ఆంధ్రనామ సంగ్రహం (2)

ఆంధ్రనామ సంగ్రహం – దేవవర్గు (2)

సీ. సోకుమూఁకల గొంగ, చుట్టుఁగైదువుజోదు, పచ్చవిల్తుని తండ్రి, లచ్చిమగఁడు,
పులుఁగుతత్తడి రౌతు, వలమురితాలుపు, వెన్నుఁడు, కఱివేల్పు, వెన్నదొంగ,
నునుగాడ్పుదిండి పానుపునఁ బండెడు మేటి, బమ్మదేవరతండ్రి, తమ్మికంటి,
పదివేసముల సామి, పసిఁడిపుట్టముదాల్చు, కఱ్ఱినెచ్చెలి, తరి గట్టుదారి,

తే. యాలకాపరి, వ్రేఁతల మేలువాఁడు
పాలకడలల్లుఁడును, బక్కి డాలుఱేఁడు
ఱేయుఁబవలును జేయుకందోయివాఁడు
మామమామన హరి యొప్పు (శ్రీమహేశ!).

సోకుమూకల గొంగ — (సోకుడు=రాక్షసుడు, సోకుటొజ్జ = రాక్షసుల గురువు, శుక్రాచార్యుడు) రాక్షస సమూహానికి (గొంగ =నిర్మూలనము చేయువాడు, శత్రువు) శత్రువు, చుట్టుకైదువు జోదు — (చుట్టు = గుండ్రని, కైదువు (కయిదువు) = ఆయుధము, జోధు = యోధుడు) సుదర్శనచక్రాన్ని ఆయుధంగా గలిగిన యోధుడు, పచ్చవిల్తుని తండ్రి — పచ్చని (చఱకుగడను) ఆయుధంగా గలిగిన మన్మధుని తండ్రి, లచ్చి మగడు — లక్ష్మీదేవికి భర్త;

పులుగుతత్తడి రౌతు — (పులుగు = పక్షి, తత్తడి = గుర్రము) గరుడుని వాహనంగా చేసుకుని సంచరించేవాడు, వలమురి తాలుపు — (వలను+మురి, వలను=వైపు, దిక్కు, పార్శ్వము, వల=కుడి, మురి=to turn, కుడివైపునుంచి ఎడమవైపుకు తిరుగుతూ ఏర్పడే శంఖం ‘that which has its volutes formed from right to left, the counch of Vishnu’ అని బ్రౌన్ నిఘంటువు) (పాంచజన్యము అనే పేరున్న) శంఖమును ధరించినవాడు, వెన్నుడు — విష్ణుశబ్దభవం, కఱివేల్పు– నల్లనిమేనిచాయ కలిగిన దేవుఁడు, వెన్నదొంగ;

నునుగాడ్పు తిండి పానుపున పండెడు మేటి– మెత్తటిగాలియే ఆహారమైన శేషుని తల్పంగా చేసుకుని పండుకుని ఉండే ఉత్తముడు, బమ్మదేవర తండ్రి– బ్రహ్మదేవునికి తండ్రి, తమ్మికంటి — (తమ్మి= పద్మము) పద్మములనుబోలిన కన్నులు కలవాడు;

పదివేసముల సామి– పది అవతారములను ఎత్తిన దేవుఁడు, పసిడిపుట్టముదాల్పు (పసిడి, పుట్టము =వస్త్రము) పీతాంబరుడు, కఱ్ఱినెచ్చెలి– (కఱ్ఱి = అర్జునుని ఒక పేరు) అర్జునునికి ముఖ్యమైన హితుడు;

తరిగట్టు ధారి– మంధరపర్వతాన్ని మోసినవాడు, ఆలకాపరి– (ఆవు, ఆవులు…ఆలు బహువచనం, ఆవుల కాపరి, ఆలకాపరి) పసువులమందను కాసినవాడు, వ్రేతల మేలువాడు –  (వ్రేత=గొల్ల పడతి, గోపిక) గోపికాస్త్రీల మేలును కాంక్షించినవాడు;

పాలకడలల్లుడు — లక్ష్మీదేవికి తండ్రియైన క్షీరసముద్రునికి అల్లుడు, పక్కి డాలు ఱేడు — (పక్కి.. పక్షి,  గరుడుడు) గరుడధ్వజము కల దేవుఁడు;

ఱేయుబవలును చేయు కందోయివాడు– రాత్రికి పగలుకు అధిపతులైన చంద్ర సూర్యులను తన రెండు కళ్ళుగా గలిగినవాడు;

మామమామ — మామకు మామ (లక్ష్మీదేవిని పెండ్లాడి నందువలన తనకు మామయైన సముద్రుని భార్య యైన గంగాదేవి వరసకు విష్ణువుకు కూతురు అవడం వలన తిరిగి విష్ణువు సముద్రునికి మామ అయ్యాడు కాబట్టి), (అ)న హరి యొప్పు — అనిన  ( ఈ పేళ్ళు, శ్రీ మహేశ్వరా)  విష్ణువుకు వొప్పుగా చెందుతాయి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s