తెలుగు సాహిత్యంలో ‘శతక’ చిత్రాలు (1)

‘బద్దెన’ అనే నామాంతరం గలిగిన భద్ర భూపతి కూర్చిన ‘సుమతీ శతకం’ తో తెలుగులో శతకాల రచన ఒక నూతన ప్రక్రియగా ప్రారంభమైందనే సంగతి అందరికీ తెలిసిందే. సరళమైన భాషతో, సుబోధకంగా ఉంటూ పిల్లలూ పెద్దలూ అనే తేడా లేకుండా సర్వజనాళికీ అర్ధమయే విధంగానూ, ఉపయోగపడే విధంగానూ బద్దెన ‘నీతిసార ముక్తావళి’ అని ఆంధ్రదేశానికి మొత్తానికీ స్థిరపరిచితమైన ‘సుమతీ శతకా’న్ని రచించాడు.

ఏ పద్యానికి ఆ పద్యంగా ఉంటూ, ఒక పద్యం తీసివేసినా, ఒక పద్యం కలిపినా మొత్తం గ్రంథానికి ఏమీ ఇబ్బంది కలగకుండా ఉండడం అనేది శతక కావ్యాల విశిష్ఠ లక్షణం. కథాకావ్యాలకు కావాల్సిన బృహత్ప్రణాళిక శతకాల రచనలో అవసరంలేదు. ఛందోబధ్ధంగా కవిత్వం చెప్పగలిగిఉండి, బృహత్ప్రణాళికతో కూడుకున్నదైన కథాకావ్య రచన చేయగలిగే తాహతు లేనివారు కూడ శతకరచనలో ఒక చెయ్యి వెయ్యడంతో, తెలుగులో శతకాల రచన ముమ్మరంగా సాగింది. సంఖ్య పెరగడంతో, బద్దెన ఉద్దేశ్యించిన సరళత పోయి సంక్లిష్టత పెరిగింది. ఇది ఎంతదాకా వెళ్ళిందనడానికి ఉదాహరణగా కూచిమంచి తిమ్మకవి రచించిన శ్రీభర్గ శతకంలోని ఈ పద్యం చూస్తే తెలుస్తుంది:

“కోటీరాంగద మేఖలాఘనతులా కోటీకవాటీ నట
ద్ఘోటీ హాటకపేటికా భటవధూకోటీ నటాందోళికా
వీటీ నాటక చేటికాంబరతతుల్ వే చేకుఱు నిన్నిరా
ఘాటప్రౌఢి భజించు ధన్యులకు భర్గా! పార్వతీవల్లభా!”

తిమ్మకవిగారి సోదరుడైన కూచిమంచి జగ్గకవి గారి భక్తమందార శతకంలో ఇదే వరస పద్యం తనవంతుగా ఆయన చేకూర్చినది:

“ధాటీపాటవ చాటు కావ్యరచనోద్యధ్ధోరణీ సారణీ
వాటికోద్గతి సత్కవీశ్వరుడు నిత్యంబుం దమున్ వేడగా
వీటీఘోటక హాటకాదు లిడ రుర్విన్ నిర్దయాబుధ్ధిచే
మాటే బంగరు నేటి రాజులకు రామా! భక్తమందారమా!”

బద్దెన తన ‘సుమతీ శతకం’ లో తెలుగులో నీతి పద్యాలన దగిన వాటికి ‘మాదిరి’ (model)  పద్యాలను తయారుచేసిపెట్టి వెళ్ళాడు. తెలుగులో నీతిపద్యాలకు ‘మాదిరి’  పద్యంగా చెప్పుకోదగ్గ ప్రసిధ్ధమైన పద్యాలలో ఒక ‘మాదిరి’ పద్యం ‘తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు’ అనేది. ఈ ‘వచ్చు’ తరహా మాదిరి పద్యం చిలువలుపలువలుగా పెరిగి ఏస్థాయికి వెళ్ళిందో ‘మదనగోపాల శతకం’ లోని ఈ క్రింది పద్యపాదాల వలన తెలుసుకోవచ్చు:

“తలక్రిందుగాను వేదము జెప్పగా వచ్చు
బహు మంత్ర సిధ్ధులు బడయ వచ్చు
సకల శాస్త్రములు ప్రసంగింపగా వచ్చు
తీర్థయాత్రాసక్తి దిరుగ వచ్చు
సతతోపవాస నిష్ఠలు గాంచగా వచ్చు
సర్వపురాణముల్ చదవ వచ్చు
నృత్త గీతాదులన్నియు నేర్వగావచ్చు
నఖిల గారుడ విద్య లాడవచ్చు…”         (కాని దారిద్ర్య బాధ ఒక్కటీ భరించలేం అని)

“క్షితినాధు చేత తాజీము చెందగ వచ్చు
బుధులచే మన్నన బొంద వచ్చు
జనులలో బహుయోగ్యుడనిపించుకొన వచ్చు
బుధులలోపల గొప్ప బొంద వచ్చు
జ్ఞాతులచే మహాస్తవము జెందగ వచ్చు
కులములో బెద్దయై మెలగ వచ్చు
పరులచే పాదముల్ పట్టించు కొన వచ్చు
వీరులలో ఖ్యాతి వెలయ వచ్చు…”                   (కాస్త డబ్బుంటే చాలు ఇవన్ని జరిగిపోతాయి అని)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s