తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

ఆంధ్రుల లేదా తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర గురించిన ఈ notes లో తొలి వెయ్యేళ్ళు అంటే క్రీస్తు శకాబ్దం మొదలుకొని ఆపై వెయ్యేళ్ళదాకా అని అనుకున్నది.
అయితే, ఇది నిజానికి ఇంకో రెండువందల పాతికేళ్ళు ముందుకు వెళ్ళి అదనంగా మరో రెండువందలపాతికేళ్ళు కలిసి మొత్తం పన్నెందువందల పాతిక
సంవత్సరాలవుతుంది. దీనికి కారణం, శాతవాహనుల పరిపాలనతో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర మొదలవుతుంది/మొదలుపెట్టుకోవాలనుకుంటే,
శాతవాహనుల పాలన క్రీ.పూ.225 లో మొదలై క్రీ.శ.225 తో అంతమయిందని చరిత్రకారులంటారు గాబట్టి. శాతవాహనుల పరిపాలనలో తెలుగువాళ్ళ
సాంఘిక చరిత్రకు కూడా క్రీ.పూ.225 నుంచి ఆధారలు దొరకాలి.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి. ఆంధ్ర భృత్యులని మాటకూడా ఉంది. దీనిమీద లేచినవివాదం ఇంకా ఎటూ తెలకుండానూ ఉంది. ఆంధ్రులైన భృత్యులా?
ఆంధ్రులకు భృత్యులా? ఆంధ్రులు వేరే రాజవంశం వారై, వారికి శాతవాహనులు సామంతరాజులా? అని మీమాంస. అదెలా ఉన్నా, నాలుగున్నర శతాబ్దాల
వీరి పరిపాలన మాత్రం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లిందని చెప్పుకోవాలి. నాలుగున్నర శతాబ్దాలు ఒకే రాజవంశం ఒక భూభాగాన్ని నిరాటంకంగా పరిపాలించడం
అంత సులభంగా జరిగే పని కాదు. అయినా శాతవాహనుల విషయంలో అది సాధ్యమైంది. తరానికి 25 సంవత్సరాల చొప్పున (చరిత్ర పరిశోధనలో తరానికి 25
సం.గా వేసుకుని లెక్కిస్తారని చదివాను) నాలుగున్నర శతాబ్దాలకు 18 తరాలవుతుంది. అంటే తరం నుంచి తరానికి సాగే జ్ఞాపకాల ప్రవాహంలో
పరిస్థితులలోనూ పరిపాలకులకు చెందిన విషయాలలోనూ ఏవిధమైన మార్పూ లేకుండా 18 తరాలు గడవడం, జ్ఞాపకాల, అనుభవాల ప్రవాహం నిరాటంకంగా
కొనసాగడం అన్నది చరిత్రలో ఒక అరుదైన సందర్భం, ఒక luxury గానే చెప్పుకోవాలి. ఆ సందర్భాన్ని, ఆ luxury ని  శాతవాహనుల పరిపాలనలో
అప్పటి ప్రజలు అనుభవించారు.

ఈ సుఖాన్ని అనుభవించిన వాళ్ళలో తెలుగు మాతృభాషగా ఉండిన తెలుగువాళ్ళూ ఉన్నారు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అప్పుడు, అంటే
శాతవాహనుల పరిపాలనా కాలం నాటికి, ఆంధ్రులు తెలుగువాళ్ళూ ఒక్కటి కాదా? అని. కాదనే నేను అనుకుంటాను. అయితే గనక, ఆంధ్రులైన
శాతవాహనులు తమ మాతృభాష అయిన తెలుగును వదిలి ప్రాకృతాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు? శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజబాష, ప్రజల భాష
కూడాను! ప్రాకృతంలోనే కదా గాథాసప్తశతిలోని గాథలన్ని ఉన్నాయి! అయితే, అప్పటికి తెలుగింకా పూర్తిగా పరిణతిచెందిన భాషగా కాకుండానన్నా
ఉండిఉండాలి. అలా అనుకోవడానికీ వీలు లేదు.  కారణం, గాథాసప్తశతిలో అక్కడక్కడా కనుపించే అత్తా (అత్త), అద్దాఏ (అద్దం) లాంటి కొన్ని తెలుగు
పదాలు, తెలుగు అప్పటికే పూర్తిగా పరిణతి చెందిన భాషగా ఉండినదనీ, ఎంత పరిణతి అంటే, అందులోని కొన్ని మాటలు వేరే భాషలోకి వెళ్ళగలిగేంత పరిణతి
చెందిన భాషగా శాతవాహనుల కాలంనాటికే ఉండినదనీ, పూజ్యులు కీ.శే.తిరుమల రామచంద్ర గారు తమ వ్యాసాలలో ఇప్పటికే నిరూపించి ఉన్నారు కాబట్టి!

అదలా ఉంచితే, “ఆంధ్రశ్చ బహువః” అనే మాట ఒకటి ఉంది. దీని అర్ధం ఆంధ్రులు పలువురు అని. అంటే, పలు జాతుల ప్రజలు కలిసి ఆంధ్రులు
అయ్యారని ఇది సూచిస్తుంది. ఇది నానుడి. ప్రజల నాలుకలపైనుంచి వచ్చిన మాట. దీనికి నిదర్శనాలు, ఆధారాలూ దొరకవు. తరం నుంచి తరానికి ఇలా
దిగుమతి అయిన జ్ఞానంలో నిజం బొత్తిగా ఉండదు అనుకోవడం సాహసమే అవుతుంది. ఈ పలు జాతుల ప్రజలలో తెలుగు మాతృ భాషగా కలిగిన తెలుగువాళ్ళూ
ఉండిఉండవచ్చు. కాదనటానికి లేదు. బలమైన, ప్రభావవంతమైన జాతి కావడం మూలాన పోనుపోను ఆంధ్రులంటే, తెలుగువాళ్ళన్నది స్థిరపడి పోయి
ఉంటుందనుకోవాలి.

తెలుగు మాట, పాట, పద్యం (5)

అచ్చ తెనుగు పద్యం

తెలుగు పద్య సాహిత్యంలో ‘అచ్చ తెనుగు’ అన్న మాటను మొదటి సారిగా వాడిన వ్యక్తి మూలఘటిక కేతన అని చెబుతారు. ఈయన తిక్కన మహాకవి సమకాలికుడు. తెలుగులో మొదటి కథాకావ్యానికి (దశకుమార చరిత్ర) శ్రీకారం చుట్టినవాడు కేతన. ‘కవిత చెప్పి’ తిక్కన మహాకవినే మెప్పించినవాడు ఈయన.  ఈయన చెప్పిన ఈ ‘అచ్చ తెనుగు’ అనే మాటకు ముందు, ఈ మాట ఏ అర్ధాన్నయితే సూచిస్తుందో అదే అర్ధంలో ‘జాను తెనుగు’, ‘దేశి’ అనే మాటలు వాడుకలో వుండేవి. ఈ మాటలను తమ పద్యాలలో చెప్పిన వారు ‘నన్నె చోడుడు’, పాలుకురికి సోమనాధుడు!

పేరుకి ఇన్ని మాటలున్నా, ఈ మాటలు ‘అచ్చ తెనుగు’ భాషా స్వరూపాన్ని అర్ధమయేలా చేయడంలో సఫలీకృతం కాలేకపోయాయన్న ఒక అభిప్రాయం, విజ్ఞుల మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి! భాషా స్వరూపం అర్ధం కావాలంటే, ఒక ఉదాహరణంతో చెప్పుకుంటే, కొంతలో కొంత స్ఫష్టత వచ్చి, సులభం అవుతుంది.

“పగలు సేయుచు వేడిమి మిగుల జగము
గ్రాచు జమునబ్బ మున్నీట గలిసె ననియొ
తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపు
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”

కూచిమంచి తిమ్మకవి రచించిన ‘అచ్చ తెలుగు రామాయణం’ కావ్యంలోనిది ఈ పద్యం. సూర్యాస్తమయాన్ని సుందరంగా వర్ణించే పద్యం! నాకయితే, ఈ పద్యంలోని మాటల పొందిక, brevity, గాథా సప్తశతిలోని గాథలను తలపుకు తెస్తుంది. మంచి భావంతో నిండి వున్న పద్యం! ఊహ original ది! నాకు తెలిసినంతవరకూ, ఏ ప్రాకృత గాథనుంచో, సంస్కృత శ్లోకంనుంచో ఎత్తుకొచ్చింది కాదు!

ఇప్పుడు, ఈ పద్య భావాన్ని కొంచెం విడమరచి చెప్పుకుంటే…

‘పగలు సేయుచు’ – పగలు సేయువాడు – దినకరుడు.
సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ, కొన్ని రకాలయిన సంస్కృత సమాసాలు అచ్చ తెలుగులోకి మారేటప్పుడు జరిగే మార్పులను గురించి కొంత వివరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సంస్కృత సమాసాలలోని ప్రత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, దొర, తపసి, జోదు…ఇత్యాది శబ్దాలు జతవుతాయి అని వ్యాకరణం. ఉదాహరణకి:

అచ్చ తెలుగులో ‘కప్పు కుత్తుక వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘నీలకంఠ’ కు,
అచ్చ తెలుగులో ‘గిత్త తత్తడి వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘వృషభ వాహన’ కు,
అచ్చ తెలుగులో ‘వెంట్రుక యడుగుల దొర’ అనే సమాసం, సంస్కృతంలో ‘రోమ పాద’ కు,
అచ్చ తెలుగులో ‘మనుబోతు కొమ్ము తపసి’ అనే సమాసం, సంస్కృతంలో ‘ఋష్యశృంగ’ కు,
అచ్చ తెలుగులో ‘పచ్చ వారువపు జోదు’ అనే సమాసం, సంస్కృతంలో ‘హరిదశ్వా’ కూ అనువాదాలని పెద్దల వివరణ. తెలుగులో వీటినే బహువ్రీహి సమాసాలుగా భావిస్తారని కూడా చెబుతారు, అర్ధంలో చివరన కలది, కలవాడు చేరతాయి కాబట్టి. (నల్లని కంఠము కలవాడు, ఎద్దును వాహనముగా కలవాడు…ఇత్యాదిగ).

నాకయితే తెలుగులో ఈ మాటలు, సంస్కృతంలో మాటలు ఎంత అందంగా కనిపిస్తాయో, తెలుగులోనూ అంతే అందంగా అనిపిస్తాయి. ఇలాంటివే ఇంకొన్ని సమాసాలు:

వలిగుబ్బలి రాచ కూతురు (హైమవతి – హిమవంతుని కూతురు, ‘వలిగుబ్బలి’ అంటే మంచుకొండ అని అర్ధం), పుట్ట బుట్టువు తపసి (వాల్మీకి – పుట్ట  నుంచి పుట్టిన తపస్వి), పదియరదముల దొర కొడుకు (దాశరధి – దశరధుని కుమారుడు) – ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలంత అందంగానే కనబడతాయి.

ఇక్కడితో ఇది ఆపి, అసలు పద్యానికొస్తే –

పగలు సేయుచు – పగటిని చేస్తూ, ఆ క్రమంలోనే; వేడికి మిగుల జగము గ్రాచు – వేడిమితో జగత్తునంతా వుడికించి ఇబ్బందికిలోను చేసే; యమునబ్బ – యముని తండ్రి (సూర్యుడు); మున్నీట – సముద్రములోనికి; కలిసె ననియొ – కలిసిపోయాడుగదా అని; తొగ వెలందుక – కలువ పూవు (అనే పడతి); నగియె – నవ్వింది; అమ్మగువ – ఆ కలువ సుందరి; పెంపు గని – సంతోషంతో వదనం పెద్దదవడం (కలువ వికసించడం అన్న భావం) చూసి; సయింపక – తాళ లేక; తమ్మి – తామర పూవు (అనే పడతి); మొగంబు మొగిచె – మొహం ముడుచుకుంది, చాటు చేసుకుంది.

సూర్యాస్తమయంతోనూ, చంద్రాగమనంతోనూ కలువలు వికసించడం అనేది ప్రకృతి ధర్మం. సూర్యాస్తమయంతో తామరలు వికసనం కొల్పోయినట్లయి, కళావిహీనంగా, ముడుచుకున్నట్లయిపోవడమూ ప్రకృతిధర్మమే! ఈ రెండు ధర్మాలనూ కలబోసి, ఒకే సందర్భానికి జతచేసి, హృద్యంగా చెప్పడం ఈ పద్యంలో జరిగింది.

నాకు ఈ పద్యాన్ని చదివినప్పుడల్లా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది. పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గాథా సప్తశతి లోని పద్యాలను తెలుగులోకి అనువదించడంలో ఈ పద్యాన్నే(సరిగ్గా ఈ పద్యాన్నే అని కాకుండా, ఇలాంటి పద్యాలనే) ఆదర్శంగా తీసుకున్నరేమో! అని. ఎందుకంటే, అందులోని చాలా పద్యాల నడక ఈ పద్యాన్నే పోలి వుంటుంది. ఉదాహరణకి:

“అడుగుదమ్ములందు బడివేడు పతివీపు
జిన్ని కొమరుడెక్కి చెలగి యాడ
అలుక యెంత తెగనిదయ్యును నిల్లాలి
మొగమునందు నవ్వు మొలచె నపుడు! “                (శతకం 1 గాథ 11)

“ఎవని వదలిన జీవంబు నవసి చనునొ
యతని నపరాధినయ్యు నోదార్ప వలయు;
ఊరు గాలుచు బొలిపోవు చున్న గాని
యగ్గి నొల్లని వారెవ్వరతివ, చెపుమ?”         (శతకం 2, గాథ 63)

అందుండి అచ్చ తెలుగు మాటలలో వున్న ఇలాంటి రమ్యమైన పద్యాలను ఇంకా చాలానే ఉదాహరించవచ్చు!

వియోగం (2)

ఇంటిలో సంధ్య వేళ దీపం, పరుచుకోబోతూన్న చీకటిని పారద్రోలే తొలి వెలుగు. అప్రయత్నంగానే కనులు మొగిడ్చి ఆ వెలుగుకు నమస్కరించడం మన సంస్కృతిలో భాగమై పోయింది, ఆ వెలుగుని దైవ సమానంగా భావిస్తాం గనుక!  దైవ సమానం గనుకనే ఆ వెలుగు వివాహం అయిన స్త్రీకి భర్తను జ్ఞాపకం తెస్తుందని ఊహించాడు వెయ్యేళ్ల క్రితమే ఊరూ పెరూ తెలియని ఒక సామాన్య ప్రాకృత కవి.  ఆ క్షణం వెలుగై అతను ఆమె కళ్ళ ముందే ఉన్నాడు గాని, భౌతికంగా అతడు దగ్గరగా ఉండే సందర్భం, అవకాశం దగ్గరలో లేదనే భావన, ఆలోచన మనస్సును బాధకు గురిచేస్తే, ఆమె కన్నీటి పర్యంతం అయింది.  ఇది అతి పవిత్రమైన, మాటలతో వర్ణించి చెప్పగాలేని వియోగ బాధ.  ఈ బాధను ఇలా ఊహించడానికి అంతే పవిత్రమైన హృదయం ఉండాలి.  అతనెవరో గాని, ఆ ప్రాకృత కవికి అంతటి పవిత్ర హృదయం ఉందనడానికి ఏమాత్రం సందేహపడనక్కర లేదు.

పై ప్రాకృత గాథకు నేను చేసుకున్న తెలుగు స్వేఛ్ఛానువాదం:

“ఇంటిలోన సందె దీపమ్ము వెలిగించునట్టి తరుణాన
ఒంటరై యున్న తరుణి హృదిన ప్రవాసుడైన పతి తలపు మెరిసె;
కంట నిండిన నీరు ధారలగు రీతి భీతి గొలుప
ఇంట దీపమ్మా కన్నీట నారునోయని మోమావంకకు తా చాటు చేసె.”

వియోగం (1)

వియోగం ఒక అవస్థ. తప్పనిసరి పరిస్థితులలో వేరైపోయి ఒకరినొకరు చేరుకోలేని దూరాలలో ఉండాల్సి వచ్చిన స్త్రీపురుషుల హృదయాలను తెరిచి చూడడం గనుక చేయగలిగితే, అక్కడ అన్యులకు అర్ధంకాకుండా కనిపించే ఒక surrealistic చిత్రం లాంటి భాధామయ దృశ్యం అది.

అది హృదయమంత అనాది. ఆకలి దాని పునాది. సంపాదించుకు రావాల్సిన బాధ్యత పురుషుడిపై ఎప్పుడు పడిందో అప్పుడే వియోగావిర్భావానికి బీజమూ పడింది. దూరాలకు బయటకు వెళ్ళే పురుషుడు తన స్త్రీని వెనుక వొంటరిగా వదిలి వెళ్ళక తప్పదు. ఇది ఒక తప్పనిసరి స్థితి. ఈ స్థితి కి సంబంధించిన ఊహ కవుల చిత్తాల్లో ఎన్నెన్నో కల్పనలకు దారి తీసింది. ఎన్నెనో బాధామయ దృశ్యాలను కవిత్వీకరించి చూపించేలా చేసింది.

వియోగం అనగానే నా తలపునకు వచ్చే మొట్టమొదటి బాధామయ చిత్రం హాలుని ‘గాథా సప్తశతి’ కాలానికి, అంటే క్రీ.శ.19-24 సం.ల రోజులకు చెందినది. ఒక మహా బాధామయ సన్నివేశాన్ని అంతే గొప్పదైన, ఉదాత్తమైన రీతిలో కళ్ళకుకట్టినట్లుగా కవిత్వీకరించి చూపిస్తుంది ఈ గాథ. భారతీయ సాహిత్యం మొత్తంలో వెదికినా, తప్పనిసరి పరిస్థితులలో తన పతికి దూరమై ఉంటున్న ఒక స్త్రీ వియోగ బాధను ఇంత ఉదాత్తంగా చిత్రించి చూపిన పద్యం గాని, పాట గాని, దీనితో సరితూగ గలిగినది వేరే ఉంటుందంటే నాకు సందేహమే!

“పిఅ సంభరణ పలోట్టంత వాహధారా నివాఆ భీఆఏ
దిజ్జఇ వంకగ్గీవాఏ దీవఓ పహిఠ జాయయా.”                    (3వ శతకం -22వ గాథ)

దీని సంస్కృత చాయ:

“ప్రియ సంస్మరణ ప్రలుఠ ద్భాష్ప ధారానిపాతభీతయా
దీయతే వక్రగ్రీవయా దీపకః పథిక జాయయా.”

భర్త వ్యాపార నిమిత్తం దూరం వెళ్ళి పరదేశంలో ఎక్కడున్నాడే తెలియకుండా ఉన్నాడు. సంజె వేళ అయింది.  ఆమే ఇంటిలో దీపం పెడుతోంది. కనుల ఎదుట వెలిగిన దీపం ఆమెకు వెంటనే భర్తను తలపులలోకి తెచ్చింది. తలపులలో అతను మెదిలినదే  తడవుగా, కనులలో కన్నీళ్ళు నిండి ధార కట్టడానికి సిధ్ధమయ్యాయి.  చెంపల మీదుగా క్రిందకు జారి పడడానికి సిధ్ధంగా ఉన్న కన్నీళ్ళు ఎదురుగా ఉన్న దీపాన్ని ఆర్పివేస్తాయేమో అన్న భయంతో ఆమె తన ముఖాన్ని అటుగా తిప్పి దీపం పెడుతున్నది. ఇది ఈ గాథ భావం. ఈ సన్నివేశం, భావం కరిగించలేని హృదయం ఉండగలదా!?

హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (4)

శ్రీనాథుని పద్యపు ప్రథమ పాదంలోని ‘దావగొను’ అనే పదానికి సంబంధించి విశేషంగా చర్చ జరిగింది. నిఘంటువులలో కనుపించని పదం ఇది. శ్రీనాథుడు ఈ పదాన్ని ‘విన్నావా? చెవిన పెట్టావా?’ అన్న అర్ధంలో వాడాడనేది స్పష్టం. ఈ పదం స్థానంలో ‘తావు గొనవా’, ‘తావి గొనవా’, ‘తాల్మి గొనవా’, ‘త్రావ గనునా’ ఇత్యాది పదాలను ఉంచి, అప్పట్లో చర్చలో పాల్గొన్న పెద్దలు, అర్ధం పొసిగేలా చేయాలని ప్రయత్నించారుగాని, ఈ పదాలలో ఏదీ శ్రీనాథుడు చెప్పిన ‘దావ గొనవా’ అన్న పదం చేకూర్చిన అందాన్ని అక్కడ ఇవ్వలేక పోవడంతో అలాగే వదిలేయక తప్పిందికాదు. ఇలాగే, మూడవ పాదంలో ‘తగవా మగవారల దూఱ’ అన్న చోట కూడ అర్ధానికి తగినట్లుగా మాటల పొంతన సరిగా కుదిరినట్లు కనుపించదు.  ‘తప్పు నీ దగ్గర పెట్టుకుని, కోపగించుకున్నాడని పతిమీద పోట్లాడడం తగునా?’ అని చెప్పడం అక్కడి సందర్భం. సందర్భానికి సరిపోయేట్లుగా లేవనిపించినప్పిటికీ, పద్యపు నడకను దృష్టిలో ఉంచుకుని చూసినప్పుడు, ఆ పదాలను శ్రీనాథుడు చెప్పినట్లుగానే ఉంచేయడం మేలనిపించి ఎటువంటి మార్పూ చేయకుండా అలాగే ఉంచేయడం జరిగింది. తెలుగు భాషా సాహిత్యాలపైన మక్కువ గల వారికి, శ్రీనాథుడు తెనిగించిన ‘గాథా సప్తశతి’ లభించి ఉన్నట్లయితే అందులో ఇంకా ఇలాంటివే ఎన్నెన్ని ఆసక్తికరమైన, సుందరమైన భాషా ప్రయోగాలు వెలుగు చూసి వుండేవో గదా! అనిపించక మానదు.

ఇదిలా ఉండగా, ఆశ్చర్యకరమైన విషాయాలేమిటంటే, క్రీ.శ. 1931 దాక శ్రీనాథుని ‘శాలివాహన సప్తశతి’ కావ్యం లభ్యమై ఉండినదనడానికి నిదర్శనాలు ఉన్నాయి. క్రీ.శ.1931 లో జరిగిన కాకతీయ చారిత్రక మహోత్సవాలలో భాగంగా జరిగిన గ్రంథ ప్రదర్శనలో శ్రీనాథుని ‘సప్తశతి’ ప్రదర్శించబడినట్లుగా ‘కాకతీయ సంచిక’ కు అనుబంధమైన ‘ఉత్సవమున ప్రదర్శించిన గ్రంథములు’ పట్టికలో ఉన్నట్లుగానూ, ఆచార్య బిరుదురాజు రామరాజుగారి తాతగారి వద్ద ఉండిన ప్రతిని ప్రదర్శనకోసం ఇవ్వగా, ప్రదర్శనానంతరం ఆ ప్రతి తిరిగి వారి వద్దకు చేరలేదని చెబుతారని ‘అలబ్ధ కావ్య పద్య ముక్తావళి’ లో ఉల్లేఖాన్ని బట్టి తెలుస్తుంది. ఇదే కాకుండా, మాన్యులు మానవల్లి రామకృష్ణ కవిగారు ఈ పద్యాన్ని, తాము ఉధ్ధరించి ప్రచురించిన నన్నెచోడుని ‘కుమార సంభవం’ ప్రథమ భాగంలో ఉదాహరిస్తూ, ఇది శ్రీనాథుని సప్తశతిలో నాల్గవ ఆశ్వాసంలోనిదని పేర్కొన్నారనీ, ఇందు మూలకంగా కవిగారి వద్ద శ్రీనాథుని సప్తశతి ప్రతి ఉండినదేమో, చెప్పలేం అనీ, కూడ ఈ గ్రంథంలోని ఉల్లేఖాన్నిబట్టి తెలుస్తుంది.

ఏదేమైనా,  కాల ప్రవాహంలో ఏమంత వెనుకటిది కాని, క్రీ.శ.1931 దాకా లభ్యమై వుండిన శ్రీనాథుని ‘సప్తశతి’ అప్పటిలోనే ముద్రణ భాగ్యానికి నోచుకోక పోవడం ఆంధ్రుల దురదృష్టం. సాహిత్యాభిలాషులూ, పెద్దలూ, ప్రచురణకర్తలూ పూనుకుని వెదికితే ఇప్పటికయినా శ్రీనాథుడు తెనిగించిన ‘సప్తశతి’ ప్రతి లభించవచ్చునేమోనని అనుకోవడం అత్యాశ కాదు గదా!

(‘భారతి’ లో స్వర్గీయ తిరుమల రామచంద్ర గారి వ్యాసాలు, డా.రవ్వా శ్రీహరి గారి సంపాదకత్వంలో వెలువడిన ‘అలబ్ధ కావ్య పద్య ముక్తావళి’ గ్రంధం ఈ వ్యాస రచనలో సంప్రదించడం జరిగింది.)

హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (3)

శ్రీనాథుడు ఆంధ్రీకరించిన ‘శాలివాహన సప్తశతి’ ఇప్పుడు అలభ్యం. అందులోనివిగా చెప్పుకునే ఐదు పద్యాలు మాత్రమే ఇప్పుడు లభ్యమై ఉన్నాయి. ఈ అయిదింటిలో రెండు వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామం’ లో ఉన్నాయి. మిగతా మూడూ విడిగా లభ్యమై ఉన్నాయి. ఈ మూడింటిలో ప్రసిధ్ధమైనది ‘వారణ సేయ దావ గొనవా’ అనే పద్యం. క్రీ.శ.1960 సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మాసాల భారతి సంచికలలో ఈ పద్యం పై ‘తెలుగు మఱుగులు’ శీర్షికన చర్చ జరిగింది. ఈ పద్యానికి మూలమైన ప్రాకృత గాథ పాఠం, దాని సంస్కృత చాయ, చర్చ చివరన పెద్దలు అంగీకరించిన శ్రీనాథుని పద్య పాఠం (ఉత్పలమాల వృత్తంలో) వరుసగా:

“కస్స వ ణ హోఇ రోసో దష్టూయ పియాఏ సవ్వణం అహరమ్
సభమర ఉపమగ్ఘాఇణి వారిఅవామే సహసు ఏహ్మిమ్”

“కస్యవా న భవతి రోషో దృష్ట్వా, ప్రియాయాః సవ్రణ మధరమ్
సభ్రమర పద్మా ఘ్రాణశీలే! వారితవామే! సహస్వేదానీమ్.”

“వారణసేయ దావ గొనవా? నవ వారిజ మందు తేటి క్రొ
వ్వారుచునుంట నీ వెరుగవా? ప్రియ వాతెఱ గంటు కంటి కె
వ్వారికి కెంపు రాదు? తగవా మగవారల దూఱ? నీ విభుం
డారసి నీ నిజం బెరుగు నంతకు నంతకు నోర్వు నెచ్చెలీ!”

శ్రీనాథుని ఈ పద్యం పై ఒకింత ఆసక్తి కరంగా జరిగిన చర్చ సారాంశం ఇది – అప్పటికి (అంటే క్రీ.శ.1960 నాటికి) లభ్యమవుతూండిన ప్రాకృత ‘గాథా సప్తశతి’ లో శ్రీనాథుని ‘వారణ సేయ’ పద్యానికి మూలమైన ప్రాకృత గాథ లేదు. అయితే, ధ్వన్యాలోక ప్రవర్తకుడైన ఆనందవర్ధనాచార్యుని ‘ధ్వన్యాలోకం’ లో ఈ ప్రాకృత గాథ ఉదాహరించబడి ఉంది. ఆనందవర్ధనాచార్యుని ‘ధ్వన్యాలోకా’ నికి అభినవగుప్తపాదులవారి లోచన వ్యాఖ్యలో ఈ ప్రాకృత గాథకు సంస్కృత ఛాయతోపాటు సవిస్తర వ్యాఖ్య ఉంది.

ఈ ప్రాకృత గాథను స్వర్గీయ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు క్రింది విధంగా తెనిగించారు:

“ఎవరి కలుక గలుగదే ప్రియురాలి కె
మ్మోవి కాటుగన్న? ముగుద! తేంట్లు
ముసరియున్న తమ్మి మూరుకొంటివి వల
దన్న వినక! సైపవమ్మ యిపుడు.”

“ఓ చెలీ! వలదని ఎంత వారించినా విన్నావా, చెవిన పెట్టావా? అప్పుడే వికసిస్తూన్న కమలంలో కనిపించకుండా తేనెటీగ మకరందాన్ని చప్పరిస్తూ వుంటుందని నీకు తెలియదా? ఇప్పుడు చూడు, నీ పెదవిపై ఏర్పడిన ఈ గంటు నీ ప్రియునికి (పతికి) కోపం తెప్పించిందంటే తెప్పించదా మరి? ఇందులో అతని తప్పేమున్నది? దానికి అతనితో తగవా? నిజం తెలిసిన మీదట అతని కోపం ఉపశమించి నీ దరి చేరేవరకూ నీవు సహించి ఊరక ఉండవలసినదే, తప్పదు మరి!” అని ఈ గాథ తాత్పర్యం. ఇందులో ధ్వని ఊహకందనిదేం కాదు. ఈ ధ్వని తెలుగులో ఇంకో స్వతంత్ర పద్యానికి కారణమైనదని ఈ క్రింది పద్యం వలన తెలుస్తుంది.

“మాకంద ఫల రసంబుల
నాకలిగొని మేము గ్రోలు నా కొమ్మలలో
చీకటినప్పుడు నొక చిలు
కేగతినో మోవి గఱచె నెఱుగవె చెలియా!”

కవి ఎవరో తెలియని ‘ఉమా మహేశ్వరము’ అనే పేరున్న ఒక అలభ్య కావ్యంలోనిదిగా లభ్యమైన ఒకే ఒక్క పద్యం ఇది. వెల్లటూరి లింగయమంత్రి కృత ‘సరసాంధ్ర వృత్తరత్నాకరం’ అనే ఛందో గ్రంథంలో ఇది ఉదాహరింపబడింది.

హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (2)

“అగ్ని రస్మి జన్మనా జాతవేదా
ఘృతం మేచక్షు రమృతం మేఆసన్”

‘నేను అగ్నిని, పుట్టుకతోనే అంతా తెలిసినవాడను, నెయ్యి నా కన్ను, అమృతం నా నోటిలో ఉంది’ అని వామదేవుడు ఋగ్వేదంలో అగ్నిని స్తుతించాడు. అమృతం నోటిలో ఉన్నందువలన అగ్ని అపవిత్రతకు బాహ్యుడు. ఆయన ఎక్కడ ఉన్నా పవిత్రుడేను. ఉత్తమ గుణాలున్న మానవుని అగ్నితో పోల్చడం ద్వారా హాలుడు ఉత్తముని అగ్ని సమానుని చేసి చూపించాడు పై గాథలో. ఆ కారణాన, ఉత్తముడైన మానవునికి అపవిత్రతా దోషం లేదు అని సూచించాడు.  హాలుడు ఎంత సహృదయుడో, అతని ఆలోచనలు ఎంత ఉదాత్తమైనవో తెలియజెప్పడానికి ఈ ఒక్క గాథా చాలు.

అవడానికి మహారాజు అయినప్పటికీ, హాలుని మనస్సంతా ఆ కాలపు సామాన్య జనజీవితంలోని సుఖదుఃఖాలూ, కష్టనష్టాలకు సంబంధించిన సంగతుల చుట్టూనే తిరుగుతూండేది అనడానికి ‘గాథా సప్తశతి’ నిలువెత్తు సాక్ష్యం. ప్రాకృతం ఆ కాలపు జనుల భాష, అదే రాజ భాష కూడ అయింది. కవితాత్మ కలిగి ఉన్నప్పటికిన్నీ, కవులుగా పేరు పడని సామాన్య జనానీకంలోని ఎందరో వ్యక్తులు – అలఅస్స, మాణస్స, మఅరందస్స, రాఅవగ్గస్స, విగ్గహస్స, వంగవిఅరస్స, అణంగస్స, పాలిఅస్స, ఇత్యాది నామధేయాలతో ఉండిన వ్యక్తులు – ఎందరెందరో రోజువారీ జీవనపు సంఘటనలలోని సంతోషలనూ, దుఃఖాలనూ, ప్రేమికుల వియోగాలనూ, విరహాలనూ, వినోదాలనూ, విలాసాలనూ, పల్లె సంబరాలనూ, పెళ్ళి సంబరాలనూ, అలంకారాలనూ, అనుభూతులనూ, ఇలా ఎన్నెన్నిటినో గాథలలో బంధిస్తే, వాటిల్లో ఉత్తమమైన వాటన్నిటినీ సేకరించి గుది గూర్చి గ్రంథంగా చేసాడు హాలుడు. శాతవాహన రాజుల కాలపు జనుల జీవనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే దృశ్యకావ్యం ‘గాథా సప్తశతి’.

‘గాథా సప్తశతి’ సౌందర్యానికి ముగ్ధుడై, నూనూగు మీసాల నూత్న యవ్వనం నాటికే ‘గాథా సప్తశతి’ ని ‘శాలివాహన సప్తశతి’ గా తెలుగులోకి అనువదించానని చెప్పుకున్నాడు శ్రీనాథుడు. కవిత్వం చెప్పడంలో అనన్య సామాన్యమైన ధారాశుధ్ధి, ప్రతిభ కలిగివుండి, అనతికాలంలోనే మహాకవి బిరుదాన్ని పొందివుండి, రాజాస్థానాలలో పొందిన సన్మానాలతోను, గడించిన ధనంతోనూ జీవితాన్ని సుఖంగా గడపగలిగివుండి కూడ సామాన్య జన జీవితంలోకి అడుగు పెట్టకుండా వుండలేక పోయిన వ్యక్తి శ్రీనాథుడు. సందర్భం దొరికినప్పుడల్లా, సంగతులను తన చాటువులలో బంధించి భావి తరాలకు అందించాడు.

హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (1)

మౌర్య సామ్రాజ్య పతనం తరువాత, దక్షిణ భారతం మొత్తాన్నీ, ఉత్తర భారతంలో కొంతభాగాన్నీ కలిపి ఏక మొత్తంగా కొన్ని సంవత్సరాల కాలమైనా పాలించిన  దక్షిణాది రాజవంశం శాతవాహన రాజవంశం. ఈ ప్రసిధ్ధ రాజవంశం క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 దాకా, అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు రాజ్య పాలన సాగించి, ఆ క్రమంలో పురాణాలలోకి కూడా ఎక్కిన  ఘనతను సాధించుకుంది.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి.  ఈ వంశపు రాజులలో హాల మహారాజు ఒకడు. ఇతడు క్రీ.శ.19-24 సంవత్సరాల మధ్య కాలంలో  రాజ్యపాలన చేశాడని చరిత్రకారులు చెబుతారు. (హాలుడు అశ్మక రాజ్యంలోని ప్రతిష్ఠానమును పరిపాలిస్తూ ఉండినాడని ప్రాకృతంలో రచింపబడిన  ‘లీలావతి’ కావ్యం చెబుతుంది). పరిపాలించినది ఆరేళ్ళే అయినప్పటికీ, శాతవాహన వంశపు రాజులందరిలోకీ హాలుడు జగత్ప్రసిధ్ధుడు కావడానికి కారణం ఆ మహారాజు సంకలించి ప్రపంచానికి అందించిన ‘గాథా సప్తశతి’ గ్రంథం. (ప్రస్తావ వశాన, ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. హాలుని ఆస్థానంలో వుండిన శ్రీపాలితుడనే మహాకవి, హాలుని దర్శించుకోవడానికి వచ్చిన వారిలో కవులు కొందరు ఆ మహారాజు సమక్షంలో వినిపించిన గాథలలో ఉత్తమమైన గాథలను సేకరించి సంకలించాడనే మాట కూడ ప్రచారంలో ఉంది. అయితే, ఇందులో నిజానిజాలు ఏమైనప్పటికీ, హాలుడు విని మెచ్చిన వాటినే శ్రీపాలితుడు కూడ మెచ్చడం జరిగి ఉంటుందనుకోవడానికి ఏమీ సందేహ పడనవసరం లేదు కదా!). గాథా సప్తశతి లోని ఏడు వందల గాథలలో దేనికది అనాటి సమాన్య జనజీవనంలోని ఏదో ఒక పార్శ్వాన్ని భావి తరాలకు గ్రంథస్తం చేసి చూపించడంలో సఫలీకృతమై కనిపిస్తుంది. హాలుడు పరిపాలించిన ఆ ఆరేళ్ళ కాలం ప్రాకృత వాఙ్మయానికి స్వర్ణ యుగమని కూడా చెబుతారు.

‘గాథా సప్తశతి’ ని హాలుడు సంకలించడమే కాదు, తాను రచించిన కొన్ని గాథలను అందులో చేర్చాడు కూడా. హాలుడు రచించిన గాథలలో అతని వ్యక్తిత్వానికి ప్రతిబింబా లనదగినవి ఉన్నాయి. వాటిలో అత్యుత్తమమైన గాథ, హాలుని సహృదయతనూ, సున్నితమైన మనస్తత్త్వాన్ని తెలియ చెప్పే గాథ, ఇది:

“పాణఉడీఅ వి జలిఊణ హుతవఓ జలఇ జణ్ణ వాడమ్మి
ణ హు తే పరిహరిఅవ్వా విసమదసా సంఠిఆ పుంసా.”

దీని సంస్కృత ఛాయ:

“పానకుట్యామపి జ్వలిత్వా హుతవహో జ్వలతి యజ్ఞవాటేపి,
నహితే పరిహర్తవ్యా విషమదశా సంస్థితాః పురుషాః”

అగ్నిహోత్రుడు యజ్ఞవాటిలో ఎలా మండుతాడో, కల్లు పాకలోనూ అలానే మండుతాడు. అలాగని అగ్నిహోత్రుని అపవిత్రుడైనాడని వదిలి పెట్టడం కుదురుతుందా? కుదరదు. అలాంటిదే ఉత్తములైన వారి సాంగత్యం. కొన్ని కొన్ని పరిస్థితులలో తమకు తగని ప్రదేశాలలో వారు ఉండడం, మనం చూడడం సంభవించినంత మాత్రాన, వారి సాంగత్యాన్ని వదులుకో చూడడం తగదు. దాని వలన మనకే నష్టం. ఇదీ ఈ గాథ అర్ధం.

ఆంధ్రమూ, తెలుగూ…(5)

ఆంధ్రమూ, తెలుగూ…(5)

19. మన కవులూ, రచయితలూ, ఆంధ్రా కీట్సులూ, ఆంధ్రా షెల్లీలూ, ఆంధ్రా లారెన్సులూ, ఆంధ్రా జాయిస్సులూ, ఇలా ఇంకా ఎన్నెన్నో. పిలిచే వాళ్ళకి ఇందులో తప్పేమీ కనిపించకపోయినా, పిలిపించుకునే వాళ్ళకి ఇందులో తప్పేమీ కనిపించక పోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే, ఏ ఒక్కరూ ఇప్పటిదాకా ‘దయచేసి అలా పిలవవద్దు. ఇది ‘nothing but consciously agreeing to lose one’s own identity and reappear as an image of somebody’ అని చెప్పే ప్రయత్నం చేసినట్లుగా కనపడదు. Telugu is Italian of the East అని, అది తెలుగు భాష గొప్పదనానికి ఒక qualification అన్నట్లుగా చెప్పుకోవడం. ఇది ఏ రకపు సమర్ధన? ఈ రెండు భాషలకూ ‘అజంతత్వమ’ న్న ఒక్క సామాన్య లక్షణంతప్ప వేరే ఏముంది? ఎవరైనా Italian ని Telugu of the West గా పిలవడం ఎప్పుడైనా మనం విన్నామా? West లో దేనితోనో ఒక దానితో పోల్చి, ఇది అలా ఉంది గాబట్టి ఇదీ గొప్పది అని చెప్పుకుంటే తప్ప మనకి మన భాష,
సాహిత్యాల గొప్పదనాన్ని చాటి చెప్పుకునేందుకు పధ్ధతులే లేవా? ఈ aping కీ, absurdity కీ అంతమే లేదా?

20. ఒక ప్రక్రియగా (as a form of literary expression) ‘నవల’ మనది కాదన్నది తెలిసిందే. అది ‘యూరప్’ కు చెందినదనీ, ఆ ప్రక్రియ ద్వారా సాధించబడే విజయాలన్నీ ఎక్కడ జరిగినా అవన్ని న్యాయంగా ‘యూరప్’ కే చెందుతాయనీ కూడా ఇక్కడ గుర్తించాలి.  ఇందులో ఏవైనా సందేహాలుంటే Milan Kundera పుస్తకం Art of the Novel చదివితే, అవన్నీ తీరుతాయి. అదలా ఉంచి, ఈ నవలా ప్రక్రియ ద్వారా మనం సాధించిపెట్టిన విజయాలేమైనా ఉన్నాయా? మనం ఇంతకు ముందు
ఎక్కడా వ్రాయని విధంగా కొత్తగా ఏమైనా వ్రాశామా? ఏమైనా కొత్త సత్యాన్ని (a new truth) ని కనుగొని, ఆవిష్కరించి ప్రపంచానికి చూపామా? నిజాయతీతో, have we ever tried to think differently?. అలా think చేయడానికి ప్రయత్నించిన వాళ్ళని గుర్తించామా? మననిచ్చామా? ఎందుకంటే, స్వర్గీయ వడ్డెర చండీ దాస్, తన పుస్తకం ‘హిమజ్వాల’ ను బుచ్చిబాబు కు అంకితమిస్తూ వ్రాసిన మాటలు ‘తెలుగు దనపు కూపంలో ఇమడలేక, అభాసు పాలైన బుచ్చిబాబు కి’ అని వ్రాయడం వెనుక అర్ధం ఏమిటి? ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

21. తెలుగు భాషను సంస్కృత తత్సమ, తత్భవ పదభూయిష్టం చేసి చెడగొట్టుకుంది మనమే.

22. హాల శాతవాహనుని ‘గాథా సప్తశతి’ లో తెలుగు పదాలు కనబడినవన్నీ ఆనాటి తెలుగు, అచ్చ తెలుగు పదాలే. ఆంధ్రమూ (ఒక వేళ ఉండినట్లయితే), తెలుగూ ఒకటి కాదు. ఆంధ్రులు తెలుగు భాషను తమ భాషగా చేసుకుని ఉండడానికి పూర్వం మాట్లాడిన భాష సంస్కృతమో, ప్రాకృతమో అయిఉండాలి. కొన్ని శతాబ్దాల కాలంపాటు తెలుగులో స్వతంత్ర రచనలు రాకపోవడానికి ఇది కారణం అయి ఉండవచ్చు.

23. శతాబ్దాల పర్యంతం సాహిత్యంలో సాగిన ఈ అనువాద/అనుకరణ వ్యాసంగం కారణంగా/ఫలితంగా తెలుగులో స్వతంత్ర రచనలు వెలువరించగల ఆసక్తి, క్తి సామర్ధ్యాలు కొరవడినట్లుగా అనిపిస్తుంది.

24. సంస్కృతం (వేరే ఏ ఇతర భారతీయ భాషలో కన్నా) ఇంకా తెలుగు భాషలోనే సజీవంగా ఉంది.

25. తెలుగు భాష original గా తనదైన ముద్ర వేసి ప్రపంచానికి అందించింది సాహిత్యంలో కానే కాదు.  అది సంగీతంలో, నాట్యంలో. సంగీతంలో అన్నమయ్య, త్యాగయ్య ల వలన, నాట్యంలో సిధ్ధేంద్ర యోగి వలన ఆ ఘనత మనకు దక్కింది.

(అయిపోయింది).

ఆంధ్రమూ, తెలుగూ…(4)

ఆంధ్రమూ, తెలుగూ…(4)

16. చలం కి కావలసిన విధంగా స్త్రీ లేకపోవడం చలం సాహిత్యం. దీనినే ఇంకో విధంగా చెబితే, చలంకు స్త్రీ ఎలా ఉండగా కావాలో అది చలం సాహిత్యం. దీన్ని ఆయనే అప్పట్లో రేడియో కి ఇచ్చిన interview లో చెప్పుకున్నారు,  ‘చలంది చలం బాధ. అది మీదనుకుని మీరు పొరబడ్డారు’ అని. చలం రచనలపై D.H. Lawrence రచనల ప్రభావం ఎంతైనా ఉందనేది సత్యం. ఒక బాధ్యత గల రచయితగా you cannot lead a woman to such a pitiable condition అన్నది ‘మైదానం’ లో రాజేశ్వరి పాత్రను రాస్తున్నప్పుడు ఆయనకు తట్టలేదా? అన్నది నా సందేహం. ఏ స్త్రీ అయినా, పురుషుడైనా సర్వం పోగొట్టుకోవడానికీ, చివరికి సర్వనాశనమవడానికి సిధ్ధపడడాన్ని నేను ఊహించగలను.  కానీ, దేని కోసం? అన్న ప్రశ్నకు సరయిన సమాధానం ఉండాలి. sex కోసమూ, physical gratification కోసమూ అని సమాధానం అయితే, ఒక రచనకు theme గా నేను దానిని అంగీకరించలేను.  It will lead you no where, the destruction is already there in the beginning itself, in the idea itself. Cann’t you imagine? తెలిసి తెలిసి ఆ పనికి పూనుకోవడం అన్యాయం.అప్పట్లో మర్యాదస్తుల ఇళ్ళలో మహిళలు చలం పుస్తకాలను రహస్యంగా దాచుకును మరీ చదివే వాళ్ళని, చలం రచనల గొప్పదనానికి నిదర్శనంగా చదువుకున్న వాళ్ళు కూడా చెప్పడం, వ్రాయడం జరిగింది.  ఇది ఏరకపు ‘జస్టిఫికేషనో’ నా కిప్పటికీ అర్ధం కాదు. There is a devil always lurking behind every man’s and woman’s mind అనీ, దానికి మనం material supply చెయ్యడం మొదలెడితే, అది తప్పకుండా తీసుకుంటుందనీ మనం ఊహించలేమా? అసలు ‘లైంగిక స్వేచ్చ’ అన్న దానిని మనం సరిగా అర్ధం చేసుకున్నామా? As a matter of course ప్రతి స్త్రీ, పురుషుడి జీవితంలో అలాంటి సందర్భాలు తప్పనిసరిగా ఎదురవుతాయనీ, సమాజం మొత్తంగా sexually repressed condition లో కొట్టుకుపోతోందనీ, మగ్గి పోతోందనీ, అది తప్ప మనుషులకి వేరే బాధలేమీ లేవన్నట్లుగా ఊహించడం, రాయడం ఎంతవరకూ సమంజసం?

సాంఘిక రుగ్మతల (social evils) మీద యుధ్ధం చేయడానికి సాహిత్యాన్ని ఆయుధంగా ఎంచుకున్న ఏ రచయితైనా, తను ఉంటున్న (present day) సంఘంలోని వాస్తవాలను (realities) ని వొదిలిపెట్టి, issues కి fantasized solutions చూపెట్టడం మొదలెడితే జరిగేది ఏమిటి? ఆ solutions తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా, repeated reading of those fantasized
solutions will lead to  inner struggles which will further lead to a desire to escape from the reality అన్నది అర్ధం కావడానికి ఒక జీవిత కాలం పడితే ఎలాగ? And, finally unable to face the realities of the world, Chalam, he himself had to end up in an Aashram! తనతోపాటు, తన సాహిత్యాన్ని చదివిన వారంతా ఆశ్రమాల్లో end అవ్వాలని చలం (suggestion) సలహానా? And, given a safe chance to escape from reality, why not?, every one wants to do that. చలం రచనలను మర్యాదస్తుల ఇళ్ళళ్ళో మహిళలు దాచుకుని మరీ చదవడానికి కారణం ఇది గాదా? నేను పైన ప్రస్తావించిన devil అన్నది ఇదే, మరేదో కాదు, a desire to escape from reality, even at least temporarily!

A true warrior never likes to leave the battle field. Come whatever may, he prefers to die rather than leave the battle field. A person who does the opposite, is not a worrier at all.  He has to be judged as a liar, an outright liar… however harsh it may appear, there is no other way!

17. చలం సాహిత్యమంతా, వెలువరించిన భావజాలం అంతా feminist సాహిత్యంగా, భావజాలంగా ఒప్పుకోవడం జరిగింది. అసలు ఒక పురుషుడు feminist భావజాలాన్ని ఎల వెలువరించ గలడో, ఆ భావజాలాన్ని feminist భావజాలంగా ఎల ఒప్పుకో గలమో నాకిప్పటికీ అర్ధం కాదు. కళాపూర్ణోదయంలో పింగళి సూరన ఊహించి చూపించినట్లుగా, ఒక వ్యక్తి రోజులో సగభాగం
పురుషునిగానూ, సగభాగం స్త్రీగనూ అవగలిగే సౌకర్యం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని నా నమ్మకం. అసలు స్త్రీకి ఏం కావాలో, (స్త్రీ ఎలా ఉండాలో కాదు. ఎలా ఉండాలన్న దాని మీద ఎవళ్ళకు నచ్చినట్లు వాళ్ళు ఎన్నయినా రాసుకోవచ్చు, సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా), పురుషుడు చెప్పడం ఏంటి? దానిని feminist భావజాలంగా ఒప్పుకోవడం, ఒక్క తెలుగులో తప్ప, ప్రపంచ సాహిత్యంలో వేరే ఎక్కడా జరిగినట్లుగా నాకు తెలియదు.

18. నాకు తెలిసినంత వరకూ, ప్రపంచ సాహిత్యంలోనే మొట్ట మొదటి feministic episode గా చెప్పగలిగిన కథ ఋగ్వేదంలోని ‘ఊర్వశీ, పురూరవు’ ల సంవాదం. అనూహ్యంగా ఈ కథ, ఊర్వశి పురూరవుని విడిచి వెళ్ళే సందర్భంతో, ‘ఇంక చాలు, నీకు కావలసినవన్నీ ఇచ్చాను, నీ దారిన నువ్వు వెళ్ళు, నన్ను నా దారిన వెళ్ళనీ’ అన్న ఊర్వశి మాటలతో మొదలై వెనకకు నడుస్తుంది. దీనిలో ఉన్న నిజాయతీని మనం గుర్తించిందీ లేదు, elaborate చేసి చూపించిందీ లేదు. అంతులేని శోకంతో
విలపిస్తున్న పురూరవునికి ‘నీ శోకం అర్ధరహితమైనది, నేను నీకు సంబంధించిన వ్యక్తిని కాదు, నాకోసం విలపించడం తగదు’ అని నిర్మొహమాటంగాను, అనునయంగానూ చెప్పి వెళ్ళిపోతుంది ఊర్వశి. మూడువేల ఐదువందల సంవత్సరాల క్రితం ఒక ఋషి ఊహించి ప్రపంచం ముందుంచాడు ఈ (situation) సందర్భాన్ని! సందర్భం వచ్చింది గాబట్టి చెప్పడమేగాని, ఇది ‘అన్నీ వేదాలలో
ఉన్నాయట’ అని చెప్పటం కాదు.