తెలుగు నాటకాలు (1)

బళ్ళారి వారి ‘చిత్రనళీయము’
వీరేశలింగం గారి ‘శకుంతల’
లక్ష్మీకాంతం గారి ‘హరిశ్చంద్ర’
శ్రీపాద వారి ‘బొబ్బిలి యుధ్ధం’
తిరుపతి వేంకటకవుల ‘పాండవోద్యోగ విజయాలు’
వేదము వారి ‘ప్రతాప రుద్రీయము’
పానుగంటి వారి ‘రాధ కృష్ణ’
వడ్డాది సుబ్బారాయ కవి ‘వేణీ సంహారం’

తెలుగులో నాటకాలలో ఇవి ఎన్నదగినవని, చాల గొప్పవని  పెద్దలు చెబుతారు. జనామోదాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి ‘హరిశ్చంద్ర’ కూ, ఆ తరువాత తిరుపతి వేంకటకవుల ‘పాండవోద్యోగవిజయాల’ కూ ఉన్న popularity మిగతా వాటికి లేదని చెప్పవచ్చు. popularity ని దృష్టిలో పెట్టుకుంటే జ్ఞాపకానికొచ్చే మరో నాటకం కాళ్ళకూరి నారాయణరావుగారి ‘చింతామణి’. తెలుగు నేల పల్లెటూళ్ళలో ఈ మూడు నాటకాలూ ఒకానొక కాలంలో రాజ్యమేలినాయని చెబితే అతిశయోక్తి కాదు.

లక్ష్మీకాంతంగారి ‘హరిశ్చంద్ర’ నాటకంలోని పద్యాలు ప్రేక్షకులను ఎంతగా కదిలించేవో చెప్పనలవికాదు. ‘హరిశ్చంద్ర’ నాటకంలో హరిశ్చంద్రుని పాత్రను ధరించి ప్రసిధ్ధులైనవారిలో కొంతమంది పద్యం పాడే పధ్ధతికి ప్రేక్షకులలో చాలామంది వచ్చే దుఃఖాన్ని చాల కష్టంమీద ఆపుకోగలగడం, కొందరైతే దుఃఖాన్ని ఆపుకోలేక ఒకింతసేపు హాల్లోంచి వెలుపలికెళ్ళి, మళ్ళి లోపలికొస్తూండడం చేస్తూండేవారు. చీమచిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించి ఉన్న హాలులో, లక్ష్మీకాంతంగారి ఈ క్రింద ఉదాహరించిన పద్యంలోని ఒక్కొక్క మాట, ప్రేక్షకుల భావావేశాల్తో చెండాడుకొనేదనడంకూడా అతిశయోక్తి కాదు:

“తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగిరా వేరి కే
సరికేపాటు విధించెనో విధి యవశ్య ప్రాప్యమద్దాని నె
వ్వరు దప్పించెద రున్నవాడనని గర్వం బేరికెన్ గాదు; కిం
కరుడే రాజగు, రాజె కింకరుడగున్ కాలానుకూలంబుగాన్!”

‘తిరమై’ అన్న మొదటి పదం దగ్గర మొదలై, నడుస్తూ నడుస్తూ, పద్యం చివరి పాదం దగ్గరికొచ్చి, ‘కింకరుడే రాజగు, రాజె కింకరుడగున్ కాలానుకూలంబుగాన్!’ అన్నది రాగయుక్తంగా పూర్తయే సరికి, పాషాణమైనా సరే కరిగి పోవాలిసిందే అన్నట్లుగా ఉండేది. పాడేవాడు కన్నీళ్ళతోనే పాడేవాడు, చూసేవాళ్ళు కన్నీళ్ళతోనే చూసేవాళ్ళు. ఏడుపా అది? కానేకాదు. ఎంతమంది ఎన్నెన్ని పల్లెటూళ్ళలో ఎన్నెన్ని సంవత్సరాలపాటు ఈ పద్యం ధాటికి తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకున్నారో చెప్పడానికి లెక్కల్లేవు. అవన్నీ వేరే రోజులు. ఇప్పుడు వచ్చేవి
కావు. చెప్తే అర్ధమయేవీ కావు. ఇప్పుడు rewind చేసుకుని చూసుకోవడానికి స్వంత memory తప్ప వేరే మార్గాలు లేవు.

ఛందస్సు ఒక బంధనమని, శ్రుంఖలమని, అదుండగా అసలుసిసలైన కవిత్వం ఎక్కదని, భావం ఒదగదనీ, వ్యర్ధపదాల్లేకుండా సాధ్యపడదనీ అనుకున్నప్పుడల్లా, ఇలాంటివే పద్యాలు జ్ఞాపకానికొచ్చి నోరుమూయిస్తూంటాయి. పాలేర్లూ, కూలివాళ్ళూ ఈ పద్యాలను అక్షరం తప్పులేకుండా పాడడం తెలిసున్న వాళ్ళలో నేనూ ఒకడిని కావడం నా భాగ్యంగానే భావిస్తూ ఉంటాను ఇప్పటికీ!

మాకందాలు (30-33)

“పావలాకే ఐదు పునుగులు
కోవెల కావలి కొట్లో ఉల్లికారంతో సహా అప్పట్లో
ఏవెలకైనా సరే  కొని చే
కోవలెనంటే మాత్రం సాయంవేళల చాలా కష్టం వెంకట్‌బిరావూ!”

“మర్చిపోగా లేనివి
మిర్చి బజ్జీలు మరి వేడిగా ఉండంగానే పొట్ట
చీర్చి సన్నగా తరిగిన ఉల్లి
కూర్చి నిమ్మరసంతో తింటే కళ్ళు చెమర్చేవిగా వెంకట్‌బిరావూ!”

“కాదేదీ కవిత కనర్హం
ఏదైనా సరే కవనానికి వంగాల్సిందే విధిగా నంటూ
వాదం కొరకే అనినా
ఆమోదం పొందదగినవవి శ్రీశ్రీ మాటలు వెంకట్‌బిరావూ!”

“అప్పిచ్చే బ్యాంకులు ఇప్పుడు
కుప్పలుగా ఎప్పెట్టున చూసినా పుట్టుకొస్తుండగా
అప్పిచ్చు వాని కొరకై
తిప్పలు పడి వెదకు తీరు నేటికి తప్పెనుగా వెంకట్‌బిరావూ!”

మాకందాలు (27-29)

“ఎంతెంత దూరాన్నైనా
ఎంతో ఉల్లాసంగా కాలి నడకన అలవోకగా
గెంతుకుంటూ వెళ్ళొచ్చిన నాళ్ళు
ఎంతో మేలైనవి కష్టమైనా కండపుష్టికి వెంకట్‌బిరావూ!”

“తెలుగంటే పరీక్షలలో ఆరోజులలో
ఎలా చదివినా యాభై మార్కులు రావడం బహు కష్టం
అలాంటిది, మా వావిలాల గురువుల బడిలో
చలువపందిరి నీడన నేర్చిన తెలుగే వెలుగైంది వెంకట్‌బిరావూ!”

“విందంటే ముందరగా
పందిరిక్రింద వరుసగా బంతులుగా కూర్చొని
ఎందరో వడ్డిస్తూండగా
అందరూ కలిసి భొంచేసే పెళ్ళి విందే విందు వెంకట్‌బిరావూ!”

 

మాకందాలు (24-26)

“ఎన్ని భాషలు లోకంలో వున్నా
అన్నిటికన్నా మనిషికి మాతృభాషే మిన్న, అయినా మరి
కొన్ని భాషలు సరదాగా నేర్చుట
ఎన్నిటికో మేలన్న మాట మన్నికయింది వెంకట్‌బిరావూ!”

“ఎన్నినాళ్ళయిందో నిన్ను జూచి
వన్నె తగ్గవురా వేళకి సరిగా తింటున్నావా లేదా ఇలా
సన్నగా ఐపోయావేంటోయ్ అంటూ
మన్ని పలకరించే వాడుండడం ఓ పండుగ వెంకట్‌బిరావూ!”

“చెక్క భజన లిప్పుడు మరి
ఎక్కడయిన చేస్తున్నారో లేదొ గాని
ఒక్కొక్కడుగే ముందు వేసినా
ఒక్కసారి ఊపందుకుంటే కనువిందే మరది వెంకట్‌బిరావూ!”

మాకందాలు (20-23)

“చేలల్లో గట్ల మీద ఈలేసుకుంటూ
ఉల్లాసంగా పిల్లిపిసరలు కోసి నాలుకపైకి
రాల్చుకుని నములుకుంటూ చెలుల సంగతులు
తలపోసుకుంటూ తిరిగిన రోజులిక రానేరావు వెంకట్‌బిరావూ!”

“తీగకు వేలాడుతూన్న
నూగింకా వీడిపోని దోర దోసపిందని
లాగేసి చేతులతోనే రెండు సగాలుగా
తెగేసి తత్క్షణం తినడం నిజంగా ఒక విభవం వెంకట్‌బిరావూ!”

“వరిచేను మీదుగా ఉదయించే
సూరీడుని వీక్షిస్తూ హరితంపై విరుచుకుంటూ
పరుచుకుంటూన్న నీరెండలో
మెరవడం మనిషన్నవాడికి ఒక ముచ్చట వెంకట్‌బిరావూ!”

“రేగుపండ్లూ బఠానాలూ
వేగించిన శనగకాయలూ ఇంకా తేగలూ
వెగటనిపించొచిప్పుడు గానీ
తెగలాగించేసే వాళ్ళం గాదా ఒకప్పుడు వెంకట్‌బిరావూ!”

మాకందాలు (16-19)

“వెన్నెల రాత్రుల్లో ఇసుక
తిన్నెలపై కనులు మూసుకు పడుకుని
సన్నగ వీచే గాలిని శ్వాసిస్తూ
కన్నా మెన్నో కలలు అన్నిటినీ మరిచి వెంకట్‌బిరావూ!”

“లోకం తెలియని లేగ దూడ
తోకంతా ఊపుకుంటు తెగ గెంతునట్లుగా
శోకం తాకిడి తగిలే దాకా
ఏకంగా యమునైనా ఎదిరించ జూతురుగా  వెంకట్‌బిరావూ!”

“అన్నమయ హృదయం
వెన్నమయం అలమేలుమంగను వలచేత చే
కొన్న వెంకన్న మయం
ఎన్నెన్నో తేట మాటల పదకవితార్ణవమయం వెంకట్‌బిరావూ!”

“రోళ్ళూ రోకళ్ళని ఉండేవి
ఊళ్ళల్లో నిజంవాటికి నమూనాల్లా, మందు కూరి
రాళ్ళకు కొడితే దీపావళి రోజుల్లో చెవులు ది
బ్బిళ్ళు పడేలా మోగేవవి వింత వాసనతో పొగతో వెంకట్‌బిరావూ!”

నా కంద పద్యాలు (20-22)

ఏడు కొండల స్వామికి ఏడు కందాలు(5-7)

“అలమేలుమంగ పతివై
ఇల వైకుంఠమనిపించు ఈతిరుమల లో
వెలసితివి నీవు, కొలిచిన
వెలలేని వరములిడుదువు వేంకట దేవా!”

“తలచిన తోడనె, మదిలో
అలజడి రేపిన అలసట అధికము కాగా,
తలపడి తోడై నిలుతువు
వెలుగుల రేడా! నిరతము వేంకట దేవా!”

“ఒక్కనిగ తిరుగు వానికి
ఎక్కువగు ఇక్కట్లను ఇల ఎక్కడచగ నీ
వక్కరకు వత్తువు గదా
వేగిరముగ ఒక్కడవుగ వేంకట దేవా!”

నా కంద పద్యాలు (16-19)

ఏడు కొండల స్వామికి ఏడు కందాలు(1-4)

“కలియుగ దైవము నీవే
తలపుల తొలుతగ తలచెడు తండ్రివి నీవే
తెలుగు ప్రజలకు పెన్నిధి
విలలో తిరుమల వెలసిన వేంకట దేవా!”

“ఆపద మొక్కుల తోడను
నీపాదములను తలచుచు నినుచేరినచో
కాపాడెదవు కరుణ నీ
వేపాటి శ్రమము నీవు వేంకట దేవా!”

“అక్షరములేగా ఆస్తులు
కుక్షికి కుడువగను లేక కుములు కవులకై
అక్షయముగ అక్షరముల
బిక్షగ నిడుమయ తిరుమల వేంకట దేవా!”

“కలతలకు నెలవయి కడుజ
టిలమైన జనాటవీ కఠినవని నెటుపో
వలెనో తెలియని వేళల
వెలుగై నిలిచెదవు నీవె  వేంకట దేవా!”

బ్లాగ్ సందర్శకులకు, శ్రేయోభిలాషులకు అందరికీ

2011 నూతన సంవత్సర శుభాకాంక్షలు!

నా కంద పద్యాలు (12-15)

“సాయం కాలపు వేళల
హాయంటూ పిలుచు నా సహాధ్యాయుని తో
హాయిగ విహరించితి మా
హాయని విహాయసమున విహగముల వలెనే!”

“వాదన చేయుట తగదు ని
వేదనమే తగిన విధము విబుధులతో స
మ్మోదము పొందగ నది పెం
పొందెడు విధముగ మెలగుట పోడిమి వింటే!”

“నడచితి మా రోజులలో
వడివడిగా అడుగడుగును వైచుకొనుచు ఆ
మడ దూరము నైనా పో
వడమే విధియయిన రోజు పనికోసముగా!”

“లోగడ గడచిన రోజుల
ఆగడములు వేగడములు ఆమోదమగు దా
కేగా ఆపై వీపులు
మోగడములను విధములిక మొదలగు నవిగా!”

నా కంద పద్యాలు (8-11)

“నడచితి మెన్నో మారులు
అడుగడుగే వేసుకుంటు అలుపెరుగని పో
కడతో కడలికి అంచున
తడిగాలులలో తలపులతో సరదాగా!”

“వెన్నెలల రాత్రుల ఇసుక
తిన్నెలపై వాలి కనులు తెరిచే కన్నా
మెన్నెన్నో మంచి కలలు
అన్నిటినీ మరచి మురిసి అదియే పనిగా!”

“వేకువనే లేచి విధిగ
వాకిట తీర్చెదరు రంగవల్లికలు నమో
వాకములుగ అతివలు నీ
రాకకు సంకేతములుగ, రా…సంక్రాంతీ!”

“ఎచ్చటనున్నా వేప్పూ
పచ్చడిని ఉగాదినా డెపుడు తిను వాడూ
వెచ్చని కూరలు ఉన్నా
పచ్చడిపై తలపులు నిలుపు నతడు తెలుగౌ!”

(పై పద్యాల్లోని మొదటి, చివరి పద్యాల్లో యతి దోషాలు దొర్లాయి.  సవరణలకు, వివరణలకు చూడుడు ‘అభిప్రాయములు’)