తెలుగు మాట, పాట, పద్యం (5)

అచ్చ తెనుగు పద్యం

తెలుగు పద్య సాహిత్యంలో ‘అచ్చ తెనుగు’ అన్న మాటను మొదటి సారిగా వాడిన వ్యక్తి మూలఘటిక కేతన అని చెబుతారు. ఈయన తిక్కన మహాకవి సమకాలికుడు. తెలుగులో మొదటి కథాకావ్యానికి (దశకుమార చరిత్ర) శ్రీకారం చుట్టినవాడు కేతన. ‘కవిత చెప్పి’ తిక్కన మహాకవినే మెప్పించినవాడు ఈయన.  ఈయన చెప్పిన ఈ ‘అచ్చ తెనుగు’ అనే మాటకు ముందు, ఈ మాట ఏ అర్ధాన్నయితే సూచిస్తుందో అదే అర్ధంలో ‘జాను తెనుగు’, ‘దేశి’ అనే మాటలు వాడుకలో వుండేవి. ఈ మాటలను తమ పద్యాలలో చెప్పిన వారు ‘నన్నె చోడుడు’, పాలుకురికి సోమనాధుడు!

పేరుకి ఇన్ని మాటలున్నా, ఈ మాటలు ‘అచ్చ తెనుగు’ భాషా స్వరూపాన్ని అర్ధమయేలా చేయడంలో సఫలీకృతం కాలేకపోయాయన్న ఒక అభిప్రాయం, విజ్ఞుల మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి! భాషా స్వరూపం అర్ధం కావాలంటే, ఒక ఉదాహరణంతో చెప్పుకుంటే, కొంతలో కొంత స్ఫష్టత వచ్చి, సులభం అవుతుంది.

“పగలు సేయుచు వేడిమి మిగుల జగము
గ్రాచు జమునబ్బ మున్నీట గలిసె ననియొ
తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపు
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”

కూచిమంచి తిమ్మకవి రచించిన ‘అచ్చ తెలుగు రామాయణం’ కావ్యంలోనిది ఈ పద్యం. సూర్యాస్తమయాన్ని సుందరంగా వర్ణించే పద్యం! నాకయితే, ఈ పద్యంలోని మాటల పొందిక, brevity, గాథా సప్తశతిలోని గాథలను తలపుకు తెస్తుంది. మంచి భావంతో నిండి వున్న పద్యం! ఊహ original ది! నాకు తెలిసినంతవరకూ, ఏ ప్రాకృత గాథనుంచో, సంస్కృత శ్లోకంనుంచో ఎత్తుకొచ్చింది కాదు!

ఇప్పుడు, ఈ పద్య భావాన్ని కొంచెం విడమరచి చెప్పుకుంటే…

‘పగలు సేయుచు’ – పగలు సేయువాడు – దినకరుడు.
సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ, కొన్ని రకాలయిన సంస్కృత సమాసాలు అచ్చ తెలుగులోకి మారేటప్పుడు జరిగే మార్పులను గురించి కొంత వివరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సంస్కృత సమాసాలలోని ప్రత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, దొర, తపసి, జోదు…ఇత్యాది శబ్దాలు జతవుతాయి అని వ్యాకరణం. ఉదాహరణకి:

అచ్చ తెలుగులో ‘కప్పు కుత్తుక వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘నీలకంఠ’ కు,
అచ్చ తెలుగులో ‘గిత్త తత్తడి వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘వృషభ వాహన’ కు,
అచ్చ తెలుగులో ‘వెంట్రుక యడుగుల దొర’ అనే సమాసం, సంస్కృతంలో ‘రోమ పాద’ కు,
అచ్చ తెలుగులో ‘మనుబోతు కొమ్ము తపసి’ అనే సమాసం, సంస్కృతంలో ‘ఋష్యశృంగ’ కు,
అచ్చ తెలుగులో ‘పచ్చ వారువపు జోదు’ అనే సమాసం, సంస్కృతంలో ‘హరిదశ్వా’ కూ అనువాదాలని పెద్దల వివరణ. తెలుగులో వీటినే బహువ్రీహి సమాసాలుగా భావిస్తారని కూడా చెబుతారు, అర్ధంలో చివరన కలది, కలవాడు చేరతాయి కాబట్టి. (నల్లని కంఠము కలవాడు, ఎద్దును వాహనముగా కలవాడు…ఇత్యాదిగ).

నాకయితే తెలుగులో ఈ మాటలు, సంస్కృతంలో మాటలు ఎంత అందంగా కనిపిస్తాయో, తెలుగులోనూ అంతే అందంగా అనిపిస్తాయి. ఇలాంటివే ఇంకొన్ని సమాసాలు:

వలిగుబ్బలి రాచ కూతురు (హైమవతి – హిమవంతుని కూతురు, ‘వలిగుబ్బలి’ అంటే మంచుకొండ అని అర్ధం), పుట్ట బుట్టువు తపసి (వాల్మీకి – పుట్ట  నుంచి పుట్టిన తపస్వి), పదియరదముల దొర కొడుకు (దాశరధి – దశరధుని కుమారుడు) – ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలంత అందంగానే కనబడతాయి.

ఇక్కడితో ఇది ఆపి, అసలు పద్యానికొస్తే –

పగలు సేయుచు – పగటిని చేస్తూ, ఆ క్రమంలోనే; వేడికి మిగుల జగము గ్రాచు – వేడిమితో జగత్తునంతా వుడికించి ఇబ్బందికిలోను చేసే; యమునబ్బ – యముని తండ్రి (సూర్యుడు); మున్నీట – సముద్రములోనికి; కలిసె ననియొ – కలిసిపోయాడుగదా అని; తొగ వెలందుక – కలువ పూవు (అనే పడతి); నగియె – నవ్వింది; అమ్మగువ – ఆ కలువ సుందరి; పెంపు గని – సంతోషంతో వదనం పెద్దదవడం (కలువ వికసించడం అన్న భావం) చూసి; సయింపక – తాళ లేక; తమ్మి – తామర పూవు (అనే పడతి); మొగంబు మొగిచె – మొహం ముడుచుకుంది, చాటు చేసుకుంది.

సూర్యాస్తమయంతోనూ, చంద్రాగమనంతోనూ కలువలు వికసించడం అనేది ప్రకృతి ధర్మం. సూర్యాస్తమయంతో తామరలు వికసనం కొల్పోయినట్లయి, కళావిహీనంగా, ముడుచుకున్నట్లయిపోవడమూ ప్రకృతిధర్మమే! ఈ రెండు ధర్మాలనూ కలబోసి, ఒకే సందర్భానికి జతచేసి, హృద్యంగా చెప్పడం ఈ పద్యంలో జరిగింది.

నాకు ఈ పద్యాన్ని చదివినప్పుడల్లా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది. పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గాథా సప్తశతి లోని పద్యాలను తెలుగులోకి అనువదించడంలో ఈ పద్యాన్నే(సరిగ్గా ఈ పద్యాన్నే అని కాకుండా, ఇలాంటి పద్యాలనే) ఆదర్శంగా తీసుకున్నరేమో! అని. ఎందుకంటే, అందులోని చాలా పద్యాల నడక ఈ పద్యాన్నే పోలి వుంటుంది. ఉదాహరణకి:

“అడుగుదమ్ములందు బడివేడు పతివీపు
జిన్ని కొమరుడెక్కి చెలగి యాడ
అలుక యెంత తెగనిదయ్యును నిల్లాలి
మొగమునందు నవ్వు మొలచె నపుడు! “                (శతకం 1 గాథ 11)

“ఎవని వదలిన జీవంబు నవసి చనునొ
యతని నపరాధినయ్యు నోదార్ప వలయు;
ఊరు గాలుచు బొలిపోవు చున్న గాని
యగ్గి నొల్లని వారెవ్వరతివ, చెపుమ?”         (శతకం 2, గాథ 63)

అందుండి అచ్చ తెలుగు మాటలలో వున్న ఇలాంటి రమ్యమైన పద్యాలను ఇంకా చాలానే ఉదాహరించవచ్చు!

మన కథకులు (my notes): బుచ్చిబాబు-1

బుచ్చిబాబు (జూన్ 1916 – సెప్టెంబరు 1967)

కథనం స్థూలంగా రెండు రకాలు. ఒకటి naration – ఎక్కువ వర్ణనలతో పని పెట్టుకోకుండా కథను చెప్పుకుంటూ పోవడం; రెండు inquiry – కథను చెబుతున్నట్లుగానే చెబుతూ అంతః సూత్రంగా ఒక ప్రశ్నను లేవనెత్తి, విశ్లేషించే ప్రయతం చేసి, వీలయితే సమాధానాన్ని సూచించడం, లేదా చెప్పడం.

కథా వస్తువు (subject) ను బట్టి, ఈ రెండింటిలో ఏది ప్రధానమై వుండాలన్నది నిర్ణయమై వుంటుంది. అయితే, enquiey అనేది లేకుండా కేవలం narration తోనే గొప్ప కథ తయారవడానికి ఆస్కారం వుంది గాని, సరయిన narraation లేకుండా కేవలం inquiry తోనే గొప్ప కథ తయారవుతుందనడానికి నిదర్శనాలు సున్న. కారణం, సరయిన narration లేకుండా కథ లేదు.

బుచ్చిబాబు గారి ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ – great narration as well as enquiry, both at the same time! అందువలన ఆ కథ తెలుగులో అత్యుత్తమ కథానికలలో ఒకటిగా మన్ననలందుకుని నిలిచింది.

మనలో చాలా మధ్య తరగతి జీవితాలు పుట్టుకనుంచి గిట్టేదాకా మూసపోసినట్లు ఒకేరకంగా, కొత్తదనమేమీ లేకుండా, unbearably absurd గా వుంటాయి – ఇది ఆ కథలో enquiry! అవును? కాదు? – కథలో ప్రధాన పాత్రలైన ఇద్దరిలో ఒకరు ‘నేను’ దృష్టిలో ‘అవును!’; రెండవ పాత్ర అయిన కుముదం దృష్టిలో ‘కాదు. అలా అనుకోవడానికి వీల్లేదు. that is a wrong notion!’

‘ఎక్కడో ఎప్పుడో పుట్టడం, ఎవరో ఎవర్నో ఒప్పగిస్తే వారిని పెళ్ళాడడం, ఎందుకో తెలీకుండా పిల్లల్ని కనడం, ఎప్పుడో ఎక్కడే చచ్చిపోవడం. ఇది చాలామంది చేస్తున్నది. దీన్ని గురించి కథగా చెప్పుకునేందుకు ఏముంది? ప్రత్యేకత, వ్యక్తిత్వం లేని ఈ జీవితాలు ప్రశాంతాన్ని పొందుతున్నాయి.  కాని, అది బురద గుంటలో పురుగు పొందే ప్రశాంతం’ – అని కథలో ‘నేను’. He was unclear, unrealistic, too emotional and idealistic!

‘ఏమీ లేదు. నాకేదో చెప్పాలనుంది. ఎట్లా చెప్పాలో తెలీడం లేదు. నే చదువుకున్న దాన్ని కాదు. ఉండు, ఆలోచించనీ…’

‘కానీ….కానీ…సుర్యుడూ, చంద్రుడూ ఎప్పుడూ చూస్తూంటాను. కాని, ప్రతిసారి ఎందుకో క్రొత్తగా కనబడతాయి.  మంచినీళ్ళు రోజూ త్రాగుతా. కాని ప్రతిసారి ఎంతో క్రొత్తగా వుంటాయి…నక్షత్రాలు…’

‘ఏమో, నువ్వు జీవితాన్ని పరిశీలిస్తావు.  నేను అనుభవిస్తాను. ఏమో’ – అని కుముదం. She was clear in her thought, realistic, reasonably emotional and focused!

1945-46 ప్రాంతాలలో వ్రాసిన కథ ఇది. కథలోని ‘నేను’ లో బుచ్చిబాబు తనకు తానుగా లేడనుకోవడానికి వీలు లేకుండా వుంటుంది పాత్ర చిత్రణ. బుచ్చిబాబు ఈ కథ వ్రాసే నాటికి 30 సంవత్సరాల వయసులో వున్నారు.

కథలో ‘నేను’ కు ఇరవై యేళ్ళ వయసులో కథ మొదలవుతుంది. కుముదానికి పద్దెనిమిదేళ్ళు. అప్పటికే పెళ్ళి అయింది. కథ అంతమయే నాటికి ‘నేను’ ముఫ్ఫై నాలుగేళ్ళ వయసు వాడు. అప్పటికీ అవివాహితుడూ. కుముదం ముఫ్ఫై రెండేళ్ళ వయసులో వుంటుంది. కనుక, కథ నడిచిన కాలం పధ్నాలుగేళ్ళు.

కథ అంతంలో, కుముదం న్యుమోనియ జబ్బుతో హాస్పిటలులో మంచం పై చావుబ్రతుకుల మధ్య వుండగా చూడడానికి వెళ్ళిన అతను ‘అనుకోకుండా’ తన చేతిని ఆమె చేతిపై ఆనించబోగా, వెంటనే చేతిని లాగేసుకుని దుప్పటిలో దాచేసుకుని ‘నువ్వెందుకు పెండ్లి చేసుకోలేదో నాకు తెలుసు – నాకోసం.’ అంటుంది.

‘నీ స్థితి నాకెంతో బాధగా వుంది’ అంటాడతను కన్నీరు దగమింగుకుని.
‘నాకు నిర్విచారం. ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి. నువ్వు మాత్రం….’ అని కళ్ళు మూసి మరివిప్పదు కుముదం.

కుముదం ఈ మాటలు కథలో ‘నేను’ కు ఒక revealation! ఈ revealation కథలో ‘నేను’ యొక్క ప్రపంచాన్ని తల క్రిందులు చేసి అతని జీవిత పరమావధినే తారుమారు చేస్తుంది. అదే కుముదం సాధించిన విజయం, అదే ఆమె ప్రత్యేకత. కుముదంలోని ఈ ప్రత్యేకతే (కథలో ‘నేను’ చేత) ఆమె గురించి కథ వ్రాయించేలా చేస్తుంది.

కథాంతంలో కుముదం మాటలవలన జరిగిన ఈ revealation రెండు విషయాలను సుచిస్తుంది:
ఒకటి – కుముదం ‘అతడు తనను ప్రేమిస్తున్నాడు’ అన్న అభిప్రాయంలో వుంది, మొదటినుంచీ.
రెండు – అతడు ‘తాను కుముదాన్ని ప్రేమిస్తున్నాను’ అనుకోలేదు ఎప్పుడూ.

ఈ confusion అసలుగా ఎవరిది? మొదటినుంచీ చూసుకుంటూ వస్తే:

తనకు పదేళ్ళ వయసులో ‘నన్ను గురించి కథ చెప్పవూ?’ అంటుంది కుముదం.
తనకు పద్దెనిమిదేళ్ళ వయసులో ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ అంటుంది.

‘తన వ్యక్తిత్వాన్ని గుర్తించుకుని, దాని ప్రభావాన్ని ఇతరులకి తెలియచెయ్యాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో చూడగలిగాను. ఆమె ఒక జీవి. ప్రత్యేకమైన ఉనికి గలది. ఆమెని తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది’ అని వ్యఖ్యానిస్తాడు అతను, కుముదం ఆ కోరిక గురించి.

కుముదంపై ఈ పవిత్ర భావం అతనికి ఎప్పటిది? తాను ఇరవై యేండ్ల వయసప్పటిదా? లేక, (చివరలో ఆమె మాటల తరువాత) ఆమె మరణానంతరం, కథ వ్రాసే నాటికి కలిగినదా? అంటే, రెండింటిలోనూ పెద్ద తేడా లేదనిపించొచ్చు గాని, ఆమె మరణం తరువాత కలిగిన ఈ పవిత్రతా భావాన్ని తన ఇరవై ఏండ్ల వయసప్పటి స్థితికి కూడా ఆపాదించుకున్నట్లుగా అనిపిస్తుంది కథాగమనంలో ఈ వ్యాఖ్య చేసిన చోటు.

కుముదం అందమైంది కాదు. అసాధారణ స్త్రీ కాదు. పదే పదే ఈ వ్యాఖ్య చేయబడి కనిపిస్తుంది కథలో. సారాంశం – ఆరోజులలో (1945-46) మధ్యతరగతి తెలుగిళ్ళలో కనిపిస్తూండిన సాధారణ గృహిణి ఆమె. అయితే, కొన్ని సందర్భాలలో మాత్రం a born intellectual లా కనిపిస్తంది ఆమె మాటలలో.

‘….మనం ప్రకృతికి దాస్యం చెయ్యడం తప్పదు. దాస్యం నేను సహించలేను. కానీ, అది తప్పదనుకుంటాను. నేను ఎదురు తిరగలేక కాదు. నాకదిష్టం లేదు. జీవితానికి తలవొగ్గి ప్రపంచాన్ని అంగీకరిస్తాను.’

‘…ప్రపంచాన్ని మనం ఏదేనా కోరి ఆశిస్తే దాన్ని ఇవ్వదు. మనం దేన్నీ ఆశించకుండా, దూరంగా వుండి చెయ్యగలిగిన పని చేస్తుంటే ప్రపంచం మన పాదాలముందు వాల్తుంది.’

‘నేను నువ్వైతే ఏం చేద్దునో తెలుసా? నదీ తీరాన్న చిన్న తాటాకు పాక కట్టుకుంటాను. అందులో కూర్చుని, ఊరికే చదువు నేర్పుతానని చాటింపు వేయిస్తాను.   మొదట ఏ పదిమంది పొలం కాపులో వస్తారు.  సాయంత్రం వాళ్ళకి బోధించడం మొదలెడతాను. ఇరుగు పొరుగు నుంచి అనేక మంది కర్షకులు, కూలివాళ్ళు చదువుకోసం వస్తారు.  ఉత్త చేతుల్తో రాకుండా, ఒకరు వుప్పు, చింతపండు, ఒకరు పాలు అలా నాక్కావల్సిన వాటిని వాళ్ళే సిధ్ధం చేస్తారు.  వారు నా శిష్య బృందం. వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటా. వారి తగాదాలకు తీర్పు చెపుతా. అంతే. అప్పుడు నా జీవితం వృధా అనుకోను.’ – ఇదీ కుముదం మాటలలోనే కుముదం.

సమయం సందర్భం దొరికినప్పుడల్లా ఉద్యోగం సద్యోగం లేకుండా unrealistic idealism లాంటి దేనిలోనో కొట్టుకుపోతూ నేల విడిచి సాముకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించే అతని జీవితానికి ఒక దిశా నిర్దేశం చేయడానికి ప్రయత్నిస్తుంది కుముదం. దీనిని ఏమనాలి? ఇప్పుడున్న సంకుచితార్ధంలో ‘ప్రేమ’ అనుకోలేం. దానికంటే మించినది, వేరే మాట కావాలి.

అతడు కుముదం మాటలను అర్ధవంతమైనవిగా ఖాతరు చెయ్యడు, పట్టించుకోడు. కథ చివరిదాకా కూడా అదే పరిస్థితిలో ఉంటాడు తప్ప మార్పేమీ వుండదు.

అలా వచ్చి, చివరి సన్నివేశంలో, చేయి స్పృసించబోతాడు. కుముదం అంగీకరించదు.
ఇక అదే ఆఖరి ప్రయత్నంగా, ఒక shock treatment లా -

‘నువ్వెందుకు పెండ్లి చేసుకోలేదో నాకు తెలుసు – నా కోసం.’
‘నాకు నిర్విచారం. ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి. నువ్వు మాత్రం….’ మాట పూర్తికాకుండానే కళ్ళు మూస్తుంది.

ఈ shock treatment ఫలితంగా – చివరికి ఆమె ఆశించింది జరిగిందనడాన్ని కథాంత వాక్యంలో ‘నా ప్రపంచాన్ని తలక్రిందులుచేసి నా జీవిత పరమావధినే తారుమారు చేసిన కుముదాన్ని గురించి ఏం కథ వ్రాయను?’ అన్న మాటలు సూచిస్తాయి.

ఈ వాక్యానికి ముందు, కథలో ‘నేను’ , తాను కుముదం చేతిని అనుకోకుండా స్పృశించబోవడాన్ని, ఫ్రాయిడ్ మనోవైజ్ఞానిక సిధ్ధాంతంలోని ‘సుప్త చేతన’  నేపధ్యంలో విశ్లేషణ చేస్తూ – ‘ఇంతకాలం నా బుధ్ధి వాటిని (కుముదంపై ప్రేమ సంబంధ భావనలను) కట్టేసింది. ఆనాడు ఆమె చెయ్యిపైన చెయ్యి వేసినప్పుడు బుధ్ధిని తొలగించి వాంచలు బైటికొచ్చినట్లు కుముదం గ్రహించి, తన చేతిని లోపల దాచుకున్నట్లు వాటిని వెనక్కి నెట్టి నోరు నొక్కింది. ఆమెలో ఏమీ విశేషం లేదని సమాధానపరుచుకున్నా, ప్రాకృతికమైన ఆకర్షణ లోపల దాగి వుండి, నా జీవితంపై అంత ఒత్తిడి కలిగించినందుకు ఆశ్చర్యపడ్డాను’ – అని explanation యిస్తాడు.(కుండలీకరణం లోని మాటలు నావి).

అయితే, ఒక స్త్రీ పై పురుషుని ప్రేమ భావనలు ఇంత ‘సుప్తం’ గా వుండగలవా? అన్నది ఇక్కడ పుట్టుకొచ్చే ప్రశ్న.
దీనికి సమాధానం ‘అవును’ అన్నదయితే, అది నమ్మశక్యంగానట్లుగా వుండి convincing గా ఒప్పుకోలేము.
‘కాదు’ అయితే, ఈ explanation కథలో ‘నేను’ ఆ చర్యను convincing గా సమర్ధించేదిలా అనిపించదు. అప్పుడు వారిద్దరూ వున్న పరిస్థతిలో, చాలా సహజమైన సానుభూతి ఫలితమైన ఆ చర్యను సమర్ధించడానికి ‘సుప్త చేతన’ ను తోడు తెచ్చుకోవాలా? అన్న సందేహాన్ని రేపుతుంది.

తెలుగు మాట, పాట, పద్యం (4)

తెలుగులో శతక సాహిత్యంలో అధిక్షేప శతకానిది ఒక ప్రత్యేకమైన శాఖ అయితే, అందులో వేణుగోపాల శతకానిది ఒక విశిష్ఠ స్థానం అన్నది తెలిసినదే! ఈ శతకాన్ని రచించినది పోలిపెద్ది వేంకటరాయ కవి.  ఇతడు కార్వేటి సంస్థాన కవులలో ప్రముఖుడు అని చెబుతారు.

వేణుగోపాల శతకంలోని పద్యాలలో తెలుగు నానుడులు, సామెతలు అనదగినవి చాలా (పద్యాలకు అనువైన భాషలో)  పద్యాలలోకి ఎక్కి కనబడతాయి. వాటిలో కొన్ని మంచివాటిని పద్యాలలోంచి ఏరి విడిగాతీసి చూపించడం ఇక్కడ జరిగింది:

పొరుగూరి కేగిన పోవునే దుర్దశ
కాదె పెండిలి సన్నికల్లు దాచ
డొంకల డాగ పిడుగుపాటు తప్పునే    (డొంకలలో దాక్కుని పిడుగుపాటునుంచి తప్పుకోగలమా? అని)
కాలడ్డ నిలుచునే గాంగ ఝరము       (గంగా ప్రవాహాన్ని కాలడ్డుపెట్టి ఆపగలమా?)
ఇంకిపోవునే అనావృష్టి జలధి            (దేశంలో అనావృష్టివలన సముద్రం ఇంకిపోతుందా?)
అర్కుడుదయింప చెడునె గుహా తిమిరము  (గుహలో చీకటి సూర్యోదయంతో తొలుగుతుందా?)

పెట్టిపోసిన నాడె చుట్టాల రాకడ
సేవ చేసిన నాడె క్షితినాదు మన్నన
విభవంబు గల నాడె వెనువెంట తిరుగుట   (ఇవన్నీ సమానార్ధకాలే!)

‘అభావ విరక్తి’ అని ఒక అవస్థ వుందని, దానికి ఈ క్రిందివి వుదాహరణలనీ ఒక పద్యంలో చెప్పి…

శక్తి చాలని నాడు సాధుత్వం వహించడం
విత్తహీనుడు ధర్మ వృత్తి తలచడం
వ్యాధి పీడితుడు దైవతాభక్తి దొరలాడడం
పని పోవ మౌనవర్తనం దాల్చడం
రమణి లేకున్న విరక్తి మంచిది అనడం
భారము పైబడ్డ (పుడు) బరువెఱుంగడం (బరువు గుఱించి ఉపన్యాసాలివ్వడం)…

ఇత్యాది ‘అభావ విరక్తు’ ల వలన, తత్కాల విరక్తుల వల్ల ఫలితంలేదంటూ….

తినక చవి చొరకయె లోతు తెలియబడునె (తినక రుచి, దిగక లోతూ తెలియడం సాద్యం అవుతుందా?) అనే సామెత చెప్పబడింది.

ఆశకు ముదిమియు అర్ధికి సౌఖ్యంబు
ధనపరాయణునకు ధర్మచింత
అల్పవిద్యునకు అహంకారదూరత
పాపభీరుత సంతానబాహ్యునకు
కలదనెడువార్త కలదె లోకములయందు… (దీనికి ఏమీ వివరణ అవసరంలేదు కదా!)

ఈతకు మిక్కిలి లోతు లేదు
కవిజనంబుల కెఱుంగనివి లేవు

మెఱుపు దీపంబౌనె మేఘంబు గొడుగౌనె
అల యెండమావులు జలంబు లౌనె
కాని వస్తువు పట్టుకో కాంక్షచేత
పెనుగు మాత్రంబెగాని లభింపదేమి….

పొయిపాలికే పాలు పొంగుటెల్ల
ఆఱిపోయెడి దివ్వె కధిక దీప్తి
కట్టనిల్వని చెర్వు గడియలోపల నిండు
బ్రతుకజాలని బిడ్డ బారెడుండు
పెరుగుటయు విఱుగుటకని యెఱుగలేక
అదిరిపడుచుండు నొక్కొక్క అల్పజనుడు….

వలపు రూపెరుగదు
ఆకలిలో నాల్క అరుచి యెరుంగదు
కోపం బెదుటి గొప్పకొద్దు లెఱుంగదు
నిదుర సుఖం బెఱుంగదు
హరునకైనను నివి గెల్వ నలవికాదు
ఇతరులైనట్టి మానవులెంతవారు….

పైన చూపినవన్నీ అదనంగా వివరణ యేమీ అవసరంలేకుండానే అర్ధమయ్యేవీ,  తక్కువ మాటలలో చక్కటి నిజాలను చెప్పేవీను! వాటిల్లో కొన్ని ఇప్పటికీ  సామెతలుగా అదపాదడపా నిత్యవ్యవహారంలో పెద్దవాళ్ళనోట వినిపిస్తూనే వున్నాయి కూడానూ!

*****

తెలుగులో అధిక్షేప శతకాలు రచించిన వారిలో కూచిమంచి తిమ్మకవి, జగ్గ కవి అని ఇద్దరు కవులున్నారు.  వీరిద్దరూ అన్నదమ్ములని తెలుస్తూనేవుంది కదా! కూచిమంచి తిమ్మకవి రచించిన శతకం శ్రీ భర్గ శతకం, జగ్గ కవి రచించిన శతకం శ్రీ భక్తమందార శతకం. వీరు  క్రీ.శ.18 వ శతాబ్దానికి చెందిన వారు. వీరిలో కూచిమంచి జగ్గకవి తెలుగులో మొట్టమొదటి అధిక్షేప ప్రబంధకర్తగా ప్రసిధ్ధుడు.  ఆ ప్రబంధం పేరు ‘చంద్రరేఖా విలాపము’. ఇందులోని కవిత్వ స్థాయిని C.P.Brown దొర కూడా మెచ్చుకున్నాడని ఎక్కడో చదివినట్లు గుర్తు.

ఆ సంగతి అలా వుంచి, ప్రస్తుత విషయానికి వస్తే – వీరిరువురు రచించిన అధిక్షేప శతకాలను  ఇప్పుడు తలుచుకోవడానికి కారణం, వీరిరువురూ వారి శతకాలలోని పద్యాలలో వాడిన పరభాషా పదాలను గుఱించి ముచ్చటించుకోవడానికి! పరభాషా పదాలలో వీరు మక్కువపడి అన్నట్లుగా ఒకటికి రెండుసార్లు వాడిన పదం  ‘ఇల్ల’. ఈ పదం తమిళ భాషలోనిది.  ‘లేదు’ అని తమిళంలో ఈ మాటకు అర్ధం. ఎందుకు అంత మక్కువపడి ఈ పదాన్ని వీరు వాడారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ‘ఇల్లె’ అనే ఈ మాటకు బదులు తెలుగు పదం ‘లేదు’ అన్నది వాడొచ్చు, ఛందోభంగం ఏమీ కాదు. (సుఖం ఇల్లె, సుఖం లేదు – తేడా ఏమీ లేదు).

“కోపంబెక్కువ; తాల్మి యిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబు తీల్”

కూచిమంచి తిమ్మకవి – శ్రీ భర్గ శతకము లోనిది ఈ శార్దూల పద్య ప్రథమ పాదం. ఈ పాదంలో  చివరిపదం   ‘తీల్’ అనేది కూడా పరభాషా పదమే, జగ్గకవి భక్తమందార శతకంలోని ఒక పద్యంలో ఈ పదం ‘తీర్’ అని కనిపించింది, నేను చూసిన పుస్తకంలో.  ఇది అచ్చు తప్పు అయివుండాలి. ఈ పదం తీల్/తీర్ ఏ భాషా పదమోగాని, అర్ధం మాత్రం ‘లేదు’ అనే అన్నది సందర్భాన్ని బట్టి అర్ధమై పోతుంది!

కూచిమంచి జగ్గకవి రచించిన శ్రీ భక్తమందార శతకం నుండి ఈ క్రింది పద్య పాదాలు:

“దానంబిల్లె, దయారసంబు నహి, సద్ధర్మంబు తీర్, మీపద
ధ్యానంబున్ గడులొచ్చు…..”

“క్రతువుల్ సేసెదనంటినా, బహుపదార్ధంబిల్లె!…”

అదలా వుంచితే, కూచిమంచి జగ్గకవి భక్త మందార శతకంలో నాకు బాగా ఆసక్తి కరంగా అనిపించిన ఒక మాట ‘దేమస’ అనే మాట. ఈ మాట బ్రౌన్ నిఘంటువులోనికి కూడా ఎక్కలేదు. ఇది ఇప్పుడు ‘తమాషా’ అన్న అర్ధంలో వాడకంలో వుంది.  భక్తమందార శతకంలోని ఆ పద్యం, మత్తేభం:

“రసికోత్తంసులు సత్కులీనులు మహాద్రాఘిష్ఠ సంసార ఘో
రసముద్రాంతరమగ్నులై దరికి జేరన్ లేక విభ్రాంతిచే
పసులం గాచిన మోటుకొయ్య దొరలం బ్రార్ధింతు రెంతేని దే
మసగాదే యిది యెంచిచూచినను రామా! భక్త మందారమా!”

తెలుగు నాటకాలు – మరి కొన్ని సంగతులు (4)

వారి కాలంలోని ముగ్గురు గొప్ప కవులలో (అంటే 19వ శతాబ్దం ఉత్తరార్ధం, 20వ శతాబ్దం పూర్వార్ధం) వసురాయ కవిగా రొకరు. మిగిలిన యిరువురూ, కందుకూరి వేరేశలింగంగారు, వావిలాల వాసుదేవశాస్త్రి గారు. వావిలాల వాసుదేవశాస్త్రిగారు శూద్రకుని మృచ్ఛకటికాన్ని మొదటగా తెలుగులోనికి అనువదించి అప్పట్లో వెలువడుతూండిన ‘చింతామణి’ మాస పత్రికలో (న్యాపతి సుబ్బరావుగారు స్థాపించి నిర్వహిస్తూండినది) ప్రకటించారు.

భక్తచింతామణి శతకం  తరువాత  వసురాయకవి గారికి అంతగా పేరుతెచ్చినది ‘వేణీ సంహారం’ నాటకం. ఇది సంస్కృత నాటకానికి రసవంతమైన తెలుగు అనువాదం. వసురాయకవిగారు దీనిని రచించి ఊరుకోకుండా, రంగస్థలం మీదికి కూడా ఎక్కించి, అందులో భీముని పాత్రను గూడా పోషించేవారని చెబుతారు.

‘గయోపాఖ్యానం’ నాటక కర్త అయిన చిలకమర్తి లక్ష్మీనరసింహంగారికి (క్రీ.శ.1867-1946), వసురాయకవిగారు తమ ‘వేణీసంహారం’ నాటకాన్ని స్వయంగా చదివి వినిపించగా,  విని పరవశుడైన చిలకమర్తివారు మెచ్చుకోలుగా అప్పటికప్పుడు ఆశువుగా చెప్పిందట ఈ క్రింది పద్యం:

“వేణీ సంహారంబును
 వాణీధవ తుల్యుడైన వసురాయుడు తా
 నాణెముగా తెనిగించెను
 ప్రాణంబులు లేచివచ్చు పద్యము విన్నన్.”

తెలుగునాట అత్యధిక జనత (popularity) పొందిన పద్య నాటకాలలో చిలకమర్తివారి ‘గయోపాఖ్యానం’ ఒకటి. తెలుగులో బహుశః అన్ని కాపీలు అమ్ముడుబోయిన గ్రంథం (నాటకాలలో) మరొకటి లేదు అనిపించుకున్నది ‘గయోపాఖ్యానం’ నాటకం. అదలా వుంచితే, చిలకమర్తివారి పేరుమీద ఒక ప్రసిధ్ధమైన చాటుపద్యం, బిపిన్ చంద్ర పాల్ గారి ఆంగ్లోపన్యాసాన్ని ఒక సభలో తెలుగులో అనువదిస్తూన్న సందర్భంలో, సభ జరుగుతూ ఉండంగానే, మనసులో ఊహించుకుని ఆశువుగా ఆయన చదివిన పద్యం, ఎవ్వరూ మరిచిపోలేనిది:

“భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియబట్టి.”

ఆ రోజులలో విశేషమైన ప్రజాదరణ పొందిన పద్యం చిలకమర్తివారి ఈ చాటు పద్యం. ఎంతగా ప్రసిధ్ధమైనదంటే, విజయవాడలో కృష్ణానది వంతెన గోడలమీద పెన్సిళ్ళతో వ్రాయబడిందట, హరికథలలోకి కూడా ఎక్కిందట!

తెలుగు నాటకాలు – మరి కొన్ని సంగతులు (3)

తెలుగులోని గొప్ప పద్య నాటకాలలో ఒకటైన ‘వేణీసంహారం’ నాటక కర్త వడ్డాది సుబ్బారాయుడు (క్రీ.శ.1854-1938). ‘వసురాయకవి’ గా ప్రసిధ్ధులు. దురదృష్టవశాత్తు వీరికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరమయ్యారు. ఈయన బడిలో చదివి పాసయిన పరిక్ష ఒక్కటీ లేదని చెబుతారు. అయినప్పటికీ, వీరు తమ 14వ ఏట నుండే భజగోవింద శ్లోకాలను తెలిగించడంతో కవిత్వం చెప్పడం మొదలెట్టారు. రాజమండ్రిలోని ఒక ఉన్నతపాఠశాలలో ఆంధ్రోపాధ్యాయుడిగా ప్రారంభమైన వీరి ఉద్యోగపర్వం అనంతంగా సాగి వీరి జీవికకు లోటులేకుండా చేసింది.

వడ్డాది సుబ్బారాయ కవి (వసురాయకవి) గొప్పదనాన్నిమొదటగా లోకానికి తెలియజేసింది వీరు రచించి అప్పటిలో వస్తూండిన ‘హిందూజన సంస్కారిణి’ అనే పత్రికలో ప్రచురించిన ‘భక్త చింతామణి’ శతకంలోని పద్యాలు. ఈ శతకం క్రీ.శ.1893 లో మొదటిసారి పుస్తక రూపంలో వచ్చింది. నమ్మశక్యంగాని విషయమేమిటంటే, క్రీ.శ.1893 లో మొదటిసారి ముద్రణ అయింది మొదలు, ఈ చిన్న 50-60 పేజీల పుస్తకం దాదాపు ఇరవైమూడు సార్ల దాకా పునర్ముద్రణ పొందడం. ఈ పుస్తకంలోని పద్యాలు ఆంగ్లంలోనికి కూడా అనువాదమయ్యాయని చెబుతారు కాని, అదెంతవరకు నిజమో తెలీదు.

అప్పటిలో ఇంతగా ప్రాచుర్యం పొందిన ఈ ‘భక్తచింతామణి ‘ శతకం ఇప్పుడు లైబ్రరీలలోనయినా దొరుకుతుందో లేదో తెలియదు. సరళమైన, శబ్దవాచ్యత లేని, అర్ధ సుబోధకమైన సూటి భాష; ఒడిదుడుకులేమీ లేకుండా, అడుగున నునుపుతేలి ఉన్నటువంటి శిలాతలం మీదనుంచి తేలికగా ప్రవహిస్తుండే సెలయేటి గతి లాంటి ధార – ఈ రెండు లక్షణాలు  ‘భక్త చింతామణి’ లోని పద్యాలను పండితులు, పామరులు, పిల్లలు, పెద్దలు అని లేకుండా, ఆబాలగోపాలానికి ప్రీతిపాత్రం అవడానికి దోహదం చేశాయి అని చెప్పడానికి సందేహించాలిసిందేమీ లేదు.

“పడుచుల్ వేడుక బొమ్మరిండ్లిసుకలో బాగొప్ప నిర్మించి, చొ
ప్పడ మ్రుగ్గుల్ పచరించి, యాడుకొని, యాపై నాటగొల్లంచు గ
ట్టడముల్ పాడొనరించి పోవు గతి, వేడ్కల్ నీకు నీ విశ్వముల్
పొడమంజేసి, భరించి, మాపుటలు నెప్డున్; భక్తచింతామణీ!”

పై పద్యంలో కఠినమైన పదం ఒక్కటి గూడా లేదు. అర్ధంకాకపోవడానికి అందులో మానవాతీతమైన అనుభవాలకి సంబంధించిన విషయాలూ లేవు. చిన్నపిల్లలు ఆడుకునే ఆటలను దృష్టాంతంగా తీసుకుని దేవుని లీలను వర్ణించిన పద్యం. ఇది నచ్చకపోతే ఆశ్చర్యపడాలిగాని, నచ్చితే కాదు గదా! ఇలాంటిదే ఇంకో పద్యం:

“ఎదురం దండము చేత బట్టుక, నిజాధీశుండు చూపట్టినన్,
దుదకున్ సేవకు లెట్టులో యతని కన్నుల్ గప్పి వర్తింతు, రే
మిది, నిన్నెన్నడు జూడకుండియును, తండ్రీ! విశ్వ మింతైన ద
ప్పదు నీ యానతి, యద్భుతావహము; దేవా, భక్త చింతామణీ!”

ఇందులోనూ అర్ధంగాక పోవడానికి ఏమీ లేదు. విశదీకరించి చెప్పాల్సిందీ లేదు.  అర్ధ సుబోధకమైన పద్యం. ఇలాంటిదే మరొక పద్యం:

“నీకుం బ్రేమ సమాన మన్నిటియెడన్, నిక్కంబు సర్వేశ!, యీ
లోకంబందు సమస్త జంతువులకెట్లో నిత్య మాహార మీ
వే కావే దయసేయుచుండుదువు? తండ్రీ! యట్లు గాకున్న, మం
డూకం బేక్రియ ఱాతిలో బ్రతుకుచుండున్? భక్త చింతామణీ!”

ఈ పద్యం గురించి ఇక చెప్పాల్సిందేముంది?

తెలుగు నాటకాలు – మరి కొన్ని సంగతులు (2)

లక్ష్మీకాంతంగారి ‘హరిశ్చంద్ర’ లోని ‘తిరమై సంపదలెల్ల’ పద్యాన్ని తలచుకున్నప్పుడల్లా, నాకు ఏ నాటకంలోనిదీ, కావ్యంలోనిదీ కానిదైన ఈ క్రింది పద్యం స్ఫురణకు వస్తుంది:

“చూడంజూడ మహా శ్మశాన మనిపించున్ నాకు నీ లోక, మిం
దేడన్ గాలిడబోవ నేరిపయినో యే వేయుచున్నట్టులే
లో డక్కయ్యెడిగాని నీ మహిమ యాలోనే నివారించి, నీ
క్రీడారంగమటన్న మాట స్మృతికిం గీలించు మృత్యుంజయా!”

మహాద్భుతమైన ధారతో, చదవగానే ఒంటిని ఒకవిధమైన జలదరింపుకు గురిచేసే పద్యం ఇది. మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి గారిది, వారు ఆశువుగా చెప్పింది, కాదు పాడింది, తమ ‘కవన కుతూహలం’ లో అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు గ్రంథస్తం చేయడం వలన తెలుగు సాహితీలోకానికి తెలిసింది. అలా కాకపోయున్నట్లయితే,  ఈ పద్యం తెలియకుండానే జీవితం గడిచి పోయివుండేది గదా! అనుకుంటే మళ్ళీ ఒకసారి ఒళ్ళు జలదరిస్తుంది.

వరదరాజేశ్వరరావుగారు వివరించిన సందర్భం ఇది:

ఒక సాయంత్రం వారూ, సుందరరామ శాస్త్రిగారూ తెనాలిలో (సుందరరామ శాస్త్రిగారు తెనాలి వాస్తవ్యులు) కాలవ పక్కనుంచి నడిచి వెళ్తున్నారట. సుందరరామ శాస్త్రిగారు కాళ్ళకి చెప్పులు గూడా ధరించకుండా నడుస్తున్నారు. నడుస్తూండగా దారిలో ఆయన అడుగు (పాదం)  కాలవ వొడ్డున ఉన్న రెండు, మూడు బొమికల మీద పడబోగా, చూసి, వరదరాజెశ్వరరావుగారు శాస్త్రిగారి చెయ్యిపట్టుకుని ఆపి, వాటిని చూపించి, క్రింద చూస్తూ నడవమని చెప్పబోయేంతలో, శాస్త్రిగారు వరదరాజెశ్వరరావుగారి భుజం మీద చెయ్యివేసి, చూపులను ఆకాశం వంకకు మరల్చి, ఒక్కసారిగా అందుకుని ఉఛ్ఛస్వరంలో ఆలాపించిన పద్యం అట ఇది. శాస్త్రిగారి ఆలాపనలో ఈ పద్యం వింటుంటే ‘కాళ్ళు వణికినై, భయం వేసింది’ అని వ్రాసారు వరదరాజేశ్వరరావుగారు. ఇదీ ఈ పద్యం కథ!

తెలుగులో నిండైన అర్ధం గలిగిన, మంచి ధార గలిగిన పద్యాన్ని వ్రాయడం (చెప్పడం) ఒక కళ అయితే, వ్రాసిఉన్న పద్యాన్ని భావయుక్తంగానూ, సుబోధకంగానూ చదవడం, అంతకు మించి పాడడం ఇంకో కళ. తెలుగు కావ్యాలలోని పద్యాలను మించి రంగస్థల పద్యాలు (సత్యహరిశ్చంద్రలోనివీ, పాండవోద్యోగవిజయాల లోనివీ, గయోపాఖ్యానం లోనివి, ఇంకా ఇలాంటివే చాలా నాటకాలలోనివి) అక్షరం ముక్క రాని వాళ్ళ నోళ్ళల్లోకి కూడా అతిసుళువుగా వెళ్ళిపోవడానికి కారణం వాటిని హృద్యంగా పాడడమెలాగో పండితుల, గురువుల సహాయంతో తెలుసుకుని, సాధనచేసి ఆతరువాత రంగస్థలంపై పాడి వినిపించిన కళాకారులే అనడం ఎంతమాత్రం అతిశయోక్తి అవదు.

పద్యం చదవడంలో చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారినీ, వేలూరి శివరామశాస్త్రి గారినీ, ఆఖరికి విశ్వనాథ సత్యనారాయణ గారిని మించిన ప్రజ్ఞ కలవారు సుందరరామశాస్త్రిగారు అని సమకాలికులు చెప్పగా వినినట్లు వ్రాశారు వరదరాజేశ్వరరావు గారు, కవనకుతూహలంలో. కవిత్వం కడుపునింపుతుందని నమ్మి భంగపడినవాళ్ళలో సుందరరామశాస్త్రిగారొకరు.

సుందరరామశాస్త్రిగారి మీద చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి పద్యం, అంతే అద్భుతమైనది, వరదరాజెశ్వరరావుగారు చెప్పడంవలన తెలిసినదే, ఈ క్రింద ఉదాహరించినది:

“అగు నితడు స్వయం వ్యక్తుడు
భగవంతుడు గురువు, వీని పాండితికేనో
నగుబాటుం గురువును వీ
ని గుణాఢ్యత్వమ్ము మాన నీయమ్మెందున్.”

పై పద్యంలో ‘స్వయం వ్యక్తుడు’ అన్న మాట – ఆ ఒక్క మాట చాలు సుందరరామశాస్త్రిగారి ప్రతిభామూర్తి కళ్ళ ముందు కట్టడానికి. ఈ ‘స్వయం వ్యక్తుడు’ అన్న మాట సుందరరామశాస్త్రిగారిని గురించిన సందర్భంలో తప్ప తెలుగు సాహిత్యంలో మరెక్కడా ఎవరిచేతా ప్రయోగింపబడగా నేను చదవలేదు.

తెలుగు నాటకాలు (1)

బళ్ళారి వారి ‘చిత్రనళీయము’
వీరేశలింగం గారి ‘శకుంతల’
లక్ష్మీకాంతం గారి ‘హరిశ్చంద్ర’
శ్రీపాద వారి ‘బొబ్బిలి యుధ్ధం’
తిరుపతి వేంకటకవుల ‘పాండవోద్యోగ విజయాలు’
వేదము వారి ‘ప్రతాప రుద్రీయము’
పానుగంటి వారి ‘రాధ కృష్ణ’
వడ్డాది సుబ్బారాయ కవి ‘వేణీ సంహారం’

తెలుగులో నాటకాలలో ఇవి ఎన్నదగినవని, చాల గొప్పవని  పెద్దలు చెబుతారు. జనామోదాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి ‘హరిశ్చంద్ర’ కూ, ఆ తరువాత తిరుపతి వేంకటకవుల ‘పాండవోద్యోగవిజయాల’ కూ ఉన్న popularity మిగతా వాటికి లేదని చెప్పవచ్చు. popularity ని దృష్టిలో పెట్టుకుంటే జ్ఞాపకానికొచ్చే మరో నాటకం కాళ్ళకూరి నారాయణరావుగారి ‘చింతామణి’. తెలుగు నేల పల్లెటూళ్ళలో ఈ మూడు నాటకాలూ ఒకానొక కాలంలో రాజ్యమేలినాయని చెబితే అతిశయోక్తి కాదు.

లక్ష్మీకాంతంగారి ‘హరిశ్చంద్ర’ నాటకంలోని పద్యాలు ప్రేక్షకులను ఎంతగా కదిలించేవో చెప్పనలవికాదు. ‘హరిశ్చంద్ర’ నాటకంలో హరిశ్చంద్రుని పాత్రను ధరించి ప్రసిధ్ధులైనవారిలో కొంతమంది పద్యం పాడే పధ్ధతికి ప్రేక్షకులలో చాలామంది వచ్చే దుఃఖాన్ని చాల కష్టంమీద ఆపుకోగలగడం, కొందరైతే దుఃఖాన్ని ఆపుకోలేక ఒకింతసేపు హాల్లోంచి వెలుపలికెళ్ళి, మళ్ళి లోపలికొస్తూండడం చేస్తూండేవారు. చీమచిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించి ఉన్న హాలులో, లక్ష్మీకాంతంగారి ఈ క్రింద ఉదాహరించిన పద్యంలోని ఒక్కొక్క మాట, ప్రేక్షకుల భావావేశాల్తో చెండాడుకొనేదనడంకూడా అతిశయోక్తి కాదు:

“తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగిరా వేరి కే
సరికేపాటు విధించెనో విధి యవశ్య ప్రాప్యమద్దాని నె
వ్వరు దప్పించెద రున్నవాడనని గర్వం బేరికెన్ గాదు; కిం
కరుడే రాజగు, రాజె కింకరుడగున్ కాలానుకూలంబుగాన్!”

‘తిరమై’ అన్న మొదటి పదం దగ్గర మొదలై, నడుస్తూ నడుస్తూ, పద్యం చివరి పాదం దగ్గరికొచ్చి, ‘కింకరుడే రాజగు, రాజె కింకరుడగున్ కాలానుకూలంబుగాన్!’ అన్నది రాగయుక్తంగా పూర్తయే సరికి, పాషాణమైనా సరే కరిగి పోవాలిసిందే అన్నట్లుగా ఉండేది. పాడేవాడు కన్నీళ్ళతోనే పాడేవాడు, చూసేవాళ్ళు కన్నీళ్ళతోనే చూసేవాళ్ళు. ఏడుపా అది? కానేకాదు. ఎంతమంది ఎన్నెన్ని పల్లెటూళ్ళలో ఎన్నెన్ని సంవత్సరాలపాటు ఈ పద్యం ధాటికి తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకున్నారో చెప్పడానికి లెక్కల్లేవు. అవన్నీ వేరే రోజులు. ఇప్పుడు వచ్చేవి
కావు. చెప్తే అర్ధమయేవీ కావు. ఇప్పుడు rewind చేసుకుని చూసుకోవడానికి స్వంత memory తప్ప వేరే మార్గాలు లేవు.

ఛందస్సు ఒక బంధనమని, శ్రుంఖలమని, అదుండగా అసలుసిసలైన కవిత్వం ఎక్కదని, భావం ఒదగదనీ, వ్యర్ధపదాల్లేకుండా సాధ్యపడదనీ అనుకున్నప్పుడల్లా, ఇలాంటివే పద్యాలు జ్ఞాపకానికొచ్చి నోరుమూయిస్తూంటాయి. పాలేర్లూ, కూలివాళ్ళూ ఈ పద్యాలను అక్షరం తప్పులేకుండా పాడడం తెలిసున్న వాళ్ళలో నేనూ ఒకడిని కావడం నా భాగ్యంగానే భావిస్తూ ఉంటాను ఇప్పటికీ!

చిరస్మరణీయులు: మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు

ఆంధ్రదేశంలో ‘కవిగారు’ గా ప్రసిధ్ధులైన వ్యక్తులు ఇద్దరు. వారిలో ఒకరు, మాన్యులు మానవల్లి రామకృష్ణ కవిగారు. రెండవ వ్యక్తి, విశాఖ వాస్తవ్యులైన మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు (క్రీ.శ.1874-1951). తెలుగు సాహిత్యాన్ని గురించి అడపాదడపా పుస్తకాలు తిరగేసే వారికి తెలిసే విషయాలలో ఇది ఒకటి.

వీరిరువురిలో ఏ ఒక్కరూ ‘కవిగారు’ గా అందరిచేత పిలవబడేందుకు సరిపోయేటంతటి గ్రంథమేదీ వ్రాయలేదు. అయినప్పటికీ వీరిరువురూ ‘కవిగారు’ గానే ప్రసిధ్ధులు.  కారణం ఒక్కటే అయిఉండాలి. అది బదులేమీ ఆశించకుండా తెలుగు సాహిత్యానికి వీరు చేసిన సేవకు ముచ్చటపడి లోకమే వారినలా పిలుచుకుని గౌరవించింది అనుకోవాలి.

రామచంద్ర శాస్త్రి గారయితే, సాహిత్య సేవతో పాటు తమ చేతనయినంత సామాజిక సేవ చేయడంపైన కూడా ఎక్కువ మక్కువ చూపారనవచ్చు ననిపిస్తుంది, వారిదే అయిన ఈ క్రింది పద్యం చదివిన ఎవరికయినా:

“గీ: నీ తలంపేమొ సర్వజ్ఞ నేనెరుంగ;
      కాని, స్వర్గంబు మోక్షంబు కాంక్షచేయు
      టరయ స్వార్ధ పరత్వమే అగును; కాన,
      పరులకై సదా ఇట పాటు పడనె తలతు.”

కవిగారు ఆంధ్ర, సంస్కృత, ఆంగ్ల భాషలలో పండితులు. ఆంధ్రంలో అష్టావధానం చేయగలిగిన సామర్ధ్యం వారికుండేదట. గ్రాంథికవాదే అయినప్పటికీ, అచ్చతెలుగు మీద ఆయనకు మమకారం చాల హెచ్చు. ఈ మమకారం అచ్చతెలుగులో ఒక నిఘంటువును రూపొందించే దాకా  వెళ్ళింది.  కాని, ఆ నిఘంటు నిర్మాణం పూర్తయినట్లుగా కనపడదు. విశాఖపట్టణంలో శ్రీశ్రీ, పురిపండా అప్పలస్వామి, ఇత్యాదులు కలిసి ఏర్పరచిన ‘కవితా సమితి’  అనే సాహితీ సంస్థకు కవిగారు అద్యక్షులుగా ఉండేవారు.

సంస్కృత భాషా సంపర్కంవలన తెలుగులో చాలా పదాలు అంతరించి పోయినాయనీ, వాటిని తిరిగి సంపాదించుకోవడం కర్తవ్యమనీ నమ్మి ఆదిశగా కృషి చేశారు. సామాన్యంగా ఉత్తరప్రత్యుత్తరాలలో వాడే ‘శుభం’ అనే మాటకు అచ్చతెలుగు సమానార్ధకంగా ‘మేల్ ‘అనే మాటను వారు వాడే వారు. ‘దేవుడు’ అనే పదానికి ‘ఎల్లడు’ అనేది అచ్చతెలుగులో వారు సూచించిన పదం.

నిజానికి సాహిత్యరంగంలో కంటె సాంఘికరంగంలోనే రామచంద్రశాస్త్రిగారి కృషి ఎక్కువగా కనబడుతుంది. అనర్గళంగా ఉపన్యసించే శక్తి ఆయనకు ఉండేదని, మైకులులేని ఆరోజులలో (అంటే భారతదేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాకముందు, 1910-20 ప్రాంతాల్లో) వేలాదిమంది జనాన్ని తమ ఉపన్యాసంతో ఆకట్టుకోగలిగేవారనీ, జాతీయోద్యమంలో గాంధీగారి అనుచరులై ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్ళారనీ వారిని గురించి పెద్దలు వ్రాసిన వ్రాతల వలన తెలుస్తుంది. సాంఘికంగా వీరేశలింగంగారితో మొదలైన సంస్కరణధోరణిని అందిపుచ్చుకుని విశాఖపట్టణంలో తమ వంతు సేవగా పాఠశాలలను స్థాపించడం, బాల బాలికలకు విద్యను ప్రోత్సహించడం వంటి
కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా కొనసాగించారు.

1909 సంవత్సరంలో ‘కళాభిలాష కావ్యమాల’ ను ఏర్పరిచి ఆ సంస్థద్వారా గ్రంథప్రచురణను విస్తారంగా సాగించారనీ, తెలుగులో రామచంద్రశాస్త్రిగారిదే మొదటి కావ్యమాలిక అనీ చెబుతారు. విశాఖపట్టణంలో శ్రీరామనవమి ఉత్సవాలకు వీరే శ్రీకారం చుట్టారనీ, వేదపాఠశాలలు గూడా వీరి చేతులమీదుగానే రూపుదిద్దుకున్నాయనీ చేబుతారు. తాము ఉంటున్న పూరిపాకనే ఆశ్రమంగా చేసి, అందులోనే గ్రంథాలయాన్ని నిర్వహించేవారనీ తెలుస్తుంది. క్రీ.శ. 1938-39 ప్రాంతాల్లో గ్రంథాలయ సర్వస్వం పత్రిక యొక్క
సంపాదకత్రయంలో రామచంద్రశాస్త్రిగారు ఒకరనీ తెలుస్తుంది.

క్రీ.శ.1935 సంవత్సరం నవంబరు నెల 24న రామచంద్రశాస్త్రిగారి షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్టణంలో చాలా ఘనంగా జరిగిందనీ, నిజంగా అది ఒక మరపురాని ఉత్సవమనీ, కవిగారిని ఆయన ఆశ్రమంనుంచి ఊరేగింపుగా సభామంటపానికి తీసుకువచ్చి సత్కరించారనీ, విశాఖపట్టణం యావత్తూ ఆ ఉత్సవంలో పాల్గొన్నదనీ, స్వాతంత్ర్యపూర్వ తెలుగుదేశం సృష్టించుకున్న నీతిమంతమైన అలుపెరుగని నాయకులలలో కవిగారు రామచంద్రశాస్త్రిగారు ఒకరనీ, నిజానికి వీరేశలింగంగారి తరువాత శాస్త్రిగారి పేరుతో సరితూగగలిగేది మరొకటి
కనబడదనీ పెద్దల మాటల వలన తెలుస్తుంది.

అయితే, అన్నిటినీ మించి ఆయన ఇష్టంగా ఎంచుకుని శ్రమించిన అచ్చతెలుగు నిఘంటువు (నుడికడలి) నిర్మాణం అనే కల తీరకుండానే క్రీ.శ.1951 లో ఆయన పరమపదించడం ఒక దురదృష్టకర పరిణామం అనాలి. ఆయన వదిలేసిన చోటినుండయినా ఆ కార్యక్రమాన్ని అందిపుచ్చుకుని కొనసాగించిన వారు అప్పటిలోనే ఎందుచేతనో లేరు. ఇప్పటిలో అలాంటి కార్యక్రమాలకు అవకాశమూ లేదు.

చిరస్మరణీయులు: మహనీయులు మానవల్లి రామకృష్ణకవిగారు (2)

తాళపత్రాలపై ఉన్న ఒక కావ్యాన్ని కాగితపు పుస్తకాలలోకి ఎక్కించడానికి రెండు విషయాలలో  ప్రతిభ అవసరం. మొదటగా తాళ పత్రం పై ఉన్న కొన్ని వందల సంవత్సరాల క్రితపు వ్రాతను చదవడానికి సంభందించిన ప్రజ్ఞ అవసరం. రెండవది, లేఖన దోషాలను గుర్తించగలగడమే కాకుండా, అవసరమయినచోటల వ్రాయసగాండ్ల లేఖన దోషాలను గుర్తించి పాఠాన్ని సరిదిద్దగల భాషా పరిజ్ఞానం చాలా అవసరం. ఈ రెంటిలోనూ పరిజ్ఞానం పుష్కలంగా ఉండిన మహనీయులు మానవల్లి కవిగారు.

నన్నె చోడుని ‘కుమార సంభవం’ కావ్యం ప్రథమ భాగం ప్రచురింపబడి తెలుగు సాహితీలోకంలో ఒక సంచలనం రేపింది.  దీనికి కారణం ‘కుమార సంభవం’ కావ్యానికి సమకూర్చిన పీఠికలో కవిగారు నన్నె చోడదేవుని క్రీ.శ.950 ప్రాంతం వానిగా చెప్పడం. ఈ కాల నిర్ణయం నన్నె చోడుని నన్నయ కంటే ముందువానిగా చేయడమే కాకుండా, ‘కుమార సంభవా’న్ని తెలుగులో తొలి కావ్యాన్ని చేసి, నన్నయ ఆంధ్ర మహాభారతాన్ని వెనుకకు నెట్టింది. నన్నయను ఆదికవిగా ఆరాధుస్తూ వస్తూన్న తెలుగు పండితలోకం, కవిగారి ఈ కాల నిర్ణయాన్ని హర్షించలేకపోవడమే కాకుండా, విపరీతమైన స్థాయిలో విమర్శనాస్త్రాలను ప్రయోగించింది. చివరికి ఒక దశలో ఈ విమర్శ ఏ స్థాయిదాకా వెళ్ళిందంటే, కవిగారే పాత కావ్యాల తరహాలో రచనచేసి పేరుకోసం అలా చేశారనేంత దాకానూ వెళ్ళిందని చెబుతారు. అయితే, అసంకల్పితంగా దీనివలన అవగతమైన విషయం ఒకటుంది. అది -  పూర్వ ప్రసిధ్ధ కవుల పంధాలో కావ్యరచన చేయగలిగినంతటి సమర్థత ఆ రోజులలో కవిగారికి ఉండేదనిన్నీ, పూనుకోవాలేగాని, వారు అంతటి సమర్థులనిన్నీ! వారి పాండిత్యం మీద ఎవ్వరికీ ఏవిధమైన సందేహాలూ లేవు. హిందూదేశంలోని అతిగొప్ప సంస్కృత పండితులు ఆరుగురిలోనూ ఒకరిగా ఆయన పేరుపొందినవారు. అప్పటిలో బరోడా ప్రభుత్వంవారు ఆయనచేత భరతముని సంస్కృతంలో రచించిన నాట్యశాస్త్రానికి వ్యాఖ్య రాయించి ప్రకటించేరనీ చెబుతారు.

కవిగారు తెలుగులో తమ ‘విస్మృతకవులు’ లో భాగంగా ప్రకటించిన రెండవ గ్రంథం వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామం’. ఇది వల్లయభరాయనిచే రచించబడలేదనీ, శ్రీనాథుడే దీనిని రచించి ఏకారణం చేతనో వల్లభరాయని పేరు పెట్టాడనీ, నిజానికి ఈ కావ్యం శ్రీనాథకృతంగా పిలవబడాలనీ చెప్పి నమ్మించడానికి తరువాతి కాలంలో పూజ్యులు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఎంతగానో ప్రయత్నించారుగాని, ఈనాటికీ ఇది వినుకొండవల్లభరాయ కృతంగానే ప్రసిధ్ధం. అలాగే, చిమ్మపూడి అమరేశ్వరుడని ఒక ప్రసిధ్ధ పూర్వ కవీచే రచించబడిన ‘విక్రమసేనము’ అనే గ్రంథపు తాటాకు ప్రతిని కవిగారు సంపాదించి దానికి సాఫు ప్రతిని తయారుచేయడానికి ఒక పండితునికి ఈయగా, సదరు పండితుడు ఆ పుస్తకపు తాటాకు ప్రతితో అయిపు లేకుండాపోయాడనీ కూడా చెబుతారు. ఈ విషయాన్ని వారు పండితలోకానికి తెలియజేయగా, నమ్మినవాళ్ళు నమ్మారు, లేనివాళ్ళు లేదని కూడా చెబుతారు! ఇంచుమించు ఒక వ్యసనంగా కవిగారు చేసిన ఈ విస్మృతకవులను వెలుగులోకి తీసుకురావడం అనే ‘వ్యాపారం’ లో ఆయన  ఎంతో డబ్బు సంపాదించుకుంటున్నారన్న తప్పుడు అభిప్రాయం కలిగినవాళ్ళకు ఇందులోని సాధకబాధకాలు అర్థమవాలన్న ఉద్దేశ్యంతో నన్నట్లుగా ఒకానొక సందర్భంలో ఆయన చెప్పిన ‘విజ్ఞప్తి’  మాటలు – “క్రీ.శ.1914 సం.నకు అనగా నేను క్రీ.శ.1908లో ఈ గ్రంథ ప్రథమ భాగము ముద్రించిన నాటినుందడి “యాఱు” ప్రతులు మాత్రమే చెల్లినవి” (అంటే అమ్ముడుబోయాయి అని). ఈ మాటలు  తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాల ప్రచురణ రంగంలో ఆనాటి పరిస్థితి ఎలావుండేదో తెలియజెప్పడానికి కూడా బాగా ఉపయోగపడతాయి.  తెలుగు సంప్రదాయ సాహిత్యంపై ఈనాడు శ్రధ్ధ తగ్గిందనీ, ఆనాళ్ళలో తెలుగులో ఏదైనా కొత్తది  పద్య సాహిత్యం ప్రచురణ పొంది లభ్యమవడం మొదలైందే తడవుగా తండోపతండాలుగా పండితులు ఆ పుస్తకాలను కొని చదివేసేవారనీ అనుకొనేవాళ్ళకు, చెప్పేవాళ్ళకు కవిగారి ఈ మాటలు ఒక కనువిప్పు.

క్రీ.శ.1972 లో గౌరవనీయులు నిడదవోలు వేంకటరావు మరియు పోణంగి శ్రీరామ అప్పారావు గారల సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు “మానవల్లి కవి – రచనలు” అనే పుస్తకాన్ని ప్రచురించారు. కవిగారిని గురించిన చాలా సమాచారం ఇందులో దొరుకుతుంది. ఇది కాకుండా, సాహిత్య లోకంలో ప్రసిధ్ధులైన తలావఝ్ఝుల శివశంకర శాస్త్రి, పంచాఙ్నుల ఆదినారాయణ శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ లాంటి వారలు తెలుగు సాహిత్యం పై చేసిన రచనలలో కవిగారి గురించిన సంగతులు ప్రస్తావ వశాన వచ్చినవి ఎన్నో తెలుస్తాయి.

మాన్యులు టేకుమళ్ళ కామేశ్వరరావు గారు తమ “నా వాఙ్మయ మిత్రులు” లో కవిగారిని గురించిన వ్యాసంలోని ముగింపు వాక్యాలు – “పగడపు పురుగులు మహాసముద్రంలో చుట్టు గోడలను కట్టుకొంటాయి.  అవి మానవులకు దీవులవుతాయి. అట్లే మానవులలో మేధావులు తమ లాభంకోసం పొగడ్తల కోసంగాక నైసర్గికంగా పనిచేసుకొని పోతారు. దానివల్ల జాతికి మాత్రమే శాశ్వత ప్రయోజనం”. కవిగారి విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు.

ఆయన నిరాడంబ జీవనం, అకుంఠిత దీక్షతో తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన నిస్స్వార్ధ సేవ, ఆయన పాండిత్య ప్రతిభ – ఇవి ఆయనను నాకు ప్రాతఃస్మరణీయులలో మొదటివానినిగా చేశాయి.

చిరస్మరణీయులు: మహనీయులు మానవల్లి రామకృష్ణకవిగారు (1)

కాలగర్భంలో కలిసిపోయినటువంటి పురాతన వస్తువులను తవ్వి తీసే పురావస్తు పరిశోధక శాస్త్రం (Archeology) వంటిది సాహిత్యానికి సంబంధించి పురా గ్రంథ పరిశోధక శాస్త్రం  (Literary archeology) ఏదైనా ఉండడం సంభవిస్తే, అలాంటి శాస్త్రానికి తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ఆద్యులనదగిన తొలి తెలుగు వ్యక్తి మాన్యులు మానవల్లి రామక్రిష్ణ కవిగారు అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. ఏ వ్యక్తి అయినా అన్ని రకాల కష్టనష్టాలకూ వోర్చి  జీవితమంతా సాహిత్యంకోసమే జీవిస్తూ, పురాతన గ్రంథాలను వెలికితీసి వెలుగుచూపించడమే ధ్యేయంగా పెట్టుకుని, అది తప్ప వేరే ధ్యాసంటూ లేకుండా జీవించడం అంటూ
సాధ్యపడితే అది మహనీయులు మానవల్లి ద్వారానే సాధ్యపడిందంటే, అది యెంత మాత్రమూ అతిశయోక్తి కానేరదు. ఇవాల్టి రోజున అలాంటి జీవితాన్ని గడపడం ఊహించుకోనే లేం! అల్లా గడపాలని ఇఛ్ఛ ఉన్నా సాధ్యమయే సంగతీ కాదు!!

మానవల్లి వారు లేకుంటే తెలుగు సాహిత్యానికి నన్నెచోడుడు ఉండేవాడేమో గాని, ‘కుమార సంభవం’ ఉండేది కాదు. వారే లేకుంటే ‘క్రీడాభిరామం’ అంతకన్నా లేదు.

క్రీ.శ.1866లో ఇప్పటి చెన్నై, అప్పటి మదరాసు, లో జన్మించారు మానవల్లి వారు. పండిత వంశం కావడంతో, సంస్కృతంలో పాండిత్యం సహజంగానే వారికి బాల్యం నుండీ అలవడింది. ఇరవై ఏండ్లు వచ్చే సరికల్లా సంస్కృత బాషలోనే కాక, ఆంధ్రము, ఆంగ్లము, తమిళము,కన్నడము భాషలలో ప్రావీణ్యం సంపాయించారు కవిగారు. అసాధారణమైన ధారణ శక్తి ఆయనకు దైవమిచ్చిన వరంగా చెబుతారు. ఏ గ్రంథమైన ఒక్క సారి చదివితే చాలు, అందులోని అక్షరమక్షరమూ ఆయనకు పట్టుబడిపోవలసిందే!

సాహిత్యంపై సహజంగానే అబ్బిన మమకారం చేత ఆయనకు తాళపత్ర గ్రంథాల అన్వేషణ తొలినాళ్ళ నుంచే అలవడింది. తంజావూరు సరస్వతీమహల్ లో తెలుగువాళ్ళు అప్పటిదాకా కనివినీ యెరుగనటువంటి గ్రంథాలున్నాయని మొదటగా తెలియజేసింది కవిగారేనని చెబుతారు. అచ్చటినుండి వారు సంపాదించి ‘విస్మ్రుత కవులు’ శీర్షికన ప్రచురించిన కావ్యాలలో ఒకటి నన్నె చోడుని ‘కుమార సంభవం’ కావ్యం.

తంజావూరు గ్రంథాలయం గురించి చెప్పాలంటే, తాళపత్ర గ్రంథం కావాలంటేనూ, చూడాలంటేనూ తంజావూరు పోవలసిందే నని అప్పటిలో నానుడిగా ఉండేదని పెద్దలు చెబుతారు. తంజావూరులో సరస్వతీమహలు గ్రంథాలయంలోని గ్రంథాలన్ని తంజావూరునేలిన మహారాష్ట్ర రాజులు సేకరించినట్టివే! ఆ గ్రంథాలయం ఆ ప్రభువుల కోటలో ఉండేది గాబట్టి, అందులోనికి సామాన్యులకు ప్రవేశం దుర్లభంగా ఉండేదట. వాఙ్మయంలో పరిశ్రమచేసే వారికి మాత్రం కొంత కష్టం మీద ప్రవేశం లభించేదట. ఇక గ్రంథం వెలుపలికి కావాలనంటే వ్రాసుకుని తెచ్చుకోవలసిందే గాని వేరే మార్గంలేకుండెడిదట. తమిళం తెలిసి వుండడం వలన, కవిగా రెలాగో వారిని వొప్పించి తాళ పత్ర గ్రంథాలను గ్రంథాలయం నుండి తెచ్చి రాత్రులకు రాత్రులు నిద్రకు వెలిగా ఉండి వ్రాత ప్రతులను తయారు చేసిన మీదట, తెచ్చిన గ్రంథాలను తిరిగి గ్రంథాలయానికి చేర్చే వారట!

ఇంతటి శ్రమకోర్చి, తాళపత్ర గ్రంథాలకు వ్రాత ప్రతులను తయారు చేసి ఆ మీదట పాఠాన్ని పరిస్కరించి కవిగారు ప్రచురించిన తెలుగు కావ్యాల జాబితా (ప్రచురింప బడిన సంవత్సరం కుండలీకరణాలలో) – కుమార సంభవం – ప్రథమ భాగం (1908), క్రీడాభిరామం (1909), బద్దె భూపాలుని ‘నీతిసార ముక్తావళి’ (1910), అనర్ఘ రాఘవము (1911), ఉదాహరణ వాఙ్మయంలో తొలుతటిదైన త్రిపురాంతకోదాహరణం (1912), శ్రీరంగ మహత్మ్యం (1912), కుమార సంభవం – ద్వితీయ భాగం (1914), సకలనీతి సమ్మతం (1923). ఈ కావ్యాలన్నీ తొలుతగా తాళపత్రాల నుంచి అచ్చులోనికి వెళ్ళింది కవిగారి చేతుల మీదుగానే అనీ ఆ తరువాతి ముద్రణలన్నిటికీ కవిగారి ముద్రిత ప్రతులే ఆధారములయినాయని చెబుతారు.