తెలుగు మాట, పాట, పద్యం (5)

అచ్చ తెనుగు పద్యం

తెలుగు పద్య సాహిత్యంలో ‘అచ్చ తెనుగు’ అన్న మాటను మొదటి సారిగా వాడిన వ్యక్తి మూలఘటిక కేతన అని చెబుతారు. ఈయన తిక్కన మహాకవి సమకాలికుడు. తెలుగులో మొదటి కథాకావ్యానికి (దశకుమార చరిత్ర) శ్రీకారం చుట్టినవాడు కేతన. ‘కవిత చెప్పి’ తిక్కన మహాకవినే మెప్పించినవాడు ఈయన.  ఈయన చెప్పిన ఈ ‘అచ్చ తెనుగు’ అనే మాటకు ముందు, ఈ మాట ఏ అర్ధాన్నయితే సూచిస్తుందో అదే అర్ధంలో ‘జాను తెనుగు’, ‘దేశి’ అనే మాటలు వాడుకలో వుండేవి. ఈ మాటలను తమ పద్యాలలో చెప్పిన వారు ‘నన్నె చోడుడు’, పాలుకురికి సోమనాధుడు!

పేరుకి ఇన్ని మాటలున్నా, ఈ మాటలు ‘అచ్చ తెనుగు’ భాషా స్వరూపాన్ని అర్ధమయేలా చేయడంలో సఫలీకృతం కాలేకపోయాయన్న ఒక అభిప్రాయం, విజ్ఞుల మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి! భాషా స్వరూపం అర్ధం కావాలంటే, ఒక ఉదాహరణంతో చెప్పుకుంటే, కొంతలో కొంత స్ఫష్టత వచ్చి, సులభం అవుతుంది.

“పగలు సేయుచు వేడిమి మిగుల జగము
గ్రాచు జమునబ్బ మున్నీట గలిసె ననియొ
తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపు
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”

కూచిమంచి తిమ్మకవి రచించిన ‘అచ్చ తెలుగు రామాయణం’ కావ్యంలోనిది ఈ పద్యం. సూర్యాస్తమయాన్ని సుందరంగా వర్ణించే పద్యం! నాకయితే, ఈ పద్యంలోని మాటల పొందిక, brevity, గాథా సప్తశతిలోని గాథలను తలపుకు తెస్తుంది. మంచి భావంతో నిండి వున్న పద్యం! ఊహ original ది! నాకు తెలిసినంతవరకూ, ఏ ప్రాకృత గాథనుంచో, సంస్కృత శ్లోకంనుంచో ఎత్తుకొచ్చింది కాదు!

ఇప్పుడు, ఈ పద్య భావాన్ని కొంచెం విడమరచి చెప్పుకుంటే…

‘పగలు సేయుచు’ – పగలు సేయువాడు – దినకరుడు.
సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ, కొన్ని రకాలయిన సంస్కృత సమాసాలు అచ్చ తెలుగులోకి మారేటప్పుడు జరిగే మార్పులను గురించి కొంత వివరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సంస్కృత సమాసాలలోని ప్రత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, దొర, తపసి, జోదు…ఇత్యాది శబ్దాలు జతవుతాయి అని వ్యాకరణం. ఉదాహరణకి:

అచ్చ తెలుగులో ‘కప్పు కుత్తుక వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘నీలకంఠ’ కు,
అచ్చ తెలుగులో ‘గిత్త తత్తడి వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘వృషభ వాహన’ కు,
అచ్చ తెలుగులో ‘వెంట్రుక యడుగుల దొర’ అనే సమాసం, సంస్కృతంలో ‘రోమ పాద’ కు,
అచ్చ తెలుగులో ‘మనుబోతు కొమ్ము తపసి’ అనే సమాసం, సంస్కృతంలో ‘ఋష్యశృంగ’ కు,
అచ్చ తెలుగులో ‘పచ్చ వారువపు జోదు’ అనే సమాసం, సంస్కృతంలో ‘హరిదశ్వా’ కూ అనువాదాలని పెద్దల వివరణ. తెలుగులో వీటినే బహువ్రీహి సమాసాలుగా భావిస్తారని కూడా చెబుతారు, అర్ధంలో చివరన కలది, కలవాడు చేరతాయి కాబట్టి. (నల్లని కంఠము కలవాడు, ఎద్దును వాహనముగా కలవాడు…ఇత్యాదిగ).

నాకయితే తెలుగులో ఈ మాటలు, సంస్కృతంలో మాటలు ఎంత అందంగా కనిపిస్తాయో, తెలుగులోనూ అంతే అందంగా అనిపిస్తాయి. ఇలాంటివే ఇంకొన్ని సమాసాలు:

వలిగుబ్బలి రాచ కూతురు (హైమవతి – హిమవంతుని కూతురు, ‘వలిగుబ్బలి’ అంటే మంచుకొండ అని అర్ధం), పుట్ట బుట్టువు తపసి (వాల్మీకి – పుట్ట  నుంచి పుట్టిన తపస్వి), పదియరదముల దొర కొడుకు (దాశరధి – దశరధుని కుమారుడు) – ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలంత అందంగానే కనబడతాయి.

ఇక్కడితో ఇది ఆపి, అసలు పద్యానికొస్తే –

పగలు సేయుచు – పగటిని చేస్తూ, ఆ క్రమంలోనే; వేడికి మిగుల జగము గ్రాచు – వేడిమితో జగత్తునంతా వుడికించి ఇబ్బందికిలోను చేసే; యమునబ్బ – యముని తండ్రి (సూర్యుడు); మున్నీట – సముద్రములోనికి; కలిసె ననియొ – కలిసిపోయాడుగదా అని; తొగ వెలందుక – కలువ పూవు (అనే పడతి); నగియె – నవ్వింది; అమ్మగువ – ఆ కలువ సుందరి; పెంపు గని – సంతోషంతో వదనం పెద్దదవడం (కలువ వికసించడం అన్న భావం) చూసి; సయింపక – తాళ లేక; తమ్మి – తామర పూవు (అనే పడతి); మొగంబు మొగిచె – మొహం ముడుచుకుంది, చాటు చేసుకుంది.

సూర్యాస్తమయంతోనూ, చంద్రాగమనంతోనూ కలువలు వికసించడం అనేది ప్రకృతి ధర్మం. సూర్యాస్తమయంతో తామరలు వికసనం కొల్పోయినట్లయి, కళావిహీనంగా, ముడుచుకున్నట్లయిపోవడమూ ప్రకృతిధర్మమే! ఈ రెండు ధర్మాలనూ కలబోసి, ఒకే సందర్భానికి జతచేసి, హృద్యంగా చెప్పడం ఈ పద్యంలో జరిగింది.

నాకు ఈ పద్యాన్ని చదివినప్పుడల్లా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది. పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గాథా సప్తశతి లోని పద్యాలను తెలుగులోకి అనువదించడంలో ఈ పద్యాన్నే(సరిగ్గా ఈ పద్యాన్నే అని కాకుండా, ఇలాంటి పద్యాలనే) ఆదర్శంగా తీసుకున్నరేమో! అని. ఎందుకంటే, అందులోని చాలా పద్యాల నడక ఈ పద్యాన్నే పోలి వుంటుంది. ఉదాహరణకి:

“అడుగుదమ్ములందు బడివేడు పతివీపు
జిన్ని కొమరుడెక్కి చెలగి యాడ
అలుక యెంత తెగనిదయ్యును నిల్లాలి
మొగమునందు నవ్వు మొలచె నపుడు! “                (శతకం 1 గాథ 11)

“ఎవని వదలిన జీవంబు నవసి చనునొ
యతని నపరాధినయ్యు నోదార్ప వలయు;
ఊరు గాలుచు బొలిపోవు చున్న గాని
యగ్గి నొల్లని వారెవ్వరతివ, చెపుమ?”         (శతకం 2, గాథ 63)

అందుండి అచ్చ తెలుగు మాటలలో వున్న ఇలాంటి రమ్యమైన పద్యాలను ఇంకా చాలానే ఉదాహరించవచ్చు!

తెలుగు మాట, పాట, పద్యం (4)

తెలుగులో శతక సాహిత్యంలో అధిక్షేప శతకానిది ఒక ప్రత్యేకమైన శాఖ అయితే, అందులో వేణుగోపాల శతకానిది ఒక విశిష్ఠ స్థానం అన్నది తెలిసినదే! ఈ శతకాన్ని రచించినది పోలిపెద్ది వేంకటరాయ కవి.  ఇతడు కార్వేటి సంస్థాన కవులలో ప్రముఖుడు అని చెబుతారు.

వేణుగోపాల శతకంలోని పద్యాలలో తెలుగు నానుడులు, సామెతలు అనదగినవి చాలా (పద్యాలకు అనువైన భాషలో)  పద్యాలలోకి ఎక్కి కనబడతాయి. వాటిలో కొన్ని మంచివాటిని పద్యాలలోంచి ఏరి విడిగాతీసి చూపించడం ఇక్కడ జరిగింది:

పొరుగూరి కేగిన పోవునే దుర్దశ
కాదె పెండిలి సన్నికల్లు దాచ
డొంకల డాగ పిడుగుపాటు తప్పునే    (డొంకలలో దాక్కుని పిడుగుపాటునుంచి తప్పుకోగలమా? అని)
కాలడ్డ నిలుచునే గాంగ ఝరము       (గంగా ప్రవాహాన్ని కాలడ్డుపెట్టి ఆపగలమా?)
ఇంకిపోవునే అనావృష్టి జలధి            (దేశంలో అనావృష్టివలన సముద్రం ఇంకిపోతుందా?)
అర్కుడుదయింప చెడునె గుహా తిమిరము  (గుహలో చీకటి సూర్యోదయంతో తొలుగుతుందా?)

పెట్టిపోసిన నాడె చుట్టాల రాకడ
సేవ చేసిన నాడె క్షితినాదు మన్నన
విభవంబు గల నాడె వెనువెంట తిరుగుట   (ఇవన్నీ సమానార్ధకాలే!)

‘అభావ విరక్తి’ అని ఒక అవస్థ వుందని, దానికి ఈ క్రిందివి వుదాహరణలనీ ఒక పద్యంలో చెప్పి…

శక్తి చాలని నాడు సాధుత్వం వహించడం
విత్తహీనుడు ధర్మ వృత్తి తలచడం
వ్యాధి పీడితుడు దైవతాభక్తి దొరలాడడం
పని పోవ మౌనవర్తనం దాల్చడం
రమణి లేకున్న విరక్తి మంచిది అనడం
భారము పైబడ్డ (పుడు) బరువెఱుంగడం (బరువు గుఱించి ఉపన్యాసాలివ్వడం)…

ఇత్యాది ‘అభావ విరక్తు’ ల వలన, తత్కాల విరక్తుల వల్ల ఫలితంలేదంటూ….

తినక చవి చొరకయె లోతు తెలియబడునె (తినక రుచి, దిగక లోతూ తెలియడం సాద్యం అవుతుందా?) అనే సామెత చెప్పబడింది.

ఆశకు ముదిమియు అర్ధికి సౌఖ్యంబు
ధనపరాయణునకు ధర్మచింత
అల్పవిద్యునకు అహంకారదూరత
పాపభీరుత సంతానబాహ్యునకు
కలదనెడువార్త కలదె లోకములయందు… (దీనికి ఏమీ వివరణ అవసరంలేదు కదా!)

ఈతకు మిక్కిలి లోతు లేదు
కవిజనంబుల కెఱుంగనివి లేవు

మెఱుపు దీపంబౌనె మేఘంబు గొడుగౌనె
అల యెండమావులు జలంబు లౌనె
కాని వస్తువు పట్టుకో కాంక్షచేత
పెనుగు మాత్రంబెగాని లభింపదేమి….

పొయిపాలికే పాలు పొంగుటెల్ల
ఆఱిపోయెడి దివ్వె కధిక దీప్తి
కట్టనిల్వని చెర్వు గడియలోపల నిండు
బ్రతుకజాలని బిడ్డ బారెడుండు
పెరుగుటయు విఱుగుటకని యెఱుగలేక
అదిరిపడుచుండు నొక్కొక్క అల్పజనుడు….

వలపు రూపెరుగదు
ఆకలిలో నాల్క అరుచి యెరుంగదు
కోపం బెదుటి గొప్పకొద్దు లెఱుంగదు
నిదుర సుఖం బెఱుంగదు
హరునకైనను నివి గెల్వ నలవికాదు
ఇతరులైనట్టి మానవులెంతవారు….

పైన చూపినవన్నీ అదనంగా వివరణ యేమీ అవసరంలేకుండానే అర్ధమయ్యేవీ,  తక్కువ మాటలలో చక్కటి నిజాలను చెప్పేవీను! వాటిల్లో కొన్ని ఇప్పటికీ  సామెతలుగా అదపాదడపా నిత్యవ్యవహారంలో పెద్దవాళ్ళనోట వినిపిస్తూనే వున్నాయి కూడానూ!

*****

తెలుగులో అధిక్షేప శతకాలు రచించిన వారిలో కూచిమంచి తిమ్మకవి, జగ్గ కవి అని ఇద్దరు కవులున్నారు.  వీరిద్దరూ అన్నదమ్ములని తెలుస్తూనేవుంది కదా! కూచిమంచి తిమ్మకవి రచించిన శతకం శ్రీ భర్గ శతకం, జగ్గ కవి రచించిన శతకం శ్రీ భక్తమందార శతకం. వీరు  క్రీ.శ.18 వ శతాబ్దానికి చెందిన వారు. వీరిలో కూచిమంచి జగ్గకవి తెలుగులో మొట్టమొదటి అధిక్షేప ప్రబంధకర్తగా ప్రసిధ్ధుడు.  ఆ ప్రబంధం పేరు ‘చంద్రరేఖా విలాపము’. ఇందులోని కవిత్వ స్థాయిని C.P.Brown దొర కూడా మెచ్చుకున్నాడని ఎక్కడో చదివినట్లు గుర్తు.

ఆ సంగతి అలా వుంచి, ప్రస్తుత విషయానికి వస్తే – వీరిరువురు రచించిన అధిక్షేప శతకాలను  ఇప్పుడు తలుచుకోవడానికి కారణం, వీరిరువురూ వారి శతకాలలోని పద్యాలలో వాడిన పరభాషా పదాలను గుఱించి ముచ్చటించుకోవడానికి! పరభాషా పదాలలో వీరు మక్కువపడి అన్నట్లుగా ఒకటికి రెండుసార్లు వాడిన పదం  ‘ఇల్ల’. ఈ పదం తమిళ భాషలోనిది.  ‘లేదు’ అని తమిళంలో ఈ మాటకు అర్ధం. ఎందుకు అంత మక్కువపడి ఈ పదాన్ని వీరు వాడారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ‘ఇల్లె’ అనే ఈ మాటకు బదులు తెలుగు పదం ‘లేదు’ అన్నది వాడొచ్చు, ఛందోభంగం ఏమీ కాదు. (సుఖం ఇల్లె, సుఖం లేదు – తేడా ఏమీ లేదు).

“కోపంబెక్కువ; తాల్మి యిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబు తీల్”

కూచిమంచి తిమ్మకవి – శ్రీ భర్గ శతకము లోనిది ఈ శార్దూల పద్య ప్రథమ పాదం. ఈ పాదంలో  చివరిపదం   ‘తీల్’ అనేది కూడా పరభాషా పదమే, జగ్గకవి భక్తమందార శతకంలోని ఒక పద్యంలో ఈ పదం ‘తీర్’ అని కనిపించింది, నేను చూసిన పుస్తకంలో.  ఇది అచ్చు తప్పు అయివుండాలి. ఈ పదం తీల్/తీర్ ఏ భాషా పదమోగాని, అర్ధం మాత్రం ‘లేదు’ అనే అన్నది సందర్భాన్ని బట్టి అర్ధమై పోతుంది!

కూచిమంచి జగ్గకవి రచించిన శ్రీ భక్తమందార శతకం నుండి ఈ క్రింది పద్య పాదాలు:

“దానంబిల్లె, దయారసంబు నహి, సద్ధర్మంబు తీర్, మీపద
ధ్యానంబున్ గడులొచ్చు…..”

“క్రతువుల్ సేసెదనంటినా, బహుపదార్ధంబిల్లె!…”

అదలా వుంచితే, కూచిమంచి జగ్గకవి భక్త మందార శతకంలో నాకు బాగా ఆసక్తి కరంగా అనిపించిన ఒక మాట ‘దేమస’ అనే మాట. ఈ మాట బ్రౌన్ నిఘంటువులోనికి కూడా ఎక్కలేదు. ఇది ఇప్పుడు ‘తమాషా’ అన్న అర్ధంలో వాడకంలో వుంది.  భక్తమందార శతకంలోని ఆ పద్యం, మత్తేభం:

“రసికోత్తంసులు సత్కులీనులు మహాద్రాఘిష్ఠ సంసార ఘో
రసముద్రాంతరమగ్నులై దరికి జేరన్ లేక విభ్రాంతిచే
పసులం గాచిన మోటుకొయ్య దొరలం బ్రార్ధింతు రెంతేని దే
మసగాదే యిది యెంచిచూచినను రామా! భక్త మందారమా!”

తెలుగు మాట, పాట, పద్యం (3)

ఏ భాషలో నైనా సరే, పద్యం పదికాలాల పాటు నిలబడాలంటే, దానికి ముఖ్యంగా కావలసింది నడక. మంచి అర్ధసౌందర్యం కలిగిన పద్యానికి, ఒక మోస్తరు నడకైనా తోడైతే, ఆ పద్యం పదికాలాలు కాదు, వెయ్యి  కాలాలైనా నిలుస్తుంది. తెలుగులో వందల కొలది చాటు పద్యాలు, అజ్ఞాతకర్తృకాలైనవి, ప్రజల నాలుకల మీదనుంచే తరంనుంచి తరానికి అంది నిలిచి వుండడానికి కారణం ఇదే గదా!

పద్యానికి ఛందస్సు వుంది. ఛందస్సులో వున్నంతమాత్రాన పద్యం పద్యమవుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. గాలికి తావి తోడైనట్లుగా, ఛందస్సుతో వున్న పద్యానికి మరొకటేదో తోడుకావాలి. ఆ ‘మరొక’ లక్షణాన్ని ప్రతిభగల కవి మాత్రమే అందించగలడు.

తెలుగు పద్యాలలో కంద పద్యానిది ఒక ప్రత్యేక స్థానం. కేవలం 64 మాత్రల నిడివి గలిగినటువంటి ఈ పద్యాన్ని రకరకాలుగా నడిపించారు మన కవులు. ఒక కవి వినూత్నంగా సాధించిన నడకను ఆ తరువాతి కవులు మక్కువతో అనుసరించిన సందర్భాలు సాహిత్యంలో చాలానే కనిపిస్తాయి. పద్యాల నడకల విషయంలో ఎవరు ముందు ఎవరు వెనుక అనే విషయాన్ని పక్కన పెట్టి, ఆయా నడకలలో తెలుగు పద్యం వయ్యారంగా నడిచిన తీరును పట్టి చూసుకుని ఆనందించడం ఒక పధ్ధతి. ఆ పధ్ధతిలో, ఇప్పుడు కంద పద్యమనే కాకుండా, మరికొన్ని రకాల ఛందస్సులలో వున్న పద్యాలను, ఆకర్షణీయంగానూ, ఆనందదాయకంగానూ వుండే వాటి ఒకటి రెండు  రకాల ముచ్చటైన నడకలని, ఆ నడకలలో వివిధ కవుల పద్యాలను, నా దృష్టికి వచ్చిన వాటిని, ఇక్కడ మరోసారి మననం చేసుకుంటూ చూపెడుతున్నాను.

“లేమా, దనుజుల గెలువగ
లేమా నీవేల కడగి లేచితి విటురా
లే! మాను, మానవేనిన్
లే, మా విల్లందికొనుము లీలంగేలన్.”

పోతనగారి భాగవతంలోనిది ఈ కంద పద్యం. ఈ పద్యానికి ఒక వీనులవిందైన నడక వుంది. ఈ నడక పోతనగారితో ఆగిపోలేదు. ఇంకా ముందుకు వెళ్ళింది. ఆడిదం సూరకవి ( క్రీ.శ.18 వ శతాబ్దం) తరం దాకా వెళ్ళింది. రేకపల్లి సోమనాథకవి అని  ఆడిదం సూరకవికి బలవత్ ప్రత్యర్ధియైన ఒక కవి ఉండేవాడట! ఆయన మీద ఒక భట్రాజు చెప్పన ఈ క్రింది కంద పద్యంలో మళ్ళి ప్రత్యక్షమైంది:

“అప్పా! రేకపలీ సో
మప్పా! విభుదాళి పాళి అమృతపు లప్పా!
ఒప్పులు నీ కవితలు వె
న్నప్పాలకు సాటి వచ్చునౌ భళి రుచులన్!”

ఈ పద్యం చెప్పి, సోమనాథకవికి రాజుగారు బహుమానంగా ఇచ్చిన దుశ్శాలువను ఆయనదగ్గరనుంచి కొట్టేశాడట ఆ భట్రాజు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో సంగతి ఏమిటంటే, కంద పద్యంలో సాధింపబడిన ఈ  నడక, క్రీ.శ.18వ శతాబ్దం వాడే అయిన కూచిమంచి జగ్గకవి భక్తమందార శతకంలో ‘మత్తేభ’ ఛందంలో వున్న రెండు పద్యాలలో సాధింపబడి కనిపిస్తుంది. ఆ పద్యాలు ఇవి:

“అదిరా! పిల్చినబల్కవేటికి? పరాకా చాలు నిం కేలగా
గదరా! మిక్కిలివేడి వేసిరిలు బాగా? నీకు శ్రీజానకీ
మదిరాక్షీ శరణంబులాన! నను ప్రేమన్ బ్రోవరా….”

“గడియల్ రెండిక సైచిరా, వెనుకరా, కాసింత సేపుండిరా,
విడిదింటం గడె సేద దీర్చుకొనిరా, వేగంబె బోసేసి రా,
యెడపొద్దప్పుడు రమ్మటంచు….”

భాగవతంలోని ద్వితీయాశ్వాసంలో పోతనగారిదే మరొక కంద పద్యం:

“రామున్ మేచక జలద
శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సు
త్రామున్ దుష్టనిశాట వి
రామున్ పొమ్మనియె పంక్తిరథుడడవికిన్.”

కందపద్యానికి ఇది వీనులవిందైన, హాయిగొలిపే నడక. అయితే ఈ అనుప్రాసమే కొంచెం ఎక్కువైతే పద్యం ఎలా వుంటుందో తెలియడానికి పోతనగారిదే ఒక కందపద్యం:

“అడిగెదనని కడువడిజను
నడిగిన దనుమగుడ నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్.”

ఇందులో మోతాదు కొంచెం ఎక్కువైందని నేననుకుంటాను.  అయితే, ఈ మోతాదులో అనుప్రాసము నచ్చే వాళ్ళూ వుండవచ్చు. కాదనలేం! ఈ రకపు నడకను, అనుప్రాసాన్ని కొంచెం మితంగా అంటే తగినంతగా వుంచి, చెప్పిన పద్యం ఎలా వుంటుందో ఈ క్రింది పద్యంలో తెలుస్తుంది:

“కడుపునకు కూడుగానక
పడి మిడిమిడి మిడుకునట్టి బడుగునకీయా
రడి అమరత్వం బేటికి
కడుపిటగాలంగ కంటకాటుక యేలా?”

కొఱవి గోపరాజు రచించిన సింహాసనాద్వాత్రింశిక లోనిదనుకుంటాను ఈ పద్యం, నాకు సరిగా గుర్తులేదు.

దొరకకుండా పోయిన తిక్కనసోమయాజిగారి ‘కృష్ణశతకము’ లోనిదిగా ఈ క్రింది పద్యం, మత్తేభ విక్రీడిత వృత్తం లోనిది, ప్రచారంలో వుంది:

“అరయన్ శంతనుపుత్రుపై విదురుపై నక్రూరుపై కుబ్జపై
నరుపై ద్రౌపదిపై కుచేలునిపయి న్నందవ్రజస్త్రీలపై
పరగం గల్గు భవత్కృపారసము నాపైగొంతరానిమ్ము నీ
చరణాబ్జంబులు నమ్మినాడ జగదీశా! కృష్ణ! భక్తప్రియా!”

తెలుగులోని సరళాతిసరళమైన పద్యాలలో ఇది ఒకటి. ఈ పద్యం చదివినతరువాత ఎవరికైనా పోతనగారి భాగవతంలోని పద్యం గుర్తుకురాకుండా ఉంటుందా? ఆ పద్యం:

“ఇంతింతై వటుడింతింతై మఱియు దానింతై నభొవీధిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్థియై!”

పోతనగారి ఈ పద్యం శార్దూలవిక్రీడిత ఛందంలోనిది.

తెలుగు మాట, పాట, పద్యం (2)

తెలుగు మాట, పాట, పద్యం - image (1)

“ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తర తారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధ బంధురో
దారసమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబులై.”

తెలుగు పద్యం ఒక పధ్ధతిగా నన్నయతోనే మొదలైంది. నన్నయచే ఆంధ్రీకరించబడిన మహాభారత భాగంలో,  అరణ్యపర్వం, చతుర్ధాశ్వాసం 142వ పద్యం ఇది. నన్నయ చివరి పద్యం.

“వర్షాకాలం గడిచి, చలి కాలం అప్పుడప్పుడే మొదలౌతున్న రోజుల నాటి రాత్రులు.  చంద్రుడు కర్పూర పరాగం లాంటి వెన్నెలను కురిపిస్తున్నాడు. ఇలాంటి చంద్రుణ్ణి చూసి అప్పుడే వికసించినటువంటి తెల్లకలువల నుంచి వెలువడుతూన్న గంధాన్ని తనలో కలుపుకుని గాలి మత్తుగా వీస్తొంది.  అలా కాస్తూన్న వెన్నెలనూ ఇలా వీస్తూన్న గాలినీ వహించి చుక్కలు మైమరచి మెరుస్తూంటే ఆ మెరుపులో రాత్రులు ఇంకా మెరిసిపోతున్నాయి” అన్నది ఈ పద్యపు భావం.

పై ఫొటోకి తెలుగులో పద్యాన్ని ఊహించుకుంటున్నప్పుడు, నా మనస్సులో మెదలిన పద్యం నన్నయగారి ఈ పద్యం. పై ఫొటోలో వెన్నెల ఎంతగా కనిపిస్తుందో నేను చెప్పలేనుగాని, నన్నయగారి ఈ పద్యం నిండా వెన్నెల పరుచుకుని కనిపిస్తుంది.

ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వర్ణించడానికి అంతే అహ్లాదకరమైన చింతనలో మనసుండాలి, చిత్తంతో మనిషుండాలి. ఈ పద్యం లిఖించేటప్పుడు నన్నయగారు కూడా అంతే ఆహ్లాదకరమైన చిత్తంతో వుండి వుంటాడని నేననుకుంటాను. అప్పటికిక స్వస్తి చెప్పుకుని, మిగతాది మరుసటి దినానికి వాయిదా వేసుకుని, మామూలుగానే నిద్రకుపక్రమించి వుంటాడనీ నేననుకుంటాను. అయితే, తెల్లవారేసరికి పరిస్థితులు మారిపోయాయి. అలా మారిన ఆ పరిస్థితులు ఎలాంటివో,  ఆ మారిన పరిస్థితులు నన్నయ భారత ఆంధ్రీకరణం అర్ధంతరంగా ఆగిపోవడానికి ఎందుకు దారితీశాయో ఇదమిధ్ధంగా తేల్చి చెప్పుకోవడానికి సరిపడా ఆధారాలేవీ చరిత్రలో మిగలలేదు. అది  ఇప్పటికీ  ఒక mystery గానే మిగిలిపోయింది.

ఏదేమైనా, నన్నయ చివరి పద్యం ఒక బధామయ సన్నివేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని నాకనిపిస్తుంది. ఆ బాధకు ఒక కారణం ఆ పద్యంలో నిండుగా వున్న ఆహ్లాదకరమైన సన్నివేశమే అని కూడా నేననుకుంటాను! తాను వెన్నెలలాగా నిండుగా మెరుపులు కురిపిస్తూ, తన వెనుక ఎంతకూ వీడని ఒక చిక్కుముడిలాంటి చీకటినీ, రహస్యాన్నీ బంధించి దాచి ఉంచడం లాంటిది ఆ సన్నివేశం!!

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (4)

నన్నెచోడదేవుని ‘కుమార సంభవం’ (4)

“వీంగు నపారసత్త్వ గుణవిస్ఫురణం బరమేశ్వరోరువా
మాంగమునందు మున్నుదయమై నియమస్థితి గొల్చి తద్దయున్
లోంగొని పేర్మితో నఖిలలోకములుం దగగాచుచున్నవే
దాంగు ననంతు విష్ణు గమలాధిపు సంస్తుతి దేల్తు సమ్మతిన్.”

ఉత్పలమాల వృత్తంలోని పద్యం – కుమార సంభవం, ప్రథమాశ్వాసం, నాల్గవ పద్యం ఇది.

ఈ పద్యాన్ని స్మరించుకోవడానికి ముఖ్యమైన కారణం, ఈ పద్యం ప్రథమ పాదంలోనూ, మూడవ పాదంలోనూ వాడిన ‘వీంగు’ ‘లోంగొని’ అనే పదాలూ, వీటితో ‘వామాంగము ‘ ‘వేదాంగు ‘ అనే పదాలలోని పూర్ణబిందుపూర్వకాక్షరం ‘గ’ కు చెల్లించిన ప్రాసమైత్రి.

ఈ ‘వీంగు’ ‘లోంగొను’ అనే పదాలు ఖండబిందు యుక్తంగా ‘వీఁగు’ ‘లోఁగొను’ అనే వాటికి పూర్వరూపాలు.  ఇప్పుడు ఇవి ఖండబిందువును కూడా విడిచిపెట్టి బిందురహితంగా ‘వీగు’ ‘లోగొను’ అనే రూపాలలో మిగిలి ఉన్నాయి.

ఈ ప్రయోగాలనే నన్నెచొడుని ప్రాచీనతకు నిదర్శనాలుగా పూజ్యులు మానవల్లి వారు చూపి, నన్నయ కవిత్వంలో గానీ, ఆ తరువాతి కవుల ప్రయోగాలలో గానీ ఇలాంటి ప్రయోగాలు లేని కారణంగా నన్నెచొడుని నన్నయకంటే పూర్వునిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. “నన్నెచోడుడు నన్నయకంటె పూర్వుడని కుమార సంభవము నందలి వ్యాకరణ ఛ్ఛందో విశేషాత్మకాపూర్వపద ప్రయోగములు సహస్ర ముఖముల ఘోషించుచున్నవి” అంటూ పూజ్యులు మానవల్లి వారు చూపిన ఉదాహరణలలో రెండు పద్యాలు ఈ క్రిందివి:

“పోండిగ నగజ తపశ్శిఖి
మూండు జగంబులను దీవ్రముగఁ బర్విన బ్ర
హ్మాండము గాఁచిన కాంచన
భాండముక్రియఁ దాల్చెఁ దత్ప్రభాభాసితమై.” (షష్టాశ్వాసం, 157వ పద్యం)

“వీండేమి సేయుఁ బంచిన
వాం డుండఁగ నిక్కమునకు వధ్యుఁడుగా నా
ఖండలుఁడు గాక యేసిన
వాండుండఁగ నేమిసేయు వరశర మనిలోన్.” (దశమాశ్వాసం, 155వ పద్యం).

పూర్ణార్ధ బిందుప్రాసము — అంటే దీర్ఘముమీది అరసున్నను నిండుసున్నగా చేసి సిధ్ధపూర్ణానుస్వార పూర్వాక్షరముతో ప్రాసను చెల్లించడం అన్నది పై పద్యాలలోని ఛ్ఛందోవిశేషం. నన్నయకానీ, ఆ తరువాతి కవులుగానీ ఈరకపు ప్రాసను ఎక్కడా వాడి యుండలేదనీ, ఇట్టి ప్రాసమైత్రి నన్నయకు పూర్వం వుండియుండును కాబట్టి నన్నెచోడుడు నన్నయకు పూర్వుడు కావలయుననీ, ‘ఇది పూర్ణార్ధబిందుప్రాసముకాదు, కవి ఈ శబ్దములను పూర్ణబిందుయుతములుగనే వాడాడు’ అనుకున్నా, పూర్వమొకప్పుడు పూర్ణమై యుండిన బిందువు తరువాత్తరువాత ఖండబిందువయినట్లు భాషాచరిత్రనుబట్టి తెలుస్తుంది కాబట్టి, అప్పుడుకూడా నన్నయకంటె నన్నెచోడుడు పూర్వుడే అవుతాడు అన్నది మానవల్లివారి వాదన.

ఇక అసలు పద్యం యొక్క అర్ధం విషయానికొస్తే:

‘వీంగు (వీఁగు) – అపార సత్త్వగుణ – విస్ఫురణన్ – పరమేశ్వరు (ని) – ఉరు వామాంగము నందు’ — విజృంభించు అపారమైన  సత్త్వగుణముయొక్క స్ఫూర్తితో పరమేశ్వరుని (శరీరంలో) యెడమభాగమందు,

‘మున్ను – ఉదయమై – నియమస్థితి – కొల్చి’ — పూర్వం ఉద్భవించి నిష్ఠతో  అతనిని సేవించి,

‘తద్దయున్ – లోంగొని (లోఁగొని) – పేర్మితో – అఖిల లోకములుం – తగ కాచుచున్న’ — (అతని అనుగ్రహముతో) ఎల్లలోకములను ప్రేమతో వశపరచుకొని సముచితముగా కాచుచున్న,

‘వేదాంగున్ – అనంతున్ – విష్ణున్ – కమలాధిపున్’ — వేదమునే శరీరముగా గలవాడూ, అంతములేనివాడూ, కమలాధిపుడూ అయిన విష్ణువును,

‘సంస్తుతిన్ – తేల్తు – సమ్మతిన్’ — మంచి స్తోత్రముతో, సమ్మతితో, సంతోషపెట్టెదను.

ఈ పద్యంలో పైకి కనబడేది విష్ణు స్తుతి. అంతరంగా, విష్ణువు ఉద్భవానికీ, ఆయన సముచితంగా అఖిల జగత్తునూ కాచుకోవడానికీ కారణమైనది శివతత్త్వమే అన్నది లీలామాత్ర ధ్వని.

 

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (3)

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (3)

“హరి వికచామలాంబుజసహస్రము పూంచి మృగాంకునం దవి
స్ఫురిత మలాసితాబ్జమని పుచ్చగ జాచిన చేయి జూచి చం
దురు డది రాహు సావి వెఱ దుప్పలదూలగ జాఱుచున్న న
య్యిరువుర జూచి నవ్వు పరమేశ్వరు డీవుత మా కభీష్టముల్.”

చంపకమాల వృత్తంలో ఉన్న పద్యం ఇది, కుమార సంభవం, ప్రథమాశ్వాసం మూడవ పద్యం.

ఇందులో ఒక చిత్రమైన సన్నివేశం ఊహించబడి, పద్యంగా వర్ణించబడింది.

ఎక్కడా మచ్చంటూ లేనటువంటి వెయ్యి తామరలతో విష్ణువు శివుని శిరస్సును పూజిస్తూంటాడు. విష్ణువుచే అలా పూజలో సమర్పించబడిన తామరపుష్పాలలో, మచ్చకలిగిన (అంటే స్వఛ్ఛమైనది కాని) ఒక తామరపూవుగా భ్రమింపజేస్తూ అకస్మాత్తుగా శివుని జటాజూటంలోని చంద్రునివదనం, మృగాంక సహితంగా, కనుపించి విష్ణువును కలవరపాటుకు గురిచేయగా, కలత చెందిన మనస్సుతో విష్ణువు ఆ మలినపుష్పాన్ని తీసివేసే ఉద్దేశ్యంతో చేయిచాస్తాడు. అలా విష్ణువుచే చాచబడిన (నీల వర్ణం కలిగిన) చేతిని తనను మింగడానికి సమీపిస్తున్న రాహువుగా భ్రమసి, చంద్రుడు శివజటాజూటాన్ని వీడి పారిపోయే ప్రయత్నంలో ఉండగా,
భ్రాంతికిలోనయిన ఆ ఇరువురి చేష్టలను చూసి పరమేశ్వరుడు నవ్వుకుంటుంటాడు – ఇదీ ఆ సన్నివేశం.

‘హరి – వికచ – అమల – అంబుజ – సహస్రము – పూనిచి’ –వికసించినటువంటి నిర్మలమైనట్టి వేయి తామరలను సమర్పించి, హరి (శివునికి పూజ చేసేటప్పుడు)….

‘మృగాంకున్ – అందున్ – అవిస్ఫురిత – మల – అసిత – అబ్జమని’ –వాటిలో చంద్రుని మాలిన్యముచే నల్లనైన వికసించని తామరపూవుగా అనుకుని…

‘పుచ్చగ – జాచిన – చేయి చూచి’ –తొలగించుటకు చాచిన చేతిని చూసి…

‘చందురుడు – అది – రాహు సావి – వెఱన్ – తుప్పలతూలగ – జాఱుచున్నన్’ –చంద్రుడు దానిని (తనను కబళించడానికి వస్తున్న) రాహువని తలచి, ఆ భయంతో మిక్కిలిగా చలించి పారిపోయే చర్యలో ఉండగా…

‘అయ్యిరువుర – జూచి – నవ్వు – పరమేశ్వరుడు – ఈవుత – మాకు – అభీష్టముల్’ (భ్రమలో వింత వింత చర్యలకు పాల్పడియున్న) ఆ ఇరువురినీ చూచి నవ్వు పరమేశ్వరుడు మా కోరికలను తీర్చు గాక!

ఇందులో ‘అయ్యిరువురన్’ అనే మాట, నా జ్ఞాపకాలను ఒక్కసారిగా మా హైస్కూలు 10వ తరగతి గదిలోకి తీసుకువెళ్ళి మా తెలుగు మాష్టారిముందు బాసింపట్లు వేయించి కూర్చోబెడతాయి.

‘అయ్యిరువురన్’ అనేది యడాగమానికీ, ఆపై  త్రికసంధికి మంచి ఉదాహరణ. బాలవ్యాకరణం, సంధి/సమాస పరిఛ్ఛేదాలలోని మూడు సూత్రాలు ‘ఆ’ ‘ఇరువురన్’ అనే రెండు మాటలను ఒకటిగా సంధిస్తాయి. దీనిని వివరిస్తూ మా తెలుగు మాష్టారు ‘ఆ, ఈ, ఏ లు త్రికములు’ అనే సూత్రంతో మొదలు పెట్టేవారు. అప్పుడు ఈ పదాలు ‘ఆ + ఇరువురన్’ అని వాటి సాధారణ రూపంలో వుంటాయి. ఆ తరువాత వరుసగా -

‘సంధి లేని చోట స్వరంబుకంటె పరంబయిన స్వరంబునకు యడాగమంబగు’ (బాల వ్యా.సంధి.3)

ఆ + యిరువురన్

‘త్రికంబుమీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు’ (బాల వ్యా.సమాస.14)

ఆ + య్యిరువురన్

‘ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు ఆఛ్ఛికంబగు దీర్ఘంబు హ్రస్వంబగు’ (బాల వ్యా.సమాస.13)

అ + య్యిరువురన్ = అయ్యిరువురన్ గా  మారి మిగులుతుంది చివరికి.

ఎన్నిసార్లు ఈ త్రికసంధి సూత్రాలను practice చేయించారో చెప్పలేను…ఆ రోజులలో నిద్రలో లేపి అడిగినా అక్షరం పొల్లుపోకుండా చెప్పగలిగి ఉండేవాళ్ళం.

తెలుగు భాషపై ఏమాత్రం పట్టు సాధించాలన్నా బాలవ్యాకరణం జోలికిపోకుండా సాధ్యమవుతుందంటే నాకు సందేహమే!

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (2)

నన్నెచోడదేవుని ‘కుమార సంభవం’ (2)

“శ్రీవాణీంద్రామరేంద్రార్పిత మకుట మణిశ్రేణిధామాంఘ్రి పద్మా
జీవోద్యత్కేసరుం డాశ్రితజనలషితాశేషవస్తుప్రదుం డా
దేవాధీశుండు నిత్యోదితు డజుడు మహాదేవు డాద్యుండు విశ్వై
కావాసుం డెప్పుడున్ మా కభిమతములు ప్రీతాత్ముడై యిచ్చుగాతన్.”

నన్నెచోడుని ‘కుమార సంభవం’ లోని మొదటి పద్యం ఇది. స్రగ్ధర వృత్తంలో ఉన్న పద్యం.

ఆరంభం ఒక అవస్థ అని మనకు నానుడి. పద్యానికైన, గేయానికైనా,  కావ్యానికైనా, కథకైనా, నవలకైన — దేని రచనకైనా సరే, ఆరంభం అనేది ఒక అవస్థ అని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు.  ఈ అవస్థను ఒకింత దాటెయ్యడానికన్నట్లుగా , కావ్య రచన నేరుగా కథతో మొదలు కానక్కర లేకుండా ప్రార్ధనాత్మకమైన శ్లోకంతోనో, పద్యంతోనో మొదలయ్యేలా పూర్వకవులు చేశారని నేను అనుకుంటాను.

నన్నయగారి భారతం కూడా ‘శ్రీవాణీ’ అన్న మూడు అక్షరాలతోనే మొదలవుతుంది.  అయితే, నన్నె చోడుని ‘కుమార సంభవం’ తొలి పద్యంలో ‘శ్రీవాణీం’ అని  మగణంగా ఉన్న ఈ మూడు అక్షరాల తరువాత వచ్చిన ‘ద్రామరేం’ అనే మూడు అక్షరాలు ‘ర’ గణము అయి ఉండడం వలన, ఒక కావ్యాన్ని ఏకవి అయితే మగణం వెంట రగణంతో మొదలు పెట్టి చెబుతాడో ఆకవి తప్పక అకాల మరణం పాలవుతాడన్న దానికి దృష్టాంతంగా నన్నెచోడుడు యుధ్ధంలో అకాలమరణం చెందాడని ఒక మాట ప్రచారంలో ఉంది. ఈ దృష్టాంతాన్ని తెలిపే అధర్వణఛ్ఛందం లోని కంద పద్యం:

“మగణమ్ము గదియ రగణము
వగవక కృతి మొదల నిలిపువానికి మరణం
బగు నిక్కమండ్రు, మడియడె
యగునని యిది తొల్లి టెంకణాదిత్యుండనిన్.”

పై పద్యంలోని ‘టెంకణాదిత్యుడు’ అనే పదం నన్నెచోడుని సూచిస్తుండి. ‘కుమార సంభవం’ అవతారికలోని పద్యాలను బట్టి నన్నెచొడుడు సూర్యవంశ క్షత్రియుడు, కాశ్యప గోత్రుడు. వివేకబ్రహ్మ అని పేరుపొందినవాడు.  పాకనాటి యందు ఇరువదిఒక్క వేయిటికి అధీశుడగు చోడబల్లికీ, హైహయరాజవంశజ అయిన శ్రీసతికీ కుమారుడు. కలుపొన్న, కలుకోడి చిహ్నాలుగా గలిగినట్టి ‘ఒరయూరు’ కు అధిపతి అయినట్టివాడు. టెంకణాదిత్యునిగా కూడా వ్యవహృతుడు. నన్నెచోడుని అకాలమరణాన్ని తెలిపే ఈ ఐతిహ్యం ఎంతవరకు నమ్మశక్యమైనదో చప్పలేము. అయితే, అకారణంగా పద్యం ఎలా పుడుతుంది? అన్న ప్రశ్నకూ సరయిన సమాధానం దొరకదు. కాబట్టి, ఇలాంటివి సమాధానం దొరికీ దొరకకుండానూ, reason కి అందీ
అందకుండానూ అలా మిగిలి ఉంటేనే బాగుంటుందనుకుంటాను. ఈ సంగతులను ఇక్కడితో వదిలి, పద్యం యొక్క భావం వైపుకు దృష్టి సారిస్తే -

‘శ్రీ – వాణీ – ఇంద్ర – అమరేంద్ర – అర్పిత – మకుట – మణిశ్రేణి – ధామ – అంఘ్రిపద్మ – ఆజీవ – ఉద్యత్కేసరుండు ‘ అంటే ‘విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు తమ శిరస్సులను మోపగా వారివారి కిరీటములలో పొదగబడివున్న మణుల కాంతులు తనయొక్క పాదపద్మములకు ఆకరువులుగా గలిగినవాడునూ…

‘ఆశ్రితజన – లషిత – అశేష – వస్తుప్రదుండు’ అనగా ‘ఆశ్రయించిన జనుల సమస్త కోరికలను తీర్చువాడునూ…

‘ఆ దేవాధీశుండు – నిత్యోదితుడు – అజుడు – మహాదేవుడు – ఆద్యుండు – విశ్వైకావసుండు’ – ఇవన్నీ ఈశ్వరునికి విశేషణాలుగా చెప్పబడిన మాటలు; అయిన ఆ మహాదేవుడు…

‘ఎప్పుడున్ -  మాకు – అభిమతములు – ప్రీతాత్ముడై – యిచ్చుగాతన్’ అనగా ‘సంతోషము చెందిన మనసు కలవాడై మా కోరిన కోరికలెల్ల సకలవేళలందునూ తీర్చును గాక!

నన్నెచోడుడు ఈ కావ్యాన్ని తన గురువు, మహాతపస్సంపన్నుడు, శ్రీశైల నివాసి అయిన జంగమ మల్లికార్జున శివయోగికి అంకితమిస్తూ చెప్పినట్లుగా (‘అంకిత’ మన్న మాట ఈ కావ్యంలో ఎక్కడా వాడక పోయినా, ఆ అర్ధం ధ్వనించే విధంగా) చెప్పాడు.

ఈ కావ్యానికి కారకులయిన మువ్వురిలో ఇద్దరు – అనగా క్రుతికర్తయైన నన్నెచోడుడు, క్రుతిభర్తగా అనుకుంటే జంగమ మల్లికార్జున శివయోగి – శైవులు. మూడవ వ్యక్తి, తానుగా కావ్యనాయకుడైన శివుడు!  అందుచేత, కావ్యారంభంలోని ఈ పద్యంలో వాడబడిన విశేషణాలన్నిటిలో అంతా శివమయంగానూ, శివాధిపత్యం ధ్వనించే విధంగానూ చేసి చూపెట్టడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు కదా!

 

తెలుగు నాటకాలు – మరి కొన్ని సంగతులు (2)

లక్ష్మీకాంతంగారి ‘హరిశ్చంద్ర’ లోని ‘తిరమై సంపదలెల్ల’ పద్యాన్ని తలచుకున్నప్పుడల్లా, నాకు ఏ నాటకంలోనిదీ, కావ్యంలోనిదీ కానిదైన ఈ క్రింది పద్యం స్ఫురణకు వస్తుంది:

“చూడంజూడ మహా శ్మశాన మనిపించున్ నాకు నీ లోక, మిం
దేడన్ గాలిడబోవ నేరిపయినో యే వేయుచున్నట్టులే
లో డక్కయ్యెడిగాని నీ మహిమ యాలోనే నివారించి, నీ
క్రీడారంగమటన్న మాట స్మృతికిం గీలించు మృత్యుంజయా!”

మహాద్భుతమైన ధారతో, చదవగానే ఒంటిని ఒకవిధమైన జలదరింపుకు గురిచేసే పద్యం ఇది. మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి గారిది, వారు ఆశువుగా చెప్పింది, కాదు పాడింది, తమ ‘కవన కుతూహలం’ లో అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు గ్రంథస్తం చేయడం వలన తెలుగు సాహితీలోకానికి తెలిసింది. అలా కాకపోయున్నట్లయితే,  ఈ పద్యం తెలియకుండానే జీవితం గడిచి పోయివుండేది గదా! అనుకుంటే మళ్ళీ ఒకసారి ఒళ్ళు జలదరిస్తుంది.

వరదరాజేశ్వరరావుగారు వివరించిన సందర్భం ఇది:

ఒక సాయంత్రం వారూ, సుందరరామ శాస్త్రిగారూ తెనాలిలో (సుందరరామ శాస్త్రిగారు తెనాలి వాస్తవ్యులు) కాలవ పక్కనుంచి నడిచి వెళ్తున్నారట. సుందరరామ శాస్త్రిగారు కాళ్ళకి చెప్పులు గూడా ధరించకుండా నడుస్తున్నారు. నడుస్తూండగా దారిలో ఆయన అడుగు (పాదం)  కాలవ వొడ్డున ఉన్న రెండు, మూడు బొమికల మీద పడబోగా, చూసి, వరదరాజెశ్వరరావుగారు శాస్త్రిగారి చెయ్యిపట్టుకుని ఆపి, వాటిని చూపించి, క్రింద చూస్తూ నడవమని చెప్పబోయేంతలో, శాస్త్రిగారు వరదరాజెశ్వరరావుగారి భుజం మీద చెయ్యివేసి, చూపులను ఆకాశం వంకకు మరల్చి, ఒక్కసారిగా అందుకుని ఉఛ్ఛస్వరంలో ఆలాపించిన పద్యం అట ఇది. శాస్త్రిగారి ఆలాపనలో ఈ పద్యం వింటుంటే ‘కాళ్ళు వణికినై, భయం వేసింది’ అని వ్రాసారు వరదరాజేశ్వరరావుగారు. ఇదీ ఈ పద్యం కథ!

తెలుగులో నిండైన అర్ధం గలిగిన, మంచి ధార గలిగిన పద్యాన్ని వ్రాయడం (చెప్పడం) ఒక కళ అయితే, వ్రాసిఉన్న పద్యాన్ని భావయుక్తంగానూ, సుబోధకంగానూ చదవడం, అంతకు మించి పాడడం ఇంకో కళ. తెలుగు కావ్యాలలోని పద్యాలను మించి రంగస్థల పద్యాలు (సత్యహరిశ్చంద్రలోనివీ, పాండవోద్యోగవిజయాల లోనివీ, గయోపాఖ్యానం లోనివి, ఇంకా ఇలాంటివే చాలా నాటకాలలోనివి) అక్షరం ముక్క రాని వాళ్ళ నోళ్ళల్లోకి కూడా అతిసుళువుగా వెళ్ళిపోవడానికి కారణం వాటిని హృద్యంగా పాడడమెలాగో పండితుల, గురువుల సహాయంతో తెలుసుకుని, సాధనచేసి ఆతరువాత రంగస్థలంపై పాడి వినిపించిన కళాకారులే అనడం ఎంతమాత్రం అతిశయోక్తి అవదు.

పద్యం చదవడంలో చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారినీ, వేలూరి శివరామశాస్త్రి గారినీ, ఆఖరికి విశ్వనాథ సత్యనారాయణ గారిని మించిన ప్రజ్ఞ కలవారు సుందరరామశాస్త్రిగారు అని సమకాలికులు చెప్పగా వినినట్లు వ్రాశారు వరదరాజేశ్వరరావు గారు, కవనకుతూహలంలో. కవిత్వం కడుపునింపుతుందని నమ్మి భంగపడినవాళ్ళలో సుందరరామశాస్త్రిగారొకరు.

సుందరరామశాస్త్రిగారి మీద చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి పద్యం, అంతే అద్భుతమైనది, వరదరాజెశ్వరరావుగారు చెప్పడంవలన తెలిసినదే, ఈ క్రింద ఉదాహరించినది:

“అగు నితడు స్వయం వ్యక్తుడు
భగవంతుడు గురువు, వీని పాండితికేనో
నగుబాటుం గురువును వీ
ని గుణాఢ్యత్వమ్ము మాన నీయమ్మెందున్.”

పై పద్యంలో ‘స్వయం వ్యక్తుడు’ అన్న మాట – ఆ ఒక్క మాట చాలు సుందరరామశాస్త్రిగారి ప్రతిభామూర్తి కళ్ళ ముందు కట్టడానికి. ఈ ‘స్వయం వ్యక్తుడు’ అన్న మాట సుందరరామశాస్త్రిగారిని గురించిన సందర్భంలో తప్ప తెలుగు సాహిత్యంలో మరెక్కడా ఎవరిచేతా ప్రయోగింపబడగా నేను చదవలేదు.

చిరస్మరణీయులు: మహనీయులు మానవల్లి రామకృష్ణకవిగారు (2)

తాళపత్రాలపై ఉన్న ఒక కావ్యాన్ని కాగితపు పుస్తకాలలోకి ఎక్కించడానికి రెండు విషయాలలో  ప్రతిభ అవసరం. మొదటగా తాళ పత్రం పై ఉన్న కొన్ని వందల సంవత్సరాల క్రితపు వ్రాతను చదవడానికి సంభందించిన ప్రజ్ఞ అవసరం. రెండవది, లేఖన దోషాలను గుర్తించగలగడమే కాకుండా, అవసరమయినచోటల వ్రాయసగాండ్ల లేఖన దోషాలను గుర్తించి పాఠాన్ని సరిదిద్దగల భాషా పరిజ్ఞానం చాలా అవసరం. ఈ రెంటిలోనూ పరిజ్ఞానం పుష్కలంగా ఉండిన మహనీయులు మానవల్లి కవిగారు.

నన్నె చోడుని ‘కుమార సంభవం’ కావ్యం ప్రథమ భాగం ప్రచురింపబడి తెలుగు సాహితీలోకంలో ఒక సంచలనం రేపింది.  దీనికి కారణం ‘కుమార సంభవం’ కావ్యానికి సమకూర్చిన పీఠికలో కవిగారు నన్నె చోడదేవుని క్రీ.శ.950 ప్రాంతం వానిగా చెప్పడం. ఈ కాల నిర్ణయం నన్నె చోడుని నన్నయ కంటే ముందువానిగా చేయడమే కాకుండా, ‘కుమార సంభవా’న్ని తెలుగులో తొలి కావ్యాన్ని చేసి, నన్నయ ఆంధ్ర మహాభారతాన్ని వెనుకకు నెట్టింది. నన్నయను ఆదికవిగా ఆరాధుస్తూ వస్తూన్న తెలుగు పండితలోకం, కవిగారి ఈ కాల నిర్ణయాన్ని హర్షించలేకపోవడమే కాకుండా, విపరీతమైన స్థాయిలో విమర్శనాస్త్రాలను ప్రయోగించింది. చివరికి ఒక దశలో ఈ విమర్శ ఏ స్థాయిదాకా వెళ్ళిందంటే, కవిగారే పాత కావ్యాల తరహాలో రచనచేసి పేరుకోసం అలా చేశారనేంత దాకానూ వెళ్ళిందని చెబుతారు. అయితే, అసంకల్పితంగా దీనివలన అవగతమైన విషయం ఒకటుంది. అది -  పూర్వ ప్రసిధ్ధ కవుల పంధాలో కావ్యరచన చేయగలిగినంతటి సమర్థత ఆ రోజులలో కవిగారికి ఉండేదనిన్నీ, పూనుకోవాలేగాని, వారు అంతటి సమర్థులనిన్నీ! వారి పాండిత్యం మీద ఎవ్వరికీ ఏవిధమైన సందేహాలూ లేవు. హిందూదేశంలోని అతిగొప్ప సంస్కృత పండితులు ఆరుగురిలోనూ ఒకరిగా ఆయన పేరుపొందినవారు. అప్పటిలో బరోడా ప్రభుత్వంవారు ఆయనచేత భరతముని సంస్కృతంలో రచించిన నాట్యశాస్త్రానికి వ్యాఖ్య రాయించి ప్రకటించేరనీ చెబుతారు.

కవిగారు తెలుగులో తమ ‘విస్మృతకవులు’ లో భాగంగా ప్రకటించిన రెండవ గ్రంథం వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామం’. ఇది వల్లయభరాయనిచే రచించబడలేదనీ, శ్రీనాథుడే దీనిని రచించి ఏకారణం చేతనో వల్లభరాయని పేరు పెట్టాడనీ, నిజానికి ఈ కావ్యం శ్రీనాథకృతంగా పిలవబడాలనీ చెప్పి నమ్మించడానికి తరువాతి కాలంలో పూజ్యులు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఎంతగానో ప్రయత్నించారుగాని, ఈనాటికీ ఇది వినుకొండవల్లభరాయ కృతంగానే ప్రసిధ్ధం. అలాగే, చిమ్మపూడి అమరేశ్వరుడని ఒక ప్రసిధ్ధ పూర్వ కవీచే రచించబడిన ‘విక్రమసేనము’ అనే గ్రంథపు తాటాకు ప్రతిని కవిగారు సంపాదించి దానికి సాఫు ప్రతిని తయారుచేయడానికి ఒక పండితునికి ఈయగా, సదరు పండితుడు ఆ పుస్తకపు తాటాకు ప్రతితో అయిపు లేకుండాపోయాడనీ కూడా చెబుతారు. ఈ విషయాన్ని వారు పండితలోకానికి తెలియజేయగా, నమ్మినవాళ్ళు నమ్మారు, లేనివాళ్ళు లేదని కూడా చెబుతారు! ఇంచుమించు ఒక వ్యసనంగా కవిగారు చేసిన ఈ విస్మృతకవులను వెలుగులోకి తీసుకురావడం అనే ‘వ్యాపారం’ లో ఆయన  ఎంతో డబ్బు సంపాదించుకుంటున్నారన్న తప్పుడు అభిప్రాయం కలిగినవాళ్ళకు ఇందులోని సాధకబాధకాలు అర్థమవాలన్న ఉద్దేశ్యంతో నన్నట్లుగా ఒకానొక సందర్భంలో ఆయన చెప్పిన ‘విజ్ఞప్తి’  మాటలు – “క్రీ.శ.1914 సం.నకు అనగా నేను క్రీ.శ.1908లో ఈ గ్రంథ ప్రథమ భాగము ముద్రించిన నాటినుందడి “యాఱు” ప్రతులు మాత్రమే చెల్లినవి” (అంటే అమ్ముడుబోయాయి అని). ఈ మాటలు  తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాల ప్రచురణ రంగంలో ఆనాటి పరిస్థితి ఎలావుండేదో తెలియజెప్పడానికి కూడా బాగా ఉపయోగపడతాయి.  తెలుగు సంప్రదాయ సాహిత్యంపై ఈనాడు శ్రధ్ధ తగ్గిందనీ, ఆనాళ్ళలో తెలుగులో ఏదైనా కొత్తది  పద్య సాహిత్యం ప్రచురణ పొంది లభ్యమవడం మొదలైందే తడవుగా తండోపతండాలుగా పండితులు ఆ పుస్తకాలను కొని చదివేసేవారనీ అనుకొనేవాళ్ళకు, చెప్పేవాళ్ళకు కవిగారి ఈ మాటలు ఒక కనువిప్పు.

క్రీ.శ.1972 లో గౌరవనీయులు నిడదవోలు వేంకటరావు మరియు పోణంగి శ్రీరామ అప్పారావు గారల సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు “మానవల్లి కవి – రచనలు” అనే పుస్తకాన్ని ప్రచురించారు. కవిగారిని గురించిన చాలా సమాచారం ఇందులో దొరుకుతుంది. ఇది కాకుండా, సాహిత్య లోకంలో ప్రసిధ్ధులైన తలావఝ్ఝుల శివశంకర శాస్త్రి, పంచాఙ్నుల ఆదినారాయణ శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ లాంటి వారలు తెలుగు సాహిత్యం పై చేసిన రచనలలో కవిగారి గురించిన సంగతులు ప్రస్తావ వశాన వచ్చినవి ఎన్నో తెలుస్తాయి.

మాన్యులు టేకుమళ్ళ కామేశ్వరరావు గారు తమ “నా వాఙ్మయ మిత్రులు” లో కవిగారిని గురించిన వ్యాసంలోని ముగింపు వాక్యాలు – “పగడపు పురుగులు మహాసముద్రంలో చుట్టు గోడలను కట్టుకొంటాయి.  అవి మానవులకు దీవులవుతాయి. అట్లే మానవులలో మేధావులు తమ లాభంకోసం పొగడ్తల కోసంగాక నైసర్గికంగా పనిచేసుకొని పోతారు. దానివల్ల జాతికి మాత్రమే శాశ్వత ప్రయోజనం”. కవిగారి విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు.

ఆయన నిరాడంబ జీవనం, అకుంఠిత దీక్షతో తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన నిస్స్వార్ధ సేవ, ఆయన పాండిత్య ప్రతిభ – ఇవి ఆయనను నాకు ప్రాతఃస్మరణీయులలో మొదటివానినిగా చేశాయి.

చిరస్మరణీయులు: మహనీయులు మానవల్లి రామకృష్ణకవిగారు (1)

కాలగర్భంలో కలిసిపోయినటువంటి పురాతన వస్తువులను తవ్వి తీసే పురావస్తు పరిశోధక శాస్త్రం (Archeology) వంటిది సాహిత్యానికి సంబంధించి పురా గ్రంథ పరిశోధక శాస్త్రం  (Literary archeology) ఏదైనా ఉండడం సంభవిస్తే, అలాంటి శాస్త్రానికి తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ఆద్యులనదగిన తొలి తెలుగు వ్యక్తి మాన్యులు మానవల్లి రామక్రిష్ణ కవిగారు అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. ఏ వ్యక్తి అయినా అన్ని రకాల కష్టనష్టాలకూ వోర్చి  జీవితమంతా సాహిత్యంకోసమే జీవిస్తూ, పురాతన గ్రంథాలను వెలికితీసి వెలుగుచూపించడమే ధ్యేయంగా పెట్టుకుని, అది తప్ప వేరే ధ్యాసంటూ లేకుండా జీవించడం అంటూ
సాధ్యపడితే అది మహనీయులు మానవల్లి ద్వారానే సాధ్యపడిందంటే, అది యెంత మాత్రమూ అతిశయోక్తి కానేరదు. ఇవాల్టి రోజున అలాంటి జీవితాన్ని గడపడం ఊహించుకోనే లేం! అల్లా గడపాలని ఇఛ్ఛ ఉన్నా సాధ్యమయే సంగతీ కాదు!!

మానవల్లి వారు లేకుంటే తెలుగు సాహిత్యానికి నన్నెచోడుడు ఉండేవాడేమో గాని, ‘కుమార సంభవం’ ఉండేది కాదు. వారే లేకుంటే ‘క్రీడాభిరామం’ అంతకన్నా లేదు.

క్రీ.శ.1866లో ఇప్పటి చెన్నై, అప్పటి మదరాసు, లో జన్మించారు మానవల్లి వారు. పండిత వంశం కావడంతో, సంస్కృతంలో పాండిత్యం సహజంగానే వారికి బాల్యం నుండీ అలవడింది. ఇరవై ఏండ్లు వచ్చే సరికల్లా సంస్కృత బాషలోనే కాక, ఆంధ్రము, ఆంగ్లము, తమిళము,కన్నడము భాషలలో ప్రావీణ్యం సంపాయించారు కవిగారు. అసాధారణమైన ధారణ శక్తి ఆయనకు దైవమిచ్చిన వరంగా చెబుతారు. ఏ గ్రంథమైన ఒక్క సారి చదివితే చాలు, అందులోని అక్షరమక్షరమూ ఆయనకు పట్టుబడిపోవలసిందే!

సాహిత్యంపై సహజంగానే అబ్బిన మమకారం చేత ఆయనకు తాళపత్ర గ్రంథాల అన్వేషణ తొలినాళ్ళ నుంచే అలవడింది. తంజావూరు సరస్వతీమహల్ లో తెలుగువాళ్ళు అప్పటిదాకా కనివినీ యెరుగనటువంటి గ్రంథాలున్నాయని మొదటగా తెలియజేసింది కవిగారేనని చెబుతారు. అచ్చటినుండి వారు సంపాదించి ‘విస్మ్రుత కవులు’ శీర్షికన ప్రచురించిన కావ్యాలలో ఒకటి నన్నె చోడుని ‘కుమార సంభవం’ కావ్యం.

తంజావూరు గ్రంథాలయం గురించి చెప్పాలంటే, తాళపత్ర గ్రంథం కావాలంటేనూ, చూడాలంటేనూ తంజావూరు పోవలసిందే నని అప్పటిలో నానుడిగా ఉండేదని పెద్దలు చెబుతారు. తంజావూరులో సరస్వతీమహలు గ్రంథాలయంలోని గ్రంథాలన్ని తంజావూరునేలిన మహారాష్ట్ర రాజులు సేకరించినట్టివే! ఆ గ్రంథాలయం ఆ ప్రభువుల కోటలో ఉండేది గాబట్టి, అందులోనికి సామాన్యులకు ప్రవేశం దుర్లభంగా ఉండేదట. వాఙ్మయంలో పరిశ్రమచేసే వారికి మాత్రం కొంత కష్టం మీద ప్రవేశం లభించేదట. ఇక గ్రంథం వెలుపలికి కావాలనంటే వ్రాసుకుని తెచ్చుకోవలసిందే గాని వేరే మార్గంలేకుండెడిదట. తమిళం తెలిసి వుండడం వలన, కవిగా రెలాగో వారిని వొప్పించి తాళ పత్ర గ్రంథాలను గ్రంథాలయం నుండి తెచ్చి రాత్రులకు రాత్రులు నిద్రకు వెలిగా ఉండి వ్రాత ప్రతులను తయారు చేసిన మీదట, తెచ్చిన గ్రంథాలను తిరిగి గ్రంథాలయానికి చేర్చే వారట!

ఇంతటి శ్రమకోర్చి, తాళపత్ర గ్రంథాలకు వ్రాత ప్రతులను తయారు చేసి ఆ మీదట పాఠాన్ని పరిస్కరించి కవిగారు ప్రచురించిన తెలుగు కావ్యాల జాబితా (ప్రచురింప బడిన సంవత్సరం కుండలీకరణాలలో) – కుమార సంభవం – ప్రథమ భాగం (1908), క్రీడాభిరామం (1909), బద్దె భూపాలుని ‘నీతిసార ముక్తావళి’ (1910), అనర్ఘ రాఘవము (1911), ఉదాహరణ వాఙ్మయంలో తొలుతటిదైన త్రిపురాంతకోదాహరణం (1912), శ్రీరంగ మహత్మ్యం (1912), కుమార సంభవం – ద్వితీయ భాగం (1914), సకలనీతి సమ్మతం (1923). ఈ కావ్యాలన్నీ తొలుతగా తాళపత్రాల నుంచి అచ్చులోనికి వెళ్ళింది కవిగారి చేతుల మీదుగానే అనీ ఆ తరువాతి ముద్రణలన్నిటికీ కవిగారి ముద్రిత ప్రతులే ఆధారములయినాయని చెబుతారు.