తెలుగు కావ్యాలు – కుమారసంభవం (1)

నన్నెచోడదేవుని ‘కుమార సంభవం’ (1)

తెలుగు భాషలోని కావ్యాలలో నన్నె చోడదేవుని ‘కుమార సంభవా’ నిది ఒక విశిష్టమైన స్థానం. తంజావూర్ సరస్వతీమహలు గ్రంథాలయంనుంచి ఈ కావ్యాన్ని ఉధ్ధరించి క్రీ.శ.1908వ సంవత్సరంలో తమ స్వంత ప్రచురణగా స్వర్గీయ మానవల్లి రామకృష్ణకవిగారు ప్రచురించిన తరువాత,  తెలుగు సాహితీ లోకంలో ఈ కావ్యం రేపినంత దుమారం మరే కావ్యామూ రేపలేకపోయిందనడంలో అతిశయోక్తి లేదన్నది సాహితీవేత్తలందరూ ఎరిగినదే. కావ్యం లోపలి విషయం కంటె, ఈ కావ్యానికి తాము వ్రాసిన ఉపోద్ఘాతంలో ఈ కావ్యకర్తయైన నన్నెచొడదేవుడు క్రీ.శ.940 ప్రాంతంవాడనీ, తత్కారణంగా క్రీ.శ.1020-30ల నాటి నన్నయ భట్టారకుని కంటె ముందువాడానీ,  ఆ కారణాన తెలుగు సాహిత్యంలో ఆదికవి బిరిదానికి నిజమైన అర్హుడనీ మానవల్లి
కవిగారు చేసిన నిర్ణయం ఈ కావ్యం రేపిన దుమారానికి ముఖ్య కారణం అనికూడా అందరకూ తెలిసినదే! ఆ తరువాత జరిగిన తర్జనభర్జనలో, పలువురు సాహిత్తివేత్తలు వారికి తోచిన ఆధారాలతో పలురకాలుగా చేసిన నన్నె చోడదేవుని జీవిత కాలనిర్ణయం తరువాతగూడా, నన్నెచోడుని జీవితకాలం ఇది అని ఇదమిధ్ధంగా, స్పష్టంగా చెప్పగలగడానికి తగినటువంటి అధారాలు లేనికారణంగా, చివరికి అందరికీ ఒకింత అంగీకారంగా నన్నెచోడుడు క్రీ.శ.1125-30 ప్రాంతములవాడని తేల్చుకుని సరిపెట్టుకోవలిసి వచ్చిందన్నదీ విదితమే! కనుక, ఇప్పటికి తెలిసినంతవరకు, తెలుగులో కుమారసంభవ కర్తయైన నన్నెచోడుడు క్రీ.శ.12వ శతాబ్దంవాడనీ, నన్నయకు పూర్వుడుకాడనీ, నిజానికి ఒక శతాబ్దం తరువాతివాడనీ అనుకుని ముందుకు వెళ్ళడం చేయవలసిన
పని.

పేరొకటే అయినప్పటికీ, తెలుగు కుమారసంభవంలోని సతీ వృత్తాంతం, గజాననోత్పత్తి, దక్షాధ్వర ధ్వంసం అనే అంశాలను విడిచి పెడితే, రెండింటి కథా ఒకటే అయినప్పటికినీ, నన్నెచొడుని కుమారసంభవం సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచించిన కుమారసంభావానికి అనుకరణగానీ, అనువాదంగానీ కాదని పెద్దల నిర్ణయం. నన్నెచోడుడు మిక్కిలి స్వతంత్రుడైన ఆంధ్ర కవి అనీ, వర్ణనప్రియుడనీ, కుమారసంభవంలో ఈ కవి చేసిన సుదీర్ఘ వర్ణనలన్నీ కూడా స్వకపోలకల్పితాలే అనీ, కాళిదాసు కుమారసంభవంలోని శ్లోకాలలో చాలా తక్కువ వాటికి (వేళ్ళపై లెక్కింపదగినన్ని వాటికి) మాత్రమే తెలుగు కుమారసంభవంలో ఆంధ్రీకరణములనదగినవి కనిపిస్తాయనీ, నిజానికి కాళిదాసు అంతటి కవిచే తలవూయించగలిగిన పద్యాలు కొన్ని తెలుగు కుమారసంభవకావ్యంలో వున్నాయనీ కూడా పెద్దలు చెబుతారు.

తెలుగు కుమారసంభవం పండ్రెండాశ్వాసాల కావ్యం. కొన్నికొన్ని చోటల ఇందులోని వర్ణనలు ఒకింత ప్రౌఢంగా వుండి, పెద్దలు పరిణతబుధ్ధులు మాత్రమే ఆయా తావులలోని అంశాలను చదవడానికి అర్హులనీ, చదివిన దానిని తగిన విధంగా అర్ధంచేసుకోవడానికి అనువైన సమర్ధత కలిగి ఉంటారని అనిపింపజేస్తుంది.

ఒక్కొక్క ఆశ్వాసంలోని కథ బహుసంక్షిప్త రూపంలో —

ఆశ్వాసం (1): దక్షుని  ప్రార్థనను మన్నించి ఆదిశక్తి సతీదేవి అనే పేరుమీద దక్షునికి కూతురుగా జన్మించి, పరమశివుని వివాహమాడడం, వారిరువురికీ గజాననుడు ఆవిర్భవించడం, దక్షుడు తన కూతుళ్ళనందరనూ చూడాలనే ఇఛ్ఛతో వెళ్ళి కశ్యప ప్రభృతులైన తన అల్లుళ్ళచే సన్మానితుడై ఆనందాంతరంగుడవడం.

ఆశ్వాసం (2): అదేవిధంగా దక్షుడు శివుని చూడడానికి వెళ్ళగా శివుడు ఆయనను తక్కిన అల్లుళ్ళవలె సత్కరించకపోవడం, అందులకు ఆయన కోపంచెంది ప్రతిగా శివుని అవమానించ దలచి తాను చేయు యజ్ఞానికి అతనిని ఆహ్వానించక తన కూతురైన సతీదేవికి మాత్రమే ఆహ్వానం పంపడం, తన భర్తయైన శివుని ఆహ్వానింపకపోవడంపై సతీదేవి తండ్రియైన దక్షుని అధిక్షేపించడం, దానికి ప్రతిగా దక్షుడు శివుని నిందించడం, దానికామె పట్టరాని కోపంతో యోగాగ్నియందు ఆత్మాహుతి చేసుకోవడం, గజాననుడు
ప్రమథగణాలతో వెళ్ళి దక్షుని యాగాన్ని ధ్వంసంచేసి, దక్షుని బందీనిగా చెసుకుని పరమేశ్వరుని వద్దకు తీసుకురావడం, ఫరమశివుడు దక్షుని క్షమించి యగఫలాన్ని అనుగ్రహించి అతనిని ప్రజాపతిగా నియమించడం.

ఆశ్వాసం (3): సతీదేవి హిమవంతునికి కుమార్తెగా జన్మించడం, హిమవంతుని దగ్గరకు నారదమహర్షి వచ్చి పార్వతిని చూసి ఆమె పరమేశ్వరునికి భార్య అవుతుందని చెప్పడం, శివుడు తపస్సుచేసుకోవడానికి హిమవత్పర్వతానికి రాగా, హిమవంతుడు ఆయన పరిచర్యకై పార్వతిని నియోగించడం.

ఆశ్వాసం (4): తారకాసురుడనే రాక్షసుడు తమను పెట్టే బాధలకు తట్టుకోలేక దేవతలు బ్రహ్మదేవునితో మొరపెట్టుకోగా, ఆయన పార్వతీ  పరమేశ్వరుల కుమారుడు తారకుని సంహరించగలడని చెప్పడం, పార్వతీ పరమేశ్వరుల సంయోగాన్ని కల్పించడంకోసం ఇంద్రుడు మన్మథుని నియోగించడం, మన్మథుడు సపరివారంగా ఈశ్వరుని తపోవనమునకు వెళ్ళడం, వసంతుడు శివ తపోవనంలో అకాల వసంతోదయాన్ని కల్పించడం.

ఆశ్వాసం (5): వాసంతకుసుమాలంకృతయై తనను సేవించడానికి వచ్చిన పార్వతిని చూసి శివుడు చలించడం, తన మనోవికారానికి కారణం మన్మథుడని తెలుసుకొన్న శివుడు తన మూడవ కంటి అగ్నిచే మన్మథుని భస్మీపటలం చేయడం, పతిని పోగొట్టుకుని రతి విలపించడం, భర్తకై విలపించు రతిని ఆకాశవాణి ఊరడించడం, పార్వతి విరహతాపము చెందడం, చెలికత్తెలు శిశిరోపచారములను చేయడం.

ఆశ్వాసం (6): పార్వతి తండ్రియైన హిమవంతుని అనుమతితో తపోవనానికి వెళ్ళడం, ఆమె ఒక మునిపల్లెను చేరి అక్కడనున్న జంగమ మల్లికార్జునుని వద్ద దీక్ష గైకొని తపోవేషధారిణియై గంగాతీరాన ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఘోర తపస్సును చేయడం, ఒక్కొక్క ఋతువులో పార్వతీదేవి తపోవర్ణనం.

ఆశ్వాసం (7) : శివుడు మారువేషంలో పార్వతి వద్దకు వచ్చి ఆమె తపస్సుకు మెచ్చి ఆమెకు సాక్షాత్కరించడం, శివుడు కన్యావరణార్థం సప్తర్షులను హిమవంతుని వద్దకు పంపించడం.

ఆశ్వాశం (8): అలా వెళ్ళిన సప్తర్షులు వివాహనిశ్చయం చేసుకుని తిరిగి రావడం, శివుడు పెండ్లికొడుకయి బ్రహ్మాదులతో పెళ్ళికి తరలి వెళ్ళడం, హిమవంతుడు మగపెళ్ళివారికి ఎదురు సన్నాహం పంపడం, ఆనాటి రాత్రి విటీ విట శృగారక్రీడల వర్ణనం.

ఆశ్వాసం (9): పార్వతీ పరమేశ్వరుల వివాహం, తంబురునారదుల గానం, రంభాదుల నాట్యం, దేవతల ప్రార్థనమీద శివుడు మన్మథుని పునరుజ్జీవితుని చేయడం, వసంతోత్సవం, జలక్రీడలు, పార్వతీ పరమేశ్వరులు కైలాసపర్వతానికి వెళ్ళడం, వారి మధ్య శృగార వర్ణనం.

ఆశ్వాసం (10): పార్వతీ పరమేశ్వరులు శయనమందిరంలో ఉన్నపుడు అగ్ని అందు ప్రవేశించడం, శివుడు అగ్నిపై తన వీర్యాన్ని చల్లడం, అగ్ని దానిని గ్రహించి శరవణ సరస్సుకు వెళ్ళడం, అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నులు అగ్ని వలన శివుని వీర్యాన్ని గ్రహించి గర్భవతులవడం, వారు వారి గర్భస్థ పిండాలను సరోవరగర్భంలో పెట్టి వెళ్ళిపోవడం, అవన్ని ఏకమై కుమారుడు ఉద్భవించడం, నారదుడు ఆ కుమారుని తేజోవిషేషాలను గురించి ఇంద్రునకు చెప్పగా అతడు కుమారునిపై యుధ్ధంచేసి ఓడిపోయి శివుని శరణు వేడడం, పార్వతీ పరమేశ్వరులా కుమారుని తమ కుమారునిగానే గణనచేసి తారకాసురుని వధించడానికై
దేవతల సేనానాయకునిగా అభిషేకించడం,  కుమారుని క్రౌంచాచల భేదనం, దేవతలు బృహస్పతి కొడుకైన సుమతిని తారకాసురుని వద్దకు రాయబారినిగా పంపడం, తారకుడు దూతను నిందించి వధించ బూనడం, శుక్రుని ధర్మోపదేశం, తారకుడు దేవసభకు దూతను పంపడం, యుధ్ధం నిశ్చయమవడం, శుక్రుడు మరలా తారకునకు రాజనీతిని ఉపదేశించి యుధ్ధాన్ని నివారించబూనడం, తారకుడు నిరాకరించడం.

ఆశ్వాసం (11): ఇరు పక్షాలూ చతురంగబలాలతో యుధ్ధభూమిని చేరి ఘోర యుధ్ధం చేయడం.

ఆశ్వాసం (12): కుమారతారకాసురులు ఒకరికొకరుగా యుధ్ధం చేయడం, కుమారుని చేతిలో తారకుడు నిహతుడవడం, కుమారుని దేవతలు అభినందించడం, విజయలక్ష్మీశోభితుడై కుమారుడు తల్లిదండ్రులను దర్శించడం, పరమేశ్వరుడు కుమారునకు ఈశ్వర తత్త్వోపదేశం చేయడం.

ముందుగానే చెప్పినట్లుగా, సంక్షిప్తంగా ఇదీ తెలుగు ‘కుమారసంభవం’ కథ. ఇక్కడినుంచి ఒక్కో ఆశ్వాసంలో భాషాసౌందర్యంతోనూ, భావసౌందర్యంతోనూ మెరుసిపోతూండే మంచి మంచి పద్యాలను అన్వీక్షణం చేస్తూ ఈ వ్యాసం ముందుకు సాగుతుంది.

ప్రకటనలు

One thought on “తెలుగు కావ్యాలు – కుమారసంభవం (1)

  1. ఆర్యా ,నేను 2007లో ప్రచురించిన ‘సంధ్యారాగం’అనే వ్యాససంపుటి లో నన్నెచోడుని ‘కుమారసంభవం’ గురించి వ్రాసిన వ్యాసాన్ని దయచేసి చదవ గోరెదను. మీ వ్యాసం బాగుంది.నా వ్యాసంలో కొన్ని మంచి పద్యాలు అర్థం తో సహా రాసాను.
    రమణారావు.ముద్దు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s