పద్య రచన – పద ప్రయోగ వైచిత్రి (1)

తెలుగు పద్య రచనలో ఛందస్సుకు సంబంధించిన అవసరాలకోసం తెలుగు పదాల స్వరూపాలను మార్చి పూర్వ కవులలో ప్రసిధ్ధులైన వారు సైతం ప్రయోగించిన విధానం పరికిస్తే కొంతైనా ఆశ్చర్యం కలగక మానదు. ఉదాహరణకు, నన్నె చోడుని కుమార సంభవం లోని ఈ పద్యంలో ‘ఆంధ్ర’ శబ్దాన్ని ‘అంధ్ర’ గా ప్రయోగించిన
సందర్భం:

కం. మును మార్గ కవిత లోకం
బున వెలయగ దేశి కవిత బుట్టించి తెను
గు నిలిపి రంధ్ర విషయమున
జన సత్యాశ్రయుని తొట్టి చాళుక్యనృపుల్.

ఈ పద్యంలోని మూడవ, నాల్గవ పాదాలకు పాఠాంతరం కనిపిస్తోంది.  అయితే వాటిల్లో కూడా ఈ పద ప్రయోగంలో మార్పేమీ లేకపోవడాన్ని గమనించవచ్చు. పాఠాంతరంగా లభిస్తూన్న పాదాలు ఇవి:

‘గును నిలిపి రంధ్ర విషయం
బున జన చాళుక్యరాజు మొదలగు పలువుర్.’

తెలుగు సాహిత్య చరిత్రలో ‘ఆంధ్ర ‘ శబ్దానికి దగ్గరవిగా ‘అంధ, అంధక ‘ రూపాలు కనిపిస్తాయి తప్ప, ‘అంధ్ర ‘ అన్నప్రయోగం ఈ ఒక్క పద్యంలోనే కనిపిస్తుంది, నేనెఱిగున్నంతవరకు. ఈ రూపం ఆ తరువాతి కాలంలో కవుల ప్రయోగాల్లో అంతగా ఆమోదాన్ని పొందినట్లుగా కనిపించని కారణంచేత కేవలం చ్చందస్సుకు సంబంధించిన అవసరంవల్లే నన్నె చోడుడు ఇలా ప్రయోగించాడని అనుకోవాల్సివస్తుంది.

ఇలాంటిదే పదప్రయోగం (దీర్ఘాక్షరానికి బదులుగా హ్రస్వాక్షరాన్ని వాడినటువంటి సందర్భం) ఉన్న ఇంకో పద్యం:

“ఫుల్ల సరోజనేత్ర! అలపూతన చన్నుల చేదుద్రావినా
డల్ల దవాగ్ని మ్రింగితినటంచును నిక్కెదవేల? తింత్రిణీ
పల్లవ యుక్తమౌనుడుకు బచ్చలి శాకము జొన్నకూటితో
మెల్లన యొక్కముద్ద దిగమ్రింగుమ! నీ పస కాననయ్యెడిన్”

ఇది ఒక చాటు పద్యం. పల్నాటిసీమలో ప్రజలు తినే ఆహారం, చింతచిగురు (తింత్రిణీపల్లవము), బచ్చలాకు కలిపి వండిన కూరతో జొన్నన్నం తినడంలో అనుభవమయ్యే కష్టాన్ని తెలిపే పద్యం ఇది.

‘దావానలము’ ‘బడబాగ్ని’ అనేవి రెండు భిన్న అర్ధాలున్న పదాలు.  ఈ రెండింటి సంయోగ  రూపంగా అనిపించే ‘దావాగ్ని’ అనే పదాన్ని కూడా చ్చందస్సుకు సంభంధించిన అవసరం కోసం ‘దవాగ్ని’ అని ప్రయోగించడం ఈ పద్యం లో కనిపిస్తుంది. అయితే పద్యం యొక్క సందర్భ ఔచిత్యం, అర్ధ సౌందర్యం దృష్టిలో ఉంచుకుని చూస్తే ఇలాంటి చిన్న చిన్న అపప్రయోగాలను అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదనుకుంటాను.

ప్రకటనలు

2 thoughts on “పద్య రచన – పద ప్రయోగ వైచిత్రి (1)

 1. అంధ్రము ఆంధ్రము కన్న ముందు పుట్టిన పదం.
  అసలు అంధ్రము నుండే ఆంధ్రము పుట్టింది.
  అంధ్రము అన్నది దేశం
  ఆంధ్రము అన్నది భాష.
  విషయము అన్న పదానికి దేశం అని అర్థం.
  అంధ్ర విషయములో మాటాడు భాష ఆంధ్ర భాష.
  అందుకే ఆ పద్యంలో “తెనుగు నిలిపి రంధ్ర విషయమున” (ఆంధ్ర భాషను అంధ్ర దేశంలో నిలిపారు) అని చెప్పారు.
  అయితే రాను రాను ఈ శాబ్దిక భేదం చెరిగిపోవడంతో,
  అటు దేశానికి, ఇటు భాషకు ఆంధ్ర శబ్దమే ప్రయోగించడం పరిపాటి అయింది.

  • డా. ఆచార్య ఫణీంద్ర గారికి
   వివరణకు కృతజ్ఞతలు. ఒక్క మాట. ఋగ్వేదానికి చెందినదైన ఐతరేయ బ్రాహ్మణంలో (శునశ్శేపుని కధ) మొదటిసారిగా ఆంధ్ర పదం జాతిని ఉద్దేశించినదిగా వాడబడి కనిపిస్తుందని చదివాను. ఇదే ఆంధ్ర పదానికి మొట్ట మొదటి reference గా కూడా పెద్దలు చెబుతారు. ‘అంధ్ర’ అన్న పదం నుంచే ‘ఆంధ్ర’ పదం జనించి ఉన్నట్లైతే, ‘అంధ్ర’ అన్న పదం ఐతరేయ బ్రాహ్మణం రచింపబడిన కాలానికి ముందే వాడుకలో ఉండిఉండాలి. ఒక్క సందర్భమన్నా అలాంటిది కనబడాలి. అది ఎప్పుడు? ఏ సందర్భంలో? అన్న ప్రశ్నలకు సమాధానం ఎక్కడ లభిస్తుంది?
   నమస్కారములతో,
   వెంకటరావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s