తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (2)

‘అకము’ అనే పదానికి అర్ధం పాపము అని. న అకము, నాకము అంటే పాపము లేనిది, కాబట్టి స్వర్గం.

‘అక్షతలు’ అనగా క్షతమై ఉండనివి unbroken grains అని అర్ధం. అందుకే అక్షతలు తయారు చేసేప్పుడు నిండు బియ్యపు గింజలనే తీసుకోవాలి, అలాంటివే శిరస్సుపై ధరించడం గానీ, చల్లడం గానీ చేయ్యాలి.

‘పరము’, పరముపడి ఉండడం అంటే అభోజనం ఉండడం. పరగడుపు, పరము కడుపు, అభోజనమై ఉన్న, అప్పటికింకా ఏ అహారమూ తీసుకోని స్థితిలో అని అర్ధం.

‘అందె’ అనే మాటకు నూపురము a foot trinklet అని అర్ధం (అందెల రవళుల సందడి మరి మరి….). కానీ అందె వేసిన చేయి అన్నప్పుడు ఇది చేతి కంకణాన్ని సూచిస్తుంది. అయితే ఈ కంకణం ప్రజ్ఞకు ప్రశంశా పూర్వకంగా బహూకరింప బడినదై ఉంటుందనేది ఆ మాటల అర్ధం చెప్పకనే చెబుతుంది.

‘బోన’ అనే పదానికి వండిన ప్రాలు, అన్నం అనే అర్ధం ఉండేది. దీని నించే బోనము అయ్యింది. ఇదే ‘బోనాలు’ అనే మాట. అయితే, బోనము అనే పదం సంస్కృత ‘భోజనము’ అనే పదానికి వికృతి రూపమని కూడా చెబుతారు.

‘హాయిగా’ అన్న మాట సుఖంగా అని ప్రయోగంలో ఇప్పుడున్న అర్ధం. శరీరం బాగా అలసట చెంది ఉన్న తరుణంలో కొంత విశ్రాంతి దొరికితే, అప్పుడు అసంకల్పితంగా నోటినుండి విడుదలయ్యే ‘హా’ అనే ఊర్పుతో కూడుకున్న శబ్దం నుంచి ఈ పదం ఏర్పడింది. కవుల ప్రయోగాల్లో ఇది ఇలాగే కనిపిస్తుంది (సుఖమంది ‘హా’ యని సొక్కువేళ…ఇత్యాదిగ).

‘భడవా’ అన్న మాట ఇప్పుడు ‘చిన్న వయసులోనే పెద్ద పనులు చేయగల నేర్పరి’ లేదా ‘వయసుకు మించిన పనులు చేయగల ప్రావీణ్యత గలవాడు’ అన్న అర్ధంలో పిల్లలను ఒకింత మెచ్చుకోలు ధ్వనించే విధంగా మందలిస్తున్న సందర్భంలో వాడబడుతోంది.  కానీ, ‘బడవా’ అన్న మాట కవుల ప్రయోగాల్లో ‘తార్చువాడు, తార్చునది’ అన్న అర్ధంలో వాడబడింది. (పంచాంగములు మోసి, బడవాతనము చేసి…ఇత్యాదిగ).

‘అల్లారు ముద్దుగా’ అనే పదబంధానికి చాలా ముద్దుగా, అంటే ఏ కష్టమూ తెలీనీయకుండా చూసుకోవడం, అలా పెంచడం అనేది ప్రయోగంలో జనసమ్మతి పొందిన అర్ధం. ఈ పదబంధంలోని ‘అల్లారు’ అనే మాటను అల్ల, ఆరు అని రెండు మాటలుగా విడదీసి చూపించింది బ్రౌణ్యం. అయితే ఈ రెండు పదాల విడి అర్ధాలు ఇక్కడ పొసగవు. అల్లరే ముద్దుగా, అంటే చేసే అల్లరియే ముద్దుగా అనే అర్ధంలో వాడబడినది రాను రానూ అపభ్రంశమై అల్లారు ముద్దుగా మారిందని నా అభిప్రాయం. ఈ అభిప్రాయంతో మీరు సోపపత్తికంగా విబేధించవచ్చు.

‘వాస్తవము’ అంటే నిజం అన్నది రూఢార్ధం. వస్తువులో నిక్షిప్తమై దృగ్గోచరమయేదీ, అనుభవమయ్యేదీ ఏదైతే ఉందో అది తాత్త్వికంగా నిజం కాబట్టి, వస్తుగతమై ఉండేది వాస్తవము, నిజం అన్నది రూఢార్ధమైందని నా అభిప్రాయం. ఈ అభిప్రాయంతోనూ మీరు సోపపత్తికంగా విబేధించవచ్చు.

ప్రకటనలు

6 thoughts on “తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (2)

  1. కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలే! అకము అంటే అ+క (క=సంతోషము) అని విరిచేసి దుఃఖము అని అర్థము చెప్పి, నాకము అంటే న+అక= దుఃఖము లేని చోటు అని స్వర్గము అని చెప్పిన నిరుక్తి, నిఘంటు పుస్తకాలున్నా భాషాశాస్త్రవేత్తలు ఈ వ్యుత్పత్తి ఒప్పుకోరు.అక్షత అన్న పదం అక్కి (బియ్యము) అన్న దేశ భాషాపదానికి సంస్కృతీకరణ కూడా కావచ్చు. బోన- అన్నది భోజన- నుండి వచ్చిందన్నదే సమంజసమనిపిస్తుంది. అల్లారు లో అల్ల- అన్న పదానికి -ఆరు అన్న ప్రత్యయం కలపడమే సబబు. నిండారు, సొంపారు, పొల్పారు, అలరారు అన్న పదాలలో -ఆరు ప్రత్యయానికి “నిండిన,” “కూడిన” అన్న అర్థాలు గమనించగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s