తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

ఆంధ్రుల లేదా తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర గురించిన ఈ notes లో తొలి వెయ్యేళ్ళు అంటే క్రీస్తు శకాబ్దం మొదలుకొని ఆపై వెయ్యేళ్ళదాకా అని అనుకున్నది.
అయితే, ఇది నిజానికి ఇంకో రెండువందల పాతికేళ్ళు ముందుకు వెళ్ళి అదనంగా మరో రెండువందలపాతికేళ్ళు కలిసి మొత్తం పన్నెందువందల పాతిక
సంవత్సరాలవుతుంది. దీనికి కారణం, శాతవాహనుల పరిపాలనతో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర మొదలవుతుంది/మొదలుపెట్టుకోవాలనుకుంటే,
శాతవాహనుల పాలన క్రీ.పూ.225 లో మొదలై క్రీ.శ.225 తో అంతమయిందని చరిత్రకారులంటారు గాబట్టి. శాతవాహనుల పరిపాలనలో తెలుగువాళ్ళ
సాంఘిక చరిత్రకు కూడా క్రీ.పూ.225 నుంచి ఆధారలు దొరకాలి.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి. ఆంధ్ర భృత్యులని మాటకూడా ఉంది. దీనిమీద లేచినవివాదం ఇంకా ఎటూ తెలకుండానూ ఉంది. ఆంధ్రులైన భృత్యులా?
ఆంధ్రులకు భృత్యులా? ఆంధ్రులు వేరే రాజవంశం వారై, వారికి శాతవాహనులు సామంతరాజులా? అని మీమాంస. అదెలా ఉన్నా, నాలుగున్నర శతాబ్దాల
వీరి పరిపాలన మాత్రం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లిందని చెప్పుకోవాలి. నాలుగున్నర శతాబ్దాలు ఒకే రాజవంశం ఒక భూభాగాన్ని నిరాటంకంగా పరిపాలించడం
అంత సులభంగా జరిగే పని కాదు. అయినా శాతవాహనుల విషయంలో అది సాధ్యమైంది. తరానికి 25 సంవత్సరాల చొప్పున (చరిత్ర పరిశోధనలో తరానికి 25
సం.గా వేసుకుని లెక్కిస్తారని చదివాను) నాలుగున్నర శతాబ్దాలకు 18 తరాలవుతుంది. అంటే తరం నుంచి తరానికి సాగే జ్ఞాపకాల ప్రవాహంలో
పరిస్థితులలోనూ పరిపాలకులకు చెందిన విషయాలలోనూ ఏవిధమైన మార్పూ లేకుండా 18 తరాలు గడవడం, జ్ఞాపకాల, అనుభవాల ప్రవాహం నిరాటంకంగా
కొనసాగడం అన్నది చరిత్రలో ఒక అరుదైన సందర్భం, ఒక luxury గానే చెప్పుకోవాలి. ఆ సందర్భాన్ని, ఆ luxury ని  శాతవాహనుల పరిపాలనలో
అప్పటి ప్రజలు అనుభవించారు.

ఈ సుఖాన్ని అనుభవించిన వాళ్ళలో తెలుగు మాతృభాషగా ఉండిన తెలుగువాళ్ళూ ఉన్నారు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అప్పుడు, అంటే
శాతవాహనుల పరిపాలనా కాలం నాటికి, ఆంధ్రులు తెలుగువాళ్ళూ ఒక్కటి కాదా? అని. కాదనే నేను అనుకుంటాను. అయితే గనక, ఆంధ్రులైన
శాతవాహనులు తమ మాతృభాష అయిన తెలుగును వదిలి ప్రాకృతాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు? శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజబాష, ప్రజల భాష
కూడాను! ప్రాకృతంలోనే కదా గాథాసప్తశతిలోని గాథలన్ని ఉన్నాయి! అయితే, అప్పటికి తెలుగింకా పూర్తిగా పరిణతిచెందిన భాషగా కాకుండానన్నా
ఉండిఉండాలి. అలా అనుకోవడానికీ వీలు లేదు.  కారణం, గాథాసప్తశతిలో అక్కడక్కడా కనుపించే అత్తా (అత్త), అద్దాఏ (అద్దం) లాంటి కొన్ని తెలుగు
పదాలు, తెలుగు అప్పటికే పూర్తిగా పరిణతి చెందిన భాషగా ఉండినదనీ, ఎంత పరిణతి అంటే, అందులోని కొన్ని మాటలు వేరే భాషలోకి వెళ్ళగలిగేంత పరిణతి
చెందిన భాషగా శాతవాహనుల కాలంనాటికే ఉండినదనీ, పూజ్యులు కీ.శే.తిరుమల రామచంద్ర గారు తమ వ్యాసాలలో ఇప్పటికే నిరూపించి ఉన్నారు కాబట్టి!

అదలా ఉంచితే, “ఆంధ్రశ్చ బహువః” అనే మాట ఒకటి ఉంది. దీని అర్ధం ఆంధ్రులు పలువురు అని. అంటే, పలు జాతుల ప్రజలు కలిసి ఆంధ్రులు
అయ్యారని ఇది సూచిస్తుంది. ఇది నానుడి. ప్రజల నాలుకలపైనుంచి వచ్చిన మాట. దీనికి నిదర్శనాలు, ఆధారాలూ దొరకవు. తరం నుంచి తరానికి ఇలా
దిగుమతి అయిన జ్ఞానంలో నిజం బొత్తిగా ఉండదు అనుకోవడం సాహసమే అవుతుంది. ఈ పలు జాతుల ప్రజలలో తెలుగు మాతృ భాషగా కలిగిన తెలుగువాళ్ళూ
ఉండిఉండవచ్చు. కాదనటానికి లేదు. బలమైన, ప్రభావవంతమైన జాతి కావడం మూలాన పోనుపోను ఆంధ్రులంటే, తెలుగువాళ్ళన్నది స్థిరపడి పోయి
ఉంటుందనుకోవాలి.

ప్రకటనలు

5 thoughts on “తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

 1. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అన్నట్టు ఇలాంటి విషయాలు మీరే వ్రాయాలి! అష్ట భాషల్లో ఒకటయిన ప్రాకృతం గురించి వివరాలు తెలుసుకోవాలని ఉండేది నాకు. దీని వలన కొంత పరిచయం అయినా ఇది చదివాక నాకు ఒక సందేహం కలిగింది: ఆంధ్రము అన్నది కూడా అష్ట భాషల్లో ఒకటే కదా! ఇలా ఆంధ్రమును మాట్లాడేవాళ్ళు ఆంధ్రులు అయ్యుంటారు అనుకునేదానిని. కానీ మీరు చెప్పినది చూస్తుంటే ఆంధ్రులు తెలుగు, ప్రాకృతం మాట్లాడేవారని తెలుస్తోంది. మరి ఆంధ్రము ఎవరు మాట్లాడేవారు???? ఆంధ్రము అన్నా తెలుగు అన్నా ఒకటేనా???? నా అనుమానానికి నవ్వుకోకుండా జవాబిస్తారని ఆశిస్తున్నాను.

  • రసజ్ఞ, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు! నవ్వుకోగలిగే అనుమానం కాదు మీది. ఆ విషయమై అనుమానాలు వెలిబుచ్చుకుంటూ, దొరికిన సమాచారంతో తీర్చుకుంటూ, ప్రాకృతం రాజభాషగా ఉండిన నాటి తెలుగు వాళ్ళ జీవితం సంగతులను గురించి రాసుకోవడానికి ఉద్దేశించినది ఈ శీర్షిక. ఇదిలా కొన్నాళ్ళు సాగుతుంది. ఈ క్రమంలో నా అనుమానాలు తీరే క్రమంలో మీ అనుమానాలూ తీరగలవని అనుకుంటాను, ప్రస్తుతానికి!

 2. ఆంగ్లం లో రాస్తున్నందుకు క్షమించండి.

  The following theory is consistent with your observations. Please consider this as a possible explanation.

  – Satavahanas spoke Prakrit and so did most of the inhabitants
  – Satavahanas called themselves Andhras; the term “ఆంధ్ర భృత్యు” probably referred to the ruled, not the kings
  – Telugu evolved as a language during the Satavahana rule
  – The kings adopted Telugu as their language towards the end of the dynasty
  – Because the kings were already called Andhras, the term “Andhra” came to be treated as synonymous with Telugu

 3. నమస్కారమండీ..!

  భాషాశాస్త్రం మీద అంతగా పట్టు లేకపోయినా, ఆసక్తికొద్దీ కొన్ని భావనలను రాస్తున్నాను.

  శాతవాహనుల కాలంలో ప్రాకృతం ప్రజలభాషగా ఉండిందనడానికి గాథాసప్తశతి ప్రాకృతంలోనే ఉండడం కారణమంటున్నారు. అలాగే ఆ కాలంనాటి నాణేల మీద కూడా ప్రాకృతమే ఉండిందనీ అంటారు చాలా మంది. అయితే, ఇవి ఆనాటి కాలాన్ని పూర్తిగా ప్రతిబింబించకపోవచ్చు.

  1) ఉదాహరణకి, ప్రస్తుతం మన యీ ఆధునిక నాగరికత అనుకోని కారణాలవల్ల అంతరించిపోయి, మానవాళి మరో వెయ్యి-వెయ్యిన్నరేళ్ళు అంధయుగంలో గడిపిన తర్వాత, మళ్ళీ ఇంకో నాగరికత పురుడు పోసుకుందనుకోండి. ఆ తరాలవారికి మన కాలానికి సంబంధించిన నాణేలు, రాజపత్రాలు దొరికితే మన గురించి ఏమనుకుంటారు..? మన కాలంలోని ప్రజలు హిందీ లేక ఇంగ్లీషు మాట్లాడేవారు అనే కదా. ఎందుకంటే, నాణేల మీద ఆ రెండు భాషలే ఉంటాయి. కరెన్సీ కాగితాల మీద తెలుగు, ఇతర భాషలు ఉన్నప్పటికీ అవి ఆ కాలానికి మట్టిలో కలిసిపోతాయి కనుక లభించే అవకాశం లేదు. అయితే, మనం ఇప్పుడూ వాడి పాడేస్తున్న ప్లాస్టిక్ చెత్త దొరుకుతుంది కాబట్టి, దాని ద్వారా వారికేమైనా లంకె దొరకచ్చు, మన గురించి తెలుసుకోడానికి. (ఇదే స్థాయి ఆనాటి కుండ పెంకులకు ఉంటుంది. అవి స్థానికుల చెందినవి కావచ్చు కాబట్టి)
  నే చెప్పేదేంటంటే, శాతవాహన సామ్రాజ్యంలో తెలుగు కన్నా, తెలుగేతరులు ఎక్కువగా ఉండి ఉండడం వల్ల అప్పటిలో జాతీయ భాష హోదా కలిగిన ప్రాకృతానికీ, పండిత భాష సంస్కృతానికీ ప్రాధాన్యత ఇచ్చి ఉండొచ్చు. (ఇప్పటి హిందీ, ఇంగ్లీషుల్లాగే).

  2) “గాథ” అంటే, ప్రజలలో బాగా ప్రాచుర్యంలో ఉన్న కథ అని ఎక్కడో చదివాను. అదే అయితే, గాథా సప్తశతి రాజభాష ప్రాకృతంలో రాసినా, తెలుగు మాటలు దొర్లాయి కాబట్టి. తెలుగు (పాతది) గట్టిగానే వాడుకలోనే ఉందనుకోవచ్చు.

  3) శాతవాహనుల పరిపాలనలోని చివరికాలంలో తెలుగు అక్షరాలు కనిపించాయని అంటున్నారు. దానికి సాంస్కృతిక మార్పులు కారణం కావచ్చు. శాతవాహనులు మొదట వైదిక మతానుయాయులు, అటుపైన బౌద్ధానికి మారిపోయారు. భాషకీ దీనికీ సంబంధం లేదనిపించవచ్చు. కానీ బుద్ధుని బోధలని గమనిస్తే, ఈ సంబంధాన్ని పూర్తిగా కొట్టెయ్యక్కర్లేదు. ఏంటంటే, బుద్ధుడు సంస్కృతంలో రచనలు చేయడాన్నీ, ప్రచారం చేయడాన్నీ నిరసించాడు. (అందువల్ల ఆది బౌద్ధ సాహిత్యం అంతా పాళీలోనే జరిగిందని చదివాను. అటుపైన వారికి కూడా సంస్కృతమే ప్రధాణ భాష అయింది). అందువల్ల దేశీ భాష అయిన తెలుగు గుర్తింపు నివ్వడం మొదలుపెట్టి ఉండొచ్చు.

  • నమస్కారం ‘వామనగీత’ గారూ!
   చాలా విశదంగా వ్రాసిన మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!భాషా శాస్త్రం పై నాకూ పెద్దగా పట్టేమీ లేదు, అలాగే చరిత్రపై కూడా! ఈ రెండింటిపై ఉన్నదల్లా ఆసక్తీ, అప్పుడప్పుడూ పుస్తకాలలో చదివిన చిన్నచిన్న సంగతుల జ్ఞానమూ! అంత మాత్రమే!

   మీ వ్యాఖ్యలో మీరు స్పృశించిన అంశాలను, తత్సంబంధ విషయాలను ఇంకా చాలా వాటినీ చర్చిస్తూనే ఈ విషయమై ఇకపై పోస్టులూ ఉంటాయి. ఈ topic ని కాస్తంత విశదంగా పరికిద్దామనే ఒక పరంపరగా ఈ పోస్టులను మొదలెట్టాను. కాబట్టి, ఇదిలా కొనసాగుతుంది…చివరికి ఏదో ఒక కొత్త నిజం (ప్రస్తుతానికి కొంత అత్యాశగా అనిపించినా సరే!) దొరికేదాకా (దొరుకుతుందనే అనుకుంటాను)! ఒకవేళ దొరకకపోయినా నష్టమేమీ లేదుగదా, సంగతులను మళ్ళీ ఒకసారి చదువుకున్నట్లవుతుంది.

   ధన్యవాదాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s