తెలుగు మాట, పాట, పద్యం (5)

అచ్చ తెనుగు పద్యం

తెలుగు పద్య సాహిత్యంలో ‘అచ్చ తెనుగు’ అన్న మాటను మొదటి సారిగా వాడిన వ్యక్తి మూలఘటిక కేతన అని చెబుతారు. ఈయన తిక్కన మహాకవి సమకాలికుడు. తెలుగులో మొదటి కథాకావ్యానికి (దశకుమార చరిత్ర) శ్రీకారం చుట్టినవాడు కేతన. ‘కవిత చెప్పి’ తిక్కన మహాకవినే మెప్పించినవాడు ఈయన.  ఈయన చెప్పిన ఈ ‘అచ్చ తెనుగు’ అనే మాటకు ముందు, ఈ మాట ఏ అర్ధాన్నయితే సూచిస్తుందో అదే అర్ధంలో ‘జాను తెనుగు’, ‘దేశి’ అనే మాటలు వాడుకలో వుండేవి. ఈ మాటలను తమ పద్యాలలో చెప్పిన వారు ‘నన్నె చోడుడు’, పాలుకురికి సోమనాధుడు!

పేరుకి ఇన్ని మాటలున్నా, ఈ మాటలు ‘అచ్చ తెనుగు’ భాషా స్వరూపాన్ని అర్ధమయేలా చేయడంలో సఫలీకృతం కాలేకపోయాయన్న ఒక అభిప్రాయం, విజ్ఞుల మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి! భాషా స్వరూపం అర్ధం కావాలంటే, ఒక ఉదాహరణంతో చెప్పుకుంటే, కొంతలో కొంత స్ఫష్టత వచ్చి, సులభం అవుతుంది.

“పగలు సేయుచు వేడిమి మిగుల జగము
గ్రాచు జమునబ్బ మున్నీట గలిసె ననియొ
తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపు
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”

కూచిమంచి తిమ్మకవి రచించిన ‘అచ్చ తెలుగు రామాయణం’ కావ్యంలోనిది ఈ పద్యం. సూర్యాస్తమయాన్ని సుందరంగా వర్ణించే పద్యం! నాకయితే, ఈ పద్యంలోని మాటల పొందిక, brevity, గాథా సప్తశతిలోని గాథలను తలపుకు తెస్తుంది. మంచి భావంతో నిండి వున్న పద్యం! ఊహ original ది! నాకు తెలిసినంతవరకూ, ఏ ప్రాకృత గాథనుంచో, సంస్కృత శ్లోకంనుంచో ఎత్తుకొచ్చింది కాదు!

ఇప్పుడు, ఈ పద్య భావాన్ని కొంచెం విడమరచి చెప్పుకుంటే…

‘పగలు సేయుచు’ – పగలు సేయువాడు – దినకరుడు.
సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ, కొన్ని రకాలయిన సంస్కృత సమాసాలు అచ్చ తెలుగులోకి మారేటప్పుడు జరిగే మార్పులను గురించి కొంత వివరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సంస్కృత సమాసాలలోని ప్రత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, దొర, తపసి, జోదు…ఇత్యాది శబ్దాలు జతవుతాయి అని వ్యాకరణం. ఉదాహరణకి:

అచ్చ తెలుగులో ‘కప్పు కుత్తుక వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘నీలకంఠ’ కు,
అచ్చ తెలుగులో ‘గిత్త తత్తడి వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘వృషభ వాహన’ కు,
అచ్చ తెలుగులో ‘వెంట్రుక యడుగుల దొర’ అనే సమాసం, సంస్కృతంలో ‘రోమ పాద’ కు,
అచ్చ తెలుగులో ‘మనుబోతు కొమ్ము తపసి’ అనే సమాసం, సంస్కృతంలో ‘ఋష్యశృంగ’ కు,
అచ్చ తెలుగులో ‘పచ్చ వారువపు జోదు’ అనే సమాసం, సంస్కృతంలో ‘హరిదశ్వా’ కూ అనువాదాలని పెద్దల వివరణ. తెలుగులో వీటినే బహువ్రీహి సమాసాలుగా భావిస్తారని కూడా చెబుతారు, అర్ధంలో చివరన కలది, కలవాడు చేరతాయి కాబట్టి. (నల్లని కంఠము కలవాడు, ఎద్దును వాహనముగా కలవాడు…ఇత్యాదిగ).

నాకయితే తెలుగులో ఈ మాటలు, సంస్కృతంలో మాటలు ఎంత అందంగా కనిపిస్తాయో, తెలుగులోనూ అంతే అందంగా అనిపిస్తాయి. ఇలాంటివే ఇంకొన్ని సమాసాలు:

వలిగుబ్బలి రాచ కూతురు (హైమవతి – హిమవంతుని కూతురు, ‘వలిగుబ్బలి’ అంటే మంచుకొండ అని అర్ధం), పుట్ట బుట్టువు తపసి (వాల్మీకి – పుట్ట  నుంచి పుట్టిన తపస్వి), పదియరదముల దొర కొడుకు (దాశరధి – దశరధుని కుమారుడు) – ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలంత అందంగానే కనబడతాయి.

ఇక్కడితో ఇది ఆపి, అసలు పద్యానికొస్తే –

పగలు సేయుచు – పగటిని చేస్తూ, ఆ క్రమంలోనే; వేడికి మిగుల జగము గ్రాచు – వేడిమితో జగత్తునంతా వుడికించి ఇబ్బందికిలోను చేసే; యమునబ్బ – యముని తండ్రి (సూర్యుడు); మున్నీట – సముద్రములోనికి; కలిసె ననియొ – కలిసిపోయాడుగదా అని; తొగ వెలందుక – కలువ పూవు (అనే పడతి); నగియె – నవ్వింది; అమ్మగువ – ఆ కలువ సుందరి; పెంపు గని – సంతోషంతో వదనం పెద్దదవడం (కలువ వికసించడం అన్న భావం) చూసి; సయింపక – తాళ లేక; తమ్మి – తామర పూవు (అనే పడతి); మొగంబు మొగిచె – మొహం ముడుచుకుంది, చాటు చేసుకుంది.

సూర్యాస్తమయంతోనూ, చంద్రాగమనంతోనూ కలువలు వికసించడం అనేది ప్రకృతి ధర్మం. సూర్యాస్తమయంతో తామరలు వికసనం కొల్పోయినట్లయి, కళావిహీనంగా, ముడుచుకున్నట్లయిపోవడమూ ప్రకృతిధర్మమే! ఈ రెండు ధర్మాలనూ కలబోసి, ఒకే సందర్భానికి జతచేసి, హృద్యంగా చెప్పడం ఈ పద్యంలో జరిగింది.

నాకు ఈ పద్యాన్ని చదివినప్పుడల్లా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది. పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గాథా సప్తశతి లోని పద్యాలను తెలుగులోకి అనువదించడంలో ఈ పద్యాన్నే(సరిగ్గా ఈ పద్యాన్నే అని కాకుండా, ఇలాంటి పద్యాలనే) ఆదర్శంగా తీసుకున్నరేమో! అని. ఎందుకంటే, అందులోని చాలా పద్యాల నడక ఈ పద్యాన్నే పోలి వుంటుంది. ఉదాహరణకి:

“అడుగుదమ్ములందు బడివేడు పతివీపు
జిన్ని కొమరుడెక్కి చెలగి యాడ
అలుక యెంత తెగనిదయ్యును నిల్లాలి
మొగమునందు నవ్వు మొలచె నపుడు! “                (శతకం 1 గాథ 11)

“ఎవని వదలిన జీవంబు నవసి చనునొ
యతని నపరాధినయ్యు నోదార్ప వలయు;
ఊరు గాలుచు బొలిపోవు చున్న గాని
యగ్గి నొల్లని వారెవ్వరతివ, చెపుమ?”         (శతకం 2, గాథ 63)

అందుండి అచ్చ తెలుగు మాటలలో వున్న ఇలాంటి రమ్యమైన పద్యాలను ఇంకా చాలానే ఉదాహరించవచ్చు!

తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (7)

సంస్కృత భాషలో ‘శ్లోకము’ అన్న పదం పద్యానికి బదులుగా సర్వ సామాన్యంగా వాడబడుతూ ఉన్నది గాని, నిజానికి శ్లోక మన్నది పద్య పర్యాయవాచి కాదు. ప్రత్యేక లక్షణముగ ఒక పద్యం.  ఇది అనుష్టుప్ జాతికి చెందినది.

పాదమునకు ఎనిమిది అక్షరములుండడం (ఇక్కడ కూడ సంఖ్య ఎనిమిదే.  భేదమల్లా అక్కడది మాత్రల లెక్క, ఇక్కడ అక్షరాల లెక్క),  అయిదవ అక్షరం అన్ని పాదములందును లఘువై ఉండడం, ఆరవ అక్షరం తప్పనిసరిగా గురువై ఉండడం శ్లోకపు లక్షణములు.

శ్లోకమన్న శబ్దమునకు స్తోత్రము అని అర్ధం.  ఈ రకపు పద్యం మొదట్లో స్తుతి పరమగు రచనలలోనే వాడబడుతుండెడిది గాబట్టి దీనికా పేరు వచ్చి ఉంటుందని పెద్దల అభిప్రాయం.

పద్యములలో అక్షరగణ నిబధ్ధములైనవి వృత్తములు. లక్షణం చెప్పడానికి సౌలభ్యం కోసం గణముల పధ్ధతి ప్రవేశపెట్టబడింది. ఒక్కొక్క గణమునకు మూడు అక్షరములు (అక్షరం లఘువు గాని, గురువు గాని కావొచ్చు). అలా చూసినట్లయితే, మూడు అక్షరముల గణములు ఐనిమిది ఏర్పడతాయి (మ, య, స, న, భ, త, జ, ర అనే 8 ప్రధాన గణములు).  ఈ పధ్ధతిలో లక్షణం చెప్పడం సులభం, ఉదా: ఉత్పలమాలా వృత్తము – భ, ర, న, భ, భ, ర, వ.  ఇత్యాదిగ. సంస్కృత పద్యంలోని ఒక పాదంలో ఉండగల అక్షరముల సంఖ్య 26. వృత్త పాదమునకు ఎన్ని అక్షరము లుండునో ఆ వృత్తము అన్నవ ఛందమున పుట్టినదని చెబుతారు. దీనిని బట్టి 26 ఛందస్సుల్లో మొత్తం 13,42,17,726 వృత్తములు ఏర్పడుతాయి.

ఇన్ని కోట్లుగా వృత్తములు ఏర్పడుతున్నా, సంస్కృతములో గూడ మొత్తం ఇరవైఆరు ఛందములలో పదకొండు, పన్నెండు (త్రిష్టుప్, జగతి) ఛందములలోని పద్యములే ఎక్కువగా ప్రచారం పొందాయనీ, ఈ ఉభయ ఛందములలో దాదాపు అన్ని వృత్తములూ ప్రసిధ్ధములయినాయనీ పెద్దలు చెబుతారు.

తెలుగు పద్యములలోకి ప్రవేశించిన ప్రసిధ్ధ సంస్కృత వృత్తములు ఉత్పలమాల, చంపకమాలలు.  వీటి తరువాత మత్తేభము, శార్దూలవిక్రీడితము అను వ్రృత్తములు.  వీటికి సంస్కృతములో ప్రచారం తక్కువ.  అయితే తెలుగులో ఇవి యతి, ప్రాస సహితముగా ప్రయోగింపబడినాయి.

చంపకమాల వృత్తములోని మొదటి రెండు లఘువులను గురువులుగా మార్చి వాడితే ఉత్పలమాల అవుతుంది.  అలాగే మత్తేభ శార్దూల విక్రీడితములు. మత్తేభములోని తొలి రెండు లఘువులను గురువులుగా మార్చిన యెడల శార్దూల విక్రీడితమౌతుంది.  ఈ రెండింటిలో మత్తేభమునకే తెలుగులో ప్రచారము ఎక్కువ.

తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (6)

“ఈ నగవులను నువ్వేగ నిన్నలకు
ఆనవాళ్ళుగ నా ఎదను నిలిపింది
ఈ నాడిదేల నే నోపగ లేని
మౌనము దాల్చి ఏమార్చేవు, చెలియ!”

‘చెలియ!’ బదులు ‘సఖుడ!’ అని కూడ చదువుకోవచ్చు. అర్ధంలో ఏమీ మార్పుండదు.  ద్విపద ఛందంలో ఉన్న పద్య పాదాలివి. స్వకీయములు.  ఇందులో మొదటి మూడు పాదాల్లో స్వరయతి మాత్రమే పాటింపబడింది.

తెలుగులో ద్విపద అతి ప్రాచీనమైన పద్యం.  నన్నయ భట్టారకుని కంటె ముందునుంచీ ద్విపద ఛందంలో గేయాలుండేవని శాసనాల్లోని పద్యాల వల్లనూ, జానపద గేయ సాహిత్యం రూపంగానూ విశదమౌతుంది. జానపదుల నోళ్ళలో ఎంతగా ప్రాచుర్యంపొంది గేయాల్లో వాడుకోబడినా, పండితుల చిన్నచూపుకు మాత్రం ద్విపద గురి అయినంతగా మరే పద్యమూ గురి కాలేదన్నది సత్యం. ద్విపదకు సాహిత్య గౌరవం ఇచ్చి పోషించిన మొదటి కవి పాలుకురికి సోమనాధుడు.  పద్యత్వాన్ని సంపాదించిపెట్టడానికి అన్నట్లుగా సోమనాధుడు ద్విపదకు యతిప్రాసలను నియతం చేశాడు.

ఎంతగా చిన్న చూపు చూడబడినా, ద్విపద ఛందమే జాత్యుపజాతులలో చాల పద్యాలకు మూలమైందని చెబుతారు. ద్విపద నుంచే తరువోజ పుట్టిందని ఒక అభిప్రాయం.  కాదు, తరువోజనుంచే ద్విపద పుట్టిందని ఇంకొక అభిప్రాయం. ఏదేమైనా, రెండు ద్విపద పాదాలు కలిస్తే తరువోజ అవుతూండడం, రెండూ ఒకే కోవకు చెందినవని చెప్పకనే చెప్తాయి. స్త్రీల దంపుళ్ళ పాటలు చాలా ద్విపదలు, తరువోజలే.

“దంపు దంపనియేరు అది యెంత దంపు
ధాన్య రాసుల మీద చెయ్యేసినట్లు
వంట వంటనియేరు అది యెంత వంట
వదినతో మరదళ్ళు వాదాడినట్లు”

“నొష్ట రాసిన రాలు తుడిచినా పోదు
పైట చెంగులు పెట్టి పులిమినా పోదు”

“కన్న తల్లిని బోలు చుట్టాలు లేరు
పట్టు చీరను బోలు చీరల్లు లేవు”

ఇవన్నీ ద్విపద ఛందంలో ఉన్న పాదాలే. యతిప్రాసలు, పాదనియమాలు ఉన్న చోట్ల ఉన్నాయి, లేని చోట్ల లేవు.  ఉన్న చోటల మాటెలా ఉన్నా, లేని చోటల లేక పోవడంవలన పాటలకు జరిగిన నష్టమేమీ కనిపించదు.

పైన నేను వ్రాసి చూపిన ద్విపద ఛందంలోని పద్యం ఛందస్సు పరంగా సరిగానే ఉన్నా అందులో గేయ లక్షణం ఎంత వరకు అమరింది? జానపదుల నోళ్ళలో సహజంగా పుట్టిన పాటలకు, గణాలు యతిప్రాసలు సరిచూసుకుంటూ వ్రాసిన వాటికి చాలా తేడా ఉంటుంది.

తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (5)

తెలుగులో (లిఖిత) సంప్రదాయ సాహిత్యం నన్నయ భట్టారకునితోనే మొదలైందిగా భావిస్తూన్నాం గనక, తెలుగు సాహిత్యం మొత్తాన్ని గురించి మాట్లాడుకోవలసినప్పుడల్లా, బేరీజు వేసుకోజూచినప్పుడల్లా, నన్నయ గారిని హద్దుగా పెట్టుకుని ఆయనకు ముందు, ఆయనతోనూ.. ఆ తరువాత అని మాట్లాడుకోవలసి ఉంటుంది. నన్నయగారి చేతిలో తాళపత్రం మీదికెక్కడం మొదలెట్టిన తెలుగు సాహిత్యం అంతకు మునుపు జనాల నాలుకల మీద గేయాల రూపంలో ఉండి రకరకాల వయ్యారాలుపోయింది. ఆ వయ్యారాల్లో కొన్ని ఏలలు, జోలలు, అర్ధచంద్రికలు, అక్కరలు, రగడలు, సువ్విపాటలు, జాజరలు, ఉయల పాటలు, ఐరేని పాటలు, చిందులు, జక్కిణులు, చౌపదాలు, ఆరతులు, దరువులు, జక్కులరేకులు, సుద్దులు, నలుగులు, జంపెలు, కురుజంపెలు, అల్లోనేరేళ్ళు, చద్దులు, కొరవంజులు, తలపు పాటలు, అప్పగింతలు, మేలుకొలుపులు, వాదాలు, పడవ పాటలు, కోలాటాలు, గొబ్బి పాటలు, పెండ్లి పాటలు, నివ్వాళులు, సూళలు, ఇత్యాది పేర్లతో వేల కొలదిగా లభ్యమౌతున్నాయని పెద్దలు చెబుతారు.

ఈ గేయాలన్నీ యతి ప్రాసయుక్తంగా ఉన్నాయా అంటే, ఉన్నప్పుడు ఉన్నాయి, లేనప్పుడు లేవు అన్నది సమాధానం.  యతి ప్రాసలు లేకపోవడం వల్ల పాట కుంటుబడిందీ లేదు, అవి ఉండడం వల్ల పాటలకు అదనంగా ఒనగూడిన సౌలభ్యమూ లేదన్నది పెద్దల పరిశీలనలో తేలిన విషయం.  ఒక నియమంలా కాకుండా యాదృచ్చికంగా యతి ప్రాసలు పడితే అవి పాటకు అదనపు అలంకారాలుగా మేరిసేవి.

ఈ పాటల, వీని నడకల ప్రభావం నన్నయ కవిత్వం మీద లేకుండా ఎలా ఉంటుంది? అని తరచి చూసి నిదర్శనాలుగా నన్నయ భారతంలోనివే కొన్ని పద్యాలను ఎత్తి చూపారు పెద్దలు.  వాటిల్లో ఒకటి నన్నయ భారతంలోని ఆది పర్వం, ప్రధమాశ్వాసంలోని 30వ పద్యం, కంద పద్యం:

“ఏయది హృద్యమ పూర్వం
బేయది, యెద్దాని వినిన నెఱుక సమగ్రం
బైయుండు నఘనిబర్హణ
మేయది యక్కథయ వినగ నిష్టము మాకున్”

కంద పద్యంగా ఇలా ఉన్న ఈ పద్యం, పాడుకోవడానికి అనువయిన గేయంగా మారితే ఇలా ఉంటుంది:

యది హృద్యమ పూర్వం బేయది,
యెద్దాని వినిన నెఱుక సమగ్రం
బైయుండు నఘనిబర్హణ మేయది
క్కథయ వినగ నిష్టము మాకున్”

16 అక్షరాలకొక పాదం చొప్పున తిరగ రాస్తే, చరణం మొదటి అక్షరాలలో యతులు, ప్రాసయతులు చక్కగా కుదిరి, తాళం వేసుకుని చక్కగా పాడుకోవడానికి అనువుగా మారడం గమనించవచ్చు.

తెలియవచ్చే దేమిటంటే, పనికిరాని చోట యతిస్థానాన్ని ఉంచి ఎంతగా చెడగొట్టినా, కొన్ని కంద పద్యాలకు వద్దన్నాకూడా, యాదృచ్చికంగానూ, అలంకారికంగానూ యతి ప్రాసలు కుదిరి గేయలక్షణం అబ్బుతుందనీ, అది అంత తొందరగా తొలగిపోయే సంగతి కాదనీను.

నన్నయ భారతంలో ఇలాంటి పద్యాలు ఇంకా చాల ఉన్నాయనీ, నన్నయ పద్యాలలో నిజానికి దేశీచ్చందోబద్దాలైన పద్యాల సంఖ్య హెచ్చు అనీ, అందులోనూ కందాల సంఖ్యే ఎక్కువనీ పెద్దలు చెబుతారు.

ఇదంతా తెలుసుకున్న తరువాత, తెలుగులో ఒక రకపు గేయానికి గాయమై కంది కందమై మిగిలిందని నేను అనుకుంటుంటాను.

తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (4)

పల్లె, పట్టణము అనే భేదం లేకుండా, తెలుగు ఇళ్ళలో తల్లులు నేటికీ తమ పిల్లలను ఆడిస్తూ పాడుకునే పాట, ‘చందమామ రావే’. ఈ పాటను కంద పద్యంగా మారిస్తే ఇలా ఉంటుంది:

“చందమామ రావే జాబిల్లి
రావె కొండెక్కి రావె గోగు పూలు తేవే
బండెక్కి రావే బంతిపూలు
తేవే పల్లకీలు తేవే పారిజాతం తేవే…”

‘…అన్నీ తెచ్చి మా అబ్బాయికి/అమ్మాయికి ఇవ్వవే!’ అని చివర్న ముక్తాయింపు చరణం.

ఇలాంటిదే ఇంకొక పాట, ‘కాకీ కాకీ గంతుల కాకీ’.  ఈ పాట సరిగ్గా రెండు కంద పద్యాలు, చివర్న ముక్తాయింపు చరణం గా అమరిపోతుంది.

“కాకీకాకీ గంతుల
కాకీ కాకిని తీస్కెళ్ళి గంగలో ముంచితే
గంగా నాకు పాలూ
ఇచ్చే పాలూ తీస్కెళ్ళి అమ్మా కిస్తే”

“అమ్మా నాకూ డబ్బూ
నిచ్చే డబ్బూ తీస్కెళ్ళి పంతులకిస్తే
పంతులు నాకూ చదువూ
నిచ్చే చదువూ తీస్కెళ్ళి మామాకిస్తే”

‘…మామ నాకు పిల్లానిచ్చే!’ ముక్తాయింపు చరణం.

చదరంగంలో గళ్ళు ప్రతి ఎనిమిది గళ్ళకూ ఒకసారి వరస మారినట్లుగా, పైన ఉదాహరించిన పిల్లల పాటలలో, అవి పాటలుగా ఉన్న స్థితిలో (చందమామ రావే – జాబిల్లి రావే, కాకీ కాకీ – గంతుల కాకీ, ఇత్యాదిగ), పదాలు ప్రతి ఎనిమిది మాత్రలకొకసారి విశ్రాంతి పొందటం గమనించవచ్చు. వీటినే కంద పద్యాలుగా వ్రాస్తే వరస తప్పడమూ గమనించవచ్చు. పిల్లల పాటల్లోనే కాదు, ‘ఒప్పుల కుప్పా – ఒయ్యారి భామా’ లాంటి తరుణుల పాటల్లో కూడా ఇలాంటి విన్యాసమే కనిపిస్తుంది.  మాటల్ని ప్రతి ఎనిమిది మాత్రలకు విశ్రాంతి పొందే విధంగా అమరిస్తే వాటికి గాన యోగ్యతను కొంత సుళువుగా చేకూర్చ వచ్చని గ్రహించి చేసిన నిర్మాణాలివి.  మామూలు మాటలు – ‘గలగల పారే ఏటీ నీరూ’, ‘నీవూ నేనూ ఒకటిగ కలిసీ’, ‘మదిలో మెదిలే భావా లెన్నో’, ‘రారా రారా ఓ సుందరాంగా’, ‘చాక్లెట్ల కోసం బజారు కెళితే’, ‘చిందర వందర గందర గోళం’, ఇత్యాదిగా ఎన్నయినా చెప్పుకోవచ్చు,  వీటన్నిటికీ గానయోగ్యత దానంతట అదే లభిస్తుంది. 4,4 + 4,4 అమరికలోనే ఈ లక్షణం నిక్షిప్తమై ఉంది.

అయితే, స్థూలంగా ఈ నిర్మాణాన్నే తీసుకుని, గానయోగ్యమైన వరస తప్పే విధంగా పాదాలను విరిచి, యతిస్థానాన్ని 24 మాత్రల తరువాత (కంద పద్యంలో రెండవ, నాల్గవ పాదములలో నాల్గవ గణం ప్రధమాక్షరం యతి స్థానం) నిర్ణయించుకుని నియతం చెయ్యాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించుకుని ఆలోచిస్తే దొరికే సమాధానం ఒకటే.  కంద పద్యం ప్రధానంగా చదువుకోవడానికి ఉద్దేశించినది, పాడుకోవడానికి కాదు.  ఒకవేళ పాడుకోవాలనుకుంటే, అనువుగా ఉండే పద్యాన్ని పాటకు యోగ్యమైన వరసలోకి 16 మాత్రలకొక చరణంగా సర్దుకుని పాడుకోవలిసి ఉంటుంది.

పాడుకోవడానికి అనువుగా ఉండే పద్యాలు నన్నయ భారతంలోనే ఉన్నాయని, వెదికితే ఇలాంటివి ఇతరుల పద్యాల్లోనూ దొరుకుతాయని పెద్దలు చబుతారు.  కంద పద్యానికి మూలాలు పాటలో ఉండడం వల్ల అప్రయత్నపూర్వకంగానే ఇది కొన్ని పద్యాల్లో సిధ్ధిస్తుందని చెప్పుకోవచ్చు.

తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (3)

తెలుగు పద్య పాదములోని మొదటి అక్షరాన్ని ‘వడి’ అని, రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అని అంటారు. తెలుగు పద్యాల్లో ప్రాసయేగాక, యతి కూడ నియతము. అంటే తెలుగు పద్యపు పాదములలో యతి స్థానము పై వడి గూర్ప వలసియుంటుంది. అనగా యతి స్థానముపై పాద ప్రధమాక్షరమును గాని దాని మిత్రాక్షరమును గాని నిలపాలి. హల్లులకు యతి మైత్రి కూర్చునపుడు వాని మీద నిలుచు అచ్చులకు (అంటే తలకట్టు, గుడి, కొమ్ము మొదలగు వాటికి) కూడ మైత్రి కూర్చాలి. అలా కాకుంటే యతి భంగమయినట్లే. తెలుగులో ప్రాస లేని పద్యాలు ఉంటాయి కాని యతిలేని పద్యములు లేవు. తెలుగుపద్యాలకు సంబంధించి 39 రకాల యతి భేదాలు లక్షణ గ్రంధాల్లో చెప్పబడ్డాయి.

సంస్కృత పద్యాల్లో యతి అంటే ‘విచ్చేదం’, విశ్రాంతి కొరకు పాదం అక్కడ విరిగితే చాలు.  తెలుగులో విడి (వళీ), విశ్రాంతీ రెండూ ఉండాలన్నది నియమం.  అంటే యతి స్థానంలో పాదం విరగడమే కాకుండా సరూపాక్షరం కూడ అక్కడ ఉండాలి. తెలుగులో ఉన్న ఈ వళి (అక్షర మైత్రి) నియమం సంస్కృత, కరనాట భాషల్లో లేదనీ, ఒకవేళ అక్కడక్కడా కనిపించినా అది యాదృచ్చికమూ, అలంకారికమూ అని పెద్దలు చెబుతారు.

అయితే, ఈ యతి నియమం మొదటి నించీ తెలుగు పద్యాల్లో ఇంత కఠినంగా ఉందా అంటే, ఉంది… లేదు… అని రెండు రకాలుగాను సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. నన్నయకు పూర్వపు శాసనాల్లో యతి, ప్రాస సహితంగాను, రహితంగాను అగుపించే కంద పద్యాలు ఇందుకు నిదర్శనాలుగా పెద్దలు చెబుతారు.

పద్యము గురువుతో అంతం కావాలన్న నియమం ఒక్క కంద పద్యానికి తప్ప తెలుగు ఛందస్సులో మరే పద్యంలోనూ కనుపించదు. కంద పద్యం అచ్చంగా తెలుగు వాళ్ళ ఆస్తి అనీ, కాదు సంస్కృత ఆర్యాగీతిభేదమే అనీ రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి.

64 మాత్రల నిడివి కలిగియుంటూ, యతి మరియు ప్రాస సహితంగా ఉండడం స్థూలంగా ఇప్పటి కంద పద్య లక్షణం.  కనురెప్పపాటు కాలాన్ని ఒక మాత్ర గా అనుకుని లెక్కిస్తే, ఎన్ని మాత్రలున్నా 64 మాత్రల కాలానికి (లఘు, గురువుల లెక్కతో నిమిత్తంలేకుండా, గణాల సంగతి అంతగా పట్టించుకోకుండా) పద్యం అమరిపోయేలా చూసుకోవడం పాత కంద పద్య లక్షణం. ఉదాహరణకి, మొన్న మొన్నటి దాకా పల్లెపట్టుల్లో పిల్లలు పాడుకుంటూండిన ఈ పాట:

“గుడు గుడు గుంచం గుండే రాగం
పామూల పట్టా పడగా రాగం
చినన్న పెండ్లీ చిట్టే రాగం
పెద్దన్న పెండ్లీ పెట్టే రాగం.”

ఈ పాటను కంద పద్యంలోకి మారిస్తే ఇలా ఉంటుంది:

“గుడు గుడు గుంచం గుండే
రాగం పామూల పట్టా పడగా రాగం
చినన్న పెండ్లీ చిట్టే
రాగం పెద్దన్న పెండ్లీ పెట్టే రాగం.”

కంద పద్య పాదములకు సరిపోయేట్లుగా చరణాల్ని మార్చి వ్రాయడం తప్ప, ఇందులో కొత్తగా చేసిందేమీ లేదు. అయితే, ఇందులో గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, గణాలు కూడా సరిగ్గా సరిపోతున్నప్పటికీ, కంద పద్యంగా మార్చి వ్రాసినపుడు ఈ పాటలో పాడుకోవడానికి అనుకూలంగా ఉండిన తాళానుకూల యతులు మాయమై పోతున్నాయి.

తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (2)

తెలుగులో ఎక్కడకూడ రెండు అచ్చులు ఒకదాని పక్కన మరి ఒకటి ప్రకృతి భావమునందు ఉండగా, అనగా సహజ స్థితిలో ఉండగా ఉండగూడదని మన వైయాకరణుల సిధ్ధాంతం. ఇలాంటి నియమం ప్రాకృతంలోగాని, హిందీ మొదలగు భాషలలో గాని లేదు.

రెండు అచ్చులు ఒక్క చోటకు వచ్చి కలుసుకొనుటకు వీలులేనప్పుడు, ఉచ్చారణ సౌకర్యార్ధమై నడుమ ఒక ‘న’ కారమును తెచ్చి పెట్టుట సంస్కృతాది ఆర్యభాషలలో కనిపిస్తుంది.  అ (న్)+ఆదరః = అనాదరః, ఇత్యాదిగ. ఇక్కడ వచ్చి చేరిన ‘న’ కారమును ద్రుతము అంటారు.  ద్రుతమనగా ద్రవించునది.  కరిగిపోవునట్టిది.  అవసరమైతే ఉంటుంది. అవసరం లేకుంటే ఉండదు.

ఇంగ్లీషు భాషలో కూడ అచ్చులు మొదటనుండు శబ్దములకు ముందు ‘an’ వస్తుంది.  ఇది ‘న’కారము, ద్రుతము లాంటిదే.  గ్రీకు భాషలో కూడ ఇలాంటి ‘న’కార ద్రుతము ఉందని చెబుతారు.

ద్రుతానంతరము పరుషములు (క చ ట త ప) సరళములు (గ జ డ ద బ) అవుతాయి.  ఇది తెలుగు భాషలో విలక్షణంగా వృధ్ధి చెందిన లక్షణంగా చెబుతారు.

తెలుగు భాషలో ‘డు’ అచ్చ తెనుగు ప్రత్యయము.  ఆర్య భాషలలో గాని, ద్రవిడ భాషలలో గాని వేరెచ్చటనూ కానరాదు.  పురుష వాచకమగు ఈ ప్రత్యయము తెలుగులో ప్రత్యేకంగా ఏర్పడినదని చెబుతారు.  దీనికి పూర్వ రూపమైన ‘వాండు’ ఇప్పటికీ వంటవాడు, చాకలి వాడు, మంచివాడు మొదలైన పదములలో మిగిలిఉండి కనిపిసుంది.  ఇలాంటిదే అల్లువాడు, ‘వా’ లుప్తమై అల్లుడు గా మిగిలింది.

ఆంగ్లమున నలభైరెండు ధ్వనులున్నట్లు అంచనా వేయగా, అక్షరములు ఇరవై ఆరు మాత్రమే ఉన్నాయి.  తెలుగులో అక్షరములు యాభై ఆరు, అంటే రెండింతలు కంటే ఇంకా నాలుగక్షరాలు ఎక్కువ, ఆంగ్లంలో ఉన్న ధ్వనుల కంటే పధ్నాలుగు ఎక్కువ.  ఇంగ్లీషు మాటలను వాటి ఉచ్చారణకు తగినట్లుగానె తెలుగులో వ్రాయటం ఇందువలన తేలికగా సాధ్యమౌతుంది.

తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (1)

శబ్దరత్నాకరంలో మొత్తం శబ్దాల సంఖ్య 35309. వీటిలో సంస్కృత సమములు 15014 (42.6%), ప్రాకృత సమములు, సంస్కృత ప్రాకృత భవములు 6892 (19.6%), దేశ్యములు 12475 (35.4%), అన్యదేశ్యములు 928 (2.4%).

ఇప్పుడు వాడుకలో ఉన్న ‘మాంసము’ అనే పదానికి పర్యాయ పదాలు మొత్తం 7. అవి వరుసగా – ఈరువు, ఎఱిచి, కలిమము, కౌచు, చియ్య, నంజుడు, పెరసు.  కానీ ఈ పదములలో ఏదీ ఇప్పుడు వ్యవహారంలో లేదు.

ముందు చెప్పుకున్నట్లుగా, తత్సమములు రెండు రకాలు – సంస్కృత సమములు, ప్రకృత సమములు.  సంస్కృతంలో గానీ, ప్రాకృతంలో గానీ ఏ రూపంలో ఉందో ఆరూపానికి మార్పేమీ చెయ్యకుండా ఉన్నదానిని ఉన్నట్లుగానే ఉంచి తెలుగు ప్రత్యయం తొడగడం ఈ పధ్ధతి.

సంస్కృతంలోంచి విశేష్య, విశేషణ, క్రియా పదాలు తీసుకోబడినాయి. సంస్కృతంలో 2000 దాకా ధాతువులు ఉనాయి. వాటికి ‘ఇంచు’ అనే ముద్ర వేసి తెనిగీకరించుకోవచ్చు. దేశ్య శబ్దాలనన్నిటినీ శోధించి చూసినట్లయితే అవన్నీ అజంతములే తప్ప హలంత శబ్దములు తెలుగున లేవని, దీర్ఘ స్వరాంత శబ్దములు లేవని, అందులో కూడ అకార, ఇకార, ఉకారములు చివరనుండు శబ్దములే ఎక్కువని తెలుస్తుంది.

ద్రావిడ భాషలలో పురుషులను, పురుష దేవతలను సూచించు శబ్దాలు పుల్లింగములు. స్త్రీలను, స్త్రీదేవతలను సూచించు శబ్దాలు స్త్రీ లింగములు. తిర్యగ్జంతువులను, జడములను సూచించు శబ్దాలు నపుంసక లింగములు. ఆర్య భాషలలో అలా కాదు.  లింగము అర్ధమును బట్టి కాకుండా శబ్దమును బట్టి ఉంటుంది.  ‘మిత్రమ్’ నపుంసక లింగము.  ‘దారాః’ అనగా భార్య, ఇది సంస్కృతంలో నిత్య పుల్లింగము. తెలుగులో ‘మహత్’ పుల్లింగము.  ‘అమహత్’ పుల్లింగము కానిది (స్త్రీ మరియు నపుంసక).

ప్రయోగముల కొరకు హితములైనట్టివి ‘తధ్ధిత’ ప్రత్యయములు.  భావార్ధకమైన ‘తనము’ ఇందులో ముఖ్యమైనది. దీని పూర్వ చరిత్ర ఋగ్వేదం దాకా పోతుంది.  ఋగ్వేదంలో ‘త్వన’, ప్రాకృతంలో ‘త్తన’. సంయుక్తాక్షర శబ్దాలు మొడటగా ఉండేవనీ, తరువాత వాటినుంచి వికృతి శబ్దాలు పుట్టే క్రమంలో ఉచ్చారణ సౌకర్యార్ధం అందుండి సంయుక్తాక్షరం విడదీయబడిందనీ తెలుస్తుంది.

తెలుగు భాషలో దేశ్య విశేషణములు దాదాపు 1000 దాక ఉన్నాయి. వీని విశేషమేమంటే విశేష్యము యొక్క లింగ వచనములను బట్టి వీనికి మార్పులు కలుగవు.  ఉదా: మంచి పిల్లవాడు, మంచి పిల్ల, మంచి చెట్టు. సంస్కృతంలో ఇలా కాదు.  ‘సుగుణవాన్’ బాలకః’, ‘సుగుణవతీ’ బాలిక, ఇత్యాదిగ. ఇలా ద్రావిడ విశేషణములకును సంస్కృత విశేషణములకును భేదం ఉండగా,  తత్సమ విశేషణములు వచ్చి తెలుగులో సంస్కృత నియమాలను తెచ్చి పెట్టినాయి.  ఉదా: సుందరుడగు బాలుడు, సుందరియైన బాలిక, సుందరమైన వాహనము, ఇత్యాదిగ.