హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (3)

శ్రీనాథుడు ఆంధ్రీకరించిన ‘శాలివాహన సప్తశతి’ ఇప్పుడు అలభ్యం. అందులోనివిగా చెప్పుకునే ఐదు పద్యాలు మాత్రమే ఇప్పుడు లభ్యమై ఉన్నాయి. ఈ అయిదింటిలో రెండు వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామం’ లో ఉన్నాయి. మిగతా మూడూ విడిగా లభ్యమై ఉన్నాయి. ఈ మూడింటిలో ప్రసిధ్ధమైనది ‘వారణ సేయ దావ గొనవా’ అనే పద్యం. క్రీ.శ.1960 సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మాసాల భారతి సంచికలలో ఈ పద్యం పై ‘తెలుగు మఱుగులు’ శీర్షికన చర్చ జరిగింది. ఈ పద్యానికి మూలమైన ప్రాకృత గాథ పాఠం, దాని సంస్కృత చాయ, చర్చ చివరన పెద్దలు అంగీకరించిన శ్రీనాథుని పద్య పాఠం (ఉత్పలమాల వృత్తంలో) వరుసగా:

“కస్స వ ణ హోఇ రోసో దష్టూయ పియాఏ సవ్వణం అహరమ్
సభమర ఉపమగ్ఘాఇణి వారిఅవామే సహసు ఏహ్మిమ్”

“కస్యవా న భవతి రోషో దృష్ట్వా, ప్రియాయాః సవ్రణ మధరమ్
సభ్రమర పద్మా ఘ్రాణశీలే! వారితవామే! సహస్వేదానీమ్.”

“వారణసేయ దావ గొనవా? నవ వారిజ మందు తేటి క్రొ
వ్వారుచునుంట నీ వెరుగవా? ప్రియ వాతెఱ గంటు కంటి కె
వ్వారికి కెంపు రాదు? తగవా మగవారల దూఱ? నీ విభుం
డారసి నీ నిజం బెరుగు నంతకు నంతకు నోర్వు నెచ్చెలీ!”

శ్రీనాథుని ఈ పద్యం పై ఒకింత ఆసక్తి కరంగా జరిగిన చర్చ సారాంశం ఇది – అప్పటికి (అంటే క్రీ.శ.1960 నాటికి) లభ్యమవుతూండిన ప్రాకృత ‘గాథా సప్తశతి’ లో శ్రీనాథుని ‘వారణ సేయ’ పద్యానికి మూలమైన ప్రాకృత గాథ లేదు. అయితే, ధ్వన్యాలోక ప్రవర్తకుడైన ఆనందవర్ధనాచార్యుని ‘ధ్వన్యాలోకం’ లో ఈ ప్రాకృత గాథ ఉదాహరించబడి ఉంది. ఆనందవర్ధనాచార్యుని ‘ధ్వన్యాలోకా’ నికి అభినవగుప్తపాదులవారి లోచన వ్యాఖ్యలో ఈ ప్రాకృత గాథకు సంస్కృత ఛాయతోపాటు సవిస్తర వ్యాఖ్య ఉంది.

ఈ ప్రాకృత గాథను స్వర్గీయ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు క్రింది విధంగా తెనిగించారు:

“ఎవరి కలుక గలుగదే ప్రియురాలి కె
మ్మోవి కాటుగన్న? ముగుద! తేంట్లు
ముసరియున్న తమ్మి మూరుకొంటివి వల
దన్న వినక! సైపవమ్మ యిపుడు.”

“ఓ చెలీ! వలదని ఎంత వారించినా విన్నావా, చెవిన పెట్టావా? అప్పుడే వికసిస్తూన్న కమలంలో కనిపించకుండా తేనెటీగ మకరందాన్ని చప్పరిస్తూ వుంటుందని నీకు తెలియదా? ఇప్పుడు చూడు, నీ పెదవిపై ఏర్పడిన ఈ గంటు నీ ప్రియునికి (పతికి) కోపం తెప్పించిందంటే తెప్పించదా మరి? ఇందులో అతని తప్పేమున్నది? దానికి అతనితో తగవా? నిజం తెలిసిన మీదట అతని కోపం ఉపశమించి నీ దరి చేరేవరకూ నీవు సహించి ఊరక ఉండవలసినదే, తప్పదు మరి!” అని ఈ గాథ తాత్పర్యం. ఇందులో ధ్వని ఊహకందనిదేం కాదు. ఈ ధ్వని తెలుగులో ఇంకో స్వతంత్ర పద్యానికి కారణమైనదని ఈ క్రింది పద్యం వలన తెలుస్తుంది.

“మాకంద ఫల రసంబుల
నాకలిగొని మేము గ్రోలు నా కొమ్మలలో
చీకటినప్పుడు నొక చిలు
కేగతినో మోవి గఱచె నెఱుగవె చెలియా!”

కవి ఎవరో తెలియని ‘ఉమా మహేశ్వరము’ అనే పేరున్న ఒక అలభ్య కావ్యంలోనిదిగా లభ్యమైన ఒకే ఒక్క పద్యం ఇది. వెల్లటూరి లింగయమంత్రి కృత ‘సరసాంధ్ర వృత్తరత్నాకరం’ అనే ఛందో గ్రంథంలో ఇది ఉదాహరింపబడింది.

హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (2)

“అగ్ని రస్మి జన్మనా జాతవేదా
ఘృతం మేచక్షు రమృతం మేఆసన్”

‘నేను అగ్నిని, పుట్టుకతోనే అంతా తెలిసినవాడను, నెయ్యి నా కన్ను, అమృతం నా నోటిలో ఉంది’ అని వామదేవుడు ఋగ్వేదంలో అగ్నిని స్తుతించాడు. అమృతం నోటిలో ఉన్నందువలన అగ్ని అపవిత్రతకు బాహ్యుడు. ఆయన ఎక్కడ ఉన్నా పవిత్రుడేను. ఉత్తమ గుణాలున్న మానవుని అగ్నితో పోల్చడం ద్వారా హాలుడు ఉత్తముని అగ్ని సమానుని చేసి చూపించాడు పై గాథలో. ఆ కారణాన, ఉత్తముడైన మానవునికి అపవిత్రతా దోషం లేదు అని సూచించాడు.  హాలుడు ఎంత సహృదయుడో, అతని ఆలోచనలు ఎంత ఉదాత్తమైనవో తెలియజెప్పడానికి ఈ ఒక్క గాథా చాలు.

అవడానికి మహారాజు అయినప్పటికీ, హాలుని మనస్సంతా ఆ కాలపు సామాన్య జనజీవితంలోని సుఖదుఃఖాలూ, కష్టనష్టాలకు సంబంధించిన సంగతుల చుట్టూనే తిరుగుతూండేది అనడానికి ‘గాథా సప్తశతి’ నిలువెత్తు సాక్ష్యం. ప్రాకృతం ఆ కాలపు జనుల భాష, అదే రాజ భాష కూడ అయింది. కవితాత్మ కలిగి ఉన్నప్పటికిన్నీ, కవులుగా పేరు పడని సామాన్య జనానీకంలోని ఎందరో వ్యక్తులు – అలఅస్స, మాణస్స, మఅరందస్స, రాఅవగ్గస్స, విగ్గహస్స, వంగవిఅరస్స, అణంగస్స, పాలిఅస్స, ఇత్యాది నామధేయాలతో ఉండిన వ్యక్తులు – ఎందరెందరో రోజువారీ జీవనపు సంఘటనలలోని సంతోషలనూ, దుఃఖాలనూ, ప్రేమికుల వియోగాలనూ, విరహాలనూ, వినోదాలనూ, విలాసాలనూ, పల్లె సంబరాలనూ, పెళ్ళి సంబరాలనూ, అలంకారాలనూ, అనుభూతులనూ, ఇలా ఎన్నెన్నిటినో గాథలలో బంధిస్తే, వాటిల్లో ఉత్తమమైన వాటన్నిటినీ సేకరించి గుది గూర్చి గ్రంథంగా చేసాడు హాలుడు. శాతవాహన రాజుల కాలపు జనుల జీవనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే దృశ్యకావ్యం ‘గాథా సప్తశతి’.

‘గాథా సప్తశతి’ సౌందర్యానికి ముగ్ధుడై, నూనూగు మీసాల నూత్న యవ్వనం నాటికే ‘గాథా సప్తశతి’ ని ‘శాలివాహన సప్తశతి’ గా తెలుగులోకి అనువదించానని చెప్పుకున్నాడు శ్రీనాథుడు. కవిత్వం చెప్పడంలో అనన్య సామాన్యమైన ధారాశుధ్ధి, ప్రతిభ కలిగివుండి, అనతికాలంలోనే మహాకవి బిరుదాన్ని పొందివుండి, రాజాస్థానాలలో పొందిన సన్మానాలతోను, గడించిన ధనంతోనూ జీవితాన్ని సుఖంగా గడపగలిగివుండి కూడ సామాన్య జన జీవితంలోకి అడుగు పెట్టకుండా వుండలేక పోయిన వ్యక్తి శ్రీనాథుడు. సందర్భం దొరికినప్పుడల్లా, సంగతులను తన చాటువులలో బంధించి భావి తరాలకు అందించాడు.

హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (1)

మౌర్య సామ్రాజ్య పతనం తరువాత, దక్షిణ భారతం మొత్తాన్నీ, ఉత్తర భారతంలో కొంతభాగాన్నీ కలిపి ఏక మొత్తంగా కొన్ని సంవత్సరాల కాలమైనా పాలించిన  దక్షిణాది రాజవంశం శాతవాహన రాజవంశం. ఈ ప్రసిధ్ధ రాజవంశం క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 దాకా, అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు రాజ్య పాలన సాగించి, ఆ క్రమంలో పురాణాలలోకి కూడా ఎక్కిన  ఘనతను సాధించుకుంది.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి.  ఈ వంశపు రాజులలో హాల మహారాజు ఒకడు. ఇతడు క్రీ.శ.19-24 సంవత్సరాల మధ్య కాలంలో  రాజ్యపాలన చేశాడని చరిత్రకారులు చెబుతారు. (హాలుడు అశ్మక రాజ్యంలోని ప్రతిష్ఠానమును పరిపాలిస్తూ ఉండినాడని ప్రాకృతంలో రచింపబడిన  ‘లీలావతి’ కావ్యం చెబుతుంది). పరిపాలించినది ఆరేళ్ళే అయినప్పటికీ, శాతవాహన వంశపు రాజులందరిలోకీ హాలుడు జగత్ప్రసిధ్ధుడు కావడానికి కారణం ఆ మహారాజు సంకలించి ప్రపంచానికి అందించిన ‘గాథా సప్తశతి’ గ్రంథం. (ప్రస్తావ వశాన, ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. హాలుని ఆస్థానంలో వుండిన శ్రీపాలితుడనే మహాకవి, హాలుని దర్శించుకోవడానికి వచ్చిన వారిలో కవులు కొందరు ఆ మహారాజు సమక్షంలో వినిపించిన గాథలలో ఉత్తమమైన గాథలను సేకరించి సంకలించాడనే మాట కూడ ప్రచారంలో ఉంది. అయితే, ఇందులో నిజానిజాలు ఏమైనప్పటికీ, హాలుడు విని మెచ్చిన వాటినే శ్రీపాలితుడు కూడ మెచ్చడం జరిగి ఉంటుందనుకోవడానికి ఏమీ సందేహ పడనవసరం లేదు కదా!). గాథా సప్తశతి లోని ఏడు వందల గాథలలో దేనికది అనాటి సమాన్య జనజీవనంలోని ఏదో ఒక పార్శ్వాన్ని భావి తరాలకు గ్రంథస్తం చేసి చూపించడంలో సఫలీకృతమై కనిపిస్తుంది. హాలుడు పరిపాలించిన ఆ ఆరేళ్ళ కాలం ప్రాకృత వాఙ్మయానికి స్వర్ణ యుగమని కూడా చెబుతారు.

‘గాథా సప్తశతి’ ని హాలుడు సంకలించడమే కాదు, తాను రచించిన కొన్ని గాథలను అందులో చేర్చాడు కూడా. హాలుడు రచించిన గాథలలో అతని వ్యక్తిత్వానికి ప్రతిబింబా లనదగినవి ఉన్నాయి. వాటిలో అత్యుత్తమమైన గాథ, హాలుని సహృదయతనూ, సున్నితమైన మనస్తత్త్వాన్ని తెలియ చెప్పే గాథ, ఇది:

“పాణఉడీఅ వి జలిఊణ హుతవఓ జలఇ జణ్ణ వాడమ్మి
ణ హు తే పరిహరిఅవ్వా విసమదసా సంఠిఆ పుంసా.”

దీని సంస్కృత ఛాయ:

“పానకుట్యామపి జ్వలిత్వా హుతవహో జ్వలతి యజ్ఞవాటేపి,
నహితే పరిహర్తవ్యా విషమదశా సంస్థితాః పురుషాః”

అగ్నిహోత్రుడు యజ్ఞవాటిలో ఎలా మండుతాడో, కల్లు పాకలోనూ అలానే మండుతాడు. అలాగని అగ్నిహోత్రుని అపవిత్రుడైనాడని వదిలి పెట్టడం కుదురుతుందా? కుదరదు. అలాంటిదే ఉత్తములైన వారి సాంగత్యం. కొన్ని కొన్ని పరిస్థితులలో తమకు తగని ప్రదేశాలలో వారు ఉండడం, మనం చూడడం సంభవించినంత మాత్రాన, వారి సాంగత్యాన్ని వదులుకో చూడడం తగదు. దాని వలన మనకే నష్టం. ఇదీ ఈ గాథ అర్ధం.

సాహిత్యంలో ప్రకృతి – (3)

ఆర్యుల తొలి నివాసం గురించి పూర్వం జరిగిన చర్చలో, ఆర్యులు తొలుత ఉత్తర ధ్రువమండల వాసులని ఒక వాదం ఉండేది.  భూమండలం యొక్క ఉత్తర ధ్రువానికి సరిగా ఉత్తరాన ఒక నక్షత్రం (దీనినే ధ్రువ నక్షత్రం అంటారు) ఎప్పుడూ కదలకుండా ఒకే చోటన ఉన్నట్లు కనబడుతుంది. ఉత్త ధ్రువం వద్దకు వెళ్ళి నిలబడి చూచేవారికి ఆ నక్షత్రం సరిగా నడినెత్తి మీద ఉన్నట్లుగానూ, మిగతా నక్షత్రాలన్నీ ధ్రువనక్షత్రం చూట్టూతా ఒక గొడుగులాగానూ, కుమ్మరి సారె లాగానూ, గిరగిర తిరుగుతూ ఉన్నట్లుగానూ కనబడతాయి.  ఉత్తర ధ్రువ మండలం దగ్గర భూగోళంలో ఉత్తరార్ధ భాగం మాత్రమే కనబడుతూ, మిగతా ధక్షిణార్ధ భాగం ఎప్పుడూ కనబడకుండా ఉంటుంది. అక్కడ సూర్యుడు ఉదయించిన ఆరు మాసాలకు గాని అస్తమించడు.  అస్తమించిన తరువాత మరి ఆరు మాసాలకుగాని తిరిగి ఉదయించడు. అందువలన అక్కడ  ఆరుమాసాలు పగలుగానూ, మిగతా ఆరు మాసాలు రాత్రిగానూ ఉంటాయి. ఆరు మాసాల ఆ మహా రాత్రి ముగింపుకు వచ్చే దశలో, సూర్యుడు దక్షిణార్ధ గోళం నుండి, ఉత్తరార్ధ గోళానికి ఉదయిస్తూ ప్రత్యక్షం అవుతాడు. ఈ లక్షణాలతో ఉన్న ఉత్తరధ్రువాన్ని పూర్వులు మేరు పర్వతం అని పిలిచారు, వర్ణించారు.

సూర్యుడు ఉదయించడానికి ముందు కనుపించే వెలుగును ఉషస్సు అని పిలుస్తారు.  ఈ ఉషస్సు ఉత్తర ధ్రువం ధగ్గర నివసించే వారికి ఆరు నెలలపాటు సాగే దీర్ఘమైన రాత్రి అంతరించే సమయాన భూమ్యాకాశాలు కలిసిపోయినట్లుండే దిక్చక్రం(horizon) దగ్గర కనుపించి, దాని అంచుల దగ్గర 60 గడియల కొకసారి గిర్రున తిరుగుతూ ఉంటుంది. క్రమక్రమంగా వెలుతురు ఎక్కువ అవుతూ 30 రోజుల కాలంపాటు ఈ ‘ఉషస్సులు’ తిరిగిన అనంతరమే సూర్య బింబం ప్రత్యక్షమౌతుంది.

ఉత్తర ధ్రువం దగ్గర ఒక పగలు, ఒక రాత్రి, మరి ఈ రెంటి మధ్య సంధ్య కాలాన్ని పరిశోధకులూ, పెద్దలూ ఇలా వివరించారు:

“జనవరి 29వ తేదీన మొట్టమొదటి వెలుగు కనిపిసుంది. ఇదే ఉషః కాంతి. ఇది 47 రోజులు ఉంటుంది. ఆ తరువాత మార్చి 16వ తేదీన సూర్య బింబం ఉదయిస్తుంది. సెప్టెంబరు 25వ తేదీన అస్తమిస్తుంది. కానీ ఆ తరువాత 48 రోజుల వరకూ సంధ్య వెలుగులు ఉంటాయి. తరువాత నవంబరు 13వ తేదీ మొదలుగా 76 రోజులు సూర్య సంబంధమైన వెలుతురేమీ ఉండదు. అయితే ఆ రోజులలో కూడా ఉత్తర ధ్రువానికి సరిగ్గా నెత్తి మీద బంగారపు రంగు కాంతి విరజిమ్మే ఒక బలమైన జ్యొతి వలన వెలుతురు సంభవిస్తూ ఉంటుంది. ఇలాంటి బంగారు రంగు కాంతులతో కమ్ముకుని ఉండడం చేతనే మేరువు బంగారుకొండ అని ప్రసిధ్ధి చెందింది.”

ఆర్య దేవతల నివాసం మేరు పర్వతం. ఆర్య దేవతల దినములో సగం, ఆరు నెలల పగలు, మిగతా సగం ఆరు నెలల రాత్రి. అంటే మనకు ఏది ఒక సంవత్సరమో అది ఆర్య దేవతలకు ఒక దినం. ఉత్తర ధ్రువం దగ్గర ఉండే ఈ ప్రకృతి పరిస్థితులు ఆర్య దేవతల దివారాత్రములతో సరిపోతూండడం, ఆర్యుల తొలి నివాసం ఉత్తర ధ్రువ ప్రాంతమై ఉండవచ్చన్న ఊహకు, అభిప్రాయానికి దారి తీసింది.

పైన ఉదాహరించిన వామదేవుని ఋక్కులో ఉషస్సును ‘ఉషస్సులు’గా బహువచనంలో చెప్పడానికి కారణమూ ఇందులో లభిస్తుంది. అదేకాదు, ఋగ్వేదంలో ఉషస్సు ఎక్కడ వర్ణించ బడినా ‘ఉషస్సులు’ అని బహువచనంలో వర్ణించబడడానికి కారణమూ ఇందులో లభిస్తుంది.  

అయితే, ఋగ్వేదం ఆర్యులు ఉత్తరధ్రువ మండల వాసులుగా ఉన్నప్పుడు చెప్పిన గ్రంథమా? అదే అయితే, వారు ఆ ప్రాంతాన్ని వదిలి సిందులోయకు (ఏ కారణాల చేతనైనా సరే) తరలి వచ్చిన తరువాత కూడా, సింధులోయలో ఉత్తరధ్రువ ప్రాంతానికి సరిపోయే ప్రకృతి పరిస్థితులు లేనప్పుడు కూడా, పూర్వ భావ సంచయాన్నే ఎందుకు కొనసాగించినట్లు? సింధులోయలో కనుల ఎదుట ‘ఉషస్సులు’గా కనుపించని ఉషస్సుని ‘ఉషస్సులు’గానే ఎందుకు కొనసాగించినట్లు? ఇక్కడ ఊహించుకోవడానికైనా అలవిగాని ఆ భావసంచయాన్ని ఏమార్పూ లేకుండా అలాగే కొనసాగించడం ద్వారా వారు చెప్పదలచుకున్న దేమిటి? చెప్పిందేమిటి? ఇక్కడి ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా కొత్త భావసంచయాన్ని రూపొందించుకోవడానికి వారెందుకు శ్రధ్ధ చూపలేదు? ఇత్యాది ప్రశ్నలకు
సమాధానాలు దొరకడం అంత తేలిక కాదు.

సాహిత్యంలో ప్రకృతి – (2)

“ఖరసిప్పర ఉల్లిహిఆఇ కుణఇ పహిఓ హిమాగమ పహాఏ,
ఆచమణ జలోల్లిహిఅ హత్థఫంస మసిణాఇ అంగాఇ.”

గాథసప్తశతి 4వ శతకం 30వ గాథ ఇది. ఈ గాథను చెప్పిన కవి పేరు పసణ్ణస్స. ‘అతనొక పథికుడు, పాదచారుడు. అది చలి కాలం. ఆ నాటి రాత్రి సన్నని పదునైన నూగు గలదైన గడ్డి ప్రాంతంలో (వేడిమి కోసం) పడుకున్నాడు. ఫలితంగా శరీరం మీద అనాచ్ఛాదిత భాగమంతా గీసుకుపోయింది. మంచుతో నిండి ఉన్న ఉదయాన నిద్ర లేవగానే తడిచేతితో ఒంటి మీద (గాయాలైన చోటల) రాచుకుని హాయిని పొందుతున్నాడు’ అని ఈ గాథ అర్ధం.  

గాథాసప్తశతిలోని ప్రతి గాథా ఒక రమ్యమైన కథను చెబుతుంది. గ్రామ జీవనంలోని ఎన్నెన్నో పార్శ్వాలు ఈ గాథలలో దర్శనమిస్తాయి. వస్తుపరంగా ఏ గాథా భూమిని విడిచి వెళ్ళదు. ప్రకృతితోనూ, ప్రాకృతికమైన విషయాలతోనూ అనుబంధించుకుని ఉన్న గాథలలోనూ సహజ సౌందర్యం ఏవిధమైన ఆర్భాటమూ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా దర్శనమిస్తుంది.

“అవిరల పడంత ణవజలధారా రజ్జు ఘడిఅం పఅత్తేణ,
అపహుత్తో ఉక్ఖేత్తుం రసఇవమేహో మహిం ఉఅహ.”

గాథసప్తశతి 5వ శతకంలోని 36వ గాథ ఇది. ‘వర్షాకాలం. కుండపోతగా కురుస్తూ బలమైన జలధారలనే పగ్గాలను కట్టి మేఘుడు భూమిని తనవైపు లాగే ప్రయత్నం చేస్తున్నాడు.  కానీ ఎంత ప్రయత్నించినా లాగలేక పోతున్నాడు. మూల్గుతున్నాడు. ఆ మూల్గులే ఉరుములు’ అని ఈ గాథ అర్ధం.

“ని గ్రామాసో అవిక్షత్
ని పద్వంతో ని పక్షిణః
ని శ్వేనా సక్ష్చిదర్థినః”

ఋగ్వేదంలోని 10వ మండలం 127వ సూక్తంలో 5వ ఋక్కు ఇది. ఈ ఋక్కు అర్ధం ‘గ్రామం సద్దుమణిగింది. పాదచారులు ఆగిపోయారు. పక్షులు సద్దుచేయడంలేదు. వేటాడే డేగలు కూడా సంచరించడం లేదు’ అని పెద్దల వివరణ. అతి తక్కువ అలతి అలతి మాటలతో గ్రామజీవనంలో ఒక రాత్రికి సంబంధించిన చిత్రణ ఇది. విశ్వామిత్ర వంశ స్థాపకుడైన సోభరిపుత్ర కుశికుడు ఈ ఋక్కును రచించాడని చెబుతారు. ఈ ఋక్కు గాయత్రి ఛ్ఛందంలో ఉందని కూడా చెబుతారు.

ప్రకృతిని ఎలా చూడాలో చెప్పేవారు కవులనీ, అలాంటి కవులలో ఉత్తములైన వాళ్ళు ఋగ్వేదాన్ని అందించారనీ పెద్దల మాట. ఋగ్వేద ఋషి ప్రకృతిని చూసిన విధానానికీ, ఆ తరువాతి కాలంలో కవులు ప్రకృతిని చూసిన విధానానికీ చాలా తెడా ఉందని కూడా పెద్దల మాట. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే అన్ని విపత్కర పరిస్థితులలోనూ, తాము చేసే యుధ్ధాలలోనూ తమకే విజయం కలగాలనీ, తమ శత్రువులు అపజయం పాలయే విధంగా దేవతలు సహాయపడాలనీ భక్తితో, శ్రధ్ధతో వినయపూర్వకంగా ఆర్యులు చేసిన ఆలాపనలే ఋక్కులు అయిఉండడం, పై అభిప్రాయానికి కారణం కావచ్చని నేను భావిస్తాను. ప్రకృతిని వర్ణించే సందర్భాల్లోనూ ఈ పధ్ధతినే ఆర్య ఋషులు పాటించారు. ఉదాహరణకి ఉదయాన్ని వర్ణించే ఒక సందర్భంలో ‘ఉషస్సు’ ను ఒక దేవతగా భావించి స్తుతించడాన్ని ఈ క్రింది ఋక్కులో  చూడవచ్చు:

“ఇదముత్యత్ పురుతమం పురస్తా జ్జ్యోతిస్తమసో వయునా వదస్థాత్
నూనం దివో దుహితరో విభాతీర్గాతుం కృణ వన్నుష సోజనాయా”

ఇది వామదేవుడు అనే ఋషి చెప్పిన ఋక్కు. ఋగ్వేదం 4వ మండలం 51వ సూక్తం లోనిది. ఈ ఋక్కు అర్ధం “చీకటి మధ్యనుండి అదిగదిగో తూర్పు దిక్కున శక్తివంతమైన అతి విశాలమైన జ్యోతి లేచింది. నిశ్చయంగా గణముల హితమును చేకూరుస్తూ దివస్సు యొక్క పుత్రికలు ‘ఉషస్సులు’ ప్రకాశిస్తున్నాయి” అని పెద్దల వివరణ.

అయితే, వామదేవుని ఈ ఋక్కులో ఉషస్సును ‘ఉషస్సులు’ అని బహువచనంలో చెప్పడం చూస్తాం. దీనికి కారణం ఏమైఉంటుందని వెదకడం మొదలెడితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి.

ఊర్వశి – పురూరవ: ఒక ప్రస్తావన-పునర్వీక్షణ (6)

ఐదు

“ప్రేమ సుఖం కావాలన్నాడు, పుష్కలంగా ఇచ్చాను.  పుత్రుడు కావాలన్నాడు, అదీ ఇచ్చాను. అయినా పట్టుకుని వదలడు, ఇంకా ఉండిపోవాలంటాడు…ఎందుకలా?” అంది ఊర్వశి.
“నీది ప్రకృతి హృదయం, పురూరవుడిది పురుష హృదయం. దేనినీ పట్టించుకోవు నువ్వు. ఒకసారి పట్టించుకుంటే వదలనే వదలడతడు. ఈ నియమం ఇలా కొనసాగాల్సిందే!”
“ఎన్ని నియమాలు నేను రచించాను.  అన్నింటికీ సరేనన్నాడు పిచ్చివాడు.  అవన్నీ నేను ఎప్పటికైనా తప్పించుకు పోవడానికి తెరచి ఉంచుకున్న ద్వారాలని తెలుసుకోడు. ఈ పీడ నించి నేను తప్పించుకోగోరుతున్నానన్న తలపే రానివ్వడు…మూర్ఖుడు!”
“అంతగా దూషించకు ఊర్వశీ!” అన్నాడతడు అహం దెబ్బతిన్న మొహంపెట్టి.
“ఏం? మీ కెక్కడ బాధ కలుగుతోంది మహర్షీ?” అంది ఊర్వశి గాయాన్ని ఇంకొంచెం పెద్దది చెయ్యాలన్న తలపుతో అన్నట్లుగా.
“అతడు ప్రేమంటున్నాడు దానిని!”
“వాడి తలకాయ ప్రేమ. బంధించి తాళాలేసుకు చూసుకోవాలనుకోవడం ప్రేమెలాగవుతుంది?”
“ప్రేమకు అర్ధమేమిటి మరి?”
“నాకు అనుభవంలోకి వచ్చినపుడు చెబుతాను!”
“విడ్డూరంగా ఉంది. పురూరవుడితో ఇన్నేళ్ళ సహవాసంలో ప్రేమంటే ఏమిటో అనుభవానికి రాలేదా నీకు?” ప్రశ్నించాడతడు.
“వచ్చింది. చాలాసార్లు వచ్చింది. అలా వచ్చి వచ్చేగా నేనిక వెళతానన బయలుదేరిందీ?” అంది ఊర్వశి.
“ఆఁ…!”
“అందులో అంత విడ్డూరానికేముంది మహర్షీ? నేను ఊహా రూపను. బంధించబడడం నా నైజం కాదు.  అది నీకూ తెలుసు.  కానీ, పురూరవుడికి అది తెలిసేలా నువ్వు చెయ్యవ్.  చేస్తే కథ కంచికి చేరుతుందని నీ భయం.  పరమానందంలో నీ వంతు కొరవడుతుందని నీ ఏడుపు.  పురూరవుడి విచక్షణని ప్రేమనే వెర్రి మాయలో కప్పెట్టేశావ్.  పురూరవుడు ఇక కళ్ళు తెరిచి చూసే ప్రసక్తే లేదు.  ‘నువ్వే..నువ్వే!’ అని నన్ను తలుచుకుని తలుచుకుని ఏడుస్తూనే ఉంటాడు.  అతని శోకానికి అంతమే లేదు.  అదొక అనంతమైన మాయ…అంతులేని విలాపం…తనలోంచి తనే మళ్ళీ మళ్ళీ పుట్టుకుంటూ అనందిస్తూండే వింత రోగం!”

(అయిపోయింది).


ఊర్వశి – పురూరవ: ఒక ప్రస్తావన-పునర్వీక్షణ (5)

నాలుగు

“మరేది మార్గం?” అడిగా డతడు.
“మూర్ఖత్వాన్ని వదలడమే!” చెప్పింది ఊర్వశి.
“అదంత సుళువైతే పురూరవుడీపాటి కెప్పుడో ఆపని చేసుండేవాడుగా?” అన్నాడతడు.
“ఏడుస్తూ ఉండమనేగా నీ సందేశం మొదటినుంచీ?” అంది ఊర్వశి.
“కథ నడవాలిగా ఊర్వశీ!”
“కథ కాదు…వినోదంకావాలిగా అను!”
“ఎంత మాట!”
“పురూరవుడి శోకాన్ని వినోదంగా చూసుకుని ఆనందిస్తూ నువ్వుంటే, పురూరవుడు నన్ను రాక్షసిననుకుంటున్నాడు చూడు?” అంది ఊర్వశి.
“నేను పడే వింత గూడా అదే ఊర్వశీ!” చెప్పాడు అతడు.
“అట్లాగా! అయితే అప్పుడే ఇదెంత మాత్రం వింతని? అసలు విషయం పురూరవుని చెవిలో వేస్తే, మర్మం తెలుసుకున్న పురూరవుడు కత్తి దూసి నీ కుత్తుక కొయ్యడానికి వెంట పడితే…ఆ వింత చూడాలనుంది నాకు!” అంది ఊర్వశి.
“అంత విజ్ఞత అతడికివ్వలేదులే ఊర్వశీ…నీ కంత సంతోషం అక్కరలేదు!” అన్నాడతడు.
“ఎంతటి నిర్దయుడివి నువ్వు? ఇంత ద్వేషం ఎందుకు?”
“నన్ను బాధించావుగా మరి. ఆ బాధని అజరామరం చెయ్యెద్దూ..”
“మరే…ఒక లోకం మొత్తంగా ఆ మాయలో పడి శగ తగిలిన మిడతల్లాగా కొట్టుకోవద్దూ?” అంది ఊర్వశి.
అతడు నవ్వాడు.

ఊర్వశి – పురూరవ: ఒక ప్రస్తావన-పునర్వీక్షణ (4)

మూడు

కళ్ళుతెరిచి మందహాసం చేస్తూ “మరీ ఇంత తల్లకిందులు కథనా కథకుడా?” అంది ఊర్వశి.
నవ్వి ఊరుకున్నాడతడు.
“ప్రాణాల్ని వెతుక్కుంటూ పోయిన శరీరంలాగా…పురూరవునితో నేనిప్పుడు ప్రేమ నటించాలన్నమాట?” అంది ఊర్వశి.
“నటించే కర్మం నీకు దేనికి? అనుభవించూ!” అన్నాడతడు.
“అనుభవించడమా? ఏముందని అతనిలో అనుభవించడానికి?” అడిగింది ఊర్వశి.
“లేకపోవడమేవిటి ఊర్వశీ? మహావీరుడతడు. నిన్ను రక్షించిన వాడూ..!” అన్నాడతడు.
“రక్షించడమా? నన్నా? దేని నించీ?” హేళణగా అడిగింది ఊర్వశి.
“నువ్వు మాలోకంలో ఉన్నంతవరకూ మానవమాత్రురాలివే అన్న సంగతి మరవకు ఊర్వశీ!” అన్నాడతడు హెచ్చరిస్తున్నట్లుగా.
“ఓహో…ఇదొకటిగూడానా? ఇక కథకేం తక్కువ…నేనూ రచిస్తాను చూసుకో ఋషీ!” అంది ఊర్వశి.
“ఆట మొదలౌతోందన్న మాట! నిన్ను పట్టి ఉంచుకోవాలని పురూరవుడూ…వదిలించుకుని వెళ్ళిపోవాలిని నువ్వూ…భేషుగ్గా కుదిరింది సందర్భం!” అన్నాడతడు.
ఒకింత ఆగి, బాధగా నిట్టూర్చింది ఊర్వశి.
“ఇంతలోనే ఆ నిట్టూర్పేవిఁటి ఊర్వశీ?” అడిగాడతడు.
“ప్రేమంటున్నాడు పిచ్చివాడు!” అంది ఊర్వశి.
“నిన్ను ప్రేమించి నీచేతనే పిచ్చివాడనిపించుకుంటున్నాడు పాపం పురూరవుడు…అంతటి వీరుడు!” అన్నాడు.
“ఆహా..వీరుడూ…శూరుడూ! కాదన్నానా? నాకెందుకీ పీడ అనికదా నా ప్రశ్న!” అంది ఊర్వశి.
“సమాధానం నీలోనే ఉంది ఊర్వశీ! అలవిమాలిన సౌందర్యంతో ఎవ్వరికీ చిక్కనంటూ నువ్వున్నావు, అంతులేని శూరత్వంతో దేన్నయినా సరే దక్కించుకోవాలని అతడున్నాడు. ఈ రెంటికీ సాపత్యం ఎలా కుదురుతుంది?”
“ఏడిసినట్టేఉంది నీ సిధ్ధాంతం.  సౌందర్యం, శూరత్వం లేని లోకాన్ని ఏమి చేసుకుంటావు నువ్వు ఋషీ?” అడిగింది ఊర్వశి.
“రెండూ అనలేదు నేను.  ఈ రెంటిలో ఏదో ఒకటని గదా చెప్పాను!” అన్నాడు.
“అదీ అంతే దౌర్భాగ్యం.  అడవిలో పుట్టే కార్చిచ్చు అడవినే దహించేట్లుగా, సౌందర్యంలేని లోకంలో శూరత్వమూ, శూరత్వంలేని లోకంలో సౌందర్యమూ వాటికవే నాశకాలవుతాయి.  ఇంతెందుకు…దుఃఖం లేకుండా జీవితం భరించలేనంత దుర్భరంగా ఉందని నీవేగా అన్నావ్…అప్పుడే మర్చిపోయావా?” అంది ఊర్వశి.

ఊర్వశి – పురూరవ: ఒక ప్రస్తావన-పునర్వీక్షణ (3)

రెండు

ఎన్నాళ్ళతరువాతనో తెలివొచ్చి “ఇంత బాధా?” అన్నాడతడు.
“చెప్పానా?” అందీమె.
“తెలుసుకోలేక పోయాను. ఎవ్వరికీ తెలీకుండా నేనొక్కడినే ఇంత సౌందర్యపు బాధను అనుభవించలేను!” అన్నాడు.
“మరిప్పుడేమిటి?” అందీమె.
“నన్నొదిలి వెళ్ళిపో!” అన్నాడతడు.
“జరగని పని అది.  నేనేమిటో ఎవ్వరికీ తెలియకుండా పడిఉన్నంత వరకూ నాకే చింతనా లేదు. నిన్ను చూస్తుంటే నెనింతటి బాధనేనా? అనిపిస్తోంది. ఇప్పుడు నిన్ను నేను వదలను!” అందీమె.
“అర్ధమైంది. ఒక్క క్షణం ఆగు.  నీకో చిత్రం చూపిస్తాను” అంటూ ఒక్కక్షణం కళ్ళు మూసి తెరిచి “అటు చూడు!” అన్నాడతడు.
చూసిందామె.
అలవిమాలిన శోకంతో ఉన్నాడక్కడ మరొకడు, వీరుడు.
“ఎవరతడు…ఎందుకా శోకం?” ప్రశ్నించిందామె.
“నన్ను నేను తిరగరాసుకో మన్నావుగా…రాసుకున్నాను.  దగ్గరగా వెళ్ళి చూసుకో!” అన్నాడు.
“ఊహూ…అంత తొందరగానా…ఇంకాసేపు విలపించనీ…వలపించడంగురుంచి తరవాత ఆలోచిద్దాం!…ఇంతకీ ఎవరతడు?” అడిగిందామె.
“పేరు పురూరవుడు. మహావీరుడు…అదిచూసేగా నువ్వూ అతడిని ప్రేమించిందీ!” అన్నాడితడు.
“నేనా? ఇదెప్పటిమాట?” ప్రశ్నించిందామె.
“నీ జ్ఞాపకాలలో ఇంకా పుట్టలేదులే అది…ఇప్పుడేగా నా ఊహలో ఊపిరిపోసుకుందీ!” అన్నాడితడు.
“వలపన్ని నన్ను బంధించే యత్నం చేస్తున్నావా ఋషీ?” అంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుందామె.


ఊర్వశి – పురూరవ: ఒక ప్రస్తావన-పునర్వీక్షణ (2)

ఒకటి

ప్రతి మానవుని అంతఃకరణంలో ఒక స్వప్నలోకం ఇమిడి ఉంటుంది.  చేతనలో ప్రత్యక్షానుభవాలకూ, అనుభూతులకూ కళ్ళు గవాక్షాలుగా మెలుగుతాయి.  చేతనో, అచేతనో తెలియనటువంటి ఒక సందిగ్ధ చేతనావస్థలో కలిగే అనుభూతులకు స్వప్నం గవాక్షమనుకుంటే, ఆ గవాక్షంలోంచి తమకంతో ఆవలి వైపుకు తొంగిచూసే ప్రయత్నం చేసిన ఒక తృషితుడికి, ఆవలి వైపు కనిపించిన చిత్రం – ఊర్వశి.

మహా సౌందర్యవతి.  ముగ్ధుడై అతడామెను ఆహ్వానించాడు.  ఆమె రానన్నది.  అతడు రావలసిందే అన్నాడు.  ఆమె మళ్ళీ రాననే అన్నది. అతడు రెట్టించాడు.  ప్రతిగా ఆమె ఒకసారి బాగా ఆలోచించుకోమన్నది.  బాగా అలోచించుకునే అడుగుతున్నానన్నాడితడు.  నన్ను నువ్వు భరించలేవు అన్నదామె.  అతడు పరిహాసంగా నవ్వి, ఊహించుకున్న వాడిని భరించలేనా? అన్నాడు.  పిచ్చివాడా, ఊహ వేరు, భరించడం వేరు. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోమన్నదామె.  అతడు వినలేదు.  మోహుడా, నేను తప్తను. ఇలా పడిఉన్న దానిని ఇలాగే ఉండనీ, నన్ను కదిలించకు. నా స్పర్శ నీకంత మంచిది కాదు. నన్ను వహించి పరితప్తుడవౌతావు అని హెచ్చరించిందామె.  పరవాలేదు, నాకా సుఖం కావాలి అన్నాడితడు.  సుఖం కాదది, దుఃఖం, భరించలేవు అంది.  భరించగలను, నీకేం తెలుసు, ఏ దుఃఖమూ లేకుండా బతుకు ఎంత దుర్భరంగా ఉందో? అన్నాడు.  అలాగా, మూర్ఖుడా, అయితే అనుభవించు, నీ కర్మ. నీ లాంటి ఇంకొకడిని సృష్టించికోవడానికి సిధ్ధంకా, అంటూ ఆమె
కదిలింది.  ఆనందం పట్టలేక అతడూ కదిలిపోయాడు.  ఊహారూపయై అతడి హృదయంలో కుదురుకుందామె.

మరుక్షణం హతాసుడై పడిపోయాడతడు.