తెలుగు వారూ, ఆవకాయా, పెరుగన్నమూ…శ్రీనాథుడూ!(1)

తెలుగు వారి అహారపుటలవాట్లలో ఆవకాయా పెరుగన్నాలకు ప్రత్యేక స్థానం ఉందన్నది నిర్వివాదాంశం. అన్నంలోకి ఏమీ లేకపోయినా కలుపుకోవడానికి కాస్త పెరుగూ, పక్కన నంజుకోవడానికి ఒక ఆవకాయ బద్ద ఉంటే చాలు ఆ పూట గడిచి పోతుంది. ఈ అలవాటు ఎప్పడిది? అని ఎవరైనా సరదాకైనా ప్రశ్న వేసుకుని అవలోకిస్తే మహాకవి శ్రీనాథుడు నివసించిన క్రి.శ.1370-1450 (పెద్దలు స్థూలంగా నిర్ణయించిన శ్రీనాథుని కాలం) నాటి కంటే పూర్వపుదే అని సమాధానం దొరుకుతుంది. పెరుగన్నంలో ఆవకాయ నంజుకుని భుజిస్తుంటే మంట నషాళానికి అంటినప్పుడు కలిగే అనుభవం శ్రీనాథుని శృంగార నైషధం లోనిదైన ఈ పద్యంలో స్ఫష్ఠంగా కనిపిస్తుంది.

“మిసిమిగల పుల్ల పెరుగుతో మిళితములుగ
ఆవపచ్చళ్ళు చవిచూచిరాదరమున
జుఱ్ఱుమని మూర్ధములుదాకి యెఱ్ఱదనము
పొగలు వెడలంగ నాసికాపుటములందు” (శృం.నై.6-130)

తొలినాళ్ళ నుంచీ తెలుగు సాహిత్యం నేలవిడిచి సాముచెయ్యడంలో మునిగి పోయిందనే మాట సంగతి అలా ఉంచితే, తెలుగు సాహిత్యాన్ని నేల మీద ‘వీధి’ లోకి లాక్కొచ్చి దాన్ని సామాన్య ప్రజానీకం మధ్య నిలబెట్టిన  ఘనత పూర్వకవులలో శ్రీనాథునికి చెందినంతగా మరెవరికీ చెందదు. చాటు పద్యాల రూపంలోనే కాకుండా, అవకాశం చిక్కినప్పుడల్లా కావ్యాలలో సైతం తెలుగువారి జీవన విధానికి సంబంధించిన అనేక విశేషాలనూ, అహారపుటలవాట్లనూ విస్త్రుత స్థాయిలో పొందుపరిచిన వ్యక్తి, మహాకవి శ్రీనాథుడు. శ్రీనాథుని కంటే ముందు నన్నయ, తిక్కనలు ఈ పని ఎందుకు చెయాలేకపూయార? నే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తే ముందుగా అర్ధంచేసుకోవాల్సిన విషయాలు రెండు. ఒకటి – అసలు తెలుగులో పద్యమైనా, గద్యమైనా శాసనాల్లో తప్ప వెరే ఎక్కడా లిఖితమై లేని ఆ రోజులలో, తనకు అప్పగించబడిన మహాభరత ఆంధ్రీకరణం అనబడే అతి పెద్ద పనిని బాధ్యతాయుతంగా నిర్వర్తించడంలో మునిగిపోయిన నన్నయ దృష్టి ప్రధానంగా తెలుగులో పద్య నిర్మాణానికి, కావ్య నిర్మాణానికి  సంబంధించిన వ్యవస్థను ఏర్పరచడం పైనే తప్ప వేరే విషయాలపై ఉండకపోవడం ఎంతైనా సహజం.

రెండు –  తిక్కన విషయానికొస్తే, ఏకారణం చేతనో అసంపూర్తిగా ఆగిపోయిన మహాభారత అంధ్రీకరణ యజ్ఞం లోతాను చేపట్టి పూర్తి చేయాల్సిన భాగం కొండంత.  కనక తిక్కన గారి దృష్టంతా మహాభారత అంధ్రీకరణాన్ని నన్నయ చూపిన దారిలో ముందుకు తీసుకువెళ్ళి సంపూర్తి చేయడంపైనే తప్ప వేరే విషయాలపై ఉంటుందనుకోవడం కూడా సమంజసం కాదు.

శ్రీనాథుని కాలానికి ఈ అవస్థ లేదు.  వ్యక్తిత్వ పరంగా ఆలోచిస్తే, శ్రీనాథునిది ఏ అవస్థనూ ఆట్టే పట్టించుకోని, మనసుకు అంటించుకుని అదే పనిగా మధనపడడానికి ఇచ్చగించని మనస్తత్వం. జీవితాన్ని ఒక ప్రయాణంగా తీసుకుని సంచరిస్తూ కొత్త కొత్త విషయాలను అన్వేషించడంపై శ్రధ్ధ చూపిన శ్రీనాథుడు, తన సాహిత్యం లోనూ అదే ధోరణిని కొనసాగించాడు.  ఈ ధోరణి ఫలితమే మనకిప్పుడు లభ్యమౌతున్న అనాటి ప్రజల జీవన చిత్రణ.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s