తెలుగు మాట, పాట, పద్యం (2)

తెలుగు మాట, పాట, పద్యం - image (1)

“ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తర తారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధ బంధురో
దారసమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబులై.”

తెలుగు పద్యం ఒక పధ్ధతిగా నన్నయతోనే మొదలైంది. నన్నయచే ఆంధ్రీకరించబడిన మహాభారత భాగంలో,  అరణ్యపర్వం, చతుర్ధాశ్వాసం 142వ పద్యం ఇది. నన్నయ చివరి పద్యం.

“వర్షాకాలం గడిచి, చలి కాలం అప్పుడప్పుడే మొదలౌతున్న రోజుల నాటి రాత్రులు.  చంద్రుడు కర్పూర పరాగం లాంటి వెన్నెలను కురిపిస్తున్నాడు. ఇలాంటి చంద్రుణ్ణి చూసి అప్పుడే వికసించినటువంటి తెల్లకలువల నుంచి వెలువడుతూన్న గంధాన్ని తనలో కలుపుకుని గాలి మత్తుగా వీస్తొంది.  అలా కాస్తూన్న వెన్నెలనూ ఇలా వీస్తూన్న గాలినీ వహించి చుక్కలు మైమరచి మెరుస్తూంటే ఆ మెరుపులో రాత్రులు ఇంకా మెరిసిపోతున్నాయి” అన్నది ఈ పద్యపు భావం.

పై ఫొటోకి తెలుగులో పద్యాన్ని ఊహించుకుంటున్నప్పుడు, నా మనస్సులో మెదలిన పద్యం నన్నయగారి ఈ పద్యం. పై ఫొటోలో వెన్నెల ఎంతగా కనిపిస్తుందో నేను చెప్పలేనుగాని, నన్నయగారి ఈ పద్యం నిండా వెన్నెల పరుచుకుని కనిపిస్తుంది.

ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వర్ణించడానికి అంతే అహ్లాదకరమైన చింతనలో మనసుండాలి, చిత్తంతో మనిషుండాలి. ఈ పద్యం లిఖించేటప్పుడు నన్నయగారు కూడా అంతే ఆహ్లాదకరమైన చిత్తంతో వుండి వుంటాడని నేననుకుంటాను. అప్పటికిక స్వస్తి చెప్పుకుని, మిగతాది మరుసటి దినానికి వాయిదా వేసుకుని, మామూలుగానే నిద్రకుపక్రమించి వుంటాడనీ నేననుకుంటాను. అయితే, తెల్లవారేసరికి పరిస్థితులు మారిపోయాయి. అలా మారిన ఆ పరిస్థితులు ఎలాంటివో,  ఆ మారిన పరిస్థితులు నన్నయ భారత ఆంధ్రీకరణం అర్ధంతరంగా ఆగిపోవడానికి ఎందుకు దారితీశాయో ఇదమిధ్ధంగా తేల్చి చెప్పుకోవడానికి సరిపడా ఆధారాలేవీ చరిత్రలో మిగలలేదు. అది  ఇప్పటికీ  ఒక mystery గానే మిగిలిపోయింది.

ఏదేమైనా, నన్నయ చివరి పద్యం ఒక బధామయ సన్నివేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని నాకనిపిస్తుంది. ఆ బాధకు ఒక కారణం ఆ పద్యంలో నిండుగా వున్న ఆహ్లాదకరమైన సన్నివేశమే అని కూడా నేననుకుంటాను! తాను వెన్నెలలాగా నిండుగా మెరుపులు కురిపిస్తూ, తన వెనుక ఎంతకూ వీడని ఒక చిక్కుముడిలాంటి చీకటినీ, రహస్యాన్నీ బంధించి దాచి ఉంచడం లాంటిది ఆ సన్నివేశం!!

పారడీ గారడీ (3)

“సురకాముకజనమనోహారిణీ వరూధినీ! ఆ
ధరామరవర వేషధారుని వంచనాకృతి నీ
ఎరుకకు రాదుకదా ఏనాటికీ! హా! ఎంతటి పా
మరకాంతనైన నీసాటి ఏమరుపాటు కందుమే?”

వరూధిని, అహల్య – వీరిరువురూ ఒకేరకమైన మోసానికి గురియైనవారు. తేడా ఒక్కటే. అహల్యకు అది వెంటనే తెలిసింది. వరూధినికి ఎప్పటికీ తెలియలేదు. తెలిసిన ఆమె పాషాణమైపోయి మిగిలింది. ఆమెను మామూలు మనిషిని చేయడానికి మళ్ళీ దేముడే వేరే అవతారంలో రావల్సివచ్చింది. తెలీని ఈమె ఏబాధా లేకుండా జీవనం సాగించింది. మనుజన్మానికి కూడా కారణమైంది. ఇందులో ఇంతకీ తెలియవచ్చిందేమిటి? తెలియడంలో సుఖముందా? తెలియకపోవడంలో సుఖముందా? జ్ఞానం మంచిదా? అజ్ఞానం మంచిదా? అజ్ఞానమే క్షేమదాయకమని అనిపిస్తుంది ఈ దృష్టాంతంలో! Ignorance always turns out to be a bliss! అంచేతా, అజ్ఞానమే ఆనందానికి హేతువనీ,

“కించిదవజ్ఞానమేగా విజ్ఞానసుజ్ఞానములన్
మించి ఎంచిజూడగను రంజత్కరమౌ నిలలోన్!”

అని ఎవరైనా ఆశువుగా తెలుగులో శ్లోకం చెప్తే, అలోచించాలి తప్ప చెప్పిన వారిపై ఒక్కపెట్టున ఎగిరిపడగూడదనుకుంటా!

శ్రీనాథుని దొరకకుండాపోయిన ‘శాలివాన సప్తశతి’ లోని ‘వారణసేయ దావగొనవా?’ పద్యపు నడకను దృష్టిలో పెట్టుకుని పారడీగా చెప్పిన పద్యం పైది. పారడీ రెండు రకాలుగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు. పద్యంగానీ, వచనంగానీ మాటల వొరవడికి ఇమిటేషనుగా చెప్పేది ఒకరకం. రెండోది, ఒక రచయితదో రచయిత్రిదో శైలికి, రచనలలోని overall philosophy కి పారడీగా చెప్పేది. సరిగ్గా చెప్తే, రెండూ అందగిస్తాయి. విశ్వనాథవారిని ‘పాషాణ పాక ప్రభో’ అని పిలవగలిగిన దమ్మున్న జరుక్ శాస్త్రి, ఆ ఒక్కమాటే అనేసి ఊరుకోలే! దానికి తగ్గట్టు ఇనపముక్క లాంటి ఒక పద్యంగూడా చెప్పాడు.  ఆ పద్యం ఇది:

“కించిత్ తిక్త కషాయ బాడబ రస క్షే పాతిరే కాతి వా
క్సంచార ప్రచయావకాశములలో కవ్యుద్ఘ! గండాశ్మముల్
చంచల్లీల నుదాత్త వాగ్గరిమతో సాధించి వేధించుమా!
పంచారించి ప్రవహ్లికావృతి కృతిన్ పాషాణ పాక ప్రభో!”

ఇంత దిట్టమైన పద్యంచెప్పగల ప్రతిభ వున్నవాడు కాబట్టే, జరుక్ శాస్త్రి ‘వాగుడు’ ని ఎంతెంతవారైనా సహించి ఊరుకున్నారు. విశ్వనాథవారి ఏఒక్క పద్యానికో ఇది పారడీ కాదు. స్థూలంగా వారు పద్యంచెప్పే రీతి మొత్తానికి పారడీ! ఇక పద్యానికి పద్యం, పాటకు పాట లేదా మాటకు మాటగా చెప్పే పారడీకి జరుక్ శాస్త్రిదే ఇంకో ఉదాహరణ శ్రీశ్రీ ‘సిందూరం రక్తచందనం కావాలోయ్’ గేయానికి పారడీ, బాగా ప్రసిధ్ధి చెందిందే:

“మాగాయా కందిపచ్చడీ, ఆవకాయా పెసరప్పడమూ
తెగిపోయిన పాతచెప్పులూ, పిచ్చాడి ప్రలాపం, కోపం
వైజాగ్ లో కారా కిళ్ళీ, సామానోయ్ సరదా పాటకు!”

ఈ గేయానికి ‘సరదా పాట!’ అని పేరు కూడా పెట్టాట్ట జరుక్ శాస్త్రి.

‘మొదట్నించీ అందులో ఏదో ఉందనిపిస్తూ, చివరికొచ్చే సరికి ఏమీ లేకుండా వేళ్ళాడబడిపోయేదే భావకవిత్వం అంటే!’ అని ఒక అభిప్రాయం చాలరోజులక్రిందట భావకవిత్వాన్ని నిరసించిన ఒకవర్గం కవులలో ఉండేదట. భావకవిత్వం అంటే తెలుగులో కృష్ణశాస్త్రి (కృష్ణశాస్త్రే) జ్ఞాపకానికొస్తాడు. ఆ కారణంచేత, భావకవిత్వం మీద విమర్శ కూడా మొదట కృష్ణశాస్త్రికే తగులుతున్నట్లుగా అనిపిస్తుంది. అనంతపంతుల రామలింగస్వామిగారని ఒక పారడీ కవి చెప్పిన ఈ క్రింది పద్యం కృష్ణశాస్త్రి కవిత్వాన్నే కాక భావకవిత్వ ధోరణిలో వెలువడిన కవిత్వానికంతటికీ ఒక హేళణ, ఒక చక్కటి పారడీ!

“రెండు కాకులు కూర్చుండె బండమీద;
ఒండెగిరి పోయె; అంత అందొండు మిగిలె
రెండవది పోయె; పిదప అందొండు లేదు
బండ మాత్రము పాప మందుండి పోయె!”

 

పారడీ గారడీ (2)

“కందం రాసినవాడే కవియని, ఏలాగొలాగ ఓ
కందాన్ని సాధించి నేనూ కవినై పోయానని
డెందంబును అమందానందకందళిత పరచుట
ఒక వెంట్రుక జుత్తవనటుల, కానిపనప్పా, కవి చౌటప్పా!”

కవి చౌడప్ప శతకంలో పద్యాలు చదివిన ఊపులో నా మిత్రుడు ఊదేసిన పద్యం ఇది. ఇందులో నాలుగో పాదంలో చివర  ‘చౌటప్పా’ మాట, చౌడప్పా కు బదులు పడ్డ అచ్చుతప్పేమీ కాదు. అది ‘చౌటప్పా’ నే!  ఏ వృత్తంలోనిదిరా ఇదీ’ అనడిగితే, ‘ఏ వృత్తమూ కాదు, స్వేఛ్ఛా వృత్తం, స్వయంగా నాదీ!’ అన్నాడు. అన్ని తెలివితేటలుండేవి అప్పట్లోనే వాడికి!

ఆ రోజుల్లో కంటే ఇంకొంత ముందు రోజుల్లో, అంటే మా చిన్నతనంలో, మా ఊళ్ళో ఒక పెద్దాయన ఉండేవాడు. ఆయన పెద్దగా చదువుకున్నట్లు కనిపించేవాడు కాదు గాని, అప్పుడప్పుడు తెలుగు సాహిత్యాన్ని గురించి, పద్యాల గురించి మాట్లాడుతుండేవాడు. ఆయన ఒకసారి అన్నాడూ, ‘ఒరేయ్ పిల్లల్లారా! తెలుగులో అసలైన సాహిత్యం తాటాకులమీద రాయబడి లేదురా!’ అని.  ‘మరేడ రాశారేందీ?’ అని మేం ఎగతాళిగా ఎదురు ప్రశ్నవేస్తే, ‘తొందరెందుకు, తెలుసుద్దిలే! సదుంకోండి సదుంకోండి!’ అని చెప్పి తప్పించుకునేవాడు. ఆ తరువాత చాణ్ణాళ్ళకి గాని అర్ధంగాలా, ఆయన చాటు పద్యాల గురించి, ‘చాటు’ (గోప్యంగా ఉంచదగ్గ విషయాలకు సంబంధించిన)  పద్యాల గురించి చెబుతూండేవాడని.

గ్రంధం దొరకకుండా, అందులోంచి ఒకటి రెండు పద్యాలు మాత్రమే, ఏ వ్యాకరణ గ్రంధాల్లోనో ఉదాహరింపబడి దొరికినవి మహా చెడ్డవి. అందులోనూ, ఆ దొరికిన ఒకటో రెండో పద్యాలు మాంఛి ఒడుపు గల్లవయితే, ఇక చెప్పనక్కరలేదా బాధ! దొరకని దాన్లో ఇంకా ఎన్నెన్ని చిత్రాలున్నాయో నని!

సర్వదేవుడని ఒక కవి ఉండేవాడట మనకు. ఈయనే కన్నడంలోని ‘పొన్నకవి’ అని కూడా ఒక మాట ప్రచారంలో ఉంది. ఈయన ‘ఆదిపురాణమ’ నే గ్రంధం రాశాడనీ, అందులోనివిగా ఇప్పుడు మనకు లభ్యమౌతున్నవి రెండే రెండు పద్యాలని ‘ప్రబంధ రత్నావళి’ లో ఉదాహరించినవాటి వలన తెలుస్తుంది. (సర్వదేవుడు రాసిన ఈ ‘ఆదిపురాణం’ కన్నడంలో పంపకవి రాసిన ఆదిపురాణానికి తెనిగింపు). ఈ రెండు పద్యాలలో ఒక పద్యం:

“సరసీజాత వియోగకారి పురయోషా వక్తృహృద్యా సుం
దరకాంతిం దఱిగించుబోయని మదిం దర్కించి దోషాకరున్
పురముద్దండ కరంబులెత్తి చఱవం బొత్తైన యట్లొప్పు ను
ధ్ధుర సౌధాగ్రనిబధ్ధకేతువు మహాందోలాభిరామంబుగన్.”

ఈ పద్యం నడకని ముచ్చటపడో ఏమో మరీ తీసుకుని ‘యోషా’ తో సహా దించి ముక్కు తిమ్మన గారు, ముక్కు పద్యం ఎలా చెప్పారో చూడండి:

“నానాసూన వితాన వాసనల నానందించు సారంగమే
లా నన్నొల్ల దటంచు గంధఫలి బల్ కాకన్ తపంబంది యో
షా నాసాకృతి తాల్చి సర్వ సుమన స్సౌరభ్య సంవాసియై
పూనెన్ ప్రేక్షణమాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్.”

పారడీ గారడీ (1)

“ఎప్పుడూ ఎవర్రెడీగా ఒక పారడీతో ఉండేవా
డొకడుండేవాడు; కవన్నవాడినెవ్వడినీ కవ్విం
చక నవ్వించక వదిలేవాడు కాడంటే కాడు; పే
రుకతడు జరుక్శాస్త్రి, పారడీ కళకు తాపీలేని మేస్త్రీ!”

చాన్నాళ్ళక్రితం ‘పారడీ’ కళను గురించి మాట్లాడుకుంటూండగా, నా మిత్రుడొకడు ఘబాల్న ఒక మాటనేశాడు, “ఇంకా వేరే పారడీ ఏంటీ, తెలుగుసాహిత్యం నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు పారడీనేగా!” అని. ఇలాంటి రిమార్క్సుకి తెలిసున్నవాళ్ళు గుంభనంగా గమ్మునే ఉంటారుగాని, తెలీనివాళ్ళూ, తెలిసీతెలియనివాళ్ళు ఇంకా మరీనూ, బాధపడిపోతున్నట్లుగానూ, గుండెలు పిండేసినంత పనైపోయినట్లుగానూ ఐపోయి, ఇట్టాంటి రిమార్క్స్ చేసినవ్యక్తిని అదోరకంగా చూస్తుండడం, మరింక జన్మలో మాట్లాడకపోతూండడం చేస్తుంటారు.

ఇంతకీ సంగతేమిటంటే, పారడీ కూడా ఒక కళే! దాన్నంత తేలికగా తీసిపారెయ్యడానికి వీల్లేనేలేదు. ఎందుకంటే, అందరూ పారడీ చెప్పలేరు గనక, ఒకవేళ చెప్పినా అంత తేలికగా మెప్పించనూ లేరు గనక. అసలుకవి కంటే, పారడీకవికే ఎక్కువ తెలివితేటలుండాలి. అసలుకవికి ఉన్న స్వేఛ్ఛ పారడీ కవికి ఉండదుగాక ఉండదు. అసలుకవిది ఆరుబయట వెన్నెల్లో కూర్చుని చుక్కల్ని లెక్కెడుతూనో, చందమామని చూస్తూనో
చెప్పే కవిత్వం అనుకుంటే, పారడీ కవిది బందిఖానాలో కూర్చుని కటకటాల వెనెకనుంచి చెప్పే కవిత్వం. ఇలా కటకటాల వెనకనుంచి కవిత్వం చెబుతూ, పైపెచ్చు నవ్వు పుట్టించేదిగా కూడా చెప్పాలి. ఇందువల్లే, పారడీకవికి అసలుకవి కంటే రెట్టింపు ప్రతిభా, విద్వత్తూ ఉండాలంటారు మరి.

తెలుగులో పారడీ అనంగానే, మొదటగా (చివరగానూ కూడ) జ్ఞాపకం వచ్చేది ఒకేఒక్క పేరు. ఆ ఒక్క పేరు జరుక్ శాస్త్రి. ‘రుక్కాయ్’ అని సన్నిహితవర్గాల్లో ఆప్యాయంగా పిలవబడిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. పారడీకి ఈయన పెట్టిందిపేరనీ, పద్యాలు (వచనాలు కూడ) ఈయన పేరు చెబితే గజగజ వణికిపోయేవనీ, కవిత్వాన్నే కాదు, వచనాన్ని కూడా అవలీలగా తిరగేసి తొడిగేసుకునేవాడనీ (శ్రీశ్రీ: ఆనంతం), ఈయన పారడీ చెబితే అసలుది ఎటో పోయి పారడీనే నిలిచిపోయేంతగా బాగుండేదనీ, ఈయన పారడీలు చదివినవాళ్ళకీ, ఈయన పారడీల గురించి
చదివినవాళ్ళకీ తెలుస్తుంది. జరుక్ వాగుడులో ఒక వైభవం ఉండేదనీ, తల్లావఝుల శివశంకరశాస్త్రి వంటి హేమాహేమీలు కూడా జలసూత్రం నోటిదురుసుతనానికి ఝడిసే వాళ్ళనీ (శ్రీశ్రీ: ఆనంతం), శివశంకరశాస్త్రిగారిని ‘పీఠికా పరమేశ్వరుడ’ న్నా, విశ్వనాథవారిని ‘పాషాణపాక ప్రభో’ అన్నా అది ‘రుక్కాయ్’ కే చెల్లిందనీ చెబుతారు. అయితే, ఎంత ఇదయితే మాత్రం, మరీఅంత అన్యాయంగా ముందూ వెనుకా అసలంటూ ఎవరూ లేకుండా మొత్తం ఆయనే అంటే అన్యాయం గాదూ? అని ఎవరయినా అంటే, ఆయన వెనుక సంగతి (అంటే ఆయన పుట్టిన తరువాత సంగతి) యేమో నాకు తెలియదుగాని, ఆయన పుట్టక ముందు సంగతయితే మటుకు మరీ ఇంత అధ్వాన్నంగా మాత్రం ఉండేది కాదనీ, తెలుగు కవిత్వంలో అప్పుడప్పూడూ పారడీ సంగతులనదగినవి తెలుగుకవుల పద్యాల్లో దర్శనమిస్తూ ఉండేవే అనీ మాత్రం చెప్పగలను.

ఉదాహరణకి, ఈ రెండు పద్యాలూ చూడండి:

వీరెవరయ్య? ద్రుపదమ
హారాజులే? ఇట్లు కృపణులై పట్టువడన్
వీరికి వలసెనె? ఇపుడు మ
హారాజ్య మదాంధకార మది వాసె నొకో?                  

వీరెవ్వరు? శ్రీకృష్ణులు
గారా? వీరెన్నడును వెన్నగానరట కదా?
చోరత్వం బించుకయును
నేరరట? ధరిత్రి నిట్టి నియతులు గలరే?                    

మొదటిది నన్నయ భారతం లోనిది, రెండవది పోతన భాగవతం లోనిది.

సాహిత్యంలో ప్రకృతి – (4)

“ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తర తారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధ బంధురో
దారసమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబులై.”

శరత్కాలంలో ఒక నాటి రాత్రి. చంద్రుడు కర్పూర పరాగం లాంటి వెన్నెలను కురిపిస్తున్నాడు. ఇలాంటి చంద్రుణ్ణి చూసి అప్పుడే వికసించినటువంటి తెల్లకలువల నుంచి వెలువడుతూన్న గంధాన్ని తనలో కలుపుకుని గాలి మత్తుగా వీస్తొంది.  అలా కాస్తూన్న వెన్నెలనూ ఇలా వీస్తూన్న గాలినీ వహించి చుక్కలు మైమరచి మెరుస్తూంటే ఆ మెరుపులో రాత్రులు ఇంకా మెరిసిపోతున్నాయి. ఇదీ ఈ పద్యపు భావం.

నన్నయ రచిత మహాభారతంలోని అరణ్యపర్వంలో నన్నయ చివరి పద్యం ఇది. ఇక్కడితో ఆంధ్ర మహాభారత రచనలో నన్నయ పాత్ర ముగిసింది. ఇంతటి ఆహ్లాదకరమైన ప్రకృతి చిత్రాన్ని కళ్ళకు కట్టినట్లు అక్షరబధ్ధం చేసిన నన్నయ లేఖిని అక్కడితో ఏ కారణాల వల్లనో దీర్ఘ విశ్రాంతి తీసుకుంది.

తెలుగు పద్య సాహిత్యం ప్రబంధ రచనా కాలానికి చేరుకునే సరికి, ప్రబంధాలలో ప్రకృతి వర్ణన ఒక తప్పనిసరి భాగమైపోయింది. ప్రకృతిని అద్భుతంగా వర్ణించి చూపిన పద్యాలు ప్రబంధాలలో చాలా ఎక్కువగానే కనిపిస్తాయి. తెలుగులో పంచ ప్రబంధాలలో ఒకటైన కృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని పద్యాలు దేనికదే సాటిలేనిదిగా చెప్పుకోవచ్చు. అయితే, మహారాజు కదా, పద్య రచనలో కృష్ణరాయనిది తన రాజసానికి తగ్గట్లుగానే నారికేళపాకం. ఏదో కొంత వ్యాఖ్య సహాయం లేకుండా పద్య భావాన్ని ఒక పట్టాన అర్ధం కానివ్వడు. ఉన్న పద్యాలలో, ఒకింత సరళమైన పద్యం, విలుబుత్తూరి వర్ణనలోనిది, చంపకమాలా వృత్తం లోనిది:

“మలయపుగాలి రేలు వనమాలి విమానపతాక ఘల్లుమం
చులియ పసిండిమువ్వగమి నొక్కొకమాటు కదల్పి నుల్కి మి
న్నలము తదీయ హేమవరణాంచల చంపక శాఖలందు బ
క్షులు రొద సేయ వేగె నని కూడుదు రల్కలు దేఱి దంపతుల్.”

‘రాత్రులలో వీచే కొండగాలి (విలుబుత్తూరులో) స్వామి కోవెల ధ్వజస్థంభానికి ఉన్నటువంటి బంగారు మువ్వలను ఒక్కొకమాటే కదల్చడం వలన ఘల్లుమని చప్పుడులు కాగా, ఆ కోవెల బంగారు ప్రాకారం వెంబడే ఉన్నటువంటి సంపెంగ కొమ్మలలో నిద్రిస్తూ ఉన్న పక్షులు ఆ చప్పుడులకు అదిరి పడి లేచి కూయగా, ఆ సవ్వడికి ఇక తెల్లవారవచ్చిందని భ్రమసి అప్పటిదాకా ఉండిన అలకలు మాని దంపతులు ఒకటౌతారు’ అని ఈ పద్య భావం.

రాజుని చేయకుండా వదిలేసి ఉన్నట్లయితే, హాలుని లాగా, ఆ కాలపు సామాన్య జనజీవనంలోని ఎన్నెన్నో సంగతులను అక్షరబధ్ధం చేసి ఉండేవాడేమో క్రిష్ణరాయలు అని నాకు అనిపిస్తూ ఉంటుంది.

(అయిపోయింది)

రాజరాజు – నన్నయ (9)

రాజ రాజ నరేంద్రుడు ఆంధ్ర దేశాన్ని క్రీ.శ.1022 నుండి 1063 వరకూ పరిపాలించాడని చరిత్ర పరశోధకుల నిర్ణయం. రాజ రాజు తరువాత అతని కుమారుడు కుళోత్తుంగ చోడుడు రాజ్యాదికారాన్ని చేపట్టవలసి ఉండగా, అతడు మాతామహులదైన చోళ రాజ్యానికి అధిపతియై అటు వెళ్ళిపోవడంతో ఆంధ్ర దేశంలో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఇతిని పినతండ్రియైన విజయాదిత్యుని అధికారంలో రాజ్యం ఉన్నా, రాజ రాజు మరణానంతరం ఆ సింహాసనం దక్కించుకోవడానికి రాజుల మధ్య మొదలైన యుధ్ధాలతో రాజ్యంలో దదాపు అరాజక పరిస్థితులు ఏర్పడి కావ్య రచనకు కావాల్సిన శాంతియుత వాతావరణం లేకుండా పోయింది.

ఈ పరిస్థితులే నన్నయ మహాభారత రచన అర్ధంతరంగా ఆగిపోవడానికి కారణంగా చెప్పుకుని త్రుప్తిపడాలిసిందే తప్ప వేరే కారణం ఊహించలేం.

“ఎఱుక గలవారి చెరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగిన దానిని
మఱువ కనుష్ఠించునది సమంజసబుధ్ధిన్.”

“తనయుండు తల్లిదండ్రులు
పనిచినపని సేయడేని పలుకెదలో జే
కొనడేని వాడు తనయుం
డనబడునే పితృధనమున కర్హుండగునే.”

“అలిగిన నలుగక యెగ్గులు
పలికిన మఱి వినని యట్ల ప్రతివచనంబుల్
పలుకక బన్నము వడి యెద
దలపక యున్నవాడె ధర్మజ్ఞుడిలన్.”

(అయిపోయింది)

రాజరాజు – నన్నయ (8)

నన్నయ మహాభారత ఆంధ్రీకరణం అరణ్య పర్వం, చతుర్థాశ్వాసం 142వ పద్యం దగ్గర ఆగిపోయింది.  ఆ పద్యం ఇది:

“ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తర తారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధ బంధురో
దారసమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబు లై.”

వర్షాకాలం గడిచి, చలి కాలం అప్పుడప్పుడే మొదలౌతున్న రోజుల నాటి రాత్రులు.  చంద్రుడు కర్పూర పరాగం లాంటి వెన్నెలను కురిపిస్తున్నాడు. ఇలాంటి చంద్రుణ్ణి చూసి అప్పుడే వికసించినటువంటి తెల్లకలువల నుంచి వెలువడుతూన్న గంధాన్ని తనలో కలుపుకుని గాలి మత్తుగా వీస్తొంది.  అలా కాస్తూన్న వెన్నెలనూ ఇలా వీస్తూన్న గాలినీ వహించి చుక్కలు మైమరచి మెరుస్తూంటే ఆ మెరుపులో రాత్రులు ఇంకా మెరిసిపోతున్నాయి. ఇదీ ఈ పద్యపు భావం.

ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వర్ణించడానికి అంతే అహ్లాదకరమైన చింతన కావాలి. ఈ పద్యాన్ని రచించిన నాటి రాత్రి (రాత్రి గానే నేను భావించుకుంటున్నాను) అంతే ఆహ్లాదకరమైన చిత్తంతో ఆనాటికి స్వస్తి చెప్పుకుని నిద్ర కుపక్రమించుంటాడు నన్నయ. తెల్లవారే సరికి మారిన పరిస్థితులను గురించి తెలియజెప్పగల అధారాలేవీ చరిత్రలో మిగలలేదు.  మిగిలినదల్లా కట్టుకధలుగా భావించబడుతూన్న ఒకటి రెండు కథలు మాత్రమే. వాటిల్లో ఒకటి చిత్రాంగీ సారంగధరులకు సంబంధించినది, లోక ప్రసిధ్ధమైనది. ఈ కధలో అనైతికమైన, ఏహ్యమైన రాజరాజు ప్రవర్తనకు మనసు కలతచెంది నన్నయ మహాభారత ఆంధ్రీకరణాన్ని అపివేశాడని ఐతిహ్యం. ఆంధ్ర మహాభారతం అవతారికలో నన్నయ వర్ణించిన రాజరాజుకూ, ఈ కథలోని రాజరాజుకూ సంబంధమే లేనట్లుగా ఉంటుంది ఈ కథలో రాజ రాజు ప్రవర్తన.  అయినప్పటికీ, పోతన గారన్నట్లు ‘రాజుల్ మత్తులు’…మత్తులే గాదు ఉన్మత్తులు గూడా.  ఏనాటికి ఏరాజు చిత్తం ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించలేనిది.  అకారణంగా కథలెలా పుడతాయి మరి? అదలా ఉంచితే, సారంగధరుడూ, చిత్రాంగీ కల్పిత వ్యక్తులే తప్ప వీ రిరివురూ నిజ వ్యక్తులుగా పరిగణింపబడడానికి  సంబంధించిన చారిత్రక ఆధారాలేమీ లేవని చరిత్రపరిశోధకులు చెబుతారు.

ఇక రెండవది, వేములవాడ భీమకవి తో సంబంధం ఉన్న ఒక కథ. నిస్సందేహంగా తెలుగులో అత్యంత ప్రతిభావంతులైన కవులలో ఈయనకు స్థానం ఉంది.  శ్రీనాథుడు ఈయనను తాను పూర్వకవులలో గౌరవించే మొట్టమొదటి వానిగా చెప్పుకోవడం ఇందుకు తార్కాణం.  అయితే, ఈయన రచించిన గ్రంధమేదీ ఇప్పటికీ లభ్యం కాకపోవడం దురదృష్టకరం. ఈయనవిగా చెప్పబడుతూ లభించిన పద్యాలు ఇప్పటిదాకా 53. అందులో 38 చాటువులు, అన్నీ లోకప్రసిధ్ధమైనవే.  నన్నయ కంటే ముందుగానే తెలుగులో ఈయన ‘రాఘవ పాండవీయం’ అనే ఒక ద్వ్యర్ధి కావ్యాన్ని రచించాడనీ, ఓర్వలేక నన్నయగారు ఆ కావ్యాన్ని తగులబెట్టించారనీ కథ.  ప్రతిగా నన్నయ రాసిన ‘ఆంధ్ర శబ్దచింతామణి’ ని  భీమకవి గోదావరి పాలు చేశాడని కూడా కథ. ఇదే కాకుండా, అధర్వణుడనే కవి వ్రాసిన భారతాన్ని కూడా రాజరాజు దృష్టికి రాకుండా నన్నయ అగ్నికి ఆహుతి చేశాడని కూడా కథ.  ఈ దుష్కార్యాల ప్రభావం నన్నయ మీద పడిందనీ, దాని ఫలితమే నన్నయ భారత రచన అర్ధంతరంగా ఆగిపోవడమనీ తరతరాలుగా జనంసామాన్యంలో ప్రచారమై ఉన్న కథ.

ఈ కథల్లో నిజానిజాలు ఏమైనప్పటికీ, నన్నయ భారత రచన పైన చూపిన పద్యంతో ఆగిపోవడం మాత్రం నిజం.

రాజరాజు – నన్నయ (7)

నన్నయ రచిత ఆంధ్ర మహాభారత భాగం చాలామటుకు సంస్కృత పద భూయిష్టంగా ఉంటుందన్నది ఒక మాట.  సంస్కృత పదాలు తత్సమీకరించీ, తత్భవంచెందించీ విస్తృతంగా వాడబడి కనిపిస్తాయి నన్నయ ఆంధ్రీకరించిన భారత భాగంలో. తెలుగు భాషకున్న అజంతత్వమనే లక్షణమూ, తెలుగు భాష ప్రధమా విభక్తి ప్రత్యయాలయిన ‘డు, ము, వు, లూ’ సంస్కృత పదాల తత్సమ, తద్భవీకరణలకు అనువుగానూ, ప్రోత్సాహకంగానూ ఉండి ఈ ప్రక్రియను సులభతరం చేశాయని చెప్పుకోవాలి.  భాష కల్పించిన సౌలభ్యం లేకపోతే నన్నయ చేయగలిగింది కూడా ఏమీ లేదు. 

నన్నయ రచిత భారత భాగంలో పద్యానికి నన్నయ సమకూర్చి పెట్టిన ప్రత్యేకమైన నడకలూ, కొన్ని కొన్ని పదాలను నన్నయ ఉపయోగించిన తీరూ, ఆ తరువాత కవులకు మార్గదర్శకంగా నిలిచాయి. ఇట్లాంటి వాటిల్లో చెప్పుకో దగ్గ ఒక గమ్మత్తయిన ప్రయోగం ‘ఇంతకు ఇంతయు’ అనే జంట పదానికి సంబంధించినది. ఈ జంట పదం నన్నయ వాడిన ఈ రూపంలో  తెలుగు సాహిత్యం మొత్తంలోనే చాలా అరుదుగా వాడబడి కనిపిస్తుంది. ఈ జంట పదం సౌందర్యానికి ముగ్ధుడయ్యీ, ముచ్చటపడీ శ్రీనాధుడు తన పద్యంలో ఉపయోగించుకున్నాడు.  ‘ఇంతకు ఇంతయు’ అన్న ఈ జంట పదం నన్నయ భారతంలో (ఆదిపర్వం 5వ అధ్యాయం 27వ వచనం, 28వ పద్యం) ఇలా వాడబడి కనిపిస్తుంది:

“27.వ. అంత నాదిత్యుండు నాకాశంబున కరిగిన, కొడుకుంజూచి కుంతి తద్దయు విస్మయంబంది యెద్దియుం జేయునది నేరక…

28. తరువోజ.ఏలయమ్ముని నాకు నిచ్చె నిమ్మంత్ర మిమ్మంత్ర శక్తియే నెఱుగంగ వేడి
యేల పుత్త్రకుగోరి యెంతయు భక్తి నినుదలంచితి భీతినినుడును నాకు
నేల సద్యోగర్భమిచ్చె గుమారుడేల యప్పుడుదయించె నింకెట్టు
లీలోకపరివాదమే నుడిగింతు నింతకు నింతయు నెఱుగరె జనులు”

శ్రీనాధుడీ జంట పదాన్ని తన శాలివాహన సప్త శతిలో వాడుకున్నాడు.  ఈ గ్రంధం ఇప్పటికీ అలభ్యం.  అయితే, అందులోనిదని చెప్పబడే ఒక్కటే ఒక్క పద్యం, సాహితీ లోకంలో కొన్ని దశాబ్దాలక్రితం చాలా తర్జన భర్జనలకూ వాదోపవాదలకూ కారణమైన ఈ పద్యంలో ఈ జంట పదాన్ని శ్రీనాధుడు వాడిన విధానం:

“వారణ శేయ దావగొనవా, నవవారిజమందు తేటి క్రొ
వ్వారుచునంట నీవెఱుగవా, హా ప్రియ వాతెఱ గంటు కంటి కె
వ్వారికి కెంపు రాదు, తగవా మగవారల దూఱ, నీ ప్రియుం
డారసి నీ నిజంబెరుగు నంతకు నంతయు నోర్వు నెచ్చెలీ!”       

ఈ సందర్భంలోనే ముచ్చటించుకోవాల్సిన ముఖ్య విషయం ఇంకొకటుంది. పైన చూపిన నన్నయ భారతంలోని తరువోజ పద్యం తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ప్రపంచనము (soliloquy). ఆ తరువాత ఈ ప్రక్రియ ఎన్ని చిత్రాలు పోయిందో ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.  అన్నిటిలోకీ మయసభలో భంగపాటు అనంతరం దుర్యోధనుని soliloquy బహుళ ప్రచారం పొందినది.

రాజరాజు – నన్నయ (6)

సంస్కృత మహాభారత ఆంధ్రీకరణలో నన్నయ అనుసరించిన పధ్ధతుల్ని విశ్లేషిస్తూ, నన్నయ కవిత్వంలోని గుణగణాల్ని విశదపరుస్తూ ఎంతో మంది పెద్దలు ఎన్నెన్నో వ్యాసాలను వ్రాసి ప్రచురించారు ఈవరకే.

కావ్య రచనలో నన్నయ తానుగా అనుసరిస్తూ, అనుసరించదగినవిగా సూచనప్రాయంగా తెలిపిన పధ్ధతులలో విశేషమైనది అవకాశం దొరికినప్పుడల్లా మధ్యలో ముక్తకాలనదగినటువంటి నీతి బోధకాలయిన పద్యాలను జొప్పించి చెప్పడం. ఉదాహరణకు ఆంధ్ర మహాభారతం ఆది పర్వం, రెండవ అధ్యాయం లొని 172వ దైన ఈ కంద పద్యం:

“క్రోధము తపముం జెఱచును
గ్రోధమ యణిమాదులయిన గుణముల బాపుం
గ్రోధమ ధర్మక్రియలకు
బాధయగుం గ్రోధిగా దపస్వికి జన్నే!”
(ఈ పద్య భావాన్నే ఇంకా సంక్షిప్తీకరించి ‘తన కోపమె తన శత్రువు’ అని చెప్పాడు వేమన).

విడిగా చదువుకోవడానికీ, సందర్భానికి తగినట్లుగా ఉల్లేఖించడానికీ వీలయినటువంటి చక్కటి పద్యం ఇది. ఇలాంటివే ఇంకా ఎన్నో! సద్వర్తనానికి ఉపకరించే నీతి బొధకాలయిన పద్యాలను విడిగా చెప్పడం కంటె, కావ్యంలో సందర్భానికి తగినట్లుగా చొప్పించి చెప్పడం చాల ఉపయోగకరంగా నన్నయ భావించి అనుసరించి చూపిన పధ్ధతి ఇది.

ఈ పధ్ధతిని తెలుగు సినిమాలల్లో కూడా ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ సముద్రాల రాఘవాచర్యులు (సీనియర్ సముద్రాల) గారిది. ఉదాహరణకు, భూకైలాస్ సినిమాలో పాతాళరాజు (పరమ వైష్ణవ భక్తుడు)  కొలువులో ఆయన కుమార్తె మండోదరికి సరియయిన వరుడుగా రావణుని (పరమ శివ భక్తుడు) మంత్రి సూచిస్తే, పోయి పోయి విష్ణుద్రోహియైన అతనికా అని విరుచుకుపడ్డ పాతాళరాజుకు నచ్చ చెప్పే ప్రయత్నంచేస్తూ  “లోకాలు వేరు కావచ్చు, విశ్వాసాలు వేరు కావచ్చు. అంత మాత్రాన వియ్యాలు మానుకుంటామా మహారజా!” అని  మంత్రి అన్న మాటలు….

అలాగే నర్తనశాల సినిమాలో విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం గడపడానికి మారు వేషాల్తో వెళ్ళే విషయమై జరుగుతూండిన సంభాషణలో, పాండవ పట్టమహిషియయిన ద్రౌపది ఎలా ఈ కష్టాన్ని భరిస్తూ గడంనుంచి గట్టెక్కుతుందని చింతిల్లుతున్న ధర్మరాజు నుద్దేశించి  “అనురాగం ఉన్నచోట ఆవేదన సహజమే ప్రభూ! ఆర్య పుత్రులకు లేని కష్టం నాకా!” అని ద్రౌపది అన్న మాటలూ…

ఇంకా విరాటరాజు కొలువులోకి కంకుభట్టుగా ప్రవేశించిన ధర్మరాజును చూస్తూ “ముఖవర్చస్సు చూస్తే మహారాజులా ఉన్నారు?” అని అరా తియ్య బోయిన విరాటారాజుకు సమాధానంగా “ఆకారానికీ అదృష్టానికీ అనుబంధం లేదు ప్రభూ” అని ధర్మరాజుచే చెప్పించిన మాటలూ…ఇవన్నీ సందర్భోచితంగా ఉండడమే కాకుండా అర్ధగంభీరంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సంభాషణల మధ్యలో ఇలాంటి చణుకుల్లాంటి సూక్తుల్ని సంధిస్తే సంభాషణ ఎంతగా రుచించి హృదయానికి హత్తుకుంటుందో అప్పట్లో సముద్రాల గారు గ్రహించి ఆచరణలో పెట్టారు. ఈ technique కు మూలాలన్నీ నన్నయ రచిత మాహాభారత భాగంలో సమృధ్ధిగా ఉన్నాయి.

రాజరాజు – నన్నయ (5)

రాజరాజు – నన్నయ (4) కు లింకు ఇక్కడ

రాజరాజు కోరిక మేరకు సంస్కృత మహాభారత ఆంధ్రీకరణ యజ్ఞాన్ని ప్రారంభించిన నన్నయ తన కవిత్వపు రీతికి ‘అక్షర రమ్యత’ ను ఒక లక్షణంగా చేసుకుని కవిత్వం చెప్తానని చెప్పుకున్నాడు ‘సారమతిం కవీంద్రులు’ అన్న పద్యంలో (ఆం.మ.భా.అవతారిక 26వ పద్యం). (ఈ భావాన్నే ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి కొన్ని వందల సంవత్సరాల తరువాత కొఱవి గోపరాజు తన సింహాసనా ద్వాత్రింశిక లో ‘పదజ్ఞత’ నెరిగి కవిత్వం చెప్తానని చెప్పుకున్నాడు. ‘అక్షర రమ్యత’ అన్న పదం కంటే ‘పదజ్ఞత’ అన్న పదానికి భావంలో గాఢత ఎక్కువనేది చెప్పకనే తెలుస్తుంది). 

తెలుగులో పద్య రచనకు కావాల్సిన నియమాలను తానుగానే ఏర్పరచుకుంటూ రచన చేయాల్సిన అవసరం నన్నయది.  తెలుగు సాహిత్య చరిత్రలో మరే కవికీ లేని అవసరం ఇది.  మొదలెట్టడమే సంస్కృత శ్లోకంతో మొదలెట్టాడు నన్నయ అని నింద మోపడం చాలా తేలిక.  నన్నయ ఉన్నది క్రీ.శ.11 శతాబ్దపు పూర్వార్ధంలో అనీ, అప్పటకి తెలుగులో కావ్యం మాట అటుంచి, పద్య నిర్మాణమే సరిగా కుదురుకోలేదనీ ఒక్కసారి గుర్తుకుతెచ్చుకుంటే నన్నయ మీద ఇలాంటి నింద మోపం.

ప్రాకృతం పూర్తిగా తెరమరుగైపోయి, సంస్కృతం రాజ్యమేలుతున్న రోజులవి.  పక్కన తమిళంలోనూ, కన్నడంలోనూ అప్పటికే సాహింత్యం ఉంది.  తెలుగు పద్యం తన ప్రత్యేకతను చాటుకోవడానికి వీలుగా, సంస్కృత, తమిళ, కన్నడ భాషలలో పద్య నిర్మాణానికి వాడుతూండిన ఛందస్సుకు సంబంధించిన నియమాలకు కొంచెమన్నా భిన్నంగా తెలుగు పద్యాలకు నియమాలు ఉండాలని నన్నయ సంకల్పించడం అసహజమేమీ కాదు. ఇందుకోసం నన్నయ ఆలోచించి ప్రవేశ పెట్టినవే ‘యతి (వడి, వళి)’, ‘ప్రాస’ అనే రెండు నియమాలు.  నన్నయ ఏర్పరచిన పధ్ధతిలో తెలుగు పద్యానికి ఇవి ప్రత్యేకమైనవి.తెలుగు పద్యం సంస్కృత లేదా ఇతర ద్రావిడ భాషా పద్యాలతో ఈ రెండు విషయాలలోనే భేదిస్తుంది.

పద్య పాదంలో ఒక నియత స్థానంలో పద్యపాదపు ప్రధమాక్షరాన్ని గానీ లేదా దాని మిత్రాక్షరాన్ని గానీ ఉంచడం యతి (వడి) నియమం. సంస్కృతంలో ఇది ఇలా ఉండదు.  సంస్కృత శ్లోకానికి యతి ఉంటుంది గాని, అది విశ్రాంతి రూపమైనదే తప్ప(అంటే యతి స్థానంలో పదం విరిగితే చాలు) పాద ప్రధమాక్షరం గానీ దాని మిత్రాక్షరం గానీ పునరావృతం కావాలన్న నియమం లేదు. కన్నడములో గూడా ఈ వడి నియమం లేదు.

పద్యంలోని నాలుగు పాదాల్లోనూ రెండవ అక్షరాలు సమానములై ఉండాలనే నియమం ‘ప్రాస’. తెలుగులో నన్నయ తెచ్చి పెట్టిన ఈ నియమాన్నే ‘ద్వితీయాక్షరపు ఆట’ అని స్వర్గీయ పండిత ఉమాకాంత విద్యాశేఖరులు ఎద్దేవా చేసినప్పటికీ, ఇది తెలుగు పద్యానికే పరిమితమైనది. నన్నయ తెచ్చి పెట్టిన  ఈ నియమం వల్ల అనవసర పదజాలం పద్యంలో చేరాల్సి రావడం (ప్రాస నియమాన్ని పాటించడంకోసం) జరిగి కవిత్వం పలచ బడిందని వారి భావన. పద్య రచనలో సరైన ప్రవీణ్యం లేని వాళ్ళు పద్య రచనకు పూనుకోవడం వల్ల జరిగే అనర్ధం ఇది.

ప్రాస, యతి నియమం పాటించకుండా రాసిన పద్యాలు మనకు పనికిరావని చెప్పిన ఒక చక్కటి పద్యం, కొఱవి గోపరాజు రచించిన ‘సింహాసనా ద్వాత్రిం శిక’ లోనిది -

“పలుతెఱంగు లైన పలుకులు గలిగియు
బ్రాలు వళ్ళు లేని బేలుకవిత
వన్నెలెల్ల గూర్చి వ్రాయుచో గాటుక
వన్నె లేని ప్రతిమవ్రాత బోలు”

నన్నయ పెట్టిన ఈ ప్రాస, యతి నియమాల వల్ల తెలుగు పద్యం మరీ బిగిసి పోయి ప్రజలకు దూరమైందనే మాటకు ఇప్పటి వరకూ దొరికిన అజ్ఞాత కర్తృకాలైన ఎన్నో చాటు పద్యాలు సమాధానం చెప్తాయి.

రాజ రాజు (4) కు లింకు