నేను, యాజ్ఞసేనిని! …(9)

(8)

గంగనూ, హిమాలయాలనూ దాటి ఆవల పీఠభూమిని చేరుకుని, ఒకరి వెనుకాల ఒకరంగా, ఆరుగురమూ కొన్ని నెలల పాటు నడిచాం. నడిచి నడిచి, చివరకు ఒక రోజు, ఇక నడిచే సత్తువ లేక అందరికంటే ముందు నేను కుప్పకూలి పోయాను. నా తరువాత వరుసగా భీమార్జున నకుల సహదేవులూ పడి పోయారు.  ఒక్క ధర్మరాజు, ఆయన వెనుక అనుసరిస్తూ ఒక శునకమూ ముందుకు సాగిపోయారు.

పడిపోయినా నేనింకా స్పృహలోనే ఉన్నాను.  కళ్ళు మూసుకు పోతున్నాయి.  శరీరంలో సత్తువ పూర్తిగా నశించి, మరణానికి అతి చేరువలో ఉన్నట్లు నాకు అర్ధమైంది.  ఆ స్థితిలో, నాకు కొంచెం దూరంలో ఏదో ఈడ్చుకు వస్తున్నట్లు శబ్దం, ఆ అనంత నిశ్శబ్దంలో వినిపించి నన్ను భయ కంపితురాలిని చేసింది. ఆ శబ్దం అంతకంతకూ చేరువై, చివరకు “నేను, భీముడను” అని చెప్పే వరకూ నా శరీరం కంపిస్తూనే ఉంది. భీముని ఆ మాటతో ప్రాణం కాస్తంత పదిల పడి, కనులు తెరిచి చూసే ప్రయత్నం చేశాను. కుదర లేదు. “చూశావా…అర్జున, నకుల సహదేవులు మువ్వురూ….” అన్నాడు భీముడు.  అర్ధమైంది. “అన్న ధర్మజుడు ఇంకా నడుస్తూ వెళ్ళి పోయాడు. నీవూ, నేనూ ఇలా మిగిలాం. బాధగా ఉన్నదా పాంచాలీ?” అన్నాడు భీముడు.

“తప్పని ఈ పరిస్థితికి బాధెందుకు? అయినా, నీవు పక్కన ఉండగా నాకు బాధేమిటి?” కష్టం మీద గొంతు పెగుల్చుకుని అన్నాను. “అవును, నీ కోసం నేనేమైనా చేస్తాను. చెప్పు, ఇప్పుడు ఏమి చెయ్యమంటావ్?” అడిగాడు భీముడు.  నేను నవ్వే ప్రయత్నం చేస్తూ అన్నాను “నాకు తెలుసు. నా కోసం నువ్వేమైనా చేస్తావు.  భూమికి చెందిన పురుషుడివి నువ్వు.  భూమికి చెందిన పడతిని నేను. మన ఇరువురి లక్షణాలూ ఒకటే. అందుచేత మిగిలిన నలుగురి కంటే నీకే నేను బాగా అర్ధమయ్యాను. నీలాంటి పురుషుడిని పుత్రునిగా కన్న స్త్రీ, పతినిగా పొందిన  స్త్రీ ఇద్దరూ సుఖ పడతారు. మన ఆరుగురకూ మరో జన్మంటూ ఉంటే, ఆ జన్మలో నువ్వు అగ్రజుడిగా పుట్టు. నీ నీడలో మనం అందరం సుఖంగా ఉందాం!”.

ఇవి నా ఆఖరు మాటలు. ఆ తరువాత…

(సమాప్తం)

నేను, యాజ్ఞసేనిని! …(8)

(7)

కీచకుని వధించ గలిగిన యోధుడు భీముడే అయిఉంటాడని కౌరవులు ఊహించారు. అజ్ఞాత వాసాన్ని భగ్నం చేయాలన్న కోరికతో విరటుని పైకి పెద్ద యెత్తున దండెత్తి వచ్చారు. ధర్మజుని అనుజ్ఞ మేరకు అర్జునుడు గాండీవ ధారియై కౌరవ సేనతో తలపడి తరిమి తరిమి కొట్టాడు. విరటునికి విజయం లభించింది. మా అజ్ఞాత వాసం అనాటితో ముగియడంతో, పాండవుల గుట్టు పసిగట్టా మనుకున్న కౌరువుల ఆశ నిరాశే అయ్యింది. అజ్ఞాత వాసం ముగిసి విజయోత్సాహంతో మేము ఇంటి ముఖం పట్టాము.

పదమూడేండ్లు రాజ్యాధికారానికి దూరమైన ధర్మజుడు తిరిగి కృష్ణుని దృతరాష్ట్రుని వద్దకు రాయబారిగా పంపడం, అర్ధ రాజ్యం కాదు, అయిదూళ్ళు కాదు, కనీసం సూదిమొన మోపగలిగినంత భూమిని కూడా పాండవులకు ఇవ్వనని దుర్యోధనుడు అనడం, యుధ్ధం తప్పనిసరి అవడం, పద్దెనిమిది రోజులు భీకరంగా జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో ఇరు పక్షాలూ బాగా నష్ట పోవడం, భీముడు అన్నట్లుగానే తన ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవడం, అర్జునుని చేతిలో కర్ణుడు నిహతుడవడం, అన్నీ అయి చివరికి రాజ్యాధికారం పాండవులకు దక్కడం జరిగింది.

ధర్మరాజు  సింహాసనం అధిష్టించే నాటికి రాచ నగరు అంతా బోసి పోయి ఉంది. అందరూ పోయారు. ఎక్కడ జూచినా రోదనలు. ఒక్క యుయుత్సుని తప్ప మిగిలిన నూరుగురు కొడుకులనూ  పోగొట్టుకుని గాంధారి ఏడ్చింది. నా అయిదుగురు పుత్రులనూ పోగొట్టుకుని నేను ఏడ్చాను. అభిమన్యుని పోగొట్టుకుని సుభద్ర ఏడ్చింది. మాకు లాగానే ఇంకా ఎందరో స్త్రీలు తమ తమ భర్తలను, పుత్రులను పోగొట్టుకుని రోదించారు. తప్పదు. యుధ్ధ మంటే విజితులకూ, పరాజితులకూ చివరకు మిగిలేది దుఃఖమే!

యుధ్ధం ముగిసి రాజ్యాధికారం పాండవుల చేతికొచ్చిన కొద్ది కాలానికే, ఊహించని విధంగా కృష్ణుడు ఒక విషాదకర పరిస్థితిలో మరణించాడు. కృష్ణుని మరణం ధర్మరాజును సంకటంలో పడవేసింది. ఆలోచించి, ఆలోచించి చివరకు రాజ్యాధికారాన్ని అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తునకు అప్పగించి, మేము అంతిమ యాత్రకు సమాయత్త మయ్యాం!

****

నేను, యాజ్ఞసేనిని! …(7)

(6)

వ్యాసుల వారికి కూడా చిక్కని నా అంతరంగ చిత్రాన్ని ఆవిష్కరించి చూపెట్టిన సహృదయుడు నన్నయ భట్టు. యోగక్షేమాలు విచారించి వెళ్దామని వచ్చిన కృష్ణునితో నా బాధను వెళ్లబోసుకున్న సందర్భంలో నా చేతనే చెప్పించిన మాటలు నా దృష్టికోణాన్ని స్పష్టంగా చూపెడతాయి.

****

ద్రౌపది: (నిర్వేదంగానూ, బాధ గానూ) అన్నా! పార్ధివ ప్రభుడైన పాండు మహీపతి కోడలినై యుండి, యుధ్ధ కుశలురైన పాండు తనూజులకు భార్యనై యుండి, పూజ్యుడవైన నీకు చెల్లెలినై యుండి, అధిక శక్తి సంపన్నుడైన దృష్టద్యుమ్నునికి తోబుట్టువునై యుండి, దృతరాష్ట్రుని ముద్దుల కొడుకైన దుశ్శాసనుని చేత నిండు సభలో తలపట్టి ఈడ్వబడి, ఆ పాపకర్ముని చేత పరిధాన మొలవగాబడి, దారుణమైన పరాభవాన్ని అనుభవించాను. నా ఐదుగురు భర్తలూ చేష్టలుడిగి చూస్తూ ఊరుకున్నారు. భీష్మ ద్రోణాది కురువృధ్ధ బంధు జనులనేకులుండీ ఒక్కరూ నోరు మెదపలేదు.  అదంతా ఒక ఎత్తు.  ఆ సూత పుత్రుడైన కర్ణుని నగవు ఒక ఎత్తు.  లోక గర్హితుడైన దుశ్శాసనుని చేష్ట కంటే కర్ణుని నవ్వు చిచ్చులా నా మనస్సును మాటిమాటికీ దహించి వేస్తూన్నది.  నా ఈ బాధ ఎప్పటికి తీరేను? నాలో రగిలిన ఈ జ్వాల ఎప్పటికి చల్లారేను?

కృష్ణుడు: దుఃఖించకు సోదరీ! నీ పగ తీరుతుంది.  నీ మనస్తాపం చల్లారుతుంది. పాండవుల ఇల్లాలుగా, రాజ్ఞిగా నిన్ను గౌరవించాల్సిన వారూ, ఆదరించాల్సిన వారూ విజ్ఞత కోల్పోయి నిన్ను పరాభవించడం, పరిహసించడం చూశావు. కొన్నాళ్ళు ఓపిక పట్టు.  భర్తలను పోగొట్టుకుని వారి సతులు ఒకరొకరుగా సాయం సంధ్య వేళలలో హృదయ విదారకంగా  రోదించడం చూద్దువుగాని!

****

ఇలా రోజులు గడిచి, పన్నెండేండ్ల వనవాసం పూర్తయింది.  పదమూడవ యేడు అజ్ఞాత వాసం కోసం మారు వేషాలతో విరటుని కోలువు చేరాము.  కీచకుని రంగ ప్రవేశం దాక రోజులు చాలా హాయిగా గడిచి పోయాయి. కీచకుని ఆగమనం పరిస్థితులను మార్చి వేసింది.  నాకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి.  చాలా నాళ్ళు ఓపిక పట్టాను.  బెదిరించి కూడా చూశాను.  కీచకుడు లెఖ్ఖ పెట్ట లేదు.  ఫలితం అనుభవించాడు, మూర్ఖుడు. ఒకనాటి రాత్రి జరిగిన ద్వంద్వ యుధ్ధంలో భీముని చేత వధించబడి తెల్లవారేసరికి ఒక పెద్ద మాంసపు ముద్దగా మిగిలాడు. కీచకునితో పాటు నన్నూ దహనం చేయాలని ప్రయత్నించిన అతని సోదరుల నుండి మళ్ళీ భీముడే నన్ను కాపాడాడు.

నేను, యాజ్ఞసేనిని! …(6)

(5)

ఒకటా, రెండా? పన్నెండేండ్ల వనవాసంలో ఎంతో తీరికి దొరికేది.  తీరిక దొరికిన సమయాల్లో అలోచనలు గతం లోనికి మళ్ళేవి.  గతం తలుచుకున్నప్పుడల్లా శరీరంలో రక్తం పగతో పరవళ్ళు తొక్కేది.  భీముడు చేసిన ప్రతిజ్ఞలు చెల్లించుకునే కాలం ఎప్పటికి వస్తుంది? దుశ్శాసనుని ఱొమ్ము రుధిరంతో నా కురులెప్పుడు తడుస్తాయి? అర్జునుని చేతిలో కర్ణుడు నిహతుడయ్యాడన్న వార్త నా చెవిన పడే రోజు ఎప్పుడొస్తుంది?…ఇలా సాగేవి ఆలోచనలు. కాలం నత్త నడక నడుస్తున్నట్లుగా ఉండేది. రోజు లెంతకీ దొర్లేవి కావు. పగ తీరే రోజు కను  చూపు మేరలో కనుపించక, దుఃఖితనై ఉన్న నన్ను భీముడు ఓదార్చేవాడు. భీముని ఓదార్పు మాటలు నాకు కొంత ఉపశమనాన్ని ఇచ్చేవి. నా మనస్తాపాన్ని కొంత చల్లార్చేవి.

స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించిన అనాటి మేటి విలుకాడైన అర్జునుని నేను మనసారా వరించి ఎంతగానో ప్రేమించాను.  అలాగే నేనూ అర్జునుని ప్రేమకు పాత్రురాల నవుతాననుకున్నాను. కానీ, నన్ను పణంగా పెట్టి జూదమాడిన ధర్మజుని చేతులు కాల్చుతానన్న భీముని వారించాడు అర్జునుడు. నిండు సభలో నన్ను జుట్టు పట్టుకుని ఈడ్చి దుశ్శాసనుడు పరాభవిస్తుంటే తల వంచుకుని నిలుచుండిపోయాడే తప్ప నోరు తెరిచి ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడలేదు అర్జునుడు.  మాట్లాడిన వ్యక్తి భీముడు.  మాట్లాడడం కాదు, కంఠనాళాలు బ్రద్దలయేలా అరిచి ప్రళయం సృష్టించ బోయాడు.  దుర్యోధనుడు తన తొడ చూపించి నన్ను వచ్చి కూర్చోమని పిలిచి నపుడూ అర్జునుడు మాట్లాడలేదు.

దుర్యోధనుని తొడలు విరగ కొట్టి వధిస్తానని యుధ్ధానికి అప్పటికప్పుడే సిధ్ధమై తన గదా దండాన్ని అందుకోబోయిన భీముని చూపుల్తోనే వారించిన వ్యక్తి ధర్మజుడు.  ఇవన్నీ తలుచుకున్నప్పుడల్లా, భీముడు నన్ను ప్రేమించినంతగా నేనెంతగానో ఆశపడి ప్రేమించిన అర్జునుడు నన్ను ప్రేమించ లేదని పిస్తుంది. తన భార్యగా నాకు దక్కాల్సిన గౌరవం దక్కనప్పుడల్లా భీముడు కోపంతో బుసలు కొట్టే వాడు. మిగతా నలుగురిలో నాకు ఆ లక్షణం కనపడేది కాదు. అలాంటి సందర్భాల్లో అర్జునుని మౌనం నన్ను మాటలతో చెప్పలేనంత మనస్తాపానికి గురిచేసేది. కర్ణుడు నిండు సభలో నన్ను గురించి చాలా అవమానకరంగా మాట్లాడి పరిహసించి నపుడు కూడా అర్జునుడు పెదవి కదపక పోవడం నన్ను చాలా కాలం క్షోభ పెట్టింది.  విలు విద్యా కౌశలంలో అర్జునునికి దీటైన విలుకాడుగా అందరి చేతా అంగీకరింపబడిన వ్యక్తి కర్ణుడు. కళ్లెదురుగా భార్యను పరాభవిస్తుంటే చూస్తూ ఊరుకున్న చేతకాని ఐదురుగురు భర్త లెందుకని నన్ను అవహేళణ చేశాడు. దుర్యోధనుని వంక చూపెడుతూ, ఇకనైనా ఆలిని పణంగా పెట్టి జూదం ఆడని వ్యక్తిని ఒక్కడిని చూసుకోమని హాస్యమాడాడు. కర్ణుని నవ్వుకు
అడ్డుకట్ట  వేయగలిగిన ఒకే ఒక వ్యక్తి, అర్జునుని మాట, ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట  అక్కడ లేకపోవడం నన్ను హింస పెట్టేది. ఇతడా నన్ను గెలుచుకున్నది? ఇతడినా నేను వరించినది? అర్జునుని ఇంత నిర్లిప్తతకు నేను చేసిన పాపం ఏమిటి? ఎంత ఆలోచించినా అర్ధమయేది కాదు. అందరిలోకీ చిన్నవాడయినా, ధైర్యంగా, చొరవ చేసుకుని, వికర్ణుడు చేయ బోయిన ధర్మ నిర్ణయాన్ని అడ్డుకుంటున్న కర్ణుని, అప్పుడే అర్జునుడు కలిగజేసుకుని ‘ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు ఇందులో తలదూర్చవద్దు, అదనంగా ఇంకొక్క మాట మాట్లాడినా నీ నాలుక తెగ గోస్తా’ నని తెగేసి చెప్పున్నట్లయితే, కర్ణుడు మారు మాట్లాడే ధైర్యం చేసే వాడా? అంత హేయంగా మాట్లాడి అవహేళణ చేయగలిగే వాడా? ఆ కారణంగానే, నా కలతలన్నిటికీ అర్జునుని మౌనమే మూలకారణంగా నేను అనుకుంటూ ఉండే దానిని. కర్ణుని నవ్వు మాత్రం సర్వకాల సర్వావస్థల లోనూ నన్ను వెంటాడుతూనే ఉండేది. చేతనను ఒక పట్టాన వదిలేది కాదు.  ఎప్పుడూ ఏదో ఒక వైపు నుంచి సన్నగా వినిపిస్తూ, పరిహసిస్తూ, నన్ను కలతకు గురి చేస్తూ ఉండేది. కర్ణుని నవ్వు పెట్టే క్షోభ నుంచి నాకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది?

నా ఈ అవ్యక్త మనస్తాపాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్ధం చేసుకున్న వ్యక్తి నన్నయ భట్టారకుడు.

****

నేను, యాజ్ఞసేనిని! …(5)

(4)

భీముడు: (ఉగ్ర రూపం దాల్చి) కురు వృధ్ధులు, గురు, వృధ్ధ బాంధవులు ఇంతమంది చూస్తుండగా, ఒళ్ళు మద మెక్కి, ద్రౌపదిని ఇలా పరాభవించిన ఈ పశువు దుశ్శాసనుని, లోక భీకరంగా వధించి, కొండలా బలిసి ఉన్న వాడి వక్షాన్ని చీల్చి అందుండి పారే వేడి రక్తాన్ని తాగుతాను.  అలా చేయలేని నాడు పితృ పితామహుల గతికి తప్పిన వాడి నౌతాను!

కర్ణుడు: (వికటంగా నవ్వుతూ) వింటున్నావా సుయోధనా….భీముని వీర వచనాలు? దుశ్శాసనుని వధించి రొమ్ము చీల్చి రక్తం తాగుతాడట! ఎంత శౌర్యం? (రోషంగా) ఈ కర్ణుడు జీవితుడై ఉండగానే? (తిరిగి హేళణగా) పైగా, అలా చేయలేని నాడు పితృ పితామహుల గతికి తప్పినవాడౌ తాడట! చివరికి అదే నిజమౌతుంది భీమసేనా, సిధ్ధపడు!  (ద్రౌపది వైపు తిరిగి, ఆమె నుద్దేశ్యించి) పాంచాలీ, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఐదురుగురు భర్తలున్నారు నీకు. అయినా ఏం ప్రయోజనం? చేతగాని ఐదుగురు భర్తల కన్నా, పౌరుషవంతుడైన ఒక్క భర్త మేలు! ఇప్పటికైనా జూదంలో ఆలిని పణంగా పెట్టి ఓడిపోని భర్తను ఒక్కడిని తగిన వానిని చూసుకో!

దుర్యోధనుడు: భేష్ కర్ణా భేష్! భలేగా చెప్పావ్! (ద్రౌపది వైపు చూస్తూ) నా ప్రియమైన మిత్రుడు కర్ణుడు చెప్పినట్లుగా చెయ్యి పాంచాలీ. రా…నువ్వు కూర్చోవడానికి సరిపోయే పీఠంలా నా బలమైన తొడ సిధ్ధంగా ఉంది. రా, వచ్చి కూర్చో!

****

భూ రాజ్య సంపదల బలంతో, ఒళ్ళు మదమెక్కి, ఉచ్ఛనీచాలు మరచి ఏ తొడనైతే ఎక్కి కూర్చోమని నన్ను దుర్యోధనుడు ఆహ్వానించాడో ఆ తొడను రణంలో తన గదాఘాతంతో విరగ గొడతానని శపథం చేసి, ఆయుధం చేబూన బోతూ అనుజ్ఞ కోసం ధర్మజుని వైపు దృష్టి సారించి నిలబడ్డ భీముని, కోప తాపాలు ప్రదిర్శించడానికి ఇది తరుణం కాదని భీష్మ, విదుర, ద్రోణాదులు సముదాయించి అపారు.

సభలో ఆ రోజు జరిగిందంతా విదురుని ద్వారా తెలుసుకున్న దృతరాష్ట్రులవారు బాధపడి, నన్ను దగ్గరకు పిలిపించుకుని ఇచ్చిన వరాల సహాయంతో పాండవులను వారి ఆయుధాలతో సహా దాస్య విముక్తులను చేసుకున్నాను.

రెండవ మారు ఆడిన జూదంలో కూడా ధర్మజుడు ఓడిపోయాడు.  ఫలితంగా మాకు పండ్రెండేండ్లు వనవాసం, పదమూడవ ఏడు అజ్ఞాత వాసం ప్రాప్తించింది. కట్టు బట్టలతో అడవుల పాలయ్యాం!


నేను, యాజ్ఞసేనిని! …(4)

(3)

నిజానికి దుర్యోధనుని మదిలో లేని ఆలోచనను రేపెట్టిన వాడు కర్ణుడు ఈ సందర్భంలో. దుర్యోధనుడు మూర్ఖుడు.  పరమ దురభిమాని.  అతని అంతరంగాన్ని కర్ణుడు చదవ గలిగినంతగా మరే వ్యక్తీ చదవ లేకపోయాడన్నది నిజం. ఒక్కొకప్పుడు దుర్యోధనుని దురభిమానానికి ఏది సంతృప్తి నిస్తుందో దుర్యోధనుని కంటె కర్ణుడే ముందుగా గ్రహించి అతనికి తెలియ జేశాడేమో అనిపిస్తుంటుంది.

మయసభలో మయుడి నిర్మాణ చాతురికి దృష్టాంతాలుగా నిలిచి ఉన్న అద్భుతాలను తిలకిస్తూ మైమరచి ఉన్న స్థితిలో ఊహించని రీతిలో పరాభవం ఎదురైంది దుర్యోధనునికి.  నీటి మడుగును నేలగా భ్రమసి అందులో పడిపోయాడు.  వొంటి మీదునున్న వస్త్రాలన్నీ తడిసిపోయాయి.  నవ్వుల పాలయ్యాడు.  అవమానంతో దహించుకు పోయుంటాయి అతని ఆత్మ, శరీరం.  విషయం తెలుసుకున్న ధర్మజుడు నూతన వస్త్రాలు పంపించాడు కింకరుల ద్వారా.  వాటిని అందుకుని తన శరీరం మీద తడిసిన వస్త్రాల స్థానే వాటిని మార్చుకుంటుంనప్పుడు దుర్యోధనుని దురభిమాన చిత్తంలో రగిలిన కౄరమైన అవమాన జ్వాల ఏ మాట వినడంతో మరొక సారి ప్రజ్వలితమై అతనిని పశువుగా మారుస్తుందో సరిగ్గా ఆ మాటనే వాడాడు కర్ణుడు ఈ సందర్భంలో.  అదే ‘విగత వస్త్ర’ అన్న మాట.  కర్ణుడు ఊహించినట్లు గానే ఆ మాట దుర్యోధనునికి మయసభలో తాను పొందిన అవమానాన్ని స్ఫురణకు తెచ్చింది.  బదులు తీర్చుకునే అవకాశాన్ని కల్పించింది కూడా.  అందుకు కర్ణుడిని అభినందిస్తూ, తమ్ముడైన దుశ్వాసనుని పురమాయించాడు, నన్నూ నా భర్త లైన పాండవు లైదుగురి వస్త్రాలనూ ఊడ్చేయమని.  లజ్జితులైన పాండవులు తమంత తామే ధరించి ఉన్న వస్త్రాలను విడిచి తల లొంచుకుని నిలబడ్డారు, అర్ధ నగ్న శరీరాలతో నిండు సభలో. మానవ లక్షణాలన్నీ మరుగున పడిపోగా పశువులా మారి వికటాట్టహాసం చేస్తూ నా వైపు అడుగులు వేశాడు దుశ్వాసనుడు.  నేను కంపించి పోయాను.  జరగబోయే దారుణాన్ని ఊహించుకున్న నా మనసు వశం తప్పింది.  అప్పటికే దుశ్శాసనుని పిడికిలి నా భుజం మీది చీర చెరగును ఒడిసి పట్టుకుంది. చేసేదేమీ లేక చేతులు జోడించి భగవంతుని ప్రార్ధిస్తూ శిలలా మారి పోయాను.

ఆ తరువాత ఏమైందో నాకు తెలియదు. భారతం కల్పిత కథ కాదు.  రాజ్యాధికారం కోసం అన్నదమ్ముల సంతానం మధ్య జరిగిన సుదీర్ఘ పోరాటం. ఇందులో కల్పనలకూ, అద్భుతాలుకూ తావుండ కూడదు. అయినా  ఒక అద్భుతం జరిగి నేనా దారుణాన్నుంచి బయట పడ్డట్లుగా చూపించింది భారతం. భారత రచనలో వ్యాస మహర్షి ఈ సన్నివేశాన్నెందుకు ఇలా అస్పష్టంగా వదిలి వేశాడో అర్ధం కాదు.

ఏదేమైనా, కర్ణుడు కోరుకున్నట్లు, దుర్యోధనుడు శాసించినట్లు నేను విగత వస్త్రను కాలేదు. నిండు సభలో దుశ్శాసనుడు నాకు చేయబోయిన పరవాన్ని చూసి సహించ లేక ఉగ్రుడై భీముడు సభలో అందరి ఎదుటా ప్రతిజ్ఞ చేశాడు.

****


నేను, యాజ్ఞసేనిని! …(3)

(2)

వికర్ణుడు: (తాను కూర్చుని ఉన్న ఆసనమును వీడి సభా మధ్యానికి అడుగులు వేస్తూ, ఆవేశంగా) కాదు, ద్రౌపది ధర్మ విజిత కాదు. (దుర్యోధనుని ఉద్దేశ్యించి) అన్నా, ఇది న్యాయం కాదు, ధర్మం కాదు.  (భీష్మ, ద్రోణాది కురువృధ్ధులు కూర్చుని ఉన్న ఆసనముల వైపుకు చూస్తూ, వారిని ఉద్దేశ్యించి) భీష్మ పితామహా….గురువర్యా ద్రోణాచార్యా….కృపాచార్యా….పెద్దలు, ధర్మ నిర్ణయం చేయగల సమర్ధులు ఇందరుండి ఈ సమయంలో ఇలా మౌనం వహించి ఉండడం సమంజసం కాదు.  జ్యూద వ్యసన వర్తియై, పరాజితుడైన పాండవాగ్రజుడు, పాండవులైదుగురికీ ఉమ్మడి సొత్తయిన ద్రౌపదిని పణంగా పెట్టి జూద మాడడం ఏ విధంగా న్యాయం? ఆమె ధర్మ విజిత కాదు.  అలాంటి ఆమెను, ఏకవస్త్రయై ఉన్న స్త్రీని, నిండు సభకు ఈడ్చుకు రావడం అన్యాయం, అమానుషం!

కర్ణుడు: (ఆవేశంగా) చాలించు వికర్ణా నీ అధిక ప్రసంగం. (అవహేళణగా ) చిరుతవు, నీ కెందుకోయ్ ఈ ధర్మ నిర్ణయాల గోల?

వికర్ణుడు: కర్ణా, హాస్యానికి ఇదా తరుణం?…. ధర్మ నిర్ణయానికి కావలసింది బుధ్ధి కుశలత గాని, వయసు కాదు కర్ణా!

కర్ణుడు: (వ్యంగ్యంగా) ఆహా! వింటున్నావా సుయోధనా మీ తమ్ముని వాక్చాతుర్యం? ద్రౌపదిని అధర్మ విజితగా ధర్మ నిర్ణయం చేసిన అతని బుధ్ధి కుశలతను గుర్తించావా? (ఆవేశంగా) అధర్మ విజితయట అధర్మ విజిత? ఎక్కడి అధర్మ విజిత? నిండు సభలో ఇందరి యెదుట ధర్మజుడు తన సర్వస్వాన్ని ఓడిపోవడం నిజం కాదా? సర్వస్వాన్నీఒడ్డి ఓడి పోయిన ధర్మజునిలో ద్రౌపది భాగం కాదా? ద్రౌపది ధర్మజునికి వెలి కాదు కనుక, ఆమె ధర్మ విజితయే! (పాండవుల వైపు చూస్తూ) అలా కానప్పుడు పాండవు లైదుగురూ ఆమెను ధర్మ విజితగా ఎందుకు ఒప్పుకున్నట్లు? ఎందుకు మిన్న కుండినట్లు? (ఒక్క క్షణ కాల విశ్రాంతి తరువాత) ఇక ఏకవస్త్రయై ఉన్నదానిని సభకు తోడ్కొని రావడం ధర్మం కాదని కదూ వికర్ణా నీ ధర్మ నిర్ణయం? ఏక వస్త్రను కాదు, విగత వస్త్రను చేసి తెచ్చినా తప్పు లేదు. ఎలా గంటావా? భార్యకు దైవవిహితుడైన భర్త  ఒక్కడుండడం ఆర్య ధర్మం.  కాని, ద్రౌపది అనేక భర్తృక. బంధకి. అలాంటి స్త్రీని విగతవస్త్రను చేసి సభకు తెచ్చినా ధర్మ విరుధ్ధం కాదు.

దుర్యోధనుడు: భళి కర్ణా భళి! చక్కగా చెప్పావు.  నీతి బాహ్యులైన ఈ పాండవులకు, ఈ బంధకికి అదే తగిన శాస్తి.  (దుశ్శాసనుని ఉద్దేశ్యించి, బిగ్గరగా) సోదరా దుశ్శాసనా!

దుశ్శాసనుడు: అన్నా!

దుర్యోధనుడు:  విన్నావుగా నా ప్రియ మిత్రుడు కర్ణుని ధర్మ నిర్ణయం. విగత వస్త్రను చేసి తెచ్చినా తప్పు లేదట! ఇంకా చూస్తూ నిలబడతావేం?

(దుశ్శాసనుని వికటాట్టహాసం).

****

నేను, యాజ్ఞసేనిని! …(2)

(1)

యాజ్ఞసేని: అవును, నేను యాజ్ఞసేనిని. యజ్ఞసేనుని కుమార్తెను గనుక నాకా పేరు. నా తోడబుట్టినవాడు దృష్టద్యుమ్నుడు. సంతానార్ధియై యజ్ఞంచేసిన ద్రుపదులవారికి మా యిద్దరిని మా తండ్రి సొంతం చేశాడు.  అప్పటినుండీ నేను ద్రుపదమహారాజు కుమార్తెగా ద్రౌపది నయ్యాను. ద్రుపదమహారాజు కుమార్తె గానే అష్టైశ్వర్యాలూ అనుభవిస్తూ పెరిగి పెద్ద దానిని అయినాను. యుక్త వయసు రాగానే, వివాహం చేయాలని సంకల్పించారు తండ్రిగారు. నాకు తగిన వరుడిని వెదికి పట్టుకోవడం కోసం మత్స్య యంత్రాన్ని నిర్మించి, దానిని ఛేదించిన విలుకానికే నన్ను కట్టబెడతామని చాటింపించారు. కర్ణుడితో సహా ఎందరో ప్రయత్నించి విఫలులైన ఆ మత్స్య యంత్రాన్ని బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ఛేదించి నన్ను పొందాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్నది పాండవ మధ్యముడే అని తెలిసిన తరువాత ద్రుపద మహారాజులవారు మరీ సంతోషించారు. పాండునందనులైదుగురితో నేను అత్తవారింటికి బయలుదేరి వెళ్ళాను.ఏకచక్రపురంలోని బ్రాహ్మణవీధిలో ఒక సాధారణ గృహస్తుని ఇంట్లో ఉంటూ బిక్షాటన చేసుకుని భుక్తి గడుపుకుంటున్నారు పాండవులా రోజులలో. ‘తమ్ముడు ఒక అసాధారణ బిక్ష సంపాదించి తెచ్చాడమ్మా ఈ రోజు!’ అని విన్నవించిన ధర్మజునితో ‘అయినా అందరూ సమంగా పంచుకోండి’ అన్నది కుంతి.  ఆ బిక్ష నేనని తెలిసిన తరువాత కూడా ఆ మాటను విడువ లేదామె.  ధర్మజు డందుకు అంగీకరించ లేదు.  అన్న లిద్దరు అవివాహితులుగా ఉండగా నేనందుకు ఒప్పుకోనని అర్జునుడన్నాడు. చివరికి వ్యాసులవారి సలహా మేరకు పాండవు లైదుగురకూ నేను పత్ని నయ్యాను.  కుంతీ దేవి స్థానంలో పాండవు లైదుగురకూ ఆపై  ‘ఆడదిక్కు’ నయ్యాను.

పాండవు లైదుగురూ గొప్ప వీరులే.  అయినా ఏం ప్రయోజనం?  జూదంలో నన్ను పణంగా ఒడ్డి ధర్మజు డోడిన నాడు, నిండు సభలో దుశ్వాసనుడు నా ఒంటిపై చీరను ఒలిచే ప్రయత్నం చేస్తుంటే ఒక్కరూ అడ్డుకోలేక పోయారు.  నిస్సహాయనై సభా మధ్యంలో ఒంటరిగా నిలబడ్డాను.  భీష్మ, విదుర, కృపాచార్యాది కురువృధ్ధు లనేకులు సభలో ఉండి కూడా దుశ్వాసనుని ధర్మబాహ్య కార్యాన్ని ఒక్కరూ అడ్డుకోలేదు.  ఎందుచేత? దుర్యోధనునికి భయపడా? లేక, నిజంగానే నేను ధర్మ విజితనే అని నమ్మి నందునా? అసలింతకీ నేను ధర్మ విజిత నేనా?

కురువృధ్ధు లనేకులు మాటాడక మిన్నకుండిన సభలో, వయసులో చిన్న వాడైనా ధైర్యం చేసి వికర్ణుడు నేను ధర్మ విజితను కాదని చక్కటి న్యాయం చెప్పాడు.  అయినా ఎవరూ లక్ష్య పెట్టలేదు. జరగ బోయే దారుణాన్ని అపే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయలేదు.  ఎందు చేత? నేను ధర్మ విజితనని నమ్మేనా? భగవంతునికి తెలియాలి.  భారతంలో ఈ సందర్భం ఇలా చోటు చేసుకుంది.

*****

నేను, యాజ్ఞసేనిని! …(1)

ప్రవేశిక

(పాంచాల దేశపు రాజధాని కాంపిల్య నగరంలో ఒక రోజు. పూర్వాహ్న సమయం.  రాజనగరు పరిసర ప్రాంతం అంతా కోలాహలంగానూ, అట్టహాసంగానూ గొప్ప ఉత్సవం జరుగుతూన్నట్లుగా ఉంది.  రాజ నగరుకు వెలుపల, వీధిలో పురజనులిద్దరు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు)

మొదటి వ్యక్తి: వింటున్నవా, మిత్రమా…ఆ కోలాహలం! రాచ నగరులో ఏదో ఉత్సవం జరుగుతున్నట్లుగా లేదూ?
రెండవ వ్యక్తి: అవును, ఉత్సవమే మిత్రమా! కాదూ మరి? ద్రుపద మహారాజుల వారి జీవితంలో ఈ రోజు ఎంత సుదినమో కదా!
మొ.వ్య: అవునా!? ఆ విశేషమేవిటో నాకూ కాస్త చెప్పవయ్యా.
రెం.వ్య: అదేవిటి? నీ కింకా తెలియదా మిత్రమా? అయితే విను. రాజ్యాధికారం చేపట్టి ఇన్నేళ్ళు గడిచినా సంతానం కలగక సంతాపం చెందుతున్న ద్రుపద మహారాజులవారు, అనుభవజ్ఞులైన పండిత, పురోహితుల ఆధ్వర్యంలో సంతానం కోసం యజ్ఞం చేస్తూన్న సంగతి తెలిసిందే కదా!
మొ.వ్య: అవునవును, ఆ విషయం అందరూ ఎరిగినదే కదా!
రెం.వ్య: సంతుష్ఠుడయిన యాజుడు కడకు కరుణించాడటయ్యా మిత్రమా!
మొ.వ్య: ఆహా, ఎంత మాటా… కరుణించి?
రెం.వ్య: కరుణించి ద్రుపద మహారజుల వారికి ఒక కుమార్తెను, ఒక కుమారుడిని ప్రసాదించాడట.  అందుకే రాచ నగరులో ఈ సంబరం.
మొ.వ్య: ఓహోహో, వీనుల విందైన మాట చెప్పావు గదయ్యా మిత్రమా! ద్రుపదమాహారాజుల వారి కోరిక ఇన్నాళ్ళకు గదా తీరింది. ఆఁ! అదేమిటి మిత్రమా కోట సింహ ద్వారాన్ని ఎప్పుడూ లేంది భటులు అలా బార్లా తెరుస్తున్నారు? ఏమిటీ వింత?
రెం.వ్య: అందులో అంత వింతేమీ లేదు మిత్రమా! పురజనులందరికీ ఈ రోజెంతో పండగదినం కదా! నగరులో జరిగే ఉత్సవాలలో మనమూ పాలు పంచుకోవచ్చు. నాతో రా…మనమూ నగరులో ప్రవేశించి ఉత్సవాలను కళ్ళారా తిలకిద్దాం. ఈ రోజు కోటగుమ్మం దగ్గర మనల్ని ఎవ్వరూ ఆపరులే భయపడకు.  త్వరగా నడు… యాజుడు ప్రసాదించిన ఇరివురు సంతానంతో మహారాజులవారు అంతఃపుర సౌధపు పై అంతస్తునుండి దర్శనమిస్తారని విన్నాను. దర్శనంచేసుకుని మనమూ తరిద్దాం!
మొ.వ్య: అవునా మిత్రమా? అయితే పద మరి. ఇంక ఆలస్యం దేనికి?

*****