తెలుగు సాహిత్యంలో ‘శతక’ చిత్రాలు (5)

తెలుగు పద్యసాహిత్యంలో నీతిని చెప్పడం, నీతిని గురించి చెప్పడం అన్నది ఒక strain-full exercise గా, ఒక మానసిక వ్యాయామక్రియగా మారిపోయి కనిపిస్తుంది అధిక్షేప శతక పద్యాలలో. ‘ఒకింత బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో’ అని చెప్పిన కవిచౌడప్ప నీతిని చెప్పడానికి కూడ అదే పధ్ధతిని పాటించి నీతిపద్యాన్నించి కూడా నవ్వుపుట్టించే ప్రయత్నం చేశాడు. ఫలితంగా, ఇప్పుడు కవిచౌడప్ప శతకాన్ని గురించి తెలిసిన వాళ్ళందరూ ఆ శతకంలోని పద్యాలు బాగుంటాయనే అన్నా, ఆ ‘బాగు’ అన్న మాటకు అర్ధం మాత్రం ‘చాలా హాస్యాస్ఫోరకంగా,
నవ్వుపుట్టించేవిగా’ ఉంటాయనే అర్ధంగాని మరోటి కాదు.

ఆ కాలంలో తెలుగులో ఛందోబధ్ధంగా పద్యం రాయగలిగి, కవి అనిపించుకున్న ప్రతి ఒక్కనికీ ఒక ‘కుకవి’ అనే వాడుండేవాడన్న సంగతి తెలుసుకోవడానికి ఎక్కువ శ్రమపడవలసిన అవసరంలేదు. ఆ కాలంలోని తెలుగు కవుల దృష్టిలో ఈ ‘కుకవి’ అనేవాడు ఒక phantom figure లాంటివాడు, ఒక anti hero, ఒక  ‘imaginary demon’, ఊహాకల్పిత దుష్టుడూ అని తెలుగు పద్యసాహిత్యంతో ఒకింత పరిచయం ఉన్న ఎవరికైనా తేలికగానే అర్ధమౌతుంది. వీడికి సైదోడు లాంటివాడు ‘దుష్ట రాజు’. ఈ ‘దుష్ట రాజు’ కవులను ఏమాత్రం ఆదరించి పోషించడానికి ఉత్సుకత చూపని వాడు, ఇఛ్ఛలేని వాడు. ‘రాజుల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు’ అని పోతనగారు కూడ రాజులందరినీ ఈ గాటి కిందే కట్టేసాడు. అయినప్పటికీ పోతన చెప్పినదానికి మనం ఒప్పుకుని తీరాలి అనిపిస్తుంది. ఎందుకంటే, పోతన బ్రతుకు తెరువుకోసం రాజులమీద ఆధారపడకుండా, గౌరవంగా పొలం దున్నుకుని బ్రతికాడు కాబట్టి. ఆ కారణంగానే ఆయన మాటలకు గౌరవం ఇచ్చి తీరాలి. అదే కాలంలోనే,
బ్రతుకు తెరువుకోసం, కొంచెం రాజసంగానయినా, రాజుల వంక చూసినవాడు శ్రీనాధుడు. దాని ఫలితమే ఆయన చివరి రొజులలో అన్ని కష్టాలు పడాలిసివచ్చింది అనిపిస్తుంది. ఊహాకల్పిత దుష్టులయిన ఈ ‘కుకవి’, ‘దుష్ట రాజు’ అనే ఇద్దరినీ శతక కవులలో చాలా మంది చాల విరివిగానూ, నిస్సంకోచంగానూ, నిర్భయంగానూ తిట్టారు. ఈ తిట్టు పద్యాలకు కూడా సుమతి శతక కారుడే మొదటగా దారి చూపించాడు. సుమతీ శతకంలోని ‘అడిగిన జీతం బియ్యని’, ‘రా పొమ్మని పిలువని యా భూపాలుని’ పద్యాలు దీనికి నిదర్శనాలయితే, ఆ పద్యాల బాణిలోనే సాగే
పద్యాలు శ్రీ భర్గ శతకం నుండి, భక్తమందార శతకం నుండి:

“కవి విద్వ ధ్ధరణీ సుధాశన వరుల్ కార్యార్థులై యొద్దడా
సివడిం జేతులు దోయిలించుకొని యాశీర్వాదముల్సేయ నె
క్కువ దర్పంబున నట్టితుం బొరలకే కొర్మ్రింగి నట్లుండ్రుగా
రవళి దుర్నృపులేమి యీగలరొ భర్గా! పార్వతీ వల్లభా!”

“గడియల్ రెండిక సైచిరా వెనకరా కాసింత సేపుండిరా
విడిదింటం గడె సేద దీర్చుకొనిరా వేగంబె బోసేసిరా
యెడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్ హీనప్రభుం డీగతిన్
మడతల్వల్కుచు ద్రిప్పుగాసిడక! రామా! భక్తమందారమా!”

దుష్కవులను గురించిన పద్యాలు శ్రీ భర్గ శతకంలోనివి:

“భువిలో మేదరసెట్టి చివ్వ తడకల్ పొంకంబుగా నల్లి పె
న్రవళిన్ సంతల నెల్ల ద్రిప్పుక్రియ దైన్యం బెచ్చగా దుష్కవుల్
తివుటొప్పం జెడు కబ్బపుం దడక లోలిం ద్రిప్పగా నద్దిరా!
కవితల్ కాసుకు గంపెడయ్యెగద భర్గా! పార్వతీ వల్లభా!”

“అవివేక క్షితినాయకాధమ సభా భ్యాస ప్రదేశంబులన్
బవళు ల్రేలును జుట్టబెట్టుకొని దుష్పాండిత్యము ల్చూపుచుం
గవి ముఖ్యుం బొడగాంచి జాఱుదురు వేగం; బుండ విల్గన్నకా
కవులట్లే నిలబోక కా కవులు భర్గా! పార్వతీ వల్లభా!”

ప్రకటనలు

One thought on “తెలుగు సాహిత్యంలో ‘శతక’ చిత్రాలు (5)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s