ఆంధ్రనామ సంగ్రహం (1)

నిఘంటు త్రయం

ఆంధ్రనామ సంగ్రహం, ఆంధ్రనామ శేషం, సాంబ నిఘంటువు – ఈ మూడూ పద్య రూపంలో పూర్వకవులు మనకు అందించిన నిఘంటువులు. ఆంధ్రనామ సంగ్రహాన్ని పైడిపాటి లక్ష్మణకవి, శేషాన్ని ఆడిడం సూరకవి రచించారు. సాంబ నిఘంటువు కస్తూరి రంగకవిచే రచించ బడింది.

తెలుగుభాషలోని తత్సమ, తత్భవ, దేశ్య, గ్రామ్య అనే నాలుగు విభాగాలైన పదాలలో  తత్భవ, దేశ్య పదాలు ఈ నిఘంటువులలోకి పద్యాల రూపంలో ఎక్కించబడ్డాయి.  ఈ పద్యాలను కంఠస్థం చేయడమంటే సగం ఆంధ్రభాషను కంఠస్థం చేయడమే! ఇప్పటి రోజులలో, కంఠస్థం మాట ఏలా ఉన్నా, కనీసం ఒకటి రెండు సార్లు చదువుకోగలిగినా, కొంతలో కొంతన్నా భాషపై, పదాల వ్యుత్పత్తిపై అవగాహన పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో నేను చదువుతూ, , ఆ వెంటనే నోట్సులాగా రాసుకుంటూ పోతున్నవే ఈ టపాలు….

ఆంధ్రనామ సంగ్రహం (1)

ఐదువర్గాలుగా విభజింపబడింది. దేవవర్గు, మానవవర్గు, స్థావరవర్గు, తిర్యగ్వర్గు, నానార్థవర్గు అనేవి ఈ ఐదు.  దేవవర్గు లో దేవతల, వారికి సంబంధమైనవి చెప్పబడ్డాయి. ఈ విధంగానే మిగతావి.  తిర్యగ్ – పశుపక్షయాదులకు సంబంధించినవి. నానార్థ – అనేకార్థములైన పదాలను గూర్చి వివరణ.

దేవవర్గు (1)

సీ. ముక్కంటి, అరపది మోముల వేలుపు, మినుసిగదయ్యంబు, మిత్తిగొంగ
గట్టువిల్తుడు, గఱకంఠుడు, మిక్కిలి కంటి దేవర, బేసికంటి వేల్పు
వలిమలల్లుడు, మిన్నువాక తాలుపు, కొండవీటిజంగము, గుజ్జువేల్పు తండ్రి
వలరాజు సూడు, జక్కులఱేని చెలికాడు, బూచుల యెకిమీడు, పునుకతాల్పు

తే. విసపుమేతరి, జన్నంపు వేటకాడు
బుడుతనెలతాల్పు, వెలియాల పోతురౌతు,
తోలుదాలుపు, ముమ్మొనవాలు దాల్పు,
నాగ భవదాఖ్య లొప్పు (నంధక విపక్ష).

(ఇక్కడ ఒక మాట.  ఈ పద్యంలోనూ, ఇక ముందు రాబోయే పద్యాలలోనూ పదాల మధ్య కామాలు చదువుకోవడానికి సులభంగా ఉంటుందని నేనుంచినవి, అసలు పద్యాలలో కనబడవు).

మూడు నేత్రముల వాడు, (అర పది) ఐదు మొగముల వాడు — శివుడు పంచాననుడు. తొలుత బ్రహ్మకూడ పంచాననుడే. పంచ ముఖులైన ఇద్దరిలో తనను గుర్తుపట్టడానికి పార్వతి ఇబ్బందిని తొలగించే ప్రయత్నంలో భాగంగా బ్రహ్మ అయిదో ముఖాన్ని హరిస్తాడు శివుడు. అదే బ్రహ్మకపాలంగా శివుని చేతిలోని బిక్షాపాత్రగా మిగిలిందని పెద్దలు చెబుతారు — ఆకాశమును జుట్టుగా గలిగిన దేవుడు, (మిత్తి) మృత్యువునకు శత్రువు, (గట్టు) మేరుపర్వతాన్ని (విల్లు తు డు) దనుస్సుగా గలిగినవాడు, (కఱ) నల్లని కంఠముగలవాడు, (మిక్కిలి కన్ను, దేవర) ఎక్కువ నేత్రములు గల దేవుడు, (బేసి కన్ను, వేలుపు) మూడు కళ్ళ దేవుడు, (వలిమల =
మంచుకొండ, హిమాలయ పర్వతం) ఇక్కడ అర్థం హిమవంతుని అల్లుడు అని, (మిన్ను వాక తాలుపు) ఆకాశ గంగను శిరస్సున ధరించిన వాడు, (కొండ వీడు జంగము) కైలాస పర్వతాన్ని ఇల్లుగా గలిగిన భిక్షుకుడు, పొట్టివాడగు వినాయకునికి తండ్రి, (వలరాజు సూడు) మన్మథునికి విరోధి, (జక్కుల ఱేడు= యక్షుల రాజైన) కుబేరునికి మిత్రుడు, పిశాచములకు అధిపతి, బ్రహ్మకపాల ధారి, విషమును ఆరగించినవాడు, దక్షుని యజ్ఞాన్ని భజ్ఞం చేసిన వాడు, (బుడుత నెల) బాలచంద్రుని శిరస్సున ధరించినవాడు, (వెలి
యాలపోతు రౌతు) తెల్లని ఆబోతును ఎక్కి చరించువాడు, (తోలు దాలుపు) పులిచర్మం ధరించువాడు, (ముమ్మొన వాలు దాల్పు) త్రిశూలధారి, (నాగ) అనబడే ఇవి అన్నీ, అంధకాసురుని శత్రువైన, శివుడా!, నీ పేళ్ళుగా వొప్పును.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s