తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (4)

పలుకుబడి అంటే పలికే తీరు.  ఇందులో ‘బడి’ అనేది ప్రత్యయం. ఇలాంటిదే ‘రాబడి’, వచ్చే తీరు అని అర్ధం.  కానీ జన వ్యవహారంలో ‘రాబడి’ అంటేనే ‘ఆదాయం’ అన్న అర్ధం స్థిరపడిపోయింది. ‘ఈ వ్యాపారంలో రాబడి బాగా ఉంటుందా?’ అంటే ఆదాయం వచ్చే తీరు బాగానే ఉంటుందా అని అర్ధం.

‘అరికం’ ఒక ప్రత్యయం. లక్షణాన్ని తెలుపుతుంది. పేదరికం, పెద్దరికం, చుట్టరికం, ఇల్లరికం, రాచరికం ఇత్యాదిగ. ‘అరి’ అనేది అచ్చ తెలుగు పదం. లక్షణాన్ని తెలుపుతుంది. నేర్పరి, పొడగరి, సిగ్గరి  ఇత్యాదిగా. దీనికి పొడిగింపే ‘అరికం’.

‘అమ్మా! మాదా కబళం తల్లీ!’ ఇందులో మాదా కబళం అనే మాట ‘మాధవ కబళం’. కృష్ణార్పణం తో సరిసమానమైనదిగా భావించబడాలని అర్ధం.

చదువులు, మాటలు కట్టిపెట్టి అంటే ఇక ‘చదివేది లేదా మాట్లాడుకునేదీ ప్రస్తుతానికి ఆపి’ అనే అర్ధంలో ఇప్పుడుంది. ఇందులో ‘కట్టిపెట్టడం’ అనే మాట చరిత్ర చాలా వెనకకు పోతుంది.  అంటే, పుస్తకాలు తాళపత్ర గ్రంథాల రూపంలో ఉండిన కాలందాకా నన్నమాట. తాళపత్ర గ్రంథాన్ని కట్టిపెట్టాలిసిందేగాని పుస్తకం మూసినంత సుళువుగా మూయలేంగదా. మాట మాత్రం వాడుకలో అలా నిలిచిపోయింది.

‘అభ్యంతరం’ అనే మాటకు ‘ఇంటి లోపలి గది’ అని అర్ధం. ‘అభ్యంతరం లేదు’ అనే మాటకు ‘అడ్డుచెప్పటానికి ఏమీ లేదు’ అన్న అర్ధంలో ప్రస్తుతం వాడుకలో ఉంది. అయితే ఈ అర్ధం ఎలా వచ్చిందనేది అర్ధం కావడానికి ఒక సందర్భం ద్వారా చెప్పుకోవాలి. ఒక ఇంటి యజమాని ముందు వసారాలోనో, వరండాలోని కూర్చుని ఉంటాడు. ఇంతలో ఒకతను వచ్చి ‘అయ్యా! తమతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి,’ అన్నాడు. దానికా యింటి యజమాని సమాధానంగా, ‘అట్లాగా! అయితే ఇక్కడ పరవాలేదా, అభ్యంతరం గాని ఉందా?’ అని ప్రశ్నిస్తాడు. ఇక్కడ యింటి యజమాని అర్ధం ‘ఇంటి లోపలి గదిలోనికి వెళ్ళాలిసిన అవసరం ఉందా?’ అని అర్ధం. దానికి ఆ వచ్చిన మనిషి, ‘అబ్బే, అభ్యంతరమేమీ లేదు. ఇక్కడ మాట్లాడుకోవచ్చును,’ అంటాడు. అంటే ‘లోనికి వెళ్ళవలలిసినంత రహస్యమేమీ కాదు’ అని అర్ధం. ఇలా మొదలైంది, పోనుపోనూ ‘అభ్యంతరం’ అన్న మాటకు ‘సమ్మతి తెలుపలేనిది’ అన్న అర్ధం లోక వ్యవహారంలో స్థిరపడిపోయింది.

‘పితలాటకం’ అనే మాట ప్రస్తుతం వాడకంలో ‘తంటా’ అన్న అర్ధంలో ఉంది. ‘ఇతగాడితో పెద్ద పితలాటకం’ అంటే, ‘ఇతనితో వ్యవహారం ఏమంత మంచిదికాడు, ఇతను తంటాలు తెచ్చిపెట్టే మనిషి ‘ అని అర్ధం. ఈ మాట ‘పిత్తళిహాటకం’ అన్న మాటకు అపభ్రంశమని చెబుతారు. అంటే ‘ఇత్తడిని బంగారం లాగా చేసే మనిషి ‘ అని అర్ధం. నిందార్ధంలో ‘ఇత్తడిని బంగారంగా చూపించే మనిషి’ అని. నిందార్ధం జనవ్యవహారంలో స్థిరపడిపోయింది.

ప్రకటనలు

3 thoughts on “తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (4)

  • వెంకటరావుగారికి నమస్కారాలు.
   మీ కృషి బాగుంది.
   ఒక చిన్న సవరణ.
   1. రాబడి అనే పదానికి ఆదాయం అనే అర్థం. ఆదాయం, ఆయతి, ఆయము, వచ్చుబడి మొదలైనవి
   పర్యాయపదాలు. అన్నింటికీ ఆదాయం అనే అర్థం.
   2. పేదరికం ఇలాంటి పదాల్లో వచ్చే ప్రత్యయం ’అరికం’ కాదు.
   ’ఱిక’ అనే ప్రత్యయం వస్తుంది. అప్పుడు ’ పేదఱిక ’ అవుతుంది. తరువాత ’ ము ’ విభక్తి చేరి పేదఱికము
   అవుతుంది.
   దీనికి ప్రమాణం. ” చిన్నాదులకు ఱికవర్ణకం బగు.”
   చిన్నఱికము – కన్నెఱికము. చిన్న – కన్నె – చుట్టము – దొంగ – పేద – మిం… – లం….-
   ఇత్యాదులు చిన్నాదులు. – బాలవ్యాకరణం-తద్ధిత పరిచ్ఛేదము. 3 వ సూత్రము.
   నేడు వ్యవహారంలో ’ ఱ ’ బదులు ’ ర ’ వాడుతున్నారు. ’ ము ’ అనుస్వారంగా మారింది.
   3. సిగ్గరి లాంటి పదాల్లో వచ్చే ’ అరి ’ కూడా ప్రత్యయమే.
   4. అభ్యంతరం అంటే అష్టదిఙ్మధ్యం అని అర్థం. అంతరాళం, నట్టనడుము, నడుము, మధ్యము,
   పర్యాయపదాలు.
   మీరు చెప్పిన లోపలిగదిని లోగది అంటారు. దీనికి అపవరకం, ఓవరి, గర్భాగారం, అనే పేళ్లున్నాయి.
   నాకు తెలిసినవి వ్రాశాను. తప్పులున్నచో తెలియజేయగలరు.

   నమస్కారాలతో,

   నాగస్వరం.

   • నాగస్వరంగారికి, నమస్కారములు.
    మీ స్పందనకు ధన్యవాదాలు!
    మీరు సూచించిన సవరణల గురించి —
    ఈ విషయాల మీద బ్లాగులో రాసేటప్పుడు సాధ్యమయినంత సాధారణ భాషలో, ఇంకా సాధ్యమైనంత క్లుప్తంగా రాయడమన్నది నేను పెట్టుకున్న నియమం. academic పదజాలం వాడడమన్నది ఇక్కడ చెయ్యలేమేమోనని నాకనిపిస్తుంది. వ్యాకరణ విషయాలను చర్చించడం కంటే ఇక్కడ వ్యుత్పత్తి, ఒక పదానికి ఇప్పుడున్న అర్ధం, పూర్వం ఉండిన అర్ధం, వీటిల్లో ఆసక్తికరంగా ఉండే అంశాలను చెప్పడం ప్రస్తుతం నేను చేస్తున్న పని. వీటికి నా source, నేను అప్పుడప్పుడూ పుస్తకాల్లోనూ, మాగజైన్లలోనూ, చదువుతూన్నప్పుడు చేసుకున్న notes. రాబడి అంటే ఆదాయం అన్న అర్ధం ఉంది. రాబడి, వచ్చుబడి పర్యాయపదాలు నిజమే. కానీ వచ్చుబడి ఇప్పుడు వాడకంలోనే లేదు. ఎప్పుడైనా ఉండినదేమో తెలీదు. వచ్చుబడే రాబడి అయిందని నేను అనుకుంటాను. అరి, రికము – ఈ రెండూ ప్రత్యయాలే, రెండూ లక్షణాన్ని (qualification నీ, లేదా possession నీ) తెలిపేవే, రెండిటితోనూ రెండురకాలుగా పదాలు ఏర్పడుతున్నాయి. అభ్యంతరం గురించి స్వర్గీయ గిడుగువారి వ్యాసాల్లో చదివింది జ్ఞాపకానికి తెచ్చుకుని వ్రాశాను. వ్యాకరణపరంగా మీరిచ్చిన వివరణలన్నీ తప్పుల్లేనివే. ఇకముందు వ్రాసే వాటిల్లో వ్యాకరణ అంశాలకు భంగం వాటిల్లుతున్నట్లుగా కనపడని విధంగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.
    నమస్కారాలతో,
    వెంకటరావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s