ఆంధ్రనామ సంగ్రహం (3)

ఆంధ్రనామ సంగ్రహం – దేవవర్గు (3)

సీ. పక్కిడాల్వేలుపు పొక్కిలిపసిబిడ్డఁడంచతేజీనెక్కి యాడురౌతు,
మనెడు పొద్దులనొసళ్ళను వ్రాయు దేవర, చదువుల వేలుపు, జన్నిగట్టు,
తెలిదమ్మిగద్దియఁ గొలువుండురాయఁడు, నిక్కపుజగమేలు నేర్పుకాఁడు,
కడుపుబంగారు బొక్కసముఁజేసినమేటి, పోరోగిరము తిండిపోతుతండ్రి,

ఆ. నలువ,  తమ్మిచూలి, నలుమొగంబుల వేల్పు,
వేల్పు పెద్ద, పలుకు వెలఁది మగఁడు,
తాత, బమ్మ యన విధాత నామములొప్పు
(నఘవినాశ యీశ యభ్రకేశ.)

పక్కిడాలు= గరుడధ్వజం,  వేలుపు= దేవుఁడు,  పొక్కిలి= నాభి, పసిబిడ్డడు= చిన్న పిల్లవాడు – గరుడధ్వజుడైన విష్ణువు నాభినే జన్మస్థానముగా గలిగినవాడు, అంచ తేజీనెక్కి యాడు రౌతు — హంసను వాహనంగా చేసుకుని తిరిగేవాడు;

మనెడు ప్రొద్దుల నొసళ్ళను వ్రాయు దేవర — ఏంత జీవితకాలం జీవిస్తాడో ఆ సమాచారాన్ని (మానవుల) నొసళ్ళమీద వ్రాసే దేవుఁడు, చదువుల వేలుపు — (చదువులు= వేదాలు) వేదాలకు అధిపతి (బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు పుట్టాయని అంటారు గనుక), జన్నిగట్టు = యజ్ఞోపవీతాన్ని ధరించినవాడు;

తెలి తమ్మి గద్దియ కొలువుండు రాయుండు — తెల్లతామరను ఆసనంగా చేసుకుని కూర్చుని ఉండేవాడు, నిక్కపు జగమేలు నేర్పుకాడు — సత్యలోకాన్ని పరిపాలించే నేర్పుకలిగిన ప్రభువు;

కడుపు బంగారు బొక్కసము చేసిన మేటి — తన ఉదరాన్ని బంగారానికి నిలయంగా చేసిన ఉత్తముడు (బ్రహ్మకు హిరణ్యగర్భుడు అని పేరు) పోరోగిరము తిండిపోతు తండ్రి — (పోరు = తగవు,  ఓగిరము= అన్నము) తగవులాట అనే అన్నాన్ని ఆహారంగా కలిగిన నారదునుకి తండ్రి (నారదునికి కలహభోజనుడని పేరు గనుక);

నలువ — నలు = నాలుగు, వ = నోరు, నాలుగు నోరులు కలవాడు, తమ్మిచూలి = కమలము నుంచి పుట్టినవాడు, నలుమొగంబుల వేల్పు — నాలుగు ముఖముల దేవుఁడు;

వేల్పు పెద్ద– దేవతలలో పెద్దవాడు, పలుకు వెలది మగడు — మాటలకు దేవత అయిన సరస్వతికి మగడు;

తాత — పితామహుడు, బమ్మ (బ్రహ్మ శబ్దానికి వికృతి) అన — అన్నవి, విధాత నామము లొప్పు — బ్రహ్మ దేవునికి పేర్లుగా ఒప్పును.

 

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s