యోగాచారు లైనారు.

బుధ్ధుని ప్రతిమా రూపంలో పూజించ రాదని చెబుతుంది హీనయానం.  పూజించ వచ్చని చెబుతుంది మహా యానం.  శూన్య వాదులు, విజ్ఞానవాదులు మహాయాన శాఖకు చెందుతారు.  బౌధ్ధాన్ని ప్రజలకు దగ్గర చేయాలి అని మహాయానం భావించి ఆచరణలో పెట్టింది.

శాతవాహన చక్రవర్తులు మహాయానాన్ని అభిమానించారు.  చిత్రకళలకు, శిల్పకళకు అపారమైన ప్రొత్సాహాన్ని  ఇచ్చారు. బౌధ్ధులలో విగ్రహారాధనకు, బుధ్ధుని ప్రతిమలను పూజించడమనే పధ్ధతికి ఇది దారి తీసింది.  హిందువులలో భక్తి తత్త్వం పెరగడానికి కూడా ప్రజానీకంలో మహాయాన బౌధ్ధం తీసుకొచ్చిన పరిణామలు కొంతలో కొంతగానైనా తోడ్పడ్డాయని పెద్దలు చెబుతారు.

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (6)

మనమిప్పుడు శాతవాహనుల పరిపాలనా కాలానికి (క్రి.పూ.225 – క్రి.శ.225)  చేరుకున్నాం..  శాతవాహనులు ఆంధ్రులు అని ప్రతీతి.  ఆంధ్రభృత్యులు అన్న పదంగూడా శాతవాహనుల గురించి వాడబడి కనిపిస్తుంది.  వేరే ప్రసిధ్ధి చెందిన రాజవంశానికి సామంతరాజులు అన్న అర్ధంలోనా లేక ఆంధ్ర రాజులకు సామంత రాజులు అన్న అర్ధంలో ఈ మాట వాడబడినదా అన్నది తెలుసుకోవడానికి సరియయిన అధారాలు లేవు. ఏదయినప్పటికీ, ఆంధ్ర రాజులకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని సంపాదించి పెట్టిన తొలి రాజవంశం శాతవాహన రాజ వంశం. పురాణాలలో కూడా ఈ రాజ వంశ ప్రసక్తి కనిపిస్తుంది.

జాతి పరంగా ఆంధ్రులైనా, వీరి రాజధాని మొదటలో ధాన్యకటకము (నేటి అమరావతి) అయిఉండి, తరువాత ప్రతిష్ఠానపురానికి (నేటి ‘పైఠన్’) మార్చబడింది.  ప్రాకృతం రాజ భాష.  శాతవాహనరాజులలో స్త్రీలు బౌధ్ధాన్ని అవలంబిస్తే, పురుషులు వైదికమతాన్ని అనుసరించారు.  అజంతా గుహాలయాలు వీరి కాలంలో నిర్మించబడ్డాయి.  అమరావతి ఆంధ్రుల కళా నైపుణ్యానికి ఒక మచ్చుతునక.  వీరి పరిపాలనా కాలంలోనే రెండు ముఖ్యమైన శకములు – విక్రమాదిత్య శకము క్రి.పూ.58  సంవత్సరములనుండి, శాలివాహన శకము క్రీస్తు తరువాత 78 సంవత్సరములనుండి లెక్కింపబడుతూ – ప్రచారములోకి వచ్చాయి. ఈ రాజ వంశంలో కడపటి చక్రవర్తి గౌతమీ పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ని.  ఈయన క్రీ.శ. 174 – 203 సం.ల మధ్య కాలంలో పరిపాలన సాగించాడు.  ఈయనకు సమకాలికుడు ఆచార్య నాగార్జునుడు. క్రీ.శ.180 సం.ల ప్రాంతంలో ఇప్పుడు నాగార్జునకొండ అని పిలవబడే అప్పటి శ్రీపర్వతమనే కొండమీద సంఘారామాన్ని నెలకొల్పి వందల కొలది బౌధ్ధ భిక్షువులకు విద్యాబొధనకు, జీవనానికి అనువైన సౌకర్యములను కల్పించిన వ్యక్తి ఆచార్య నాగార్జునుడు.

ఏదీ అకారణంగా జరగదు, అనేక కారణాల ఫలితంగా ఒక కార్యం ఏర్పడుతుంది అన్న కార్యకారణ సంబంధ సూత్రం బౌధ్ధానికి మూలం.  నాగార్జునుడు దీనిని అంగీకరుస్తూనే అంతకంటే మౌలికమయినది ఏది? అని ప్రశ్నించుకుని ప్రతిదీ మౌలికంగా నిస్స్వభావం గనుక శూన్యం అని సమాధానాన్ని రాబట్టాడు.  చాందొగ్యోపనిషత్తు తండ్రి కొడుకుల మధ్య సంభాషణ చివరలో ఎదురైన శూన్యాన్ని శూన్యంగా వదలక అక్కడ ఆత్మను, పరమాత్మను నిలబెట్టింది.  నాగార్జునుడు ఆ భావననే ఇంకొంత ముందుకు తీసుకువెళ్ళి ఆత్మ, పరమాత్మ అన్న ముసుగును తీసివేసి, శూన్యాన్ని శూన్యంగానే అంగీకరించమని చెప్పాడు.

శూన్యత్వమే అసలైన నిర్వాణమనీ, అది కారణ రహితమైన అస్తిత్వమనీ, అందులో అన్ని పరిణామాలూ సమత్వం పొందుతాయని నాగార్జునుని సిధ్ధాంతం.  ఇదే అతని శూన్యవాద సారాంశం.

ఆచార్య శంకరుని మాయా వాదానికి నాగార్జునుని శూన్య వాదమే ప్రాతిపదిక అయ్యిందని పెద్దలు చెబుతారు.

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (5)

జైన మతాన్ని ప్రారంభించిన వర్ధమాన మహావీరుడు క్రీ.పూ.599-527 సం.ల మధ్య కాలంలో జీవించాడు.  గౌతమ బుధ్ధుని కంటే చాల పెద్దవాడయినప్పటికీ కొంత కాలం సమకాలీకుడు.  బుధ్ధుని వలెనే ఇతడుకూడా క్షత్రియుడు.

బోధనలో బౌధ్ధం అనుసరించిన పధ్ధతినే జైనంకూడ అనుసరించింది.  వర్ణవ్యవస్థను, వేదాల ప్రామాణ్యాన్ని, యజ్ఞయాగాదులను ఖండించి అహింసను బోధించింది.  అయితే, బౌధ్ధానికి జైనానికి బేధమల్లా జైనం ఉపనిషత్తులు ముందుకు తెచ్చిన ఆత్మ భావనను నిరాకరించక పోవడంలో ఉంది.

స్థితి మౌలికమని ఉపనిషత్తులు చెప్పాయి.  గతి మౌలికమని బౌధ్ధులు చెప్పారు.  జైనులు ఈ రెండు భావనలనూ మిళితంచేసి పుట్టుక, నశింపు, శాశ్వతత్వం అనేవి వాస్తవికతలోని అంతర్భాగాలే అన్నారు. సైధ్ధాంతికంగా  ఇది బోలెడంత గందరగోళానికి దారితీసింది.  ఫలితంగా జైనం తాత్త్వికంగా చాలా బలహీనమైన శాఖ అయింది.

భారత దేశంలో ఉపనిషత్తులు ఒక రోజున ఒక తత్త్వవేత్త వ్రాసిన గ్రంధాలు కావు.  అనేకమంది తత్త్వవేత్తలు, ఉపనిషత్కర్తలు కొన్ని వందల సంవత్సరాలు చింతించి వ్రాస్తూ రాగా ఉద్భవించినవి. ఉపనిషత్తుల కాలం తరువాత చార్వాక, జైన, బౌధ్ధాలు కొంచెం అటుఇటుగా ఒకే కాలంలో ఉద్భవించిన తత్త్వ చింతనలు.  వర్ణవ్యవస్థను నిరాకరించి, జంతుహింసను ఖండించి, అహింసను బోధించడం వలన జనబాహుళ్యం ఆదరానికి పాత్రమై ఇవి ప్రజానీకంలో బహుళ వ్యాప్తిని పొందాయి.  అయితే, అహింసను జైనం అతిగా వర్తింప జేసిందన్నది సత్యం.  ఫలితంగా సమాజంలో రోజువారీ జీవనంలో వ్యవసాయదారుడు లాంటి మిగతా వృత్తి పనివారలకు ఆచరణయోగ్యం గాకుండా పోయింది.  వ్యాపారస్తులలో మాత్రమే ఎక్కువగా వ్యాపించింది.

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (4)

ముప్ఫై ఏళ్ళ వయసులో (క్రీ.పూ.533 లో) సంసారాన్ని వదిలి అర్ధరాత్రి వేళ అడవులకు వెళ్ళిపోయాడు గౌతముడు. ఆరేండ్ల కఠిన తపస్సులో శరీరం శుష్కించి శల్యావశిష్ఠుడై ఒక చెట్టుక్రింద పడిఉన్న గౌతముడిని సుజాత అనే ఒక గొల్ల స్తీ గుర్తించి, ఆదుకొని బతికిస్తుంది.  ఆ తరువాత బుధ్ధ గయలో ఒక రావి చెట్టుక్రింద జ్ఞానోదయమైనవాడై బుధ్ధుడయినాడు గౌతముడు.  ఎనభై ఏండ్ల వయసువరకూ తన సిధ్ధాంతాలను ప్రచారంచేసి చివరకు మల్లదేశంలోని కుసినార వద్ద ఒక తోటలో నిర్యాణం చెందాడు.

వర్ణ వ్యవస్థను బుధ్ధుడు ఖండించాడు.  జన్మ ప్రధానంకాదని, గుణం మాత్రమే ప్రధానమయినదనీ బోధించాడు.  ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ మొదలైన అంతుచిక్కని సమస్యలను చర్చిస్తూ జీవితాన్ని వృధా చేసుకోవద్దనీ, మానవుని చిత్త సంక్షోభానికి మూలకారణం ప్రపంచమంతా ఆవరించి ఉన్న దుఃఖమనీ చెప్పి, దుఃఖానికి కారణం కోరిక గనుక ఆ కోరికను జయించడం ప్రధమ కర్తవ్యంగా బోధించాడు.  నియమబధ్ధ జీవనం, క్రమశిక్షణ, ప్రజాసేవ లాంటివి మానవుని ఉన్నతికి మార్గాలని సూచించాడు.

దృశ్యమాన ప్రపంచంలోని గతి కంతా స్థితి మూలమని ఉపనిషత్తులు భావించి బోధించగా, అందుకు విరుధ్ధంగా స్థితికంతా గతి మూలమని బుధ్ధుడు భావించి బోధించాడు.

బౌధ్ధ తత్త్వ శాస్త్రంలో వస్తువు, ధర్మం అన్న రెండు మాటలు తరచూ వినబడతాయి.  ప్రవాహ సదృశ్యమైన జగత్పరిణామ సూత్రమే ధర్మం అన్న అర్ధంలో గౌతముడు ఆ మాటను వాడాడు.  ప్రపంచంలో ప్రతిదీ వైరుధ్యాలతో కూడుకుని ఉన్నదన్న సత్యం గౌతముని ఉపదేశాలలో పదే పదే వినిపిస్తుంది.  ఈ వైరుధ్యాన్నే గౌతముడు ‘ధఃఖం’ అని నిర్వచించాడు. తాత్త్విక రంగంలో ఇటువంటి దృక్పథాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి బుధ్ధుడే అని పెద్దలు చెబుతారు.

ఒకే కారణంనుండి అనేక ఫలితాలు పుడతాయని ఉపనిషత్తులు చెప్పాయి.  పరమాత్మ ఒక్కడే.  అతని నుండి సకల చరాచర జగత్తు పుడుతుందన్నది ఉపనిషత్సారం. పరమాత్మ స్థానంలో పదార్ధాన్ని ఉంచిన చార్వాకుల భౌతికవాద దృష్టి కూడా దీనిని అంగీకరించింది. పదార్ధం ఒక్కటే, అందులోంచి సకల ప్రపంచం ఆవిర్భవించింది అన్నది చార్వాకుల భౌతికవాద సారాంశం. బుధ్ధుడు ఈ రెండు రకాల దృక్పథాలనూ తిరస్కరించాడు.

మార్పు అస్థిరమనీ, స్థితి (పరమాత్ముడు) శాశ్వతమనీ బోధించే ఉపనిషత్తుల దృష్టి సమాజంలో సాంఘిక వ్యత్యాసాలకూ, దౌర్జన్యాన్ని సమర్ధించేందుకూ బాగా ఉపయోగపడిందనీ ఆకారణంగా లోపభూయిష్టమైనదనీ గర్హించాడు.  ఆత్మ ఒక్కటే శాశ్వతమన్న వాదననూ, పాపపుణ్యాలు శరీరానికే గాని ఆత్మకు కావన్న వాదననూ బుధ్ధుడు కఠినంగా ఖండించాడు.

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (3)

‘ఈశావాస్యమిదం సర్వం’ అంటూ మొదలవుతుంది ఈశావాస్య  ఉపనిషత్తు.  ‘జగత్తంతా ఈశ్వర మయం’ అని ఈ మాటల అర్ధం. మానవ శరీరాన్ని అంటి పెట్టుకుని ‘ఆత్మ’ అనేది ఒకటి ఉంటుందని, ఆత్మకు సుఖ, దఃఖాలూ జననమరణాలూ లేవనీ అది పరమాత్మ స్వరూపమనీ చెప్పడం భావవాద ధోరణికి చెందుతుంది.  ఉపనిషత్తులు స్థూలంగా ఈ పనినే చేశాయి.  ఆత్మ, పరమాత్మ మొదలయిన విషయాలు మేధోశక్తి ద్వారా నిరూపించడం సాధ్యం కానిపననీ, ఆత్మ ప్రబోధం ద్వారానే బ్రహ్మజ్ఞానం సంపాదించగలమనీ వివరించబడింది.

(ఇందుకు పూర్తిగా విరుధ్ధమయినది భౌతిక వాదం.  ప్రపంచం వాస్తవమనీ, అనుభవం, ఆచరణ, మేధోశక్తి ద్వారా ప్రపంచానికి సంబంధించిన విజ్ఞానాన్ని మానవుడు సంపాదించగలడనీ, ప్రపంచానికి సంబంధించిన అనేకానేక విషయాలు ప్రసుత్తానికి మానవునికి తెలియకపోయినా, తెలుసుకోలేని విషయాలంటూ మానవునికి ఉండవనీ చేప్పేది భౌతిక వాదం).

మరో యాభై ఏళ్ళకు బుధ్ధుడు జన్మిస్తాడనగా (అనగా క్రీ.పూ.6వ శతాబ్దంలో), భారతదేశంలో చార్వాక మతం తలయెత్తింది.  కృషి ద్వారా ప్రజలు పంట పండిస్తున్నారు, స్తీ పురుషుల కలయిక ద్వారా సంతానం కలుగుతోంది, ఇది లోక ప్రసిధ్ధి, ఇంక దేవుని అవసరం ఏమిటన్న దృష్టి ఈ వాదానికి మూలం.

చార్వాక మతం దేశంలో ప్రారంభమయేనాటికి జనానీకంలో మతాచారాలూ, కర్మకాండ పధ్ధతులూ బాగా వెళ్ళూనుకుని ఉన్నాయి.  ఈ కర్మకాండనూ, ఆచారాలనూ అవహేళణ చేయడంతో ప్రారంభమయింది చార్వాక మతం. అయితే,  చార్వాక మత బీజాలు ఉపనిషత్తులలో బృహస్పతి అనే ఒక ముని వ్రాసిన సూత్రాలలో ఉన్నట్లుగా పెద్దలు చెబుతారు.

చార్వాకుల జీవిత దృక్పధం ఇలా ఉండేది – పైన పొట్టు ఉన్నదన్న కారణంవల్ల గింజలను మనం పారవేయనట్లుగానూ, ముళ్ళున్న కారణాన చేపలను తినడం మానుకోనట్లుగానూ, పరలోకంలో బాధ, కష్టం వస్తాయని భయపడి జీవిత సుఖాలను అనుభవించడాన్ని, జీవితాన్ని నిరాకరించడం తప్పు. అయితే, ఈ ఆలోచనా ధోరణి వీరిలోనే కొంతమంది అతివాదులుగా మారడానికి దారితీసింది.  ఉత్తరోత్తరా అదే వారి పతనానికి కూడా కారణమయింది.

యూరపులో తత్త్వ శాస్త్రానికి పునాది గ్రీసు దేశం.  గ్రీసు దేశంలో భౌతికవాదం ముందు పుట్టి, దాని మీద తిరుగుబాటుగా భావ వాదం (సోక్రటీసు, ప్లాటో, అరిస్టాటిల్ వంటి వారి బోధనలు) పుట్టింది.  భారత దేశంలో దీనికి పూర్తిగా విరుధ్ధంగా జరిగింది.  ముందు ఉపనిషత్తులలో భావ వాద ధోరుణలు పుట్టి ఆ తరువాత చార్వాకుల భౌతిక వాద ధోరణులు పుట్టడంలో ఇది గమనించవచ్చు.

గ్రీకు దేశపు ప్రాచీన భౌతిక వాదం విజ్ఞాన శాస్త్రం అభివృధ్ధికి దోహదం చేసింది.  భారత దేశంలో ఉపనిషత్తుల రూపంలో బలమైన పునాదులను సంతరించుకున్న భావవాదం ధాటికి తట్టుకుని నిలబడలేని చార్వాక భౌతికవాదం ఒక బలహీనమైన సాంఘిక తిరుగుబాటుగా మాత్రమే చరిత్రలో మిగిలిపోయింది.

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (2)

ఋగ్వేదం అతి ప్రాచీనమైనది.  ప్రకృతి అంతా నియమబధ్ధంగా నడుస్తుందనీ, ఆ నియమమే ‘ఋత్’ అనీ ఋగ్వేద సూక్తాలలో వర్ణించబడింది.  ఉపనిషత్తులలో కనబడే ‘కర్మ’ సిధ్ధాంతానికి ఈ ‘ఋత’ భావమే మూలం అని పెద్దలు చెబుతారు.
ఋగ్వేదం తరువాత సామవేదం ఏర్పడ్డది.  ఋగ్వేదంలోని ఋక్కులను ఏవిధంగా గానం చేయాలో చెబుతుంది సామవేదం.  అలా గానంచేస్తేనే యజ్ఞం ఫలప్రదం అవుతుందని నమ్మకం కలిగించింది సామవేదం.
తరువాతిది యజుర్వేదం.  యజ్ఞయాగాది కర్మకాండ ఎలా నిర్వహించాలో వివరిస్తుంది.
చివరిది అధర్వణవేదం.  యజ్ఞయాగాది విషయాలతోపాటు కొన్ని పురాతన మూఢ విశ్వాసాలూ, దయ్యాలూ వాటి ప్రయోగాలూ, వాటికి ప్రతిక్రియలూ ఇందులో చోటుచేసుకున్నాయి.
నాలుగు వేదాలకూ నాలుగు బ్రాహ్మణాలు ఏర్పడ్డాయి.  ఇవి వచన గ్రంథాలు.  కర్మకాండలో అనుసరించవలసిన పధ్ధతులను వివరిస్తూ వ్రాయబడిన వ్యాఖ్యాన గ్రంథాలివి.
సృష్టికి మూలకారణాన్ని, సృష్టిరహస్యాలను కనుక్కోవాలంటే కర్మకాండలతో లాభంలేదనీ, సమాజాన్ని వదిలి దూరంగా అడవులలో ఆలోచన ద్వారానే అధ్యయనం చేయవలసి ఉంటుందనే సంకల్పంతో పుట్టుకొచ్చినవి అరణ్యకాలు.   నాలుగు వేదాలకూ అనుబంధాలుగా అరణ్యకాలు వ్రాయబడ్డాయి.  ఈ గ్రంథాలలో సగం కర్మకాండ, సగం తత్వ విచారణ ఉంటుంది.
ఈ పరిణామం పూర్తిచెంది, కేవలం తత్వవిచారణే ప్రధానాంశంగా పెట్టుకున్న ఉపనిషత్తులు తరువాత వచ్చాయి.  ఉపనిషత్తు అనగా గురువు దగ్గర కూర్చుని నేర్చుకోవాల్సిన విజ్ఞాన గ్రంథం అన్న అర్థం అప్పుడు  స్థిరపడింది.
పదార్ధం నిర్జీవమైనది, దానిని శక్తివంతం చేసి ప్రాణం పోయాలి, ఈ పని ఒక్క పరమాత్మ మాత్రమే చేయగలడు, ఎలాగంటే పదార్ధం కూడా పరమాత్మలో ఒక భాగమే, పదార్ధం యొక్క ప్రాధమిక రూపాలు నిప్పు, నీరు, భూమి అన్నది స్థూలంగా ఉపనిషత్సారం అని పెద్దలు చెబుతారు.
ఛాందోగ్యోపనిషత్తులో తండ్రీ కొడుకుల మధ్య చూపిన సంభాషణ ఈ ఆలోచనా సరళిని స్పష్టం చేస్తుంది.

తండ్రి: ఆ మర్రి పండు తీసుకురా.
కొడుకు: ఇదిగో తీసుకు వచ్చాను.
తండ్రి: దాన్ని పగలగొట్టు.
కొడుకు: ఇదిగో పగలగొట్టాను.
తండ్రి: ఇప్పుడు ఏమి చూస్తున్నావు?
కొడుకు: అసంఖ్యాకమైన నలుసులను చూస్తున్నాను.
తండ్రి: అందులోంచి ఒక నలుసును పగులగొట్టు.
కొడుకు: ఇదిగో అలాగే చేశాను.
తండ్రి: ఇప్పుడు ఏమి చూస్తున్నావు?
కొడుకు: ఏమీ చూడడంలేదు.
తండ్రి: కనుక ఓ కుమారా! నీకు కనుపిస్తున్న ఆ శూన్యంనుంచే ఈ మర్రి విత్తనం, అందులోంచే ఈ మహావృక్షం పుట్టాయి.  నీకు కనుపించీ కనుపించని ఆ శూన్యంనుంచే ఈ సకల చరాచర ప్రపంచమూ, నీవూ, నేనూ అందరమూ పుట్టాము.  అదే ఆత్మ, అదే పరమాత్మ.  అదొక్కటే వాస్తవం. విశ్వసించు.

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (1)

వేదములలో చెప్పబడిన విషయాలను నిర్ణయించి నిర్ధారించి చెప్పడానికి ఉత్పన్నమైనదే దర్శనశాస్త్రం.  ఈ భావాన్ని యాస్కుడు నిరుక్తంలో చెప్పాడు.  నిరుక్తం వేద శబ్దాలకు నిఘంటువు లాంటిది.
దర్శనాల్లో వాదము, ప్రతివాదము, సిధ్ధాంతము, ఖండన, స్థాపన – ఇవి ముఖ్యాంశాలుగా ఉంటాయి.
వేద ప్రతిపాదితమైన విషయాల పునరుధ్ఘాటన, విపులీకరణ, విస్తరణ అనేవి దర్శనముల ముఖ్య లక్ష్యం.
దర్శనములు రెండు రకాలు – ఆస్తిక దర్శనములు, నాస్తిక దర్శనములు.
ప్రాచీన కాలంలో వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన వారిని ఆస్తికులు అన్నారు.  వేద ప్రామాణ్యాన్ని నిరాకరిస్తూ, వితండవాదము చేస్తూండినవారిని నాస్తికులు అన్నారు.
ఇది ఇప్పుడు భగవంతునియందు విశ్వాసం ప్రకటించినవారిని ఆస్తికులుగానూ, లేనివారిని నాస్తికులుగానూ అనుకునేంతగా రూపాంతరంచెంది మిగిలింది.
ఉపనిషత్తులు మొత్తం 108. అయితే వీటిలో ప్రధానమైనవి 10 లేక 12 మాత్రమే.  ఈ పది లేక పన్నెండు ఉపనిషత్తులు క్రీ.పూ.1000 నుండి 500 వరకూ గల ఐదువందల సంవత్సరాల కాలంలో రచింపబడ్డాయి అని పెద్దలు చెబుతారు.
మొదటి ఉపనిషత్తు ఐతరేయ ఉపనిషత్తు.  కర్త మహీదాసు.  ఇతడు శూద్ర వర్ణంలో పుట్టి స్వయంకృషి ద్వారా ఉపనిషత్కర్తగా ఎదిగినవాడు.
మరో వ్యక్తి సత్యకామ జాబాలి. తండ్రి ఎవరో తెలియదు.  తల్లి పేరు జాబాలి.  దాసి. తాను దాసీ పుత్రుడననీ, తండ్రి ఎవరో తెలియని వాడిననీ, తత్వజ్ఞానం సంపాదించాలనే ఆసక్తిఉండనీ, గౌతముడనే బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళి అభ్యర్ధిస్తాడు. అతని శిష్యునిగా చేరి గొప్ప తత్వవేత్త ఐనాడు.  గార్గి, మైత్రేయి మొదలయిన స్త్రీలు కూడా భారతీయ తత్త్వవేత్తలలో ఉన్నారు.
ఋగ్వేదానికీ ఉపనిషత్తులకూ మధ్య దాదాపు వేయి సంవత్సరాల కాలం గడిచింది.  ఈ మధ్య కాలంలో అతి కఠిన రూపంలో ఉండిన వర్ణవ్యవస్థ ఉపనిషత్తుల కాలంనాటికి కొంత సడలింది. ఉపనిషత్తులు వర్ణ వ్యవస్థను ఖండించలేదుగాని కొన్ని మినహాయింపులు చెప్పాయి.  కర్మ కంటె జ్ఞానం ముఖ్యం అని చెప్పి శక్తి గలవారు, చొరవగలవారు క్రింది వర్ణాలనుండి పైకెదగడానికి అవకాశం కల్పించాయి.
మహీదాసూ, సత్యకామ జాబాలి అలాంటి వారు.