తెలుగు సాహిత్యంలో ‘శతక’ చిత్రాలు (4)

తెలుగులో శతక సాహిత్య ప్రక్రియకు, నీతి శతకానికి బద్దెన సుమతీ శతకం ఆదీ, అంతం రెండూను. బద్దెన క్రీ.శ.1260 ప్రాంతం వాడని పరిశోధకుల అభిప్రాయం. సుమతీ శతకంలోని వంద పద్యాలలో స్థూలంగా మూడు విభాగలలో అమరదగ్గ పద్యాలు కనిపిస్తాయి. మొదటి విభాగం నీతి బోధకాలనదగినవి, రెండవ విభాగంలో లోకవ్యవహారంలోని సంగతులను వివరించేవి, మూడవ విభాగంలో అధిక్షేపాలనదగినవి.  ‘అక్కరకు రాని చుట్టము’, ‘అప్పిచ్చువాడు, వైద్యుడు’, ‘తన కోపమె తన శత్రువు’ లాంటి 42 నీతిబోధకాలైన పద్యాలు, ‘ఎప్పటి కెయ్యెది ప్రస్తుత’, ‘ఓడలు బండ్లన వచ్చును’, ‘కమలములు నీట బాసిన’ లాంటి 47 లోకవ్యవహారంలోని విషయాలను వివరించే పద్యాలు, ‘అడిగిన జీతంబియ్యని’, ‘అధరము కదిలియు కదలక’, ‘ఆకలి యుడుగని కడుపును’ లాంటి 11 అధిక్షేప పద్యాలు కలిపి మొత్తం వంద లభ్యమౌతున్న సుమతీ శతక పద్యాలలో బద్దెన తడమని పార్శ్వం లేదంటే అతిశయోక్తి కాబోదు. నీతి శతకాలను రచించిన తరువాతి కవులు బద్దెన చెప్పిన విషయాలనే ఇంకా సాగదీసి, విస్త్రుతంగా ఉద్దహరణలిచ్చి చెప్పడం తప్ప వారు కొత్తగా చెప్పింది లేదు, చేర్చింది లేదు అనిపిస్తుంది.  ఉదాహరణకు సుమతీ శతకంలోని  ‘ఆకలి యుడుగని కడుపును’ అనే పద్యంలో కొన్ని ‘రోత’ పుట్టించే విషయాలను చెప్పాడు బద్దెన. బద్దెన ఈ పద్యానికి పొడిగింపుగా అనిపించే  వేణుగోపాల శతకం లోని ఈ పద్యాలలో ఎన్నెన్ని ‘రోత’ లను ఊహించి పెట్టారో చూడవచ్చు:

“పసచెడి అత్తింటబడి యుండు టది రోత
పరువు దప్పినయెడ బ్రతుకు రోత
ఋణపడి సుఖమున మునిగియుండుట రోత
పరులకల్మికి దుఃఖపడుట రోత
తన కులాచారము తప్పి నడువ రోత
ధరణీశునకు బిర్కితనము రోత
పిలువని పెత్తనంబునకు బోవుట రోత
యల్పుతో సరసంబు లాడ రోత
ఒకరి యాలిని గని వగనొంద రోత
సతికి జార పురుషుని బ్రతుకు రోత”

“పాలన లేని భూపతిని గొల్చుట రోత
యౌదార్యహీనుని నడుగ రోత
కులహీనజనులతో గలహించుటయు రోత
గుణహీనకామిని కూడ రోత
పాషండ జనులపై భ్రాంతి నొందుట రోత
మధ్యపాయులతోడ మైత్రి రోత
తుఛ్ఛంపు బనులకు నిచ్చనొందుట రోత
చెలగి సద్గురు నింద సేయ రోత
వేదబాహ్యుల విద్యలు వినుట రోత
క్రూరుడైనట్టి హరిభక్తు గూడ రోత”

సుమతీ శతకంలోని ‘పురికిని ప్రాణము కోమటి’, ‘మాటకు ప్రాణము పద్యము’ , ఇత్యాది పద్యాలలో దేనికి ఏది శోభ ఇస్తుందో చెప్పాడు బద్దెన. ఈ పద్యాల వరసలోనివే కవి చౌడప్ప ‘పస’ పద్యాలు, మొత్తం ఎనిమిది ఉన్నాయి కవి చౌడప్ప శతకంలో.

“వానలు పస పైరులకును;
సానలు పస వజ్రములకు; సమరంబులకున్
సేనలు పస; మృగజాతికి
గానలు పస: కుందవరపు కవి చౌడప్పా!”

“మీసము పస మగమూతికి;
వాసము పస యిండ్లకెల్ల; వనితలకెల్లన్
వేసము పస; బంట్రౌతుకు
గాసము పస; కుందవరపు కవి చౌడప్పా!”

ఆ ఎనిమిది పద్యాలలో ఇక్కడ పూర్తిగా ఉదాహరించగల పద్యాలు ఈ రెండు పద్యాలు మాత్రమే!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s