తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

ఆంధ్రుల లేదా తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర గురించిన ఈ notes లో తొలి వెయ్యేళ్ళు అంటే క్రీస్తు శకాబ్దం మొదలుకొని ఆపై వెయ్యేళ్ళదాకా అని అనుకున్నది.
అయితే, ఇది నిజానికి ఇంకో రెండువందల పాతికేళ్ళు ముందుకు వెళ్ళి అదనంగా మరో రెండువందలపాతికేళ్ళు కలిసి మొత్తం పన్నెందువందల పాతిక
సంవత్సరాలవుతుంది. దీనికి కారణం, శాతవాహనుల పరిపాలనతో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర మొదలవుతుంది/మొదలుపెట్టుకోవాలనుకుంటే,
శాతవాహనుల పాలన క్రీ.పూ.225 లో మొదలై క్రీ.శ.225 తో అంతమయిందని చరిత్రకారులంటారు గాబట్టి. శాతవాహనుల పరిపాలనలో తెలుగువాళ్ళ
సాంఘిక చరిత్రకు కూడా క్రీ.పూ.225 నుంచి ఆధారలు దొరకాలి.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి. ఆంధ్ర భృత్యులని మాటకూడా ఉంది. దీనిమీద లేచినవివాదం ఇంకా ఎటూ తెలకుండానూ ఉంది. ఆంధ్రులైన భృత్యులా?
ఆంధ్రులకు భృత్యులా? ఆంధ్రులు వేరే రాజవంశం వారై, వారికి శాతవాహనులు సామంతరాజులా? అని మీమాంస. అదెలా ఉన్నా, నాలుగున్నర శతాబ్దాల
వీరి పరిపాలన మాత్రం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లిందని చెప్పుకోవాలి. నాలుగున్నర శతాబ్దాలు ఒకే రాజవంశం ఒక భూభాగాన్ని నిరాటంకంగా పరిపాలించడం
అంత సులభంగా జరిగే పని కాదు. అయినా శాతవాహనుల విషయంలో అది సాధ్యమైంది. తరానికి 25 సంవత్సరాల చొప్పున (చరిత్ర పరిశోధనలో తరానికి 25
సం.గా వేసుకుని లెక్కిస్తారని చదివాను) నాలుగున్నర శతాబ్దాలకు 18 తరాలవుతుంది. అంటే తరం నుంచి తరానికి సాగే జ్ఞాపకాల ప్రవాహంలో
పరిస్థితులలోనూ పరిపాలకులకు చెందిన విషయాలలోనూ ఏవిధమైన మార్పూ లేకుండా 18 తరాలు గడవడం, జ్ఞాపకాల, అనుభవాల ప్రవాహం నిరాటంకంగా
కొనసాగడం అన్నది చరిత్రలో ఒక అరుదైన సందర్భం, ఒక luxury గానే చెప్పుకోవాలి. ఆ సందర్భాన్ని, ఆ luxury ని  శాతవాహనుల పరిపాలనలో
అప్పటి ప్రజలు అనుభవించారు.

ఈ సుఖాన్ని అనుభవించిన వాళ్ళలో తెలుగు మాతృభాషగా ఉండిన తెలుగువాళ్ళూ ఉన్నారు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అప్పుడు, అంటే
శాతవాహనుల పరిపాలనా కాలం నాటికి, ఆంధ్రులు తెలుగువాళ్ళూ ఒక్కటి కాదా? అని. కాదనే నేను అనుకుంటాను. అయితే గనక, ఆంధ్రులైన
శాతవాహనులు తమ మాతృభాష అయిన తెలుగును వదిలి ప్రాకృతాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు? శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజబాష, ప్రజల భాష
కూడాను! ప్రాకృతంలోనే కదా గాథాసప్తశతిలోని గాథలన్ని ఉన్నాయి! అయితే, అప్పటికి తెలుగింకా పూర్తిగా పరిణతిచెందిన భాషగా కాకుండానన్నా
ఉండిఉండాలి. అలా అనుకోవడానికీ వీలు లేదు.  కారణం, గాథాసప్తశతిలో అక్కడక్కడా కనుపించే అత్తా (అత్త), అద్దాఏ (అద్దం) లాంటి కొన్ని తెలుగు
పదాలు, తెలుగు అప్పటికే పూర్తిగా పరిణతి చెందిన భాషగా ఉండినదనీ, ఎంత పరిణతి అంటే, అందులోని కొన్ని మాటలు వేరే భాషలోకి వెళ్ళగలిగేంత పరిణతి
చెందిన భాషగా శాతవాహనుల కాలంనాటికే ఉండినదనీ, పూజ్యులు కీ.శే.తిరుమల రామచంద్ర గారు తమ వ్యాసాలలో ఇప్పటికే నిరూపించి ఉన్నారు కాబట్టి!

అదలా ఉంచితే, “ఆంధ్రశ్చ బహువః” అనే మాట ఒకటి ఉంది. దీని అర్ధం ఆంధ్రులు పలువురు అని. అంటే, పలు జాతుల ప్రజలు కలిసి ఆంధ్రులు
అయ్యారని ఇది సూచిస్తుంది. ఇది నానుడి. ప్రజల నాలుకలపైనుంచి వచ్చిన మాట. దీనికి నిదర్శనాలు, ఆధారాలూ దొరకవు. తరం నుంచి తరానికి ఇలా
దిగుమతి అయిన జ్ఞానంలో నిజం బొత్తిగా ఉండదు అనుకోవడం సాహసమే అవుతుంది. ఈ పలు జాతుల ప్రజలలో తెలుగు మాతృ భాషగా కలిగిన తెలుగువాళ్ళూ
ఉండిఉండవచ్చు. కాదనటానికి లేదు. బలమైన, ప్రభావవంతమైన జాతి కావడం మూలాన పోనుపోను ఆంధ్రులంటే, తెలుగువాళ్ళన్నది స్థిరపడి పోయి
ఉంటుందనుకోవాలి.

తెలుగు మాట, పాట, పద్యం (5)

అచ్చ తెనుగు పద్యం

తెలుగు పద్య సాహిత్యంలో ‘అచ్చ తెనుగు’ అన్న మాటను మొదటి సారిగా వాడిన వ్యక్తి మూలఘటిక కేతన అని చెబుతారు. ఈయన తిక్కన మహాకవి సమకాలికుడు. తెలుగులో మొదటి కథాకావ్యానికి (దశకుమార చరిత్ర) శ్రీకారం చుట్టినవాడు కేతన. ‘కవిత చెప్పి’ తిక్కన మహాకవినే మెప్పించినవాడు ఈయన.  ఈయన చెప్పిన ఈ ‘అచ్చ తెనుగు’ అనే మాటకు ముందు, ఈ మాట ఏ అర్ధాన్నయితే సూచిస్తుందో అదే అర్ధంలో ‘జాను తెనుగు’, ‘దేశి’ అనే మాటలు వాడుకలో వుండేవి. ఈ మాటలను తమ పద్యాలలో చెప్పిన వారు ‘నన్నె చోడుడు’, పాలుకురికి సోమనాధుడు!

పేరుకి ఇన్ని మాటలున్నా, ఈ మాటలు ‘అచ్చ తెనుగు’ భాషా స్వరూపాన్ని అర్ధమయేలా చేయడంలో సఫలీకృతం కాలేకపోయాయన్న ఒక అభిప్రాయం, విజ్ఞుల మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి! భాషా స్వరూపం అర్ధం కావాలంటే, ఒక ఉదాహరణంతో చెప్పుకుంటే, కొంతలో కొంత స్ఫష్టత వచ్చి, సులభం అవుతుంది.

“పగలు సేయుచు వేడిమి మిగుల జగము
గ్రాచు జమునబ్బ మున్నీట గలిసె ననియొ
తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపు
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”

కూచిమంచి తిమ్మకవి రచించిన ‘అచ్చ తెలుగు రామాయణం’ కావ్యంలోనిది ఈ పద్యం. సూర్యాస్తమయాన్ని సుందరంగా వర్ణించే పద్యం! నాకయితే, ఈ పద్యంలోని మాటల పొందిక, brevity, గాథా సప్తశతిలోని గాథలను తలపుకు తెస్తుంది. మంచి భావంతో నిండి వున్న పద్యం! ఊహ original ది! నాకు తెలిసినంతవరకూ, ఏ ప్రాకృత గాథనుంచో, సంస్కృత శ్లోకంనుంచో ఎత్తుకొచ్చింది కాదు!

ఇప్పుడు, ఈ పద్య భావాన్ని కొంచెం విడమరచి చెప్పుకుంటే…

‘పగలు సేయుచు’ – పగలు సేయువాడు – దినకరుడు.
సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ, కొన్ని రకాలయిన సంస్కృత సమాసాలు అచ్చ తెలుగులోకి మారేటప్పుడు జరిగే మార్పులను గురించి కొంత వివరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సంస్కృత సమాసాలలోని ప్రత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, దొర, తపసి, జోదు…ఇత్యాది శబ్దాలు జతవుతాయి అని వ్యాకరణం. ఉదాహరణకి:

అచ్చ తెలుగులో ‘కప్పు కుత్తుక వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘నీలకంఠ’ కు,
అచ్చ తెలుగులో ‘గిత్త తత్తడి వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘వృషభ వాహన’ కు,
అచ్చ తెలుగులో ‘వెంట్రుక యడుగుల దొర’ అనే సమాసం, సంస్కృతంలో ‘రోమ పాద’ కు,
అచ్చ తెలుగులో ‘మనుబోతు కొమ్ము తపసి’ అనే సమాసం, సంస్కృతంలో ‘ఋష్యశృంగ’ కు,
అచ్చ తెలుగులో ‘పచ్చ వారువపు జోదు’ అనే సమాసం, సంస్కృతంలో ‘హరిదశ్వా’ కూ అనువాదాలని పెద్దల వివరణ. తెలుగులో వీటినే బహువ్రీహి సమాసాలుగా భావిస్తారని కూడా చెబుతారు, అర్ధంలో చివరన కలది, కలవాడు చేరతాయి కాబట్టి. (నల్లని కంఠము కలవాడు, ఎద్దును వాహనముగా కలవాడు…ఇత్యాదిగ).

నాకయితే తెలుగులో ఈ మాటలు, సంస్కృతంలో మాటలు ఎంత అందంగా కనిపిస్తాయో, తెలుగులోనూ అంతే అందంగా అనిపిస్తాయి. ఇలాంటివే ఇంకొన్ని సమాసాలు:

వలిగుబ్బలి రాచ కూతురు (హైమవతి – హిమవంతుని కూతురు, ‘వలిగుబ్బలి’ అంటే మంచుకొండ అని అర్ధం), పుట్ట బుట్టువు తపసి (వాల్మీకి – పుట్ట  నుంచి పుట్టిన తపస్వి), పదియరదముల దొర కొడుకు (దాశరధి – దశరధుని కుమారుడు) – ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలంత అందంగానే కనబడతాయి.

ఇక్కడితో ఇది ఆపి, అసలు పద్యానికొస్తే –

పగలు సేయుచు – పగటిని చేస్తూ, ఆ క్రమంలోనే; వేడికి మిగుల జగము గ్రాచు – వేడిమితో జగత్తునంతా వుడికించి ఇబ్బందికిలోను చేసే; యమునబ్బ – యముని తండ్రి (సూర్యుడు); మున్నీట – సముద్రములోనికి; కలిసె ననియొ – కలిసిపోయాడుగదా అని; తొగ వెలందుక – కలువ పూవు (అనే పడతి); నగియె – నవ్వింది; అమ్మగువ – ఆ కలువ సుందరి; పెంపు గని – సంతోషంతో వదనం పెద్దదవడం (కలువ వికసించడం అన్న భావం) చూసి; సయింపక – తాళ లేక; తమ్మి – తామర పూవు (అనే పడతి); మొగంబు మొగిచె – మొహం ముడుచుకుంది, చాటు చేసుకుంది.

సూర్యాస్తమయంతోనూ, చంద్రాగమనంతోనూ కలువలు వికసించడం అనేది ప్రకృతి ధర్మం. సూర్యాస్తమయంతో తామరలు వికసనం కొల్పోయినట్లయి, కళావిహీనంగా, ముడుచుకున్నట్లయిపోవడమూ ప్రకృతిధర్మమే! ఈ రెండు ధర్మాలనూ కలబోసి, ఒకే సందర్భానికి జతచేసి, హృద్యంగా చెప్పడం ఈ పద్యంలో జరిగింది.

నాకు ఈ పద్యాన్ని చదివినప్పుడల్లా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది. పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గాథా సప్తశతి లోని పద్యాలను తెలుగులోకి అనువదించడంలో ఈ పద్యాన్నే(సరిగ్గా ఈ పద్యాన్నే అని కాకుండా, ఇలాంటి పద్యాలనే) ఆదర్శంగా తీసుకున్నరేమో! అని. ఎందుకంటే, అందులోని చాలా పద్యాల నడక ఈ పద్యాన్నే పోలి వుంటుంది. ఉదాహరణకి:

“అడుగుదమ్ములందు బడివేడు పతివీపు
జిన్ని కొమరుడెక్కి చెలగి యాడ
అలుక యెంత తెగనిదయ్యును నిల్లాలి
మొగమునందు నవ్వు మొలచె నపుడు! “                (శతకం 1 గాథ 11)

“ఎవని వదలిన జీవంబు నవసి చనునొ
యతని నపరాధినయ్యు నోదార్ప వలయు;
ఊరు గాలుచు బొలిపోవు చున్న గాని
యగ్గి నొల్లని వారెవ్వరతివ, చెపుమ?”         (శతకం 2, గాథ 63)

అందుండి అచ్చ తెలుగు మాటలలో వున్న ఇలాంటి రమ్యమైన పద్యాలను ఇంకా చాలానే ఉదాహరించవచ్చు!

ఆంధ్రనామ సంగ్రహం (3)

ఆంధ్రనామ సంగ్రహం – దేవవర్గు (3)

సీ. పక్కిడాల్వేలుపు పొక్కిలిపసిబిడ్డఁడంచతేజీనెక్కి యాడురౌతు,
మనెడు పొద్దులనొసళ్ళను వ్రాయు దేవర, చదువుల వేలుపు, జన్నిగట్టు,
తెలిదమ్మిగద్దియఁ గొలువుండురాయఁడు, నిక్కపుజగమేలు నేర్పుకాఁడు,
కడుపుబంగారు బొక్కసముఁజేసినమేటి, పోరోగిరము తిండిపోతుతండ్రి,

ఆ. నలువ,  తమ్మిచూలి, నలుమొగంబుల వేల్పు,
వేల్పు పెద్ద, పలుకు వెలఁది మగఁడు,
తాత, బమ్మ యన విధాత నామములొప్పు
(నఘవినాశ యీశ యభ్రకేశ.)

పక్కిడాలు= గరుడధ్వజం,  వేలుపు= దేవుఁడు,  పొక్కిలి= నాభి, పసిబిడ్డడు= చిన్న పిల్లవాడు – గరుడధ్వజుడైన విష్ణువు నాభినే జన్మస్థానముగా గలిగినవాడు, అంచ తేజీనెక్కి యాడు రౌతు — హంసను వాహనంగా చేసుకుని తిరిగేవాడు;

మనెడు ప్రొద్దుల నొసళ్ళను వ్రాయు దేవర — ఏంత జీవితకాలం జీవిస్తాడో ఆ సమాచారాన్ని (మానవుల) నొసళ్ళమీద వ్రాసే దేవుఁడు, చదువుల వేలుపు — (చదువులు= వేదాలు) వేదాలకు అధిపతి (బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు పుట్టాయని అంటారు గనుక), జన్నిగట్టు = యజ్ఞోపవీతాన్ని ధరించినవాడు;

తెలి తమ్మి గద్దియ కొలువుండు రాయుండు — తెల్లతామరను ఆసనంగా చేసుకుని కూర్చుని ఉండేవాడు, నిక్కపు జగమేలు నేర్పుకాడు — సత్యలోకాన్ని పరిపాలించే నేర్పుకలిగిన ప్రభువు;

కడుపు బంగారు బొక్కసము చేసిన మేటి — తన ఉదరాన్ని బంగారానికి నిలయంగా చేసిన ఉత్తముడు (బ్రహ్మకు హిరణ్యగర్భుడు అని పేరు) పోరోగిరము తిండిపోతు తండ్రి — (పోరు = తగవు,  ఓగిరము= అన్నము) తగవులాట అనే అన్నాన్ని ఆహారంగా కలిగిన నారదునుకి తండ్రి (నారదునికి కలహభోజనుడని పేరు గనుక);

నలువ — నలు = నాలుగు, వ = నోరు, నాలుగు నోరులు కలవాడు, తమ్మిచూలి = కమలము నుంచి పుట్టినవాడు, నలుమొగంబుల వేల్పు — నాలుగు ముఖముల దేవుఁడు;

వేల్పు పెద్ద– దేవతలలో పెద్దవాడు, పలుకు వెలది మగడు — మాటలకు దేవత అయిన సరస్వతికి మగడు;

తాత — పితామహుడు, బమ్మ (బ్రహ్మ శబ్దానికి వికృతి) అన — అన్నవి, విధాత నామము లొప్పు — బ్రహ్మ దేవునికి పేర్లుగా ఒప్పును.

 

 

ఆంధ్రనామ సంగ్రహం (2)

ఆంధ్రనామ సంగ్రహం – దేవవర్గు (2)

సీ. సోకుమూఁకల గొంగ, చుట్టుఁగైదువుజోదు, పచ్చవిల్తుని తండ్రి, లచ్చిమగఁడు,
పులుఁగుతత్తడి రౌతు, వలమురితాలుపు, వెన్నుఁడు, కఱివేల్పు, వెన్నదొంగ,
నునుగాడ్పుదిండి పానుపునఁ బండెడు మేటి, బమ్మదేవరతండ్రి, తమ్మికంటి,
పదివేసముల సామి, పసిఁడిపుట్టముదాల్చు, కఱ్ఱినెచ్చెలి, తరి గట్టుదారి,

తే. యాలకాపరి, వ్రేఁతల మేలువాఁడు
పాలకడలల్లుఁడును, బక్కి డాలుఱేఁడు
ఱేయుఁబవలును జేయుకందోయివాఁడు
మామమామన హరి యొప్పు (శ్రీమహేశ!).

సోకుమూకల గొంగ — (సోకుడు=రాక్షసుడు, సోకుటొజ్జ = రాక్షసుల గురువు, శుక్రాచార్యుడు) రాక్షస సమూహానికి (గొంగ =నిర్మూలనము చేయువాడు, శత్రువు) శత్రువు, చుట్టుకైదువు జోదు — (చుట్టు = గుండ్రని, కైదువు (కయిదువు) = ఆయుధము, జోధు = యోధుడు) సుదర్శనచక్రాన్ని ఆయుధంగా గలిగిన యోధుడు, పచ్చవిల్తుని తండ్రి — పచ్చని (చఱకుగడను) ఆయుధంగా గలిగిన మన్మధుని తండ్రి, లచ్చి మగడు — లక్ష్మీదేవికి భర్త;

పులుగుతత్తడి రౌతు — (పులుగు = పక్షి, తత్తడి = గుర్రము) గరుడుని వాహనంగా చేసుకుని సంచరించేవాడు, వలమురి తాలుపు — (వలను+మురి, వలను=వైపు, దిక్కు, పార్శ్వము, వల=కుడి, మురి=to turn, కుడివైపునుంచి ఎడమవైపుకు తిరుగుతూ ఏర్పడే శంఖం ‘that which has its volutes formed from right to left, the counch of Vishnu’ అని బ్రౌన్ నిఘంటువు) (పాంచజన్యము అనే పేరున్న) శంఖమును ధరించినవాడు, వెన్నుడు — విష్ణుశబ్దభవం, కఱివేల్పు– నల్లనిమేనిచాయ కలిగిన దేవుఁడు, వెన్నదొంగ;

నునుగాడ్పు తిండి పానుపున పండెడు మేటి– మెత్తటిగాలియే ఆహారమైన శేషుని తల్పంగా చేసుకుని పండుకుని ఉండే ఉత్తముడు, బమ్మదేవర తండ్రి– బ్రహ్మదేవునికి తండ్రి, తమ్మికంటి — (తమ్మి= పద్మము) పద్మములనుబోలిన కన్నులు కలవాడు;

పదివేసముల సామి– పది అవతారములను ఎత్తిన దేవుఁడు, పసిడిపుట్టముదాల్పు (పసిడి, పుట్టము =వస్త్రము) పీతాంబరుడు, కఱ్ఱినెచ్చెలి– (కఱ్ఱి = అర్జునుని ఒక పేరు) అర్జునునికి ముఖ్యమైన హితుడు;

తరిగట్టు ధారి– మంధరపర్వతాన్ని మోసినవాడు, ఆలకాపరి– (ఆవు, ఆవులు…ఆలు బహువచనం, ఆవుల కాపరి, ఆలకాపరి) పసువులమందను కాసినవాడు, వ్రేతల మేలువాడు -  (వ్రేత=గొల్ల పడతి, గోపిక) గోపికాస్త్రీల మేలును కాంక్షించినవాడు;

పాలకడలల్లుడు — లక్ష్మీదేవికి తండ్రియైన క్షీరసముద్రునికి అల్లుడు, పక్కి డాలు ఱేడు — (పక్కి.. పక్షి,  గరుడుడు) గరుడధ్వజము కల దేవుఁడు;

ఱేయుబవలును చేయు కందోయివాడు– రాత్రికి పగలుకు అధిపతులైన చంద్ర సూర్యులను తన రెండు కళ్ళుగా గలిగినవాడు;

మామమామ — మామకు మామ (లక్ష్మీదేవిని పెండ్లాడి నందువలన తనకు మామయైన సముద్రుని భార్య యైన గంగాదేవి వరసకు విష్ణువుకు కూతురు అవడం వలన తిరిగి విష్ణువు సముద్రునికి మామ అయ్యాడు కాబట్టి), (అ)న హరి యొప్పు — అనిన  ( ఈ పేళ్ళు, శ్రీ మహేశ్వరా)  విష్ణువుకు వొప్పుగా చెందుతాయి.

ఆంధ్రనామ సంగ్రహం (1)

నిఘంటు త్రయం

ఆంధ్రనామ సంగ్రహం, ఆంధ్రనామ శేషం, సాంబ నిఘంటువు – ఈ మూడూ పద్య రూపంలో పూర్వకవులు మనకు అందించిన నిఘంటువులు. ఆంధ్రనామ సంగ్రహాన్ని పైడిపాటి లక్ష్మణకవి, శేషాన్ని ఆడిడం సూరకవి రచించారు. సాంబ నిఘంటువు కస్తూరి రంగకవిచే రచించ బడింది.

తెలుగుభాషలోని తత్సమ, తత్భవ, దేశ్య, గ్రామ్య అనే నాలుగు విభాగాలైన పదాలలో  తత్భవ, దేశ్య పదాలు ఈ నిఘంటువులలోకి పద్యాల రూపంలో ఎక్కించబడ్డాయి.  ఈ పద్యాలను కంఠస్థం చేయడమంటే సగం ఆంధ్రభాషను కంఠస్థం చేయడమే! ఇప్పటి రోజులలో, కంఠస్థం మాట ఏలా ఉన్నా, కనీసం ఒకటి రెండు సార్లు చదువుకోగలిగినా, కొంతలో కొంతన్నా భాషపై, పదాల వ్యుత్పత్తిపై అవగాహన పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో నేను చదువుతూ, , ఆ వెంటనే నోట్సులాగా రాసుకుంటూ పోతున్నవే ఈ టపాలు….

ఆంధ్రనామ సంగ్రహం (1)

ఐదువర్గాలుగా విభజింపబడింది. దేవవర్గు, మానవవర్గు, స్థావరవర్గు, తిర్యగ్వర్గు, నానార్థవర్గు అనేవి ఈ ఐదు.  దేవవర్గు లో దేవతల, వారికి సంబంధమైనవి చెప్పబడ్డాయి. ఈ విధంగానే మిగతావి.  తిర్యగ్ – పశుపక్షయాదులకు సంబంధించినవి. నానార్థ – అనేకార్థములైన పదాలను గూర్చి వివరణ.

దేవవర్గు (1)

సీ. ముక్కంటి, అరపది మోముల వేలుపు, మినుసిగదయ్యంబు, మిత్తిగొంగ
గట్టువిల్తుడు, గఱకంఠుడు, మిక్కిలి కంటి దేవర, బేసికంటి వేల్పు
వలిమలల్లుడు, మిన్నువాక తాలుపు, కొండవీటిజంగము, గుజ్జువేల్పు తండ్రి
వలరాజు సూడు, జక్కులఱేని చెలికాడు, బూచుల యెకిమీడు, పునుకతాల్పు

తే. విసపుమేతరి, జన్నంపు వేటకాడు
బుడుతనెలతాల్పు, వెలియాల పోతురౌతు,
తోలుదాలుపు, ముమ్మొనవాలు దాల్పు,
నాగ భవదాఖ్య లొప్పు (నంధక విపక్ష).

(ఇక్కడ ఒక మాట.  ఈ పద్యంలోనూ, ఇక ముందు రాబోయే పద్యాలలోనూ పదాల మధ్య కామాలు చదువుకోవడానికి సులభంగా ఉంటుందని నేనుంచినవి, అసలు పద్యాలలో కనబడవు).

మూడు నేత్రముల వాడు, (అర పది) ఐదు మొగముల వాడు — శివుడు పంచాననుడు. తొలుత బ్రహ్మకూడ పంచాననుడే. పంచ ముఖులైన ఇద్దరిలో తనను గుర్తుపట్టడానికి పార్వతి ఇబ్బందిని తొలగించే ప్రయత్నంలో భాగంగా బ్రహ్మ అయిదో ముఖాన్ని హరిస్తాడు శివుడు. అదే బ్రహ్మకపాలంగా శివుని చేతిలోని బిక్షాపాత్రగా మిగిలిందని పెద్దలు చెబుతారు — ఆకాశమును జుట్టుగా గలిగిన దేవుడు, (మిత్తి) మృత్యువునకు శత్రువు, (గట్టు) మేరుపర్వతాన్ని (విల్లు తు డు) దనుస్సుగా గలిగినవాడు, (కఱ) నల్లని కంఠముగలవాడు, (మిక్కిలి కన్ను, దేవర) ఎక్కువ నేత్రములు గల దేవుడు, (బేసి కన్ను, వేలుపు) మూడు కళ్ళ దేవుడు, (వలిమల =
మంచుకొండ, హిమాలయ పర్వతం) ఇక్కడ అర్థం హిమవంతుని అల్లుడు అని, (మిన్ను వాక తాలుపు) ఆకాశ గంగను శిరస్సున ధరించిన వాడు, (కొండ వీడు జంగము) కైలాస పర్వతాన్ని ఇల్లుగా గలిగిన భిక్షుకుడు, పొట్టివాడగు వినాయకునికి తండ్రి, (వలరాజు సూడు) మన్మథునికి విరోధి, (జక్కుల ఱేడు= యక్షుల రాజైన) కుబేరునికి మిత్రుడు, పిశాచములకు అధిపతి, బ్రహ్మకపాల ధారి, విషమును ఆరగించినవాడు, దక్షుని యజ్ఞాన్ని భజ్ఞం చేసిన వాడు, (బుడుత నెల) బాలచంద్రుని శిరస్సున ధరించినవాడు, (వెలి
యాలపోతు రౌతు) తెల్లని ఆబోతును ఎక్కి చరించువాడు, (తోలు దాలుపు) పులిచర్మం ధరించువాడు, (ముమ్మొన వాలు దాల్పు) త్రిశూలధారి, (నాగ) అనబడే ఇవి అన్నీ, అంధకాసురుని శత్రువైన, శివుడా!, నీ పేళ్ళుగా వొప్పును.

తెలుగు మాట, పాట, పద్యం (1)

వెయ్యేళ్ళుగా తెలుగులో లిఖిత సాహిత్యం వుంది.  అంతకు ముందు ఇంకా ఎన్ని వందల ఏళ్ళ నుంచో తెలుగులో ‘అలిఖిత’ (మౌఖిక సాహిత్యంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సాహిత్యాన్ని సూచించేదిగా ఈ పదం వాడుతున్నాను) సాహిత్యం ఉంది. అలిఖిత సాహిత్యానికి జనుల రసనయే వాహికయై అందులో ‘పస’ ఉన్న సాహిత్యమంతా తరం నుంచి తరానికి ప్రవహించి అందుబాటులోకి వచ్చింది. లిఖిత సాహిత్యం విషయంలో ఇలా జరగడానికి అవకాశం లేదు. లక్షణ గ్రంథాలూ, తెలుగు పూర్వ సాహిత్యంపై పెద్దల వ్యాసాలూ చదువుతుంటే, తెలుగులో లిఖిత సాహిత్యంలో ఈనాటికి దొరికి అందుబాటులోకి వొచ్చిన సాహిత్యం కంటే దొరకకుండా పోయిందే ఎక్కువేమో అన్న అనుమానం కలుగుతుంది.  శ్రీనాథుని శాలివాహన సప్తశతి లాంటివి ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్వర్గీయ మానవల్లి కవిగారి పుణ్యమాని, నన్నిచొడుని కుమార సంభవం, వినుకొండ
వల్లభరాయుని క్రీడాభిరామం, త్రిపురాంతకుని త్రిపురాంతకోదాహరణం లాంటివి దొరికాయిగాని, లేకుంటే వాటినీ  ఈనాటికింకా మరుగునపడిపోయిన మాణిక్యాలుగానే చెప్పుకుంటూ ఉండేవాళ్ళం.

‘పాటకు సాహిత్య గౌరవాన్నిచ్చి తమిళులు పురాతన సాహిత్యం ఉన్నవాళ్ళయ్యారు, అది చేయక మనం
లేనివాళ్ళమయ్యాము’ అని స్వర్గీయ ఆరుద్ర గారు (మక్కికిమక్కి ఇవేమాటలు కాదు, ఈ అర్ధం వచ్చేట్లుగా మాత్రమే) అన్నట్లు, తెలుగు అలిఖిత (మౌఖిక) సాహిత్యంలోని పాటను కూడా సాహిత్యంగా పరిగణించి చూస్తే, తెలుగు సాహిత్యం వయసు ఎంత హీనంగా వేసుకున్నా ఇంకో వెయ్యేళ్ళ ముందుకు జరగక మానదు, హాలుని గాథాసప్తశతి కాలం నాటికే తెలుగు పరిపూర్ణమైన భాషగా వృధ్ధి చెంది ఉన్నదని చెప్పడానికి నిదర్శనాలు గాథాసప్తశతిలోనే ఉన్నాయి కాబట్టి. అంటే, తెలుగు మాటకు, పాటకు ఎంత హీనంగా వేసుకున్నా రెండు వేల ఏండ్లకుపైనే వయసుంటుండని చెప్పుకోవచ్చు. అయితే, ఇన్ని వేల ఏండ్ల క్రితం నాటి  తెలుగు మాట, పాటల తొలి నాళ్ల రూపాలు ఎలా వుండేవో తెలుసుకోవడం ఆసక్తి కరంగానే అనిపించినా, అది తెలుసుకోవడానికి
సరిపడా సామగ్రి లేకపోవడంవల్ల ఇనాటి వాటి రూపాలతో సరిపెట్టుకుని, అర్ధాన్ని ఆస్వాదించడం, ఆనందించడం మాత్రమే చేయగలం.

తెలుగు పాట పురాతన రూపాలలో ‘ఏల’ ఒకటి. ‘ఏల’ అనే మాటకు ‘శృగారపు పాట’ అని బ్రౌన్ నిఘంటువులో చెప్పిన అర్ధం. ఇదెలా ఉన్నా, ‘ఏలలు పెట్టి పాడడం’ అని పాలుకురికి సోమనాథుడు బసవపురాణంలో చెప్పిన మాట ఒకటి ఉన్నది. దీనికి ‘రెండేసి పాదములకో మూడేసి పాదములకో యొక సారి యే దేవునిపేరో రాగక్రమమున నుచ్చరించుచు జదువుట యేలలుపెట్టి చదువుట యై తోచుచున్నది’ అని పూజ్యులు దివాకర్ల వెంకటావధానిగారిచ్చిన వివరణ ( వారిదే ‘ప్రాజ్ఞన్నయ యుగము’ పుస్తకంలో). వారిచ్చిన వివరణలోని ‘చదువుట’ అనే మాటను ‘పాడుట’ గానే అర్ధంచేసుకోవచ్చు, ‘ఏలలు’ పాడుకోవడానికి ఉద్దేశ్యించినవే కాబట్టి.

“కానరాని యడవిలోన
వానలేని మడుగు నిండె,
వానలేని మడుగుమీదనూ, ఏగంటిలింగా,
మానరాని అగ్ని పొడమెరా.”

“ఆకులేని యడవిలోన
తోకలేని మృగముపుట్టె
తోకలేని మృగము కడుపునా, ఏగంటిలింగా,
ఈకలేని పక్షిపుట్టెరా.”

‘ఏగంటి వారి ఏల’ లలోనివి ఇవి రెండు ఏల పదాలు. పాడుకోవడానికే ఉద్దేశ్యించినవని చెప్పకనే తెలిసిపోతుంది.  మాటలతో వర్ణించి చెప్పలేని ఏదో మార్మికత ఈ ఏలలలో ఉన్నదని కూడా చెప్పకనే తెలిసిపోతుంది. ‘ఏగంటిలింగా’ అన్నది మూడవ పాదాతంలో తప్పనిసరిగా ఇవ్వబడిన reprieve… విశ్రాంతి. ఇది పాడుకోవడంలో ఏదో ఉపశమనం ఉంది.  అలసిపోయిన మనసుకు ఇందులోని ఉపశమనం ఎంతో హాయినిచ్చేదిగా అర్ధమవుతుంది. ఈ ఏలలను నిర్మాణం చేసిన మనిషెవరోగాని, అతడి మనసుకు మనిషి చిత్తంలోని రాగద్వేషాలు, వాటివలన పొందే కష్టనష్టాలపై సమగ్రమైన అవగాహన ఉందన్నదీ తెలిసిపోతుంది. ఇది దేనికో అనువాదమో, అనుకరణో అనుకోవడానికి వీలులేదు. ఇది అచ్చమైన తెలుగు ఊహ, తెలుగు ‘వాడి’ ఊహ!

‘ఏల’ పదం, తరువాత్తరువాత శిష్టసాహిత్యంలోనూ ప్రవేశించి కనిపిస్తుంది.  కందుకూరి రుద్రకవి రచించిన ‘సుగ్రీవ విజయం’ లోనివి ఈ క్రింద చూపిన ఏలలు ఇందుకు ఒక ఉదాహరణ:

“భాను వంశామూన బుట్టి
దానవాకామినిగొట్టి
పూని మఖము నిర్వహింపావా – ఓ రామచంద్ర
మౌనివరులు సమ్మతింపాగాన్.”

“రాతినాతిజేసి పూరా
రాతిచేతి విల్లు విరిచి
భూతలేంద్రూ లెల్లమెచ్చగా – ఓ రామచంద్ర
సీతనూ వీవాహ మాడావా.”

పాడుకోవడానికి అనువుగా ఉండేట్లుగా పై ఏలలోని కొన్ని హ్రస్వ పదాలు దీర్ఘాంతాలుగా చేయబడడం గమనించవచ్చు.ఇదిలా వుంచితే, తెలుగులో ‘ఓల’ అనే ఒక మాట ఉంది. ఈ మాటకు ‘జలక్రీడ’ అని బ్రౌన్ నిఘంటువు చెప్పిన అర్ధం. ‘ఓలలాడు’ అంటే నీళ్ళలో ఆడడం అన్న అర్ధం రూఢమై కనిపిస్తుంది. ఓల  అనే మాటకు a cry, shout అన్న అర్ధాలను కూడా బ్రౌన్ నిఘంటువు చూపింది. నీళ్ళలో ఆడుకునేటప్పుడు ఆనందంలో పెట్టే కేకలను ఓలలని చెప్పుకోవచ్చు. ఓలగంధము (జలక్రీడకు ముందు శరీరం మీద రాసుకునే పసుపు లేపనము), ఓలపాట అనే పదాలు ‘ఓల’ నుంచే పుట్టాయి. తెలుగు సినిమా పాటలో (జగదేకవీరుని కథలో) ఈ ‘ఓల’ పదమే ‘హల’ గా మారి కనిపిస్తుంది.

‘ఏల’, ‘ఓల’, ‘హల’ …ఈ మూడు పదాలకూ భాషా పరంగా ఏదైనా సంబంధం ఉన్నదో లేదో, ఉంటే దానికి సంబంధించిన వివరణ ఎలా ఇవ్వాలో నాకు తెలియదుగాని, ఈ మూడిటికీ ఉన్న ఒక్క ముఖ్యమైన సామాన్య లక్షణం, ఈ మూడు పదాలూ పాటకు సంబంధించినవిగానే ఉండడం అన్నది తేలికగానే తెలిసిపోతుంది.

హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (1)

మౌర్య సామ్రాజ్య పతనం తరువాత, దక్షిణ భారతం మొత్తాన్నీ, ఉత్తర భారతంలో కొంతభాగాన్నీ కలిపి ఏక మొత్తంగా కొన్ని సంవత్సరాల కాలమైనా పాలించిన  దక్షిణాది రాజవంశం శాతవాహన రాజవంశం. ఈ ప్రసిధ్ధ రాజవంశం క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 దాకా, అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు రాజ్య పాలన సాగించి, ఆ క్రమంలో పురాణాలలోకి కూడా ఎక్కిన  ఘనతను సాధించుకుంది.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి.  ఈ వంశపు రాజులలో హాల మహారాజు ఒకడు. ఇతడు క్రీ.శ.19-24 సంవత్సరాల మధ్య కాలంలో  రాజ్యపాలన చేశాడని చరిత్రకారులు చెబుతారు. (హాలుడు అశ్మక రాజ్యంలోని ప్రతిష్ఠానమును పరిపాలిస్తూ ఉండినాడని ప్రాకృతంలో రచింపబడిన  ‘లీలావతి’ కావ్యం చెబుతుంది). పరిపాలించినది ఆరేళ్ళే అయినప్పటికీ, శాతవాహన వంశపు రాజులందరిలోకీ హాలుడు జగత్ప్రసిధ్ధుడు కావడానికి కారణం ఆ మహారాజు సంకలించి ప్రపంచానికి అందించిన ‘గాథా సప్తశతి’ గ్రంథం. (ప్రస్తావ వశాన, ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. హాలుని ఆస్థానంలో వుండిన శ్రీపాలితుడనే మహాకవి, హాలుని దర్శించుకోవడానికి వచ్చిన వారిలో కవులు కొందరు ఆ మహారాజు సమక్షంలో వినిపించిన గాథలలో ఉత్తమమైన గాథలను సేకరించి సంకలించాడనే మాట కూడ ప్రచారంలో ఉంది. అయితే, ఇందులో నిజానిజాలు ఏమైనప్పటికీ, హాలుడు విని మెచ్చిన వాటినే శ్రీపాలితుడు కూడ మెచ్చడం జరిగి ఉంటుందనుకోవడానికి ఏమీ సందేహ పడనవసరం లేదు కదా!). గాథా సప్తశతి లోని ఏడు వందల గాథలలో దేనికది అనాటి సమాన్య జనజీవనంలోని ఏదో ఒక పార్శ్వాన్ని భావి తరాలకు గ్రంథస్తం చేసి చూపించడంలో సఫలీకృతమై కనిపిస్తుంది. హాలుడు పరిపాలించిన ఆ ఆరేళ్ళ కాలం ప్రాకృత వాఙ్మయానికి స్వర్ణ యుగమని కూడా చెబుతారు.

‘గాథా సప్తశతి’ ని హాలుడు సంకలించడమే కాదు, తాను రచించిన కొన్ని గాథలను అందులో చేర్చాడు కూడా. హాలుడు రచించిన గాథలలో అతని వ్యక్తిత్వానికి ప్రతిబింబా లనదగినవి ఉన్నాయి. వాటిలో అత్యుత్తమమైన గాథ, హాలుని సహృదయతనూ, సున్నితమైన మనస్తత్త్వాన్ని తెలియ చెప్పే గాథ, ఇది:

“పాణఉడీఅ వి జలిఊణ హుతవఓ జలఇ జణ్ణ వాడమ్మి
ణ హు తే పరిహరిఅవ్వా విసమదసా సంఠిఆ పుంసా.”

దీని సంస్కృత ఛాయ:

“పానకుట్యామపి జ్వలిత్వా హుతవహో జ్వలతి యజ్ఞవాటేపి,
నహితే పరిహర్తవ్యా విషమదశా సంస్థితాః పురుషాః”

అగ్నిహోత్రుడు యజ్ఞవాటిలో ఎలా మండుతాడో, కల్లు పాకలోనూ అలానే మండుతాడు. అలాగని అగ్నిహోత్రుని అపవిత్రుడైనాడని వదిలి పెట్టడం కుదురుతుందా? కుదరదు. అలాంటిదే ఉత్తములైన వారి సాంగత్యం. కొన్ని కొన్ని పరిస్థితులలో తమకు తగని ప్రదేశాలలో వారు ఉండడం, మనం చూడడం సంభవించినంత మాత్రాన, వారి సాంగత్యాన్ని వదులుకో చూడడం తగదు. దాని వలన మనకే నష్టం. ఇదీ ఈ గాథ అర్ధం.

ఆంధ్రమూ, తెలుగూ…(5)

ఆంధ్రమూ, తెలుగూ…(5)

19. మన కవులూ, రచయితలూ, ఆంధ్రా కీట్సులూ, ఆంధ్రా షెల్లీలూ, ఆంధ్రా లారెన్సులూ, ఆంధ్రా జాయిస్సులూ, ఇలా ఇంకా ఎన్నెన్నో. పిలిచే వాళ్ళకి ఇందులో తప్పేమీ కనిపించకపోయినా, పిలిపించుకునే వాళ్ళకి ఇందులో తప్పేమీ కనిపించక పోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే, ఏ ఒక్కరూ ఇప్పటిదాకా ‘దయచేసి అలా పిలవవద్దు. ఇది ‘nothing but consciously agreeing to lose one’s own identity and reappear as an image of somebody’ అని చెప్పే ప్రయత్నం చేసినట్లుగా కనపడదు. Telugu is Italian of the East అని, అది తెలుగు భాష గొప్పదనానికి ఒక qualification అన్నట్లుగా చెప్పుకోవడం. ఇది ఏ రకపు సమర్ధన? ఈ రెండు భాషలకూ ‘అజంతత్వమ’ న్న ఒక్క సామాన్య లక్షణంతప్ప వేరే ఏముంది? ఎవరైనా Italian ని Telugu of the West గా పిలవడం ఎప్పుడైనా మనం విన్నామా? West లో దేనితోనో ఒక దానితో పోల్చి, ఇది అలా ఉంది గాబట్టి ఇదీ గొప్పది అని చెప్పుకుంటే తప్ప మనకి మన భాష,
సాహిత్యాల గొప్పదనాన్ని చాటి చెప్పుకునేందుకు పధ్ధతులే లేవా? ఈ aping కీ, absurdity కీ అంతమే లేదా?

20. ఒక ప్రక్రియగా (as a form of literary expression) ‘నవల’ మనది కాదన్నది తెలిసిందే. అది ‘యూరప్’ కు చెందినదనీ, ఆ ప్రక్రియ ద్వారా సాధించబడే విజయాలన్నీ ఎక్కడ జరిగినా అవన్ని న్యాయంగా ‘యూరప్’ కే చెందుతాయనీ కూడా ఇక్కడ గుర్తించాలి.  ఇందులో ఏవైనా సందేహాలుంటే Milan Kundera పుస్తకం Art of the Novel చదివితే, అవన్నీ తీరుతాయి. అదలా ఉంచి, ఈ నవలా ప్రక్రియ ద్వారా మనం సాధించిపెట్టిన విజయాలేమైనా ఉన్నాయా? మనం ఇంతకు ముందు
ఎక్కడా వ్రాయని విధంగా కొత్తగా ఏమైనా వ్రాశామా? ఏమైనా కొత్త సత్యాన్ని (a new truth) ని కనుగొని, ఆవిష్కరించి ప్రపంచానికి చూపామా? నిజాయతీతో, have we ever tried to think differently?. అలా think చేయడానికి ప్రయత్నించిన వాళ్ళని గుర్తించామా? మననిచ్చామా? ఎందుకంటే, స్వర్గీయ వడ్డెర చండీ దాస్, తన పుస్తకం ‘హిమజ్వాల’ ను బుచ్చిబాబు కు అంకితమిస్తూ వ్రాసిన మాటలు ‘తెలుగు దనపు కూపంలో ఇమడలేక, అభాసు పాలైన బుచ్చిబాబు కి’ అని వ్రాయడం వెనుక అర్ధం ఏమిటి? ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

21. తెలుగు భాషను సంస్కృత తత్సమ, తత్భవ పదభూయిష్టం చేసి చెడగొట్టుకుంది మనమే.

22. హాల శాతవాహనుని ‘గాథా సప్తశతి’ లో తెలుగు పదాలు కనబడినవన్నీ ఆనాటి తెలుగు, అచ్చ తెలుగు పదాలే. ఆంధ్రమూ (ఒక వేళ ఉండినట్లయితే), తెలుగూ ఒకటి కాదు. ఆంధ్రులు తెలుగు భాషను తమ భాషగా చేసుకుని ఉండడానికి పూర్వం మాట్లాడిన భాష సంస్కృతమో, ప్రాకృతమో అయిఉండాలి. కొన్ని శతాబ్దాల కాలంపాటు తెలుగులో స్వతంత్ర రచనలు రాకపోవడానికి ఇది కారణం అయి ఉండవచ్చు.

23. శతాబ్దాల పర్యంతం సాహిత్యంలో సాగిన ఈ అనువాద/అనుకరణ వ్యాసంగం కారణంగా/ఫలితంగా తెలుగులో స్వతంత్ర రచనలు వెలువరించగల ఆసక్తి, క్తి సామర్ధ్యాలు కొరవడినట్లుగా అనిపిస్తుంది.

24. సంస్కృతం (వేరే ఏ ఇతర భారతీయ భాషలో కన్నా) ఇంకా తెలుగు భాషలోనే సజీవంగా ఉంది.

25. తెలుగు భాష original గా తనదైన ముద్ర వేసి ప్రపంచానికి అందించింది సాహిత్యంలో కానే కాదు.  అది సంగీతంలో, నాట్యంలో. సంగీతంలో అన్నమయ్య, త్యాగయ్య ల వలన, నాట్యంలో సిధ్ధేంద్ర యోగి వలన ఆ ఘనత మనకు దక్కింది.

(అయిపోయింది).

ఆంధ్రమూ, తెలుగూ…(4)

ఆంధ్రమూ, తెలుగూ…(4)

16. చలం కి కావలసిన విధంగా స్త్రీ లేకపోవడం చలం సాహిత్యం. దీనినే ఇంకో విధంగా చెబితే, చలంకు స్త్రీ ఎలా ఉండగా కావాలో అది చలం సాహిత్యం. దీన్ని ఆయనే అప్పట్లో రేడియో కి ఇచ్చిన interview లో చెప్పుకున్నారు,  ‘చలంది చలం బాధ. అది మీదనుకుని మీరు పొరబడ్డారు’ అని. చలం రచనలపై D.H. Lawrence రచనల ప్రభావం ఎంతైనా ఉందనేది సత్యం. ఒక బాధ్యత గల రచయితగా you cannot lead a woman to such a pitiable condition అన్నది ‘మైదానం’ లో రాజేశ్వరి పాత్రను రాస్తున్నప్పుడు ఆయనకు తట్టలేదా? అన్నది నా సందేహం. ఏ స్త్రీ అయినా, పురుషుడైనా సర్వం పోగొట్టుకోవడానికీ, చివరికి సర్వనాశనమవడానికి సిధ్ధపడడాన్ని నేను ఊహించగలను.  కానీ, దేని కోసం? అన్న ప్రశ్నకు సరయిన సమాధానం ఉండాలి. sex కోసమూ, physical gratification కోసమూ అని సమాధానం అయితే, ఒక రచనకు theme గా నేను దానిని అంగీకరించలేను.  It will lead you no where, the destruction is already there in the beginning itself, in the idea itself. Cann’t you imagine? తెలిసి తెలిసి ఆ పనికి పూనుకోవడం అన్యాయం.అప్పట్లో మర్యాదస్తుల ఇళ్ళలో మహిళలు చలం పుస్తకాలను రహస్యంగా దాచుకును మరీ చదివే వాళ్ళని, చలం రచనల గొప్పదనానికి నిదర్శనంగా చదువుకున్న వాళ్ళు కూడా చెప్పడం, వ్రాయడం జరిగింది.  ఇది ఏరకపు ‘జస్టిఫికేషనో’ నా కిప్పటికీ అర్ధం కాదు. There is a devil always lurking behind every man’s and woman’s mind అనీ, దానికి మనం material supply చెయ్యడం మొదలెడితే, అది తప్పకుండా తీసుకుంటుందనీ మనం ఊహించలేమా? అసలు ‘లైంగిక స్వేచ్చ’ అన్న దానిని మనం సరిగా అర్ధం చేసుకున్నామా? As a matter of course ప్రతి స్త్రీ, పురుషుడి జీవితంలో అలాంటి సందర్భాలు తప్పనిసరిగా ఎదురవుతాయనీ, సమాజం మొత్తంగా sexually repressed condition లో కొట్టుకుపోతోందనీ, మగ్గి పోతోందనీ, అది తప్ప మనుషులకి వేరే బాధలేమీ లేవన్నట్లుగా ఊహించడం, రాయడం ఎంతవరకూ సమంజసం?

సాంఘిక రుగ్మతల (social evils) మీద యుధ్ధం చేయడానికి సాహిత్యాన్ని ఆయుధంగా ఎంచుకున్న ఏ రచయితైనా, తను ఉంటున్న (present day) సంఘంలోని వాస్తవాలను (realities) ని వొదిలిపెట్టి, issues కి fantasized solutions చూపెట్టడం మొదలెడితే జరిగేది ఏమిటి? ఆ solutions తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా, repeated reading of those fantasized
solutions will lead to  inner struggles which will further lead to a desire to escape from the reality అన్నది అర్ధం కావడానికి ఒక జీవిత కాలం పడితే ఎలాగ? And, finally unable to face the realities of the world, Chalam, he himself had to end up in an Aashram! తనతోపాటు, తన సాహిత్యాన్ని చదివిన వారంతా ఆశ్రమాల్లో end అవ్వాలని చలం (suggestion) సలహానా? And, given a safe chance to escape from reality, why not?, every one wants to do that. చలం రచనలను మర్యాదస్తుల ఇళ్ళళ్ళో మహిళలు దాచుకుని మరీ చదవడానికి కారణం ఇది గాదా? నేను పైన ప్రస్తావించిన devil అన్నది ఇదే, మరేదో కాదు, a desire to escape from reality, even at least temporarily!

A true warrior never likes to leave the battle field. Come whatever may, he prefers to die rather than leave the battle field. A person who does the opposite, is not a worrier at all.  He has to be judged as a liar, an outright liar… however harsh it may appear, there is no other way!

17. చలం సాహిత్యమంతా, వెలువరించిన భావజాలం అంతా feminist సాహిత్యంగా, భావజాలంగా ఒప్పుకోవడం జరిగింది. అసలు ఒక పురుషుడు feminist భావజాలాన్ని ఎల వెలువరించ గలడో, ఆ భావజాలాన్ని feminist భావజాలంగా ఎల ఒప్పుకో గలమో నాకిప్పటికీ అర్ధం కాదు. కళాపూర్ణోదయంలో పింగళి సూరన ఊహించి చూపించినట్లుగా, ఒక వ్యక్తి రోజులో సగభాగం
పురుషునిగానూ, సగభాగం స్త్రీగనూ అవగలిగే సౌకర్యం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని నా నమ్మకం. అసలు స్త్రీకి ఏం కావాలో, (స్త్రీ ఎలా ఉండాలో కాదు. ఎలా ఉండాలన్న దాని మీద ఎవళ్ళకు నచ్చినట్లు వాళ్ళు ఎన్నయినా రాసుకోవచ్చు, సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా), పురుషుడు చెప్పడం ఏంటి? దానిని feminist భావజాలంగా ఒప్పుకోవడం, ఒక్క తెలుగులో తప్ప, ప్రపంచ సాహిత్యంలో వేరే ఎక్కడా జరిగినట్లుగా నాకు తెలియదు.

18. నాకు తెలిసినంత వరకూ, ప్రపంచ సాహిత్యంలోనే మొట్ట మొదటి feministic episode గా చెప్పగలిగిన కథ ఋగ్వేదంలోని ‘ఊర్వశీ, పురూరవు’ ల సంవాదం. అనూహ్యంగా ఈ కథ, ఊర్వశి పురూరవుని విడిచి వెళ్ళే సందర్భంతో, ‘ఇంక చాలు, నీకు కావలసినవన్నీ ఇచ్చాను, నీ దారిన నువ్వు వెళ్ళు, నన్ను నా దారిన వెళ్ళనీ’ అన్న ఊర్వశి మాటలతో మొదలై వెనకకు నడుస్తుంది. దీనిలో ఉన్న నిజాయతీని మనం గుర్తించిందీ లేదు, elaborate చేసి చూపించిందీ లేదు. అంతులేని శోకంతో
విలపిస్తున్న పురూరవునికి ‘నీ శోకం అర్ధరహితమైనది, నేను నీకు సంబంధించిన వ్యక్తిని కాదు, నాకోసం విలపించడం తగదు’ అని నిర్మొహమాటంగాను, అనునయంగానూ చెప్పి వెళ్ళిపోతుంది ఊర్వశి. మూడువేల ఐదువందల సంవత్సరాల క్రితం ఒక ఋషి ఊహించి ప్రపంచం ముందుంచాడు ఈ (situation) సందర్భాన్ని! సందర్భం వచ్చింది గాబట్టి చెప్పడమేగాని, ఇది ‘అన్నీ వేదాలలో
ఉన్నాయట’ అని చెప్పటం కాదు.

ఆంధ్రమూ, తెలుగూ…(3)

ఆంధ్రమూ, తెలుగూ…(3)

11. తెలుగులో ఆధునిక సాహిత్యంలో నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు అనుకరణే. ఈ సాహిత్యం వెనుక ఉన్న ideas and concepts మనం కనిపెట్టినవి కావు. ఎవరో కనిపెట్టి చూపెడితే మనం అనుకరించినవి. మనం సాధించిన విజయాలు ఏమైనా ఉంటే అవి కధానికా సాహిత్యంలోనే. వాటిల్లో కూడా world level కి సరి తూగగలవి చాలా కొద్ది. ఉదాహరణకు, బుచ్చిబాబు గారి ‘నన్ను గురించి కధ వ్రాయవూ?’ కధానిక.  మనలో చాలామంది మధ్యతరగతి జీవితాలు పుట్టుకనుంచి గిట్టేవరకూ ఒకే విధంగా, too absurdly and unbearably simple గా ఉంటాయన్న తాత్త్విక సత్యాన్ని వ్యంగ్యంగా చెప్పిన కథ ఇది.  ‘రసం ఎప్పుడూ వ్యంగ్యమే కావాలి తప్ప, వాచ్యం కారాదన్న’ సూత్రాన్ని తూ.చ తప్పకుండా పాటిస్తూ ఈ కథ నడుస్తుంది.  బుచ్చిబాబు మిగతా సాహిత్యం అంతా ఒక ఎత్తు, ఈ కథ ఒక్కటీ ఒక ఎత్తు అన్నా అతిశయోక్తి కాదు అని నేననుకుంటాను.కాళీపట్నం రామారావు గారి
‘యజ్ఞం’, ‘జీవధార’, గొప్ప తాత్త్విక సత్యాలను బహిర్గతం చెయ్యక పోయినప్పటికీ తిలక్ ‘ఊరిచివరి ఇల్లు’, చలం ‘దోషగుణం’, కళ్యాణసుందరీ జగన్నాధ్ ‘అలరాస పుట్టిల్లు’ లాంటివి ప్రపంచ సాహిత్యంతో సరితూగగలిగినవి తెలుగులో కథానికా సాహిత్యంలో మాత్రమే ఉన్నాయి. (పాలగుమ్మి పద్మరాజు గారి ‘గాలివాన’, పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారి ‘నీలి’ కథలు ప్రపంచ ఉత్తమ కథానికలుగా బహుమతులు అందుకున్నాయన్నది తెలిసిందే కదా!).

12. తెలుగులో కవిత్వానికి సంబంధించినంతవరకూ స్వర్గీయ అక్కిరాజ ఉమాకాంత విద్యాశేఖరుల ‘నేటి కాలపు కవిత్వం’ ఒక్కటే అప్పటికీ ఇప్పటికీ అత్యుత్తమ విమర్శ గ్రంధం. ఇందులో ఆయన ప్రస్తుతించిన ఏ విషయానికీ, విమర్శకూ సమాధానం ఇవ్వడం ఇంత వరకూ జరగలేదు. శ్రీశ్రీ తన ‘అనంతం’ లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడే తప్ప సమాధానం ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేకపోయాడు. ఆధునిక సాహిత్యం పేరుతో భావకవిత్వ ధోరణిలో అప్పటిలో వస్తూండిన కవిత్వాన్ని, భారతీయ (అంటే సంస్కృత) సాహిత్య సిధ్ధాంతాలను నేపధ్యంగా పెట్టుకుని చీల్చి చెండాడిన గ్రంధం ‘నేటికాలపు కవిత్వం’. ఇందులో ముప్పాళ్ళు విమర్శకు గురైనది దేవులపల్లి క్రిష్ణశాస్త్రి గారి కవిత్వం. భావ కవిత్వానికి అప్పటిదాకా వస్తూండిన పాత, పద్య కవిత్వ పధ్ధతులను
తోసివేయడం అన్న ఆశయం తప్ప వేరే తాత్త్విక భూమిక అంటూ ఏమీ లేదు. They hated to be old, they liked to be new and most of the time Krishna Sastri played to the gallery అన్నది సత్యం. They just aped Keats and Shelly అన్నది కూడా జగమెరిగిన సత్యం. ఇలా వచ్చే కవిత్వంలో కొత్త సత్యాలు ఆవిష్కృతాలవుతాయనుకోవడం అత్యాశే అవుతుంది.

13. ‘పద్యం’ ప్రపంచానికి మనం అందించిన ఆస్తి అని గొప్పగా చెప్పుకుంటుంటాం. అది మనకే సరిగ్గా అర్ధం కాదు, ఇక ప్రపంచానికి ఎప్పటికి అర్ధం కావాలి? శత సహస్రాలుగా వెలువడిన శతక సాహిత్యంలో నీతులు చెప్పినవే చెప్పి, చెప్పినవే చెప్పి, చెప్పినవే చెప్పి….దేవుడా!

14. దిగంబర కవిత్వం గానీ, feminism గానీ, చైతన్య స్రవంతి పధ్ధతిలో రచనలు గానీ, దళిత వాదం గానీ, ఇలాంటివి ఇంకా ఏవైనా గానీ, conceptual గా మనం కనిపెట్టినవి కానే కావు. ఎవరో కనిపెట్టి తొలుతగా రచనలు చేసి చూపిస్తే మనం అనుకరించినవి. ఈ కారణం చేతనే, వీటిల్లో వచ్చిన ఏ రచనైనా సరే గొప్పదిగా తీర్మానించుకుని చెప్పుకునే ముందు కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. నాకు తెలిసినంతవరకు, మనకి మనంగా కనిపెట్టి ప్రపంచానికి అందించిన concept అంటూ ఒక్కటీ
లేదు. అనుకరణే మన మెరిగిన పధ్ధతి.


15. దిగంబర కవిత్వం లో వాడిన భాషకూ, పదజాలానికీ నొచ్చుకుని, ఎంతైనా ‘సమాజం మరీ ఇంతగా చెడిపోయిందా?’ అని సహృదయ విమర్శకులు స్వర్గీయ రాచమల్లు రామచంద్రా రెడ్డి గారు బాధపడడం నాకింకా జ్ఞాపకం. ఇంతకీ ఈ కవిత్వంవల్ల తేబడిన మార్పూ, సాధించ బడిన విజయాలేమిటో ఎంత ఆలోచించినా నాకిప్పటికీ అర్ధం కావు.