చిరస్మరణీయులు: మహనీయులు మానవల్లి రామకృష్ణకవిగారు (2)

తాళపత్రాలపై ఉన్న ఒక కావ్యాన్ని కాగితపు పుస్తకాలలోకి ఎక్కించడానికి రెండు విషయాలలో  ప్రతిభ అవసరం. మొదటగా తాళ పత్రం పై ఉన్న కొన్ని వందల సంవత్సరాల క్రితపు వ్రాతను చదవడానికి సంభందించిన ప్రజ్ఞ అవసరం. రెండవది, లేఖన దోషాలను గుర్తించగలగడమే కాకుండా, అవసరమయినచోటల వ్రాయసగాండ్ల లేఖన దోషాలను గుర్తించి పాఠాన్ని సరిదిద్దగల భాషా పరిజ్ఞానం చాలా అవసరం. ఈ రెంటిలోనూ పరిజ్ఞానం పుష్కలంగా ఉండిన మహనీయులు మానవల్లి కవిగారు.

నన్నె చోడుని ‘కుమార సంభవం’ కావ్యం ప్రథమ భాగం ప్రచురింపబడి తెలుగు సాహితీలోకంలో ఒక సంచలనం రేపింది.  దీనికి కారణం ‘కుమార సంభవం’ కావ్యానికి సమకూర్చిన పీఠికలో కవిగారు నన్నె చోడదేవుని క్రీ.శ.950 ప్రాంతం వానిగా చెప్పడం. ఈ కాల నిర్ణయం నన్నె చోడుని నన్నయ కంటే ముందువానిగా చేయడమే కాకుండా, ‘కుమార సంభవా’న్ని తెలుగులో తొలి కావ్యాన్ని చేసి, నన్నయ ఆంధ్ర మహాభారతాన్ని వెనుకకు నెట్టింది. నన్నయను ఆదికవిగా ఆరాధుస్తూ వస్తూన్న తెలుగు పండితలోకం, కవిగారి ఈ కాల నిర్ణయాన్ని హర్షించలేకపోవడమే కాకుండా, విపరీతమైన స్థాయిలో విమర్శనాస్త్రాలను ప్రయోగించింది. చివరికి ఒక దశలో ఈ విమర్శ ఏ స్థాయిదాకా వెళ్ళిందంటే, కవిగారే పాత కావ్యాల తరహాలో రచనచేసి పేరుకోసం అలా చేశారనేంత దాకానూ వెళ్ళిందని చెబుతారు. అయితే, అసంకల్పితంగా దీనివలన అవగతమైన విషయం ఒకటుంది. అది –  పూర్వ ప్రసిధ్ధ కవుల పంధాలో కావ్యరచన చేయగలిగినంతటి సమర్థత ఆ రోజులలో కవిగారికి ఉండేదనిన్నీ, పూనుకోవాలేగాని, వారు అంతటి సమర్థులనిన్నీ! వారి పాండిత్యం మీద ఎవ్వరికీ ఏవిధమైన సందేహాలూ లేవు. హిందూదేశంలోని అతిగొప్ప సంస్కృత పండితులు ఆరుగురిలోనూ ఒకరిగా ఆయన పేరుపొందినవారు. అప్పటిలో బరోడా ప్రభుత్వంవారు ఆయనచేత భరతముని సంస్కృతంలో రచించిన నాట్యశాస్త్రానికి వ్యాఖ్య రాయించి ప్రకటించేరనీ చెబుతారు.

కవిగారు తెలుగులో తమ ‘విస్మృతకవులు’ లో భాగంగా ప్రకటించిన రెండవ గ్రంథం వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామం’. ఇది వల్లయభరాయనిచే రచించబడలేదనీ, శ్రీనాథుడే దీనిని రచించి ఏకారణం చేతనో వల్లభరాయని పేరు పెట్టాడనీ, నిజానికి ఈ కావ్యం శ్రీనాథకృతంగా పిలవబడాలనీ చెప్పి నమ్మించడానికి తరువాతి కాలంలో పూజ్యులు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఎంతగానో ప్రయత్నించారుగాని, ఈనాటికీ ఇది వినుకొండవల్లభరాయ కృతంగానే ప్రసిధ్ధం. అలాగే, చిమ్మపూడి అమరేశ్వరుడని ఒక ప్రసిధ్ధ పూర్వ కవీచే రచించబడిన ‘విక్రమసేనము’ అనే గ్రంథపు తాటాకు ప్రతిని కవిగారు సంపాదించి దానికి సాఫు ప్రతిని తయారుచేయడానికి ఒక పండితునికి ఈయగా, సదరు పండితుడు ఆ పుస్తకపు తాటాకు ప్రతితో అయిపు లేకుండాపోయాడనీ కూడా చెబుతారు. ఈ విషయాన్ని వారు పండితలోకానికి తెలియజేయగా, నమ్మినవాళ్ళు నమ్మారు, లేనివాళ్ళు లేదని కూడా చెబుతారు! ఇంచుమించు ఒక వ్యసనంగా కవిగారు చేసిన ఈ విస్మృతకవులను వెలుగులోకి తీసుకురావడం అనే ‘వ్యాపారం’ లో ఆయన  ఎంతో డబ్బు సంపాదించుకుంటున్నారన్న తప్పుడు అభిప్రాయం కలిగినవాళ్ళకు ఇందులోని సాధకబాధకాలు అర్థమవాలన్న ఉద్దేశ్యంతో నన్నట్లుగా ఒకానొక సందర్భంలో ఆయన చెప్పిన ‘విజ్ఞప్తి’  మాటలు – “క్రీ.శ.1914 సం.నకు అనగా నేను క్రీ.శ.1908లో ఈ గ్రంథ ప్రథమ భాగము ముద్రించిన నాటినుందడి “యాఱు” ప్రతులు మాత్రమే చెల్లినవి” (అంటే అమ్ముడుబోయాయి అని). ఈ మాటలు  తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాల ప్రచురణ రంగంలో ఆనాటి పరిస్థితి ఎలావుండేదో తెలియజెప్పడానికి కూడా బాగా ఉపయోగపడతాయి.  తెలుగు సంప్రదాయ సాహిత్యంపై ఈనాడు శ్రధ్ధ తగ్గిందనీ, ఆనాళ్ళలో తెలుగులో ఏదైనా కొత్తది  పద్య సాహిత్యం ప్రచురణ పొంది లభ్యమవడం మొదలైందే తడవుగా తండోపతండాలుగా పండితులు ఆ పుస్తకాలను కొని చదివేసేవారనీ అనుకొనేవాళ్ళకు, చెప్పేవాళ్ళకు కవిగారి ఈ మాటలు ఒక కనువిప్పు.

క్రీ.శ.1972 లో గౌరవనీయులు నిడదవోలు వేంకటరావు మరియు పోణంగి శ్రీరామ అప్పారావు గారల సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు “మానవల్లి కవి – రచనలు” అనే పుస్తకాన్ని ప్రచురించారు. కవిగారిని గురించిన చాలా సమాచారం ఇందులో దొరుకుతుంది. ఇది కాకుండా, సాహిత్య లోకంలో ప్రసిధ్ధులైన తలావఝ్ఝుల శివశంకర శాస్త్రి, పంచాఙ్నుల ఆదినారాయణ శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ లాంటి వారలు తెలుగు సాహిత్యం పై చేసిన రచనలలో కవిగారి గురించిన సంగతులు ప్రస్తావ వశాన వచ్చినవి ఎన్నో తెలుస్తాయి.

మాన్యులు టేకుమళ్ళ కామేశ్వరరావు గారు తమ “నా వాఙ్మయ మిత్రులు” లో కవిగారిని గురించిన వ్యాసంలోని ముగింపు వాక్యాలు – “పగడపు పురుగులు మహాసముద్రంలో చుట్టు గోడలను కట్టుకొంటాయి.  అవి మానవులకు దీవులవుతాయి. అట్లే మానవులలో మేధావులు తమ లాభంకోసం పొగడ్తల కోసంగాక నైసర్గికంగా పనిచేసుకొని పోతారు. దానివల్ల జాతికి మాత్రమే శాశ్వత ప్రయోజనం”. కవిగారి విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు.

ఆయన నిరాడంబ జీవనం, అకుంఠిత దీక్షతో తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన నిస్స్వార్ధ సేవ, ఆయన పాండిత్య ప్రతిభ – ఇవి ఆయనను నాకు ప్రాతఃస్మరణీయులలో మొదటివానినిగా చేశాయి.

ప్రకటనలు

2 thoughts on “చిరస్మరణీయులు: మహనీయులు మానవల్లి రామకృష్ణకవిగారు (2)

  1. నాట్యశాస్త్రం కవి గారి పరిష్కరణ చాలా ప్రాముఖ్యమైనది కదండి. అలాగే దిగ్నాగాచార్యుని కుందమాల నాటకమూనూ. (కుందమాల నా వద్ద ఉంది, అయితే మానవల్లి వారి ప్రస్తావన అందులో లేదు). ఇంకా చతుర్భాణి కూడా కవి గారు పరిష్కరించారనుకుంటాను.

    • తెలుగు రచనల గురించి మాత్రమే నా వ్యాసంలో ప్రస్తావించాను. సంస్కృత రచనల జోలికి వెళ్ళలేదు. భరతుని నాట్య శాస్త్రం మానవల్లివారి పరిష్కరణలో వెలువడిందే! కుందమాల, చతుర్భాణి, తాపస వత్సరాజము, వత్సరాజ చరిత నాటకం…ఇవన్నీ కవిగారిచే పరిష్కరింపబడి, ప్రకటింపబడినవే! (పే.73 ‘మానవల్లికవి – రచనలు’ : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ – 1972).

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s