తెలుగులో ఒక చలి పద్యం

శ్రీనాథుడు తన రోజులనాటి తెలుగిళ్ళ సంగతుల్ని చిన్న చిన్న సందర్భాలుగా  సందర్భోచితంగా తన కావ్యాలలో
ప్రవేశపెట్టడం ద్వారానూ, చాటువుల రూపంగానూ కవిత్వీకరించి చూపెడితే, ఆ ప్రక్రియను ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళి మొత్తంగా ఒక ‘వీధినాటక (ప్రబంధ)ము’ నే రచించినవాడు వినుకొండ వల్లభరాయుడు. ఇతడు శ్రీనాథుని సమకాలీకుడే. గ్రంధం – క్రీడాభిరామం. ఇది రావిపాటి త్రిపురాంతకుడనే కవి సంస్కృతంలో వ్రాసిన ‘ప్రేమాభిరామం’అనే నాటకానికి అనుసరణగా తెలుగులో చేసిన రచన అని వల్లభరాయడే చెప్పుకున్నాడు. ఆ పుస్తకం ఇప్పుడు అలభ్యం. ఈ ‘క్రీడాభిరామం’ అనే గ్రంధాన్నితాటాకు పొత్తిళ్ళలోంచి వెలికి తీసి వెలుగు చూపించిన వారు పూజ్యులు, ప్రాతఃస్మరణీయులు స్వర్గీయ మానవల్లి రామకృష్ణ కవి గారు(క్రీ.శ.1866-1957). ఈ గ్రంధాన్ని వారు తమ  ‘విస్మృతకవి గ్రంథమాల’ లో భాగంగా పరిష్కరించి, తే.20-4-1909ది న వ్రాసిన విపులమైన పీఠికతో ప్రకటించారు.
ప్రకటన పొందినది మొదలు, 295 పద్య/గద్యాలతో నిండిఉన్న ఈ చిన్న గ్రంధం, తెలుగు పండితలోకంలో రేపినంత దుమారం, కలగజేసిన అలజడీ మరే గ్రంధమూ చేయలేక పోయిందంటే అతిశయోక్తి కానేరదు.(దీనికి exception గా మళ్ళీ స్వర్గీయ మానవల్లి వారి చేతనే కనుగొనబడి, పరిస్కరింపబడి, ప్రకటింపబడిన నన్నె చోడ కవిరాజ విరచిత ‘కుమార సంభవ’ కృతి ని చెప్పుకోవచ్చు.  ఈ గ్రంధాన్ని ప్రకటిస్తూ నన్నె చోడుడు నన్నయ కంటే ముందువాడని స్వర్గీయ మానవల్లి వారు చేసిన ప్రతిపాదన పండిత లోకాన్ని ఎంతటి ఆశ్చర్యానికి గురి చేసిందంటే ఈ ప్రతిపాదనను  ఖండిస్తూ  పెల్లుబికిన విమర్శలలో కొందరైతే ఏకంగా మానవల్లి వారే ఈ కావ్యాన్ని రచించి కీర్తికోసం నన్నె చోడుని రంగంలోకి దింపి కర్తృత్వాన్ని అతనికి అపాదించి ప్రకటించారన్నంత దాకా వెళ్ళాయి. దీనికి ఒక్కటే పెద్ద కారణం – నన్నయ ఆదికవి హూదాకు ఈ ప్రతిపాదన భంగం కలిగిస్తుంది గదా! అదంతా ఒక వేరే కధ, ఇప్పుడు అప్రస్తుతం గనక ఇక్కడితో వదిలేయడం భావ్యం).
నన్నయ మహానుభావుడు. గాలీ వెలుతురూ సోకని గదిలో నిశ్చలంగా వెలుగుతూన్న దీప శిఖలానూ, నిశ్చలంగా ఉన్న నిండుకొలని నీటిలో నిర్మలంగా ప్రకాశిస్తూన్న చందమామలానూ,  నన్నయ విరచిత ఆంధ్ర మహభారత భాగాన్ని చదివిన వాళ్ళకు, నన్నయ మూర్తి దర్శనమిస్తుంది. మొదటి ఉపమానంలో స్థిర చిత్తమూ, స్థితప్రజ్ఞతా, రెండవ ఉపమానంలో ప్రసన్నతా ఉపమేయాలు. మహాభారత ఆంధ్రీకరణలో తాను చేయబోయే పద్య రచనకు రెండు లక్షణాలను ఆయన ముందుగానే చెప్పుకున్నాడు. వాటిల్లో మొదటిది ‘ప్రసన్న కథాకలిత అర్ధ యుక్తి’,  రెండవది ‘అక్షర రమ్యత’.
మొదటి లక్షణాన్ని గురించి ఇప్పుడు అలా ఉంచి, రెండవ లక్షణమైన ‘అక్షర రమ్యత ‘ అనే రెండు మాటల ద్వారా నన్నయ ఉద్దేశించినది స్థూలంగా రెండు మాటల్లోనే చెప్పాలంటే పద్యంలో అక్షరాల కూర్పు, పద్యం నడక భాష రాని వాళ్ళకుగూడా భావం వ్యక్తీకరించగలిగేట్లుగా ఉండాలి. ఇదంటే ఏమిటో ఒక్కసారి నన్నయ విరచిత ఆంధ్ర మహాభారత భాగంలో సభా పర్వంలోని ‘ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి, రంభోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన ఇద్దురాత్ము…’ పద్యం జ్ఞప్తికి తెచ్చుకుంటే అర్ధమౌతుంది. ఈ పద్యంలో రౌద్రం అర్ధమవడాని భాష తెలియనవసరం లేదు. పద్యంలో  ‘ర’ అక్షరం పునరావృత్తమైన క్రమంలో తెలుగు భాష రానివాళ్ళకు కూడా ‘ఇదేదో కోపాన్ని తెలిపే పద్యంలా ఉందే’ అని తప్పనిసరిగా అనిపిస్తుందనడంలో సందేహంలేదు.
ఈ కోవకు చెందిందే తెలుగులో, వింటుంటేనే చలిపుట్టించే పద్యం ఒకటుంది, వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామం’ లో.  ఆ పద్యం ఇది, ఉత్పలమాల ఛందంలో:

“ప్రక్కలు వంచి వంచి, మునిపండ్లను పండ్లను రాచి రాచి, ఱొ
మ్మక్కిల జేసి చేసి, తల యల్లన గాళుల సంది సంది, లో
చక్కికి నొక్కి నొక్కి యిరుచంబడ, గుమ్మడి మూటగట్టి, వీ
పెక్కి దువాళిచేసి, చలి ఇక్కడ నక్కడ బెట్టు వేకువన్.”

మార్గశిర, పౌష్య (డిసెంబరు, జనవరి) మాసాల్లో వేకువఝాము చలి వల్ల కలిగే వొణుకు, ఈ పద్యంలో వంచి వంచి,
పండ్లను పండ్లను, రాచి రాచి, జేసి జేసి, సంది సంది, నొక్కి నొక్కి, ఇక్కడ నక్కడ అని ఇలా  పదం వెంట అదే పదాన్ని అమర్చిన పధ్ధతిలో అత్యంత మనోహరంగా సృష్టించబడి దర్శనమిస్తుంది.
ప్రపంచ సాహిత్యంలో వేరే ఏ భాషలోనైనా సరే చలి మీద ఇంతకంటే మంచి పద్యం ఉంటుందనుకోను. దురదృష్టకరమైన విషయం ఏమిటంతే, తెలుగు తెలిసిన వాళ్ళలోకూడా పద్యాన్ని ఒక పధ్ధతిలో చదవడం తెలిసినవాళ్ళకే తప్ప అన్యులకు  ఈ పద్య సౌందర్యం అర్ధం గాదు. పోనీ వేరే భాషల వాళ్ళకి అర్ధమయ్యేలా అనువదించి చెబుదామన్నా అనువాదానికి అసలే లొంగదు. కారణం – అర్ధాన్ని అనువదించగలం గాని, ‘అక్షర రమ్యత ‘ను ఎలా అనువదించగలం?
ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s