వాగ్గేయం – (1)

స్థూల విభజనలో సాహిత్యం మూడు విధాలుగా ఉంటుందని తేలుతుంది – పదం, పద్యం, వచనం.  పదం పాడుకోవడానికి, తద్వారా ఆడుకోవడానికి (అభినయానికి) వీలైనది. పద్యం పాడుకోవడానికి, చదువుకోవడానికి వీలైనది. వచనం చదువుకోవడానికి మాత్రమే వీలైనది. ఈ మూడింటిలో పద్యం నియమ బధ్ధం అవడం వలన కేవలం పండితులకే పరిమితమైనది.

తెలుగులో సాహిత్యాన్ని మొదటినించీ రెండు రకాలని చెప్పుకుంటూ వస్తున్నారు. అవి మార్గ, దేశి. నియమ బధ్ధమై శిష్ట సమ్మతము, శాస్త్ర సమ్మతము అయి ఉండి ఉత్తమమైన మార్గంలో ఉండేది మార్గ కవిత. నియమ రహితంగా ఉండి, శాస్త్ర విషయాల జోలి పట్టించుకోకుండా కేవల ప్రజా రంజనం కోసమై చెప్పబడేది దేశి కవిత.

ప్రపంచ సాహిత్యాలన్నిటిలోనూ పద్యం కంటె పదమే ముందు అన్నది అందరూ అంగీకరించేదే. అంతే కాకుండా పద్య కవిత్వానికి మూలాలు పద కవిత్వంలోనే ఉన్నాయన్నది కూడా అందరికీ ఆమోదయోగ్య మైనదే.  పదం అంటే జనసమాన్యంలో పాట అనే అర్ధం (పదం పాడుతూ, కడం తొక్కుతూ…ఇత్యాది ప్రయోగాల్లో) స్థిరపడి ఉంది. సందర్భాన్ని బట్టి పాడుకోవడానికి అనువుగా ఉండి, లయాత్మకంగా ఉండే పదాలతో నిండి ఉండేదే పద సాహిత్యం.  తాళ బధ్ధత ఉండొచ్చూ, లేక పోవచ్చు. మన దేశంలో మొట్ట మొదటి పదాలన దగినవి వేదాలనీ, వాటి గానంలో తాళాలు లేవన్నది గమనించాల్సిన విషయమనీ పెద్దలు చెబుతారు. ఉన్న దొకటే లయ.

మనకు పదకవితా పితామహునిగా పేరుగాంచిన తాళ్ళపాక అన్నమాచార్యులవారి కీర్తన (కీర్తించునది కీర్తనము) లలో, లాక్షణికులు రెండు అంశాలను వెలికి తీసి చూపెట్టారు. మొదటిది సాహిత్యాంశం. దీనిని ‘వాక్కు’ అన్నారు. రెండవది సంగీతాంశం. దీనిని ‘గేయం’ అని అన్నారు. ఈ రెండింటి సమ్మేళనమే వాగ్గేయం. వాగ్గేయ రచనలు చేయగలిగిన వాడు వాగ్గేయకారుడు.

వాగ్గేయకారులను ‘బయకారుల’ని అనడం కూడ ఒకప్పుడు వాడుకలో ఉండేదని చెబుతారు. దీనికి అర్ధం సాహిత్యాన్ని (వాక్కు) సంగీతాన్ని (గేయం) రెండింటినీ (ఉభయాన్నీ) ఒకేసారి సృష్టించగల నేర్పు కలిగిన వ్యక్తి కాబట్టి, ఉభయకారుడు అనడానికి అపభ్రంశ రూపంలో బయకారుడని మిగిలిందని చెప్పే వివరణ కూడా బయకారుడన్న పదానికి లభిస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s