తెలుగు వారూ, ఆవకాయా, పెరుగన్నమూ…శ్రీనాథుడూ!(2)

శ్రీనాథుని ‘శివరాత్రి మహత్యం’ లోనివైన రెండు పద్యాలను గుఱించి ఇక్కడ ముచ్చటించుకోవాలి.

“చలి ప్రవేశించు నాగుల చవితినాడు
మెఱయు వేసవి రధ సప్తమీ దినమున
అచ్చు సీతు ప్రవేశించు పెచ్చు పెరిగి
మార్గశిర పౌష్యమాసాల మధ్య వేళ” (4-25)

“ఇండ్ల మొదలను నీరెండ నీడికలను
అనుగుదమ్ముడు నన్నయు నాటలాడు
అత్తయును కోడలును కుమ్ములాడు కుమ్ము
గాచుచోటికి మకర సంక్రాంతి వేళ” (4-27)

ఒక సంస్కృతి గుఱించిన సమాచారం ఈ రెండు పద్యాల్లో అలతి అలతి మాటలలో అతి మనోహరంగా పొందుపరచబడింది. మొదటి పద్యంలో పేర్కొనబడినటువంటి కాలగమనంలో ప్రకృతిలో చోటుచేసుకునే మార్పులకు సంబంధించిన సమాచారం స్థూలంగా భారతదేశానికి మొత్తానికీ వర్తించినా, రెండవ పద్యంలో పేర్కొనబడినటువంటి సంక్రాంతివేళ నాటి చిత్రణ దక్షినాది ప్రజలకు అందునా ముఖ్యంగా తెలుగు ప్రజలకు సంబంధించినది.

బుధ్ధి పెరుగుతూన్న తొలినాళ్ళలోనే, అంటే చిన్నతనంలో పిల్లలు నాల్గవ లేద ఐదవ తరగతి చదువుతూన్న రోజులలోనే, ఈ పద్యాలను కంఠస్తం చేయించి మనసుకు పట్టిస్తే జరిగే ఉపయోగాలు రెండు. ఒకటి – భారతీయులముగానూ, తెలుగు వాళ్ళముగానూ మనదైన ఒక సంస్కృతిలో చాంద్రమానాన్ని అనుసరిస్తూ మనం పెట్టుకున్న గుర్తులు, తిథులకు సంబంధించిన సమాచారం చిన్నతనంలోనే మనసుకు పట్టడం. రెండవది – ఏ ఏ తిథినాడు ప్రకృతిలో ఏ ఏ మార్పులు చోటుచేసుకుంటాయో స్థూలంగానైన ఒక అవగాహన ఏర్పడడం. ఓ అర్ధ శతాబ్ది  క్రితందాకా ‘పెద్ద బాలశిక్ష’ రూపంలో ఇలాంటి సమాచారమంతా విద్యార్ధి చిత్తంలోకి గుప్పించబడేది. కాలానుగుణంగా చోటుచేసుకున్న మార్పులలో ఇది వదిలేయబడడం ఒక దురదృష్టకర పరిణామం.

రెండవ పద్యం – ఒక సంక్రాంతి వేళ ఒక తెలుగింటి ముంగిలి నమూనా చిత్రం. ప్రభాత కాలపు నీరెండలో, అన్న తన తమ్మునితో ఆటలాడుకోవడం, అదే సమయంలో ఇంటిలో అత్తా కోడళ్ళు చలికాచు కోవడానికి పొయ్యి ముందు స్థానంకోసం నేను ముందంటే నేను ముందని పరుగు తేసే దృశ్యం కళ్ళకు కట్టినట్లు చిత్రించబడి కనిపిస్తుంది ఈ పద్యంలో. ఇలాంటి చిత్రాలన్నీ మొదటగా చిక్కింది శ్రీనాథుని కంటికే. ఇట్లాంటి వాటి నన్నిటినీ మనసుపడి కవిత్వీకరించింది కూడా మొదటగా శ్రీనాథుడే. తెలుగువాడి జిహ్వను ఆవకాయ పెరుగున్నంల రుచి ఎన్ని శతాబ్దాలు గడిచినా ఎలా విడిచిపెట్టి వెళ్ళదో, అలాగే శ్రీనాథుడు కవిత్వీకరించి చూపెట్టిన తెలుగిళ్ళ ఆచారాల, అలవాట్లలోని సౌకమార్యం, సౌందర్యం ఎన్ని శతాబ్దాలు గతించినా కనుమరుగైపోదు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s