“తెలుగు పత్రికల సాహిత్య సేవ” – డా|| తిరుమల రామచంద్ర (పరిచయ వ్యాసం : భాగం -2)

“తెలుగు పత్రికల సాహిత్య సేవ” – డా|| తిరుమల రామచంద్ర (పరిచయ వ్యాసం : భాగం -2)

1835 లో బళ్ళారి నుండి ప్రకటితమైన ‘సత్యదూత’ అనే పత్రిక తెలుగులో మొట్టమొదటిదని ఒక అభిప్రాయం ఈ విషయంపై అప్పటిదా వ్రాస్తూండిన పెద్దలలో వుండేదనీ, అయితే ‘ది కర్నాటక్ క్రానికిల్ ‘ అనే పత్రికే తెలుగులో మొదటగా వెలువడిన పత్రికని చెప్పడానికి తిరుగులేని అధారాలున్నాయి కనుక ఆ అభిప్రాయం సత్యదూరమనీ రామచంద్ర గారు ఇందులో చెప్పారు. ఈ సందర్భంలో ‘బ్రౌన్ జాబులు – జర్నలిజం చరిత్ర’ అనే పుస్తకంలో, తెలుగు సాహితీలోకంలో ‘బంగోరె’ గా ప్రసిధ్ధులైన బండి గోపాల రెడ్డి గారి  (వీరిని సాహితీ వర్గాలలో ‘తవ్వకప్పనిమంతుడు’ అని కూడా వాత్సల్యంతో  పిలుచుకునే వారని చదివాను. ఒకరి చేతినుంచి ఇంకొకరి చేతులకు మారి, అక్కడనుంచి మరొకరి చేతులకు మారి, అలా దాదాపు కాలగర్భంలో కలిసి పోయాయనుకున్నా ఎన్నిటినో పెద్దవాళ్ళ వ్రాతప్రతులను, ఉత్తరప్రత్యుత్తరాల దస్త్రాలనూ, సాహిత్యానికి సంబంధించిన నోట్సులనూ తవ్వి వెలికి తీయడంలో అంతులేని ఓపికా, ప్రజ్ఞ కలవాడవడం చేత ఈయనకా పేరు వచ్చిందని చెబుతారు. తెలుగు సాహిత్యానికి సంభంధించినంతవరకూ మరుగున పడిపోయిన పుస్తకాలను తవ్వి తీయించడంలో బ్రౌన్ దొర, తవ్వి తీయడంలో మాన్యులు, మాహజ్ఞానసంపన్నులు అయిన మానవల్లి రామకృష్ణకవిగారూ,  ఇద్దరూ ఇద్దరే! వీరి నిస్స్వార్ధ కృషియే లేకుంటే తెలుగు సాంప్రదాయ సాహిత్యంలోని ఎన్నో గ్రంధాలు ఇప్పటికీ వెలుగు చూసేవో కాదో చెప్పలేం! పాండిత్యంలో వారితో సమవుజ్జీ అనదగ్గంతటివాడు అయినా కాకపోయినా, సాహిత్యానికి సంబంధించిన సంగతులను వెలికితీసి వెలుగు చూపించాలన్న కాంక్షలో ‘బంగోరె’ వారితో సమవుజ్జీ అనదగిన వాడే!) మాటలను ఉటంకిస్తూ ‘సత్యదూత’ 1835 లో లేదనీ ఇది కేవలం ఊహేననీ శ్రీ బండి గోపాలరెడ్డి అంటున్నారు’ అని వ్రాశారు రామచంద్ర గారు.

వృత్తాంతిని – ఇది తెలుగులో మొట్టమొదటి వారపత్రిక. 1838-41 మధ్య కాలంలో ప్రకటించబడింది. ఇందులో ప్రచురించిన లేఖను బ్రౌన్ దొరయే సేకరించాడు. కలిగిన వారి ఇళ్ళ పెళ్ళిళ్ళలో జరిగే దుబారా వ్యయాన్ని, దురాచారాలనూ అందరి దృష్టికీ తెచ్చి ఈ పధ్ధతులను సంస్కరించాలన్న సదుద్దేశంతో 1845వ సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తేదీన వ్రాసిన ఒక పాఠకుని  లేఖ అది. గిడుగు రామమూర్తి గారు కూడా ఈ లేఖను  తమ సపాదకత్వంలో వెలువడిన గద్యచింతామణిలో ఉదాహరించారట.  ‘వివాహమును గురించిన దుర్వ్యయము’ అనే శీర్షికతో వున్న ఈ లేఖ పూర్తి పాఠం రామచంద్ర గారు కూడా ఇందులో ఇచ్చారు. ఈ లేఖలోని భాష, వాక్య నిర్మాణం, దాదాపు రెండు శతాబ్దాల క్రితంనాటి తెలుగు వ్రాత పధ్ధతులను తెలుసుకోవడానికీ, అప్పటి ఆచారవ్యవహారాలను తెలుసుకోవాలన్న కుతూహలం కలవారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో నాకు ఆసక్తికరంగా అనిపించిన కొన్ని సంగతులను ఈ క్రింద చూపుతున్నాను:

“… … తమ తమ వారిలో వృధ్ధులుగా నున్ను పెద్దలుగానున్ను వుండే వారిచేత ఆశీర్వచనములు చెందడమున్ను, యీ యావత్తున్ను మన శాస్త్ర సంమతిగానున్ను అయా కులాచార సమ్మతిగానున్ను వుంటుందని… …”
సంమతి – ఇలాంటి చోట్ల బిందుపూర్వక ‘మ’ అప్పటికింకా ప్రయోగంలో ఉండేది. ఇప్పుడు లేదు.

“అయితే రాత్రులలో కచ్చేరి యుంచవలెగదా, పందిరి వేసి శృంగారించవలసి యున్నది గదా…”
అలంకరించ వలసి ఉన్నది కదా అనే అర్ధంలో ఈ ప్రయోగం.

“కచ్చేరి పందిలి నాట్యం వీటిని నిలిపితే – యిందుకుగాను వృథాశలవయ్యే మొత్తాన్ని దానధర్మముల కింద అగత్యంగా సెలవు చేతురనే దానికి సందేహించ లేదు.”
అగత్యముగా – అవశ్యముగా, తప్పనిసరిగా అనే అర్ధంలో ప్రయోగం. ‘సందేహించ లేదు’ – సందేహించాల్సిన పనిలేదు అని అర్ధం.

“….తనకు విహితులు కాకపోయినా తన వియ్యంకులవారికి విహితుడేమో అని భ్రమించి వారికంతా తాజంచేసి మర్యాదలు చేయవలసి సంభవించినది గదా అని మనసులో నొచ్చుకుంటాడు.”
‘తాజం చేసి’ – ‘తాజా’ అనే మాటనుంచి ఇది పుట్టిందనుకుంటాను. ఈ మాటకు కొత్తది, చేర్చినది అని రెండు అర్ధాలున్నాయి. ఇందులో ‘చేర్చినది’ అనే అర్ధంలో,  వారినికూడా కలుపుకుని అనే అర్ధంలో ఇలాంటి సందర్భాలలో అప్పటిలో వ్యవహారంలో వుండేదనుకుంటాను. ఇప్పుడు ప్రయోగంలో లేదు.

‘”…సార్ధకము కద్దా అని విచారిస్తే యెవరికిన్ని ఏమీ లేదు.”
“…నాట్యమాడుతు యుండే దాసీకి రూపాయలు వేసే మర్యాద కద్దు.”

‘కలదు’ అనే మాటకు సంక్షిప్త రూపం – ‘కద్దు’. ఇప్పుడు వ్యవహారంలోనే కాదు, వ్రాతలలో కూడా కానరాదు.

“దాని వలన ఇంటివానికి కొంచెం కూడుదల యుండినది.”
‘కూడుదల’ – ఖర్చులో కొంచెం తగ్గుదల (saving) అనే అర్ధంలో ఇక్కడ ప్రయుక్తమైంది ఈ మాట. లాభము అని దీనికి బ్రౌణ్యంలో చెప్పిన అర్ధం.

ఈ పోస్టులో పలుమార్లు బ్రౌనుదొర పేరు స్మరించుకోవడం జరిగింది గాబట్టి, సమకాలిక పండితులు ఆయన గురించి చెప్పిన ఒక మంచి చాటు కంద పద్యం, ప్రొ.జి.ఎన్. రెడ్డి గారి పర్యవేక్షణలోనూ, బంగోరె సంశోధనతోనూ వెలువడిన ‘బ్రౌన్ లేఖలు’ అనే పుస్తకంలోనిది – ప్రొ|| జి.ఎన్.రెడ్డి గారు ఆ పుస్తకానికి రాసిన ప్రస్తావనలో ప్రస్తుతించినది – ఇక్కడ ఒకసారి చెప్పుకోవడం తగిన పని అనుకుంటాను:

నూరార్లు లెక్క సేయక
పేర్లెక్కిన విబుధవరులఁ బిలిపించుచు వే
మార్లర్థమిచ్చు వితరణి
చార్లెసు ఫీలిప్సు బ్రౌను సాహెబు కరుణన్!

ప్రకటనలు

4 thoughts on ““తెలుగు పత్రికల సాహిత్య సేవ” – డా|| తిరుమల రామచంద్ర (పరిచయ వ్యాసం : భాగం -2)

 1. “…తనకు విహితులు కాకపోయినా తన వియ్యంకులవారికి విహితుడేమో అని భ్రమించి వారికంతా తాజంచేసి మర్యాదలు చేయవలసి సంభవించినది గదా అని మనసులో నొచ్చుకొంటాడు. ” ఈ వాక్యంలో ” తాజం ” అనే పదానికి మీరు ఇది తాజా అనే మాట నుండి పుట్టిఉండవచ్చని మరియు దీనిని to make them fresh up అనే అర్ధానికి వాడి ఉండవచ్చని అన్నారు. అది సరికాదేమో అని నా భావన. ఎందుకంటే ” వారి కంతా తాజంచేసి ” అనబడు వాక్య ప్రయోగంలో మీరన్న అర్ధం పొసగాలంటే అది “వారినంతా తాజంచేసి ” అన్న వాక్యము ఉపయోగించి వుండేవారు. ఇక్కడ అలా జరగలేదు. ” తాజా ” అనే పదానికి ” చేర్చినది ” అని మరియొక అర్ధం కూడ వున్నది. కాబట్టి ఇక్కడ ” వారికంతా సమకూర్చి మర్యదలు చేయవలసి వచ్చినది ” అన్న అర్ధములోనే అది వాడి ఉండొచ్చన్నది నా భావన.

  • SUDALU గారూ,

   ‘తాజా’ అన్న పదానికి, బ్రౌన్ నిఘంటువు ఇచ్చిన అర్ధాలు రెండు – అవి fresh, new; తాజాకలము a postscript in a letter, ఇవి గాక,’తాజా’అన్న పదానికి ‘చేర్చినది’ అన్న అర్ధంలో వాక్యాలను నేను చదివి ఉండలేదు… … … ఒకవేళ చదివి ఉన్నా, ఇప్పుడు స్ఫురణకు రావడంలేదు. ఊహించుకుని చూద్దామన్నా కూడా, ‘చేర్చినది’ అన్న అర్ధంలో ‘తాజా’ అన్న పదంతో వాక్యం స్ఫురణకు రావడంలేదు.

   అదలా ఉంచితే, అసలు ‘తాజంచేసి’ అన్న పదానికీ ఈ ‘తాజా’ కు ఏమైనా సంబంధం ఉందా? అన్నది కూడా నాకు ఇంకా సందేహమే!

   ‘తాజంచేసి’ అన్న పదానికి అర్ధం to make them fresh up అనేది నేను ఊహించి వ్రాసినదే! ఇంక వేరే అన్వయం కుదరక, కుదిరినది ఇది ఒక్కటీ సరి అయినది అయివుండవచ్చనుకుని సూచించిన అర్ధమే కాబట్టి అది సరైనది కాకపోవడానికి కూడా అవకాశముంది!

   మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

   • మీ ప్రతిస్పందనకు నా ధన్యవాదములు. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారిచే 1952 లో ప్రచురించబడిన “శబ్దార్ధచంద్రిక ” ఒక అత్యంత ప్రాచీన తెలుగు నిఘంటువు. ఇది ఒక ప్రామాణిక తెలుగు నిఘంటువు. దీనిలో కూడా “తాజా” పదమునకు రెండు అర్ధములు సూచించబడినవి. ఒకటి – క్రొత్తది, రెండవది – చేర్చినది. రెండవ అర్ధము మాత్రమే సామీప్యమును సూచించుచున్నది.

   • SUDALU గారూ,
    అయుండొచ్చును. convincing గానే వుంది. ఈ అర్ధానికి అనుగుణంగా మార్చాను. చూడండి.
    ధన్యవాదాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s