తెలుగు మాట, పాట, పద్యం (6)

అచ్చ తెనుగు పాట

పండుగ రోజులలో తెలుగిళ్ళలో స్త్రీలు నోములు నోయడం అన్నది మన సంస్కృతీ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగం. శ్రావణ మాసంలో ప్రతి తెలుగిల్లు శ్రావణ మాసపు నోముల ఫలితంగా కళకళలాడుతూ వుండడం నేటికీ చూస్తూనే వుంటాం! శ్రావణమాసంలో నోముల  తరువాత, దీపావళి మొదలు కార్తీక శుధ్ధ పౌర్ణమి వరకూ పూర్వం తెలుగిళ్ళలో బాలికలు నోచే ఒక నోము (‘మూగనోము’ అని పేరు) చివర రోజున, గౌరీదేవికి పూజ చేసిన తరువాత, ఒక పాట పాడేవాళ్ళని స్వర్గీయ ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, వారు రచించిన ‘ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి’ (ప్రథమ ముద్రణ: 1951) పుస్తకంలో ఒక అచ్చ తెలుగు పాటను సూచించి, ఆ పాట పూర్తి పాఠాన్ని కూడా వ్రాసారు. ఆ పాట పేరు ‘మోచేటి పద్మం’. ఆ పాట పేరుమీదుగానే ఆ నోముకి కూడా ‘మోచేటి పద్మం’ నోము అని ఇంకొక పేరు గూడా వచ్చిందని చెప్పారు. ఆ పాట పూర్తి పాఠం ఇది:

మోచేటి పద్మమ్ము పట్టేటి వేళ
మొగ్గల్లు తామర్లు ముడిగేటి వేళ
ఆవుల్లు లేగల్లు వచ్చేటి వేళ
ఆంబోతు రంకెల్లు వేసేటి వేళ

సందేళ దీపమ్ము పెట్టేటి వేళ
చాకింటి మడతల్లు తెచ్చేటి వేళ
బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ
కోడల్లు పసుపుల్లు కొట్టేటి వేళ

కూతుళ్ళు గుండుగిన్నెల్ల కుడిచేటి వేళ
ముద్ద మొగము అద్దాన్ని బోలు
ముద్దరాలి మొగము మోచేటి పద్మమ్ముబోలు
పద్మమ్ము నోచిన చానకు పదివేల ఐదవతనము.

మొదలు నుంచి చివరిదాకా, అచ్చమైన తెలుగుదనంతో గుబాళిస్తుండే పాట ఇది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు గదా! అయితే, ఈ పాటలో ఒకింత ఇబ్బందికరమైన సంగతి, ‘మేచేటి’ అనే మాటకు అర్ధం ఏమిటి? అన్నది. ఈ మాటకు లక్ష్మీరంజనంగారు సూచించిన అర్ధం – ‘మొగుచు’ అంటే ముకుళించు పద్మమేమో! అని. వారు సూచించిన ఈ అర్ధంతో, ఈ నోమును ‘ముకుళించే పద్మం’ నోము అనుకోవడానికి కూడా సాధ్యమౌతుంది. ఈ నోము ‘మూగ నోము’ కావడం వల్లా, అంటే ఈ నోము నోచే బాలిక, నోము ఆచరించే రోజులలో సాయంత్రం ఇరుగుపొరుగు పేరంటాండ్రను బొట్టుపెట్టి పిలవడానికి బయలుదేరిన దగ్గరనుంచి, ఆ నాటి రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూసే దాకా, ఎవరెంతగా పరియాచకాలాడి ప్రేరేపించినా మాట్లాడక ఊరకుండాడాలే తప్ప పెదవి విప్పకూడదనే నియమం వుంది కాబట్టి, ఈ నోముకు ‘ముకుళించే పద్మం’ అనే పేరు సాధ్యమే అనిపిస్తుంది; ‘పద్మం’ బాలిక నోరు, ‘ముకుళించు’ అంటే పెదవులు విప్పకుండా వుండేట్లు చేసే నోము కాబట్టి!

ఇక, ఈ పాట నిండా, నాటి పల్లెటూళ్ళ సంధ్యా సమయపు శోభ పరుచుకుని కనిపిస్తుంది. ఈ పాట మొత్తంలో అర్ధంగానట్లు అనిపించి ఇబ్బంది పెట్టే పదాలు రెండే రెండు. అవి, ‘మోచేటి’, ‘బీరాయి’ అనేవి. వీటిల్లో ,మోచేటి’ కి అర్ధం ముందే వివరించ బడింది గనుక, ఇప్పుడు , ‘బీరాయి’ అన్న పదం సంగతి చూడాలి!

‘బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ’ అని చరణం! ఇది చదివిన వెంటనే ఊహ సహజంగానే పల్లెటూరి ఇళ్ళ ముంగిళ్ళలోనో లేక పెరడులలోనో సర్వ సాధారణంగా కనుపించే ‘బీర చెట్టు’ మీదకు పోతుంది. అయితే, ‘బీర చెట్టు’ పూవులు విడవడానికి ‘సంధ్యా సమయాని’ కి ఏమిటి సంబంధం? అన్నది ప్రశ్న. అదీగాక, బీర (చెట్టు) కు ‘బీరాయి (చెట్టు)’ అని నామాంతరం వున్నట్లుగా కనబడదు. ఈ రెండూ కాకపోతే, మరి ఈ మాటకు
ఇక్కడ అర్ధం ఏమై వుంటుంది?

ప్రస్తుతానికి అదలా వుంచి, ఒక్కసారి పూజ్యులు డాక్టర్ బిరుదురాజు రామరాజు గారి ‘తెలుగు జానపదగేయ సాహిత్యం’ (ప్రథమ ముద్రణ: 1958) పుస్తకంలో చూస్తే, ఈ ‘మోచేటి పద్మం’ నోము శ్రీ నేదునూరి గంగాధరం గారి పాఠంలో ‘మోచేతి పెద్దమ్మ’ నోముగా మారి, ఈ పాట పాఠం కూడా బాగా విస్త్రుతమై కనిపిస్తుంది. శ్రీ గంగాధరంగారి పాఠం ఇది:

మోచేటి పెద్దమ్మ నోచేటి వేళ – మొగ్గల్లు తామరలు పూసేటివేళ
బీరాయి పువ్వులు పూసేటి వేళ – బిందెలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
గుమ్మడి పువ్వులు పూసేటివేళ – గుండిగలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
కాకర పువ్వులు పూసేటివేళ – కడవలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
ఆనబాయ పూవులు పూసేటివేళ – అటికలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
చిక్కుడు పువ్వులు పూసేటివేళ – చిప్పలతో గంధాలు తీసేటివేళ
ఆవులు దూడలు వచ్చేటివేళ – ఆంబోతు రంకెలు వేసేటివేళ
సందిటి దీపాలు పెట్టేటివేళ – చాకింటి మడతలు దెచ్చేటివేళ
మరదళ్ళు మరి జూద మాడేటివేళ – కూతుళ్ళు గుండిగలు దింపేటివేళ
కోడళ్ళు కొటుపసుపు కొట్టేటివేళ – చెల్లెల్లు చేమంతులు ముడిచేటివేళ
వదినల్లు వంటిల్లు చేసేటివేళ –
ముద్దుల మొగము అద్దానబోలు – తన ముఖము తామర పద్మానబోలు.

శ్రీ నేదునూరి గంగాధరం గారు ఇచ్చిన పాఠాన్ని బట్టి చూస్తే, ‘బీరాయి’ బీర చెట్టునే సూచిస్తుంది. అయితే, ఈ పాఠం లక్ష్మీరంజనంగారి పాఠంలోలా ‘సంధ్య’ వర్ణనను సూచించదు. తెలుగింటి వాతావరణం మాత్రం కళ్ళకు కట్టినట్లు వుంటుంది. కానీ, లక్ష్మీరంజనంగారి పాఠంతో పోలిస్తే మాత్రం, ఈ పాట పాఠం సందర్భ శుధ్ధి లేనట్లుగా, అంటే ఒక సందర్భానికి సంబంధించినది కాకుండా వున్నట్లుగా అనిపిస్తుంది. పాట పేరులోకూడా ఈ అసందర్భం కనిపిస్తుంది, ‘మోచేతి పెద్దమ్మ’ ఏమిటన్నది అంతు చిక్కేదిగా కనుపించదు.

ఇప్పుడు, లక్ష్మీరంజనంగారు ఇచ్చిన పాట పాఠంలోని ‘బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ’ దగ్గరకొస్తే, ‘బీరాయి’ అన్న పదం ‘బీర చెట్టు’ ను సూచించేదిగానే అనుకుంటే, ‘బీర చెట్టు పూవులను విడిచేటి వేళ’ అన్న అర్ధం ఆ చరణానికి వస్తుంది. ఇందులో ఇమిడి వున్న అర్ధం ఏమిటి? అన్నది మాత్రం ఇప్పటిదాకా ఎంతగా శోధించినా నాకు పట్టుబడలేదు. బీర చెట్టు వెశేషంగా సాయంత్రం వేళల పూవులను రాలుస్తుందా? అన్నది నాకున్న సందేహం! రాలుస్తుంది గనకనే ఆ పాటలో చరణం అలా వుందని నేను నమ్ముతున్నాను! ఇది సరైనదో కాదో తెలిసినవాళ్ళు చెప్పాలి!

8 thoughts on “తెలుగు మాట, పాట, పద్యం (6)

 1. ఈ పాట మా అమ్మగారు పాడగా విన్న గుర్తుందికాని పాఠం చెప్పలేను. చాలా తక్కువగా పాడేపాట కనక గుర్తులేదు. మంచిపాట గుర్తు చేశారు

  • మీ దగ్గర ఈ చిక్కుముడి వీడుతుందేమో నని expect చేశాను, శర్మ గారు! వీడ లేదు! చూద్దాం! ఇంకాస్త శ్రమ పడాలన్న మాట!
   మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

   • ముడిచేటి పద్మమ్ము నోచేటి వేళ….నుండి……చిప్పలతో గంధాలు తీసేటి వేళ దాకా వుదయ వర్ణన. మోచేటి పెద్దమ్మ కాదని నా అభిప్రాయము, అది ముడిచేటి పద్మమ్ము అని నా వూహ సుమా! వుదయమేకదా నోము ప్రారంభం మరి.
    ఇక బీరాయి పూవుల్లు దగ్గర కొస్తే సాధారణంగా వుదయ సాయం సంధ్యలలో పూలు వికసిస్తాయని…యెక్కువగా వుదయ సంధ్య. బీరాయి అన్నది, బీరపాదుపువ్వని నా వుద్దేశం. లక్ష్మీ రంజనంగారి పాఠమే విన్న గుర్తు. నాకు తెలిసిన వరకు చెప్పేను.చూసి విషయం చెప్పగలరు. ధన్యవాదాలు, నాకీ అవకాశం యిచ్చినందుకు.బీరపువ్వు పసుపు, కాకరపువ్వు పసుపు, చిక్కుడు పువ్వు తెలుపు

 2. kastephale says:
  6:23 అపరాహ్నం వద్ద 14/09/2012
  మిత్రులు వెంకట్ గారు,
  మనం ఒక సందర్భంలో మూగనోము పాట గురించి చర్చించాము. అదెక్కడో మీ బ్లాగులో నాకు దొరకలేదు కాని, నా దగ్గర ఒక పుస్తకం బాలాంత్రపు రజనీకాంత రావు గారి తండ్రి గారు వేంకటరావు గారు రాసిన స్త్రీల వ్రతకధలు పుస్తకంలో ఉన్న పాట ఇస్తున్నా చూడండి. ఈ పుస్తకం నా దగ్గరుంది.

  మోచేటి పద్మంబు పట్టేటివేళ-మొగ్గల తామర్లు పూసేటి వేళ.
  కాకరపువ్వుల్లు పూసేటివేళ- కడవలతో నుదకమ్ము తెచ్చేటివేళ
  ఆనపా పువ్వుల్లు పూసేటి వేళ-అటికలతో నుదకమ్ము తెచ్చేటివేళ.
  గుమ్మడి పువ్వుల్లు పూసేటివేళ-గుండిగలతొ నుదకమ్ము తెచ్చేటివేళ.
  బీరపువ్వుల్లు చాల పూసేటి వేళ- బిందెలతొ నుదకమ్ము తెచ్చేటివేళ
  సంధివేళ దీపము పెట్టేటి వేళ-చాకలి మడతలు తెచ్చేటి వేళ.
  ఆవులూ గోవులూ వచ్చేటి వేళ-ఆంబోతుల్లు రంకెలూ వేసేటి వేళ.
  అన్నలూ అందనాలెక్కేటి వేళ-తమ్ములూ తాంబూలం వేసేటి వేళ.
  మరదుళ్ళు మరిజూదమాడేటి వేళ-కూతుళ్ళు గుండిగలు దింపేటి వేళ.
  బావలూ పల్లకీ లెక్కేటి వేళ- మరుదులూ మరిజూదమాడేటి వేళ.
  కోడళ్ళు కొట్టు పసుపు కొట్టేటి వేళ-చెల్లెళ్ళు చేమంతు ముడిచేటి వేళ.

  పై పాట పూర్తి పాఠం నా దగ్గరున్న పుస్తకంలో ఉంది. ఇది యాధృచ్చికంగా నా కంటపడిందీ వేళ. బ్లాగు మూసేసినా ఇది ఉపయోగకరమైనది కనక ఇక్కడ పెట్టేను. చూడగలరు.

  మరొక సంగతి ఈ నోము సాయంత్రం వేళ పడతారని ఉంది.

  జవాబు
  venkat.b.rao says:
  12:38 అపరాహ్నం వద్ద 15/09/2012
  ధన్యవాదాలు శర్మగారూ…జ్ఞాపకం పెట్టుకుని, శ్రమకోర్చి మీ దగ్గర పుస్తకంలోని పూజ్యులు బాలాంత్రపు వేంకటరావు గారు సూచించిన ఈ మోచేటి పద్మం నోము కు సంబంధించిన ఈ పాట పాఠాన్ని ఇక్కడ పెట్టినందుకు!

  ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి తమ పుస్తకం ‘ఆంధ్రుల చరిత్ర సంస్కృతి’ లో ఇచ్చిన ఈ ‘మోచేటి పద్మం’ నోము కు సంబంధించి పాట పాఠం, తదితర సంగతులతో ఉన్న పోస్టు ఈ బ్లాగులో ‘తెలుగు మాట, పాట, పద్యం (6) వద్ద ఉంది.

  మరోసారి ధన్యవాదాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s