భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (9)

తండ్రి నోట ఉద్దేశ్యపూర్వకంగా వెలువడని మాటలయినా సరే అర్ధంలేనివి కావడానికి వీల్లేదన్న తలంపుతో నచికేతుడు తనకు తానుగా మృత్యువుకు సమర్పించుకోవడానికి సిధ్ధమై యముని సదనము ముందు నిలుస్తాడు.  మూడు రోజులు ఓపికగా వేచి ఉన్న తరువాత ప్రత్యక్షమైన యముడు, నచికేతుని సంకల్పానికి ముచ్చటపడి ఇవ్వడానికి అంగీకరించిన మూడు వరాలకు ప్రతిగా ఆత్మజ్ఞానం ప్రసాదించమంటాడు నచికేతుడు. అందుకు అంగీకరించి, సందేహాలను అడుగమన్న యముడిని నచికేతుడు “స్వామీ! మనుష్యుడు మర్త్యుడు. అయితే కొందరు చెబుతారూ మృత్యువు అంతంకాదని.  ఆత్మ అనేది ఒకటుంటుందనీ, అది అనంతమయిన దనిన్నీ.  కొందరంటారూ, అదంతా ఒట్టి పుక్కిటి పురాణం అనీ. వీటిల్లో ఏది నిజం?” అని ప్రశ్నిస్తాడు.

నచికేతుని ప్రశ్నకు  యముడు చెప్పిన సమాధాన సారాంశం ఇది –  “రెండు రకాల అనుభవాలు ఉంటాయి.  శ్రేయము, ప్రేయము అని వాటి పేళ్ళు. మనుష్యుని ఈ రెండు రకాల అనుభవాలూ, వీటి తాలుకు అనుభూతులూ అల్లుకుని ఉంటాయి. శ్రేయము విముక్తిని ఇచ్చేటువంటిది.  ప్రేయము కట్టిపడవేసేటువంటిది. వివేకులు శ్రేయమనే దారిని ఎన్నుకుంటారు.  అవివేకులు ప్రేయమనే దారిని ఎన్నుకుని అవిద్యలో మగ్గుతుంటారు.  వారికి విముక్తి ఉండదు.  ఆత్మ అంతం, అనంతం రెండూను.  ఆత్మను గురించి ఎరిగినవాడు వైరుధ్యాలను గురించి ఖేదపడడు.  ఆత్మ అనేటువంటిది తెలుసుకోగలిగినటువంటి వస్తువు కాదు.  అది అంతిమ సత్యం.  ఆత్మ జ్ఞానాన్ని పొందడం బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే.  ఆత్మ జ్ఞానాన్ని గురించి ఎరుకపరచడం అత్యుత్తమమైన జ్ఞాన బోధన అవుతుంది. అందులో బోధ పరచువాడు బ్రహ్మమే, బోధ బ్రహ్మమే, బొధపరచబడునదీ బ్రహ్మమే.  ఇది తెలుసుకోవడమే ముక్తి.  ఇది నమ్మకంతో సాధించుకోవలసిందే గాని తర్కానికి అందేటువంటిది కాదు.”

ఇందులో కొత్తగా విశదమయ్యిందేమీ లేదు.  అయినప్పటికీ భారితీయ చిత్తాన్ని ఈ విశదీకరణ విశేషంగా ఆకర్షించి వశపరచుకుంది. అస్పష్టతనూ సంధిగ్దతనూ అలాగేవుంచి మబ్బు విడీవిడకుండునట్లుగా చేసిన ఈ విశదీకరణ సామాన్య ప్రజానీకం ఎవరి చిత్తానికి తోచినట్లుగా వాళ్ళు పరమాత్మ స్వరూపాన్ని ఊహించుకోవడానికి అవసరమైన సౌలభ్యాన్ని కలిగించింది.

చాందోగ్యోపనిషత్తులోని తండ్రీకొడుకుల సంభాషణలో చివరకు ఎదురైన శూన్యాన్ని పరమాత్మగా చెప్పడాన్ని భారతీయ చిత్తం అంగీకరించింది.  అదే శూన్యాన్ని శూన్యంగానే ఒప్పుకోమన్న నాగార్జునుని శూన్యవాదాన్ని, మిగతా సంగతుల మాటెలాఉన్నా, హర్షించలేక పోయింది.

ఈశావాస్య ఉపనిషత్తు పరమాత్మ భావనను అన్నిటినుంచి విడిగా, అత్యంత ఉన్నతంగా నిలబెట్టడాన్ని కూడా భారతీయ చిత్తం అంగీకరించింది.  మిగతా సంగతుల మాటెలాఉన్నా, పరమాత్మను భూమిమీదికి దించి చైతన్యంఉన్న ప్రతి ప్రాణీ మూలశక్తి (పరమాత్మ) తో సమానమే నంటూ పరమాత్మ బహుత్వ భావనను ముందుకు తేబోయిన సాంఖ్యవాదాన్ని అంగీకరించలేకపోయింది.

ఫలితంగా ఈ చింతనలు వెనకకు వెళ్ళిపోయాయి.  ఉపనిషద్వాణి మిగిలింది.  మిగిలుంది.

ప్రకటనలు

2 thoughts on “భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (9)

 1. శ్రీ వెంకట్ బి. రావు గారికి, నమస్కారములు.

  ఈ వ్యాసం లోని తొమ్మిది భాగాల్ని చదివాను. చాలా చక్కగా, వివరాణ్త్మకంగా వ్రాశారు. ధన్యవాదములు. ఇకపోతే, `ఉపనిషత్తులకు, సాంఖ్యులకు బేధమల్లా ఉపనిషత్తులు పరమాత్మను అన్నిటికంటే ఎత్తున విడిగా చూపెట్టాయి, సాంఖ్యులు చైతన్యమున్న ప్రతి ప్రాణీ పరమాత్మే అన్నారు.’ — నా వుద్దేశంలో ఈ రెండిటికీ తేడా ఏమీలేదు. ఉదా: ఆకాశంలో ఒక సూర్యుడుని చూస్తాం. భూమిమీద, వంద నీళ్ళ కుండలను పెడితే, నూరు సూర్య బింబాలు కనిపిస్తాయి. అసలు సూర్యుడే లేకపోతే, బింబాలు కనిపించవు కదా. అదేవిధంగా, ప్రతి ప్రాణీ పరమాత్మే; పరమాత్మే ప్రతి ప్రాణీనూ.
  రెండవ విషయం: `మిగతా సంగతుల మాటెలాఉన్నా, పరమాత్మను భూమిమీదికి దించి చైతన్యంఉన్న ప్రతి ప్రాణీ మూలశక్తి (పరమాత్మ) తో సమానమే నంటూ పరమాత్మ బహుత్వ భావనను ముందుకు తేబోయిన సాంఖ్యవాదాన్ని అంగీకరించలేకపోయింది.–భారతీయ చిత్తం” అని వ్రాశారు. దీనికి ఏదైనా ప్రామాణికం వున్నదా? చెప్పగలరు అని మనవి. ఎందుకంటే, విషయపరంగా, తర్కపరంగా నేను ప్రస్తావించిన మొదటి, రెండవ విషయాల్లో ఎటువంటి తేడాలు లేవుగనుక.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • శ్రీ మాధవరావు గారికి, స్పందనకు ధన్యవాదములు.
   మీరు ప్రస్తావించిన రెండు సంగతులమీదా ఆలోచించే ఇది వ్రాస్తున్నాను.
   మొదటిది – తేడా ఉంది. ఆ తేడా పరమాత్మ భావననూ, పరమాత్మనూ మనం గుడిలో ఉంచి కొలుస్తాం. ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ ఉన్నాడనే భావనను ఒప్పుకున్నా, ప్రతి ప్రాణినీ మనం అలా కొలవం. అది సాధ్య పడదు గనుక. నా ఆలోచనకు తోచినంత వరకూ ఇది తేడా. ఇది పెద్ద తేడా.
   రెండవది – ప్రామాణికం అంటే, తాత్త్వికంగా ఉపనిషత్చింతన మిగిలి, సాంఖ్యం తెరమరుగవడమే ప్రమాణం. అంతకంటే ఏం ప్రమాణం కావాలి? అని ప్రస్తుతానికి నేను నమ్ముతున్నాను.
   ఇక్కడే ఇంకొక మాట. ఈ వ్యాస పరంపర ఇంకా కొనసాగాల్సి ఉంది. ఇక్కడికి చేరుకునేప్పటికే చాలా అలసట వచ్చేసి తాత్కాలికంగా ఆపేశాను. ఇంకా ఐదారు భాగాలవుతాయి వ్రాస్తే. మళ్ళీ ఆ విషయాలకు సంబంధించిన mood లోకి వెళ్ళి, మనసు కుదిరినపుడు ఎపుడో వ్రాస్తాను.
   నమాస్కారములతో,
   వెంకట రావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s