వియోగం (3)

“అపూర్వకర్మచండాల మయి ముగ్ధే విముంచ మాం
శ్రితాసి చందన భ్రాంత్యా దుర్విపాకం విషద్రుమం”

భవభూతిచే రచించబడిన ‘ఉత్తరరామ చరితం’ లోనిది ఈ శ్లోకం. పూజ్యులు పండిత ఉమాకాంత విద్యాశేఖరుల వారి ‘నేటి కాలపు కవిత్వం’ పుస్తకంలో మొదటిసారి ఈ శ్లోకాన్ని చదివాను.  వారికి గూడ ఈ శ్లోకం చాల ప్రియమైనది గావును, ఆ పుస్తకంలో రెండు చోట్ల ఉదాహరించారీ శ్లోకాన్ని.

శ్రీరాముని తొడపై తల వుంచి, అన్ని దిగుళ్ళనూ మరచి, సుఖంగా నిద్రిస్తూ వుంటుంది సీత. నిద్రిస్తూన్న ఆమె నిర్మలమైన ముఖం వంక చూస్తూ శ్రీరాముడు అనే మాటలే ఈ శ్లోకం. (నిజానికి, సీత అనే కాదు, ప్రియుడైన తన భర్త తొడపై తల ఆనించి నిద్రించే ఏ స్త్రీ ముఖమైనా, ఎన్నడూ ఉండనంత సుఖంగానూ, సంతోషంగానూ, ప్రశాంతంగానూ ఉంటుంది.  కారణం ఒకటే, తల ఆనించి నిద్రించడానికి అంతకంటే సుఖవంతమైన ప్రదేశం ఈ భూప్రపంచంలో వివాహితకు వేరే ఏదీ ఎంత వెదికినా ఎక్కడా కనిపించదు).

అంతులేని వియోగ ధఃఖం ఉందీ శ్లోకంలో. ఆ దుఃఖం ఇంకా అనుభవింప బడనిది.  ‘తన మంచిచెడులకు, సుఖదుఃఖాలకూ భారమంతా నా మీదే వేసి, అచంచలమైన విశ్వాసంతో సర్వం మరచి నిద్రిస్తూన్న ఈమె, తనకు నేను కలగజేయబోయే ఈ నమ్మశక్యంగాని శోకాన్ని, ఈ రాబోయే వియోగాన్ని, ఎలా భరించగలదు?’ అని తననుతాను ప్రశ్నించుకుని కలత చెందిన రాముని మనస్సులో మెదిలిన మాటలివి.

“ఇంతకు మునుపెవ్వరూ చేయనట్టి దుష్కర్మలతో మలిన పడిన వాడనైన నన్ను, ఓ ముగ్ధా!, ఇకనైనా విడిచి వెళ్ళు. చందన వృక్షం అనుకుని భ్రాంతి చెంది, ఎందుకూ పనికి రాని, కనీసం ముట్టుకోవడానికైనా అర్హంకాని విష వృక్షాన్ని ఆశ్రయించావు,” అని శ్రీరాముని నోటి వెంట భవభూతి పలికించిన ఈ శ్లోకం భావం.

ఇదేమిటి? శ్రీరాముని చేత ఇలా మాట్లాడించడ మేవిటి? శ్రీరాముడు ‘అపూర్వ కర్మచండాలుడనని’ తనను తాను నిందించుకోవడం ఏమిటి? సీతను ఆ స్థితిలో తనను వదిలి వెళ్ళిపోమనడం ఏవిటి? తాను విషవృక్ష మేవిటి? ఇదంతా సరైనదేనా? అనిపిస్తుంది ఒక్క క్షణం.

కాని, ఇది సరైనదేనని నేను చెప్పడం ఈ విషయాలపై నా పరిమిత బుధ్ధితో హెచ్చులు పోవడమే అవుతుంది.  వ్రాసినది భవభూతి. అకారణంగా ఒక్క శ్లోకంగూడా ఉండదు.  శ్రీరాముడు ఎవరో కాదు, మనలోని ఒకడే, తరతరాలకు నిలిచిపోబోయే మనలోని ఉన్నతాంశయే అని నిరూపించడం ఇక్కడ భవభూతి ఆశించినది అనిపిస్తుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా, అన్నీ తానే అని నమ్మి, భారమంతా తనమీదే వేసి, సర్వమూ మరిచి నిద్రిస్తూన్న సీత ముఖం వైపు చూసి చలించిపోయిన రాముడు ఒక్క క్షణం మామూలు మనిషైపోయి విధి వంచితుడుగా, అశక్తుడుగా సామాన్యుడై కనబడతాడు.  అలాగే అలోచించుతాడు.  రాబోయే వియోగ దుఃఖానికి తననుతాను మానసికంగా సిధ్ధం చేసుకుంటున్నట్లు కనబడతాడు. అందుకే ఆయన మనకు అంత దగ్గరైవున్నాడు.

కవిత్వం చెప్పడం (వ్రాయడం) లో పొదుపుగా మాటలు వాడడం అన్న సంగతికి ఉదాహరణగా చెప్తూ ఉమాకాంత విద్యాశేఖరులవారు ఈ శ్లోకం గురించి ఇచ్చిన వివరణ ఇది:

“…నిద్రిస్తున్న సీతను జూచి (రాముడు ఈ మాటలు) అన్నపుడు, రాముడి ధర్మపరత్వం, సీతావియోగదుఃఖం, ధర్మముయొక్క నిష్టురత్వం, లౌకిక సుఖోపలభ్ధికోరే వారు ధర్మారాధనలో పొందే ఆశాభంగం, విధియొక్క అజ్ఞాతపరిణామ వికల్పాలూ, ఇట్లా ఒక విశిష్టభావ ప్రపంచం శ్రోతయొక్క మనః పరిణతిననుసరించి సంకోచవికాసాలుపొందుతూ లీలామాత్రంగా గోచరిస్తుండడం సహృదయవేద్యం. ఇదే కావ్యసౌందర్య
విభుత్వం.” (నేటికాలపు కవిత్వం, పుట 80-81).

ఇలాంటి కవిత్వం ఇప్పుడు సాధ్యమౌతుందా? అంటే సందేహమే. ఆ కాలంతోపాటే అలా ఆలోచించగలిగే మనస్సునూ మనం అక్కరలేదనుకుని మరీ కోలుపోయాం అనిపిస్తుంటుంది ఇలాంటివి చదివినప్పుడల్లా.

ప్రకటనలు

2 thoughts on “వియోగం (3)

  1. aadavaallu hayiga nidra poyaaru ante bharte meeda bharosa. kaani bhartaa hayiga nidrapoyadu ante panilo alasata valla matrame. bharta paridhi peddadi (talli, tandri,akka.chelli, tammudu, anna, bhaarya, pillalu, office, bayati vyaktulu etc..) bharya paridhi chinnadi. anni soukaryalu vunna bhaarya hayiga nidra potoone vuntundi. ante nantaara?

    • ‘భర్తమీద భరోసా’ అన్న మాట చాలా బాగుంది, ఏ భార్య అయినా భరోసా ఉంచగలిగిన మొట్టమొదటి వ్యక్తి భర్తే కాబట్టి. భర్త పరిధి నిస్సందేహంగా పెద్దదే! అయితే, భార్య పరిధి కూడా అంత చిన్నదేమీ కానవసరం లేదనుకుంటాను. ఆమె పరిధిలోనూ తల్లి, తండ్రి, అన్నలూ తమ్ముళ్ళూ, అక్కలూ చెల్లెళ్ళూ, వాళ్ళ సుఖ సంతోషాలూ ఉండనవసరంలేదనుకోవడం సరైనదికాదేమో, న్యాయం కాదేమో! అన్నీ సుఖంగా
      అమరిన భార్య హాయిగా నిద్రపోలేక పోవడానికి ఏమీ లేనట్లుగానే, భర్త సుఖంగా నిద్రపోవడానికి పనిలో అలసట ఒక్కటే కారణం కాదనుకుంటాను, పని ఒక్కటే అతని ప్రపంచం కాదు కాబట్టి. అతనికీ అన్నీ సుఖంగా అమర్చానన్న భరోసా కలిగినప్పుడే సుఖమయిన నిద్ర.

      స్పందనకు ధన్యవాదాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s