సాహిత్యంలో ప్రకృతి – (1)

“ణిప్పణ్ణ సస్సరిద్దీ సచ్ఛందం గాఇ పామరో సరఏ,
దలిఅ ణవసాలి తండుల ధవల మిఅంకాసు రాఈసు”

హాల మహారాజు కూర్చిన ప్రాకృత గాథా సప్తశతిలోని, ఏడవ శతకంలో 89వ గాథ ఇది. ఈ గాథ అర్ధం ‘(శాతవాహన రాజుల కాలంలో) ఒక శరత్కాలపు రాత్రి. వరి చేను బాగా పండి (కనుల ఎదుట కనిపిస్తూ) ఉంది. కొత్త బియ్యం దంచి చేసిన పిండి ఆరబోసినట్లుగా ఉన్న తెల్లని వెన్నెలలో (పట్టలేని ఆనందంతో) తనకుతానుగా తోసుకొచ్చిన పాటను పాడుతున్నాడు కర్షకుడు’ అని.

కనుల ఎదుట అలతి మాటలతో అలవోకగా ఒక వర్ణ చిత్రాన్ని రచించి చూపిస్తుంది ఈ గాథ. భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న ఒక గ్రామీణుడికి ఇంతకంటే ఆనందాన్నిచ్చే సందర్భం వేరొకటుండబోదంటే అతిశయోక్తి కాదు.

దక్షిణ భారతదేశం చేసుకున్న పుణ్యంకొద్దీ ఇక్కడ జన్మించిన కొద్ది మంది మహా వ్యక్తులలో హాల మహారాజు ఒకడు. అతడి కృషే లేకుంటే ఈ గాథ, ఇంకా ఇలాంటివే ఎన్నో హృద్యమైన గాథలు గ్రంథస్థం కాకుండా ఎటుపోయేవో ఊహించలేం.

“అయి రమణీయా రమణీయ, సరఓ వి మణోహరో తుమంచ సాహిణో,
అనుకూల పరియణాయే, మన్నే తం నత్థి జం ణత్థి.
తా కింపి పదోసవిణోదమేత్తసుహ అం మణహరుల్లావం,
సా హేయి అపువ్వకహం సురసం మహిళాయణమణోజ్జం.”

ప్రాకృత వాఙ్మయంలో ప్రసిధ్ధమైన ‘లీలావతి కథ’ లోనిది ఈ శ్లోకం. ‘లీలావతి కథ’ ఆంధ్ర దేశానికి సంబంధించిన చారిత్రిక కథ అనీ, అందులో ఆంధ్ర దేశంలోని అనేక ప్రాంతాలు వర్ణించ బడినాయనీ మొదటగా గుర్తించి చెప్పినవారు మాన్యులు స్వర్గీయ మానవల్లి రామకృష్ణ కవిగారు. పై శ్లోకం అర్ధం ఇది:

“రాత్రి రమణీయంగా ఉంది. దానికి తగినట్లే శరత్కాలమూ మనోహరంగా ఉన్నది. ప్రేమాస్పదుడవైన నీవూ నాకు స్వాధీనుడవై ఉన్నావు. పరిజనులుకూడా అనుకూలురుగా ఉన్న నాకు లేనిది అంటూ ఏదీ లేదని అనుకుంటాను. కనుకా, ఏదేనా, మనస్సుకు ఇంపుపుట్టించే సంభాషణ గలదిగానూ, ఈ ప్రదోషకాలపు వినోదానికి తగినట్టిదిగానూ ఉన్న కొత్త కథ, చక్కని రసం వుట్టిపడేదాన్ని, మహిళాజనానికి ఇంపు పంపాదించేదాన్నీ సాధించండి (అంటే చెప్పండి)” అని విశద పరచి చెప్పిన వారు స్వర్గీయ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు.

రాత్రి రమణీయకతను వాచ్యంగా చెప్పకుండా పాత్ర మనఃస్థితి ద్వారా చదువరికి అర్ధమయ్యేలా చెప్పడం పైన ఉదాహరించిన గాథలోనూ, ఈ శ్లోకంలోనూ కనిపిస్తుంది. రసం (ఇక్కడ కాసేపు భావం అని అనుకుంటే) ఎప్పుడూ వ్యంగ్యమే కావాలి తప్ప, వాచ్యం కారాదన్న భారతీయ (రస) సిధ్ధాంతంలోని ముఖ్యాంశాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని అనుసరిస్తూ చెప్పిన కవిత్వం ఇది.  ఉత్తమమైనది.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s