తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

ఆంధ్రుల లేదా తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర గురించిన ఈ notes లో తొలి వెయ్యేళ్ళు అంటే క్రీస్తు శకాబ్దం మొదలుకొని ఆపై వెయ్యేళ్ళదాకా అని అనుకున్నది.
అయితే, ఇది నిజానికి ఇంకో రెండువందల పాతికేళ్ళు ముందుకు వెళ్ళి అదనంగా మరో రెండువందలపాతికేళ్ళు కలిసి మొత్తం పన్నెందువందల పాతిక
సంవత్సరాలవుతుంది. దీనికి కారణం, శాతవాహనుల పరిపాలనతో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర మొదలవుతుంది/మొదలుపెట్టుకోవాలనుకుంటే,
శాతవాహనుల పాలన క్రీ.పూ.225 లో మొదలై క్రీ.శ.225 తో అంతమయిందని చరిత్రకారులంటారు గాబట్టి. శాతవాహనుల పరిపాలనలో తెలుగువాళ్ళ
సాంఘిక చరిత్రకు కూడా క్రీ.పూ.225 నుంచి ఆధారలు దొరకాలి.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి. ఆంధ్ర భృత్యులని మాటకూడా ఉంది. దీనిమీద లేచినవివాదం ఇంకా ఎటూ తెలకుండానూ ఉంది. ఆంధ్రులైన భృత్యులా?
ఆంధ్రులకు భృత్యులా? ఆంధ్రులు వేరే రాజవంశం వారై, వారికి శాతవాహనులు సామంతరాజులా? అని మీమాంస. అదెలా ఉన్నా, నాలుగున్నర శతాబ్దాల
వీరి పరిపాలన మాత్రం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లిందని చెప్పుకోవాలి. నాలుగున్నర శతాబ్దాలు ఒకే రాజవంశం ఒక భూభాగాన్ని నిరాటంకంగా పరిపాలించడం
అంత సులభంగా జరిగే పని కాదు. అయినా శాతవాహనుల విషయంలో అది సాధ్యమైంది. తరానికి 25 సంవత్సరాల చొప్పున (చరిత్ర పరిశోధనలో తరానికి 25
సం.గా వేసుకుని లెక్కిస్తారని చదివాను) నాలుగున్నర శతాబ్దాలకు 18 తరాలవుతుంది. అంటే తరం నుంచి తరానికి సాగే జ్ఞాపకాల ప్రవాహంలో
పరిస్థితులలోనూ పరిపాలకులకు చెందిన విషయాలలోనూ ఏవిధమైన మార్పూ లేకుండా 18 తరాలు గడవడం, జ్ఞాపకాల, అనుభవాల ప్రవాహం నిరాటంకంగా
కొనసాగడం అన్నది చరిత్రలో ఒక అరుదైన సందర్భం, ఒక luxury గానే చెప్పుకోవాలి. ఆ సందర్భాన్ని, ఆ luxury ని  శాతవాహనుల పరిపాలనలో
అప్పటి ప్రజలు అనుభవించారు.

ఈ సుఖాన్ని అనుభవించిన వాళ్ళలో తెలుగు మాతృభాషగా ఉండిన తెలుగువాళ్ళూ ఉన్నారు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అప్పుడు, అంటే
శాతవాహనుల పరిపాలనా కాలం నాటికి, ఆంధ్రులు తెలుగువాళ్ళూ ఒక్కటి కాదా? అని. కాదనే నేను అనుకుంటాను. అయితే గనక, ఆంధ్రులైన
శాతవాహనులు తమ మాతృభాష అయిన తెలుగును వదిలి ప్రాకృతాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు? శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజబాష, ప్రజల భాష
కూడాను! ప్రాకృతంలోనే కదా గాథాసప్తశతిలోని గాథలన్ని ఉన్నాయి! అయితే, అప్పటికి తెలుగింకా పూర్తిగా పరిణతిచెందిన భాషగా కాకుండానన్నా
ఉండిఉండాలి. అలా అనుకోవడానికీ వీలు లేదు.  కారణం, గాథాసప్తశతిలో అక్కడక్కడా కనుపించే అత్తా (అత్త), అద్దాఏ (అద్దం) లాంటి కొన్ని తెలుగు
పదాలు, తెలుగు అప్పటికే పూర్తిగా పరిణతి చెందిన భాషగా ఉండినదనీ, ఎంత పరిణతి అంటే, అందులోని కొన్ని మాటలు వేరే భాషలోకి వెళ్ళగలిగేంత పరిణతి
చెందిన భాషగా శాతవాహనుల కాలంనాటికే ఉండినదనీ, పూజ్యులు కీ.శే.తిరుమల రామచంద్ర గారు తమ వ్యాసాలలో ఇప్పటికే నిరూపించి ఉన్నారు కాబట్టి!

అదలా ఉంచితే, “ఆంధ్రశ్చ బహువః” అనే మాట ఒకటి ఉంది. దీని అర్ధం ఆంధ్రులు పలువురు అని. అంటే, పలు జాతుల ప్రజలు కలిసి ఆంధ్రులు
అయ్యారని ఇది సూచిస్తుంది. ఇది నానుడి. ప్రజల నాలుకలపైనుంచి వచ్చిన మాట. దీనికి నిదర్శనాలు, ఆధారాలూ దొరకవు. తరం నుంచి తరానికి ఇలా
దిగుమతి అయిన జ్ఞానంలో నిజం బొత్తిగా ఉండదు అనుకోవడం సాహసమే అవుతుంది. ఈ పలు జాతుల ప్రజలలో తెలుగు మాతృ భాషగా కలిగిన తెలుగువాళ్ళూ
ఉండిఉండవచ్చు. కాదనటానికి లేదు. బలమైన, ప్రభావవంతమైన జాతి కావడం మూలాన పోనుపోను ఆంధ్రులంటే, తెలుగువాళ్ళన్నది స్థిరపడి పోయి
ఉంటుందనుకోవాలి.

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర: అంధ యుగం – గ్రంథ యుగం

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర: అంధ యుగం – గ్రంథ యుగం

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్రను గురించిన ముఖ్యమైన సమాచారాన్ని, సంగతులను సేకరించుకుని ఒకచోట రాసుకోవడానికి వీలుగా ఇదేమిరకమైన విభజన అనిపించినా, నాకు మాత్రం ఇది ఒక విధమైన (convenient) స్థూల విభజనలాగానే అనిపిస్తుంది.

ఇందులో, అంధ యుగం అని నేను విభజించుకున్నది – తారీకంటూ లేని/తెలియని తొలినాళ్ళ నుంచి క్రీ.శ.1000 సం. దాకా (అంటే గీత గీసినట్లు వెయ్యవ సంవత్సరందాకా అని కాకుండా ఆ ప్రాంతాలదాకా) ఈ అంధ యుగంలోకి చేర్చుకుంటాను. కారణం – వ్రాతలో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్రను గురించి తెలిపే ఆధారాలేవీ ఈ యుగంలో దొరకవు గాబట్టి. దొరికిన శిలాశాసనాలన్నీ దానశాసనాలు. ఇందులో పెద్దగా సామాన్యజనుల సాంఘిక చరిత్రకు సంబంధించిన అంశాలేమీ వుండవు. అందువలన, ఈ యుగానికి చెందిన జనజీవనానికి సంబంధించిన ఆసక్తికరమైన అదనపు సమాచారం చిన్నదైనా సేకరించడం చాలా కష్టం, challenging గా ఉండే పని.

ఇక రెండవది  గ్రంథ యుగం – పేరు సూచించేటట్లుగానే, రాజరాజు కోరికతో నన్నయ మహనీయుని చేతులమీదుగా క్రీ.శ.1050 ప్రాంతంలో మొదలైన గ్రంథ రచన, ఆ తరువాత శతాబ్దాలుగా నిరాటంకంగా సాగి, ఇప్పటికీ సాగుతూనే ఉంది. పోను పోను కాలంలో వ్రాత అనేది  పరిణతిచెంది సర్వ సామన్యమైన తరువాత సంగతులన్నీ గ్రంథస్థం చేయబడినాయి.  శాసనాలు చాలమటుకు రాజుల చరిత్రనే చెప్పాయి. తాళపత్రాలు మిగతా సంగతులతో పాటు, అప్పుడప్పుడూ జనసామాన్యం జీవన విశేషాలను చెప్పాయి. అయితే, ఈ యుగానికి సంబంధించి అదనపు సమాచారం పెద్దగా సేకరించగలిగింది ఏమీ లేదనే అనిపిస్తుంది. ఉన్నదేదో ఇప్పటికే పెద్దలచేత బయటపెట్టబడింది గాబట్టి. ఈ యుగంలో కూడా, వెతకడానికి మిగిలి ఉన్నవిగా చెప్పాల్సినవి దొరకకుండాపోయిన ప్రసిధ్ధకవులవే గానీ, అంత ప్రసిధ్ధులు కానివారివి గానీ రచనలు. కాలగర్భంలో కలిసిపోయినవిగా అనుకోబడుతున్నవాటిని వెలికి తీసి వెలుగుచూపించడానికి కొంత అదృష్టంతో సహా ఇంకా చాలా కలిసిరావాలి.

అలాగని ఈ గ్రంథయుగంలో ఇక వెదకడానికి ఏమీ లేదని అనుకోవడంకూడా తెలివైన మాటకాదు. ఎందుకంటే, తెలుగువాళ్ళ చరిత్రకు సంబంధించిన చాలానే సంగతులు ఇంకా అపరిష్కృతాలుగా మిగిలున్నవి ఉన్నాయి. ఉదాహరణకి, శాతవాహను లెవరు? వీళ్ళు పుట్టుకతో ఆంధ్రులేనా? అనే ప్రశ్నకు ఇది final అని చెప్పుకోదగిన సమాధానం ఇంతవరకూ లేదు. అలాగే, కాకతీయులు ఎవరు? అన్న ప్రశ్నకూ, ‘కాకతి’ అనే మాట ఏ అర్ధాన్ని సూచిస్తుంది? కాకతి శక్తి ఎవరు? ఇలాంటి ప్రశ్నలకూ ఇది అంతిమం, దీనికిక తిరుగులేదు అని చెప్పుకోదగ్గ, అందరూ ఒప్పుకోదగిన, ఒప్పుకున్న సమాధానం లేదు, నాకు తెలిసినంతవరకూ, నేను చదివున్నంతవరకూ. ఇలాగే, పల్లవులు ఇక్కడివారా? బయటనుంచి వచ్చిన వారా? పల్లవ అనే మాటకు ఏమిటి అర్ధం? బృహత్ఫలాయన, శాలంకాయన, ఇత్యాది చిన్న చిన్న రాజవంశాలవారు ఇక్కడివారేనా? లేక బయటినుంచి వచ్చినవారా? ఇక్కడివారే అయితే వీరి పూర్వులు ఎవరు? ఈ వంశనామాలు దేనిని సూచిస్తాయి? ఇవి వంశనామాలేనా లేక గోత్రనామాలా? గోత్రనామాలే వంశనామాలుగా ఎందుకయ్యాయి? ఇలాంటి ప్రశ్నలకూ సరయిన convincing సమాధానాలు దొరకవలసే ఉంది ఇంకా!

అందువలన, (నా విభజనలో) అంధయుగంలోనే కాదు, గ్రంథయుగంలోని సంగతులకు సంబంధించిన సమాచారమూ సమగ్రమేమీ కాదు! అందులోకూడా ఇంకా తెలియాల్సింది ఉందనే అనుకోవాలి. చరిత్ర గురించి రాయడం out of fashion అయిపోయి చాల రోజులే అయింది. ఒకప్పుడు, 1970 ల దాకా కూడా, చరిత్ర గురించి రాయడం ఒక యజ్ఞంగా తీసుకుని కృషి చేసిన వాళ్ళున్నారు. ప్రచురించిన పత్రికలూ ఉన్నాయి. అవన్నీ గ్రంథాలయాల్లో భద్రంగానే ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుతూనే ఉన్నారు, రాయడానికి సాహసించకపోయినా!

కీ.శే. సురవరం ప్రతాపరెడ్డిగారు తమ ఆంధ్రుల సాంఘిక చరిత్రలో శాతవాహనుల కాలం నుండి క్రీ.శ.వెయ్యి దాకా ఆంధ్రుల సాంఘిక చరిత్రను గ్రంథస్థం చేయాలని అభిలషించారుగాని, ఏ కారణం చేతనో, అది కార్యరూపం దాల్చలేదు. ముందు చెప్పుకున్నట్లుగానే, వెయ్యి తరువాత ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాయడానికి తగినన్ని ఆధారాలు ఉన్నందువలన వీలయ్యే పనే! వెయ్యికి ముందు చరిత్ర రాయడానికి సరయిన ఆధారాలు ‘sources’ లేకపోవడం అనడం కంటే లభ్యంకాకపోవడం వలన అంత సులభంగా జరగే పనికాదు.

అందువలన ఆంధ్రుల చరిత్రలో తొలి వెయ్యేళ్ళు ఓరకంగా అంధయుగమే! అలా అన్నంత మాత్రాన, ఇక కృషి చెయ్యడానికి ఏమీ లేదని కాదు; చేయగలిగినంత ఉంది…ఉంటుంది!

ఆంధ్రుల చరిత్ర : బృహత్ఫలాయనులు

‘బృహత్ఫలాయన’ మహారాజ జయవర్మ

ఆంధ్ర దేశాన్ని శాతవాహనులు దాదాపు నాలుగువందల సంవత్సరాలు పరిపాలించారు.  వారి పాలన స్థూలంగా క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 దాకా సాంగిదని చరిత్రకారులు చెబుతారు.  శాతవాహనుల తరువాత ఆంధ్ర దేశాన్ని పాలించిన ప్రసిధ్ధ రాజవంశం ‘ఇక్ష్వాకు’ వంశం.  ఈ వంశం పురాణ ప్రసిధ్ధి చెందినది.  వీరి పాలన తరువాత ఆంధ్ర దేశాన్ని చిన్న చిన్న రాజవంశాలు పాలించాయి. బ్రృహత్ఫలాయన, శాలంకాయన, ఆనందగోత్రులు అనే పేర్లతో వున్న ఈ రాజవంశాలకి ఈ పేర్లు వారి ‘గోత్ర’ నామాల మీదుగానే వచ్చాయని చెబుతారు. బృహత్ఫలాయనులది బృహత్ఫలాయన గోత్రం, శాలంకాయనులది శాలంకాయన గోత్రం, ఆనందగోత్రులది (వారి పేరులోనే వున్నట్లుగా) ఆనంద గోత్రం…ఇలాగ!  బృహత్ఫలాయనుల విషయంలోనే కాదు, శాలంకాయన మరియు ఆనందగోత్రుల విషయంలోనూ వారి శాసనాలలో ఎక్కడా వారి వంశ నామం చెప్పబడి వుండక పోవడం వలన ‘గోత్ర’ నామాలే వాళ్ళ వాళ్ళ వంశ నామాలయ్యాయి! చరిత్రకారులు వాళ్ళను గోత్రనామాలతోనే పిలుచుకోవాల్సి వచ్చింది! (ఇది ఇంచుమించు ఎలాంటిదంటే, పల్లవులను ‘భారద్వాజు’ లనీ, కాదంబులను ‘మానవ్యు’ లనీ పిలుచుకోవడం లాంటిదని చెబుతారు!)

బృహత్ఫలాయన వంశానికి చెందిన రాజు ఆంధ్ర చరిత్రలో ఇప్పటివరకూ ఒక్కడే ఒక్కడు కనిపిస్తాడు.  ఆ రాజు పేరు ‘జయ వర్మ’. ఈయన తన పరిపాలనా కాలంలో వేయించిన ఒక తామ్ర శాసనం వలన ఈయనకు సంబంధించిన చరిత్ర కొద్దిగానయినా బయటపడింది.  ఆ తామ్ర శాసనం నేటి గుంటూరు జిల్లా, తెనాలి కి దగ్గరిలోని ‘కొండముది’ అనే గ్రామంలో దొరకడం వలన, ఈ శాసనానికి ‘కొండముది’ తామ్ర శాసనం అనే పేరు వచ్చింది. ఈ ‘కొండముది’ తామ్ర శాసనం వలననే ‘బృహత్పలాయన’ అనే పేరుతో ఒక గోత్రం వుందన్నది వెలుగులోకి వచ్చిందని పెద్దలు చెబుతారు. ఈ గోత్ర నామం (‘బృహత్ఫలాయన స గొత్తొ’ అన్న మాటలలో) ఈ ఒక్క శాసనంలో తప్ప వేరే ఎక్కడా ఇంతవరకూ లభించకపోవడం అందుకు కారణం అని కూడా చెబుతారు.

కొండముది శాసనం ఒక దాన శాసనం! ఇందులో ‘మహేశ్వర’, ‘బృహత్ఫలాయన’ అన్న రెండు మాటలు తప్ప మిగతా అంతా ప్రాకృతంలో వుంటుంది.  ఈ శాసనంలోని రాజముద్రికలో జయవర్మ మహారాజు పేరు కనబడుతున్నది.  ఈయన బృహత్ఫలాయన గోత్రుడు. మహేశ్వర పాద భక్తుడుగా అందులో వర్ణించబడినాడు.

ఈ ‘కొండముది’ దాన శాసనంలో ఈ మహారాజు తన రాజ్యంలో వున్న ‘కూడూరుహార’ లోని ‘పంతూరు’ అనే గ్రామాన్ని ఎనమండుగురు బ్రాహ్మణులకు (బ్రాహ్మదేయంగా) ఇచ్చి వున్నానని కూడూరు లోని తన ‘వ్యాపృతు’ నకు ఈ శాసనంద్వారా తెలియజేశాడు. ఇక్కడ వాడిన ‘వ్యాపృత’ అనే మాట రాజ్యంలోని (Administrative) విభాగాలకు సంబంధించిన కొంత సమాచారాన్ని వెలుగులోకి తెచ్చి చూపెడుతుంది. అప్పటిలో రాజ్యంలోని భూభాగం పరిపాలనా సౌలభ్యం కోసం ‘ఆహారా’ లుగా విభజించబడి, ఒక్కొక్క ‘ఆహారము’ ఒక్కొక్క అధికారి చేతులలో పెట్టబడి వుండేది, ఆ అధికారి హోదాను ‘వ్యాపృత’ నామంతో పిలిచేవారు. ఈ ‘వ్యాపృత’ పదం ‘వియపత’ అన్నరూపంలో అశోకుని శాసనాలలో కనిపిస్తుంది. ఈ పదానికి పాణిని చెప్పిన ఇంకొక రూపమే ‘ఆయుక్త’. ఈ రెండూ కూడా శాతవాహనుల ‘ఆమకు’ లకు, ఆ తరువాతి కాలంలోని ‘విషయపతు’ లకు సమానమైవని చెబుతారు. ఈ ‘వ్యాపృత’ పదానికి ప్రాకృత రూపమైన ‘వాపతమ్’ జయవర్మ వేయించిన కొండముది శాసనంలోనూ, పల్లవ రాజైన యువమహారాజ శివ స్కందవర్మ వేయించిన ‘మైదవోలు’ శాసనంలోనూ కనిపిస్తుంది. దీనిని బట్టీ, మైదవోలు, కొండముది శాసనాలలోని లిపి కూడా ఒకేరకంగా వున్నట్లు అనిపించడాన్నిబట్టీ, బృహత్పలాయన జయవర్మ, యువమహారాజ శివ స్కందవర్మ సమకాలీనులయి వుండవచ్చన్న అభిప్రాయానికి Dr.Hultzsch వంటి లిపి శాస్త్రజ్ఞులు (epigraphists) వచ్చారు!  (పల్లవ యువ మహారాజ శివస్కందవర్మ వేయించిన ఈ ‘మైదవోలు’ తామ్ర శాసనానికి ఆంధ్ర చరిత్రలో ఒక ప్రముఖ స్థానం వుంది. దేశపరమైన ‘ఆంధ్ర’ శబ్దం ప్రయోగం మొట్టమొదటగా ఈ శాసనంలో జరగడం, ఇందువలన ఈయన పరిపాలనా కాలమైన క్రీ.శ.మూడవ శతాబ్దం నుంచే ‘ఆంధ్ర’ శబ్దం దేశ సూచకంగా వాడుకలో వుండినదని ఈ శాసనంలోని ‘అంథాపథీయో’ అనే మాటల వలన తెలియడం, ఈ శాసన ప్రాముఖ్యానికి గల కారణాలు!)

పల్లవ శివ స్కందవర్మ రాజ్యం చేస్తున్న కాలంలో (అంటే క్రీ.శ.మూడవ శతాబ్దం ఉత్తరార్ధంలో) బృహత్ఫలాయనులు వేంగిని పరిపాలిస్తూండే వారనీ, ఇక్ష్వాకులు ఆంధ్ర దేశాన్ని (అంటే శ్రీశైలం, దక్షిణ కోసల మరియు గోదావరీ ఉత్తర కోస్తా తీర ప్రాంతం అంతా కలిసివున్న ప్రదేశాన్ని) పాలిస్తూండేవారనీ కూడా ఒక అభిప్రాయానికి చరిత్రకారులు రావడం జరిగింది.  దీనిని బట్టి చూస్తే, ఇక్ష్వాకుల పరిపాలనా కాలం, బృహత్ఫలాయన జయవర్మ రాజ్యం చేసిన కాలం, పల్లవుల రాజ్య కాలం అన్నీ సమకాలికాలై కనిపిస్తాయి. ఈ రాజుల పరిపాలనా కాలం క్రీ.శ.మూడవ శతాబ్దం!

అయితే, నాణానికి ఒక వైపు లాంటి పై అభిప్రాయానికి, రెండవ వైపు లాంటి వేరొక అభిప్రాయం కూడా వుంది! ఆ అభిప్రాయం ప్రకారం, మైదవోలు శాసనాన్ని యువమహారాజు శివస్కందవర్మ, తన తండ్రి (బప్ప) రాజ్యం చేస్తున్న కాలంలో ఇచ్చాడని, ఈ శాసనంలోని లిపినీ, బృహత్ఫలాయన జయవర్మ ఇచ్చిన ‘కొండముది’ శాసనంలోని లిపినీ పోల్చి చూస్తే, జయవర్మ యొక్క కొండముది శాసనం మైదవోలు శాసనం కంటే కనీసం ఒక తరం ముందుదనీ, కాబట్టి జయవర్మ, పల్లవ శివస్కందవర్మ కంటే కనీసం ఒక తరం ముందు రాజ్యం చేసి వుంటాడనీ కూడా చెబుతారు. చారిత్రకంగా కూడా ఇదే నిజమైనదన్న అభిప్రాయం కూడా వుంది!  కృష్ణకు దక్షిణాన వున్న ప్రాంతాల దాకా కూడా జయవర్మ అధికారం చెల్లిందనీ, ఆ దిగువన అంతా పల్లవ రాజ్యం క్రింద వుండినదనీ కూడా ఇక్కడ నిర్ణయించుకోవచ్చు.

బృహత్ఫలయాన వంశ మూలపురుషుడు ఎవరో తెలుసుకోవడానికి ఏ ఆధారమూ లేదు.  కొండముది శాసనంలో కూడా ఈ ప్రస్తావనలేక పోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాదాపుగా సమకాలీకులైన  పల్లవ, శాలంకాయనుల శాసనాలలో ఈ ఆచారం పాటింపబడి వుండడం ఇందుకు కారణం! కొండముది శాసనంలో, జయవర్మ తన తండ్రి పేరును తెలుపకపోయి వుండడం వలన, జయవర్మ తనకు తానుగానే తన ఒక్కడి కృషిద్వారా రాజ్యాన్ని దక్కించుకుని, తద్వారా బృహత్ఫలాయన వంశానికి మూలపురుషుడై,  ఆ వంశంలో ఒక్కడే ఒక్క రాజుగా చరిత్రలో మిగిలిపోయాడా? అన్న సందేహం కూడా కలుగుతుంది. అయితే, ఈ సందేహం తీరడానికి సరిపోయే ఆధారాలేవీ చరిత్రలో మిగలలేదు, మిగిలినా ఇప్పటివరకూ లభ్యం కాలేదు!

(ఈ చిన్న వ్యాసం వ్రాయడంలో సంప్రదించిన ప్రముఖుల పుస్తకాలు: (1) Early history of the Andhra Country – Dr.K. Gopalachari (2) ఆంధ్రుల చరిత్రము – (ప్రథమ భాగం) – చిలుకూరి వీరభద్రరావుగారు      (3) చరిత్ర చర్చ – ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి.)

తెలుగు మాట, పాట, పద్యం (5)

అచ్చ తెనుగు పద్యం

తెలుగు పద్య సాహిత్యంలో ‘అచ్చ తెనుగు’ అన్న మాటను మొదటి సారిగా వాడిన వ్యక్తి మూలఘటిక కేతన అని చెబుతారు. ఈయన తిక్కన మహాకవి సమకాలికుడు. తెలుగులో మొదటి కథాకావ్యానికి (దశకుమార చరిత్ర) శ్రీకారం చుట్టినవాడు కేతన. ‘కవిత చెప్పి’ తిక్కన మహాకవినే మెప్పించినవాడు ఈయన.  ఈయన చెప్పిన ఈ ‘అచ్చ తెనుగు’ అనే మాటకు ముందు, ఈ మాట ఏ అర్ధాన్నయితే సూచిస్తుందో అదే అర్ధంలో ‘జాను తెనుగు’, ‘దేశి’ అనే మాటలు వాడుకలో వుండేవి. ఈ మాటలను తమ పద్యాలలో చెప్పిన వారు ‘నన్నె చోడుడు’, పాలుకురికి సోమనాధుడు!

పేరుకి ఇన్ని మాటలున్నా, ఈ మాటలు ‘అచ్చ తెనుగు’ భాషా స్వరూపాన్ని అర్ధమయేలా చేయడంలో సఫలీకృతం కాలేకపోయాయన్న ఒక అభిప్రాయం, విజ్ఞుల మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి! భాషా స్వరూపం అర్ధం కావాలంటే, ఒక ఉదాహరణంతో చెప్పుకుంటే, కొంతలో కొంత స్ఫష్టత వచ్చి, సులభం అవుతుంది.

“పగలు సేయుచు వేడిమి మిగుల జగము
గ్రాచు జమునబ్బ మున్నీట గలిసె ననియొ
తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపు
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”

కూచిమంచి తిమ్మకవి రచించిన ‘అచ్చ తెలుగు రామాయణం’ కావ్యంలోనిది ఈ పద్యం. సూర్యాస్తమయాన్ని సుందరంగా వర్ణించే పద్యం! నాకయితే, ఈ పద్యంలోని మాటల పొందిక, brevity, గాథా సప్తశతిలోని గాథలను తలపుకు తెస్తుంది. మంచి భావంతో నిండి వున్న పద్యం! ఊహ original ది! నాకు తెలిసినంతవరకూ, ఏ ప్రాకృత గాథనుంచో, సంస్కృత శ్లోకంనుంచో ఎత్తుకొచ్చింది కాదు!

ఇప్పుడు, ఈ పద్య భావాన్ని కొంచెం విడమరచి చెప్పుకుంటే…

‘పగలు సేయుచు’ – పగలు సేయువాడు – దినకరుడు.
సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ, కొన్ని రకాలయిన సంస్కృత సమాసాలు అచ్చ తెలుగులోకి మారేటప్పుడు జరిగే మార్పులను గురించి కొంత వివరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సంస్కృత సమాసాలలోని ప్రత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, దొర, తపసి, జోదు…ఇత్యాది శబ్దాలు జతవుతాయి అని వ్యాకరణం. ఉదాహరణకి:

అచ్చ తెలుగులో ‘కప్పు కుత్తుక వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘నీలకంఠ’ కు,
అచ్చ తెలుగులో ‘గిత్త తత్తడి వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘వృషభ వాహన’ కు,
అచ్చ తెలుగులో ‘వెంట్రుక యడుగుల దొర’ అనే సమాసం, సంస్కృతంలో ‘రోమ పాద’ కు,
అచ్చ తెలుగులో ‘మనుబోతు కొమ్ము తపసి’ అనే సమాసం, సంస్కృతంలో ‘ఋష్యశృంగ’ కు,
అచ్చ తెలుగులో ‘పచ్చ వారువపు జోదు’ అనే సమాసం, సంస్కృతంలో ‘హరిదశ్వా’ కూ అనువాదాలని పెద్దల వివరణ. తెలుగులో వీటినే బహువ్రీహి సమాసాలుగా భావిస్తారని కూడా చెబుతారు, అర్ధంలో చివరన కలది, కలవాడు చేరతాయి కాబట్టి. (నల్లని కంఠము కలవాడు, ఎద్దును వాహనముగా కలవాడు…ఇత్యాదిగ).

నాకయితే తెలుగులో ఈ మాటలు, సంస్కృతంలో మాటలు ఎంత అందంగా కనిపిస్తాయో, తెలుగులోనూ అంతే అందంగా అనిపిస్తాయి. ఇలాంటివే ఇంకొన్ని సమాసాలు:

వలిగుబ్బలి రాచ కూతురు (హైమవతి – హిమవంతుని కూతురు, ‘వలిగుబ్బలి’ అంటే మంచుకొండ అని అర్ధం), పుట్ట బుట్టువు తపసి (వాల్మీకి – పుట్ట  నుంచి పుట్టిన తపస్వి), పదియరదముల దొర కొడుకు (దాశరధి – దశరధుని కుమారుడు) – ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలంత అందంగానే కనబడతాయి.

ఇక్కడితో ఇది ఆపి, అసలు పద్యానికొస్తే –

పగలు సేయుచు – పగటిని చేస్తూ, ఆ క్రమంలోనే; వేడికి మిగుల జగము గ్రాచు – వేడిమితో జగత్తునంతా వుడికించి ఇబ్బందికిలోను చేసే; యమునబ్బ – యముని తండ్రి (సూర్యుడు); మున్నీట – సముద్రములోనికి; కలిసె ననియొ – కలిసిపోయాడుగదా అని; తొగ వెలందుక – కలువ పూవు (అనే పడతి); నగియె – నవ్వింది; అమ్మగువ – ఆ కలువ సుందరి; పెంపు గని – సంతోషంతో వదనం పెద్దదవడం (కలువ వికసించడం అన్న భావం) చూసి; సయింపక – తాళ లేక; తమ్మి – తామర పూవు (అనే పడతి); మొగంబు మొగిచె – మొహం ముడుచుకుంది, చాటు చేసుకుంది.

సూర్యాస్తమయంతోనూ, చంద్రాగమనంతోనూ కలువలు వికసించడం అనేది ప్రకృతి ధర్మం. సూర్యాస్తమయంతో తామరలు వికసనం కొల్పోయినట్లయి, కళావిహీనంగా, ముడుచుకున్నట్లయిపోవడమూ ప్రకృతిధర్మమే! ఈ రెండు ధర్మాలనూ కలబోసి, ఒకే సందర్భానికి జతచేసి, హృద్యంగా చెప్పడం ఈ పద్యంలో జరిగింది.

నాకు ఈ పద్యాన్ని చదివినప్పుడల్లా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది. పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గాథా సప్తశతి లోని పద్యాలను తెలుగులోకి అనువదించడంలో ఈ పద్యాన్నే(సరిగ్గా ఈ పద్యాన్నే అని కాకుండా, ఇలాంటి పద్యాలనే) ఆదర్శంగా తీసుకున్నరేమో! అని. ఎందుకంటే, అందులోని చాలా పద్యాల నడక ఈ పద్యాన్నే పోలి వుంటుంది. ఉదాహరణకి:

“అడుగుదమ్ములందు బడివేడు పతివీపు
జిన్ని కొమరుడెక్కి చెలగి యాడ
అలుక యెంత తెగనిదయ్యును నిల్లాలి
మొగమునందు నవ్వు మొలచె నపుడు! “                (శతకం 1 గాథ 11)

“ఎవని వదలిన జీవంబు నవసి చనునొ
యతని నపరాధినయ్యు నోదార్ప వలయు;
ఊరు గాలుచు బొలిపోవు చున్న గాని
యగ్గి నొల్లని వారెవ్వరతివ, చెపుమ?”         (శతకం 2, గాథ 63)

అందుండి అచ్చ తెలుగు మాటలలో వున్న ఇలాంటి రమ్యమైన పద్యాలను ఇంకా చాలానే ఉదాహరించవచ్చు!

ఛాయా చిత్రం (12)

మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (3)

దక్షిణ దేశ చరిత్రలోనే కాక మొత్తం భారత దేశ చరిత్రలోనే ప్రసిధ్ధి చెందిన శాతవాహన రాజవంశ పాలన క్రీ.శ.3వ శతాబ్దం పూర్వార్ధంలో ముగిసి ఆ వంశం తెరమరుగైంది. ఆ తరువాత పల్లవ, చాళుక్య, చోళ, కాకతీయ మరియు విజయనగర రాజ వంశాలు దక్షిణభారతాన్ని భాగాలుభాగాలుగానూ కొన్ని కొన్ని సమయాల్లో దక్షిణ భారతాన్ని మొత్తాన్నీ (స్థూలంగా) పరిపాలించాయి. ఈ రాజవంశాల రాజులు కళలను ఎంతగానో ప్రోత్సహించారు. వాటిల్లో ముఖ్యంగా ఆలయ నిర్మాణం అనే కళకు అన్ని రాజవంశాలూ తమ వంతు ప్రోత్సాహాన్ని అందించాయి. అందువలన, ఆలయ నిర్మాణం అనేది కాలం గడిచే కొలదీ నూతనాంశాలను తనలో కలుపుకుంటూ పరిణతి చెంది, చాళుక్య, చోళ, విజయనగరాజుల పాలనలో అత్యున్నత స్థాయికి చేరుకున్న కళ అయ్యింది.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం (11)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం (12)

దేవాలయం అంటే నాలుగు గోడల మధ్య ఒక దైవ ప్రతిమను వుంచి పూజించడం మాత్రమే కాదన్నది పై రాజవంశాల పరిపాలనల్లో నిర్మితాలయిన దేవాలయాలు చేబుతాయి. దేవాలయాన్ని ఒక బృహత్తర స్థాయిలో ఊహించడాన్నీ, plan చేయబడడాన్నీ, నిర్మించబడడాన్నీ ఈ రాజవంశాలు ఇష్టంగా ప్రోత్సహించాయి. కంచి, తంజావూరు, గంగైకొండచోళాపురం లాంటి ప్రదేశాల్లో నిలిచి వున్న దేవాలయాలను చూస్తే ఈ విషయం తెలుస్తుంది.

తమకు ముందు విలసిల్లిన ఆలయ నిర్మాణ పధ్ధతుల్లోని ఉత్తమమైన అంశాలను అన్నిటినీ తనలో ఇముడ్చుకుని విజయనగర రాజుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది. తమకు పూర్వులు ఊహించినట్లు దేవాలయాన్ని బృహత్తర స్థాయిలో ఊహిస్తూనే, రాతిపై చెక్కబడిన ప్రతిమలో లాలిత్యాన్ని తేవడానికి ప్రయత్నించి సఫలీకృతులైనవారు విజయనగర శిల్పులు. (ఈ మాట చాళుక్య, చోళ రాజుల కాలంలో నిర్మితాలయిన దేవాలాయలలోని ప్రతిమలలో లాలిత్యం లేదిని చెప్పే అర్ధాన్ని ఏమాత్రంగానూ ఉద్దేశించదు).
లెపాక్షి శ్రీ వీరభద్ర స్వామి వారి దేవాలయపు శిల్పాలలోనూ, స్థంభాల వసారాలోని రాతి స్తంభాలపై చెక్కబడిన బొమ్మ లన్నిటిలోనూ ఈ లాలిత్యం దర్శనమిచ్చి వీక్షకుల మనస్సులను అనంద పరుస్తుంది.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం (13)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం (14)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం (15)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం (16)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం (17)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం (18)

 

 

ఛాయా చిత్రం (7)

శిథిలాలయం

శిథిలాలయం అన్న మాట వినంగానే ఏదో మాటలతో చెప్పలేని బాధకూ, అస్పష్టమైన భావోద్వేగానికీ లోనవుతూ ఉంటాం. సాధారణ అర్ధంలో దేముడు నివసించే ప్రదేశం అని ఆలయం అన్న మాటకు ఉన్న అర్ధంలో, అలాంటి పవిత్రమైన ప్రదేశం శిథిలమవ్వడమన్న ఊహను మనసు భరించలేక పోవడంలోంచి ఆ బాధా, భావోద్వేగమూ పుడతాయనుకుంటాను.

చంద్రగిరి అన్న ఊరిపేరు చరిత్ర ప్రసిధ్ధి గాంచిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులను జ్ఞాపకానికి తెస్తుంది. ఒకరు మహామంత్రి తిమ్మరుసు, మరొకరు శ్రీకృష్ణదేవరాయలు. తిమ్మరుసు ఇక్కడే పుట్టి, పెరిగి విద్యాబుధ్ధులు నేర్చాడంటారు.

చంద్రగిరికి, కోటగా ఇప్పుడు మిగిలున్న ప్రదేశానికి , వెళ్ళే దారిలో, అంటే కోట గుమ్మం దాటంగానే, ఎడమచేతి వైపూ చూస్తే కనుపించేవే ఈ శిథిలాలయం ఫోటోలు. ఇది ఏ దేముని ఆలయమో, ఎప్పటినుంచి ఏ విధమైన activity లేకుండా ఇలా పాడుబడి వున్నదో తెలియదు.

శిథిలాలయం-1

శిథిలాలయం-2

శిథిలాలయం-3

శిథిలాలయం-4

శిథిలాలయం-5

ఉలి వెలుగులు : లేపాక్షి (7)

ఇక పెద్ద బొమ్మల కొలువు సంగతి. ఇది మళ్ళీ రెండు చోట్ల దర్శన మిస్తుంది. మొదటగా అసంపూర్తి కల్యాణ మండపంలో, తరువాత ఆలయం లోపల నాట్య లేదా రంగ మండపంలో.

ఆలయాన్ని ఆనుకుని కానీ, దగ్గరలోనే విడిగా కానీ ఒక కల్యాణ మండపాన్ని నిర్మించడం విజయనగర రాజుల కాలంలో నిర్మితాలైన ఆలయాలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది వీరి ప్రత్యేక శైలి గా చెప్పుకోవచ్చు. కల్యాణ మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడంలో శిల్పుల ప్రతిభా పాటవాలు బయటపడేవి. కల్యాణ మండపాల పైకప్పు మూలలన రాతి గొలుసులను వేళ్ళాడ తీయడం అలంకరణలో ఒక భాగంగా ఉండేది.  లేపాక్షి లో కల్యాణ మండపం పూర్తి అయితే ఎలా ఉండేదో తెలియదు గాని, అసంపూర్తిగా మిగిలిన కల్యాణ మండపంలో సైతం ఎన్నో చిత్రాలున్నాయి.

అసంపూర్తి కల్యాణ మండపం (ముందు వైపు) - లేపాక్షి

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మండపం ఇది. వారి కళ్యాణానికి బ్రహ్మ, విష్ణు, దేవేంద్ర, అగ్ని, యమ, వశిష్ఠ, విశ్వామిత్రాదులు విచ్చేసినట్లుగా స్తంభాలపై మలచబడిన మూర్తుల ద్వారా తెలుస్తుంది. పురుషాకృతులకు సైతం ఒకరకమైన వయ్యారాన్ని ఇచ్చి చెక్కి చూపించారు లేపాక్షి శిల్పులు. ఆలయాల్లో ప్రతిమల కన్నులు అరమోడ్పుగానూ, అర్ధ నిమీలతంగానూ ఉండడం సాధారణంగా చూస్తూంటాం. ఇది బౌధ్ధ శిల్పం నుంచి దిగుమతి అయిన ఒక ప్రతిమా లక్షణంగా నేను భావిస్తాను. బౌధ్ధం ప్రభావం తగ్గు ముఖం పట్టిన తరువాత గూడా దేవాలయాల్లో దేవతా ప్రతిమలను మలిచేప్పుడు ఆ తరువాత కొన్ని శతాబ్దాల వరకూ అరమోడ్పు కన్నులతోనే శిల్పులు మలిచేవారు. లేపాక్షిలో ఏ శిల్పానికీ ఈ లక్షణం లేదు. సూటిగా చూస్తున్న చూపులతో విశాలమైన నేత్రాలు, ఏదో చెప్పడానికి నోరు తెరవబోతున్నట్లుగా అనిపించే విచ్చీ విచ్చని పెదవులతో జీవకళ ఉట్టిపడే విధంగా మలచ బడి కనిపిస్తాయి. పై చిత్రంలో కల్యాణ మండపం ముందు వైపు రాతి స్తంభాల పై మలచ బడిన మూర్తులలో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. half shut eyes with closed tight lips బౌధ్ధ ప్రతిమ అయితే, fully open eyes, straight looks with slightly open mouth and sensuous spouting lips లేపాక్షి ప్రతిమ అని నా భావన. బుధ్ధ ప్రతిమది అలౌకిక, అంతర దృష్టి అయితే, లేపాక్షి ప్రతిమది లౌకిక, బాహ్య దృష్టి. దేని అందం దానిది.

ఉలి వెలుగులు : లేపాక్షి (6)

లేపాక్షి మొత్తంగా ఒక బొమ్మల కొలువు.  ఈ బొమ్మల కొలువుని స్థూలంగా రెందు విభాగాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది పెద్ద బొమ్మల కొలువు. రెండవది చిన్న బొమ్మల కొలువు. చిన్న బొమ్మల కొలువు ప్రధాన అలయాన్ని చుట్టి ఉండే మండపాలలోని స్తంభాల మీద చెక్కబడి దర్శన మిస్తుంది. రాతి స్తంభాలపై ఉన్న ఈ చిన్న చిన్న రుపాలన్నీ చేనేత వస్త్రాలపై డిజైన్లు గానూ, చిన్న పిల్లల కొయ్య బొమ్మల ఆటవస్తువులకు రూపాలుగానూ తీసుకోబడి వందల సంవత్సరాలుగా ఆయా చేతి వృత్తుల వారికి ఉపయోగపడుతూ వస్తున్నాయి. మండపంలో రాతిస్తంభాలపై ఆకృతులలో కొన్ని:

లేపాక్షి (6)

లేపాక్షి (7)

లేపాక్షి (8)

లేపాక్షి (9)

ఉలి వెలుగులు : లేపాక్షి (5)

ఊయల మండపం - లేపాక్షి

శాతవాహనుల కాలంలో బౌధ్ధ మత ప్రభావంతో స్తూప, చైత్య, విహార, గుహాలయాల నిర్మాణంలో ఆంధ్ర శిల్పుల పనితనం అందరూ ఎరిగినదే.  అమరావతి, నాగార్జున కొండ, ఘంటసాల, జగ్గయ్యపేట, ఉండవల్లి ఇత్యాది ప్రదేశాలలో ఇప్పటికీ పదిలంగా ఉన్న బౌధ్ధమతానికి చెందిన అవశేషాలు ఇందుకు నిదర్శనాలుగా నిలుస్తాయి. తరువాతి కాలంలో పల్లవులు, చాళుక్యులు, చోళులు, హొయసలులు మొదలగు రాజవంశాలు ఇచ్చిన ప్రోత్సాహంతో దక్షిణ భారతంలో హిందూ దేవాలయాల నిర్మాణం విస్తృతంగా కొనసాగి దేనికదే ఒక రీతిగా రూపు దిద్దుకుని విలసిల్లాయి.  ఆలయాల నిర్మాణంలో పల్లవులది ఒక ప్రత్యేకమైన శైలి.  చాళుక్య, చొళులది ఒక రకమైన శైలి. హొయసలులది మరొక రకమైన అద్భుతమైన శైలి. ఈ మూడింటిలో సాధారణాంశాలు బోలెడున్నా, దేనికదే ప్రత్యేకమైన శైలిగా చెప్పుకోదగ్గ, గుర్తించదగ్గ అంశాలూ ఉన్నాయి. శిల్ప నిర్మాణానికి అప్పటిదాకా ఆనవాయితీగా వస్తూండిన granite శిలను కాదని, వారు నివసిస్తూండిన ప్రాంతాలలో దొరికిన chloritic schist (soap stone) ని తీసుకుని నిర్మాణం సాగించారు హొయసలులు. శిల్పంలో కాలి గోటితో సహా ఇంకా అత్యంత సూక్ష్మమైన సంగతులను కూడా చెక్కి చూపించడానికి ఈ రకపు రాయి అనువుగా ఉండడం ఇందుకు కారణం అని చెబుతారు. ఆలయం ఉన్న ప్రాంగణంలో ప్రధాన ఆలయాన్ని ‘జగతి’ అని పిలవబడే ఒక నక్షత్రాకార elevated platform మీద నిర్మించడం కూడా వీరు ప్రత్యేకంగా అవలంబించిన శైలి. బేలూరు, హాళేబీడులలో ఉన్న చేన్నకేశవ, హొయసలేశ్వర దేవాలయాలను ఒక్క సారి గుర్తుకు తెచ్చుకుంటే ఇది విశదమౌతుంది. ఈ అన్నిటిలోని అత్యుత్తమ అంశాలను తీసుకుని రూపు దిద్దుకున్నది విజయనగర రాజుల కాలంలో విలసిల్లిన శిల్ప నిర్మాణ శైలి. అయితే, విజయనగర రాజుల కాలంలోని శిల్పులు ఆలయ నిర్మాణానికి మళ్ళీ వెనుకటి పధ్ధతినే, అంటే granite శిలనే వాడకంలో పెట్టారన్నది ఒక ప్రధానాంశం. granite శిల మీదనే హొయసలుల పధ్ధతిలో సూక్ష్మమైన సంగతులను చెక్కి చూపించడానికి ప్రయత్నించి అందులో చాలా వరకు సఫలీకృతులైన శిల్ప రీతి వీరిది. అందుకు లేపాక్షి ఒక ప్రధానమైన సాక్షి.

ఉలి వెలుగులు : లేపాక్షి (4)

దేవాలయం వెనుకవైపు చిత్రం - లేపాక్షి

‘లేపాక్షి’ అన్న పదానికి ‘లేపముతో అలంకృతాలయిన కన్నులు కల స్త్రీ’ అని అర్ధం. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడం వెనుక దాగి ఉన్న అసలు మర్మం ఏమిటో అర్ధం కాక పోయినా (పోయిన విరూపణ్ణ కళ్ళకూ ఈ పేరుకూ సంబంధం ఉందని నా నమ్మకం. అలా ఆలోచిస్తే, పోయిన విరూపణ్ణ అక్షుల అంటే కనుల – నుండి స్రవించిన రక్తము – నే లేపము గా గలది కావడం వల్ల ‘లేపాక్షి’ అయిందని నా నమ్మకం), అందంలో ఈ పదం సూచించే పై అర్ధానికి ఏమాత్రం తీసిపోనట్లుగా ఉంటుంది ‘లేపాక్షి’ దేవాలయం. ఒకప్పుడు ఈ ఆలయానికి చుట్టూ ఏడు ప్రాకారాలు ఉండేవనీ, కాల గర్భంలో కలిసి పోయినవి పోగా, ఇప్పుడు మూడు ప్రాకారాలు మాత్రమే మిగిలి ఉన్నాయనీ చెబుతారు.

ఈ ఆలయాల రూపకల్పనలో, నిర్మాణంలో అమర శిల్పి జక్కనాచార్యుని ప్రమేయం ఉందని ఒక మాట వినిపిస్తుంది. ఈయన శిల్పకళా నైపుణ్యానికి బేలూరు-హాలేబీడు ఆలయాలలోని శిల్పకళాకృతులు అసలైన నిదర్శనాలు. బేలూరు ఆలయం హొయసల రాజైన విష్ణువర్ధనుని చేత క్రీ.శ.1117 లో ప్రారంభించ బడిందని చెప్పేందుకు తగిన శాసనాధారాలు ఆ దేవాలయంలోనే ఉన్నాయి. అంటే బేలూరు ఆలయం క్రీ.శ. 12వ శతాబ్దపుది. లేపాక్షి క్రీ.శ.16 వ శతాబ్దపుది. అందువలన జక్కనాచార్యుని ప్రమేయం ఈ ఆలయ రూపకల్పనలోగానీ, నిర్మాణంలోగానీ ఉందనేది చారిత్రకంగా పొసిగే సంగతి కాదు. లేపాక్షి విజయనగర రాజుల కాలంలో ఆంధ్ర శిల్పుల ప్రతిభకు ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి.