పఞ్చతన్త్రమ్ – some useful notes (1)

‘కాకోలూకీయం’ నుండి

“ఖనన్నాఖుబిలం సింహః పాషాణశకలాకులమ్
ప్రాప్నోతి నఖభఙ్గం హి ఫలం వా మూషకో భవేత్.”          (16వ శ్లోకం)

బండరాతి ముక్కలతో ఆద్యంతం నిండి ఉన్న బిలాన్ని (ఎలుక తొఱ్ఱను) అదేపనిగా తవ్వడంవల్ల సింహమైన పొందగలిగే దేముంటుంది, గోళ్ళు విరగగొట్టుకోవడం తప్ప. ఒకవేళ ప్రతిఫలంగా ఏదైనా లభిస్తే అది ఒక ఎలుక మాత్రం అయి ఉంటుంది, అని ఈ శ్లోకార్ధం.

తెలుగులో ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ అనే సామెతను గుర్తుకు తెస్తుందీ శ్లోకం.

“ప్రతివాతం న హి ఘనః కదాచిదువనర్పతి.”              (22వ శ్లోకం రెండవ పాదం)

‘మేఘం ఒకప్పుడుకూడా పవనుడికి ఎదురుగా వెళ్ళే యత్నం చేయదుగా’ అని శ్లోకార్ధపు అర్ధం. యుధ్ధం ఎప్పుడూ బలసహితుడైన వానితోనే చేయాలి అన్న నియమం అసహజం, నిధర్శనం లేనిది అని చెప్పడానికి దృష్టాంతంగా ఇది చెప్పబడింది, సహజ సుందరంగా, సుబోధకంగా.

“సుతప్తమపి పానీయం శమయత్యేవ పావకమ్”          (23వ శ్లోకం రెండవ పాదం)

‘(అగ్ని చేతనే కాయబడి) బాగా వేడెక్కి సలసల మరుగుతున్నదైనప్పటికీ, నీరు అగ్నిని చల్లార్చ గలిగే (గుణం కలిగే) ఉంటుంది’ అని అర్ధం. ఎన్ని ప్రమాణాలతో సంధి చేసుకున్నప్పటికీ శత్రువైన వాడు శత్రువుగానే ఉంటాడు, ఆ గుణం పోదు అని చెప్పడానికి దృష్టాంతంగా చెప్పినదిది.

ఇంత మంచి భావాన్ని తెలుగు పద్యంలో ఎక్కడా ఏ కవీ బంధించినట్లుగా కనబడదు. (లేక, ఏ మూలనైనా ఉన్నదా?)

“నక్రః స్వస్థానమాసాద్య గజేంద్రమపి కర్షతి
స ఏవ ప్రచ్యుతః స్థానాచ్చునాపి పరిభూయతే.”               (47వ శ్లోకం)

మొసలి తనదైన స్థానంలో ఉన్నప్పుడు గజేంద్రుని సైతం తనవైపుకు లాగ గలుగుతుంది. అదే తన స్థానం వదిలితే కుక్క చేతనూ పరాభవింపబడుతుంది.

ఈ దృష్టాంతానికి ఇంకొంచెం పొడిగింపే సుమతీ శతకంలోని ఈ పద్యం అనిపిస్తుంది, might be the other side of the above logic:

“కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పిన
తమ మిత్రులె శత్రులౌట తధ్యము సుమతీ!”

వ్యాఖ్యానించండి