‘శుభాన్ని ధ్వంసం చేసే కలికాలంలో కూడా త్రికాల దర్శిత్వాన్ని ఇచ్చి, వర్షం సరిగా ఎప్పుడు కురిసేదీ చెప్పే జ్యోతిశ్శాస్త్రం కన్న మిన్న ఏమున్నది?’ అని ప్రశ్నించిన వరాహమిహిరుడు బృహస్సంహితను మనకిచ్చాడు. జ్యోతిశ్శాస్త్రంలో గణితము, హోర, శాఖలనే మూడు స్కంధాల కలయికను సంహిత అంటారని చెబుతారు. “సంహితా సారగః దైవచింతకో భవతి” అని. అంటే సంహితను పూర్తిగా అవగాహన చేసుకున్న వాడే దైవచింతకుడు అని ఆ మాటల అర్ధం.
*****
దేని ద్వారా జ్ఞాన ప్రాప్తి కలుగుతుందో అది వేద మనబడుతుందని పెద్దల మాట. దర్శన వ్యాకరణ గ్రంథాలు సూత్రాలలో, కావ్య మహాకావ్యాలు శ్లోకాలలో కూర్చ బడినట్లే, వేదాలు మంత్ర రూపంలో నిబధ్ధం చేయబడినాయి. మంత్ర సంకలనాలకు సంహిత లని పేరు. వేదాలు నాలుగు సంహితల రూపంలో ఉన్నాయి. ఒక్కొక వేదానికి నాలుగు విభాగాలు ఉంటవి. అవి సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తులు.
*****
నీతి లోకానుభవ ప్రతిబింబము. లోకోక్తులే క్రమముగా నీతులు అవుతున్నాయి. మహా మండలేశ్వరుడు భద్ర భూపతి (బద్దె భూపతి, బద్దెన) వివిధ నామాలతో తన్ను తాను సంబోధించుకుని, “నీతి శాస్త్ర ముక్తావళి” అని ఆంధ్ర లోక సర్వస్వమునకు పరిచితమైన “సుమతీ శతకము” ను రచించాడు. రాజ కవి యగుట వలన ప్రతాపరుద్రుని పక్కన ఉండ దగిన వాడు. ప్రతాపరుద్రుని “నీతి సారము” లోని పద్యాలకు “సుమతీ శతకము” లోని పద్యాలకు చాలా పోలికలున్నాయని పెద్దల మాట.