తెలుగు సాహిత్యంలో ‘శతక’ చిత్రాలు (2)

మచ్చునకు మరో రెండు ‘వచ్చు’ పద్యాలు:

తిమ్మకవి శ్రీ భర్గ శతకం నుండి:

“రాలన్ తైలము తీయవచ్చు (ఇసుకనుంచి తైలము తీయవచ్చు అని ‘సుభాషితం’)
భుజగ వ్రాతమ్ములన్ బేర్లుగా లీలన్ బూనగ వచ్చు
అంబునిధి హాళిం దాటగా వచ్చు
డాకేలన్ బెబ్బులి బట్టవచ్చు
విపినాగ్ని న్నిల్పగా వచ్చు”  (మూర్ఖునికి తెలిసేలా చెప్పడం సాధ్యం కాదు అని)

పోలిపెద్ది వెంకటరాయకవి గారి వేణుగోపాల శతకం నుండి:

“కందిరీగల పట్టు కడగి రేపగవచ్చు
    (మానిపింపగరాదు దాని పోటు)
చెట్లలో బెబ్బులి జెనకి రావచ్చును
     (తప్పించుకొనరాదు దాని కాటు)
పఱచునశ్వము తోకబట్టి యీడ్వగవచ్చు
     (తప్పించుకోరాదు దాని తాపు)
కాకచే బొరుగిల్లు కాల్చి రావచ్చును
     (తన యిల్లు కాపాడ తరము గాదు)”
(ముందూవెనుకా చూసుకోకుండా చేసే పనులకు వాటివాటి ఫలితాలను తప్పక అనుభవించాలిసొస్తుందని)

శతక సాహిత్యంలో ‘అధిక్షేపం’ అనే ఒక ప్రత్యేక శాఖ విడిగా ఏర్పడి అందులో రచనలు మొదలైన తరువాత, ఈ ‘వచ్చు’ తరహా మూస పద్యం నుంచి వింతవింత పోకడలతో పద్యాలు వెలువడినై. చిత్ర విచిత్రాలయిన రీతుల్లో కవులు తమ పద్యాల్లో ఈ ‘వచ్చు’ అనే మాటకు బదులు, ‘అట్లు’, ‘అగునా’, ‘ఏల?’, ‘రోత’, ‘వృధా’ ఇత్యాది పదాలుంచి పద్యాలు చెప్పారు. ఇలా చెప్పిన పద్యాల్లో చాలామటుకు విషయం పాతదే, వస్త్రం మాత్రమే కొత్తది అనిపిస్తుంది కొన్ని చోట్లన్నా.

మొదటగా, కొన్ని ‘అట్లు’ పద్యాలు:

“జన్నిరోగికి బఱ్ఱెజున్ను వేసినయట్లు
పిల్లినెత్తిన వెన్న బెట్టినట్లు
కుక్కపోతుకు నెయ్యికూడు వేసినయట్లు
చెడ్డజాతికి విద్య చెప్పినట్లు
సాతాని నుదుట విభూతి రాసినయట్లు
గూబ దృష్టికి దివ్వె గూడినట్లు
ధన పిశాచికి సుదర్శనము గంపడినట్లు
చలిచీమలకు మ్రుగ్గు చల్లినట్లు
సురభి బదినక పాముకు జూపినట్లు”          (దుష్టునకు నీతి ఇలా వెగటుగా తోస్తుంది అని)

“పూబొదలో దాగియున్న పులియున్న రీతిని
మొగిలిరేకుల ముండ్లు మొలిచి నట్లు
నందవనములో నాగుబామున్నట్లు
చందురునకు నల్పు చెంది నట్లు
సొగసుకత్తెకు జడ్డ తెగులు కల్గిన యట్లు
మృగనాభిలో బుప్పి తగిలి నట్లు
జలధిలో బెద్దక్క సంభవం బైనట్లు
కమలాప్తునకు శని గల్గినట్లు
పద్మరాగమునకు బటల మేర్పడినట్లు
బుగ్గవాకిట జెట్టు పుట్టినట్లు”                   (ధర్మవిదులైన రాజుల ఆస్థానాలలో ఇలాగే దుష్టుడు చేరుతాడు అని)

‘అగునా?’, ‘అగునే?’ అంటూ సాగే ‘ప్రశ్నల’ పద్యాలు:

“గాజుం బూస యనర్ఘ రత్న మగునా?
కాకంబు రాయంచ యౌనా?
జోరీగ మధువతేంద్రమగునా?
నట్టెన్ము పంచాస్య మౌనా?
జిల్లేడు సురావనీజ మగునా?
నానా దిగంతంబులన్ రాజౌనా ఘనలోభి దుర్జనుడు?”

“ఎన్నన్ గార్ధభ ముత్తమాశ్వమగునే?
హీనుండు దాతృత్వ సంపన్నుండౌనె?
ఖలుండు పుణ్యుడగునే?
పల్గాకి సాధౌనె?
కల్జున్నౌనే? (కల్లు జున్నౌనే?)
మహిషంబ హస్తి యగునే?
జోరీగ తేటౌనెటుల్?
మన్నుంబిల్లి మృగేంద్రమౌనె?”               (కావాలని ప్రయత్నించినా కాలేవు అని)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s