తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (1)

శబ్దరత్నాకరంలో మొత్తం శబ్దాల సంఖ్య 35309. వీటిలో సంస్కృత సమములు 15014 (42.6%), ప్రాకృత సమములు, సంస్కృత ప్రాకృత భవములు 6892 (19.6%), దేశ్యములు 12475 (35.4%), అన్యదేశ్యములు 928 (2.4%).

ఇప్పుడు వాడుకలో ఉన్న ‘మాంసము’ అనే పదానికి పర్యాయ పదాలు మొత్తం 7. అవి వరుసగా – ఈరువు, ఎఱిచి, కలిమము, కౌచు, చియ్య, నంజుడు, పెరసు.  కానీ ఈ పదములలో ఏదీ ఇప్పుడు వ్యవహారంలో లేదు.

ముందు చెప్పుకున్నట్లుగా, తత్సమములు రెండు రకాలు – సంస్కృత సమములు, ప్రకృత సమములు.  సంస్కృతంలో గానీ, ప్రాకృతంలో గానీ ఏ రూపంలో ఉందో ఆరూపానికి మార్పేమీ చెయ్యకుండా ఉన్నదానిని ఉన్నట్లుగానే ఉంచి తెలుగు ప్రత్యయం తొడగడం ఈ పధ్ధతి.

సంస్కృతంలోంచి విశేష్య, విశేషణ, క్రియా పదాలు తీసుకోబడినాయి. సంస్కృతంలో 2000 దాకా ధాతువులు ఉనాయి. వాటికి ‘ఇంచు’ అనే ముద్ర వేసి తెనిగీకరించుకోవచ్చు. దేశ్య శబ్దాలనన్నిటినీ శోధించి చూసినట్లయితే అవన్నీ అజంతములే తప్ప హలంత శబ్దములు తెలుగున లేవని, దీర్ఘ స్వరాంత శబ్దములు లేవని, అందులో కూడ అకార, ఇకార, ఉకారములు చివరనుండు శబ్దములే ఎక్కువని తెలుస్తుంది.

ద్రావిడ భాషలలో పురుషులను, పురుష దేవతలను సూచించు శబ్దాలు పుల్లింగములు. స్త్రీలను, స్త్రీదేవతలను సూచించు శబ్దాలు స్త్రీ లింగములు. తిర్యగ్జంతువులను, జడములను సూచించు శబ్దాలు నపుంసక లింగములు. ఆర్య భాషలలో అలా కాదు.  లింగము అర్ధమును బట్టి కాకుండా శబ్దమును బట్టి ఉంటుంది.  ‘మిత్రమ్’ నపుంసక లింగము.  ‘దారాః’ అనగా భార్య, ఇది సంస్కృతంలో నిత్య పుల్లింగము. తెలుగులో ‘మహత్’ పుల్లింగము.  ‘అమహత్’ పుల్లింగము కానిది (స్త్రీ మరియు నపుంసక).

ప్రయోగముల కొరకు హితములైనట్టివి ‘తధ్ధిత’ ప్రత్యయములు.  భావార్ధకమైన ‘తనము’ ఇందులో ముఖ్యమైనది. దీని పూర్వ చరిత్ర ఋగ్వేదం దాకా పోతుంది.  ఋగ్వేదంలో ‘త్వన’, ప్రాకృతంలో ‘త్తన’. సంయుక్తాక్షర శబ్దాలు మొడటగా ఉండేవనీ, తరువాత వాటినుంచి వికృతి శబ్దాలు పుట్టే క్రమంలో ఉచ్చారణ సౌకర్యార్ధం అందుండి సంయుక్తాక్షరం విడదీయబడిందనీ తెలుస్తుంది.

తెలుగు భాషలో దేశ్య విశేషణములు దాదాపు 1000 దాక ఉన్నాయి. వీని విశేషమేమంటే విశేష్యము యొక్క లింగ వచనములను బట్టి వీనికి మార్పులు కలుగవు.  ఉదా: మంచి పిల్లవాడు, మంచి పిల్ల, మంచి చెట్టు. సంస్కృతంలో ఇలా కాదు.  ‘సుగుణవాన్’ బాలకః’, ‘సుగుణవతీ’ బాలిక, ఇత్యాదిగ. ఇలా ద్రావిడ విశేషణములకును సంస్కృత విశేషణములకును భేదం ఉండగా,  తత్సమ విశేషణములు వచ్చి తెలుగులో సంస్కృత నియమాలను తెచ్చి పెట్టినాయి.  ఉదా: సుందరుడగు బాలుడు, సుందరియైన బాలిక, సుందరమైన వాహనము, ఇత్యాదిగ.

2 thoughts on “తెలుగు – భాష, ఛందస్సు, వ్యాకరణం: కొన్ని సంగతులు (1)

  1. మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ పరుస్తూ …మీ వివరణ ద్వారా తెలియని మరి కొన్ని విషయాలు తెలియవచ్చాయి. అభినందనలు ….పద్య నిర్మాణం పై అభిలాష వున్న వారికి అందుబాటుగా ఛందస్సును సరళ తరం చేయలేమా? సామాన్యునికీ అందివచ్చేలా తీర్చిదిద్దుకొని ,పద్య ప్రాభవాన్ని సంరక్షించుకో లేమా ?వివరించ గలరు. …. శ్రేయోభిలాషి….నూతక్కి

    • ధన్యవాదములు రాఘవేంద్ర రావు గారూ!
      మీకూ, మీ కుటుంబ సభ్యులకూ 2011 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
      @పద్యనిర్మాణంపై….ముందు ముందు వ్యాసాలలో ప్రయత్నిస్తాను.
      నమస్కారములతో,
      వెంకట రావు.

వ్యాఖ్యానించండి