స్వగతాలు (7): రంగుల కల -1

రంగుల కల

అవును, ఇది ఒక రంగుల కల!
ఈ కల ఎప్పటికప్పుడు పరుచుకుంటున్న మంచు తెరలా కళ్ళను కమ్మేసి కలవరపెడుతూనే ఉంటుంది.
ఎందుకో తెలియని భావోద్రేకాన్ని భరించి ఉండడం ఎంత కష్టమో, కళ్ళముందు కమ్ముకుంటున్న ఈ రంగుల కలనూ పక్కకు నెట్టి విడిగా చూడడమూ అంతే కష్టంగా ఉంటుంది.

flowers, clrs (18)తల వంచుకుని నడుస్తూనే ఉంటామా…
అడుగులు ముందుకు పడుతూనే ఉంటాయా…
ఇంతలో ఏదో ఒక ఊహించని మూలనుంచి ఒక వర్ణమో, వర్ణాల సముదాయమో తెలియకుండా వచ్చి తమ ఉనికిని తెలుపుకుంటున్నట్లవుతుంది.
అదెందుకలా అవుతుందన్న దానికి సమాధానాం దొరకదు గాని,
తల అటుగా తిప్పి చూస్తే, ఇదిగో ఇలా చూడాలన్నట్లుగా వాటికవే చూపులకు దారి పరిచినట్లవుతుంది.

flowers, clrs (19)చంద్రుడితో పాటే పోయే వెన్నెలలా,
ప్రియుడి వెంట ప్రేయసి పోతుందని ఎవరో ఒక పూర్వ కవి ఉత్ప్రేక్షించినట్లు,
వర్ణంతో పాటుగానే నా కంటి చూపూ పోతుంది.

flowers, clrs (20)వర్ణ సౌందర్యం, వర్ణ సముదాయాల సమ్మేళనల సౌందర్యం. నాకొక తన్మయ నయనానందకర సమ్మోహ భీభత్సం!

flowers, clrs (21)విరియడానికి వేసటతో వేచి చూస్తున్నట్లుగా కనుపించే వర్ణం, పువ్వు వెంట ఒకానొక  తన్మయాన్ని గాలిలోకి నిరంతరంగా నిశ్వాసిస్తూనే ఉంటుంది;
మొగ్గగా విలసిల్లడానికి ముందే, ఒకా నొక …కాదు కాదు, అనేకానేక తమోహ రణాల సమీకరణాలను అణువణువునా నింపుకుని గదా అది అవతరించేది!

తెలుగు మాట, పాట, పద్యం (5)

అచ్చ తెనుగు పద్యం

తెలుగు పద్య సాహిత్యంలో ‘అచ్చ తెనుగు’ అన్న మాటను మొదటి సారిగా వాడిన వ్యక్తి మూలఘటిక కేతన అని చెబుతారు. ఈయన తిక్కన మహాకవి సమకాలికుడు. తెలుగులో మొదటి కథాకావ్యానికి (దశకుమార చరిత్ర) శ్రీకారం చుట్టినవాడు కేతన. ‘కవిత చెప్పి’ తిక్కన మహాకవినే మెప్పించినవాడు ఈయన.  ఈయన చెప్పిన ఈ ‘అచ్చ తెనుగు’ అనే మాటకు ముందు, ఈ మాట ఏ అర్ధాన్నయితే సూచిస్తుందో అదే అర్ధంలో ‘జాను తెనుగు’, ‘దేశి’ అనే మాటలు వాడుకలో వుండేవి. ఈ మాటలను తమ పద్యాలలో చెప్పిన వారు ‘నన్నె చోడుడు’, పాలుకురికి సోమనాధుడు!

పేరుకి ఇన్ని మాటలున్నా, ఈ మాటలు ‘అచ్చ తెనుగు’ భాషా స్వరూపాన్ని అర్ధమయేలా చేయడంలో సఫలీకృతం కాలేకపోయాయన్న ఒక అభిప్రాయం, విజ్ఞుల మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి! భాషా స్వరూపం అర్ధం కావాలంటే, ఒక ఉదాహరణంతో చెప్పుకుంటే, కొంతలో కొంత స్ఫష్టత వచ్చి, సులభం అవుతుంది.

“పగలు సేయుచు వేడిమి మిగుల జగము
గ్రాచు జమునబ్బ మున్నీట గలిసె ననియొ
తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపు
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”

కూచిమంచి తిమ్మకవి రచించిన ‘అచ్చ తెలుగు రామాయణం’ కావ్యంలోనిది ఈ పద్యం. సూర్యాస్తమయాన్ని సుందరంగా వర్ణించే పద్యం! నాకయితే, ఈ పద్యంలోని మాటల పొందిక, brevity, గాథా సప్తశతిలోని గాథలను తలపుకు తెస్తుంది. మంచి భావంతో నిండి వున్న పద్యం! ఊహ original ది! నాకు తెలిసినంతవరకూ, ఏ ప్రాకృత గాథనుంచో, సంస్కృత శ్లోకంనుంచో ఎత్తుకొచ్చింది కాదు!

ఇప్పుడు, ఈ పద్య భావాన్ని కొంచెం విడమరచి చెప్పుకుంటే…

‘పగలు సేయుచు’ – పగలు సేయువాడు – దినకరుడు.
సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ, కొన్ని రకాలయిన సంస్కృత సమాసాలు అచ్చ తెలుగులోకి మారేటప్పుడు జరిగే మార్పులను గురించి కొంత వివరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సంస్కృత సమాసాలలోని ప్రత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, దొర, తపసి, జోదు…ఇత్యాది శబ్దాలు జతవుతాయి అని వ్యాకరణం. ఉదాహరణకి:

అచ్చ తెలుగులో ‘కప్పు కుత్తుక వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘నీలకంఠ’ కు,
అచ్చ తెలుగులో ‘గిత్త తత్తడి వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘వృషభ వాహన’ కు,
అచ్చ తెలుగులో ‘వెంట్రుక యడుగుల దొర’ అనే సమాసం, సంస్కృతంలో ‘రోమ పాద’ కు,
అచ్చ తెలుగులో ‘మనుబోతు కొమ్ము తపసి’ అనే సమాసం, సంస్కృతంలో ‘ఋష్యశృంగ’ కు,
అచ్చ తెలుగులో ‘పచ్చ వారువపు జోదు’ అనే సమాసం, సంస్కృతంలో ‘హరిదశ్వా’ కూ అనువాదాలని పెద్దల వివరణ. తెలుగులో వీటినే బహువ్రీహి సమాసాలుగా భావిస్తారని కూడా చెబుతారు, అర్ధంలో చివరన కలది, కలవాడు చేరతాయి కాబట్టి. (నల్లని కంఠము కలవాడు, ఎద్దును వాహనముగా కలవాడు…ఇత్యాదిగ).

నాకయితే తెలుగులో ఈ మాటలు, సంస్కృతంలో మాటలు ఎంత అందంగా కనిపిస్తాయో, తెలుగులోనూ అంతే అందంగా అనిపిస్తాయి. ఇలాంటివే ఇంకొన్ని సమాసాలు:

వలిగుబ్బలి రాచ కూతురు (హైమవతి – హిమవంతుని కూతురు, ‘వలిగుబ్బలి’ అంటే మంచుకొండ అని అర్ధం), పుట్ట బుట్టువు తపసి (వాల్మీకి – పుట్ట  నుంచి పుట్టిన తపస్వి), పదియరదముల దొర కొడుకు (దాశరధి – దశరధుని కుమారుడు) – ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలంత అందంగానే కనబడతాయి.

ఇక్కడితో ఇది ఆపి, అసలు పద్యానికొస్తే –

పగలు సేయుచు – పగటిని చేస్తూ, ఆ క్రమంలోనే; వేడికి మిగుల జగము గ్రాచు – వేడిమితో జగత్తునంతా వుడికించి ఇబ్బందికిలోను చేసే; యమునబ్బ – యముని తండ్రి (సూర్యుడు); మున్నీట – సముద్రములోనికి; కలిసె ననియొ – కలిసిపోయాడుగదా అని; తొగ వెలందుక – కలువ పూవు (అనే పడతి); నగియె – నవ్వింది; అమ్మగువ – ఆ కలువ సుందరి; పెంపు గని – సంతోషంతో వదనం పెద్దదవడం (కలువ వికసించడం అన్న భావం) చూసి; సయింపక – తాళ లేక; తమ్మి – తామర పూవు (అనే పడతి); మొగంబు మొగిచె – మొహం ముడుచుకుంది, చాటు చేసుకుంది.

సూర్యాస్తమయంతోనూ, చంద్రాగమనంతోనూ కలువలు వికసించడం అనేది ప్రకృతి ధర్మం. సూర్యాస్తమయంతో తామరలు వికసనం కొల్పోయినట్లయి, కళావిహీనంగా, ముడుచుకున్నట్లయిపోవడమూ ప్రకృతిధర్మమే! ఈ రెండు ధర్మాలనూ కలబోసి, ఒకే సందర్భానికి జతచేసి, హృద్యంగా చెప్పడం ఈ పద్యంలో జరిగింది.

నాకు ఈ పద్యాన్ని చదివినప్పుడల్లా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది. పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గాథా సప్తశతి లోని పద్యాలను తెలుగులోకి అనువదించడంలో ఈ పద్యాన్నే(సరిగ్గా ఈ పద్యాన్నే అని కాకుండా, ఇలాంటి పద్యాలనే) ఆదర్శంగా తీసుకున్నరేమో! అని. ఎందుకంటే, అందులోని చాలా పద్యాల నడక ఈ పద్యాన్నే పోలి వుంటుంది. ఉదాహరణకి:

“అడుగుదమ్ములందు బడివేడు పతివీపు
జిన్ని కొమరుడెక్కి చెలగి యాడ
అలుక యెంత తెగనిదయ్యును నిల్లాలి
మొగమునందు నవ్వు మొలచె నపుడు! “                (శతకం 1 గాథ 11)

“ఎవని వదలిన జీవంబు నవసి చనునొ
యతని నపరాధినయ్యు నోదార్ప వలయు;
ఊరు గాలుచు బొలిపోవు చున్న గాని
యగ్గి నొల్లని వారెవ్వరతివ, చెపుమ?”         (శతకం 2, గాథ 63)

అందుండి అచ్చ తెలుగు మాటలలో వున్న ఇలాంటి రమ్యమైన పద్యాలను ఇంకా చాలానే ఉదాహరించవచ్చు!

నా వచన కవితలు (22)

శోధన

ఎలా చెప్పాలన్నది సమస్య
ఎప్పటికప్పుడు ఆరంభం ఒక అవస్థ
మబ్బు లోంచి తెగిపడే మొట్టమొదటి వాన చినుకులా
మొదటి మాట విడిపడ్డ దాకా
ఆరంభం ఒక పెద్ద అవస్థ

నీళ్ళ మీదుగా
నీళ్ళ చెలమల మీదుగా
ఇసుక తిన్నెల మీదుగా
సరివి చెట్ల కదలని తలల నీలం మీదుగా
నదికి అవతలి వైపు అందించే అనంతమైన జవాబవసంలేని ప్రశ్నలోకి
నిరీక్షణంగా నిర్వీక్షణంగా పదేపదే వీక్షించడమూ ఒక అవస్థ

రాతిరవడాన్ని శాసిస్తున్నట్లుగా వుండే చుక్కల వెలుతురులో
ఎన్నెన్ని సారులో చీకటిగా నిద్ర లేవడం
నుదుటిపై పట్టివున్న చిరు చెమట బిందువులను
కుంకుమ నీడలలోనికి రాకుండా నిలపుదల చేయడం
కళ్ళు తెరిచేలోపల ఒక సమావేశపు సమీకరణాన్ని
సంగ్రహించుకు చూసుకుని ఆసారికదోలా సంతృప్తి చెందడం

ముక్కు బేసరిపై పడి ముక్కలయ్యే వెన్నెల కిరణం
పదే పదే అదే అగాధంలోకి తరుముకుంటూ తీసుకువెళ్ళే అవే అవే ఆనవాళ్ళూ
ఎన్నాళ్ళగానో తపించి వేధించినా సందేహానికి ఎప్పుడూ దొరకనట్టుండే
సమాధానాల ఉఛ్ఛ్వాస నిఛ్ఛ్వాసాలూ
కన్నీటికి అంతం లేదన్నది తెలిపేటందుకే అన్నట్లుండే
దేహాగ్ని శకలాల సమూహాలూ వాటి నమూనాలూ

ఎవరో వదిలేసి వెళ్ళిపోయిన జ్ఞాపకాలను ధరించి భరిస్తున్నట్లుండే గుండెకి
నిండుగా ఒక్క సారన్నా మోహాన్ని మొహానికి పులుముకుని కనుపించలేని శరీరాన్ని హద్దుగా పెట్టుకుని

ఎందుకని
ఎక్కడికని
ఎన్నాళ్ళని
ఈ శోధన??

 

తెలుగు మాట, పాట, పద్యం (4)

తెలుగులో శతక సాహిత్యంలో అధిక్షేప శతకానిది ఒక ప్రత్యేకమైన శాఖ అయితే, అందులో వేణుగోపాల శతకానిది ఒక విశిష్ఠ స్థానం అన్నది తెలిసినదే! ఈ శతకాన్ని రచించినది పోలిపెద్ది వేంకటరాయ కవి.  ఇతడు కార్వేటి సంస్థాన కవులలో ప్రముఖుడు అని చెబుతారు.

వేణుగోపాల శతకంలోని పద్యాలలో తెలుగు నానుడులు, సామెతలు అనదగినవి చాలా (పద్యాలకు అనువైన భాషలో)  పద్యాలలోకి ఎక్కి కనబడతాయి. వాటిలో కొన్ని మంచివాటిని పద్యాలలోంచి ఏరి విడిగాతీసి చూపించడం ఇక్కడ జరిగింది:

పొరుగూరి కేగిన పోవునే దుర్దశ
కాదె పెండిలి సన్నికల్లు దాచ
డొంకల డాగ పిడుగుపాటు తప్పునే    (డొంకలలో దాక్కుని పిడుగుపాటునుంచి తప్పుకోగలమా? అని)
కాలడ్డ నిలుచునే గాంగ ఝరము       (గంగా ప్రవాహాన్ని కాలడ్డుపెట్టి ఆపగలమా?)
ఇంకిపోవునే అనావృష్టి జలధి            (దేశంలో అనావృష్టివలన సముద్రం ఇంకిపోతుందా?)
అర్కుడుదయింప చెడునె గుహా తిమిరము  (గుహలో చీకటి సూర్యోదయంతో తొలుగుతుందా?)

పెట్టిపోసిన నాడె చుట్టాల రాకడ
సేవ చేసిన నాడె క్షితినాదు మన్నన
విభవంబు గల నాడె వెనువెంట తిరుగుట   (ఇవన్నీ సమానార్ధకాలే!)

‘అభావ విరక్తి’ అని ఒక అవస్థ వుందని, దానికి ఈ క్రిందివి వుదాహరణలనీ ఒక పద్యంలో చెప్పి…

శక్తి చాలని నాడు సాధుత్వం వహించడం
విత్తహీనుడు ధర్మ వృత్తి తలచడం
వ్యాధి పీడితుడు దైవతాభక్తి దొరలాడడం
పని పోవ మౌనవర్తనం దాల్చడం
రమణి లేకున్న విరక్తి మంచిది అనడం
భారము పైబడ్డ (పుడు) బరువెఱుంగడం (బరువు గుఱించి ఉపన్యాసాలివ్వడం)…

ఇత్యాది ‘అభావ విరక్తు’ ల వలన, తత్కాల విరక్తుల వల్ల ఫలితంలేదంటూ….

తినక చవి చొరకయె లోతు తెలియబడునె (తినక రుచి, దిగక లోతూ తెలియడం సాద్యం అవుతుందా?) అనే సామెత చెప్పబడింది.

ఆశకు ముదిమియు అర్ధికి సౌఖ్యంబు
ధనపరాయణునకు ధర్మచింత
అల్పవిద్యునకు అహంకారదూరత
పాపభీరుత సంతానబాహ్యునకు
కలదనెడువార్త కలదె లోకములయందు… (దీనికి ఏమీ వివరణ అవసరంలేదు కదా!)

ఈతకు మిక్కిలి లోతు లేదు
కవిజనంబుల కెఱుంగనివి లేవు

మెఱుపు దీపంబౌనె మేఘంబు గొడుగౌనె
అల యెండమావులు జలంబు లౌనె
కాని వస్తువు పట్టుకో కాంక్షచేత
పెనుగు మాత్రంబెగాని లభింపదేమి….

పొయిపాలికే పాలు పొంగుటెల్ల
ఆఱిపోయెడి దివ్వె కధిక దీప్తి
కట్టనిల్వని చెర్వు గడియలోపల నిండు
బ్రతుకజాలని బిడ్డ బారెడుండు
పెరుగుటయు విఱుగుటకని యెఱుగలేక
అదిరిపడుచుండు నొక్కొక్క అల్పజనుడు….

వలపు రూపెరుగదు
ఆకలిలో నాల్క అరుచి యెరుంగదు
కోపం బెదుటి గొప్పకొద్దు లెఱుంగదు
నిదుర సుఖం బెఱుంగదు
హరునకైనను నివి గెల్వ నలవికాదు
ఇతరులైనట్టి మానవులెంతవారు….

పైన చూపినవన్నీ అదనంగా వివరణ యేమీ అవసరంలేకుండానే అర్ధమయ్యేవీ,  తక్కువ మాటలలో చక్కటి నిజాలను చెప్పేవీను! వాటిల్లో కొన్ని ఇప్పటికీ  సామెతలుగా అదపాదడపా నిత్యవ్యవహారంలో పెద్దవాళ్ళనోట వినిపిస్తూనే వున్నాయి కూడానూ!

*****

తెలుగులో అధిక్షేప శతకాలు రచించిన వారిలో కూచిమంచి తిమ్మకవి, జగ్గ కవి అని ఇద్దరు కవులున్నారు.  వీరిద్దరూ అన్నదమ్ములని తెలుస్తూనేవుంది కదా! కూచిమంచి తిమ్మకవి రచించిన శతకం శ్రీ భర్గ శతకం, జగ్గ కవి రచించిన శతకం శ్రీ భక్తమందార శతకం. వీరు  క్రీ.శ.18 వ శతాబ్దానికి చెందిన వారు. వీరిలో కూచిమంచి జగ్గకవి తెలుగులో మొట్టమొదటి అధిక్షేప ప్రబంధకర్తగా ప్రసిధ్ధుడు.  ఆ ప్రబంధం పేరు ‘చంద్రరేఖా విలాపము’. ఇందులోని కవిత్వ స్థాయిని C.P.Brown దొర కూడా మెచ్చుకున్నాడని ఎక్కడో చదివినట్లు గుర్తు.

ఆ సంగతి అలా వుంచి, ప్రస్తుత విషయానికి వస్తే – వీరిరువురు రచించిన అధిక్షేప శతకాలను  ఇప్పుడు తలుచుకోవడానికి కారణం, వీరిరువురూ వారి శతకాలలోని పద్యాలలో వాడిన పరభాషా పదాలను గుఱించి ముచ్చటించుకోవడానికి! పరభాషా పదాలలో వీరు మక్కువపడి అన్నట్లుగా ఒకటికి రెండుసార్లు వాడిన పదం  ‘ఇల్ల’. ఈ పదం తమిళ భాషలోనిది.  ‘లేదు’ అని తమిళంలో ఈ మాటకు అర్ధం. ఎందుకు అంత మక్కువపడి ఈ పదాన్ని వీరు వాడారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ‘ఇల్లె’ అనే ఈ మాటకు బదులు తెలుగు పదం ‘లేదు’ అన్నది వాడొచ్చు, ఛందోభంగం ఏమీ కాదు. (సుఖం ఇల్లె, సుఖం లేదు – తేడా ఏమీ లేదు).

“కోపంబెక్కువ; తాల్మి యిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబు తీల్”

కూచిమంచి తిమ్మకవి – శ్రీ భర్గ శతకము లోనిది ఈ శార్దూల పద్య ప్రథమ పాదం. ఈ పాదంలో  చివరిపదం   ‘తీల్’ అనేది కూడా పరభాషా పదమే, జగ్గకవి భక్తమందార శతకంలోని ఒక పద్యంలో ఈ పదం ‘తీర్’ అని కనిపించింది, నేను చూసిన పుస్తకంలో.  ఇది అచ్చు తప్పు అయివుండాలి. ఈ పదం తీల్/తీర్ ఏ భాషా పదమోగాని, అర్ధం మాత్రం ‘లేదు’ అనే అన్నది సందర్భాన్ని బట్టి అర్ధమై పోతుంది!

కూచిమంచి జగ్గకవి రచించిన శ్రీ భక్తమందార శతకం నుండి ఈ క్రింది పద్య పాదాలు:

“దానంబిల్లె, దయారసంబు నహి, సద్ధర్మంబు తీర్, మీపద
ధ్యానంబున్ గడులొచ్చు…..”

“క్రతువుల్ సేసెదనంటినా, బహుపదార్ధంబిల్లె!…”

అదలా వుంచితే, కూచిమంచి జగ్గకవి భక్త మందార శతకంలో నాకు బాగా ఆసక్తి కరంగా అనిపించిన ఒక మాట ‘దేమస’ అనే మాట. ఈ మాట బ్రౌన్ నిఘంటువులోనికి కూడా ఎక్కలేదు. ఇది ఇప్పుడు ‘తమాషా’ అన్న అర్ధంలో వాడకంలో వుంది.  భక్తమందార శతకంలోని ఆ పద్యం, మత్తేభం:

“రసికోత్తంసులు సత్కులీనులు మహాద్రాఘిష్ఠ సంసార ఘో
రసముద్రాంతరమగ్నులై దరికి జేరన్ లేక విభ్రాంతిచే
పసులం గాచిన మోటుకొయ్య దొరలం బ్రార్ధింతు రెంతేని దే
మసగాదే యిది యెంచిచూచినను రామా! భక్త మందారమా!”

తెలుగు మాట, పాట, పద్యం (3)

ఏ భాషలో నైనా సరే, పద్యం పదికాలాల పాటు నిలబడాలంటే, దానికి ముఖ్యంగా కావలసింది నడక. మంచి అర్ధసౌందర్యం కలిగిన పద్యానికి, ఒక మోస్తరు నడకైనా తోడైతే, ఆ పద్యం పదికాలాలు కాదు, వెయ్యి  కాలాలైనా నిలుస్తుంది. తెలుగులో వందల కొలది చాటు పద్యాలు, అజ్ఞాతకర్తృకాలైనవి, ప్రజల నాలుకల మీదనుంచే తరంనుంచి తరానికి అంది నిలిచి వుండడానికి కారణం ఇదే గదా!

పద్యానికి ఛందస్సు వుంది. ఛందస్సులో వున్నంతమాత్రాన పద్యం పద్యమవుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. గాలికి తావి తోడైనట్లుగా, ఛందస్సుతో వున్న పద్యానికి మరొకటేదో తోడుకావాలి. ఆ ‘మరొక’ లక్షణాన్ని ప్రతిభగల కవి మాత్రమే అందించగలడు.

తెలుగు పద్యాలలో కంద పద్యానిది ఒక ప్రత్యేక స్థానం. కేవలం 64 మాత్రల నిడివి గలిగినటువంటి ఈ పద్యాన్ని రకరకాలుగా నడిపించారు మన కవులు. ఒక కవి వినూత్నంగా సాధించిన నడకను ఆ తరువాతి కవులు మక్కువతో అనుసరించిన సందర్భాలు సాహిత్యంలో చాలానే కనిపిస్తాయి. పద్యాల నడకల విషయంలో ఎవరు ముందు ఎవరు వెనుక అనే విషయాన్ని పక్కన పెట్టి, ఆయా నడకలలో తెలుగు పద్యం వయ్యారంగా నడిచిన తీరును పట్టి చూసుకుని ఆనందించడం ఒక పధ్ధతి. ఆ పధ్ధతిలో, ఇప్పుడు కంద పద్యమనే కాకుండా, మరికొన్ని రకాల ఛందస్సులలో వున్న పద్యాలను, ఆకర్షణీయంగానూ, ఆనందదాయకంగానూ వుండే వాటి ఒకటి రెండు  రకాల ముచ్చటైన నడకలని, ఆ నడకలలో వివిధ కవుల పద్యాలను, నా దృష్టికి వచ్చిన వాటిని, ఇక్కడ మరోసారి మననం చేసుకుంటూ చూపెడుతున్నాను.

“లేమా, దనుజుల గెలువగ
లేమా నీవేల కడగి లేచితి విటురా
లే! మాను, మానవేనిన్
లే, మా విల్లందికొనుము లీలంగేలన్.”

పోతనగారి భాగవతంలోనిది ఈ కంద పద్యం. ఈ పద్యానికి ఒక వీనులవిందైన నడక వుంది. ఈ నడక పోతనగారితో ఆగిపోలేదు. ఇంకా ముందుకు వెళ్ళింది. ఆడిదం సూరకవి ( క్రీ.శ.18 వ శతాబ్దం) తరం దాకా వెళ్ళింది. రేకపల్లి సోమనాథకవి అని  ఆడిదం సూరకవికి బలవత్ ప్రత్యర్ధియైన ఒక కవి ఉండేవాడట! ఆయన మీద ఒక భట్రాజు చెప్పన ఈ క్రింది కంద పద్యంలో మళ్ళి ప్రత్యక్షమైంది:

“అప్పా! రేకపలీ సో
మప్పా! విభుదాళి పాళి అమృతపు లప్పా!
ఒప్పులు నీ కవితలు వె
న్నప్పాలకు సాటి వచ్చునౌ భళి రుచులన్!”

ఈ పద్యం చెప్పి, సోమనాథకవికి రాజుగారు బహుమానంగా ఇచ్చిన దుశ్శాలువను ఆయనదగ్గరనుంచి కొట్టేశాడట ఆ భట్రాజు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో సంగతి ఏమిటంటే, కంద పద్యంలో సాధింపబడిన ఈ  నడక, క్రీ.శ.18వ శతాబ్దం వాడే అయిన కూచిమంచి జగ్గకవి భక్తమందార శతకంలో ‘మత్తేభ’ ఛందంలో వున్న రెండు పద్యాలలో సాధింపబడి కనిపిస్తుంది. ఆ పద్యాలు ఇవి:

“అదిరా! పిల్చినబల్కవేటికి? పరాకా చాలు నిం కేలగా
గదరా! మిక్కిలివేడి వేసిరిలు బాగా? నీకు శ్రీజానకీ
మదిరాక్షీ శరణంబులాన! నను ప్రేమన్ బ్రోవరా….”

“గడియల్ రెండిక సైచిరా, వెనుకరా, కాసింత సేపుండిరా,
విడిదింటం గడె సేద దీర్చుకొనిరా, వేగంబె బోసేసి రా,
యెడపొద్దప్పుడు రమ్మటంచు….”

భాగవతంలోని ద్వితీయాశ్వాసంలో పోతనగారిదే మరొక కంద పద్యం:

“రామున్ మేచక జలద
శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సు
త్రామున్ దుష్టనిశాట వి
రామున్ పొమ్మనియె పంక్తిరథుడడవికిన్.”

కందపద్యానికి ఇది వీనులవిందైన, హాయిగొలిపే నడక. అయితే ఈ అనుప్రాసమే కొంచెం ఎక్కువైతే పద్యం ఎలా వుంటుందో తెలియడానికి పోతనగారిదే ఒక కందపద్యం:

“అడిగెదనని కడువడిజను
నడిగిన దనుమగుడ నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్.”

ఇందులో మోతాదు కొంచెం ఎక్కువైందని నేననుకుంటాను.  అయితే, ఈ మోతాదులో అనుప్రాసము నచ్చే వాళ్ళూ వుండవచ్చు. కాదనలేం! ఈ రకపు నడకను, అనుప్రాసాన్ని కొంచెం మితంగా అంటే తగినంతగా వుంచి, చెప్పిన పద్యం ఎలా వుంటుందో ఈ క్రింది పద్యంలో తెలుస్తుంది:

“కడుపునకు కూడుగానక
పడి మిడిమిడి మిడుకునట్టి బడుగునకీయా
రడి అమరత్వం బేటికి
కడుపిటగాలంగ కంటకాటుక యేలా?”

కొఱవి గోపరాజు రచించిన సింహాసనాద్వాత్రింశిక లోనిదనుకుంటాను ఈ పద్యం, నాకు సరిగా గుర్తులేదు.

దొరకకుండా పోయిన తిక్కనసోమయాజిగారి ‘కృష్ణశతకము’ లోనిదిగా ఈ క్రింది పద్యం, మత్తేభ విక్రీడిత వృత్తం లోనిది, ప్రచారంలో వుంది:

“అరయన్ శంతనుపుత్రుపై విదురుపై నక్రూరుపై కుబ్జపై
నరుపై ద్రౌపదిపై కుచేలునిపయి న్నందవ్రజస్త్రీలపై
పరగం గల్గు భవత్కృపారసము నాపైగొంతరానిమ్ము నీ
చరణాబ్జంబులు నమ్మినాడ జగదీశా! కృష్ణ! భక్తప్రియా!”

తెలుగులోని సరళాతిసరళమైన పద్యాలలో ఇది ఒకటి. ఈ పద్యం చదివినతరువాత ఎవరికైనా పోతనగారి భాగవతంలోని పద్యం గుర్తుకురాకుండా ఉంటుందా? ఆ పద్యం:

“ఇంతింతై వటుడింతింతై మఱియు దానింతై నభొవీధిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్థియై!”

పోతనగారి ఈ పద్యం శార్దూలవిక్రీడిత ఛందంలోనిది.

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (4)

నన్నెచోడదేవుని ‘కుమార సంభవం’ (4)

“వీంగు నపారసత్త్వ గుణవిస్ఫురణం బరమేశ్వరోరువా
మాంగమునందు మున్నుదయమై నియమస్థితి గొల్చి తద్దయున్
లోంగొని పేర్మితో నఖిలలోకములుం దగగాచుచున్నవే
దాంగు ననంతు విష్ణు గమలాధిపు సంస్తుతి దేల్తు సమ్మతిన్.”

ఉత్పలమాల వృత్తంలోని పద్యం – కుమార సంభవం, ప్రథమాశ్వాసం, నాల్గవ పద్యం ఇది.

ఈ పద్యాన్ని స్మరించుకోవడానికి ముఖ్యమైన కారణం, ఈ పద్యం ప్రథమ పాదంలోనూ, మూడవ పాదంలోనూ వాడిన ‘వీంగు’ ‘లోంగొని’ అనే పదాలూ, వీటితో ‘వామాంగము ‘ ‘వేదాంగు ‘ అనే పదాలలోని పూర్ణబిందుపూర్వకాక్షరం ‘గ’ కు చెల్లించిన ప్రాసమైత్రి.

ఈ ‘వీంగు’ ‘లోంగొను’ అనే పదాలు ఖండబిందు యుక్తంగా ‘వీఁగు’ ‘లోఁగొను’ అనే వాటికి పూర్వరూపాలు.  ఇప్పుడు ఇవి ఖండబిందువును కూడా విడిచిపెట్టి బిందురహితంగా ‘వీగు’ ‘లోగొను’ అనే రూపాలలో మిగిలి ఉన్నాయి.

ఈ ప్రయోగాలనే నన్నెచొడుని ప్రాచీనతకు నిదర్శనాలుగా పూజ్యులు మానవల్లి వారు చూపి, నన్నయ కవిత్వంలో గానీ, ఆ తరువాతి కవుల ప్రయోగాలలో గానీ ఇలాంటి ప్రయోగాలు లేని కారణంగా నన్నెచొడుని నన్నయకంటే పూర్వునిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. “నన్నెచోడుడు నన్నయకంటె పూర్వుడని కుమార సంభవము నందలి వ్యాకరణ ఛ్ఛందో విశేషాత్మకాపూర్వపద ప్రయోగములు సహస్ర ముఖముల ఘోషించుచున్నవి” అంటూ పూజ్యులు మానవల్లి వారు చూపిన ఉదాహరణలలో రెండు పద్యాలు ఈ క్రిందివి:

“పోండిగ నగజ తపశ్శిఖి
మూండు జగంబులను దీవ్రముగఁ బర్విన బ్ర
హ్మాండము గాఁచిన కాంచన
భాండముక్రియఁ దాల్చెఁ దత్ప్రభాభాసితమై.” (షష్టాశ్వాసం, 157వ పద్యం)

“వీండేమి సేయుఁ బంచిన
వాం డుండఁగ నిక్కమునకు వధ్యుఁడుగా నా
ఖండలుఁడు గాక యేసిన
వాండుండఁగ నేమిసేయు వరశర మనిలోన్.” (దశమాశ్వాసం, 155వ పద్యం).

పూర్ణార్ధ బిందుప్రాసము — అంటే దీర్ఘముమీది అరసున్నను నిండుసున్నగా చేసి సిధ్ధపూర్ణానుస్వార పూర్వాక్షరముతో ప్రాసను చెల్లించడం అన్నది పై పద్యాలలోని ఛ్ఛందోవిశేషం. నన్నయకానీ, ఆ తరువాతి కవులుగానీ ఈరకపు ప్రాసను ఎక్కడా వాడి యుండలేదనీ, ఇట్టి ప్రాసమైత్రి నన్నయకు పూర్వం వుండియుండును కాబట్టి నన్నెచోడుడు నన్నయకు పూర్వుడు కావలయుననీ, ‘ఇది పూర్ణార్ధబిందుప్రాసముకాదు, కవి ఈ శబ్దములను పూర్ణబిందుయుతములుగనే వాడాడు’ అనుకున్నా, పూర్వమొకప్పుడు పూర్ణమై యుండిన బిందువు తరువాత్తరువాత ఖండబిందువయినట్లు భాషాచరిత్రనుబట్టి తెలుస్తుంది కాబట్టి, అప్పుడుకూడా నన్నయకంటె నన్నెచోడుడు పూర్వుడే అవుతాడు అన్నది మానవల్లివారి వాదన.

ఇక అసలు పద్యం యొక్క అర్ధం విషయానికొస్తే:

‘వీంగు (వీఁగు) – అపార సత్త్వగుణ – విస్ఫురణన్ – పరమేశ్వరు (ని) – ఉరు వామాంగము నందు’ — విజృంభించు అపారమైన  సత్త్వగుణముయొక్క స్ఫూర్తితో పరమేశ్వరుని (శరీరంలో) యెడమభాగమందు,

‘మున్ను – ఉదయమై – నియమస్థితి – కొల్చి’ — పూర్వం ఉద్భవించి నిష్ఠతో  అతనిని సేవించి,

‘తద్దయున్ – లోంగొని (లోఁగొని) – పేర్మితో – అఖిల లోకములుం – తగ కాచుచున్న’ — (అతని అనుగ్రహముతో) ఎల్లలోకములను ప్రేమతో వశపరచుకొని సముచితముగా కాచుచున్న,

‘వేదాంగున్ – అనంతున్ – విష్ణున్ – కమలాధిపున్’ — వేదమునే శరీరముగా గలవాడూ, అంతములేనివాడూ, కమలాధిపుడూ అయిన విష్ణువును,

‘సంస్తుతిన్ – తేల్తు – సమ్మతిన్’ — మంచి స్తోత్రముతో, సమ్మతితో, సంతోషపెట్టెదను.

ఈ పద్యంలో పైకి కనబడేది విష్ణు స్తుతి. అంతరంగా, విష్ణువు ఉద్భవానికీ, ఆయన సముచితంగా అఖిల జగత్తునూ కాచుకోవడానికీ కారణమైనది శివతత్త్వమే అన్నది లీలామాత్ర ధ్వని.

 

తెలుగు మాట, పాట, పద్యం (1)

వెయ్యేళ్ళుగా తెలుగులో లిఖిత సాహిత్యం వుంది.  అంతకు ముందు ఇంకా ఎన్ని వందల ఏళ్ళ నుంచో తెలుగులో ‘అలిఖిత’ (మౌఖిక సాహిత్యంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సాహిత్యాన్ని సూచించేదిగా ఈ పదం వాడుతున్నాను) సాహిత్యం ఉంది. అలిఖిత సాహిత్యానికి జనుల రసనయే వాహికయై అందులో ‘పస’ ఉన్న సాహిత్యమంతా తరం నుంచి తరానికి ప్రవహించి అందుబాటులోకి వచ్చింది. లిఖిత సాహిత్యం విషయంలో ఇలా జరగడానికి అవకాశం లేదు. లక్షణ గ్రంథాలూ, తెలుగు పూర్వ సాహిత్యంపై పెద్దల వ్యాసాలూ చదువుతుంటే, తెలుగులో లిఖిత సాహిత్యంలో ఈనాటికి దొరికి అందుబాటులోకి వొచ్చిన సాహిత్యం కంటే దొరకకుండా పోయిందే ఎక్కువేమో అన్న అనుమానం కలుగుతుంది.  శ్రీనాథుని శాలివాహన సప్తశతి లాంటివి ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్వర్గీయ మానవల్లి కవిగారి పుణ్యమాని, నన్నిచొడుని కుమార సంభవం, వినుకొండ
వల్లభరాయుని క్రీడాభిరామం, త్రిపురాంతకుని త్రిపురాంతకోదాహరణం లాంటివి దొరికాయిగాని, లేకుంటే వాటినీ  ఈనాటికింకా మరుగునపడిపోయిన మాణిక్యాలుగానే చెప్పుకుంటూ ఉండేవాళ్ళం.

‘పాటకు సాహిత్య గౌరవాన్నిచ్చి తమిళులు పురాతన సాహిత్యం ఉన్నవాళ్ళయ్యారు, అది చేయక మనం
లేనివాళ్ళమయ్యాము’ అని స్వర్గీయ ఆరుద్ర గారు (మక్కికిమక్కి ఇవేమాటలు కాదు, ఈ అర్ధం వచ్చేట్లుగా మాత్రమే) అన్నట్లు, తెలుగు అలిఖిత (మౌఖిక) సాహిత్యంలోని పాటను కూడా సాహిత్యంగా పరిగణించి చూస్తే, తెలుగు సాహిత్యం వయసు ఎంత హీనంగా వేసుకున్నా ఇంకో వెయ్యేళ్ళ ముందుకు జరగక మానదు, హాలుని గాథాసప్తశతి కాలం నాటికే తెలుగు పరిపూర్ణమైన భాషగా వృధ్ధి చెంది ఉన్నదని చెప్పడానికి నిదర్శనాలు గాథాసప్తశతిలోనే ఉన్నాయి కాబట్టి. అంటే, తెలుగు మాటకు, పాటకు ఎంత హీనంగా వేసుకున్నా రెండు వేల ఏండ్లకుపైనే వయసుంటుండని చెప్పుకోవచ్చు. అయితే, ఇన్ని వేల ఏండ్ల క్రితం నాటి  తెలుగు మాట, పాటల తొలి నాళ్ల రూపాలు ఎలా వుండేవో తెలుసుకోవడం ఆసక్తి కరంగానే అనిపించినా, అది తెలుసుకోవడానికి
సరిపడా సామగ్రి లేకపోవడంవల్ల ఇనాటి వాటి రూపాలతో సరిపెట్టుకుని, అర్ధాన్ని ఆస్వాదించడం, ఆనందించడం మాత్రమే చేయగలం.

తెలుగు పాట పురాతన రూపాలలో ‘ఏల’ ఒకటి. ‘ఏల’ అనే మాటకు ‘శృగారపు పాట’ అని బ్రౌన్ నిఘంటువులో చెప్పిన అర్ధం. ఇదెలా ఉన్నా, ‘ఏలలు పెట్టి పాడడం’ అని పాలుకురికి సోమనాథుడు బసవపురాణంలో చెప్పిన మాట ఒకటి ఉన్నది. దీనికి ‘రెండేసి పాదములకో మూడేసి పాదములకో యొక సారి యే దేవునిపేరో రాగక్రమమున నుచ్చరించుచు జదువుట యేలలుపెట్టి చదువుట యై తోచుచున్నది’ అని పూజ్యులు దివాకర్ల వెంకటావధానిగారిచ్చిన వివరణ ( వారిదే ‘ప్రాజ్ఞన్నయ యుగము’ పుస్తకంలో). వారిచ్చిన వివరణలోని ‘చదువుట’ అనే మాటను ‘పాడుట’ గానే అర్ధంచేసుకోవచ్చు, ‘ఏలలు’ పాడుకోవడానికి ఉద్దేశ్యించినవే కాబట్టి.

“కానరాని యడవిలోన
వానలేని మడుగు నిండె,
వానలేని మడుగుమీదనూ, ఏగంటిలింగా,
మానరాని అగ్ని పొడమెరా.”

“ఆకులేని యడవిలోన
తోకలేని మృగముపుట్టె
తోకలేని మృగము కడుపునా, ఏగంటిలింగా,
ఈకలేని పక్షిపుట్టెరా.”

‘ఏగంటి వారి ఏల’ లలోనివి ఇవి రెండు ఏల పదాలు. పాడుకోవడానికే ఉద్దేశ్యించినవని చెప్పకనే తెలిసిపోతుంది.  మాటలతో వర్ణించి చెప్పలేని ఏదో మార్మికత ఈ ఏలలలో ఉన్నదని కూడా చెప్పకనే తెలిసిపోతుంది. ‘ఏగంటిలింగా’ అన్నది మూడవ పాదాతంలో తప్పనిసరిగా ఇవ్వబడిన reprieve… విశ్రాంతి. ఇది పాడుకోవడంలో ఏదో ఉపశమనం ఉంది.  అలసిపోయిన మనసుకు ఇందులోని ఉపశమనం ఎంతో హాయినిచ్చేదిగా అర్ధమవుతుంది. ఈ ఏలలను నిర్మాణం చేసిన మనిషెవరోగాని, అతడి మనసుకు మనిషి చిత్తంలోని రాగద్వేషాలు, వాటివలన పొందే కష్టనష్టాలపై సమగ్రమైన అవగాహన ఉందన్నదీ తెలిసిపోతుంది. ఇది దేనికో అనువాదమో, అనుకరణో అనుకోవడానికి వీలులేదు. ఇది అచ్చమైన తెలుగు ఊహ, తెలుగు ‘వాడి’ ఊహ!

‘ఏల’ పదం, తరువాత్తరువాత శిష్టసాహిత్యంలోనూ ప్రవేశించి కనిపిస్తుంది.  కందుకూరి రుద్రకవి రచించిన ‘సుగ్రీవ విజయం’ లోనివి ఈ క్రింద చూపిన ఏలలు ఇందుకు ఒక ఉదాహరణ:

“భాను వంశామూన బుట్టి
దానవాకామినిగొట్టి
పూని మఖము నిర్వహింపావా – ఓ రామచంద్ర
మౌనివరులు సమ్మతింపాగాన్.”

“రాతినాతిజేసి పూరా
రాతిచేతి విల్లు విరిచి
భూతలేంద్రూ లెల్లమెచ్చగా – ఓ రామచంద్ర
సీతనూ వీవాహ మాడావా.”

పాడుకోవడానికి అనువుగా ఉండేట్లుగా పై ఏలలోని కొన్ని హ్రస్వ పదాలు దీర్ఘాంతాలుగా చేయబడడం గమనించవచ్చు.ఇదిలా వుంచితే, తెలుగులో ‘ఓల’ అనే ఒక మాట ఉంది. ఈ మాటకు ‘జలక్రీడ’ అని బ్రౌన్ నిఘంటువు చెప్పిన అర్ధం. ‘ఓలలాడు’ అంటే నీళ్ళలో ఆడడం అన్న అర్ధం రూఢమై కనిపిస్తుంది. ఓల  అనే మాటకు a cry, shout అన్న అర్ధాలను కూడా బ్రౌన్ నిఘంటువు చూపింది. నీళ్ళలో ఆడుకునేటప్పుడు ఆనందంలో పెట్టే కేకలను ఓలలని చెప్పుకోవచ్చు. ఓలగంధము (జలక్రీడకు ముందు శరీరం మీద రాసుకునే పసుపు లేపనము), ఓలపాట అనే పదాలు ‘ఓల’ నుంచే పుట్టాయి. తెలుగు సినిమా పాటలో (జగదేకవీరుని కథలో) ఈ ‘ఓల’ పదమే ‘హల’ గా మారి కనిపిస్తుంది.

‘ఏల’, ‘ఓల’, ‘హల’ …ఈ మూడు పదాలకూ భాషా పరంగా ఏదైనా సంబంధం ఉన్నదో లేదో, ఉంటే దానికి సంబంధించిన వివరణ ఎలా ఇవ్వాలో నాకు తెలియదుగాని, ఈ మూడిటికీ ఉన్న ఒక్క ముఖ్యమైన సామాన్య లక్షణం, ఈ మూడు పదాలూ పాటకు సంబంధించినవిగానే ఉండడం అన్నది తేలికగానే తెలిసిపోతుంది.

తెలుగు నాటకాలు – మరి కొన్ని సంగతులు (4)

వారి కాలంలోని ముగ్గురు గొప్ప కవులలో (అంటే 19వ శతాబ్దం ఉత్తరార్ధం, 20వ శతాబ్దం పూర్వార్ధం) వసురాయ కవిగా రొకరు. మిగిలిన యిరువురూ, కందుకూరి వేరేశలింగంగారు, వావిలాల వాసుదేవశాస్త్రి గారు. వావిలాల వాసుదేవశాస్త్రిగారు శూద్రకుని మృచ్ఛకటికాన్ని మొదటగా తెలుగులోనికి అనువదించి అప్పట్లో వెలువడుతూండిన ‘చింతామణి’ మాస పత్రికలో (న్యాపతి సుబ్బరావుగారు స్థాపించి నిర్వహిస్తూండినది) ప్రకటించారు.

భక్తచింతామణి శతకం  తరువాత  వసురాయకవి గారికి అంతగా పేరుతెచ్చినది ‘వేణీ సంహారం’ నాటకం. ఇది సంస్కృత నాటకానికి రసవంతమైన తెలుగు అనువాదం. వసురాయకవిగారు దీనిని రచించి ఊరుకోకుండా, రంగస్థలం మీదికి కూడా ఎక్కించి, అందులో భీముని పాత్రను గూడా పోషించేవారని చెబుతారు.

‘గయోపాఖ్యానం’ నాటక కర్త అయిన చిలకమర్తి లక్ష్మీనరసింహంగారికి (క్రీ.శ.1867-1946), వసురాయకవిగారు తమ ‘వేణీసంహారం’ నాటకాన్ని స్వయంగా చదివి వినిపించగా,  విని పరవశుడైన చిలకమర్తివారు మెచ్చుకోలుగా అప్పటికప్పుడు ఆశువుగా చెప్పిందట ఈ క్రింది పద్యం:

“వేణీ సంహారంబును
 వాణీధవ తుల్యుడైన వసురాయుడు తా
 నాణెముగా తెనిగించెను
 ప్రాణంబులు లేచివచ్చు పద్యము విన్నన్.”

తెలుగునాట అత్యధిక జనత (popularity) పొందిన పద్య నాటకాలలో చిలకమర్తివారి ‘గయోపాఖ్యానం’ ఒకటి. తెలుగులో బహుశః అన్ని కాపీలు అమ్ముడుబోయిన గ్రంథం (నాటకాలలో) మరొకటి లేదు అనిపించుకున్నది ‘గయోపాఖ్యానం’ నాటకం. అదలా వుంచితే, చిలకమర్తివారి పేరుమీద ఒక ప్రసిధ్ధమైన చాటుపద్యం, బిపిన్ చంద్ర పాల్ గారి ఆంగ్లోపన్యాసాన్ని ఒక సభలో తెలుగులో అనువదిస్తూన్న సందర్భంలో, సభ జరుగుతూ ఉండంగానే, మనసులో ఊహించుకుని ఆశువుగా ఆయన చదివిన పద్యం, ఎవ్వరూ మరిచిపోలేనిది:

“భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియబట్టి.”

ఆ రోజులలో విశేషమైన ప్రజాదరణ పొందిన పద్యం చిలకమర్తివారి ఈ చాటు పద్యం. ఎంతగా ప్రసిధ్ధమైనదంటే, విజయవాడలో కృష్ణానది వంతెన గోడలమీద పెన్సిళ్ళతో వ్రాయబడిందట, హరికథలలోకి కూడా ఎక్కిందట!

తెలుగు నాటకాలు – మరి కొన్ని సంగతులు (3)

తెలుగులోని గొప్ప పద్య నాటకాలలో ఒకటైన ‘వేణీసంహారం’ నాటక కర్త వడ్డాది సుబ్బారాయుడు (క్రీ.శ.1854-1938). ‘వసురాయకవి’ గా ప్రసిధ్ధులు. దురదృష్టవశాత్తు వీరికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరమయ్యారు. ఈయన బడిలో చదివి పాసయిన పరిక్ష ఒక్కటీ లేదని చెబుతారు. అయినప్పటికీ, వీరు తమ 14వ ఏట నుండే భజగోవింద శ్లోకాలను తెలిగించడంతో కవిత్వం చెప్పడం మొదలెట్టారు. రాజమండ్రిలోని ఒక ఉన్నతపాఠశాలలో ఆంధ్రోపాధ్యాయుడిగా ప్రారంభమైన వీరి ఉద్యోగపర్వం అనంతంగా సాగి వీరి జీవికకు లోటులేకుండా చేసింది.

వడ్డాది సుబ్బారాయ కవి (వసురాయకవి) గొప్పదనాన్నిమొదటగా లోకానికి తెలియజేసింది వీరు రచించి అప్పటిలో వస్తూండిన ‘హిందూజన సంస్కారిణి’ అనే పత్రికలో ప్రచురించిన ‘భక్త చింతామణి’ శతకంలోని పద్యాలు. ఈ శతకం క్రీ.శ.1893 లో మొదటిసారి పుస్తక రూపంలో వచ్చింది. నమ్మశక్యంగాని విషయమేమిటంటే, క్రీ.శ.1893 లో మొదటిసారి ముద్రణ అయింది మొదలు, ఈ చిన్న 50-60 పేజీల పుస్తకం దాదాపు ఇరవైమూడు సార్ల దాకా పునర్ముద్రణ పొందడం. ఈ పుస్తకంలోని పద్యాలు ఆంగ్లంలోనికి కూడా అనువాదమయ్యాయని చెబుతారు కాని, అదెంతవరకు నిజమో తెలీదు.

అప్పటిలో ఇంతగా ప్రాచుర్యం పొందిన ఈ ‘భక్తచింతామణి ‘ శతకం ఇప్పుడు లైబ్రరీలలోనయినా దొరుకుతుందో లేదో తెలియదు. సరళమైన, శబ్దవాచ్యత లేని, అర్ధ సుబోధకమైన సూటి భాష; ఒడిదుడుకులేమీ లేకుండా, అడుగున నునుపుతేలి ఉన్నటువంటి శిలాతలం మీదనుంచి తేలికగా ప్రవహిస్తుండే సెలయేటి గతి లాంటి ధార – ఈ రెండు లక్షణాలు  ‘భక్త చింతామణి’ లోని పద్యాలను పండితులు, పామరులు, పిల్లలు, పెద్దలు అని లేకుండా, ఆబాలగోపాలానికి ప్రీతిపాత్రం అవడానికి దోహదం చేశాయి అని చెప్పడానికి సందేహించాలిసిందేమీ లేదు.

“పడుచుల్ వేడుక బొమ్మరిండ్లిసుకలో బాగొప్ప నిర్మించి, చొ
ప్పడ మ్రుగ్గుల్ పచరించి, యాడుకొని, యాపై నాటగొల్లంచు గ
ట్టడముల్ పాడొనరించి పోవు గతి, వేడ్కల్ నీకు నీ విశ్వముల్
పొడమంజేసి, భరించి, మాపుటలు నెప్డున్; భక్తచింతామణీ!”

పై పద్యంలో కఠినమైన పదం ఒక్కటి గూడా లేదు. అర్ధంకాకపోవడానికి అందులో మానవాతీతమైన అనుభవాలకి సంబంధించిన విషయాలూ లేవు. చిన్నపిల్లలు ఆడుకునే ఆటలను దృష్టాంతంగా తీసుకుని దేవుని లీలను వర్ణించిన పద్యం. ఇది నచ్చకపోతే ఆశ్చర్యపడాలిగాని, నచ్చితే కాదు గదా! ఇలాంటిదే ఇంకో పద్యం:

“ఎదురం దండము చేత బట్టుక, నిజాధీశుండు చూపట్టినన్,
దుదకున్ సేవకు లెట్టులో యతని కన్నుల్ గప్పి వర్తింతు, రే
మిది, నిన్నెన్నడు జూడకుండియును, తండ్రీ! విశ్వ మింతైన ద
ప్పదు నీ యానతి, యద్భుతావహము; దేవా, భక్త చింతామణీ!”

ఇందులోనూ అర్ధంగాక పోవడానికి ఏమీ లేదు. విశదీకరించి చెప్పాల్సిందీ లేదు.  అర్ధ సుబోధకమైన పద్యం. ఇలాంటిదే మరొక పద్యం:

“నీకుం బ్రేమ సమాన మన్నిటియెడన్, నిక్కంబు సర్వేశ!, యీ
లోకంబందు సమస్త జంతువులకెట్లో నిత్య మాహార మీ
వే కావే దయసేయుచుండుదువు? తండ్రీ! యట్లు గాకున్న, మం
డూకం బేక్రియ ఱాతిలో బ్రతుకుచుండున్? భక్త చింతామణీ!”

ఈ పద్యం గురించి ఇక చెప్పాల్సిందేముంది?