తెలుగు మాట, పాట, పద్యం (6)

అచ్చ తెనుగు పాట

పండుగ రోజులలో తెలుగిళ్ళలో స్త్రీలు నోములు నోయడం అన్నది మన సంస్కృతీ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగం. శ్రావణ మాసంలో ప్రతి తెలుగిల్లు శ్రావణ మాసపు నోముల ఫలితంగా కళకళలాడుతూ వుండడం నేటికీ చూస్తూనే వుంటాం! శ్రావణమాసంలో నోముల  తరువాత, దీపావళి మొదలు కార్తీక శుధ్ధ పౌర్ణమి వరకూ పూర్వం తెలుగిళ్ళలో బాలికలు నోచే ఒక నోము (‘మూగనోము’ అని పేరు) చివర రోజున, గౌరీదేవికి పూజ చేసిన తరువాత, ఒక పాట పాడేవాళ్ళని స్వర్గీయ ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, వారు రచించిన ‘ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి’ (ప్రథమ ముద్రణ: 1951) పుస్తకంలో ఒక అచ్చ తెలుగు పాటను సూచించి, ఆ పాట పూర్తి పాఠాన్ని కూడా వ్రాసారు. ఆ పాట పేరు ‘మోచేటి పద్మం’. ఆ పాట పేరుమీదుగానే ఆ నోముకి కూడా ‘మోచేటి పద్మం’ నోము అని ఇంకొక పేరు గూడా వచ్చిందని చెప్పారు. ఆ పాట పూర్తి పాఠం ఇది:

మోచేటి పద్మమ్ము పట్టేటి వేళ
మొగ్గల్లు తామర్లు ముడిగేటి వేళ
ఆవుల్లు లేగల్లు వచ్చేటి వేళ
ఆంబోతు రంకెల్లు వేసేటి వేళ

సందేళ దీపమ్ము పెట్టేటి వేళ
చాకింటి మడతల్లు తెచ్చేటి వేళ
బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ
కోడల్లు పసుపుల్లు కొట్టేటి వేళ

కూతుళ్ళు గుండుగిన్నెల్ల కుడిచేటి వేళ
ముద్ద మొగము అద్దాన్ని బోలు
ముద్దరాలి మొగము మోచేటి పద్మమ్ముబోలు
పద్మమ్ము నోచిన చానకు పదివేల ఐదవతనము.

మొదలు నుంచి చివరిదాకా, అచ్చమైన తెలుగుదనంతో గుబాళిస్తుండే పాట ఇది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు గదా! అయితే, ఈ పాటలో ఒకింత ఇబ్బందికరమైన సంగతి, ‘మేచేటి’ అనే మాటకు అర్ధం ఏమిటి? అన్నది. ఈ మాటకు లక్ష్మీరంజనంగారు సూచించిన అర్ధం – ‘మొగుచు’ అంటే ముకుళించు పద్మమేమో! అని. వారు సూచించిన ఈ అర్ధంతో, ఈ నోమును ‘ముకుళించే పద్మం’ నోము అనుకోవడానికి కూడా సాధ్యమౌతుంది. ఈ నోము ‘మూగ నోము’ కావడం వల్లా, అంటే ఈ నోము నోచే బాలిక, నోము ఆచరించే రోజులలో సాయంత్రం
ఇరుగుపొరుగు పేరంటాండ్రను బొట్టుపెట్టి పిలవడానికి బయలుదేరిన దగ్గరనుంచి, ఆ నాటి రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూసే దాకా, ఎవరెంతగా పరియాచకాలాడి ప్రేరేపించినా మాట్లాడక ఊరకుండాడాలే తప్ప పెదవి విప్పకూడదనే నియమం వుంది కాబట్టి, ఈ నోముకు ‘ముకుళించే పద్మం’ అనే పేరు సాధ్యమే అనిపిస్తుంది; ‘పద్మం’ బాలిక నోరు, ‘ముకుళించు’ అంటే పెదవులు విప్పకుండా వుండేట్లు చేసే నోము కాబట్టి!

ఇక, ఈ పాట నిండా, నాటి పల్లెటూళ్ళ సంధ్యా సమయపు శోభ పరుచుకుని కనిపిస్తుంది. ఈ పాట మొత్తంలో అర్ధంగానట్లు అనిపించి ఇబ్బంది పెట్టే పదాలు రెండే రెండు. అవి, ‘మోచేటి’, ‘బీరాయి’ అనేవి. వీటిల్లో ,మోచేటి’ కి అర్ధం ముందే వివరించ బడింది గనుక, ఇప్పుడు , ‘బీరాయి’ అన్న పదం సంగతి చూడాలి!

‘బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ’ అని చరణం! ఇది చదివిన వెంటనే ఊహ సహజంగానే పల్లెటూరి ఇళ్ళ ముంగిళ్ళలోనో లేక పెరడులలోనో సర్వ సాధారణంగా కనుపించే ‘బీర చెట్టు’ మీదకు పోతుంది. అయితే, ‘బీర చెట్టు’ పూవులు విడవడానికి ‘సంధ్యా సమయాని’ కి ఏమిటి సంబంధం? అన్నది ప్రశ్న. అదీగాక, బీర (చెట్టు) కు ‘బీరాయి (చెట్టు)’ అని నామాంతరం వున్నట్లుగా కనబడదు. ఈ రెండూ కాకపోతే, మరి ఈ మాటకు
ఇక్కడ అర్ధం ఏమై వుంటుంది?

ప్రస్తుతానికి అదలా వుంచి, ఒక్కసారి పూజ్యులు డాక్టర్ బిరుదురాజు రామరాజు గారి ‘తెలుగు జానపదగేయ సాహిత్యం’ (ప్రథమ ముద్రణ: 1958) పుస్తకంలో చూస్తే, ఈ ‘మోచేటి పద్మం’ నోము శ్రీ నేదునూరి గంగాధరం గారి పాఠంలో ‘మోచేతి పెద్దమ్మ’ నోముగా మారి, ఈ పాట పాఠం కూడా బాగా విస్త్రుతమై కనిపిస్తుంది. శ్రీ గంగాధరంగారి పాఠం ఇది:

మోచేటి పెద్దమ్మ నోచేటి వేళ – మొగ్గల్లు తామరలు పూసేటివేళ
బీరాయి పువ్వులు పూసేటి వేళ – బిందెలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
గుమ్మడి పువ్వులు పూసేటివేళ – గుండిగలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
కాకర పువ్వులు పూసేటివేళ – కడవలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
ఆనబాయ పూవులు పూసేటివేళ – అటికలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
చిక్కుడు పువ్వులు పూసేటివేళ – చిప్పలతో గంధాలు తీసేటివేళ
ఆవులు దూడలు వచ్చేటివేళ – ఆంబోతు రంకెలు వేసేటివేళ
సందిటి దీపాలు పెట్టేటివేళ – చాకింటి మడతలు దెచ్చేటివేళ
మరదళ్ళు మరి జూద మాడేటివేళ – కూతుళ్ళు గుండిగలు దింపేటివేళ
కోడళ్ళు కొటుపసుపు కొట్టేటివేళ – చెల్లెల్లు చేమంతులు ముడిచేటివేళ
వదినల్లు వంటిల్లు చేసేటివేళ -
ముద్దుల మొగము అద్దానబోలు – తన ముఖము తామర పద్మానబోలు.

శ్రీ నేదునూరి గంగాధరం గారు ఇచ్చిన పాఠాన్ని బట్టి చూస్తే, ‘బీరాయి’ బీర చెట్టునే సూచిస్తుంది. అయితే, ఈ పాఠం లక్ష్మీరంజనంగారి పాఠంలోలా ‘సంధ్య’ వర్ణనను సూచించదు. తెలుగింటి వాతావరణం మాత్రం కళ్ళకు కట్టినట్లు వుంటుంది. కానీ, లక్ష్మీరంజనంగారి పాఠంతో పోలిస్తే మాత్రం, ఈ పాట పాఠం సందర్భ శుధ్ధి లేనట్లుగా, అంటే ఒక సందర్భానికి సంబంధించినది కాకుండా వున్నట్లుగా అనిపిస్తుంది. పాట పేరులోకూడా ఈ అసందర్భం కనిపిస్తుంది, ‘మోచేతి పెద్దమ్మ’ ఏమిటన్నది అంతు చిక్కేదిగా కనుపించదు.

ఇప్పుడు, లక్ష్మీరంజనంగారు ఇచ్చిన పాట పాఠంలోని ‘బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ’ దగ్గరకొస్తే, ‘బీరాయి’ అన్న పదం ‘బీర చెట్టు’ ను సూచించేదిగానే అనుకుంటే, ‘బీర చెట్టు పూవులను విడిచేటి వేళ’ అన్న అర్ధం ఆ చరణానికి వస్తుంది. ఇందులో ఇమిడి వున్న అర్ధం ఏమిటి? అన్నది మాత్రం ఇప్పటిదాకా ఎంతగా శోధించినా నాకు పట్టుబడలేదు. బీర చెట్టు వెశేషంగా సాయంత్రం వేళల పూవులను రాలుస్తుందా? అన్నది నాకున్న సందేహం! రాలుస్తుంది గనకనే ఆ పాటలో చరణం అలా వుందని నేను నమ్ముతున్నాను! ఇది సరైనదో కాదో తెలిసినవాళ్ళు చెప్పాలి!

తెలుగు మాట, పాట, పద్యం (1)

వెయ్యేళ్ళుగా తెలుగులో లిఖిత సాహిత్యం వుంది.  అంతకు ముందు ఇంకా ఎన్ని వందల ఏళ్ళ నుంచో తెలుగులో ‘అలిఖిత’ (మౌఖిక సాహిత్యంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సాహిత్యాన్ని సూచించేదిగా ఈ పదం వాడుతున్నాను) సాహిత్యం ఉంది. అలిఖిత సాహిత్యానికి జనుల రసనయే వాహికయై అందులో ‘పస’ ఉన్న సాహిత్యమంతా తరం నుంచి తరానికి ప్రవహించి అందుబాటులోకి వచ్చింది. లిఖిత సాహిత్యం విషయంలో ఇలా జరగడానికి అవకాశం లేదు. లక్షణ గ్రంథాలూ, తెలుగు పూర్వ సాహిత్యంపై పెద్దల వ్యాసాలూ చదువుతుంటే, తెలుగులో లిఖిత సాహిత్యంలో ఈనాటికి దొరికి అందుబాటులోకి వొచ్చిన సాహిత్యం కంటే దొరకకుండా పోయిందే ఎక్కువేమో అన్న అనుమానం కలుగుతుంది.  శ్రీనాథుని శాలివాహన సప్తశతి లాంటివి ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్వర్గీయ మానవల్లి కవిగారి పుణ్యమాని, నన్నిచొడుని కుమార సంభవం, వినుకొండ
వల్లభరాయుని క్రీడాభిరామం, త్రిపురాంతకుని త్రిపురాంతకోదాహరణం లాంటివి దొరికాయిగాని, లేకుంటే వాటినీ  ఈనాటికింకా మరుగునపడిపోయిన మాణిక్యాలుగానే చెప్పుకుంటూ ఉండేవాళ్ళం.

‘పాటకు సాహిత్య గౌరవాన్నిచ్చి తమిళులు పురాతన సాహిత్యం ఉన్నవాళ్ళయ్యారు, అది చేయక మనం
లేనివాళ్ళమయ్యాము’ అని స్వర్గీయ ఆరుద్ర గారు (మక్కికిమక్కి ఇవేమాటలు కాదు, ఈ అర్ధం వచ్చేట్లుగా మాత్రమే) అన్నట్లు, తెలుగు అలిఖిత (మౌఖిక) సాహిత్యంలోని పాటను కూడా సాహిత్యంగా పరిగణించి చూస్తే, తెలుగు సాహిత్యం వయసు ఎంత హీనంగా వేసుకున్నా ఇంకో వెయ్యేళ్ళ ముందుకు జరగక మానదు, హాలుని గాథాసప్తశతి కాలం నాటికే తెలుగు పరిపూర్ణమైన భాషగా వృధ్ధి చెంది ఉన్నదని చెప్పడానికి నిదర్శనాలు గాథాసప్తశతిలోనే ఉన్నాయి కాబట్టి. అంటే, తెలుగు మాటకు, పాటకు ఎంత హీనంగా వేసుకున్నా రెండు వేల ఏండ్లకుపైనే వయసుంటుండని చెప్పుకోవచ్చు. అయితే, ఇన్ని వేల ఏండ్ల క్రితం నాటి  తెలుగు మాట, పాటల తొలి నాళ్ల రూపాలు ఎలా వుండేవో తెలుసుకోవడం ఆసక్తి కరంగానే అనిపించినా, అది తెలుసుకోవడానికి
సరిపడా సామగ్రి లేకపోవడంవల్ల ఇనాటి వాటి రూపాలతో సరిపెట్టుకుని, అర్ధాన్ని ఆస్వాదించడం, ఆనందించడం మాత్రమే చేయగలం.

తెలుగు పాట పురాతన రూపాలలో ‘ఏల’ ఒకటి. ‘ఏల’ అనే మాటకు ‘శృగారపు పాట’ అని బ్రౌన్ నిఘంటువులో చెప్పిన అర్ధం. ఇదెలా ఉన్నా, ‘ఏలలు పెట్టి పాడడం’ అని పాలుకురికి సోమనాథుడు బసవపురాణంలో చెప్పిన మాట ఒకటి ఉన్నది. దీనికి ‘రెండేసి పాదములకో మూడేసి పాదములకో యొక సారి యే దేవునిపేరో రాగక్రమమున నుచ్చరించుచు జదువుట యేలలుపెట్టి చదువుట యై తోచుచున్నది’ అని పూజ్యులు దివాకర్ల వెంకటావధానిగారిచ్చిన వివరణ ( వారిదే ‘ప్రాజ్ఞన్నయ యుగము’ పుస్తకంలో). వారిచ్చిన వివరణలోని ‘చదువుట’ అనే మాటను ‘పాడుట’ గానే అర్ధంచేసుకోవచ్చు, ‘ఏలలు’ పాడుకోవడానికి ఉద్దేశ్యించినవే కాబట్టి.

“కానరాని యడవిలోన
వానలేని మడుగు నిండె,
వానలేని మడుగుమీదనూ, ఏగంటిలింగా,
మానరాని అగ్ని పొడమెరా.”

“ఆకులేని యడవిలోన
తోకలేని మృగముపుట్టె
తోకలేని మృగము కడుపునా, ఏగంటిలింగా,
ఈకలేని పక్షిపుట్టెరా.”

‘ఏగంటి వారి ఏల’ లలోనివి ఇవి రెండు ఏల పదాలు. పాడుకోవడానికే ఉద్దేశ్యించినవని చెప్పకనే తెలిసిపోతుంది.  మాటలతో వర్ణించి చెప్పలేని ఏదో మార్మికత ఈ ఏలలలో ఉన్నదని కూడా చెప్పకనే తెలిసిపోతుంది. ‘ఏగంటిలింగా’ అన్నది మూడవ పాదాతంలో తప్పనిసరిగా ఇవ్వబడిన reprieve… విశ్రాంతి. ఇది పాడుకోవడంలో ఏదో ఉపశమనం ఉంది.  అలసిపోయిన మనసుకు ఇందులోని ఉపశమనం ఎంతో హాయినిచ్చేదిగా అర్ధమవుతుంది. ఈ ఏలలను నిర్మాణం చేసిన మనిషెవరోగాని, అతడి మనసుకు మనిషి చిత్తంలోని రాగద్వేషాలు, వాటివలన పొందే కష్టనష్టాలపై సమగ్రమైన అవగాహన ఉందన్నదీ తెలిసిపోతుంది. ఇది దేనికో అనువాదమో, అనుకరణో అనుకోవడానికి వీలులేదు. ఇది అచ్చమైన తెలుగు ఊహ, తెలుగు ‘వాడి’ ఊహ!

‘ఏల’ పదం, తరువాత్తరువాత శిష్టసాహిత్యంలోనూ ప్రవేశించి కనిపిస్తుంది.  కందుకూరి రుద్రకవి రచించిన ‘సుగ్రీవ విజయం’ లోనివి ఈ క్రింద చూపిన ఏలలు ఇందుకు ఒక ఉదాహరణ:

“భాను వంశామూన బుట్టి
దానవాకామినిగొట్టి
పూని మఖము నిర్వహింపావా – ఓ రామచంద్ర
మౌనివరులు సమ్మతింపాగాన్.”

“రాతినాతిజేసి పూరా
రాతిచేతి విల్లు విరిచి
భూతలేంద్రూ లెల్లమెచ్చగా – ఓ రామచంద్ర
సీతనూ వీవాహ మాడావా.”

పాడుకోవడానికి అనువుగా ఉండేట్లుగా పై ఏలలోని కొన్ని హ్రస్వ పదాలు దీర్ఘాంతాలుగా చేయబడడం గమనించవచ్చు.ఇదిలా వుంచితే, తెలుగులో ‘ఓల’ అనే ఒక మాట ఉంది. ఈ మాటకు ‘జలక్రీడ’ అని బ్రౌన్ నిఘంటువు చెప్పిన అర్ధం. ‘ఓలలాడు’ అంటే నీళ్ళలో ఆడడం అన్న అర్ధం రూఢమై కనిపిస్తుంది. ఓల  అనే మాటకు a cry, shout అన్న అర్ధాలను కూడా బ్రౌన్ నిఘంటువు చూపింది. నీళ్ళలో ఆడుకునేటప్పుడు ఆనందంలో పెట్టే కేకలను ఓలలని చెప్పుకోవచ్చు. ఓలగంధము (జలక్రీడకు ముందు శరీరం మీద రాసుకునే పసుపు లేపనము), ఓలపాట అనే పదాలు ‘ఓల’ నుంచే పుట్టాయి. తెలుగు సినిమా పాటలో (జగదేకవీరుని కథలో) ఈ ‘ఓల’ పదమే ‘హల’ గా మారి కనిపిస్తుంది.

‘ఏల’, ‘ఓల’, ‘హల’ …ఈ మూడు పదాలకూ భాషా పరంగా ఏదైనా సంబంధం ఉన్నదో లేదో, ఉంటే దానికి సంబంధించిన వివరణ ఎలా ఇవ్వాలో నాకు తెలియదుగాని, ఈ మూడిటికీ ఉన్న ఒక్క ముఖ్యమైన సామాన్య లక్షణం, ఈ మూడు పదాలూ పాటకు సంబంధించినవిగానే ఉండడం అన్నది తేలికగానే తెలిసిపోతుంది.

సామెతలూ, వాటి సంగతులు(5)

నీతి లోకానుభవ ప్రతిబింబము. లోకోక్తులే క్రమముగా నీతులు అవుతున్నాయి. లోకోక్తులకు లోకానుభవం నుంచి తెలుసుకున్న నిజాలు, నేర్చుకున్న పాఠాలూ ప్రాతిపదిక. ‘ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలువుతాయి’ అన్న సామెతకు కూడా లోకానుభవం నుంచి తెలుసుకున్న నిజమే ప్రాతిపదిక.

పూర్వ కాలంలో, వ్యాపారం రెండు విధాలుగా జరెగేది. చిన్న చిన్న వ్యాపారులు వస్తువులను బళ్ళమీద ఒక ఊరి నుండి ఇంకొక వూరికి తిప్పుతూ చేసే చిల్లర వస్తువుల వ్యాపారం ఒకటి. రెండవ రకం, బాగా ధనవంతులైన వ్యాపారులు ఓడల మీద సరుకులను విదేశాలకు తీసుకువెళ్ళి చేసే వ్యాపారం. దైవం అనుకూలించనప్పుడు, అదృష్టం కలిసిరానప్పుడు, సముద్ర యానంలో సంభవించిన ఏ తుఫాను లోనో సరుకులను తీసుకెళుతూండిన  ఓడలు గల్లంతై పెద్ద పెట్టున నష్టపోయి తెల్లవారేసరికల్లా ధనవంతుడు దరిద్రుడై మిగలడం, దేశంలో పొరుగూళ్ళలో చేస్తూండిన చిన్న సరుకుల వ్యాపారమే దైవం అనుకూలించడం వలన బాగా కలిసొచ్చి కొద్ది రోజుల్లోనే బాగా ధనవంతుడై బళ్ళలో చేస్తూండిన వ్యాపారం వృధ్ధి చెంది ఓడల కెక్కి విదేశాలకు మళ్ళడం లాంటి సందర్భాలూ సన్నివేశాలూ నిజజీవితంలోనివి కథలలో కెక్కి కనిపిస్తూంటాయి.

‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అన్న సామెత ఇలాంటి దృష్టాంతాలనుంచి పుట్టిందే. ఇందులో, కాలం కలిసొస్తే బండి ఓడవడం, కలిసి రానప్పుడు ఓడ బండవడం సరియైనది. అయితే, సుమతీ శతక కర్త అయిన బద్దెన మంత్రి ఈ సామెతను కలిమి లేముల్లాగా ఓడలు బళ్ళ మీదా, బళ్ళు ఓడల మీదా వస్తాయి అంటూ కలిమి లేముల ప్రసక్తి తెచ్చి వాటి రాకపోకలను అన్వయించడానికి చేసిన ప్రయత్నంలో, అన్వయం అంత బాగా కుదరక పోయినప్పటికీ, లోకం సరిపెట్టుకుంది. కానీ, భాస్కర శతక కర్త అయిన మారయగారి వెంకయ గారు దీని అర్ధాన్నే పూర్తిగా మార్చి వేశాడు. కష్టాల్లో పరస్పర సహకారం అన్న అర్ధంలో దృష్టాంతంగా దీనిని వాడాడు.  సరిపెట్టుకుందామని చూసినా సరే, సరిగా అన్వయం కుదరని సందర్భం ఇందులోది. నీటిపై ఓడలో బళ్ళు ప్రయాణించడం, నేల మీద బళ్ళపై ఓడలు ప్రయాణించడం లోకానుభవానికి దృష్టాంతాలుగా సాధారణంగా దొరికే సన్నివేశాలు కావు. అందువలన, సుమతీ శతకంలోనూ, భాస్కర శతకంలోనూ వాడబడిన రూపాలు సరియయినవి కావు. అన్వయానికి కుదరని రూపాలని తేలుతుంది.

లోకానుభవాలను సామెతల రూపంలో నీతి బోధకాలుగా చెప్పే ప్రక్రియలో, అతి తక్కువ మాటలలో చెపాల్సిన విషయాన్ని చెప్పడానికి వీలుగా మాటల్ని వడపోసి వడపోసి కూర్చగా అయినవే సామెతలు.  వాటిలో వ్యర్ధ పదాలూ, అర్ధ రహితమైన మాటలు సాధారణంగా ఉండవు.  ప్రతి మాట వెనుకా ఏదో బలమైన కారణం, అర్ధవంతమైన అనుభవ సారం తప్పకుండా ఉంటుంది. అందువల్ల ఈ సామెత ‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అన్న రూపమే అసలైనదీ, లోకానుభవ సిధ్ధమైనదీను!

సామెతలూ, వాటి సంగతులు (3)

“ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి” అని తెలుగులో ఒక సామెత ఉంది.  దీనిని అదృష్టం కలిసి రాకపోతే పరిస్థితులు తారుమారై ఈ రోజు భాగ్యవంతుడు రేపటికల్లా బికారి కావచ్చు, ఈ రోజుటి బికారి రేపటికి భాగ్యవంతుడు కావచ్చు గనుక మనిషిని మనిషిగా గౌరవించాలి గాని ఉన్న సంపదను చూసుకుని మిడిసిపడడం తగదు అన్న అర్ధంలో ఒక హెచ్చరికగా వాడ బడుతోంది.

తెలుగులో ఈ సామెత  భాస్కర శతకం రచించ బడిన రోజుల నుంచీ ఉంది.  దీనికి నిదర్శనం భాస్కర శతకంలోనే ఉంది.  భాస్కర శతకంలో మూడవ పద్యం:

“అక్కరపాటు వచ్చు సమయంబున జుట్టము లొక్క రొక్కరి
న్మక్కువ నుధ్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ
యొక్కట; నీటిలో మెరక నోడల బండ్లను బండ్లనోడలున్
దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా!”

బేధమల్లా, ఈ పద్యంలో భాస్కర శతకకర్తగా భావింప బడుతూన్న మారయగారి వెంకయ ఇప్పుడు వాడబడుతూన్న ‘ఓడలు బళ్ళు అవుతాయి’ అన్నరూపంలో కాకుండా, ‘ఓడల బండ్లు వచ్చుట’ అన్న రూపంలో వాడాడు. అర్ధం విషయంలో సందేహం లేకుండా స్పష్టత కోసంగా ‘నీటిలో, మెరక’ అన్న పదాలు గూడా వాడాడు.  దీనిని బట్టి చూస్తే ఈ సామెత పూర్వం ‘ఓడలు బళ్ళు లాగుతాయి, బళ్ళు ఓడలు లాగుతాయి’ అన్న రూపంలో ఉండి, రాను రాను ‘ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి’ అని మారినట్లుగా కనిపిస్తుంది.

భాస్కర శతకంలో ఈ సామెత వాడబడిన సందర్భములో విశదమయ్యే అర్ధానికీ, ఇప్పుడు వాడ బడుతూన్న అర్ధానికి కూడా తేడా కనిపిస్తుంది.  భాస్కర శతకంలో ఇది ‘ఆపత్కాలంలో పరస్పర సహకారం’ అన్న అర్ధంలో వాడబడి కనిపిస్తూండగా, ఇప్పుడు దానికి సంబంధం లేని అదృష్టంతో తారు మారు కాగలిగే పరిస్థితులకు సూచకంగా వాడబడుతోంది.

సామెతలూ, వాటి సంగతులు.

‘ఒక సంగతికి దృష్టాంతముగా లోకులు వాడుకగా చెప్పే మాట’ అని తెలుగు సామెతకు బ్రౌణ్య నిఘంటుకారులు ఇచ్చిన నిర్వచనం.  లోకులు వాడుకగా చెప్పే మాట గాబట్టి సామెతకు ‘లోకోక్తి’ అని ఇంకొక పేరు. సంభాషించేటప్పుడు సందర్భానికి తగినట్లుగా సామెతను తగిలించి సంభాషించడం ఒక కళ. దీనికి సామెతల మీద తగినంత పరిజ్ఞానం ఉండడమే కాకుండా, తగినన్ని సామెతలు బుధ్ధిలో నిక్షిప్తమై ఉండాలి. అవసరానికి తగినట్లుగా అవి జ్ఞాపకం రావడంగూడా అంతే ముఖ్యం.  నిన్న మొన్నటిదాకా, కొంతమంది పెద్దల సంభాషణలలో, వ్రాతలలో సామెతల వాడకం చాలా విరివిగా కనిపించేది.  ఏకారణంచేతనో ఇప్పుడది కొంత తగ్గిందనే చెప్పాలి.  సామెతలు మౌఖిక సాహిత్యంలో ఒక భాగం.  వాటిని కాపాడుకోవడం, వాడకాన్ని పునరుధ్ధరించడం, పెంచడం భాషాభివృధ్ధి దృష్త్యా ఒక అవసరం.

ప్రతి సామెత పుట్టుకకూ మూలమై  తప్పనిసరిగా చిన్నదో, పెద్దదో ఒక కథ ఉంటుంది.  బ్రౌణ్య నిఘంటుకారులు దీనినే తమ నిర్వచనంలో ‘సంగతి’ అన్నారు.  ఈ కథకు లేదా సంగతి కి అత్యంత సంక్షిప్త రూపంగా సామెత పుడుతుంది.  ఉదాహరణకు:

కసి తీరక మసి పూసుకున్నాడు” అనే సామెత. మన్మధుడిని దగ్ధం చేసినా పరమశివునికి కోపంతీరక ఆ బూడిదను ఒంటికి రాసుకున్నడట.  ఈ సామెత పుట్టుకకు ఈ సంగతి మూలం.

పెన్న దాటితే పెరుమాళ్ళ సేవ” అని ఒక నానుడి ఉంది.  దీనికి మూలం పెన్నానది తీరాన గల (నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం – దొడ్ల వారి సంస్థానం) రంగనాధుని ఆలయంలో జరుగుతూండిన నృత్యసేవ అట.

హంస కుయ్యగానే ఛస్తుందని” ప్రతీతి.  దీనికి దృష్టాంతమేదో తెలియదు.

మనం సర్వ సాధారణంగా వినే “గాదిద గుడ్డు, కంకర పీసూ” అనే నానుడి.  ఇది God the good! Conquer peace! అనే ఆంగ్ల లోకోక్తి కి అపభ్రంశ, గ్రామ్య రూపంగా తెలుస్తుంది. ఇక -

“ఇరుసున కందెన బెట్టక పరమేశ్వరుని బండియైనా బాఱదు”

తినక తీపూ చేదూ తెలియవు, దిగక లోతూ పాతూ తెలియవు”

“బాధ వచ్చు దినములును భాగ్యము వచ్చు దినములును తెలియవు.”

ఇలాంటి సామెతలకు వేరే దృష్టాంతాలు అవసరంలేదు. సర్వ జనావళి నిత్యానుభవాలే ఈ సామెతల పుట్టుకకు దృష్టాంతాలుగా చెప్పుకోవచ్చు.

పద్య రచన – పద ప్రయోగ వైచిత్రి (2)

ఛందస్సుకు సంబంధించిన అవసరాల కోసం తెలుగు పదాలను రూపాంతరం చెందించి ప్రయోగించి అధిక్షేపణకు గురియైన సందర్భం ఒకటి, శ్రీక్రిష్ణదేవరాయల కాలానికి చెందినది, ఇక్కడ తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది. రాయలవారి ఆస్థానంలో రాయలవారి చేతనే ఆంధ్ర కవితా పితామహునిగా సంబోధింపబడినటువంటి అల్లసాని పెద్దన ఒకానొక సందర్భంలో ప్రస్తావవశాన చెప్పినదిగా ప్రసిధ్ధమైన ఒక చాటు పద్యం:

కం. కలనాటి ధనము లక్కర
గల నాటికి దాచ కమలగర్భుని వశమా?
నెల నడిమి నాటి వెన్నెల
అలవడునే గాదె బోయ అమవస నిసికిన్?

ఇంత చక్కటి చాటు పద్యంలో, ‘అమావాశ్య’ అనే పదం ‘అమవస’ గా మార్చబడి పెద్దన గారి చేత ప్రయోగించబడడం కేవలం ఛందస్సుకు సంబంధించిన అవసరం కోసమే అన్నది ఇక్కడ స్పష్ఠమే. పెద్దన అంతటి కవి చేసిన ప్రయోగం కాబట్టి తప్పు బట్టడం సముచితం కాదని ఎవరనుకుని  సమాధానపడి ఊరుకుండినా, తెనాలి రామక్రిష్ణుడు అలా సమాధానపడి నిమ్మకుండే వ్యక్తి కాదు కదా! పెద్దన చేసిన అపప్రయోగంపై తన అధిక్షేపాన్ని పద్యరూపంలోనే చెప్పినట్లుగా ప్రసిధ్ధమైన తెనాలి రామక్రిష్ణుని చాటు పద్యం:

కం. ఎమి తిని సెపితివి కపితము?
బ్రమపడి వెరి పుచ్చకాయ వడి దిని సెపితో?
ఉమెతః కయ తిని సెపితో
అమవసనిసి అన్న మాట అలసని పెదనా!

తెనాలి రామక్రిష్ణుని కవితా ప్రతిభకు అద్దంపట్టే చాటు పద్యం ఇది. పెద్దన గారి పద్యాన్ని ఈ  పద్యాన్ని పక్క పక్కనే చదివి అర్ధంచేసుకోవాల్సిందే తప్ప ఈ పద్య సౌందర్యాన్ని గుఱించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ‘ఏమి’ అన్న పదానికి బదులుగా ‘ఎమి’ అని, ‘చెప్పితివి’ అన్న పదానికి బదులుగా ‘సెపితివి’ అని, ‘చెప్పితివా’ అన్న పదానికి బదులుగా ‘సెపితో’ అని, ‘ఉమ్మెత్త కాయ’ అన్న పదానికి బదులుగా ‘ఉమెతః కయ’ అని, చివరికి ‘అల్లసాని పెద్దనా’ అన్న పదానికి బదులు ‘అలసని పెదనా’ అని చేసిన ప్రయోగాలన్నీ పెద్దన గారు ‘అమవస నిసి’ అని చేసిన అపప్రయోగాన్ని ఎత్తి చూపుతూ చేసిన పద ప్రయోగాలే. ‘అధిక్షేపాన్ని ఇంత అందంగా చేయగల కవి తెలుగులో ఒక్క తెనాలి రామక్రిష్ణుడు తప్ప మరొకరున్నారా?’ అంటే సందేహమే!

పద్య రచన – పద ప్రయోగ వైచిత్రి (1)

తెలుగు పద్య రచనలో ఛందస్సుకు సంబంధించిన అవసరాలకోసం తెలుగు పదాల స్వరూపాలను మార్చి పూర్వ కవులలో ప్రసిధ్ధులైన వారు సైతం ప్రయోగించిన విధానం పరికిస్తే కొంతైనా ఆశ్చర్యం కలగక మానదు. ఉదాహరణకు, నన్నె చోడుని కుమార సంభవం లోని ఈ పద్యంలో ‘ఆంధ్ర’ శబ్దాన్ని ‘అంధ్ర’ గా ప్రయోగించిన
సందర్భం:

కం. మును మార్గ కవిత లోకం
బున వెలయగ దేశి కవిత బుట్టించి తెను
గు నిలిపి రంధ్ర విషయమున
జన సత్యాశ్రయుని తొట్టి చాళుక్యనృపుల్.

ఈ పద్యంలోని మూడవ, నాల్గవ పాదాలకు పాఠాంతరం కనిపిస్తోంది.  అయితే వాటిల్లో కూడా ఈ పద ప్రయోగంలో మార్పేమీ లేకపోవడాన్ని గమనించవచ్చు. పాఠాంతరంగా లభిస్తూన్న పాదాలు ఇవి:

‘గును నిలిపి రంధ్ర విషయం
బున జన చాళుక్యరాజు మొదలగు పలువుర్.’

తెలుగు సాహిత్య చరిత్రలో ‘ఆంధ్ర ‘ శబ్దానికి దగ్గరవిగా ‘అంధ, అంధక ‘ రూపాలు కనిపిస్తాయి తప్ప, ‘అంధ్ర ‘ అన్నప్రయోగం ఈ ఒక్క పద్యంలోనే కనిపిస్తుంది, నేనెఱిగున్నంతవరకు. ఈ రూపం ఆ తరువాతి కాలంలో కవుల ప్రయోగాల్లో అంతగా ఆమోదాన్ని పొందినట్లుగా కనిపించని కారణంచేత కేవలం చ్చందస్సుకు సంబంధించిన అవసరంవల్లే నన్నె చోడుడు ఇలా ప్రయోగించాడని అనుకోవాల్సివస్తుంది.

ఇలాంటిదే పదప్రయోగం (దీర్ఘాక్షరానికి బదులుగా హ్రస్వాక్షరాన్ని వాడినటువంటి సందర్భం) ఉన్న ఇంకో పద్యం:

“ఫుల్ల సరోజనేత్ర! అలపూతన చన్నుల చేదుద్రావినా
డల్ల దవాగ్ని మ్రింగితినటంచును నిక్కెదవేల? తింత్రిణీ
పల్లవ యుక్తమౌనుడుకు బచ్చలి శాకము జొన్నకూటితో
మెల్లన యొక్కముద్ద దిగమ్రింగుమ! నీ పస కాననయ్యెడిన్”

ఇది ఒక చాటు పద్యం. పల్నాటిసీమలో ప్రజలు తినే ఆహారం, చింతచిగురు (తింత్రిణీపల్లవము), బచ్చలాకు కలిపి వండిన కూరతో జొన్నన్నం తినడంలో అనుభవమయ్యే కష్టాన్ని తెలిపే పద్యం ఇది.

‘దావానలము’ ‘బడబాగ్ని’ అనేవి రెండు భిన్న అర్ధాలున్న పదాలు.  ఈ రెండింటి సంయోగ  రూపంగా అనిపించే ‘దావాగ్ని’ అనే పదాన్ని కూడా చ్చందస్సుకు సంభంధించిన అవసరం కోసం ‘దవాగ్ని’ అని ప్రయోగించడం ఈ పద్యం లో కనిపిస్తుంది. అయితే పద్యం యొక్క సందర్భ ఔచిత్యం, అర్ధ సౌందర్యం దృష్టిలో ఉంచుకుని చూస్తే ఇలాంటి చిన్న చిన్న అపప్రయోగాలను అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదనుకుంటాను.

తెలుగులో మౌఖిక సాహిత్యం – చాటువు

తెలుగులో చాటు పద్యం ‘చిచ్చుబుడ్డి’ లాంటిది. వెలగడమే కాంతి ఉవ్వెత్తున ఎగసి నలుదిక్కులనూ కమ్మేసే స్వభావం కలిగినటువంటిది.

సరళమైన పదప్రయోగ సామర్ధ్యం, అనర్గళమైన ధారా పటిమ, తెలుగు చ్చందస్సు తో సంపూర్తి పరిచయం ఉన్నవ్యక్తి మాత్రమే చాటు పద్యం చెప్పగలడు.  ఈ మూడు సామర్ధ్యాలతో పాటు మరో ముఖ్య లక్షణం కూడా ఉండాలి. అది ‘విట్’, చమత్కార ఆలోచనా పటిమ, ఆ విధమైన భాషణా సామర్ధ్యం. సహజంగానే ఈ లక్షణం పుష్కలంగా ఉన్న వ్యక్తులు చెప్పిన చాటు పద్యాలు మాత్రమే సజీవంగా నిలిచి ప్రసిధ్ధమయ్యాయి.

చాటు పద్యం అనగానే మొట్టమొదటగా ఙ్నప్తికి వచ్చే పద్యం శ్రీనాధుని ‘సిరిగల వానికి చెల్లును’ పద్యం.  ఎన్నిసార్లు చదువుకొన్నా ఎప్పటికీ నూతనంగా అనిపిస్తుంది.

కం. సిరిగల వానికి చెల్లును
తరుణుల పదియారువేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా?
పరమేశా గంగవిడుము, పార్వతి చాలున్.

ఎంత చమత్కారం తో నిండి ఉన్నదీ పద్యం! సరళాతి సరళమైన భాష, ‘వానికి ‘ అన్న పదంతో శ్లేషించిన విధానం, ‘తిరిపెమునకు’ అన్న పదంతో పరమశివుని సంభోదించగల ధైర్యం, ఒకవైపు గంగాదేవిని మాకొదలవయ్యా స్వామీ అని అభ్యర్ధిస్తూనే చివరన తమరికి వొక్క భార్య చాలదా అన్న విసురు…శ్రీనాధుని వల్ల తప్ప వేరే ఎవరివల్లనైనా సాధ్యం అవుతుందా ఇలాంటి పంధ్యం చెప్పడం? ఇన్ని సంగతులనూ కేవలం 64 మాత్రల (అక్షరాలు కాదు సుమా!) నిడివి తో ఉండేటువంటి కంద పద్యంలో ఇమిడ్చి చెప్పడానికి ఎంతో ప్రఙ్న కావాలి.  అటువంటి ప్రఙ్నశ్రీనాధునికి పుష్కలంగా ఉంది.  అందుకే ఆయన మహాకవిగా మన్ననలందుకుంటున్నాడు, నేటికీ!