ఆంధ్రుల చరిత్ర : బృహత్ఫలాయనులు

‘బృహత్ఫలాయన’ మహారాజ జయవర్మ

ఆంధ్ర దేశాన్ని శాతవాహనులు దాదాపు నాలుగువందల సంవత్సరాలు పరిపాలించారు.  వారి పాలన స్థూలంగా క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 దాకా సాంగిదని చరిత్రకారులు చెబుతారు.  శాతవాహనుల తరువాత ఆంధ్ర దేశాన్ని పాలించిన ప్రసిధ్ధ రాజవంశం ‘ఇక్ష్వాకు’ వంశం.  ఈ వంశం పురాణ ప్రసిధ్ధి చెందినది.  వీరి పాలన తరువాత ఆంధ్ర దేశాన్ని చిన్న చిన్న రాజవంశాలు పాలించాయి. బ్రృహత్ఫలాయన, శాలంకాయన, ఆనందగోత్రులు అనే పేర్లతో వున్న ఈ రాజవంశాలకి ఈ పేర్లు వారి ‘గోత్ర’ నామాల మీదుగానే వచ్చాయని చెబుతారు. బృహత్ఫలాయనులది బృహత్ఫలాయన గోత్రం, శాలంకాయనులది శాలంకాయన గోత్రం, ఆనందగోత్రులది (వారి పేరులోనే వున్నట్లుగా) ఆనంద గోత్రం…ఇలాగ!  బృహత్ఫలాయనుల విషయంలోనే కాదు, శాలంకాయన మరియు ఆనందగోత్రుల విషయంలోనూ వారి శాసనాలలో ఎక్కడా వారి వంశ నామం చెప్పబడి వుండక పోవడం వలన ‘గోత్ర’ నామాలే వాళ్ళ వాళ్ళ వంశ నామాలయ్యాయి! చరిత్రకారులు వాళ్ళను గోత్రనామాలతోనే పిలుచుకోవాల్సి వచ్చింది! (ఇది ఇంచుమించు ఎలాంటిదంటే, పల్లవులను ‘భారద్వాజు’ లనీ, కాదంబులను ‘మానవ్యు’ లనీ పిలుచుకోవడం లాంటిదని చెబుతారు!)

బృహత్ఫలాయన వంశానికి చెందిన రాజు ఆంధ్ర చరిత్రలో ఇప్పటివరకూ ఒక్కడే ఒక్కడు కనిపిస్తాడు.  ఆ రాజు పేరు ‘జయ వర్మ’. ఈయన తన పరిపాలనా కాలంలో వేయించిన ఒక తామ్ర శాసనం వలన ఈయనకు సంబంధించిన చరిత్ర కొద్దిగానయినా బయటపడింది.  ఆ తామ్ర శాసనం నేటి గుంటూరు జిల్లా, తెనాలి కి దగ్గరిలోని ‘కొండముది’ అనే గ్రామంలో దొరకడం వలన, ఈ శాసనానికి ‘కొండముది’ తామ్ర శాసనం అనే పేరు వచ్చింది. ఈ ‘కొండముది’ తామ్ర శాసనం వలననే ‘బృహత్పలాయన’ అనే పేరుతో ఒక గోత్రం వుందన్నది వెలుగులోకి వచ్చిందని పెద్దలు చెబుతారు. ఈ గోత్ర నామం (‘బృహత్ఫలాయన స గొత్తొ’ అన్న మాటలలో) ఈ ఒక్క శాసనంలో తప్ప వేరే ఎక్కడా ఇంతవరకూ లభించకపోవడం అందుకు కారణం అని కూడా చెబుతారు.

కొండముది శాసనం ఒక దాన శాసనం! ఇందులో ‘మహేశ్వర’, ‘బృహత్ఫలాయన’ అన్న రెండు మాటలు తప్ప మిగతా అంతా ప్రాకృతంలో వుంటుంది.  ఈ శాసనంలోని రాజముద్రికలో జయవర్మ మహారాజు పేరు కనబడుతున్నది.  ఈయన బృహత్ఫలాయన గోత్రుడు. మహేశ్వర పాద భక్తుడుగా అందులో వర్ణించబడినాడు.

ఈ ‘కొండముది’ దాన శాసనంలో ఈ మహారాజు తన రాజ్యంలో వున్న ‘కూడూరుహార’ లోని ‘పంతూరు’ అనే గ్రామాన్ని ఎనమండుగురు బ్రాహ్మణులకు (బ్రాహ్మదేయంగా) ఇచ్చి వున్నానని కూడూరు లోని తన ‘వ్యాపృతు’ నకు ఈ శాసనంద్వారా తెలియజేశాడు. ఇక్కడ వాడిన ‘వ్యాపృత’ అనే మాట రాజ్యంలోని (Administrative) విభాగాలకు సంబంధించిన కొంత సమాచారాన్ని వెలుగులోకి తెచ్చి చూపెడుతుంది. అప్పటిలో రాజ్యంలోని భూభాగం పరిపాలనా సౌలభ్యం కోసం ‘ఆహారా’ లుగా విభజించబడి, ఒక్కొక్క ‘ఆహారము’ ఒక్కొక్క అధికారి చేతులలో పెట్టబడి వుండేది, ఆ అధికారి హోదాను ‘వ్యాపృత’ నామంతో పిలిచేవారు. ఈ ‘వ్యాపృత’ పదం ‘వియపత’ అన్నరూపంలో అశోకుని శాసనాలలో కనిపిస్తుంది. ఈ పదానికి పాణిని చెప్పిన ఇంకొక రూపమే ‘ఆయుక్త’. ఈ రెండూ కూడా శాతవాహనుల ‘ఆమకు’ లకు, ఆ తరువాతి కాలంలోని ‘విషయపతు’ లకు సమానమైవని చెబుతారు. ఈ ‘వ్యాపృత’ పదానికి ప్రాకృత రూపమైన ‘వాపతమ్’ జయవర్మ వేయించిన కొండముది శాసనంలోనూ, పల్లవ రాజైన యువమహారాజ శివ స్కందవర్మ వేయించిన ‘మైదవోలు’ శాసనంలోనూ కనిపిస్తుంది. దీనిని బట్టీ, మైదవోలు, కొండముది శాసనాలలోని లిపి కూడా ఒకేరకంగా వున్నట్లు అనిపించడాన్నిబట్టీ, బృహత్పలాయన జయవర్మ, యువమహారాజ శివ స్కందవర్మ సమకాలీనులయి వుండవచ్చన్న అభిప్రాయానికి Dr.Hultzsch వంటి లిపి శాస్త్రజ్ఞులు (epigraphists) వచ్చారు!  (పల్లవ యువ మహారాజ శివస్కందవర్మ వేయించిన ఈ ‘మైదవోలు’ తామ్ర శాసనానికి ఆంధ్ర చరిత్రలో ఒక ప్రముఖ స్థానం వుంది. దేశపరమైన ‘ఆంధ్ర’ శబ్దం ప్రయోగం మొట్టమొదటగా ఈ శాసనంలో జరగడం, ఇందువలన ఈయన పరిపాలనా కాలమైన క్రీ.శ.మూడవ శతాబ్దం నుంచే ‘ఆంధ్ర’ శబ్దం దేశ సూచకంగా వాడుకలో వుండినదని ఈ శాసనంలోని ‘అంథాపథీయో’ అనే మాటల వలన తెలియడం, ఈ శాసన ప్రాముఖ్యానికి గల కారణాలు!)

పల్లవ శివ స్కందవర్మ రాజ్యం చేస్తున్న కాలంలో (అంటే క్రీ.శ.మూడవ శతాబ్దం ఉత్తరార్ధంలో) బృహత్ఫలాయనులు వేంగిని పరిపాలిస్తూండే వారనీ, ఇక్ష్వాకులు ఆంధ్ర దేశాన్ని (అంటే శ్రీశైలం, దక్షిణ కోసల మరియు గోదావరీ ఉత్తర కోస్తా తీర ప్రాంతం అంతా కలిసివున్న ప్రదేశాన్ని) పాలిస్తూండేవారనీ కూడా ఒక అభిప్రాయానికి చరిత్రకారులు రావడం జరిగింది.  దీనిని బట్టి చూస్తే, ఇక్ష్వాకుల పరిపాలనా కాలం, బృహత్ఫలాయన జయవర్మ రాజ్యం చేసిన కాలం, పల్లవుల రాజ్య కాలం అన్నీ సమకాలికాలై కనిపిస్తాయి. ఈ రాజుల పరిపాలనా కాలం క్రీ.శ.మూడవ శతాబ్దం!

అయితే, నాణానికి ఒక వైపు లాంటి పై అభిప్రాయానికి, రెండవ వైపు లాంటి వేరొక అభిప్రాయం కూడా వుంది! ఆ అభిప్రాయం ప్రకారం, మైదవోలు శాసనాన్ని యువమహారాజు శివస్కందవర్మ, తన తండ్రి (బప్ప) రాజ్యం చేస్తున్న కాలంలో ఇచ్చాడని, ఈ శాసనంలోని లిపినీ, బృహత్ఫలాయన జయవర్మ ఇచ్చిన ‘కొండముది’ శాసనంలోని లిపినీ పోల్చి చూస్తే, జయవర్మ యొక్క కొండముది శాసనం మైదవోలు శాసనం కంటే కనీసం ఒక తరం ముందుదనీ, కాబట్టి జయవర్మ, పల్లవ శివస్కందవర్మ కంటే కనీసం ఒక తరం ముందు రాజ్యం చేసి వుంటాడనీ కూడా చెబుతారు. చారిత్రకంగా కూడా ఇదే నిజమైనదన్న అభిప్రాయం కూడా వుంది!  కృష్ణకు దక్షిణాన వున్న ప్రాంతాల దాకా కూడా జయవర్మ అధికారం చెల్లిందనీ, ఆ దిగువన అంతా పల్లవ రాజ్యం క్రింద వుండినదనీ కూడా ఇక్కడ నిర్ణయించుకోవచ్చు.

బృహత్ఫలయాన వంశ మూలపురుషుడు ఎవరో తెలుసుకోవడానికి ఏ ఆధారమూ లేదు.  కొండముది శాసనంలో కూడా ఈ ప్రస్తావనలేక పోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాదాపుగా సమకాలీకులైన  పల్లవ, శాలంకాయనుల శాసనాలలో ఈ ఆచారం పాటింపబడి వుండడం ఇందుకు కారణం! కొండముది శాసనంలో, జయవర్మ తన తండ్రి పేరును తెలుపకపోయి వుండడం వలన, జయవర్మ తనకు తానుగానే తన ఒక్కడి కృషిద్వారా రాజ్యాన్ని దక్కించుకుని, తద్వారా బృహత్ఫలాయన వంశానికి మూలపురుషుడై,  ఆ వంశంలో ఒక్కడే ఒక్క రాజుగా చరిత్రలో మిగిలిపోయాడా? అన్న సందేహం కూడా కలుగుతుంది. అయితే, ఈ సందేహం తీరడానికి సరిపోయే ఆధారాలేవీ చరిత్రలో మిగలలేదు, మిగిలినా ఇప్పటివరకూ లభ్యం కాలేదు!

(ఈ చిన్న వ్యాసం వ్రాయడంలో సంప్రదించిన ప్రముఖుల పుస్తకాలు: (1) Early history of the Andhra Country – Dr.K. Gopalachari (2) ఆంధ్రుల చరిత్రము – (ప్రథమ భాగం) – చిలుకూరి వీరభద్రరావుగారు      (3) చరిత్ర చర్చ – ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి.)

ప్రకటనలు

7 thoughts on “ఆంధ్రుల చరిత్ర : బృహత్ఫలాయనులు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s