పారడీ గారడీ (3)

“సురకాముకజనమనోహారిణీ వరూధినీ! ఆ
ధరామరవర వేషధారుని వంచనాకృతి నీ
ఎరుకకు రాదుకదా ఏనాటికీ! హా! ఎంతటి పా
మరకాంతనైన నీసాటి ఏమరుపాటు కందుమే?”

వరూధిని, అహల్య – వీరిరువురూ ఒకేరకమైన మోసానికి గురియైనవారు. తేడా ఒక్కటే. అహల్యకు అది వెంటనే తెలిసింది. వరూధినికి ఎప్పటికీ తెలియలేదు. తెలిసిన ఆమె పాషాణమైపోయి మిగిలింది. ఆమెను మామూలు మనిషిని చేయడానికి మళ్ళీ దేముడే వేరే అవతారంలో రావల్సివచ్చింది. తెలీని ఈమె ఏబాధా లేకుండా జీవనం సాగించింది. మనుజన్మానికి కూడా కారణమైంది. ఇందులో ఇంతకీ తెలియవచ్చిందేమిటి? తెలియడంలో సుఖముందా? తెలియకపోవడంలో సుఖముందా? జ్ఞానం మంచిదా? అజ్ఞానం మంచిదా? అజ్ఞానమే క్షేమదాయకమని అనిపిస్తుంది ఈ దృష్టాంతంలో! Ignorance always turns out to be a bliss! అంచేతా, అజ్ఞానమే ఆనందానికి హేతువనీ,

“కించిదవజ్ఞానమేగా విజ్ఞానసుజ్ఞానములన్
మించి ఎంచిజూడగను రంజత్కరమౌ నిలలోన్!”

అని ఎవరైనా ఆశువుగా తెలుగులో శ్లోకం చెప్తే, అలోచించాలి తప్ప చెప్పిన వారిపై ఒక్కపెట్టున ఎగిరిపడగూడదనుకుంటా!

శ్రీనాథుని దొరకకుండాపోయిన ‘శాలివాన సప్తశతి’ లోని ‘వారణసేయ దావగొనవా?’ పద్యపు నడకను దృష్టిలో పెట్టుకుని పారడీగా చెప్పిన పద్యం పైది. పారడీ రెండు రకాలుగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు. పద్యంగానీ, వచనంగానీ మాటల వొరవడికి ఇమిటేషనుగా చెప్పేది ఒకరకం. రెండోది, ఒక రచయితదో రచయిత్రిదో శైలికి, రచనలలోని overall philosophy కి పారడీగా చెప్పేది. సరిగ్గా చెప్తే, రెండూ అందగిస్తాయి. విశ్వనాథవారిని ‘పాషాణ పాక ప్రభో’ అని పిలవగలిగిన దమ్మున్న జరుక్ శాస్త్రి, ఆ ఒక్కమాటే అనేసి ఊరుకోలే! దానికి తగ్గట్టు ఇనపముక్క లాంటి ఒక పద్యంగూడా చెప్పాడు.  ఆ పద్యం ఇది:

“కించిత్ తిక్త కషాయ బాడబ రస క్షే పాతిరే కాతి వా
క్సంచార ప్రచయావకాశములలో కవ్యుద్ఘ! గండాశ్మముల్
చంచల్లీల నుదాత్త వాగ్గరిమతో సాధించి వేధించుమా!
పంచారించి ప్రవహ్లికావృతి కృతిన్ పాషాణ పాక ప్రభో!”

ఇంత దిట్టమైన పద్యంచెప్పగల ప్రతిభ వున్నవాడు కాబట్టే, జరుక్ శాస్త్రి ‘వాగుడు’ ని ఎంతెంతవారైనా సహించి ఊరుకున్నారు. విశ్వనాథవారి ఏఒక్క పద్యానికో ఇది పారడీ కాదు. స్థూలంగా వారు పద్యంచెప్పే రీతి మొత్తానికి పారడీ! ఇక పద్యానికి పద్యం, పాటకు పాట లేదా మాటకు మాటగా చెప్పే పారడీకి జరుక్ శాస్త్రిదే ఇంకో ఉదాహరణ శ్రీశ్రీ ‘సిందూరం రక్తచందనం కావాలోయ్’ గేయానికి పారడీ, బాగా ప్రసిధ్ధి చెందిందే:

“మాగాయా కందిపచ్చడీ, ఆవకాయా పెసరప్పడమూ
తెగిపోయిన పాతచెప్పులూ, పిచ్చాడి ప్రలాపం, కోపం
వైజాగ్ లో కారా కిళ్ళీ, సామానోయ్ సరదా పాటకు!”

ఈ గేయానికి ‘సరదా పాట!’ అని పేరు కూడా పెట్టాట్ట జరుక్ శాస్త్రి.

‘మొదట్నించీ అందులో ఏదో ఉందనిపిస్తూ, చివరికొచ్చే సరికి ఏమీ లేకుండా వేళ్ళాడబడిపోయేదే భావకవిత్వం అంటే!’ అని ఒక అభిప్రాయం చాలరోజులక్రిందట భావకవిత్వాన్ని నిరసించిన ఒకవర్గం కవులలో ఉండేదట. భావకవిత్వం అంటే తెలుగులో కృష్ణశాస్త్రి (కృష్ణశాస్త్రే) జ్ఞాపకానికొస్తాడు. ఆ కారణంచేత, భావకవిత్వం మీద విమర్శ కూడా మొదట కృష్ణశాస్త్రికే తగులుతున్నట్లుగా అనిపిస్తుంది. అనంతపంతుల రామలింగస్వామిగారని ఒక పారడీ కవి చెప్పిన ఈ క్రింది పద్యం కృష్ణశాస్త్రి కవిత్వాన్నే కాక భావకవిత్వ ధోరణిలో వెలువడిన కవిత్వానికంతటికీ ఒక హేళణ, ఒక చక్కటి పారడీ!

“రెండు కాకులు కూర్చుండె బండమీద;
ఒండెగిరి పోయె; అంత అందొండు మిగిలె
రెండవది పోయె; పిదప అందొండు లేదు
బండ మాత్రము పాప మందుండి పోయె!”

 

పారడీ గారడీ (2)

“కందం రాసినవాడే కవియని, ఏలాగొలాగ ఓ
కందాన్ని సాధించి నేనూ కవినై పోయానని
డెందంబును అమందానందకందళిత పరచుట
ఒక వెంట్రుక జుత్తవనటుల, కానిపనప్పా, కవి చౌటప్పా!”

కవి చౌడప్ప శతకంలో పద్యాలు చదివిన ఊపులో నా మిత్రుడు ఊదేసిన పద్యం ఇది. ఇందులో నాలుగో పాదంలో చివర  ‘చౌటప్పా’ మాట, చౌడప్పా కు బదులు పడ్డ అచ్చుతప్పేమీ కాదు. అది ‘చౌటప్పా’ నే!  ఏ వృత్తంలోనిదిరా ఇదీ’ అనడిగితే, ‘ఏ వృత్తమూ కాదు, స్వేఛ్ఛా వృత్తం, స్వయంగా నాదీ!’ అన్నాడు. అన్ని తెలివితేటలుండేవి అప్పట్లోనే వాడికి!

ఆ రోజుల్లో కంటే ఇంకొంత ముందు రోజుల్లో, అంటే మా చిన్నతనంలో, మా ఊళ్ళో ఒక పెద్దాయన ఉండేవాడు. ఆయన పెద్దగా చదువుకున్నట్లు కనిపించేవాడు కాదు గాని, అప్పుడప్పుడు తెలుగు సాహిత్యాన్ని గురించి, పద్యాల గురించి మాట్లాడుతుండేవాడు. ఆయన ఒకసారి అన్నాడూ, ‘ఒరేయ్ పిల్లల్లారా! తెలుగులో అసలైన సాహిత్యం తాటాకులమీద రాయబడి లేదురా!’ అని.  ‘మరేడ రాశారేందీ?’ అని మేం ఎగతాళిగా ఎదురు ప్రశ్నవేస్తే, ‘తొందరెందుకు, తెలుసుద్దిలే! సదుంకోండి సదుంకోండి!’ అని చెప్పి తప్పించుకునేవాడు. ఆ తరువాత చాణ్ణాళ్ళకి గాని అర్ధంగాలా, ఆయన చాటు పద్యాల గురించి, ‘చాటు’ (గోప్యంగా ఉంచదగ్గ విషయాలకు సంబంధించిన)  పద్యాల గురించి చెబుతూండేవాడని.

గ్రంధం దొరకకుండా, అందులోంచి ఒకటి రెండు పద్యాలు మాత్రమే, ఏ వ్యాకరణ గ్రంధాల్లోనో ఉదాహరింపబడి దొరికినవి మహా చెడ్డవి. అందులోనూ, ఆ దొరికిన ఒకటో రెండో పద్యాలు మాంఛి ఒడుపు గల్లవయితే, ఇక చెప్పనక్కరలేదా బాధ! దొరకని దాన్లో ఇంకా ఎన్నెన్ని చిత్రాలున్నాయో నని!

సర్వదేవుడని ఒక కవి ఉండేవాడట మనకు. ఈయనే కన్నడంలోని ‘పొన్నకవి’ అని కూడా ఒక మాట ప్రచారంలో ఉంది. ఈయన ‘ఆదిపురాణమ’ నే గ్రంధం రాశాడనీ, అందులోనివిగా ఇప్పుడు మనకు లభ్యమౌతున్నవి రెండే రెండు పద్యాలని ‘ప్రబంధ రత్నావళి’ లో ఉదాహరించినవాటి వలన తెలుస్తుంది. (సర్వదేవుడు రాసిన ఈ ‘ఆదిపురాణం’ కన్నడంలో పంపకవి రాసిన ఆదిపురాణానికి తెనిగింపు). ఈ రెండు పద్యాలలో ఒక పద్యం:

“సరసీజాత వియోగకారి పురయోషా వక్తృహృద్యా సుం
దరకాంతిం దఱిగించుబోయని మదిం దర్కించి దోషాకరున్
పురముద్దండ కరంబులెత్తి చఱవం బొత్తైన యట్లొప్పు ను
ధ్ధుర సౌధాగ్రనిబధ్ధకేతువు మహాందోలాభిరామంబుగన్.”

ఈ పద్యం నడకని ముచ్చటపడో ఏమో మరీ తీసుకుని ‘యోషా’ తో సహా దించి ముక్కు తిమ్మన గారు, ముక్కు పద్యం ఎలా చెప్పారో చూడండి:

“నానాసూన వితాన వాసనల నానందించు సారంగమే
లా నన్నొల్ల దటంచు గంధఫలి బల్ కాకన్ తపంబంది యో
షా నాసాకృతి తాల్చి సర్వ సుమన స్సౌరభ్య సంవాసియై
పూనెన్ ప్రేక్షణమాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్.”

పారడీ గారడీ (1)

“ఎప్పుడూ ఎవర్రెడీగా ఒక పారడీతో ఉండేవా
డొకడుండేవాడు; కవన్నవాడినెవ్వడినీ కవ్విం
చక నవ్వించక వదిలేవాడు కాడంటే కాడు; పే
రుకతడు జరుక్శాస్త్రి, పారడీ కళకు తాపీలేని మేస్త్రీ!”

చాన్నాళ్ళక్రితం ‘పారడీ’ కళను గురించి మాట్లాడుకుంటూండగా, నా మిత్రుడొకడు ఘబాల్న ఒక మాటనేశాడు, “ఇంకా వేరే పారడీ ఏంటీ, తెలుగుసాహిత్యం నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు పారడీనేగా!” అని. ఇలాంటి రిమార్క్సుకి తెలిసున్నవాళ్ళు గుంభనంగా గమ్మునే ఉంటారుగాని, తెలీనివాళ్ళూ, తెలిసీతెలియనివాళ్ళు ఇంకా మరీనూ, బాధపడిపోతున్నట్లుగానూ, గుండెలు పిండేసినంత పనైపోయినట్లుగానూ ఐపోయి, ఇట్టాంటి రిమార్క్స్ చేసినవ్యక్తిని అదోరకంగా చూస్తుండడం, మరింక జన్మలో మాట్లాడకపోతూండడం చేస్తుంటారు.

ఇంతకీ సంగతేమిటంటే, పారడీ కూడా ఒక కళే! దాన్నంత తేలికగా తీసిపారెయ్యడానికి వీల్లేనేలేదు. ఎందుకంటే, అందరూ పారడీ చెప్పలేరు గనక, ఒకవేళ చెప్పినా అంత తేలికగా మెప్పించనూ లేరు గనక. అసలుకవి కంటే, పారడీకవికే ఎక్కువ తెలివితేటలుండాలి. అసలుకవికి ఉన్న స్వేఛ్ఛ పారడీ కవికి ఉండదుగాక ఉండదు. అసలుకవిది ఆరుబయట వెన్నెల్లో కూర్చుని చుక్కల్ని లెక్కెడుతూనో, చందమామని చూస్తూనో
చెప్పే కవిత్వం అనుకుంటే, పారడీ కవిది బందిఖానాలో కూర్చుని కటకటాల వెనెకనుంచి చెప్పే కవిత్వం. ఇలా కటకటాల వెనకనుంచి కవిత్వం చెబుతూ, పైపెచ్చు నవ్వు పుట్టించేదిగా కూడా చెప్పాలి. ఇందువల్లే, పారడీకవికి అసలుకవి కంటే రెట్టింపు ప్రతిభా, విద్వత్తూ ఉండాలంటారు మరి.

తెలుగులో పారడీ అనంగానే, మొదటగా (చివరగానూ కూడ) జ్ఞాపకం వచ్చేది ఒకేఒక్క పేరు. ఆ ఒక్క పేరు జరుక్ శాస్త్రి. ‘రుక్కాయ్’ అని సన్నిహితవర్గాల్లో ఆప్యాయంగా పిలవబడిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. పారడీకి ఈయన పెట్టిందిపేరనీ, పద్యాలు (వచనాలు కూడ) ఈయన పేరు చెబితే గజగజ వణికిపోయేవనీ, కవిత్వాన్నే కాదు, వచనాన్ని కూడా అవలీలగా తిరగేసి తొడిగేసుకునేవాడనీ (శ్రీశ్రీ: ఆనంతం), ఈయన పారడీ చెబితే అసలుది ఎటో పోయి పారడీనే నిలిచిపోయేంతగా బాగుండేదనీ, ఈయన పారడీలు చదివినవాళ్ళకీ, ఈయన పారడీల గురించి
చదివినవాళ్ళకీ తెలుస్తుంది. జరుక్ వాగుడులో ఒక వైభవం ఉండేదనీ, తల్లావఝుల శివశంకరశాస్త్రి వంటి హేమాహేమీలు కూడా జలసూత్రం నోటిదురుసుతనానికి ఝడిసే వాళ్ళనీ (శ్రీశ్రీ: ఆనంతం), శివశంకరశాస్త్రిగారిని ‘పీఠికా పరమేశ్వరుడ’ న్నా, విశ్వనాథవారిని ‘పాషాణపాక ప్రభో’ అన్నా అది ‘రుక్కాయ్’ కే చెల్లిందనీ చెబుతారు. అయితే, ఎంత ఇదయితే మాత్రం, మరీఅంత అన్యాయంగా ముందూ వెనుకా అసలంటూ ఎవరూ లేకుండా మొత్తం ఆయనే అంటే అన్యాయం గాదూ? అని ఎవరయినా అంటే, ఆయన వెనుక సంగతి (అంటే ఆయన పుట్టిన తరువాత సంగతి) యేమో నాకు తెలియదుగాని, ఆయన పుట్టక ముందు సంగతయితే మటుకు మరీ ఇంత అధ్వాన్నంగా మాత్రం ఉండేది కాదనీ, తెలుగు కవిత్వంలో అప్పుడప్పూడూ పారడీ సంగతులనదగినవి తెలుగుకవుల పద్యాల్లో దర్శనమిస్తూ ఉండేవే అనీ మాత్రం చెప్పగలను.

ఉదాహరణకి, ఈ రెండు పద్యాలూ చూడండి:

వీరెవరయ్య? ద్రుపదమ
హారాజులే? ఇట్లు కృపణులై పట్టువడన్
వీరికి వలసెనె? ఇపుడు మ
హారాజ్య మదాంధకార మది వాసె నొకో?                  

వీరెవ్వరు? శ్రీకృష్ణులు
గారా? వీరెన్నడును వెన్నగానరట కదా?
చోరత్వం బించుకయును
నేరరట? ధరిత్రి నిట్టి నియతులు గలరే?                    

మొదటిది నన్నయ భారతం లోనిది, రెండవది పోతన భాగవతం లోనిది.

వివిధాలు (2)

మన్మధుడు దేవతల కోరిక మేరకు పార్వతిపై శివునికి ప్రేమ కలిగించడానికి ప్రయత్నించి ఆయన కోపాగ్నికి ఆహుతి అవుతాడు.  పతిని కోల్పోయిన రతీ దేవి తప్పు సైరించి పతి బిక్ష పెట్టమని శివుని కోరుకోగా, ఆయన దయతలచి మన్మధుడు ఇతరులకు అదృశ్య రూపంలో ఉండి, రతీ దేవికి మాత్రం దృగ్గోచర మయేటట్లు వరం ఇస్తాడు. ఆ కారణం చేత మన్మధుడు ఒక్క రతీదేవికి తప్ప మిగిలిన వారికి అదృశ్య రూపుడు. కనపడకుండా పెట్టాల్సిన బాధలు పెడుతూంటాడు.

*****

లక్ష్మీ నారాయణులు జలవాసులు. పాల సముద్రం వారి విడిది. వారు వర్ష ఋతువునకు ముందుగా వచ్చు ఆషాఢ శుధ్ధ ఏకాదశి నాడు పాల సముద్రము నందు శయనించి, శరత్కాలము నందు వచ్చు కార్తీక శుధ్ధ ఏకాదశి నాడు మేల్కొందురని ప్రాచీన బారతీయ సాంప్రదాయ విజ్ఞానుల వివరణ. ఈ కారణం చేతనే ఆషాఢ శుధ్ధ ఏకాదశి “శయనైకాదశి” యనియు, కార్తీక శుధ్ధ ఏకాదశి “ఉత్థానైకాదశి” యనియు వ్యవహరింప బడుతూ ఉంది.

*****

మహా భారత కథలో ముఖ్య పాత్రలు కౌరవ పాండవులునూ, వారికి గురు స్థానీయులైన భీష్మ, ద్రోణ, కృపాచార్య అశ్వథ్థామలును, దృతరాష్ట్రుడును అయి ఉండగా, “కర్ణు తల భారతం”  అనే నానుడి తెలుగు నాట ప్రసిధ్ధమై ఉంది.  భారత రణాన్ని కౌరవుల పక్షాన భీష్ముడు పది రోజులు, ద్రోణుడు ఐదు రోజులూ  నడుపగా కర్ణుడు రెండు రోజులు మాత్రమే నడిపాడు. అయినప్పటికీ, తిక్కన రచిత ఆంధ్ర భారతంలో కర్ణ పర్వానికి ఉన్న ప్రాముఖ్యం మిగతా వాటికి లేదని పెద్దల మాట.

నేను, యాజ్ఞసేనిని! …(9)

(8)

గంగనూ, హిమాలయాలనూ దాటి ఆవల పీఠభూమిని చేరుకుని, ఒకరి వెనుకాల ఒకరంగా, ఆరుగురమూ కొన్ని నెలల పాటు నడిచాం. నడిచి నడిచి, చివరకు ఒక రోజు, ఇక నడిచే సత్తువ లేక అందరికంటే ముందు నేను కుప్పకూలి పోయాను. నా తరువాత వరుసగా భీమార్జున నకుల సహదేవులూ పడి పోయారు.  ఒక్క ధర్మరాజు, ఆయన వెనుక అనుసరిస్తూ ఒక శునకమూ ముందుకు సాగిపోయారు.

పడిపోయినా నేనింకా స్పృహలోనే ఉన్నాను.  కళ్ళు మూసుకు పోతున్నాయి.  శరీరంలో సత్తువ పూర్తిగా నశించి, మరణానికి అతి చేరువలో ఉన్నట్లు నాకు అర్ధమైంది.  ఆ స్థితిలో, నాకు కొంచెం దూరంలో ఏదో ఈడ్చుకు వస్తున్నట్లు శబ్దం, ఆ అనంత నిశ్శబ్దంలో వినిపించి నన్ను భయ కంపితురాలిని చేసింది. ఆ శబ్దం అంతకంతకూ చేరువై, చివరకు “నేను, భీముడను” అని చెప్పే వరకూ నా శరీరం కంపిస్తూనే ఉంది. భీముని ఆ మాటతో ప్రాణం కాస్తంత పదిల పడి, కనులు తెరిచి చూసే ప్రయత్నం చేశాను. కుదర లేదు. “చూశావా…అర్జున, నకుల సహదేవులు మువ్వురూ….” అన్నాడు భీముడు.  అర్ధమైంది. “అన్న ధర్మజుడు ఇంకా నడుస్తూ వెళ్ళి పోయాడు. నీవూ, నేనూ ఇలా మిగిలాం. బాధగా ఉన్నదా పాంచాలీ?” అన్నాడు భీముడు.

“తప్పని ఈ పరిస్థితికి బాధెందుకు? అయినా, నీవు పక్కన ఉండగా నాకు బాధేమిటి?” కష్టం మీద గొంతు పెగుల్చుకుని అన్నాను. “అవును, నీ కోసం నేనేమైనా చేస్తాను. చెప్పు, ఇప్పుడు ఏమి చెయ్యమంటావ్?” అడిగాడు భీముడు.  నేను నవ్వే ప్రయత్నం చేస్తూ అన్నాను “నాకు తెలుసు. నా కోసం నువ్వేమైనా చేస్తావు.  భూమికి చెందిన పురుషుడివి నువ్వు.  భూమికి చెందిన పడతిని నేను. మన ఇరువురి లక్షణాలూ ఒకటే. అందుచేత మిగిలిన నలుగురి కంటే నీకే నేను బాగా అర్ధమయ్యాను. నీలాంటి పురుషుడిని పుత్రునిగా కన్న స్త్రీ, పతినిగా పొందిన  స్త్రీ ఇద్దరూ సుఖ పడతారు. మన ఆరుగురకూ మరో జన్మంటూ ఉంటే, ఆ జన్మలో నువ్వు అగ్రజుడిగా పుట్టు. నీ నీడలో మనం అందరం సుఖంగా ఉందాం!”.

ఇవి నా ఆఖరు మాటలు. ఆ తరువాత…

(సమాప్తం)

నేను, యాజ్ఞసేనిని! …(8)

(7)

కీచకుని వధించ గలిగిన యోధుడు భీముడే అయిఉంటాడని కౌరవులు ఊహించారు. అజ్ఞాత వాసాన్ని భగ్నం చేయాలన్న కోరికతో విరటుని పైకి పెద్ద యెత్తున దండెత్తి వచ్చారు. ధర్మజుని అనుజ్ఞ మేరకు అర్జునుడు గాండీవ ధారియై కౌరవ సేనతో తలపడి తరిమి తరిమి కొట్టాడు. విరటునికి విజయం లభించింది. మా అజ్ఞాత వాసం అనాటితో ముగియడంతో, పాండవుల గుట్టు పసిగట్టా మనుకున్న కౌరువుల ఆశ నిరాశే అయ్యింది. అజ్ఞాత వాసం ముగిసి విజయోత్సాహంతో మేము ఇంటి ముఖం పట్టాము.

పదమూడేండ్లు రాజ్యాధికారానికి దూరమైన ధర్మజుడు తిరిగి కృష్ణుని దృతరాష్ట్రుని వద్దకు రాయబారిగా పంపడం, అర్ధ రాజ్యం కాదు, అయిదూళ్ళు కాదు, కనీసం సూదిమొన మోపగలిగినంత భూమిని కూడా పాండవులకు ఇవ్వనని దుర్యోధనుడు అనడం, యుధ్ధం తప్పనిసరి అవడం, పద్దెనిమిది రోజులు భీకరంగా జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో ఇరు పక్షాలూ బాగా నష్ట పోవడం, భీముడు అన్నట్లుగానే తన ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవడం, అర్జునుని చేతిలో కర్ణుడు నిహతుడవడం, అన్నీ అయి చివరికి రాజ్యాధికారం పాండవులకు దక్కడం జరిగింది.

ధర్మరాజు  సింహాసనం అధిష్టించే నాటికి రాచ నగరు అంతా బోసి పోయి ఉంది. అందరూ పోయారు. ఎక్కడ జూచినా రోదనలు. ఒక్క యుయుత్సుని తప్ప మిగిలిన నూరుగురు కొడుకులనూ  పోగొట్టుకుని గాంధారి ఏడ్చింది. నా అయిదుగురు పుత్రులనూ పోగొట్టుకుని నేను ఏడ్చాను. అభిమన్యుని పోగొట్టుకుని సుభద్ర ఏడ్చింది. మాకు లాగానే ఇంకా ఎందరో స్త్రీలు తమ తమ భర్తలను, పుత్రులను పోగొట్టుకుని రోదించారు. తప్పదు. యుధ్ధ మంటే విజితులకూ, పరాజితులకూ చివరకు మిగిలేది దుఃఖమే!

యుధ్ధం ముగిసి రాజ్యాధికారం పాండవుల చేతికొచ్చిన కొద్ది కాలానికే, ఊహించని విధంగా కృష్ణుడు ఒక విషాదకర పరిస్థితిలో మరణించాడు. కృష్ణుని మరణం ధర్మరాజును సంకటంలో పడవేసింది. ఆలోచించి, ఆలోచించి చివరకు రాజ్యాధికారాన్ని అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తునకు అప్పగించి, మేము అంతిమ యాత్రకు సమాయత్త మయ్యాం!

****

నేను, యాజ్ఞసేనిని! …(7)

(6)

వ్యాసుల వారికి కూడా చిక్కని నా అంతరంగ చిత్రాన్ని ఆవిష్కరించి చూపెట్టిన సహృదయుడు నన్నయ భట్టు. యోగక్షేమాలు విచారించి వెళ్దామని వచ్చిన కృష్ణునితో నా బాధను వెళ్లబోసుకున్న సందర్భంలో నా చేతనే చెప్పించిన మాటలు నా దృష్టికోణాన్ని స్పష్టంగా చూపెడతాయి.

****

ద్రౌపది: (నిర్వేదంగానూ, బాధ గానూ) అన్నా! పార్ధివ ప్రభుడైన పాండు మహీపతి కోడలినై యుండి, యుధ్ధ కుశలురైన పాండు తనూజులకు భార్యనై యుండి, పూజ్యుడవైన నీకు చెల్లెలినై యుండి, అధిక శక్తి సంపన్నుడైన దృష్టద్యుమ్నునికి తోబుట్టువునై యుండి, దృతరాష్ట్రుని ముద్దుల కొడుకైన దుశ్శాసనుని చేత నిండు సభలో తలపట్టి ఈడ్వబడి, ఆ పాపకర్ముని చేత పరిధాన మొలవగాబడి, దారుణమైన పరాభవాన్ని అనుభవించాను. నా ఐదుగురు భర్తలూ చేష్టలుడిగి చూస్తూ ఊరుకున్నారు. భీష్మ ద్రోణాది కురువృధ్ధ బంధు జనులనేకులుండీ ఒక్కరూ నోరు మెదపలేదు.  అదంతా ఒక ఎత్తు.  ఆ సూత పుత్రుడైన కర్ణుని నగవు ఒక ఎత్తు.  లోక గర్హితుడైన దుశ్శాసనుని చేష్ట కంటే కర్ణుని నవ్వు చిచ్చులా నా మనస్సును మాటిమాటికీ దహించి వేస్తూన్నది.  నా ఈ బాధ ఎప్పటికి తీరేను? నాలో రగిలిన ఈ జ్వాల ఎప్పటికి చల్లారేను?

కృష్ణుడు: దుఃఖించకు సోదరీ! నీ పగ తీరుతుంది.  నీ మనస్తాపం చల్లారుతుంది. పాండవుల ఇల్లాలుగా, రాజ్ఞిగా నిన్ను గౌరవించాల్సిన వారూ, ఆదరించాల్సిన వారూ విజ్ఞత కోల్పోయి నిన్ను పరాభవించడం, పరిహసించడం చూశావు. కొన్నాళ్ళు ఓపిక పట్టు.  భర్తలను పోగొట్టుకుని వారి సతులు ఒకరొకరుగా సాయం సంధ్య వేళలలో హృదయ విదారకంగా  రోదించడం చూద్దువుగాని!

****

ఇలా రోజులు గడిచి, పన్నెండేండ్ల వనవాసం పూర్తయింది.  పదమూడవ యేడు అజ్ఞాత వాసం కోసం మారు వేషాలతో విరటుని కోలువు చేరాము.  కీచకుని రంగ ప్రవేశం దాక రోజులు చాలా హాయిగా గడిచి పోయాయి. కీచకుని ఆగమనం పరిస్థితులను మార్చి వేసింది.  నాకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి.  చాలా నాళ్ళు ఓపిక పట్టాను.  బెదిరించి కూడా చూశాను.  కీచకుడు లెఖ్ఖ పెట్ట లేదు.  ఫలితం అనుభవించాడు, మూర్ఖుడు. ఒకనాటి రాత్రి జరిగిన ద్వంద్వ యుధ్ధంలో భీముని చేత వధించబడి తెల్లవారేసరికి ఒక పెద్ద మాంసపు ముద్దగా మిగిలాడు. కీచకునితో పాటు నన్నూ దహనం చేయాలని ప్రయత్నించిన అతని సోదరుల నుండి మళ్ళీ భీముడే నన్ను కాపాడాడు.

నేను, యాజ్ఞసేనిని! …(6)

(5)

ఒకటా, రెండా? పన్నెండేండ్ల వనవాసంలో ఎంతో తీరికి దొరికేది.  తీరిక దొరికిన సమయాల్లో అలోచనలు గతం లోనికి మళ్ళేవి.  గతం తలుచుకున్నప్పుడల్లా శరీరంలో రక్తం పగతో పరవళ్ళు తొక్కేది.  భీముడు చేసిన ప్రతిజ్ఞలు చెల్లించుకునే కాలం ఎప్పటికి వస్తుంది? దుశ్శాసనుని ఱొమ్ము రుధిరంతో నా కురులెప్పుడు తడుస్తాయి? అర్జునుని చేతిలో కర్ణుడు నిహతుడయ్యాడన్న వార్త నా చెవిన పడే రోజు ఎప్పుడొస్తుంది?…ఇలా సాగేవి ఆలోచనలు. కాలం నత్త నడక నడుస్తున్నట్లుగా ఉండేది. రోజు లెంతకీ దొర్లేవి కావు. పగ తీరే రోజు కను  చూపు మేరలో కనుపించక, దుఃఖితనై ఉన్న నన్ను భీముడు ఓదార్చేవాడు. భీముని ఓదార్పు మాటలు నాకు కొంత ఉపశమనాన్ని ఇచ్చేవి. నా మనస్తాపాన్ని కొంత చల్లార్చేవి.

స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించిన అనాటి మేటి విలుకాడైన అర్జునుని నేను మనసారా వరించి ఎంతగానో ప్రేమించాను.  అలాగే నేనూ అర్జునుని ప్రేమకు పాత్రురాల నవుతాననుకున్నాను. కానీ, నన్ను పణంగా పెట్టి జూదమాడిన ధర్మజుని చేతులు కాల్చుతానన్న భీముని వారించాడు అర్జునుడు. నిండు సభలో నన్ను జుట్టు పట్టుకుని ఈడ్చి దుశ్శాసనుడు పరాభవిస్తుంటే తల వంచుకుని నిలుచుండిపోయాడే తప్ప నోరు తెరిచి ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడలేదు అర్జునుడు.  మాట్లాడిన వ్యక్తి భీముడు.  మాట్లాడడం కాదు, కంఠనాళాలు బ్రద్దలయేలా అరిచి ప్రళయం సృష్టించ బోయాడు.  దుర్యోధనుడు తన తొడ చూపించి నన్ను వచ్చి కూర్చోమని పిలిచి నపుడూ అర్జునుడు మాట్లాడలేదు.

దుర్యోధనుని తొడలు విరగ కొట్టి వధిస్తానని యుధ్ధానికి అప్పటికప్పుడే సిధ్ధమై తన గదా దండాన్ని అందుకోబోయిన భీముని చూపుల్తోనే వారించిన వ్యక్తి ధర్మజుడు.  ఇవన్నీ తలుచుకున్నప్పుడల్లా, భీముడు నన్ను ప్రేమించినంతగా నేనెంతగానో ఆశపడి ప్రేమించిన అర్జునుడు నన్ను ప్రేమించ లేదని పిస్తుంది. తన భార్యగా నాకు దక్కాల్సిన గౌరవం దక్కనప్పుడల్లా భీముడు కోపంతో బుసలు కొట్టే వాడు. మిగతా నలుగురిలో నాకు ఆ లక్షణం కనపడేది కాదు. అలాంటి సందర్భాల్లో అర్జునుని మౌనం నన్ను మాటలతో చెప్పలేనంత మనస్తాపానికి గురిచేసేది. కర్ణుడు నిండు సభలో నన్ను గురించి చాలా అవమానకరంగా మాట్లాడి పరిహసించి నపుడు కూడా అర్జునుడు పెదవి కదపక పోవడం నన్ను చాలా కాలం క్షోభ పెట్టింది.  విలు విద్యా కౌశలంలో అర్జునునికి దీటైన విలుకాడుగా అందరి చేతా అంగీకరింపబడిన వ్యక్తి కర్ణుడు. కళ్లెదురుగా భార్యను పరాభవిస్తుంటే చూస్తూ ఊరుకున్న చేతకాని ఐదురుగురు భర్త లెందుకని నన్ను అవహేళణ చేశాడు. దుర్యోధనుని వంక చూపెడుతూ, ఇకనైనా ఆలిని పణంగా పెట్టి జూదం ఆడని వ్యక్తిని ఒక్కడిని చూసుకోమని హాస్యమాడాడు. కర్ణుని నవ్వుకు
అడ్డుకట్ట  వేయగలిగిన ఒకే ఒక వ్యక్తి, అర్జునుని మాట, ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట  అక్కడ లేకపోవడం నన్ను హింస పెట్టేది. ఇతడా నన్ను గెలుచుకున్నది? ఇతడినా నేను వరించినది? అర్జునుని ఇంత నిర్లిప్తతకు నేను చేసిన పాపం ఏమిటి? ఎంత ఆలోచించినా అర్ధమయేది కాదు. అందరిలోకీ చిన్నవాడయినా, ధైర్యంగా, చొరవ చేసుకుని, వికర్ణుడు చేయ బోయిన ధర్మ నిర్ణయాన్ని అడ్డుకుంటున్న కర్ణుని, అప్పుడే అర్జునుడు కలిగజేసుకుని ‘ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు ఇందులో తలదూర్చవద్దు, అదనంగా ఇంకొక్క మాట మాట్లాడినా నీ నాలుక తెగ గోస్తా’ నని తెగేసి చెప్పున్నట్లయితే, కర్ణుడు మారు మాట్లాడే ధైర్యం చేసే వాడా? అంత హేయంగా మాట్లాడి అవహేళణ చేయగలిగే వాడా? ఆ కారణంగానే, నా కలతలన్నిటికీ అర్జునుని మౌనమే మూలకారణంగా నేను అనుకుంటూ ఉండే దానిని. కర్ణుని నవ్వు మాత్రం సర్వకాల సర్వావస్థల లోనూ నన్ను వెంటాడుతూనే ఉండేది. చేతనను ఒక పట్టాన వదిలేది కాదు.  ఎప్పుడూ ఏదో ఒక వైపు నుంచి సన్నగా వినిపిస్తూ, పరిహసిస్తూ, నన్ను కలతకు గురి చేస్తూ ఉండేది. కర్ణుని నవ్వు పెట్టే క్షోభ నుంచి నాకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది?

నా ఈ అవ్యక్త మనస్తాపాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్ధం చేసుకున్న వ్యక్తి నన్నయ భట్టారకుడు.

****

నేను, యాజ్ఞసేనిని! …(5)

(4)

భీముడు: (ఉగ్ర రూపం దాల్చి) కురు వృధ్ధులు, గురు, వృధ్ధ బాంధవులు ఇంతమంది చూస్తుండగా, ఒళ్ళు మద మెక్కి, ద్రౌపదిని ఇలా పరాభవించిన ఈ పశువు దుశ్శాసనుని, లోక భీకరంగా వధించి, కొండలా బలిసి ఉన్న వాడి వక్షాన్ని చీల్చి అందుండి పారే వేడి రక్తాన్ని తాగుతాను.  అలా చేయలేని నాడు పితృ పితామహుల గతికి తప్పిన వాడి నౌతాను!

కర్ణుడు: (వికటంగా నవ్వుతూ) వింటున్నావా సుయోధనా….భీముని వీర వచనాలు? దుశ్శాసనుని వధించి రొమ్ము చీల్చి రక్తం తాగుతాడట! ఎంత శౌర్యం? (రోషంగా) ఈ కర్ణుడు జీవితుడై ఉండగానే? (తిరిగి హేళణగా) పైగా, అలా చేయలేని నాడు పితృ పితామహుల గతికి తప్పినవాడౌ తాడట! చివరికి అదే నిజమౌతుంది భీమసేనా, సిధ్ధపడు!  (ద్రౌపది వైపు తిరిగి, ఆమె నుద్దేశ్యించి) పాంచాలీ, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఐదురుగురు భర్తలున్నారు నీకు. అయినా ఏం ప్రయోజనం? చేతగాని ఐదుగురు భర్తల కన్నా, పౌరుషవంతుడైన ఒక్క భర్త మేలు! ఇప్పటికైనా జూదంలో ఆలిని పణంగా పెట్టి ఓడిపోని భర్తను ఒక్కడిని తగిన వానిని చూసుకో!

దుర్యోధనుడు: భేష్ కర్ణా భేష్! భలేగా చెప్పావ్! (ద్రౌపది వైపు చూస్తూ) నా ప్రియమైన మిత్రుడు కర్ణుడు చెప్పినట్లుగా చెయ్యి పాంచాలీ. రా…నువ్వు కూర్చోవడానికి సరిపోయే పీఠంలా నా బలమైన తొడ సిధ్ధంగా ఉంది. రా, వచ్చి కూర్చో!

****

భూ రాజ్య సంపదల బలంతో, ఒళ్ళు మదమెక్కి, ఉచ్ఛనీచాలు మరచి ఏ తొడనైతే ఎక్కి కూర్చోమని నన్ను దుర్యోధనుడు ఆహ్వానించాడో ఆ తొడను రణంలో తన గదాఘాతంతో విరగ గొడతానని శపథం చేసి, ఆయుధం చేబూన బోతూ అనుజ్ఞ కోసం ధర్మజుని వైపు దృష్టి సారించి నిలబడ్డ భీముని, కోప తాపాలు ప్రదిర్శించడానికి ఇది తరుణం కాదని భీష్మ, విదుర, ద్రోణాదులు సముదాయించి అపారు.

సభలో ఆ రోజు జరిగిందంతా విదురుని ద్వారా తెలుసుకున్న దృతరాష్ట్రులవారు బాధపడి, నన్ను దగ్గరకు పిలిపించుకుని ఇచ్చిన వరాల సహాయంతో పాండవులను వారి ఆయుధాలతో సహా దాస్య విముక్తులను చేసుకున్నాను.

రెండవ మారు ఆడిన జూదంలో కూడా ధర్మజుడు ఓడిపోయాడు.  ఫలితంగా మాకు పండ్రెండేండ్లు వనవాసం, పదమూడవ ఏడు అజ్ఞాత వాసం ప్రాప్తించింది. కట్టు బట్టలతో అడవుల పాలయ్యాం!


నేను, యాజ్ఞసేనిని! …(4)

(3)

నిజానికి దుర్యోధనుని మదిలో లేని ఆలోచనను రేపెట్టిన వాడు కర్ణుడు ఈ సందర్భంలో. దుర్యోధనుడు మూర్ఖుడు.  పరమ దురభిమాని.  అతని అంతరంగాన్ని కర్ణుడు చదవ గలిగినంతగా మరే వ్యక్తీ చదవ లేకపోయాడన్నది నిజం. ఒక్కొకప్పుడు దుర్యోధనుని దురభిమానానికి ఏది సంతృప్తి నిస్తుందో దుర్యోధనుని కంటె కర్ణుడే ముందుగా గ్రహించి అతనికి తెలియ జేశాడేమో అనిపిస్తుంటుంది.

మయసభలో మయుడి నిర్మాణ చాతురికి దృష్టాంతాలుగా నిలిచి ఉన్న అద్భుతాలను తిలకిస్తూ మైమరచి ఉన్న స్థితిలో ఊహించని రీతిలో పరాభవం ఎదురైంది దుర్యోధనునికి.  నీటి మడుగును నేలగా భ్రమసి అందులో పడిపోయాడు.  వొంటి మీదునున్న వస్త్రాలన్నీ తడిసిపోయాయి.  నవ్వుల పాలయ్యాడు.  అవమానంతో దహించుకు పోయుంటాయి అతని ఆత్మ, శరీరం.  విషయం తెలుసుకున్న ధర్మజుడు నూతన వస్త్రాలు పంపించాడు కింకరుల ద్వారా.  వాటిని అందుకుని తన శరీరం మీద తడిసిన వస్త్రాల స్థానే వాటిని మార్చుకుంటుంనప్పుడు దుర్యోధనుని దురభిమాన చిత్తంలో రగిలిన కౄరమైన అవమాన జ్వాల ఏ మాట వినడంతో మరొక సారి ప్రజ్వలితమై అతనిని పశువుగా మారుస్తుందో సరిగ్గా ఆ మాటనే వాడాడు కర్ణుడు ఈ సందర్భంలో.  అదే ‘విగత వస్త్ర’ అన్న మాట.  కర్ణుడు ఊహించినట్లు గానే ఆ మాట దుర్యోధనునికి మయసభలో తాను పొందిన అవమానాన్ని స్ఫురణకు తెచ్చింది.  బదులు తీర్చుకునే అవకాశాన్ని కల్పించింది కూడా.  అందుకు కర్ణుడిని అభినందిస్తూ, తమ్ముడైన దుశ్వాసనుని పురమాయించాడు, నన్నూ నా భర్త లైన పాండవు లైదుగురి వస్త్రాలనూ ఊడ్చేయమని.  లజ్జితులైన పాండవులు తమంత తామే ధరించి ఉన్న వస్త్రాలను విడిచి తల లొంచుకుని నిలబడ్డారు, అర్ధ నగ్న శరీరాలతో నిండు సభలో. మానవ లక్షణాలన్నీ మరుగున పడిపోగా పశువులా మారి వికటాట్టహాసం చేస్తూ నా వైపు అడుగులు వేశాడు దుశ్వాసనుడు.  నేను కంపించి పోయాను.  జరగబోయే దారుణాన్ని ఊహించుకున్న నా మనసు వశం తప్పింది.  అప్పటికే దుశ్శాసనుని పిడికిలి నా భుజం మీది చీర చెరగును ఒడిసి పట్టుకుంది. చేసేదేమీ లేక చేతులు జోడించి భగవంతుని ప్రార్ధిస్తూ శిలలా మారి పోయాను.

ఆ తరువాత ఏమైందో నాకు తెలియదు. భారతం కల్పిత కథ కాదు.  రాజ్యాధికారం కోసం అన్నదమ్ముల సంతానం మధ్య జరిగిన సుదీర్ఘ పోరాటం. ఇందులో కల్పనలకూ, అద్భుతాలుకూ తావుండ కూడదు. అయినా  ఒక అద్భుతం జరిగి నేనా దారుణాన్నుంచి బయట పడ్డట్లుగా చూపించింది భారతం. భారత రచనలో వ్యాస మహర్షి ఈ సన్నివేశాన్నెందుకు ఇలా అస్పష్టంగా వదిలి వేశాడో అర్ధం కాదు.

ఏదేమైనా, కర్ణుడు కోరుకున్నట్లు, దుర్యోధనుడు శాసించినట్లు నేను విగత వస్త్రను కాలేదు. నిండు సభలో దుశ్శాసనుడు నాకు చేయబోయిన పరవాన్ని చూసి సహించ లేక ఉగ్రుడై భీముడు సభలో అందరి ఎదుటా ప్రతిజ్ఞ చేశాడు.

****